konathala ramakrishna

కొణతాలకు వైకాపా నుండి త్వరలో ఉద్వాసన

  ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో కళంకిత మంత్రులను పార్టీలోకి ఆకర్షించేందుకు గాలం వేస్తున్న వైకాపా, మరో వైపు పార్టీకి కష్టకాలంలో వెన్నంటి ఉన్న కొణతాల రామకృష్ణను అదే కాంగ్రెస్ పార్టీకి అప్పగించేందుకు సిద్దం అవుతుండటం విశేషం. దాడి వీరభద్రరావు వైకాపాలో చేరినప్పటి నుండి కొణతాల రామకృష్ణ పార్టీ కార్యక్రమాలకి, సమావేశాలకి కూడా దూరంగా ఉంటున్నారు. తమ రాజకీయ ప్రత్యర్ధిని పార్టీలోకి తీసుకోవడంపై ఆయన తన అసంతృప్తిని పార్టీ అధిష్టానానికి చాలా స్పష్టంగానే తెలియజేసారు. అయినా కూడా జగన్, దాడి వీరభద్రరావుకే ప్రాధాన్యతనీయడంతో కొణతాల వర్గీయులు అందరూ పార్టీకి దూరంగా ఉంటున్నారు.   ఈ సమస్యను పరిష్కరించేందుకు జగన్ తన దూతలుగా సోమయాజులు, సుబ్బారెడ్డి తదితరులను పంపినప్పటికీ, కొణతాల దాడితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేయడమే కాకుండా, చంచల్ గూడా జైలుకి వెళ్లేందుకు కూడా అయిష్టత చూపడంతో సమస్య పరిష్కారం కాలేదు.   దానితో తీవ్ర ఆగ్రహం చెందిన జగన్ మోహన్ రెడ్డి పార్టీలో తన నిర్ణయాలను, ఆదేశాలను మన్నించనివారు వెంటనే తప్పుకోవడం మేలని గాటుగా ఒక సందేశం పంపడమే కాకుండా, దాడి వీరభద్రరావు రాకను నిరసిసస్తూ ఇటీవల కొణతాల సోదరుడు లక్ష్మినారాయణ మరియు ఆయన అనుచరులు సమావేశం నిర్వహించినందుకు, రామకృష్ణతో సహా వారందరికీ కూడా సంజాయిషీ కోరుతూ నోటీసులు పంపినట్లు తాజా సమాచారం.   నోటీసుల వరకు వచ్చిన కధలో సాధారణంగా సదరు నోటీసులు అందుకొన్న నేతలు పార్టీ నుండి బహిష్కరించబడినట్లే భావిస్తారు. కనుక కొణతాల రామకృష్ణ కూడా ఇంక మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకొంటారేమో.   అటు కాంగ్రెస్ నుండి ధర్మాన, సబితలు వైకాపాలోకి వస్తే, ఇటు నుండి కొణతాల ఆయన సోదరుడు లక్ష్మి నారాయణ కాంగ్రెస్ పార్టీలోకి వేళతారేమో? కొణతాల రామకృష్ణకు అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరికి ఉన్న విబేధాలు కూడా ఆయన ఉద్వాసనకు మరో కారణమని తెలుస్తోంది.

congress sonia gandi

ఈ అవినీతి పాలనకు అంతం ఎప్పుడు?

