మోడీ ర్యాలీకి 5 రూపాయలు టికెట్

      దేశ భవిష్యత్ ప్రధానిగా భావించబడుతున్న నరేంద్రమోడీ ముందు రాహుల్ గాంధీ ప్రభ వెల వెలబోతుంది. గుజరాత్ సర్వతోముఖాభివృద్ది నరేంద్రమోడీ జాతి దృష్టిని ఆకర్షించారు. మూడో సారి ముఖ్యమంత్రిగా ఎన్నికయిన ఆయన అయితేనే ఈ దేశానికి దిశానిర్ధేశం చేయగలుగుతారని, ప్రపంచ దేశాలతో పోటీ పడలేకపోతున్న భారత్ కు ఆయనే దిక్సూచి అని యువత భావిస్తోంది.   బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ గా మోడీ ఇప్పటికే పోటీలో దూసుకెళ్తున్నాడు. దేశవ్యాప్తంగా ఆయన పర్యటనలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. త్వరలోనే ఆయన హైదరాబాద్ లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించబోతున్నారు.  ఈ నేపథ్యంలో మోడీ ర్యాలీకి హాజరయ్యే ప్రతి ఒక్కరూ రూ.5 చెల్లించి టికెట్ కొనుక్కోవాలని నిర్ణయించారు. ఈ విధంగా వసూలయిన మొత్తం ఉత్తరాఖండ్ వరద బాధితులకు పంపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇదో మంచి ప్రయత్నంగా మిగులుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

పుట్టిన తేదీ మార్చినందుకు ప్రభుత్వానికి జరిమానా

  ప్రభుత్వ ఉద్యోగాలలో చేరేవారు తమ జన్మతేదీ దృవీకరణ పత్రాలను విధిగా సమర్పించడం, దానిని ఆధారంగా తీసుకొని వారి సర్వీస్ కాలం లెక్కకట్టడం సాధారణ విషయమే. ఒకసారి సర్వీస్ రికార్డులో జన్మ తేదీ నమోదు చేయబడిన తరువాత ఇక దానిని ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేయడం సాధ్యం కాదు. అందుకు చట్టం కూడా అనుమతించదు. అయితే, ఈ చట్టాలకు అతీతులమని భావించేవారు కొందరు ఉంటే, అటువంటి వారికి ప్రభుత్వం కూడా అండగా నిలుస్తుంటుందని ఈ కేసు నిరూపిస్తోంది.   రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ఇంజనీర్ శివారెడ్డి సర్వీసు రికార్డులో తన పుట్టిన తేదీ తప్పుగా నమోదు చేయబడిందని, అందువల్ల దానిని 1954 బదులుగా 1956గా సవరించమని ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇచ్చారు. అందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ సర్వీసు రికార్డులో ఆయన పుట్టిన తేదీని ఆయన కోరినట్లు మార్చేందుకు ఒక జీఓ జారీ చేసింది.   గంగాధర్, రామ్మూర్తి అనే ఇద్దరు వ్యక్తులు ఈ జీవోను సవాలు చేస్తూ ట్రిబ్యునల్లో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన ట్రిబ్యునల్ ఆ జీవోను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ శివారెడ్డి, ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అక్కడ కూడా వారికి చుక్కెదురయింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ శివారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.   న్యాయమూర్తులు జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ చల్లా కోదండరామ్‌లతో కూడిన ధర్మాసనం వారి పిటిషన్లను కొట్టివేస్తూ సర్వీసు రిజిస్టర్‌లో మార్పులు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని తన తీర్పులో స్పష్టం చేసింది. ఆ నిబంధనల్లోని రూల్ 4(1)(బి) ప్రకారం పుట్టిన తేదీ సవరణపై నిషేధం ఉందని గుర్తు చేసింది. అంతే గాకుండా శివారెడ్డికి, అతనిని వెనకేసుకు వచ్చిన ప్రభుత్వానికి చెరో రూ. 10 వేల జరిమానా కూడా విధించింది. ఈ మొత్తాన్ని ప్రతివాదులుగా ఉన్న గంగాధర్, రామ్మూర్తిలకు చెల్లించాలని ఆదేశిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

ఖత్రోచీకి భారత్ ఋణపడి ఉండాలిట

  ఇటలీ దేశానికి చెందిన ఖత్రోచి బోఫోర్స్ కేసులో భారత్ లో చేసిన నిర్వాకం గురించి భారతీయులందరికీ తెలుసు. ఆయన చేసిన నిర్వాకం వల్ల చివరికి మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీపై రూ.80 కోట్లు ముడుపులు స్వీకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తడం, తత్ఫలితంగా ఆయన ఎన్నికలలో ఓడిపోయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. బోఫోర్స్ కేసులో సీబీఐ కేసు నమోదయిన సంగతి పసిగట్టిన వెంటనే రాత్రికి రాత్రి దేశం నుండి ఉడాయించిన ఆ పెద్ద మనిషిమీద రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేయబడింది. రెండు సార్లు పోలీసులనుండి తెలివిగా తప్పించుకొని ఇటలీ చేరుకొన్న అతనిని భారత్ కి తిరిగి రప్పించలేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో అతనిపై ఉన్న కేసులన్నీ ఎత్తివేయడం జరిగింది. మన దేశం పరువు తీసిన ఆ మహానుభావుడు నాలుగు రోజుల క్రితం ఇటలీలో గుండెపోటుతో మరణించాడు. బోఫోర్స్ కుంభకోణంలో అసలు సూత్రధారి అయిన అతని మరణంతో ఇక మరెన్నడూ బోఫోర్స్ గురించి ప్రస్తావన కూడా చేయనవసరం లేని పరిస్థితి.   ఇంత పెద్ద గ్రంథo నడిపిన ఆ మహానుభావుడు భారత్‌ను ఎంతగానో ప్రేమించారని, ఆయన భారత్ కు చేసిన సేవలకు గాను భారత్ ఆయనకు ఋణపడి ఉండాలని ఆయన కుమారుడు ‘మాసిమో’ మీడియాతో చెప్పడం విశేషం. తన తండ్రిని రాజకీయ వేధింపుల కారణంగానే భోపోర్స్ కుంభకోణంలో ఇరికించారని, నిజానికి ఆయన ఏ పాపం ఎరుగరని అని మాసిమో పేర్కొన్నారు. తన తండ్రి చేసిన పనులకు తానూ చాలా గర్విస్తున్నానని తెలిపారు. పెట్ర ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు అమోఘం అని కొనియాడారు.

