రామజోగయ్య శాస్త్రికి ఎన్నారైల సన్మానం

        మే 28న డాలస్ లో ప్రముఖ సినీగేయ రచయిత రామజోగయ్య శాస్త్రి గారిని అభిమానులు, మిత్రులు కలిసి తానా గత అధ్యక్షులు తోటకూర ప్రసాద్, టాన్టెక్స్ అధ్యక్షుడు సురేశ్ మండువ ఆధ్వర్యంలో సన్మానించారు.   ఇదే సందర్భంలో ప్రముఖ గాయకుడు సూపర్ గురు రామాచారి గారిని కూడా సన్మానించారు. విద్య రీత్యా ఇంజనీర్ అయినా, తను జీవితంలో సాధించాలని అనుకొన్న లక్ష్యం వైపు ఎంతో ఆత్మబలంతో సాగి ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్న శాస్త్రి పిల్లలకి, యువతరానికి స్ఫూర్తి అని, సభకు రామజోగయ్య శాస్త్రిని పరిచయం చేశారు, రాయవరం విజయ భాస్కర్.   పిల్లలు, పెద్దలు దాదాపు వందమంది దాకా హాజరైన ఈ సమావేశంలో రామజోగయ్య తన సినీ ప్రయాణంలో ఆరంగేట్రం గురించి, ప్రస్తుతం నడుస్తున్న తీరు, తను పనిచేసే విధానం గురించి వివరించారు. తన జీవితంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ప్రభావం, తను గురువుగా రామజోగయ్య నేర్చుకొన్న సినీపాటల మెళకువలు అన్నీ తన మనసు పరచి పంచుకొన్నారు రామ్-జో. అభిమానులతో ఫోటోలు, ఆత్మీయుల ప్రశ్నలు , చిన్నారుల పాటల మధ్య ఓ మంచి సాయంత్రాన్ని డాలస్ తెలుగువారు రామజోగయ్యకి కానుకగా సమర్పించారు.  ఈ సమావేశానికి వేదికతోబాటు భోజనాల ఏర్పాటు చెయ్యడానికి సహకరించిన స్వగృహ భోజనశాల వారికి, వినోద్ ఉప్పు గారికి,  కృతజ్ఞతలు ప్రకటించారు రాయవరం భాస్కర్.

కిరణ్ పట్టిన కుందేలుకి మూడే కాళ్ళా?

  మంత్రి డీయల్ రవీంద్ర రెడ్డిని బర్త్ రఫ్ చేసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రి వర్గంపై పైచేయి సాధించారని అయన అనుచరులు భావిస్తుంటే, ‘అదొక పొరపాటు నిర్ణయం’ అని స్వయంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అని ఆ మరునాడే ప్రకటించడమే కాకుండా ఇటువంటి పొరపాట్లు ఇక ముందు జరుగవని కూడా హామీ ఇవ్వడం విశేషం. డీయల్ ను బర్త్ రఫ్ చేస్తున్నట్లు ఆయనకు ముఖ్యమంత్రి ముందుగా తెలియజేయలేదని ఆయన మీడియాతో చెప్పిన మాటలవల్ల అర్ధం అవుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ఒంటెత్తుపోకడల గురించి ఇప్పటికే అనేక మార్లు అధిష్టానానికి పిర్యాదులు చేసిన బొత్స సత్యనారాయణ, ఈ రోజు డిల్లీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ విషయం గురించి చర్చిస్తానని కూడా స్పష్టంగా చెప్పారు. బొత్సతో బాటు మరికొంత మంది మంత్రులు కాంగ్రెస్ నేతలు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయంపట్ల తీవ్ర అసంతృప్తి వెల్లడించారు.   ఇక, హోంమంత్రి పదవి ఆశిస్తున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కూడా ముఖ్యమంత్రి హిట్ లిస్టులో పేరున్నవారే గనుక, ఆయన తనని వెళ్ళగొట్టక ముందే తానే తప్పుకోవాలనుకొన్నారు. కానీ, మంత్రి జానారెడ్డి సలహా మేరకు ఆయన వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇక, వేటుకోసం ఎదురుచూస్తున్న మరో మంత్రి రామచంద్రయ్య, ఈ మద్యన కొంచెం జోరు తగ్గించుకొన్నారు. బహుశః చిరంజీవి ఆయనను వెనక్కి తగ్గమని సూచించి ఉండవచ్చును.   ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి కొంత మందితో తనకొక ప్రత్యేక వర్గం తయారుచేసుకొని ముందుకు సాగుతున్నపటికీ, ఆయనను పార్టీలో వ్యతిరేఖించేవారు చాల మందే ఉన్నారనేది సుస్పష్టం. ఆయన తన ప్రస్తుత పద్దతిలోనే ముందుకు సాగితే ప్రస్తుతం ఆయన ఏర్పరుచుకొన్న స్వంత వర్గంలో మంత్రులు కూడా ఏదో ఒకనాడు ఆయనతో విభేదించచ్చును. అప్పుడు ఆయన పార్టీలో ప్రభుత్వంలో ఒంటరి అవడం ఖాయం.   కిరణ్ కుమార్ రెడ్డి రెండున్నర సం.లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నపటికీ ఇంతవరకు తన స్వంత పార్టీకి ప్రభుత్వానికి మద్య సమన్వయము సాదించడంలో విఫలమవడం చాలా ఆశ్చర్యకరమే. అయితే, భేషజానికి పోయి అందరినీ దూరం చేసుకొంటున్న ముఖ్యమంత్రి అందుకు ఇతరులను ఈ విధంగా బలి తీసుకోవడం మరీ ఆశ్చర్యకరం. సహచర మంత్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, సమర్ధంగా ప్రభుత్వాన్ని నడిపించవలసిన ముఖ్యమంత్రి వాటిని వ్యక్తిగత విమర్శలుగా భావిస్తూ, వారిని తన శత్రువులని భావించడమే దీనికి మూలకారణం.   తన స్వంత పార్టీలో, ప్రభుత్వంలో ఇంత మంది తనను వ్యతిరేఖించడానికి కారణం ఏమిటని ఆత్మవిమర్శ చేసుకోకుండా అహానికి పోయి అందరినీ దూరం చేసుకోవడం వల్ల ఆయనకీ ఇంతా బయటా శత్రువులే మిగులుతారు. సాధారణ ఎన్నికలను ఎదురుగా ఉంచుకొని ముఖ్యమంత్రే స్వయంగా ఇటువంటి పరిస్థితులను సృష్టించుకోవడం వల్ల ఆయనకీ, కాంగ్రెస్ పార్టీకి నష్టం కలగడమే కాకుండా, ప్రతిపక్షాలకు వరంగా కూడా మారుతుంది.

