జగన్ కోసం 'క్యాంపు ఆఫీస్ దందా'
posted on Jun 21, 2013 @ 12:11PM
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుడు వైఎస్ జగన్ ని కోట్లకు అధిపతిని చేయడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. సెక్రెటేరియట్ లెవల్ లో తీసుకోవాల్సిన నిర్ణయాలు..తన పర్సనల్ క్యాంపు ఆఫీస్ అడ్డాగా చేసేసుకొని ముఖ్యమంత్రి వైఎస్, ఆయన సన్నిహిత మిత్రుడు కేవీపీ రాంచంద్రరావు, ఏపీఐఐసీ చైర్మన్ బీపీ ఆచార్య, అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ లు ఓ పెద్ద వ్యవహారం చక్కబెట్టేశారు.
కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ సంస్థకు అప్పనంగా ఎలాంటి ఒప్పందపత్రం లేకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 4700 ఎకరాలు నెల్లూరు జిల్లాలో కట్టబెట్టేశారు. వైఎస్ కు సన్నిహితంగా ఉండే కృష్ణపట్నం పోర్టు గ్రూపు అధినేత విశ్వేశ్వరరావు కుమారులు శ్రీధర్, శశిధర్ లు కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ కు డైరెక్టర్లు. ఆ తరువాత వైఎస్ హయాంలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఆగస్టులో పదవీ విరమణ పొంది 2009 అక్టోబర్ 14న అంటే పదవీ విరమణ చేసిన రెండు నెలలకే అందులో ఎండీగా చేరిపోయారు.2005లో ఈ సంస్థ నమోదుకాగా 2008 మేలో డైరెక్టర్లు శ్రీధర్, శశిధర్ లు తప్పుకున్నారు. వారి స్థానంలో జగన్ సన్నిహితులు సజ్జల దివాకర్ రెడ్డి, నర్రెడ్డి గంగిరెడ్డిలు వచ్చారు. ఆ తరువాత జులై 25న హరీష్ సి కామర్తి, జెజె రెడ్డి అనే మరో ఇద్దరు జగన్ సన్నిహితులు చేరారు.
ఇక 2009 సెప్టెంబర్ 2న వైఎస్ అనుకోని ప్రమాదంలో చనిపోయారు. వైఎస్ అభిమానులు ఆ షాక్ నుండి కోలుకోవడానికి చాలా నెలలు పట్టింది. ఇది ఒకవైపు జరుగుతున్న సంఘటన అయితే వైఎస్ చనిపోయిన నెల 17 రోజులకు అంటే అక్టోబరు 19న వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి మెజారిటీ షేర్లు కొనుగోలు చేసి ఈ సంస్థకు యజమాని అయిపోయారు. మరి ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ వ్యవహారం పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.