పార్లమెంటు సమావేశాలు ఆగస్ట్ 5 నుండి మొదలు

  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 30 వరకు జరుగుతాయి. మధ్యంతర ఎన్నికల గురించి జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నందున బహుశః పార్లమెంటుకు ఇవే ఆఖరి సమావేశాలు కావచ్చును. కాంగ్రెస్ తనకు ఓట్ల వర్షం కురిపిస్తుందని భావిస్తున్నఆహార భద్రతా బిల్లును ఈ సమావేశాలలో ప్రవేశపెట్టవచ్చును. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసే ఉద్దేశ్యం ఉంటే గనుక ఈ సమావేశాల్లోనే తెలంగాణపై బిల్లు కూడా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.   కీలకమయిన ఈ రెండు బిల్లులు ప్రవేశపెట్టినా లేకున్నా కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు రెండూ కూడా ఒకరిపై మరొకరు దాడికి అస్త్రాలు సిద్ధం చేసుకొంటున్నాయి. బహుశః ఇదే ఆఖరి సమావేశమని ప్రతిపక్షాలు భావిస్తే ఆ దాడి మరింత తీవ్రంగా ఉండవచ్చును. క్రిందటిసారి సమావేశాల సమయంలో కాంగ్రెస్ ఉన్న పరిస్థితి కంటే ప్రస్తుత పరిస్థితి చాల మెరుగ్గా ఉంది గనుక, కాంగ్రెస్ కూడా అంతే దీటుగా ప్రతిపక్షాలను ఎదుర్కోవచ్చును.   అయితే అధికార విపక్షాల ఈ వ్యూహాల వలన పార్లమెంటు విలువయిన సమయం వృధాకావడం మినహా మరేమీ సాధించేది ఉండదని ఇరుపక్షాల నేతలకి తెలుసు. కానీ, ఎవరి రాజకీయ ప్రయోజనాలను వారు కాపాడుకోవడం కోసం తమ పరస్పర దాడులు, ఆరోపణలు, వాక్ అవుట్లు వంటివి కొనసాగిస్తుంటారు.

స్టార్ బ్యాట్ మ్యాన్ ని అవుట్ చేసే బౌలర్ ని దింపుతాము: వీ.హెచ్చ్.

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోర్ కమిటీ సమావేశంలో సమైక్యాంద్రకి మద్దతుగా మాట్లాడుతూ తెలంగాణా అభివృద్ధికి తగిన ప్యాకేజ్ ఇస్తే సరిపోతుందని వాదించారు. ఇది తెలంగాణా వాదులకు నేతలకు ఆగ్రహం కలిగించడం సహజమే. కానీ, ఆ వాదన చేసింది సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఎవరూ కూడా నోరెత్తే సాహసం చేయలేకపోయారు. మొన్న విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ సమైక్యరాష్ట్ర సాధనకోసం తమ స్టార్ బ్యాట్ మ్యాన్ ఇప్పటికే ఆడుతున్నాడని, అతను రాష్ట్ర విభజనను సమర్ధంగా అడ్డుకొంటాడని అనడం పుండు మీద కారం చెల్లినట్లయింది.   రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంత రావు వెంటనే స్పందిస్తూ “ఆ స్టార్ బ్యాట్స్ మ్యాన్ ఎవరో చేపితే అతనికి సరిపోయే బౌలర్ ను మేము రంగంలోకి దింపి ఔటు చేయిస్తాము. ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని పలికే లగడపాటి వంటి వారు ఈవిధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం వివేకం అనిపించుకోదు. అదేవిధంగా ముఖ్యమంత్రి తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని సలహా ఇవ్వడం కూడా సమజసం కాదు. అంతగా అయితే, మాకు తెలంగాణా ఇచ్చేసి ఆ ప్యాకేజీ ఏదో సీమంధ్ర రాష్ట్రానికే ఇప్పించుకోండి. మాకేమి అభ్యంతరం లేదు” అని అన్నారు.