కాంగ్రెస్ లో అహంకార కి'రణం'

        వైద్య శాఖ మంత్రి డి.ఎల్. రవీంద్ర రెడ్డిని ముఖ్యమంత్రి అధిష్ట్టానం అనుమతితో మంత్రి పదవి నుండి తొలగించిన విషయం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలిని పరిశీలిస్తే వివిధరకాలైన అంశాలు వెలుగు చూస్తాయి. ఒకప్పుడు ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డి.ఎల్ రవీంద్ర రెడ్డి అత్యంత సన్నిహితులు. వై.యస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇద్దరికీ మంత్రి పదవులు దక్కకపోవటం ఈ సాన్నిహిత్యానికి ఒక కారణం అని చాలామంది ఉద్దేశ్యం. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత తన మంత్రివర్గంలో అత్యంత ప్రాధాన్యమున్న వైద్య, ఆరోగ్య శాఖను డీ.ఎల్. కు పూర్తి స్థాయిలో అప్పగించారు. ఇది పలువురి మంత్రుల అలకలకు కూడా కారణమయ్యింది.              కడప లోక్ సభ ఉప ఎన్నికల వరకు ఇద్దరి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఆ ఎన్నికల సమయంలోనే వివిధ అంశాల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయి. అక్కడి నుండే ఇద్దరు ఎడ ముఖం, పెడ ముఖంగా ఉంటూ, ఇద్దరు ఒకరితో ఒకరు విభేదాలు మరింతగా పెంచుకున్నారు.             డి. ఎల్. రవీంద్ర రెడ్డి రాజకీయ ప్రస్తానం 1978లో మొదలైన నాటి నుండి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, నేడురుమేల్లి ప్రభుత్వాలలో వివిధ కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 1978లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తొలుత స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత కాంగ్రెస్ చేరారు. ఇప్పటి వరకు ఆయన అసెంబ్లీకి 8 సార్లు పోటీ చేసి, 6 సార్లు గెలుపొందటం జరింగింది. అంతగా డి.ఎల్. రవీంద్ర రెడ్డి తన నియోజక వర్గం నుండి ప్రజాదరణ పొందిన రాజకీయ వేత్త.                  అపారమైన రాజకీయ అనుభవం, పరిపాలన సామర్థ్యం ప్రజాదరణ కలిగిన ఒక సంపూర్ణ రాజకీయ నాయకుడిగా డి.ఎల్. అనేకసార్లు సి.ఎం. యొక్క పరిపాలనా తీరును విమర్శించారు. తనకు కేటాయించిన వైద్య శాఖ నిధులు సరిగా లేవని అనేకసార్లు మొరపెట్టుకుంటే, కావలిసిన నిధులు కేటాయించకపోగా శాఖను కుదించి, కొండ్రు మురళికి కేటాయించటం జరింగింది. ఇది ఒక సీనియర్ నేత పట్ల కిరణ్ కుమార్ రెడ్డి నడుచుకున్న విధానానికి అద్దం పడుతుంది.                    ఒకనాడు వైయస్ జగన్ ను ఎదురుకోవడానికి ఉపయోగించుకొని, ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఎందుకూ పనికి రాని వాడిగా చిత్రీకరించటం వెనుక కిరణ్ ఉద్దేశ్యం ఏమిటి? ఒక నాడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తో విభేదించారు. తన వ్యక్తిగత విభేదాలను రాజకీయ విభేదాలుగా చూపించటం వలన పార్టీకి నష్టం జరుగుతున్న విషయాన్ని అధిష్టానం కూడా గమనించక పోవడం ఆశ్చర్యకరం.                 ఇప్పటివరకు మొత్తం విషయాన్ని గమనిస్తే ప్రజాదరణతో ఎదిగిన నేత డి.ఎల్. ప్రజాదరణతో కాకుండా అధిష్ఠానం ఆశీస్సులతో ముఖ్య మంత్రి అయ్యి, అహంకార ప్రవర్తనను ప్రదర్శిస్తున్న నేత కిరణ్ కుమార్ రెడ్డి. ప్రజల మధ్య నుండి వచ్చిన నాయకులు ప్రజాసంక్షేమం కోసం అవసరమైతే ప్రభుత్వ పరిపాలన తీరును ఎండ కడతారనడానికి డి.ఎల్. ఒక ఉదాహరణ అయితే, నడమంత్రపు అధికారం తో దురహంకారిగా ప్రవర్తిస్తూ ఏమాత్రం సామర్థ్యం లేని పరిపాలనకు పాలన కర్తగా కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఉదాహరణ.                ఈ మొత్తం వైనంలో అధిష్టానం వైఖరి చాలా అసమర్థతగా కనిపిస్తుంది. ముఖ్య మంత్రి అభ్యర్ధిగా అన్ని అర్హతలూ కలిగి ఉండి ఏనాడో ముఖ్య మంత్రి కావాల్సిన డి.ఎల్. రవీంద్ర రెడ్డి నేడు వివిధ స్వార్థ రాజకీయాలకు, దురహంకారానికి గుర్తుగా బర్తరఫ్ కాబడ్డారు. వివిధ రకాల లాబీయింగులకు, భజనపరులకు తలవోగ్గే దిక్కుమాలిన కాంగ్రెస్ అధిష్ఠానం, పనికిమాలిన అసమర్థ రాజకీయ నాయకులకు పట్టం కట్టడం కారణంగానే భారత దేశం ఆర్ధిక పురోగతిని, పురోభివృద్ధిని సాధించటంలో వెనుకబడింది. దీనికి మళ్ళీ ప్రజాస్వామ్యం అని పేరు. నేడు రాష్ట్రం లోను దేశం లోను కాంగ్రెస్ పార్టీ తీరు ఎలా ఉందంటే నవ్వి పోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఉంది. 

ఈ రోజు కేశవ్ రావ్ జీవితంలో బ్లాక్ డే

ఈ రోజు సాయంత్రం తెరాసలో జేరనున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కే.కేశవ్ రావ్ ఇది తన రాజకీయ జీవితంలో ‘బ్లాక్ డే’ అని అన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీతో ఏర్పరుచుకొన్ననాలుగు దశబ్దాల అనుబంధం తెంచుకొని పార్టీని వీడవలసి వస్తున్నందుకు ఆయన ఆవిధంగా అన్నారు. సోనియా గాంధీ తనకు అన్ని పదవులు ఇచ్చి పార్టీలో సముచిత గౌరవం ఇచ్చారని, కానీ తానడిగిన ఒక్క తెలంగాణా మాత్రం ఈయలేకపోయారని ఆయన అన్నారు. ఇక, ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బయటపడినప్పటికీ, మంత్రి డీయల్ బర్త్ రఫ్ పై తీవ్రంగా స్పందించారు. కిరణ్ కుమార్ రెడ్డి చాల అవమానకరంగా, రాజ్యాంగ విరుద్దంగా ఆయనను తొలగించారని, మంత్రి పదవి అంటే ముఖ్యమంత్రి వేసే భిక్ష కాదని కిరణ్ కుమార్ రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు.

