విశ్వసనీయత అంటే ఇదేనా
posted on Jul 26, 2013 @ 12:18PM
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సమైక్యాంధ్ర కోరుతూ నిన్న అకస్మాత్తుగా రాజీనామాలు సమర్పించడంతో ఆ పార్టీకి చెందిన తెలంగాణా నేతలు కంగు తిన్నారు. తెరాస విసురుతున్న సవాళ్ళను తట్టుకొంటూ పార్టీకోసం అవమానాలు భరిస్తూ పనిచేస్తున్న తమతో కనీసం చర్చించకుండా మాట మాత్రమయినా చెప్పకుండా పార్టీ ఈవిధమయిన నిర్ణయం తీసుకోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తీసుకొన్నఈ నిర్ణయంతో పార్టీనే నమ్ముకొన్నతమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరం అయిపోయిందని వాపోతున్నారు. ఒకప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా తెలంగాణాలో ఆయన అభిమానులు ఆ పార్టీకోసం లక్షలు ఖర్చుబెట్టి నష్టపోయిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకొంటున్నారు. తాము కూడా వైకాపా కోసం చాలా ఖర్చుచేసి, తెలంగాణాలో బలమయిన తెరాసను డ్డీకొంటూ పార్టీని కాపాడుకొంటున్నామని, అయినప్పటికీ పార్టీ తమపై ఏమాత్రం విశ్వాసం చూపకుండా అకస్మాత్తుగా ఈవిధంగా తెలంగాణాలో బోర్డు తిప్పేయడం చాలా అన్యాయమని వారు వాపోతున్నారు. ఆ పార్టీకి చెందిన కొండా సురేఖ కేవలం స్వర్గీయ వైయస్సార్ పట్ల తమకున్న కృతజ్ఞతా భావంతో తాను వైకాపాకోసం తన మంత్రి పదవికి, శాసనసభ సభ్యత్వానికి చివరికి కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామాలు చేసివస్తే, ఇప్పుడు పార్టీ ఈవిధంగా చేసి తమను చాల ఘోరంగా దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజీనామాల వ్యవహారంపై విజయమ్మ వెంటనే స్పష్టమయిన ప్రకటన చేయాలని కొండా సురేఖతో సహా ఆపార్టీకి చెందిన తెలంగాణా నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైకాపా చేసిన ఈ పని వల్ల తమపై కూడా ప్రజలలో అపనమ్మకం ఏర్పడుతుందని తెదేపా నేతలు భయపడుతున్నారు.
వైకాపా తన రాజకీయ మనుగడకు చాలా గొప్ప నిర్ణయమే తీసుకొన్నట్లు భావించవచ్చు గాక, కానీ ఆ పార్టీ తన తెలంగాణా నేతలకి ఏమని సమాధానం చెపుతుందిప్పుడు? విస్వసనీయతకు మారుపేరుగా చెప్పుకొనే ఆ పార్టీ తన తెలంగాణా నేతల రాజకీయ భవిష్యత్తును ఏమాత్రం పట్టించుకోకుండా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఎటువంటి విశ్వసనీయత?