మన్మోహన్ విధానాలను తప్పు బట్టిన కిషోర్ చంద్ర దేవ్

  కేంద్రమంత్రి గిరిజన శాఖా మంత్రి కిషోర్ చంద్ర దేవ్ ఒక ప్రముఖ దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యులో ప్రధాని మన్మోహన్ సింగ్ విధానాలను తప్పుబడుతూ మాట్లాడటం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. దేశంలోవివిధ రాష్ట్రాలలో మావోయిస్టులు వ్యాప్తి చెందడానికి ప్రధాని మన్మోహన్ ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలే కారణమని ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.   ఉదారవాద ఆర్థిక విధానాలు, పారిశ్రామికీకరణ పేరుతో కొంతమంది పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రభుత్వం విధివిధానాలు ఏర్పరచడంతో, కోటీశ్వరులయిన వ్యాపారవేత్తలు మరింత ధనికులుగా మారుతుంటే, వారి దోపిడీకి గురయిన గిరిజన ప్రాంతాలలో ప్రజలు ఆకలికి, రోగాలకు, రొప్పులకు, నిరుద్యోగంతో బాధలుపడుతూ చివరికి మావోయిస్టుల ప్రభావానికి లోనవుతున్నారని ఆయన ఆరోపించారు. కానీ, ప్రభుత్వం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా మావోయిస్టులను కేవలం శాంతి భద్రతల సమస్యగా పరిగణిస్తూ వారిని అణచివేయాలని విఫలయత్నాలు చేస్తోందని ఆయన అభిప్రాయ పడ్డారు.   ప్రభుత్వాలు తనకు అనుకూలురయిన కొంత మంది పారిశ్రామికవేత్తలతో కలిసి అవలంభిస్తున్న ‘ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం’ నికి (క్రోనీ కేపిటలిజం) తాను మనస్పూర్తిగా వ్యతిరేఖిస్తున్నాని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ముఖ్యంగా గిరిజనుల, ఆదివాసిలా హక్కులను కాపాడవలసిన ప్రభుత్వాలు సదరు పారిశ్రామికవేత్తలతో కలిసి, వారికి చెందిన అటవీప్రాంతాలలో మైనింగ్‌ కార్యకలాపాలకు అనుమతులీయడాన్ని ఆయన తప్పు పట్టారు.   రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసిన ప్రతీ ఒక్కరు దానికి కట్టుబడి ఉండాలి. కానీ, ఆ ప్రమాణాలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. కోట్ల మంది ఆదివాసీలు, గిరిజనుల కష్ట నష్టాలను, బాధలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు కొందరు పారిశ్రామిక వేత్తలకి కొమ్ముకాస్తున్నాయి. అంతేకాక గిరిజనులు, బలహీన వర్గాలకోసం కేటాయించబడిన నిధులు కూడా వారికి చేరకపోగా, అవి వేరే ఇతర అవసరాలకు వినియోగించబడుతున్నాయి. కనీసం వారికి కేటాయించిన నిధులు వారికే సద్వినియోగం చేసినా నేడు సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదు. కానీ ప్రభుత్వాలకి, మంత్రులకీ కూడా జవాబుదారీ లేకపోవడం వలన ఎన్నేళ్ళు గడచినా వారి జీవితాలలో మార్పు రాలేదు. తత్ఫలితమే నానాటికి మావోయిజం పెరుగుతోంది. త్వరలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత మంత్రిత్వ శాఖతో కలిసి జవాబుదారీ బిల్లును తీసుకు రానున్నట్టు ఆయన తెలిపారు.   కేంద్ర మంత్రిగా ఉన్న కిషోర్ చంద్ర దేవ్ ఇంత లోతుగా సమస్యని అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు చెపుతున్నప్పటికీ, ఆయనే చెపుతునట్లు కొందరు బడా పారిశ్రామిక వేత్తల కనుసన్నలలో నడుస్తున్న ప్రభుత్వాల పనితీరుని మార్చడం ఆయన వలన సాధ్యమయ్యే పనేనా?

తెలంగాణాకు ఎవరు అడ్డుపడుతున్నారు

  తెలంగాణా ఏర్పాటుకు అడ్డుపడుతున్నది కాంగ్రెస్ నేతలా? సీమంధ్ర వలసవాదులా? లేక వేరవరయినా అడ్డుపడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రజలను మోసం చేస్తోందా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికితే, ముందుగా తప్పు పట్టవలసింది వారెవరినీ కాదు, తెలంగాణా సాధనే తన జీవిత ధ్యేయమని ప్రకటించుకొంటున్న కేసీఆర్నే తప్పుపట్టవలసి ఉంటుంది.   తెరాసను విలీనం చేసుకొని తనకు తెలంగాణాలో ఎదురులేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఆలోచన. తెరాస విలీనమే తెలంగాణా ఏర్పాటుకి ప్రధాన షరతుగా కాంగ్రెస్ భావిస్తూ ఎత్తులు వేస్తుంటే, నిన్న మొన్నటివరకు ‘తెలంగాణా కోసం కాంగ్రెస్ లో విలీనానికి కూడా సిద్దమే, కానీ కాంగ్రెస్ పార్టీయే వెనుకంజ వేస్తోందని’ వాదిస్తూవచ్చిన కేసీఆర్, ఇప్పుడు తెలంగాణా అంశం చివరిదశకు చేరుకొన్న తరువాత, తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేసినట్లయితే, తమ రాజకీయ ప్రయోజనాలు దెబ్బ తింటాయనే భయంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనానికి ఒప్పుకోకపోవడం గమనిస్తే, ఆయనకి తెలంగాణా సాధన కంటే తమ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని అర్ధం అవుతోంది.   తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత, అది తమను మోసం చేయవచ్చుననే భయాలు కూడా ఆయనకు ఉండి ఉండవచ్చును. కానీ అదే జరిగితే, ఆయన తన పార్టీ సభ్యులందరినీ తీసుకొని కాంగ్రెస్ నుండి బయటకి వచ్చి మళ్ళీ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవడం పెద్ద పనేమీ కాదు. ఈ సంగతి కేసీఆర్ కి తెలియకపోదు. అయినప్పటికీ, ఆయన విలీనానికి మొగ్గు చూపకుండా స్వయంగా తెలంగాణాను అడ్డుకొంటూనే, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని, సీమంధ్ర వలసవాదులు తెలంగాణా ఏర్పాటుకు అడ్డుపడుతున్నారని ఆరోపించడం ఆయన నిజ వైఖరికి అద్దం పడుతోంది.   కాంగ్రెస్ తెరాసను తనలో విలీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే, కేసీఆర్ తెలంగాణా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పేందుకు ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని, ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చినా తమ పార్టీ తెలంగాణా పునర్నిర్మాణ ప్రక్రియలో చురుకుగా పాల్గొంటుందని చెప్పడం గమనిస్తే, ఆయనకు తెలంగాణా రావడం కంటే ఉద్యమం కొనసాగించడం, తన పార్టీ మనుగడని రక్షించుకోవడమే ముఖ్యమని భావిస్తునట్లు అర్ధమవుతోంది.   సమైక్యాంధ్ర కోరుతున్నలగడపాటి, రాయపాటి, శైలజానాద్, టీజీ. వెంకటేష్ వంటి నేతలు రాష్ట్ర విభజన జరగకుండా, తెలంగాణా ఏర్పడకుండా అడ్డుపడుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చును. కానీ, తెలంగాణా సాధనే తన ఏకైక లక్ష్యం అని చెప్పుకొంటున్న కేసీఆరే స్వయంగా ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు జరగకుండా ఎందుకు అడ్డుపడుతున్నట్లు? తెలంగాణా సాధన కొరకే ఆవిర్భవించిన తెరాసను, అది నెరవేరబోతున్నపుడు దానిని కాంగ్రెస్ పార్టీలో కలపడానికి ఎందుకు వెనకాడుతున్నట్లు?   తన మాటకారితనంతో కేసీఆర్ తెలంగాణా ప్రజలను ఎంతకాలం మభ్యపెట్టగలనని భావిస్తున్నారు? ప్రజలు ఆయన ఆలోచనలను, ఉద్దేశ్యాలను గమనించలేరని భావించడం వలననే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారా? అది సాధ్యమేనా?