        ఈనాటి దేశ, ఆంధ్ర రాష్ట్రాల రాజకీయాల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ముందు రాష్ట్రం గురించి ప్రస్తావిస్తే .... రాష్ట్రంలో కాంగ్రెస్ ముందు రెండు పెను సవాళ్లు ఉన్నాయి. ఒకటి తెలంగాణ సమస్య, రెండవది వైకాపా. ఇక అవినీతి భాగోతం ఎటూ ఉండనే ఉంది. ఇప్పటికే జగన్ అవినీతి నేపథ్యంలో ఇద్దరు మంత్రులు పదవిని కోల్పోగా ఇప్పటికే పదవి కోల్పోయిన మంత్రి మోపిదేవి వెంకట రమణ .... ఇదే వరుసలో మరి కొందరు.... అయినా సరే 2014 ఎన్నికలలో కిరణ్ చాకచక్యంతో, బొత్స మంత్రాంగం తో పార్టీ నెగ్గుకు వచ్చేస్తుందని వారి ప్రగల్భాలు. మరి తెలంగాణ విషయానికి వస్తే అదో రగులుతున్న కుంపటి. ఎన్నికల వేళ ప్రతి వారికి అదొక అస్త్రం. దాన్ని తేల్చని వారు ఒకరు... అది తేలడం ఇష్టం లేని వారు ఒకరు .... దాని పేరు చెప్పి ఉద్యమం మాటున పార్టీని బలోపేతం చేసుకునే ధన అహంకారి మరొకరు. ఇదిలా ఉంటే ఈ రోజు ముగ్గురు టి- కాంగ్రెస్ ఎంపీలు వివేక్, మంద జగన్నాధం, రాజయ్యలు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. రఘునందన్ గత కొద్ది రోజులగా తెరాస అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరుగుతూ ఆధారాలతో కూడిన ఆరోపణలు చేస్తున్న సమయం లో కాంగ్రెస్ నుండి తెరాస లోకి ఇలాంటి వలసల వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రజలందరికీ విదితమే. ఈ 4 సం.రాలు గా మన రాష్ట్రం సాధించిన దానికన్నా కోల్పోయినదే ఎక్కువ.  కేంద్రంలో మరో పరిస్థితి. రైల్వే మంత్రిని, న్యాయ శాఖా మంత్రిని పదవుల నుండి తొలగించడం వెనుక సోనియా గాంధీ దురుద్దేశం ఉన్నట్లు సమాచారం. కారణం ... మన్మోహన్ సింగ్ తన రాష్ట్రానికి చెందిన బన్సాల్, అశ్విని కుమార్, కపిల్ సిబాల్... ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత వరుసతో ఆయన తన అనుకూల వర్గాన్ని తయారు చేసుకున్నాడని, అంతే కాక పలు రాజకీయ కీలక అంశాలలో ఆయన సతీమణి గుర్శరన్ కౌర్ కీలక పాత్ర వహిస్తున్నారని సోనియా గాంధీ కినుక వహించింది. అందులో భాగంగానే పంజాబ్ కు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులను అధికారం నుండి తప్పించింది.             