విలీనం పై హరీష్ రావు మెలిక

        సమైక్యాంధ్రకు జై కొట్టి, తెలంగాణను అడ్డుకున్నందుకు ముందుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బహిరంగ క్షమాపణ చెబుతూ చెంపలేసుకుంటేనే ఆ పార్టీలో తమ పార్టీ విలీనంపై ఆలోచిస్తామని టీఆర్ఎస్ఎల్పీ ఉప నేత టి.హరీశ్‌రావు స్పష్టంచేశారు. టీడీపీలో టీఆర్ఎస్ విలీనంపై తాను చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి అర్థంకానట్టు ఉందని అన్నారు.   "2009 డిసెంబర్ 9 నాటి ప్రకటన తర్వాత టీడీపీ యూటర్న్ తీసుకోవటం వల్లనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వెనక్కి వెళ్లింది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిందే టీడీపీ. రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రవచించిన పార్టీ అది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి రెండు నివేదికలు ఇచ్చి.. పార్లమెంటులో సమైక్యాంధ్ర కోసం ప్లకార్డులు పట్టింది. ఈ తప్పులన్నింటినీ చంద్రబాబు ఒప్పుకొని బహిరంగంగా చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి. రేవంత్‌రెడ్డికి చేతనైతే ఆ పని చేయించాలి. అప్పుడే విలీనంపై మా పొలిట్‌బ్యూరోలో చర్చిస్తాం'' అని చెప్పారు. ఆ తరువాతే మూడు షరతుల గురించిన చర్చలోకి వెళదామని సూచించారు. కాగా, కాంగ్రెస్ నాయకత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. "అది కాంగ్రెస్ కోర్ కమిటీ కాదు.. మహా చోర్ కమిటీ'' అంటూ మండిపడ్డారు.

తానా 19వ మహా సభల్లో స్వామి వివేకానందుల వారి 150 వ జయంతి సంబరాలు !

తానా మహా సభ ల్లో ఆదివారం మే 26 నాడు సాయంత్రము స్వామి వివేకానందుని 150 వ జయంతి సంబరాలు మరియు యువతకు వివేకానందుని సందేశం పై ప్రసంగాలు జరిగాయీ ఈ కార్యక్రమాన్ని తానా ఆధ్యాత్మిక కమిటి ఆధ్వర్యములో గోపాల్ పొన్నంగి మరియు గోపి చిల్లకూరు లు నిర్వహించారు.   మొదటగా జిడ్డు కృష్ణ మూర్తి ఫౌండేషన్ కు చెందినా స్వామి చిదానంద మాట్లాడుతూ మనస్సు ,శరీరం ,బుద్ది మద్య వున్నా సంబంధాన్ని సభికులకు వివరించారు .మనస్సుని అదుపులో ఉంచుకోవడం గురించి వివరించారు . శ్రీ పీటం ,కాకినాడ స్వామి పరిపూర్ణ నంద స్వామి ముఖ్య అతిధిగా హాజరయ్యి ప్రసంగిస్తూ భారత దేశ జీవనం ,సంస్కృతీ ,సనాతన ధర్మాన్ని,ఆద్యాత్మికతను తన అద్బుతమైన వాగ్ధాటి తో ప్రపంచ వ్యాప్తముగా భారత దేశం ఔనత్యాన్ని గౌరవాన్ని నిల్బెట్టారని అన్నారు .. తరువాత చిల్లకూరు గోపి మాట్లాడుతూ స్వామిజి 150 వ దినోస్తావాలు గత మూడు సంవత్సరాలు గా ప్రపంచ వ్యాప్తముగా జరుగుతున్నాయని వాటి యొక్క ముఖ్య ఉద్దేశం వివేకానందుల వారి త్యాగ జీవితం ,వారి అమూల్య సందేశాన్ని నేటి యువతకు అర్ధం అయ్యేలా తెలియ జెప్పి వారిలో ఆత్మ న్యూనత భావాన్ని,బలహీనతలను పోగొట్టడం ,వారిని కార్యొన్ముకులను చేయడమే అన్నారు . సభలో ముఖ్య అతిధి స్వామి పరిపూర్ణ నందుల వారికి తాన తరపున మొమెంటో అందచేసి దుస్శాలువతో సన్మానించారు .   సభ నిర్వాహకులు గోపి చిల్లకూరు పరి పూర్ణ నందుల వారికి వివేకానందుని ప్రియ శిష్యులు ,స్వామి వివేకానందుల వారి అమెరికా పర్యటనకు ఎంతో కృషి చేసిన తమిళనాడుకు చెందిన గృహస్తు శిష్యుడు అలసింగ పేరుమల్ గారి జీవితం పై రామకృష్ణ మఠ్ వారిచే ప్రచురించిన "అలసింగ పేరుమల్ " పుస్తకము భాహుకరించారు . పరి పూర్ణ నందుల స్వామి వారి చే పిల్లలకు వివేకానందుల స్తిక్కరులు ,ఫోటోలు అంద చేసారు.సమావేశానికి హాజరైన ప్రవాసులకు అందరికి రామ కృష్ణ మఠ్ ప్రచురించిన వివేకానందుని జీవితం మరియు సందేశం 150th Birthday special edition పుస్తకం ను అంద చేసారు . జిడ్డు కృష్ణ మూర్తి ఫౌండేషన్ కు చెందినా స్వామి చిదత్మానంద ను తాన మొమెంటో బహుకరించి సాలువాలతో ఘసన్మానించారు .సినీ గేయ రచయత జొన్న విత్తుల,స్వామి వివేకానందుని 150 వ జయంతి సభ నిర్వహణకు కృషి చేసి న చిల్లకూరు గోపి కి తాన మహా సభల ప్రత్యెక మొమెంటో ను బహుకరించి శాలువాలతో తో సన్మానించారు. చివరగా తాన లో ఆద్యాత్మిక సమావేశములు ఘనం గా నిర్వహించిన గోపాల్ పొన్నంగిని ప్రత్యెక మొమెంటో అందచేసి శాలువా తో సన్మానించారు . సభలో ప్రముఖులు సినీ గేయ రచయత జొన్న విత్తుల ,జ్యోతిష పండితులు డాక్టర్ రాఘవెంద్ర ప్రసాద్, dr రేణుక బసవ రాజు ,Mahesh Choppa,చెరుకు పల్లి రాజేష్, వసంత సూరి ,పమిడి శ్రీనివాస్ ,శివ అడుసుమల్లి, Priya Korrapati,Dr Raju Nakta,Subrahmanyam Cheruvu,Abhinav Dahagam,Aditya Chilukuri,Anand Chellappa,Anita Basavaraju,Basivi Reddy,Bhaskar Aluru,Ghanshyam Mudigonda,IV Rao,Kalarani Kakarla,Koushik ,Krishna Athota Mohan Reddy,Prabhat Kasarneni,Dr Prabhav Tella,Pranamya Suri,Ramakrishna Kondapalli,Sai Prasad Kalinga,Shastry Anipindi,Srinivas Raju Nakta, Dr Sujatha Tella,Varun Anand,Vijay Kumar Basavaraju,Viswas Mudigonda పాల్గొన్నారు. ఏక విద్యాలయ ఫౌండేషన్ వారు సమావేశపు హాలు లో శ్రీ రామకృష్ణ పరమహంస ,మాతృశ్రీ శారద దేవి చిత్రాలతో పాటు స్వామి వివేకానంద జీవితం ,సందేశం ,సూక్తులు కలిగిన ఫోటోలు సభికుల కోసం ప్రదర్శన ఏర్పాటు చేసారు.