తెలంగాణ పై కాంగ్రెస్ క‌స‌ర‌త్తు

  తెలంగాణ అంశంపై ఏదో ఒక‌టి తేల్చేయాల‌ని నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్టానం ఆ దిశ‌గా ప్రయ‌త్నాల‌ను మొద‌లు పెట్టింది. యుపిఏ పక్షాలతో సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేసింది. ముందుగా ప్రధాన భాగస్వామ్య పక్షాల్లో ఒకటైన ఎన్‌సిపి అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఇప్పటికే కాంగ్రెస్ అభిప్రాయానికే గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ కోర్ కమిటీలో తెలంగాణపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేక‌పోయిన‌ పార్టీ అధినాయకత్వం ఈ ఆంశంపై మిత్రపక్షాలతో మంతనాలు ప్రారంభించింది.   ముందుగా యుపిఏ భాగస్వామ్య పక్షాల్లో అత్యంత ముఖ్యుడు, సీనియర్ నాయకుడైన శరద్ పవార్‌కు పార్టీ నిర్ణయం గురించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు తెలియజేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప‌వార్‌ పలు సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు ఇవ్వటంతోపాటు ఈ సమస్యను వీలున్నంత త్వరగా పరిష్కరించాలని కాంగ్రెస్ అధినాయకత్వానికి సూచించారు. లోక్‌సభ ఎన్నికలు 2014 మేలో జరగనున్నందున అప్పటిలోగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సలహా ఇచ్చినట్లు ఎన్‌సిపి వర్గాలు వెల్లడించాయి.   కాంగ్రెస్ అధినాయకత్వం వారం, పది రోజుల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ఏర్పాటుపై కోర్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేయనున్నది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ పై ఏదో ఒక‌టి తేల్చేలోగా యుపిఏ మిత్రపక్షాలతో ఈ అంశం గురించి చర్చించి వారి మద్దతు తీసుకోవాలని అధినాయకత్వం ఆలోచిస్తోంది.   ఇదిలా ఉంటే బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి ఆదివారం విలేఖరులతో మాట్లాతుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తాము ఎప్పటి నుండో చెబుతున్నామని ఆమె అన్నారు. కాగా యుపిఏ మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌డి అధ్యక్షుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ మొదటి నుండి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు ఇవ్వటం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటుకు తన మద్దతు గురించి ఆయన త్వరలోనే కాంగ్రెస్ అధినాయకత్వానికి తెలియజేస్తారని ఆర్‌ఎల్‌డి వర్గాలు తెలిపాయి. యుపిఏలో ఎన్‌సిపి, ఆర్‌ఎల్‌డిలు తప్ప మిగతా పార్టీలు అన్నీ చిన్నా, చితకా పార్టీలు కావటంతో వాటి నుండి పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చునని కాంగ్రెస్ అధినాయకులు భావిస్తున్నారు. ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చునని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఆర్ ఎస్ ఎస్. విహెచ్‌పిల‌ను నిషేదించాలి

