బొత్స ఎంపైరింగ్ అంటే మాటలా మరి
posted on Jul 26, 2013 @ 11:27AM
రాష్ట్ర విభజన అంశం నిర్ణయాత్మక దశకు చేరుకోవడంతో రెండు ప్రాంతాల నేతలు తమతమ ‘స్టార్ బ్యాట్ మ్యాన్స్’తో డిల్లీలో జరగబోయే ఫైనల్ గేంకి సిద్దం అయ్యారు. ఈ గేంలో తనకీ సమైక్యాంధ్ర తరపున బ్యాటింగ్ చేయాలనీ ఉన్నపటికీ, రాష్ట్ర హితం కోరే పెద్దమనిషిగా ‘న్యూట్రల్ ఎంపైర్’ పాత్ర పోషిస్తానని బొత్ససత్యనారాయణ శలవిచ్చారు. ఇక ఫీల్డింగులో ఉన్నకొందరు సీమంధ్ర నేతలు ఆట మద్యలో వెళ్ళిపోతే తానేమీ చేయలేనని, ఆట చివరివరకు ఆడదలచుకొన్నవారికి మాత్రమే చివరాఖరున ‘రాష్ట్ర విభజన కప్పు’ స్వీకరించే అర్హత ఉంటుందని ఆయన స్పష్టం చేసారు.
తానూ ఎంపైర్ గా ఉన్నపటికీ తన సీమంద్ర టీం గెలవాలని మనసారా కోరుకొంటున్నానని స్పష్టం చేసారు. అదేవిధంగా తమ స్టార్ బ్యాట్స్ మ్యాన్ కిరణ్ కుమార్ రెడ్డికి తానూ కాలు అడ్డుపెట్టి, జైపాల్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడుతున్నట్లు వస్తున్న వార్తలు కేవలం మీడియా సృష్టేనని ఆయన తెలిపారు. ఒకవేళ ఆయన బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పొరపాటున తన కాలు అడ్డం పెట్టినా, దానిని మీడియా వాళ్ళు ఫాల్స్ రిపోర్టింగ్ చేసేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
ఇక, వైకాపాకి చెందిన 11మంది ప్లేయర్లు గ్రౌండులోకి రాకుండానే గేం డిక్లేర్ చేసి వెళ్ళిపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. పంచాయితీ ఎన్నికలలో క్లీన్ బౌల్డ్ అయిపోవడం వలననే వైకాపా పాత గేం పక్కనబెట్టి, మరో కొత్త గేం మొదలుపెట్టాలని చూడటం ఫౌల్ గేం అవుతుందని ఆయన అన్నారు. తమ కాంగ్రెస్ ఫ్రాంచైసర్లు(అధిష్టానం) ఏ టీముని ఇచ్చినప్పటికీ తాను చక్కగా ఎంపైరింగ్ చేయగలనని, తనకు ఏ టీమయినా ఒకటేనని ఆయన చెప్పారు.