డీఎల్ రవీంద్రారెడ్డి ఆపరేషన్ ఎలా ఉండబోతోంది?

  వైద్య శాఖా మంత్రి డీ.యల్ బర్త్ రఫ్ తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన స్వంత టీం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ముందుగా ఆ పదవిని తనకి అత్యంత సనిహితుడయిన కొండ్రు మురళికి అప్పజెప్పారు. గతంలో డీ.యల్. దగ్గర నుండి తప్పించిన వైద్య విద్య, ఆరోగ్యశ్రీ, వైద్య బీమా, 104, 108, వైద్య మౌలిక సదుపాయాలు తదితర శాఖలు చూస్తున్న కొండ్రు మురళికే ఈ కొత్త బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న డీ.యల్. సోమవారం నాడు హైదరాబాద్ తిరిగి వస్తారు. అయితే, ఆయనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండానే అయన గైర్హాజరీలో ముఖ్యమంత్రి ఆయనను బర్త్ రఫ్ చేయడం గమనిస్తే, ఆయన డీ.యల్.పై ఎంతగా రగిలిపోతున్నారో అర్ధం అవుతుంది.   ఈ పరిణామాలను డీ.యల్ ఊహించకనే ఇంత కాలం ముఖ్యమంత్రిపై విమర్శలు చేసారని భావించలేము. అయితే పార్టీ అధిష్టానం పట్ల తన విదేయత, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్తో తనకున్న సత్సంబందాలు తనని కాపడుతాయనే ధీమా ఆయనలో ఉండేది. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి అకస్మాత్తుగా తనని బర్తరఫ్ చేయడంతో, డీయల్ రేపటి నుండి తన ఆపరేషన్ మొదలుపెడతారు.   ఆయన పార్టీలో ఇతర అసమతి నేతలను కూడ గట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డిపై తన దాడిని మరింత తీవ్రతరం చేయవచ్చును. అది మరింత తీవ్రతరమయితే, అది అంతిమంగా ఆయన పార్టీ నుండి కూడా బహిష్కరించబడే పరిస్థితులు కల్పించినా ఆశ్చర్యం లేదు. అప్పుడు ఆయన తన కడప జిల్లాలో బలంగా ఉన్న వైకాపా వైపు మళ్ళినామళ్ళవచ్చును. కానీ, ఆజిల్లాలో వైకాపా తరపున పోటీ చేసేందుకు చాలామందే అభ్యర్దులున్నారు గనుక డీ.యల్.కి ఆ పార్టీ టికెట్ ఆఫర్ చేయగలదా లేదా? అనే దానిని బట్టి, ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి ఎటువంటి వైద్యం చేయాలో నిశ్చయించుకొనే అవకాశం ఉంది.   ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగవలసి వస్తే, ముఖ్యమంత్రి ఆయనకు టికెట్ రాకుండా అడ్డుపడే ప్రయత్నం చేయవచ్చును గనుక, ఆయనను వ్యతిరేఖించే పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో, రామచంద్రయ్య ద్వారా చిరంజీవితో జతకట్టి, ముఖ్యమంత్రికి పొగపెట్టడం ప్రారంబించవచ్చును. బొత్స సహాయంతోనే డీ.యల్. టికెట్ సంపాదించుకొని మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డికి సవాలు చేయవచ్చును.   ఒకవేళ వైకాపా నుండి తగిన విధంగా ఆహ్వానం అందితే, పార్టీ నుండి బహిస్కరించేబడేవరకు కూడా కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన నిప్పులు చెరగడం ఖాయం. సోమవారం ఆయన లండన్ నుండి తిరిగి రాగానే ముఖ్యమంత్రిపై ఘాటయిన విమర్శలతో మీడియా ముందుకు ఎలాగు వస్తారు గనుక, ఇక తినబోతూ గారెల రుచి అడగడం అనవసరం ఇప్పుడు.

తెరాస, తెదేపాలు సవాళ్ళు దేనికి?