  యుపిఎ స‌ర్కారుకు మాయావ‌తి మ‌రో త‌ల‌నొప్పి తెచ్చిపెట్టింది.. ఇప్పటికే ఉన్న స‌మ‌స్యల‌తో మిగంలేక క‌క్కలేక ఇబ్బంది ప‌డుతున్న యుపిఏను మాయావ‌తి.. ఆర్ ఎస్ ఎస్‌, విహెచ్‌పిల‌ను బ్యాన్ చేయాల్సిందిగా వ‌త్తిడిచేస్తుంది.. అంతేకాదు యుపిఏ అలా నిషేదించ‌ని ప‌క్షంలో యుపిఎ స‌ర్కారుకు త‌న‌ప మ‌ద్దతును కూడ ఉప‌సంహ‌రించుకుంటానంటుంది.   గ‌తంలో ఎన్‌డిఏతో పొత్తు పెట్టుకొని ఆర్ ఎస్ ఎస్ అండ‌దండ‌ల‌తోనే సియం అయిన మాయ ఇప్పుడు ఇలా మాట్లాడ‌టం పై బిజెపి కూడా తీవ్రంగానే స్పందించింది..గ‌తంలో కేవ‌లం ఆర్ ఎస్ ఎస్ అండ‌దండ‌ల వ‌ల్లే నువ్ ఉత్త‌ర ప్రదేశ్ ముఖ్యమంత్రివి కాగ‌లిగావ‌న్న సంగ‌తి గుర్తుంచుకోవాలి హిత‌వు ప‌లికింది.   ఈ విష‌యాల‌పై విహెచ్‌పి భ‌జ‌రంగ‌ద‌ల్ కూడా తీవ్రంగానే స్పందించాయి.. కేవ‌లం మైనారిటీ ఓట్ల కోస‌మే మాయ ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తుంద‌ని విమ‌ర్శించింది.. అయితే ఈ విష‌యం యుపిఏ ప్రభుత్వం మాత్రం ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు..

ఆఖ‌రి సందేశం రాహుల్‌కే

  163 సంవ‌త్సరాలుగా భార‌తీయుల‌కు సేవ‌లందించిన ఓ వ్యవ‌స్థ నిన్నటితో క‌నుమ‌రుగ‌య్యింది.. ఇన్ని సంవత్సరాలుగా మంచి చెడు అన్నిర‌కాలు విష‌యాల‌ను అతి శీఘ్రంగా అందించిన టెలిగ్రామ్‌ వ్యవ‌స్థ ఇక క‌నిపించదు.. త‌న వాణి వినిపించ‌దు.. అయితే ఈ నేప‌ధ్యంలో టెలిగ్రామ్ స‌ర్వీస్ ద్వారా పంపే ఆఖ‌రి సందేశం త‌మ‌దే కావాలంటూ దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు పోటి ప‌డ్డారు.. దాదాపు అన్ని న‌గ‌రాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపించింది.   ప్రతీ పోస్ట్ ఆపీస్‌లోనూ ఉద‌యం నుంచే భారీగా క్యూలైన్‌లో జ‌నం క‌నిపించారు. అయితే ఆఖ‌రి మెసేజ్ అందుకుంది కూడా ఓసెల‌బ్రిటీనే.. అర్ధరాత్రికి స‌రిగా 15 నిమిషాల ముందు ఏఐసిసి వైస్ ప్రెసిండెంట్ రాహుల్‌గాంది ఆఖ‌రి టెలిగ్రామ్‌ను అందుకున్నార‌ట‌. అయితే ఈ సందేశం పంపిన వ్యక్తితో అందులోని వివ‌రాల‌ను మాత్రం వెల్లడించలేదు.   అయితే రాత్రి ఆఖ‌రున 11.45 నిమిషాల‌కు టెలిగ్రామ్ కౌంట‌ర్ క్లోజ్ చేసే ముందు ఈ మెసేజ్ పంపింన‌ట్టుగా డిల్లీలోని పోస్టల్ వ‌ర్గాలు చెపుతున్నాయి. అంతే కాదు ఇన్ని ఒక్క రోజులోనే ప్రజ‌లు వేలాదిగా సందేశాల‌ను త‌మ బందు మిత్రుల‌కు పంపించారు..

రిలయన్స్ పై నారాయణ పోరాటం

  కేజీ బేసిన్లో రిలయన్స్ సంస్థ చేస్తున్న దోపిడిపై సోమవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేజీ బేసిన్లో రిలయన్స్ సంస్థ గ్యాస్ దోపిడిపై తమ పోరాటం ఆగదని ఆయన స్ఫష్టం చేశారు. ఆ గ్యాస్ విషయంలో రిలయన్స్ సంస్థ, యూపీఏ సర్కార్లు తోడుదొంగల్లా వ్యవహారిస్తున్నాయని, నిన్నటివరకు గ్యాస్ ఉత్పత్తిలేదని చెప్పిన రిలయన్స్ సంస్థ చమురు కంపెనీ ధరలు ఒకేసారి పెంచడంతో మాటమార్చిందని ఆయన ఆరోపించారు.   చమురుసంస్థల అక్రమాలపై త్వరలో జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. యూపీఏ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అనిశ్చితి ఇంకా అలానే కొనసాగుతుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీలోని వారందరిని ఓకేతాటిపైకి తీసుకురాలేని కాంగ్రెస్పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తుందని నారాయణ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

