నవ్విపోదురుగాక మాకేల సిగ్గు
posted on Jun 22, 2013 8:10AM
గట్టిగా నెల రోజులు కూడా శాసనసభను నడపలేని ప్రభుత్వం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు రూ.ఒకటిన్నర కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి, ఒక్కోటి రూ 47, ౦౦౦ ఖరీదు చేసే టాబ్లెట్ పీసీలను, గిఫ్ట్ వోచార్లను, ఇతర కానుకలను బహుమతిగా అందిస్తే, సభను ఒక్కరోజు కూడా సవ్యంగా జరగనీయకుండా అడ్డుపడిన మన శాసన సభ్యులు, నవ్వితే నవ్విపోదురుగాక మాకేల సిగ్గు అనుకొంటూ ప్రభుత్వం అందించిన ఆ బహుమతులను ఆనందంగా స్వీకరించారు. అందుకు ప్రభుత్వంపై తమకున్నవ్యతిరేఖత కానీ, పార్టీ సిద్దాంతాలు గానీ, తెలంగాణావాదం గానీ ఏవీ అడ్డు రాలేదు. బహుమతులు అందుకోవడం తమ జన్మ హక్కు అన్నట్లు చిద్విలాసంగా నవ్వులు చిందిస్తూ నిన్నటి వరకు ఎవరిని సభలో తిట్టిపోసారో వారి నుండే అందుకొని ఎంచక్కా ఇళ్ళకు వెళ్ళిపోయారు.
ఇక, గిరిజన సంక్షేమ శాఖ గిరిజనుల కోసం ఏమి చేస్తోందో చెప్పలేకపోయినా, ఒక్కో శాసన సభ్యుడికి రూ.7,500 విలువయిన గిఫ్ట్ వోచర్లు పంచిపెట్టింది. అదేవిధంగా పరిశ్రమల శాఖ రాష్ట్రoలో కరెంటు కోతలతో అల్లాడిపోయిన పరిశ్రమలకు చేసిన మేలేమి లేకపోయినా, శాసన సభ్యులకు ఎంతో ఉదారంగా విలువయిన బహుమానాలు పంచిపెట్టింది.
అయితే, క్రిందటిసారి బడ్జెట్ సమావేశాల అనంతరం ఇచ్చిన లాప్ టాపులు, ప్రింటర్లు, స్కానర్లు, సెల్ ఫోనులు, ఐ పాడ్ వగైరా కానుకలతో పోలిస్తే ఈ సారి ప్రభుత్వం మొక్కుబడి బహుమతులతో సరిపెట్టేసిందని కొందరు సభ్యులు సణిగినప్పటికీ, ప్రజలమీద మరింత భారం మోపడం సబబు కాదనుకొంది ప్రభుత్వం.
సాధారణంగా కార్యాలయాలలో, కర్మాగారాలలో ఎవరయినా సరిగ్గా పనిచేయకాపోతే అటువంటివారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ అసెంబ్లీని సజావుగా సాగనీయకుండా అడ్డుపడినందుకు శాసనసభ్యులకు ప్రభుత్వం బహుమానాలు పంచిపెట్టడం మాత్రం నిజంగా విడ్డూరమే. అందుకు ప్రజాధనం ఖర్చు చేయడం జవాబు దారితనం లేకపోవడమే కారణం.