అయితే రాష్ట్రానికి, కేంద్రానికి సంబందించి ఒక విషయం లో పోలిక ఉంది. ఇక్కడ రాజశేఖర రెడ్డికి అనుయాయులుగా ఉన్న మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని పదవులు కోల్పోతున్నారు. పైగా తప్పును సమర్ధించటం, సహకరించటం కూడా తప్పే కదా అంటూ వారిపై అభియోగాలు మోపారు. అటువంటి తరుణం లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2జీ స్పెక్ట్రం కుంభకోణం మొదలుకుని నిన్నటి సీబీఐ నివేదిక నిర్వాకం వరకు జరిగిన అన్ని అంశాలకు ప్రధాని నైతిక బాధ్యత వహించరా? అన్ని కుంభకోణాల మరకలు తమ ప్రభుత్వం పై పడుతుంటే కూడా ఆయన మౌనమే వహిస్తారా? మరి కుంభకోణాలను సమర్ధించడం కూడా తప్పే కదా. రాష్ట్రంలో ఒక న్యాయం .... కేంద్రంలో ఒక న్యాయమా? సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా గురించి కూడా ఏమీ మాట్లాడరు. అంటే ఇక్కడ ధర్మాన, సబితల లాగానే అక్కడ మన్మోహన్ కి కూడా అధికారం లేకపోయినా పదవి ఉంటే చాలా? అధికారం ఎంత దుర్వినియోగం అవుతున్నా పర్వాలేదా?              అసలు ఏమిటీ రాజకీయ కాంక్ష, పదవీకాంక్ష? ఏ మాత్రం రాజకీయ సామర్థ్యం, పరిపాలనచేవా లేని తన కొడుకు రాహుల్ గాంధీ కోసం అతని రాజకీయ భవిష్యత్తు కోసం 120 కోట్ల భారత ప్రజానీకం భవిష్యత్తును కాలరాయాలని చూస్తున్న సోనియా గాంధీని ఏమనాలి? 2014 ఎన్నికల నాటికి తన కొడుకు రాహుల్ చుట్టూ అంత ఆయన అనుయాయులే ఉండాలనే ఆమె తాపత్రయానికి మళ్ళీ త్యాగం అనే పేరెందుకు? సోనియా గాంధీ ఈ తాపత్రయం కారణంగా ప్రధాని త్వరలోనే తన పదవిని కోల్పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. కేంద్ర ప్రభుత్వానికి అంటిన కుంభకోణాల మరకల విషయంలో మన్మోహన్ సింగ్ తో పాటు సోనియా గాంధీ నైతిక బాధ్యత వహించదా? అలా బాధ్యత వహిస్తే రాహుల్ ను ప్రజలు ఎలా ఆదరించాలి?                    సోనియా గాంధీకి యావత్ రాజకీయ నాయకులందరూ ఎందుకు భయపడుతున్నారు? 10 సం.రాల క్రితం సోనియా గాంధీ ప్రధాని అవ్వడానికి వీల్లేదని అడ్డుపడిన భాజపా ఆమె అల్లుడు అవినీతి కేసుల విషయంలో సీబీఐ విచారణకు భాజపా కాని ఇతర పార్టీలు కానీ ఎందుకు పట్టుపట్టడం లేదు?ఒకనాడు రాజశేఖర రెడ్డి నియంతలా వ్యవహరించిన ఫలితం సదరు కేబినెట్ మంత్రులు ఒక్కొక్కరుగా అవినీతి ముద్ర వేయించుకుంటూ ఉంటే, సోనియా గాంధీ నియంత ధాటికి కాంగ్రెస్ పునాదులే కదిలిపోతున్నాయి. తద్వారా దేశ పురోగతి చిన్నాభిన్నమైపోతొంది.                  ఏది ఏమైనా అంతరిక్షం వైపు పరుగులు పెడుతున్న ఈ ఆధునిక యుగంలో భారత దేశం లో సోనియా గాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నది నియంత పరిపాలన. మళ్ళీ దానికి ప్రజాస్వామ్యమనే పేరెందుకు? కేవలం ఓట్లు అడుక్కోవడానికి తప్ప. కాబట్టి సగటు భారతీయుడా! మేలుకో! నీలో చేవ ఉంటే ... చైతన్యం ఉంటే ... నీజాతిని జాగృతం చెయ్యి. అది నీ బాధ్యత... నీ కర్తవ్యం.