అన్నిటికీ చెడిన మజ్లిస్ పార్టీ

  కాంగ్రెస్ పార్టీతో దాదాపు ఒక దశాబ్దంపాటు అంటకాగిన మజ్లిస్ పార్టీ, అది మర్రిచెట్టు నీడ క్రింద సేద తీరడమేనని గ్రహించింది. మర్రి నీడన మరే మొక్కలు మొలిచి ఎదగలేనట్లే కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉనంతకాలం తమకి ఎదిగే అవకాశం ఉండదని మజ్లిస్ అధినేతలయిన ఓవైసీ సోదరులకి ఒకనాడు హటాత్తుగా జ్ఞానోదయం అయింది. దానితో కిరణ్ సర్కారుతో గిల్లి కజ్జాలు పెట్టుకొని కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకొని బయటపడ్డారు. అయితే, తమ పార్టీని రాష్ట్రమంతటా త్వరగా వ్యాపింపజేసుకోవాలనే ఆలోచనతో తమ మతస్థులను ఆకట్టుకొనేందుకు కొంచెం సులువయిన మార్గం ఎంచుకొందామని విద్వేష ప్రసంగాలు చేసి వివిధ కేసులో ఇర్రుకొన్నాక గానీ తాము తప్పు ద్రోవలో పయనిస్తున్నామని వారు గ్రహించలేకపోయారు.   అంతకు ముందు వారితో వైకాపా కూడా స్నేహానికి సిద్దపడినప్పటికీ, ఓవైసీ సోదరుల ధోరణి చూసి ఆ పార్టీ కూడా దూరమయిపోయింది. అదే విధంగా కిరణ్ సర్కార్ పోలీసులకు ఓవైసీ సోదరులపై ఉన్న పాత కేసులన్నీ తిరగదోడడానికి అనుమతినీయడంతో వారు పూర్తిగా చల్లబడిపోయారు. కాంగ్రెస్ తో సంబంధ బాంధవ్యాలు గట్టిగా ఉన్న కాలంలో ఓవైసీ సోదరులు తమ ఓవైసీ ఆసుపత్రికి ఆనుకొని ఉన్న 2.57 ఎకరాల ప్రభుత్వభూమిని కబ్జా చేయడమే గాక మరో 10 ఎకరాల భూమిని తమకు కేటాయించాలని విజ్ఞప్తి చేసుకొన్నారు. నాడు ఈ భూకబ్జాపై కిమ్మనని ప్రభుత్వం ఓవైసీ సోదరుల విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదు.   ఇప్పుడు కిరణ్ సర్కారుతో తిరిగి చేతులు కలపాలని ఉవ్విళ్ళూరుతున్న ఓవైసీ సోదరులకి కిరణ్ మరో జలక్ ఇస్తున్నారు. నాడు ఓవైసీ సోదరులు కబ్జాచేసిన 2.57 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాదీనం చేసుకొనేందుకు బండ్లగూడ మండల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మరో రెండుమూడు రోజుల్లో ఈ భూమిని స్వాదీనం చేసుకొని వారు ప్రభుత్వానికి అప్పగించనున్నారు. అదేవిధంగా ఒకప్పుడు ప్రభుత్వం ఓవైసీ సోదరులకిచ్చిన ఎన్‌వోసీ కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.     అటు కాంగ్రెస్ పార్టీతో స్నేహం చెడగొట్టుకొన్నపటికీ, రాష్ట్రంలో వారు కొత్తగా సాధించింది ఏమిలేదు. కనీసం వైకాపాతో స్నేహ సంబంధాలు కూడా ఏర్పాటుచేసుకోలేకపోయారు. తమ విద్వేష ప్రసంగాలతో మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం వలన, ఇప్పుడు వారితో చేతులు కలిపేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావడంలేదు. అయితే ఎన్నికలు దగ్గిర పడేసమయానికి ఈ పరిస్థితులలో కొంత మార్పు వచ్చి ఓవైసీ సోదరులకి, వారి మజ్లిస్ పార్టీకి కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చును. గానీ, ప్రస్తుతం మాత్రం వారికి ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

బొత్స విశ్వాస ఘాతకుడు: షర్మిల

  రాష్ట్రంలో మద్యం మాఫియా డాన్ గా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేరుగాంచారని, ఆయనకు పి.సి.సి. బాద్యతలు అప్పగించడం సిగ్గుచేటని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల మండిపడ్డారు. ఆదివారం విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో జరిగిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఆమె మాట్లాడారు.   షర్మిల మాట్లాడుతూ... మద్యం కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నా కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదు. చీపురుపల్లిలో ఉన్న వ్యాపారాలన్నీ బొత్స కుటుంబానివే. ప్రతి మద్యం దుకాణాన్ని ఒక మినీ బార్ గా మార్చే ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మద్యాన్ని పూర్తిగా నియంత్రించి కేవలం నియోజక వర్గానికి ఒక మద్యం దుకాణం మాత్రమే ఉండేలా చూస్తారని భరోసా ఇచ్చారు షర్మిల.   కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల కష్టం పట్టించుకోకుండా, సంక్షేమ పథకాలను వృధా చేస్తున్నారని అన్నారు. తన తండ్రి పెట్టిన రాజకీయ భిక్షను మరచిపోయి, మా కుటుంబాన్నే విమర్శించడం నైతికం కాదని, బొత్స ఒక విశ్వాస ఘాతకుడు అని షర్మిల విమర్చించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి వై.ఎస్. జగన్ ను జైల్లో పెట్టించాయి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బుద్ధిచెప్పి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణా ఇస్తే గోర్ఖల్యాండ్ కూడా ఇవ్వాల్సిందే