     హరీష్ రావు: తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇచ్చి, పార్లమెంటులో తెలంగాణా బిల్లుకు మద్దతు ప్రకటించి, అధికారంలోకి వస్తే తెలంగాణకు చెందిన దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తానని హామీ ఇస్తే, తెరాసను తెదేపాలో విలీనం చేయడానికి మేము సిద్దం.   రేవంత్ రెడ్డి: హరీష్ రావు ప్రతిపాదనను మేము స్వాగతిస్తున్నాము. అయితే, దానిని తెరాస రాజకీయ కమిటీలో ఆమోదించి, కేసీఆరే స్వయంగా లిఖిత పూర్వకంగా ఇస్తే, మేము కేసీఆర్ కేంద్రానికి వ్రాసి పంపదలచిన ఏ లేఖమీదయినా సంతకం పెట్టడానికి సిద్దం.   తెలంగాణా ఇస్తే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని కేసీఆర్ చెపితే, ఆయన మేనల్లుడు హరీష్ రావు మూడు షరతుల మీద తమ పార్టీని తెదేపాలో విలీనం చేస్తామని తాజాగా ప్రకటించడం, దానిని తెదేపా స్వాగతించడంపై ప్రస్తుతం రాజకీయ వర్గాలలో రసవత్తర చర్చ జరుగుతోంది.   సీమంద్రా పార్టీలయిన తెదేపా, వైకాపాలను తెలంగాణా నుండి తరిమికొట్టాలని కేసీఆర్ పిలుపునిస్తుంటే, హరీష్ రావు అదే సీమంద్ర పార్టీలో తమ ఉద్యమ పార్టీని విలీనం చేస్తామని చెప్పడం చూస్తే, రఘునందన్ రావు చెప్పినట్లు తెరాసలో ఆధిపత్యపోరు సాగుతోందని, హరీష్ రావు, కేసీఆర్ ల మధ్య తీవ్ర విభేదాలున్నట్లు స్పష్టం అవుతోంది. లేకుంటే ఆయన ఇటువంటి కీలకమయిన ప్రతిపాదన తనంతట తానుగా చేయడానికి సాహసించేవారు కాదు. అందుకే, తెదేపా నేత రేవంత్ రెడ్డి ‘ఈ ప్రతిపాదనకు కేసీఆర్ ఆమోదం ఉందా లేదా? అని ప్రశ్నించారు.   ఏమయినప్పటికీ, హరీష్ రావు ప్రకటన తెలంగాణా ఉద్యమాలలో తెరాస నిబద్ధతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. అసలు ఆ పార్టీ లక్ష్యం తెలంగాణా సాధనా లేక వచ్చే ఎన్నికలలో విజయం సాదించడమా? అనే అనుమానం రేకెత్తిస్తోంది. కానీ, ఇటువంటివి వాటిని అవలీలగా కొట్టిపారేయగల వాక్చాతుర్యం కేసీఆర్ స్వంతం గనుక, పార్టీలో లొసుగులు బయటపడకుండా, ఏదో ఒక మెలికతో ఆయన బంతిని మళ్ళీ తెదేపా కోర్టులో పడేయడం ఖాయం.   ఇక, రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు ప్రతిపాదనను స్వాగతించడం చూస్తే, మరి ఆయన ప్రతిస్పందనకు చంద్రబాబు ఆమోదం ఉందాలేదా? అనే సంగతి ఆయనే స్పష్టం చేయాలి. వచ్చే ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న చంద్రబాబుని కాదని, తెలంగాణకు చెందిన ఒక దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని పార్టీ తరపున ఆయన చెప్పడం ఎంతవరకు సాధ్యమో, అది సాధికార ప్రతిస్పందనో కాదో ఆయనే చెప్పాలి.   ఈ మద్య తరచుగా తెరాస నేతలు, “తెదేపాలో అయితే చంద్రబాబు లేకుంటే బాలకృష్ణ తప్ప తెలంగాణకు చెందిన వారు ఎన్నటికీ ఆ పార్టీ అధ్యక్షులు కాలేరు, ముఖ్యమంత్రి అసలే కాలేరని” తెదేపాలో తెలంగాణా నేతలను రెచ్చగొడుతున్నారు. బహుశః తెదేపాలో తెలంగాణా నేతలు వారి మాటలకు ప్రభావితమయినందునే లోనయ్యరేమోనని రేవంత్ రెడ్డి ప్రతిస్పందన అనుమానాలు రేక్కిత్తిస్తోంది.   వచ్చేఎన్నికలలో కాంగ్రెస్, వైకాంగ్రెస్ పార్టీలు ఒకవేళ చేతులు కలిపితే, వాటిని ఎదుర్కోవడానికి మళ్ళీ తెదేప, తెరాసలు పొత్తులు పెట్టుకొని ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా ఈ సవాలు, ప్రతిసవాళ్ళు అన్యాపదేశంగా చెపుతున్నట్లు భావించవచ్చును.   ఏమయినప్పటికీ, తమ ఉనికిని నిలుపుకోవడానికి తిప్పలుపడుతున్న తెదేపా, తెరాసాలు ఇటువంటి వివాదాస్పద ప్రకటనలు, విమర్శలు, సవాళ్ళు ప్రతిసవాళ్ళతో మీడియా ద్వారా జనం నోళ్ళలో నిత్యం నానేలా చూసుకొంతున్నాయని చెప్పవచ్చును.

జగన్ పొలిటికల్ బుకీ

        వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పొలిటికల్ బుకీ అని, అది కలెక్షన్ల పార్టీ అని కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి అభివర్ణించారు. విజయసాయిరెడ్డి జగన్‌కు బ్రోకర్ అని ఆయన అన్నారు. జగన్ అక్రమాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మూడు సార్లు అటాచ్ చేసినా వాటిపై వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, జగన్ విడిచిన బాణం షర్మిలా ఒక్క మాట కూడా మాట్లాడకుండా జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టారని ప్రచారం చేయడం ఎంతవరకు సబబని ఆనం వివేకా ప్రశ్నించారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు పార్టీని వీడడం ఆహ్వానించదగిన పరిణామమని ఆనం వివేకా అన్నారు. ఆలస్యంగా వెళ్లినా తమ నెత్తిన తెలంగాణ ఎంపీలు పాలు పోశారని ఆయన అన్నారు.

అసమ్మతి నేతలే ముఖ్యమంత్రిని నిలువరించారా?

  ముఖ్యమంత్రి మళ్ళీ డిల్లీ తిరిగొచ్చారు. ఈసారి కూడా ఆయన మంత్రి వర్గంలో అసమ్మతి వాదులను బయటకి పంపేందుకు, మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పుల ప్రతిపాదనలకు కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలుపకపోవడంతో ఆయన నిరాశగా తిరిగి వచ్చి మళ్ళీ తన ఇందిరమ్మ కలలలో మునిగిపోయారు. ఈసారి ఆయన పర్యటనలో కొన్ని నామినేటడ్ పదవులను నింపుకోవడానికి మరికొన్ని శాఖపరమయిన మార్పులు చేసుకోవడానికి మాత్రమే అనుమతి సంపాదించుకొన్నారు.   అసమ్మతి మంత్రులను తొలగించి, దానివల్ల తలెత్తే పరిణామాలను ఎదుర్కోవడానికి స్వయంగా ముఖ్యమంత్రి సిద్దపడుతున్నపటికీ కాంగ్రెస్ అధిష్టానం వెనుకంజ వేయడం విశేషం. ప్రస్తుతం తెలంగాణా యంపీల తెరాస జంపింగ్ సీరియల్ నడుస్తోంది గనుక, మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేసి కొత్త సమస్యను నెత్తినెత్తుకోవడం కాంగ్రెస్ అధిష్టానం వెనుకంజ వేసి ఉండవచ్చును. లేదా, బొత్స సత్యనారాయణ తదితర అసమ్మతి నేతలు అధిష్టానానికి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేఖంగా చేస్తున్న పిర్యాదులను దృష్టిలో పెట్టుకొని, ఎవరినీ ఖాతరు చేయని కిరణ్ కుమార్ రెడ్డి కూడా మళ్ళీ మరో రాజశేఖర్ రెడ్డిలా తయారు కాకూడదనే ఆలోచనతోనే ఆయన ప్రతిపాదనలను ఆమోదించకుండా, ఆయనకు పక్కలో బల్లెంలా అసమ్మతి నేతలను ఉంచాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన కావచ్చును. అందువల్ల మరికొంత కాలం రామచంద్రయ్య, డీ.యల్.రవీంద్రా రెడ్డి వంటి వారికి వెసులు బాటు దొరికినట్లే.   ముఖ్యమంత్రి డిల్లీ వెళ్ళినప్పుడల్లా వారి నెత్తిపై కట్టి వ్రేలాడుతున్నట్లేనని చివరికి మీడియా కూడా దృడంగా నమ్ముతోందంటే, వారిపట్ల ముఖ్యమంత్రికి ఎటువంటి అభిప్రాయం ఉందో అర్ధం అవుతుంది. అధిష్టానం వారిని తొలగించడానికి ఆమోదముద్ర వేయలేదు కనుక, త్వరలో మళ్ళీ ఎదో ఒక అవకాశం దొరకగానే మళ్ళీ ముఖ్యమంత్రి పై విమర్శల వర్షం కురిపించవచ్చును. ఇది ముఖ్యమంత్రి ఇబ్బందికరమే అయినప్పటికీ భరించక తప్పదు.

