హెరిటేజ్ ని టార్గెట్ చేసిన జగన్ పార్టీ
posted on Apr 9, 2013 @ 2:57PM
ఇంత వరకు యన్టీఆర్ ఫోటోలు తమ పార్టీ బ్యానర్లపై ముద్రించి తెలుగుదేశం పార్టీ లో చిచ్చు పెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన దృష్టిని చంద్రబాబు కుటుంబం అద్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ పాల కంపెనీ మీదకు మరల్చినట్లుంది. తద్వారా చంద్రబాబు ఆర్ధిక మూలాలను దెబ్బ తీయవచ్చుననే ఆలోచనచేస్తున్నట్లు ఉంది.
కేరళ రాష్ట్రానికి హెరిటేజ్ పద్మనాభ అనే బ్రాండ్ పేరుతో సప్లై చేస్తున్న పాలను, పాల ఉత్పత్తులపై కేరళ ప్రభుత్వం నెల రోజులు నిషేధం విదించడంతో, ఆ పాలలో హానికరమయిన కెమికల్స్ కొన్ని ఉన్నoదునే వాటిని కేరళ ప్రభుత్వం నిషేదించిందని, గనుక ఆ పాలను రాష్ట్రం లోకూడా వెంటనే నిషేదించాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత జూపూడి ప్రభాకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
హెరిటేజ్ సంస్థ అధ్యక్షుడు సాంబశివరావు రాజకీయాలను పరిశ్రమలతో ముడిపెట్టడాన్ని ఆక్షేపిస్తూ “మా పాల ఉత్పత్తులను అత్యంత ఆధునికమయిన, రక్షితమయిన పద్దతిలో సేకరించి, ప్యాక్ చేసి మా ఖాతాదారులకు గత అనేక సం.లుగా అందిస్తూ వస్తున్నాము, రోజు లక్షలాది మంది ప్రజలు మా పాలను తాగుతున్నారు. అయినప్పటికీ ఇంతకాలం ఒక్క పిర్యాదు కూడా రాలేదు. కేరళ ప్రభుత్వం మా పాలను కేవలం కొన్ని షరతులు, ఒప్పందాలు కుదరకపోవడం చేతనే సరఫరా నిలిపివేయమని ఆడిగింది తప్ప జూపూడి చెపుతున్నట్లు హానికరమయిన రసాయనాలున్నాయని మాత్రం ఎన్నడూ నిలిపివేయలేదు. అయినప్పటికీ, మేము జరిపిన అన్ని పరీక్షలతో కేరళ ప్రభుత్వం సంతృప్తి చెందింది గనుకనే ఇప్పుడు మేము కేరళ రాష్ట్రానికి మళ్ళీ పాలు సరఫరా చేస్తున్నాము. అందువల్ల, జూపూడి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పి, తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము. అలా కాని పక్షంలో హెరిటేజ్ కంపెనీ ఆయన మీద న్యాయపరమయిన చర్యలు తీసుకోవడాని కూడా వెనుకాడదు, “ అని హెచ్చరించారు.