ysrcp

వైకాపా సానుభూతి కాంగ్రెస్ మంత్రులను ఆకర్షించేందుకేనా

  నిన్న మొన్నటి వరకు జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ని మాత్రం బలిపశువుని చేసి, అదే కేసులో సీబీఐ చేత తప్పుపట్టబడిన మంత్రులను వెనకేసుకువస్తున్నారని కాంగ్రెస్ పార్టీని, కిరణ్ కుమార్ రెడ్డిని తప్పుపడుతూ వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, మొన్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలను పదవులలోంచి తప్పించగానే, అకస్మాత్తుగా కొత్త రాగం అందుకొని వారిరువురూ కాంగ్రెస్-తెదేపాల రాజకీయ చదరంగంలో బలిపశువులయ్యారని వారిపై సానుభూతి కురిపించింది.   తద్వారా తమను అన్యాయంగా, చాలా అవమానకరంగా పదవులలోంచి తొలగించిందంటూ కాంగ్రెస్ అధిష్టానంపై మండిపడుతున్న వారిరువురినీ, ఇదే అదనుగా తమ పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. చంద్రబాబు మంత్రులను తొలగించమని ఆదేశించగానే కాంగ్రెస్ ఇద్దరినీ తొలగించిందని, అదేవిధంగా మిగిలిన వారిని కూడా తొలగించమని ఆయన ఆదేశిస్తే వారినీ తొలగిస్తుందా అని వైకాపా నేత శోభానాగి రెడ్డి ప్రశ్నించడం, కిరణ్ ప్రభుత్వంలో కళంకిత మంత్రులుగా ముద్రపడి, తీవ్ర అభద్రతా భావంతో ఉన్న ఇతర మంత్రులలో మరింత భయాందోళనలు పెంచడానికేనని చెప్పవచ్చును. తద్వారా కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అసమ్మతి మంటలను మరింత ఎగదోసి ఇదే అదనుగా ఎంత మందిని వీలయితే అంత మందిని తమ పార్టీ వైపు ఆకర్షించుకోవాలని వైకాపా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.   “తన పోరాటాల ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ కళంకిత మంత్రులను తొలగించవలసి వచ్చిందని స్వయంగా చంద్రబాబే, వేరెక్కడి నుండో కాక నేరుగా డిల్లీ నుండే ప్రకటించడంతో వైకాపా మాటలకు బలం చేకూరుతోంది.   తమ రాజీనామాలు ఆమోదిస్తే పార్టీని వీడి వైకాపాలో చేరడం ఖాయమన్నట్లు మంత్రులిరువురూ స్పష్టమయిన సంకేతాలు ఇస్తుండటంతో, కిరణ్ కుమార్ రెడ్డి ఇంత వరకు ఇద్దరు మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదానికి పంపలేకపోతున్నట్లు అర్ధం అవుతోంది. తద్వారా గాలిలో వ్రేలాడుతున్నట్లున్న ఇద్దరు మంత్రులను ఇదే అదనుగా తమ వైపు రప్పించుకోవాలని వైకాపా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.   జగన్ సమ్మతిస్తే తెదేపా ఖాళీ అయిపోతుందని శోభా నాగిరెడ్డి మరో మాట కూడా అన్నారు. తెదేపా సంగతెలా ఉన్నా, ప్రస్తుతం ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి మిగిలిన కళంకిత మంత్రులపై వేటు వేసే సాహసం చేయకపోవచునేమో. మరి అధిష్టానం ఏమంటుందో?