నారాయణ మూర్తి మళ్ళీ వచ్చారు

        ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్‌గా మరోసారి నారాయణ మూర్తి నియామకమయ్యారు. ఎగ్జిక్యూటీవ్ బోర్డులోని సభ్యులు ఆయన్ని ఏకగ్రీవంగా శనివారం ఎన్నుకున్నారు. నారాయణ మూర్తి ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగుతారు. అయితే ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన కె.వి.కామత్ (65 ) తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.   2011లో ఇన్పోసిస్ ఎగ్జిక్యూటీవ్ బోర్డు బాధ్యతల నుంచి నారాయణ మూర్తి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక నారాయణమూర్తి ఈ పదవీ కాలంలో కేవలం ఏడాదికి ఒక్క రూపాయి జీతంతోనే పనిచేస్తారు. జూన్ 1వ తేదీ నుంచి  నారాయణమూర్తి సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, అదనపు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని ఇన్ఫోసిస్ ఓ ప్రకటనలో తెలిపింది.1981లో ఇన్ఫోసిస్‌ ను నారాయణమూర్తి ప్రారంభించారు. 1981నుంచి 2002 వరకు ఆయన సిఇఒగా పనిచేశారు. తిరిగి తనను బోర్డులకు ఆహ్వానించడంపై నారాయణ మూర్తి స్పందించారు. ఇది అకస్మాత్తుగా, అనూహ్యంగా, అసాధారణంగా జరిగిందని అన్నారు. ఇన్ఫోసిస్ తన మిడిల్ చైల్డ్ అని, దాంతో మిగతా ప్రణాళికలను పక్కన పెట్టి తాను బాధ్యతలను అంగీకరించానని ఆయన అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు చైర్మన్ కెవి కామత్‌కు బోర్డుకు, ప్రతి ఇన్ఫోసిసియన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. సవాల్‌తో కూడిన ప్రస్తుత తరుణంలో కంపెనీకి విలువ చేకూర్చే  విధంగా పనిచేస్తానని ఆయన చెప్పారు.  

టీడీపీలో టీఆర్ఎస్ విలీనం!

        టీఆర్ఎస్ ని టీడీపీలో విలీనం చేయడానికి రెడీ అని ప్రకటించారు ఎమ్మెల్యే హరీష్ రావు. కాకపోతే ఆయన మూడు కండీషన్లు పెట్టాడు. “పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేయడంతో పాటు, బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. అధికారంలోకి వస్తే తెలంగాణ బిల్లుమీద మొదటి సంతకం పెట్టాలి. తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇవ్వాలి… ఈ మూడు అంశాల మీద టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో స్పష్టత ఇస్తే టీఆర్ఎస్ ను టీడీపీలో విలీనం చేయడానికి ఎప్పుడయినా సిద్దం” అని అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశాడు. టీఆర్ఎస్ ను టీడీపీలో విలీనం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు.   ఈ మూడు అంశాలమీద చంద్రబాబుతో స్పష్టత ఇప్పించే దమ్ము టీడీపీ నేతలకు ఉందా ? అని హరీష్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ మీద టీడీపీ మోసపూరిత వైఖరి మరోసారి బయటపడిందని, పదవుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే మోత్కుపల్లి, కేఎస్ రత్నం లాంటి వారికి కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. తెలంగాణ మీద డెడ్ లైన్లు పెడితే లొంగమని ముఖ్యమంత్రి అహంకారపూరితంగా అంటున్నారని, అసలు డెడ్ లైన్లు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

అందని ద్రాక్ష పుల్లనంటున్న రాజయ్య

  తెరాస అధ్యక్షుడు కేసీఆర్, కేశవ్ రావు, వివేక్, మందాలకు సకుటుంబ సపరివారంగా పార్టీలో జేరెందుకు టికెట్స్ పంచిఇచ్చి తనకు మాత్రం హ్యాండివ్వడంతో కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయిన రాజయ్య ఒడ్డున పడ్డ చేపలా గిలగిల కొట్టుకొంటున్నారు.   ‘కాంగ్రెస్ పార్టీ లోంచి తెరాసలోకి జంపు చేసేస్తున్నానహో!’ అని చాటింపు కూడా వేసేసుకొని మూట ముల్లె సర్దుకొని రోడ్డు మీదకి వచ్చేసిన తరువాత, కేసీఆర్ తనని మాత్రం వదిలిపెట్టి మిగిలిన ముగ్గురినే తన కారెక్కించుకొని బుర్రు మంటూవెళ్లిపోయి తన పరువు తీసాడని ఆయన ఆవేశంతో రగిలిపోతున్నారు. కేసీఆర్ తనని మోసం చేసాడని ఆయన ఆక్రోశిస్తున్నారు.   అటువంటి వాడిని నమ్మి కాంగ్రెస్ నుండి బయటకు వెళ్ళకపోవడమే మంచిదయిందని తనను తానూ సముదాయించుకొని, ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండే తెలంగాణా కోసం నిరంతర పోరాటం చేస్తానని ప్రకటించేశారు. తెలంగాణా సాదించేవరకు తన పోరాటం ఆగదని పనిలోపనిగా ప్రకటించేశారు.   కేవలం తెలంగాణా ఉద్యమంలో పాల్గొనడానికే తెరాసలోకి వెళ్తున్నామని చెప్పుకొంటున్న ఆ ముగ్గురు నేతలు, కాంగ్రెస్ పార్టీలో చిక్కుకుపోయిన రాజయ్య అందరి ఆలోచనలు కూడా తమకీ, తమ సంతానానికి, ఇంకా వీలయితే తమ బందుగణానికి టికెట్స్ సంపాదించుకోవడమేనని ఈ వ్యవహారాలతో స్పష్టం అవుతోంది.   టికెట్స్ ఇస్తే ఉద్యమం కోసం పార్టీ మారుతారు. ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉద్యమం చేస్తామంటారు. దీనిని బట్టి తెలంగాణా సాదించుకోవడం పట్ల వారికెంత గొప్ప నిబద్దత ఉందో అర్ధం అవుతోంది. వారి ప్రాదాన్యత కేవలం పార్టీ టికెట్స్ కే తప్ప తెలంగాణాకి కాదని మరోమారు నిరూపించారు.   ఇక, ఉద్యమం కోసం ఇంతకాలం పోరాడిన వారిని కాదని, టికెట్ ఎరలు వేసి ఇతర పార్టీలలోని ‘సౌండ్ పార్టీలను’ తమ పార్టీలోకి ఆకర్షించాలనుకోవడం కేసీఆర్ నైజం తెలియజేస్తోంది. ఏది ఏమయినప్పటికీ, తెలంగాణా సాధన కంటే రాబోయే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ సంపాదించుకోవడమే నేడు అందరి ప్రధానధ్యేయంగా మారిందని జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలియజేస్తున్నాయి.

