కాంగ్రెస్ జైపాల్ రెడ్డిని పక్కన పెట్టబోతోందా
posted on Apr 9, 2013 @ 7:47PM
కేంద్ర పెట్రోలియం శాఖామంత్రిగా ఒక వెలుగు వెలిగిన జైపాల్‌రెడ్డి, తనను ఆ శాఖ నుండి తప్పించడంతో ఆగ్రహించి రాబోయే ఎన్నికలలో పోటీ చేయనని ప్రకటించారు. ఆయన చేవెళ్ళ లోక్ సభ నియోజక వర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్నారు. అయితే, ఆయన ఆశించినట్లు కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ఏమాత్రం అనునయించే ప్రయత్నం చేయలేదు. పైగా ఆయన ప్రాతినిద్యం వహిస్తున్న చేవెళ్ళ నుండి గెలుగు గుర్రాలను వెతికి పట్టుకోమని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన దూత అమర్‌కాలేను హైదరాబాద్ పంపడంతో ఆయన కంగు తిన్నారు.
తెలంగాణా అంశంపై ఆయన ప్రత్యక్షంగా నోరు మెదపక పోయినా, కాంగ్రెస్ నాయకులకు, తెరాసా నేతలకు కూడా వెనుక నిలబడి అయనే ప్రోత్సహిస్తున్నందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై ఆగ్రహంతో ఉండటమే అందుకు కారణమని చెప్పవచ్చును. ఈ అవమానం చాలదన్నట్లు ఎన్నికలలో పోటీ చేయనని ఆయన ప్రకటించగానే, చేవెళ్ళలో టికెట్ ఆశిస్తున్న అభ్యర్ధులు అందరూ పండగ చేసుకొంటున్నారు. ఇది ఎలా ఉందంటే ఏళ్ళు తగలబడి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు అగ్గి దొరికిందని మరొకడు సంబరపడినట్లుంది.
నిన్నపార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ ప్రతినిధి అమర్‌కాలే చేవెళ్ల, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గాలపై నేతల అభిప్రాయాలను సేకరించినప్పుడు చేవెళ్ళ టికెట్ కోసం చాల మంధి అభ్యర్ధులు క్యూలో నిలబడ్డారు. వారిలో జైపాల్ రెడ్డి దగ్గర బందువు ఎమ్మెల్సీ యాదవ్‌రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి, మేడ్చల్ శాసన సభ్యుడు కే. లక్ష్మా రెడ్డి తదితరులున్నారు.
వారు చేవెళ్ళ లోక్ సభ టికెట్ తమకు ఇప్పించవలసిందిగా అమర్ కాలేకు విజ్ఞప్తులు చేసి, పనిలోపనిగా కొంతమంది కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణపైనా, మరి కొంత మంది హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పైనా పిర్యాదులు కూడా చేసారు. అలాగే, తెలంగాణా అంశం గురించి కూడా అందరూ మరో మారు గుర్తు చేసారాయనకి.
కేంద్రంలో చక్రం తిప్పుతున్నానని గట్టిగా విశ్వసించే సర్వేసత్యనారాయణ కూడా కాలేను కలిసి టికెట్ ఇప్పించమని ప్రాదేయపడటం విశేషం. తనకు గనుక టికెట్ ఇప్పిస్తే ఈ సారి 5లక్షల వోట్ల భారీ మెజార్టీతో గెలుస్తానని ఆయన హామీ కూడా ఇచ్చారు.
యల్.బీ.నగర్ శాసన సభ్యుడు సుదీర్ రెడ్డి సర్వే సత్యనారాయణకు టికెట్ ఇవ్వడం సంగతెలా ఉన్నా, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పట్ల అగౌరవంగా మాట్లాడినందుకు ముందు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అంతటితో ఆగక మరో అడుగు ముందుకు వేస్తూ తమ వంటి సీనియర్లకు టికెట్స్ ఈయకుండా పార్టీలోకి కొత్తగా వస్తున్నవారికి పార్టీ టికెట్స్ ఇచ్చినట్లయితే వచ్చే ఎన్నికల సమయానికి పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయం అని ఒక హెచ్చరిక కూడా చేసి వచ్చారు. ఇక పార్టీలో మరో సీనియర్ నేత పిట్ల కృష్ణ కూడా సర్వే సీటును ఈసారి తనకు కేటాయించమని కోరారు.