congress government

కాంగ్రెస్ పార్టీలో కళంకిత సీజన్

  ఇద్దరు మంత్రుల రాజీనామాల వ్యవహారం ఇంకా ఒక కొలొక్కి రాక మునుపే, ఆ వరుసలో ఉన్నమరో మంత్రి కె.పార్ధసారధితో నిన్నముఖ్యమంత్రి చర్చలు జరపడంతో, ఇక నేడో రేపో ఆయన కూడా ‘పార్టీకి, ప్రభుత్వానికి తన వల్ల మచ్చ ఏర్పడకూడదనే సదుదేశ్యంతోనే రాజీనామా చేస్తున్నట్లు’ మీడియా ముందుకు వచ్చి ప్రకటిస్తారేమో.   మిగిలిన మంత్రులవలే ఆయన జగన్ వ్యవహారంలో కాక, తన స్వంత వ్యవహరాలలోనే ప్రత్యేక కోర్టు చేత 2నెలలు జైలు శిక్ష మరియు 5.15లక్షలు జరిమానా విదింపబడిన ఏకైక మంత్రిగా నిలిచారు. అయితే ఆయన హైకోర్టు నుండి స్టే తెచ్చుకొని దానిని నుండి బయట పడ్డారు. ఆయనకు చెందిన కేపీ ఆర్ టెలీ ప్రొడక్ట్స్ సంస్థ ఫెరా నిబందనలు ఉల్లంఘించినందుకు ఈడీ అధికారులు 2003లో నోటీసులు జారీ చేసినా ఆయన పట్టించుకోకపోవడంతో, ఆయనపై ప్రత్యేక కోర్టులో కేసు వేసారు. కోర్టు పంపిన నోటీసులను కూడా ఆయన పట్టించుకోకపోవడంతో, కోర్టు ఆయనకు రెండు నెలలు జైలు శిక్ష, 5.15లక్షలు జరిమానా వేసింది.   ఈ కేసు సంగతిని ఎన్నికల ఎఫిడవిట్ లో దాచిపెట్టినందుకు ఆయన మీద ప్రజాప్రాతినిద్యం చట్టం క్రింద మరో కేసుకూడా విజయవాడ కోర్టులో నడుస్తోంది. అది కూడా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. రెండు కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన పేరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ‘కళంకిత మంత్రుల రాజీనామాల సీజన్’ నడుస్తోంది కనుక పైకి వచ్చింది.   కానీ, ముందు రాజీనామాలు చేసిన వారి సంగతే ఇంకా తేలనప్పుడు, మరో మంత్రిని ఇప్పుడు ఆ లైన్లో నిలబెట్టడం కేవలం కాంగ్రెస్ మార్క్ రాజీనామా డ్రామాగానే కనిపిస్తోంది. ధర్మాన, సబితలు ఎటువంటి పరిస్థితుల్లో రాజీనామాలు చేసారో కళ్ళకు కట్టినట్లు అందరికీ కనబడుతుంటే, ‘వారు రాజీనామాలు చేసినట్లు తనకు తెలియదని, అసలు వారిరువురినీ ఎవరూ రాజీనామాలు కోరలేదని’ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పడం చూస్తే, అసలు మంత్రులను తొలగించాలో వద్దో అనే విషయంపై కాంగ్రెస్ పార్టీలోనే సరయిన స్పష్టత లేదని అర్ధం అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో మంత్రి ఉద్వాసనకి రంగం సిద్దం చేయడం హాస్యాస్పదమే అవుతుంది.   కళంకిత మంత్రుల లైన్లో ఉన్న మిగిలిన మంత్రులు గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మి నారాయణలకు మరికొంత కాలం వెసులుబాటు కల్పించేందుకే  ముఖ్యమంత్రి పార్ధ సారధిని ముందుకు తీసుకువచ్చారేమో తెలియదు.   ఏమయినప్పటికీ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సంగతిని పక్కనబెట్టి, కళంకిత మంత్రుల ఉద్వాసన చెయాలా వద్దా, చేయిస్తే ఎదురయ్యే అసమ్మతిని ఏవిధంగా ఎదుర్కొనాలి, ఖాళీ అయిన మంత్రి పదవుల కోసం మిగిలిన మంత్రుల అలకలు, కొట్లాటలను ఏవిధంగా ఎదుర్కోవాలి, తెలంగాణా యంపీల అలకలు తీర్చడం వంటి విషయాలతోనే తీరిక లేకుండా ఉంది. ఇవ్వనీ సర్ధుకొనే సరికి ఎన్నికల గంట మ్రోగితే ఇక మంత్రులందరూ ఎన్నికల హడావుడిలో పడిపోతారు. అంటే, మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడి అది ఒక గాడినపడే వరకు ప్రజలని పట్టించుకొనే నాధుడు ఉండడన్న మాట.