  ఇక వీలయినంత త్వరగా తెలంగాణ సమస్యని తేల్చేయాలని కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి భయపడినట్లుగానే, గోర్ఖల్యాండ్ ఉద్యమనేతలు నిన్న సమావేశమయి, ఒకవేళ కేంద్రం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుచేసినట్లయితే, దానితో బాటు తమకు కూడా గోర్ఖల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేయాలని నిర్ణయించుకొన్నారు. దాదాపు 5గంటల పాటు సాగిన సమావేశానంతరం గోర్ఖల్యాండ్ జనముక్తి మోర్చా అధ్యక్షుడు బిమల్ గురంగ్ మీడియాతో మాట్లాడుతూ, “ఒక వేళ కేంద్రం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయదానికి సిద్దపడితే, అదే సమయంలో మాకు గోర్ఖల్యాండ్ రాష్ట్రం కూడా ఏర్పాటు చేయాలనీ కోరుతూ త్వరలో మేము కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, హోంమంత్రి సుషీల్ కుమార్ షిండేకి లేఖలు వ్రాస్తాము. అయినప్పటికీ, వారు మా విన్నపాలను పట్టించుకోకపోతే కేంద్రం తెలంగాణా ప్రకటన చేసిన వెంటనే మళ్ళీ మేము మా గోర్ఖల్యాండ్ రాష్ట్రం కోసం ఉద్యమాలు మొదలుపెడతాము,” అని చెప్పారు.   గోర్ఖల్యాండ్ రాష్ట్ర డిమాండ్ కూడా ఎప్పటి నుండో ఉన్నపటికీ దానిని పరిమిత అధికారాలు కలిగిన గోర్ఖల్యాండ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రం సర్దుబాటు చేయగలిగింది. అయితే అది కేవలం తాత్కాలిక పరిష్కారమేనని అటు కాంగ్రెస్ ఇటు గోర్ఖల్యాండ్ జనముక్తి మోర్చ నేతలకి కూడా తెలుసు. ఇప్పుడు కేంద్రం తెలంగాణా అంశం పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నపటికీ, గోర్ఖల్యాండ్, విదర్భ వంటి ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్స్ మళ్ళీ తలెత్తుతాయని భయపడుతూనే ఉంది. అది భయపడుతున్నట్లుగానే గోర్ఖల్యాండ్ ఉద్యమనేతలు కేంద్రానికి అల్టిమేటం జారీ చేసారు.   ఇది తెలంగాణా అంశానికి బ్రేకులు వేసే అవకాశం లేకపోలేదు. అయితే, ఇటువంటి పరిణామాలను ముందు నుండే ఊహిస్తున్న కాంగ్రెస్ దైర్యంగా తెలంగాణపై నిర్ణయం తీసుకొంటుందా లేక ఈ సమస్యలన్నిటినీ తప్పించుకొనేందుకు రెండవ యసార్సీ వేసేసి చేతులు దులుపుకొంటుందా? అనే విషయం త్వరలోనే తేలిపోవచ్చును. బహుశః కాంగ్రెస్ తనకు కొంత వెసులుబాటు కల్పించే రెండవ యసార్సీకే మొగ్గు చూపవచ్చును.

ఐక్య రాజ్యసమితి వేదిక పై అదరగొట్టిన 'మలాలా'

      ఐక్యరాజ్య సమితి యూత్ అసెంబ్లీ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యువజన నాయకులు ఐక్య రాజ్యసమితిలో సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా ఐక్య రాజ్యసమితి వేదిక మీది నుంచి మలాలా స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసింది.   'మలాలా డే' నాకు మాత్రమే పరిమితమైన రోజు కాదు. ఇది హక్కుల కోసం గొంతెత్తే ప్రతి ఒక్కరిది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదుల దుశ్చర్యల బాధితుల్లో నేనూ ఉన్నా. గొంతెత్తి మాట్లాడలేని వారి తరఫున నేను మాట్లాడుతున్నా. గత ఏడాది అక్టోబర్ 9న తాలిబన్లు నన్ను కాల్చారు. బుల్లెట్లు మా నోళ్లు మూస్తాయని వారు భావించారు. కానీ అధైర్యం నశించి, పోరాటం పుట్టుకొచ్చింది' అని వ్యాఖ్యానించింది. మహాత్మా గాంధీ అహింసా సిద్దాంతం, మదర్ థెరిస్సా సేవాగుణం తనకు స్ఫూర్తినందించాయని చెప్పింది. మార్టిన లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, మొహమ్మద్ అలీ జిన్నావంటి వారి నుంచి తాను ఆయుధాన్ని స్వీకరించినట్లు తెలిపింది. పుస్తకాలు, కలాలు తీసుకోవాలని, అవి అత్యంత శక్తివంతమైన ఆయుధాలని ఆమె అన్నది. ఒక చిన్నారి, ఓ టీచర్, ఓ పుస్తకం, ఓ కలం ప్రపంచాన్ని మార్చేస్తాయని అన్నారు. విద్యనే అన్నింటినీ పరిష్కారమని అభిప్రాయపడింది. తన లక్ష్యాలను, ఆకాంక్షలను అడ్డుకుంటామని ఉగ్రవాదులు భావించారని, తన జీవితంలో ఏమీ మారలేదని, బలహీనత, భయం, నిరాశ తొలగిపోయాయని చెప్పింది. శక్తి, ధైర్యం, పరిమళం సమకూరాయని చెప్పింది.

సబితా, ధర్మానను జైలుకు పంపాల్సిందే: సిబిఐ

      మీడియాతో మాట్లాడిన విషయాలపై దాఖలు చేసిన మెమోపై మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరాలను సిబిఐ వ్యతిరేకించింది. వారిద్దరు మంత్రులుగా పనిచేశారని, రాజకీ యంగాను, అధికార వర్గాల్లోనూ పలుకుబడి కలవారని ఈ నేపథ్యంలో వారు మాట్లాడిన మాటలు సాక్షుల్ని ప్రభావితం చేస్తాయన్న తన ఆందోళనను పునరుద్ఘాటించింది. ఈ వ్యవహారంలో నింధుతులుగా వీరిద్దరిని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాలని, నేరం రుజువైతే శిక్ష అనుభవించక తప్పదని పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన మెమోను కొట్టేయాలని కోర్టును మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితాకోరారు. ప్రజాప్రతినిధులుగా తాము ఎందుకు రాజీనామా చేశామో చెప్పాల్సిన బాధ్యత త మపై ఉందని అందుకే మీడియాతో మాట్లాడామని చెప్పారు. దానిపై సీబీఐ అర్థం లేని వాదనలను లేవనెత్తిందని ఆక్షేపిం చారు. దీనిపై వాదనలను కోర్టు 19వ తేదీకి వాయిదా వేసింది. మొత్తానికి ఈ వ్యవహారంలో సబిత, ధర్మానలకు జైలు జీవితం తప్పేలా కనబడటం లేదు.

