రాయలసీమలో మొదలయిన రాజకీయ అల్పపీడనం
posted on Jul 25, 2013 @ 7:05PM
కమలాపురం కాంగ్రెస్ శాసనసభ్యుడు వీరశివారెడ్డి రాజీనామాతో రాయలసీమలో రాజకీయ అల్పపీడనం మొదలయి, పదకొండు మంది వైయస్సార్ కాంగ్రెస్ శాసన సభ్యుల రాజీనామాలతో పెను తుఫానుగా మారి, అది తెలంగాణాలో ఉరుములు, మెరుపులు సృష్టిస్తోంది.
సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 11మంది శాసన సభ్యులు రాజీనామాలు చేసారు. వారు: శోభా నాగిరెడ్డి(ఆళ్లగడ్డ); బాలినేని శ్రీనివాసరెడ్డి(ఒంగోలు); గుర్నాథరెడ్డి (అనంతపురం); అమర్ నాథరెడ్డి(రాజంపేట); భూమన కరుణాకరరెడ్డి( తిరుపతి); మేకపాటి చంద్రశేఖరరెడ్డి(ఉదయగిరి); శ్రీనివాసులు(రైల్వేకోడూరు); శ్రీకాంత్ రెడ్డి(రాయచోటి); పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల); కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం) మరియు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (కోవూరు). వీరందరూ తమ రాజీనామా లేఖలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు ఫాక్స్ ద్వారా ఈ రోజు పంపారు.
ఇక నేడో రేపో తెలంగాణా రాబోతోందని ఆత్రుతగా ఎదురు చూస్తున్న తెలంగాణా ప్రజలకు, తెలంగాణా వాదులకు, ముఖ్యంగా టీ-కాంగ్రెస్ నేతలకు, తెలంగాణా విద్యార్ధులకు ఇది తీవ్రఆగ్రహం కలిగించింది. వైసీపీ శాసన సభ్యులు రాజీనామాలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఓయూ జేఏసీ అందుకు నిరసనగా తెలంగాణాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణా కార్యకర్తలు, నేతలు అందరూ కూడా పార్టీని వీడాలని కోరింది. జగన్, విజయమ్మల దిష్టి బొమ్మలు దగ్ధం చేసి వారు తమ నిరసన తెలిపారు. తెలంగాణను అడ్డుకొనే ఆ పార్టీలో ఎవరూ కొనసాగరాదని, వెంటనే పార్టీని వీడి ఉద్యమంలోకి రావాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని వారు హెచ్చరించారు. బహుశః త్వరలో ఆ పార్టీకి చెందిన తెలంగాణా కార్యకర్తల, నేతల రాజీనామాలు మొదలయ్యే అవకాశం ఉంది.
ఇక, ఈ వేడి తెలుగుదేశం పార్టీని కూడా తాకితే, ఆ పార్టీ నేతలు ఏవిధంగా స్పందిస్తారో, రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించిన చంద్రబాబు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.