sahara

ఐపీయల్ నుండి తప్పుకొంటున్న పూణే వారియర్స్

  పూణే వారియర్స్ టీం యజమాని అయిన సహారా సంస్థ వచ్చే ఏడాదిలో జరిగే ఐపీయల్ మ్యాచుల నుండి తప్పుకొంటున్నట్లు ఈరోజు ప్రకటించింది. సహారా సంస్థ పూణే వారియర్స్ టీంపై పదేళ్ళ ఫ్రాంచైస్ హక్కుల కోసం మొత్తం 1702 కోట్ల రూపాయలు చెల్లించడానికి అంగీకరించింది. ఈ ఏడాది సహారా చెల్లించవలసిన మొత్తంలో కేవలం రూ. 170 కోట్లు ఫ్రాంచైస్ ఫీసు మాత్రమే చెల్లించి, మిగిలిన మొత్తం ఇంత వరకు చెల్లించలేకపోవడంతో, ఆసంస్థ బ్యాoకు గ్యారంటీగా ఉంచిన మొత్తాన్ని బీసీసీఐ స్వాదీనం చేసుకొంది. దానితో ఆగ్రహించిన సహారా సంస్థ బీసీసీఐ పై తీవ్ర విమర్శలు చేసింది. బీసీసీఐకు ఇప్పుడు డబ్బుయావ తప్ప క్రీడా స్ఫూర్తి అసలు లేకుండా పోయిందని విమర్శించారు.   మీడియా ముందు తమ టీముకు మొత్తం 94 మ్యాచులు ఆడిస్తున్నట్లు ప్రకటిస్తున్న బీసీసీఐ, నిజానికి కేవలం 74 మాత్రమే కేటాయించడంతో తాము తీవ్రంగా నష్టబోతున్నామని చెప్పారు. తాము ఇదే విషయంపై బీసీసీఐకి పదే పదే విన్నవించుకొని, తమకు జరిగిన నష్టానికి ప్రతిగా ఫ్రాంచైస్ ఫీసు తగ్గించమని గత మూడు సం.లుగా కోరుతున్నపటికీ, బీసీసీఐ ఖాతరు చేయలేదని, ఇప్పుడు బ్యాంక్ గ్యారంటీని కూడా స్వాదీనం చేసుకోవడంతో తమకిక ఐపీయల్లో కొనసాగేందుకు ఆసక్తి లేదని సహారా సంస్థ ప్రతినిధులు చెప్పారు.   ఈ ఏడాది డిసెంబర్ తో తమకీ బీసీసీఐకి మద్య ఉన్న కాంట్రాక్ట్ ముగియనున్నందున, వచ్చే ఏడాదికి పూణే వారియర్స్ టీంకు మరో కొత్త ఫ్రాంచైస్ ను వెతుకోవలసిందిగా తాము బీసీసీఐని కోరామని తెలిపారు.

ministers

ఇవి కూడా కాంగ్రెస్ మార్క్ రాజీనామాలేనా

  మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిల రాజినామాలపై ఇంకా కాంగ్రెస్ మార్క్ డ్రామా కొనసాగుతూనే ఉంది. వారిద్దరూ మళ్ళీ కొత్తగా రాజినామాలు ఇవ్వకుండా, తాము ఇదివరకు ఇచ్చిన వాటికే కట్టుబడి ఉన్నామని చెప్పడంతో, వారిచ్చిన పాత రాజినామా లేఖలు దుమ్ము దులిపి గవర్నర్ కు పంపించవలసి ఉంది. కానీ, ఇంత వరకు అది కూడా జరుగలేదు. కనీసం ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ గానీ ఈ విషయంలో నిర్దుష్టమయిన ప్రకటన వెలువడక పోవడంతో వారి రాజీనామాలపై సస్పెన్స్ డ్రామా ఇంకా కొనసాగుతోంది. కేవలం మీడియాలో ఊహాగానాలు తప్ప నిర్దిష్టమయిన సమాచారం లేదు. ఈ రోజు గవర్నర్ ను కలిసి వస్తున్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను మీడియా ఇదే విషయం గురించి అడిగితే, వారు రాజీనామాలు చేసినట్లే తనకు తెలియదని చెప్పడం బాధ్యతా రాహిత్యమే కాక పార్టీలో, ప్రభుత్వంలో వారి రాజినామాలపై ఎంత గందరగోళం నెలకొని ఉందో వివరిస్తోంది. పార్టీకి, ప్రభుత్వానికి తమవల్ల ఇబ్బందులు కలగకూడదనే తాము రాజినామాలు చేస్తున్నట్లు ప్రకటించిన సదరు మంత్రులిద్దరూ కూడా వాటిని వెంటనే ఆమోదించాలని ముఖ్యమంత్రిని కోరలేదు. ధర్మాన కోరిక మేరకు ముఖ్యమంత్రి ఆఖరి ప్రయత్నంగా మరోసారి కేంద్రానికి వారి రాజినామాల విషయమై విజ్ఞప్తి చేసి, అధిష్టానం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. వారి రాజీనామాలు ఆమోదించమని అధిష్టానం చెపితే తప్ప వాటిని గవర్నర్ ఆమోదానికి పంపకపోవచ్చును. బహుశః రేపటికి ఈ విషయంలో స్పష్టత రావచ్చును. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలంటే ఇలాగే ఉంటాయి మరి.

