త్వరలో మరో ‘టీ’ పార్టీ
posted on Jun 21, 2013 @ 9:50AM
తెరాస మరియు దాని అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యులపై తరచూ ఎన్ని ఆరోపణలు వస్తున్నపటికీ, తెలంగాణా పోరాటానికి వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో కేసీఆర్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా చలామణి అవుతోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల అటువంటి ఆరోపణలతోనే ఆ పార్టీ నుండి బహిష్కరింపబడిన రఘునందన్ రావు, తిరిగి హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేయడం, ఆ తరువాత వారిరువురూ సవాళ్లు ప్రతిసవాళ్ళు చేసుకోవడం, రఘునందనుడు నేరుగా సీబీఐకి వెళ్లి ఏవో కాగితాలు సమర్పించడం, పరువు నష్టం దావాలంటూ హరీష్ రావు రంకెలేయడం వగైరా ఎపిసోడ్స్ అన్నీ చకచకా జరిగిపోయిన తరువాత, అమాయక ప్రజలకి ఈ సీరియల్లో అసలు హీరో ఎవరో, విలన్ ఎవరో తెలుసుకోక ముందే సీరియల్ ఏవో చెప్పలేని అనివార్య కారణాల వల్ల అర్ధంతరంగా ముగిసిపోయింది. కనీసం తరువాత ఎపిసోడ్ లోనయినా ఆ సస్పెన్స్ వీడుతుందో లేదో అని సీరియల్ జీవితానికి అలవాటుపడిన జనాలు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
అయితే, మీడియా ముందు గుక్క తిప్పుకోకుండా మాట్లాడే రఘునందనుడు, ఏ కోర్టు గడప దగ్గరో లేక ఏ మీడియా గుమ్మంలోనో ఎదురయి మిగిలిన సీరియల్ కంప్లీట్ చేస్తాడని ఆశిస్తున్న ప్రజలు ఆశలు అడియాసలు చేస్తూ, ఆయన అనుచరులు అకస్మాత్తుగా డిల్లీలో ఎలెక్షన్ కమీషన్ ముందు ప్రత్యక్షమయినట్లు సమాచారం. త్వరలో ఆయన కూడా ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టుకొని, కేసీఆర్ లాగే ఉద్యమాలు చేసుకొందామని డిసైడ్ అయినట్లు సమాచారం.
కానీ, కేసీఆర్ పద్దతి కంటే ‘గుర్ఖాల్యాండ్’ తరహాలో ఉద్యమాలు చేసుకోవడం మంచిదని ఆయన డిసైడ్ అయినట్లు, అందువల్ల తన కొత్త పార్టీకి అదే స్టయిల్లో ‘తెలంగాణా ముక్తి మోర్చా’ అని పేరు ఖాయం చేసుకొనట్లు సమాచారం.కానయితే, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ డిల్లీలో మళ్ళీ పెద్దల మేళా పెట్టుకొని ఇక నేదో రేపో తెలంగాణా ప్యాకేజి ఇచ్చేస్తోందని అందరూ చెప్పుకొంటున్న ఈ తరుణంలో ఆయన పార్టీ లాంచింగ్ వల్ల ఏమయినా లాభం ఉంటుందా లేదా అనేది ఆయన ఆలోచించుకోవాలి.