పార్టీ నేతలను కట్టడి చేసిన చంద్రబాబు

  తెలంగాణా అంశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇరుకునపడిన కాంగ్రెస్ పార్టీని తెరాస, టీ-జేయేసీ నేతలు ఎండగడుతుంటే, ఉస్మానియా విద్యార్ధులు ఏకంగా గాంధీ భవన్ ముట్టడికి పూనుకొని, ఈ రోజు తెలంగాణాలో విద్యాసంస్థల బంద్ కి పిలుపు కూడా ఇచ్చారు. అయితే, తెరాస, తెదేపా అధ్యక్షులు కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ కూడా ఇంతవరకు నోరు విప్పలేదు. కేసీఆర్ తన పార్టీ నేతలు కాంగ్రెస్ పై దాడి చేస్తుంటే చూసి చూడనట్లు ఊరుకొంటే, చంద్రబాబు మాత్రం తన పార్టీ నేతలని ఈ విషయంపై ఎవరూ కూడా మీడియాకెక్కి అనవసరమయిన రాద్ధాంతం చేసి పార్టీకి కొత్త తల నొప్పులు తేవద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అందుకే తెదేపా తరపున కేవలం రేవంత్ రెడ్డి, పెద్దిరెడ్డి తప్ప ఇతర నేతలెవరూ కూడా ఈ వ్యవహారంపై ఇంత వరకు స్పందించలేదు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీకి వదిలిపెట్టి, పంచాయితీ ఎన్నికలపై దృష్టి పెట్టమని చంద్రబాబు తన నేతలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రేపు వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా తెలంగాణా సమస్య తేల్చలేకపోయినట్లయితే, అప్పుడు తగిన రీతిలో స్పందించడం మేలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక, వైకాపా కూడా ఈవిషయంలో తెలుగుదేశం పార్టీనే సింపుల్ గా ఫాలో అయిపోతూ పంచాయితీ ఎన్నికలపై దృష్టి పెట్టింది.

20శాతం మంది నేరచరితులే

      నేరచరితులకు ఎలక్షన్స్‌లో పోటి చేసే అర్హత నేపథ్యంలో కోర్టు ఇచ్చిన సంచనల తీర్పుతో ఇప్పుడు అందరి దృష్టి చట్టసభల్లోని నేరచరితలపై పడింది.. రాజకీయనాయకులుగా చలామణి అవుతున్న చాలామంది ఎప్పుడో ఒకసారి ఏదో ఒక కేసులో ఇరుక్కున్న వారే దీంతో అసలు అలా క్రిమినల్‌ రికార్డ్‌ ఉన్న వారిపై ఓ లెక్కతేల్చింది ఓ ప్రైవేట్‌ సంస్థ. ప్రస్థుతం చట్ట సభల్లో ఉన్నవారిలో రాష్ట్రం నుంచి 20శాతం మంది అంటే దాదాపు 54మంది ఎమ్‌ఎల్‌ ఎలు, 14 మంది ఎంపిలకు క్రిమినల్‌ రికార్డ్‌ ఉందట.. అంతేకాదు దాదాపు 90 మంది ఎమ్‌ఎల్‌సి లపై కేసులు ఉన్నాయి.. అయితే ఈ లిస్ట్‌లో అందరికంటే ఎక్కువగా ఎమ్‌ ఐ ఎమ్‌ పార్టీకి సంభందించిన 71 శాతం మంది ఎమ్‌ఎల్‌ఎ లు కేసుల్లో ఉన్నారు.. కోర్టు తీర్పును ఎటువంటి లోసుగులు చూపించకుండా అమలు చేయగలిగితే 2014 ఎన్నికలల్లో దాదాపు సగం మందికి కొత్త నేతలే చట్ట సభల్లో అడుగుపెట్టే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు..

తెలంగాణ పై వర్కింగ్ కమిటీ తేల్చలేదు

      ప్రత్యేక తెలంగాణ అంశం పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా నిర్ణయాన్ని హై కామండ్ కే వదిలిపెట్టవచ్చునని వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు సంజీవరెడ్డి అబిప్రాయపడ్డారు. తెలంగాణాపై వర్కింగ్ కమిటీ ఏ నిర్ణయం తీసుకోలేకపోవచ్చునని తెలిపారు. తెలంగాణ ప్రజలు మాత్రం తెలంగాణ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంద్రలో వ్యతిరేకత వస్తుందని, లేకపోతె తెలంగాణ లో వ్యతిరేకత వస్తుందని, ఏ నిర్ణయం తీసుకున్నా రెండో ప్రాంతంలో సమస్య అని,రాజకీయంగా వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అందరూ మాట్లాడుతున్నారని,ఎవరూ రాజకీయ సన్యాసం కోరుకోరు కదా అని ఆయన అన్నారు. తాను సమైక్యవాదినేనని... తెలంగాణ చాలా క్లిష్టమైన సమస్యగా ఉన్నందున ఎక్కడో ఒక చోట రాజీ కుదిరేలా ప్రయత్నించాలని ఆయన అన్నారు. విభజన వల్ల ఇతరరాష్ట్రాలలో సమస్యలు వస్తాయని చెప్పారు.