స్పెల్లింగ్ బీ విజేత అరవింద్ మహాకాళి

        భారత సంతతికి చెందిన చిన్నారి అరవింద్ మహాకాళి ఈ పదాన్ని పలికి ఏకంగా 86వ స్ర్కిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ చాంపియన్ షిప్ కైవసం చేసుకున్నాడు. అమెరికాలో ఏటా స్పెల్లింగ్ పోటీలు పలు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో ఎక్కువ శాతం అక్కడ స్థిరపడిన భారతీయుల చిన్నారులే ముందుంటున్నారు. వీటిల్లో ప్రధానంగా చిన్నారుల బ్రెయిన్ పవర్ ను పరీక్షిస్తారు. 13 ఏళ్ల అరవింద్ మహాకాళి న్యూయార్క్ నగరంలో ఉంటాడు. అరవింద్ 2011, 2012 స్పెల్లింగ్ చాంపియషన్ షిప్ లలోనూ 3వ స్థానంలో నిలిచాడు. అప్పుడు జర్మనీ పదాలను పలకడంలో తప్పులు చేసి చాంపియన్ షిప్ కోల్పోయాడు. ఈ సారి మాత్రం తప్పటడుగు వేయకుండా విజయాన్ని దక్కించుకున్నాడు. అరవింద్ విజయాన్ని భారతీయులు, ఎన్ఆర్ఐలు ఆస్వాదిస్తున్నారు.

సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ బదిలీ

        సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారు. ఆయన జూన్ ఏడోతేదీన తన సొంత క్యాడర్ మహారాష్ట్ర సర్వీసుకు వెళ్లిపోతున్నారు. ఆయన ముంబయి క్రైం బ్రాంచ్ అధిపతిగా నియమితులయినట్లు తెలుస్్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ గనుల తవ్వకాలు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో జేడీ లక్ష్మీనారాయణ వెలుగులోకి వచ్చారు. ఆయన ధైర్యం, నిజాయితీ గల అధికారిగా పేరుపడ్డారు. ఈ రెండు కేసుల పరిశోధనలో ఆయనకు రాష్ట్రంలో ఏకంగా అభిమాన సంఘాలు తయారయ్యాయి. పలు చోట్ల జేడీ ఫోటోతో ఫ్లెక్సీలు కూడా పెట్టే పరిస్థితి వచ్చింది. అయితే ఈ క్రమంలో ఆయనను వివాదాస్పదుడిగా చేసే ప్రయత్నం జరిగింది. ఆయన కాల్ డేటా సేకరించడం, ఆయనకు ఇంకొకరితో సంబంధం అంటగట్టే ప్రయత్నాలు, ఆయన ఇతరులు చేస్తున్న వత్తిడి మేరకు దర్యాప్తు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కాల్ డేటా సేకరణ నేపథ్యంలో కేసుకూడా నమోదయింది. వీటన్నింటినీ ఆయన హుందాగా ఎదుర్కొన్నారనే చెప్పాలి. మొత్తానికి జేడీ లక్ష్మీనారాయణ బదిలీతో జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి.

స్పాట్ ఫిక్సింగ్ పై సచిన్, ధోని స్పందన

  క్రికెటర్లకు, బీసీసీఐ బోర్డుకు కోట్ల రూపాయలు వర్షం కురిపిస్తున్న ఐపియల్ మ్యాచులలో బయటపడిన బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాలు తెర వెనుకున్న క్రికెట్ బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్, బాలివుడ్ నటుడు విందూ ధారా సింగ్ వంటి పెద్ద తలకాయలను బయట పెట్టడంతో క్రికెట్ అభిమానులు షాకయ్యారు. అల్లుడు ప్రమేయం ఉందని స్పష్టంగా తెలుస్తున్నపటికీ, బోర్డు అధ్యక్ష పదవిని వదిలి పెట్టేదిలేదని శ్రీనివాసన్ గట్టిగా చెపుతుండటంతో, అటువంటి వారి నేతృత్వంలోనడుస్తున్న క్రికెట్ మ్యాచులపై అభిమానులకు నమ్మకం సడలుతోంది.   ఇక ఈ విషయంలో స్పందించవలసిన హేమా హేమీలయిన క్రికెట్ ఆటగాళ్ళు సైతం అనవసరంగా కలుగజేసుకొని తమ అవకాశాలను పాడుచేసుకోవడం ఎందుకని అనుకోన్నారో ఏమో ఎవరూ ఈ విషయం పై నోరు విప్పలేదు.   అయితే లండన్ పర్యటనలో ఉన్న ఇండియన్ టీం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మీడియాతో మాట్లాడుతూ “ప్రస్తుతం ఈ విషయంపై మాట్లాడటం మంచిదికాదని నేను భావిస్తున్నాను. దీనిపై సరయిన సమయంలో నా అభిప్రాయం వ్యక్తం చేస్తాను. ఈ విధంగా జరగడానికి ప్రధాన కారణం కొందరు ఆటగాళ్ళు మానసికంగా మిగిలిన వారికంటే కొంచెం బలహీనంగా ఉండటేనని నేను భావిస్తున్నాను. ఇంత కంటే ప్రస్తుతం ఎక్కువ మాట్లాడలేను,” అని అన్నారు.   ఇక, ఇటీవలే ఐపియల్ మ్యాచుల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండుల్కర్ మాట్లాడుతూ, లక్షలాది ప్రజలు అభిమానించే క్రికెట్ ఆటలో ఇటువంటివి జరగడం నిజంగా నాకు చాల బాధ కలిగిస్తోంది. ఇటువంటి ఆరోపణలతో క్రికెట్ ఆట మీడియా కెక్కిన ప్రతీసారి నాకు చాల బాధ కలుగుతుంది. మేము బాగా ప్రాక్టీస్ చేసి, ఆడి విజయం సాదించాలని మాత్రమే మాకూ శిక్షణలో నేర్పబడుతుంది. ఆటలో ఓడినా గెలిచినా క్రీడాస్పూర్తి నిలపడం చాల ముఖ్యమని మాకూ శిక్షణలో చెప్పబడింది. కానీ, ఇటువంటి వ్యవహారాల వల్ల ఆటకు చెడ్డ పేరు రావడమే కాకుండా, లక్షలాది అభిమానుల నమ్మకం కూడా వమ్ము చేసినట్లవుతుంది. ఇప్పటికేయినా సమూల ప్రక్షాళన చేసి ఆటకు పునర్ వైభవం తీసుకువస్తే అందరూ సంతోషిస్తారు.”   ధోనీ ఆటగాళ్ళ బలహీనతలే ఇటువంటి అవినీతి పనులకు అవకాశం ఇస్తాయని అభిప్రాయ పడితే, క్రికెట్ బోర్డులో చోటుచేసుకొన్న రాజకీయాలను, తద్వారా ఆటను సమూల ప్రక్షాళణం చేయడమే దీనికి పరిష్కారమని సచిన్ అభిప్రాయ పడ్డారు.

గులాబీ కార్లో సీటు దొరకని రాజయ్య

  టీ-కాంగ్రెస్ నేతలు కేశవ్ రావు, వివేక్, మందా జగన్నాధంలకు వారి పుత్రరత్నాలకు కూడా కేసీఆర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ క్రింద పార్టీ టికెట్లు, పదవులు హామీలు ఈయడంతో వారు (ఉద్యమాన్నిబలపరిచేందుకు) తెరాసలోకి వెళ్ళడం ఖాయం అయిపోయింది. ఇక మరో టీ-కాంగ్రెస్ యంపీ రాజయ్యకు కూడా ఉద్యమం బలపరచాలని గట్టిగా కోరిక ఉన్నపటికీ టికెట్ దొరకకపోవడంతో గులాబి కారెక్కలేకపోయారు.   రాజయ్య వరంగల్ నుండి డిల్లీకి టికెట్ తీసుకొందామనుకొన్నారు. కానీ, దానిని కడియం శ్రీహరికి ఇస్తానని చెప్పి పార్టీలోకి తీసుకువచ్చినందున, మానకొండూరు నుండి హైదరాబాద్(అసెంబ్లీ)కి మాత్రమే టికెట్ ఇవ్వగలనని కేసీఆర్ చెప్పారు. దానితో చిన్నబుచ్చుకొన్న రాజయ్య డిల్లీ టికెట్ దొరికే వరకు అమ్మహస్తం పట్టుకొనే నడవాలని ఫిక్స్ అయ్యారు.   కానీ, కిరణ్, బొత్స ఇద్దరూ కూడా ‘బయటకు పోయే వాళ్ళు ఎంచక్కా పోవచ్చునని’ ఇప్పటికే స్పష్టం చేసారు కనుక, కధ ఇంతవరకు వచ్చిన తరువాత ఆయన బొత్స హస్తం పట్టుకొన్నా, కిరణ్ హస్తం పట్టుకొన్నా ప్రయోజనం లేదు. ఇక రాష్ట్రంలో, కేంద్రంలో కూడా తనకి మద్దతు ఇచ్చేవారు లేరని రాజయ్య గ్రహించగలిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దొరికినకాడికి ఏదో ఒక టికెట్ తీసుకొని సంతోషపడటమే బెటర్. లేకుంటే మున్ముందు హైదరాబాద్ టికెట్ కూడా దొరకకపోయే ప్రమాదం ఉంది.   ఇక, వరంగల్ టికెట్ వెనుక కేసీఆర్, హరీష్ రావుల మద్య ఏదో కోల్డ్ వార్ నడుస్తున్నట్లు కూడా కొన్ని పుకార్లు ఉన్నాయి. అదే నిజమయితే, రాజయ్య వారిరువురి మద్య నలిగిపోవడం కంటే, టులెట్ బోర్డు పెట్టుకొని అభ్యర్దుల కోసం ఎదురు చూస్తున్న బీజేపీలోకి జంపయిపోవడం ఇంకా మంచిది. కావాలంటే, ఆనక గెలిచిన తరువాత అప్పటి రాజకీయ పరిస్తితులను బట్టి ఏ పార్టీలోకి కావాలంటే ఆ పార్టీలోకి జంప్ అయిపోవచ్చును. ఇంకా తనకి రాజయోగం గాని పడితే, కేంద్రంలో బెజీపీ అధికారంలోకి వచ్చి ఆయన కేంద్ర మంత్రి కూడా అయిపోవచ్చును. బీజేపీ కూడా తెలంగాణా ఉద్యమం చేస్తోంది గనుక అందులో జేరడానికి శాస్త్రం అభ్యంతరం చెప్పదు. కాకపోతే ఆలశించిన ఆశాభంగం అనే సంగతిని ఆయన తెలుసుకోవడం చాల మంచిది.

బక్కన్నకి రాములమ్మ జలక్

  ఒకవైపు తెలంగాణా ఉద్యమ సైన్యాదిపతి బక్కన్నకేసీఆర్, పార్టీలోకి రావడానికి చాలాకాలంగా మొరాయిస్తున్న ఇద్దరు టీ-కాంగ్రెస్ యంపీలను అతికష్టం మీద పార్టీలోకి లాక్కొని వచ్చేందుకు తిప్పలు పడుతుంటే, మరో వైపు ఆయనను నిత్యం అంటిబెట్టుకొని తిరిగే చెల్లెమ్మ రాములమ్మ వెళ్లి ముఖ్యమంత్రిని కలిసివచ్చి ఆయనకు జలక్ ఇచ్చింది.   తన మెదక్ సీటుపై కేసీఆర్ ఇంతవరకు స్పష్టమయిన హామీ ఏమీ ఈయకపోగా, దానిని పార్టీలోకి కొత్తగా జేరిన ఐఏయస్ ఆఫీసర్ రమణాచారికి అప్పగించేందుకు బ్రదర్ బక్కన్న డిసైడ్ అయినట్లు కనిపెట్టింది చెల్లెమ్మ. అందువల్ల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మేలనుకొని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలో తన సరికొత్త అన్నగారిని చూసుకొన్న రాములమ్మ, కాంగ్రెస్ కండువా ఇస్తే కప్పుకోవడానికి తాను సిద్దం అని స్పష్టమయిన సంకేతం ఇచ్చి వచ్చింది.   అయితే శంఖంలో పోస్తే గానీ నీళ్ళు తీర్ధం కావు గనుక అమ్మహస్తం పట్టుకొని తిరుగుతున్నకిరణన్నగారు తనకి అభయ హస్తం ఇచ్చేవరకు ఎటువంటి (ఇందిరమ్మ) కలలు కనడం మంచిది కాదని ఆమెకు తెలుసు గనుక, ముఖ్యమంత్రితో తన భేటీని అపార్ధం చేసుకొని రాజకీయం చేయవద్దని, తానూ కేవలం తన మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మెదక్- అక్కన్నపేట రైల్వే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరడానికే మాత్రమె ఆయనను కలిసానని ఆమె సంజాయిషీ ఇచ్చుకొన్నారు. అయితే తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగుతున్నానని చెప్పినా నమ్మని జనం ఆమె మాటలని నమ్మడం లేదిప్పుడు.   ఆమె గతంలోనే ఒకసారి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని కలిసివచ్చినపటికీ కాలం కలిసి రాకపోవడంతో వెనక్కి తగ్గింది. ఆ తరువాత కిషన్ రెడ్డికి రాఖీ కట్టి బీజేపీలో చేరుదామని చెల్లెమ్మ కొంచెం ఊగిసలాడినా మళ్ళీ బక్కన్నకన్విన్స్ చేసేయడంతో ఇంతవరకు తెరాసనే అంటిపెట్టుకొని ఉంది. కానీ, తన బక్కన్నమళ్ళీ తనకి హ్యాండిస్తునట్లు అనుమానం రాగానే, ఎందుకయినా మంచిదని కిరణన్నని కలిసి తన కర్తవ్యం తానూ నిర్వర్తించి వచ్చింది.   మరి తన బక్కన్న, కిరణన్నలలో ఎవరు ఆమెచేత రాఖీ కట్టించుకొని ఆమెకు మెదక్ లోక్ సభ టికెట్ గిఫ్టుగా ఇస్తారో చూడాలి మరి.