 Raghunandan Rao complains of death threat

సీబీఐ వద్దకు రఘునందన రావు

        టీఆర్ఎస్ బహిష్కృత నేత రఘునందనరావు కేసీఆర్ కుటుంబాన్ని అంత సులభంగా వదిలేలా లేరు. హరీష్ రావు అండ్ కో పై సంచలన ఆరోపణలు గుప్పించిన రఘునందన్.. అంతటితో ఊరుకోకుండా వీటికి సంబంధించిన ఆధారాలతో సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణను కలవాలని నిర్ణయించుకున్నారు. హరీష్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు అక్రమలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్న రఘునందన్ ఇందుకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను సీబీఐకి ఇచ్చే అవకాశం ఉంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ రఘునందన్పై టీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ రఘు రెండు రోజుల క్రితం డీజీపీ దినేష్ రెడ్డిని కలిశారు. తమకు భద్రత కల్పించాలని కోరారు.

jagan assets case

జగన్‌కు ఆయుధంగా మారిన రాజీనామా

        కళంకిత మంత్రుల ఎపిసొడ్‌కు పులిస్టాప్‌ పెట్టాలనుకున్న కాంగ్రెస్‌ టెన్‌ జన్‌పథ్‌ సాక్షిగా భారీ కథనే నడిపింది.. కేంద్రంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మత్రులను తప్పించినట్టుగానే రాష్ట్రంలోనూ మంత్రులను సాగనంపాలని నిర్ణయించుకుంది..   అధిష్టాన్నాన్ని ఎలాగైన ఒప్పించి మంత్రులు పదవులు ఉండేలా చూస్తానన్న సీఎం మాట నిలబెట్టుకోలేకపోయారు.. సీఎం చెప్పిన మాటలకు అధిష్టానం ససేమిరా అనడంతో కళంకిత మంత్రలు రాజీనామ చేయక తప్పలేదు..         అయితే మంత్రుల రాజీనామా తరువాతే మొదలైంది అసలు కథ.. క్యాంప్‌ ఆఫీస్‌లో సీఎంను కలిసి ధర్మాన, సభిత.. తరువాత మీడియాతో మాట్లాడిన మాటలు అనేక సందేహాలకు తావిస్తున్నాయి..         ఇన్నాళ్లు కాంగ్రెస్‌ నేతలంతా వైయస్‌ పెట్టమంటే సంతాకాలు పెట్టాం గాని తెరవెనుక జరిగిన సంగతులతో మాకెలాంటి సంబంధం లేదంటూ పాపం అంతా జగన్‌దే అన్నట్టుగా మాట్లాడుతూ వస్తున్నారు.. కాని ఇప్పడు ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది..         ఇన్నాళ్లు కాంగ్రెస్‌ నాయకుల చెపుతున్నమాటలకు భిన్నంగా ధర్మాన తన ప్రెస్‌ మీట్‌లో కొత్త పల్లవి అందుకున్నారు.. జిఓలకు సంబందించిన నిర్ణాయాలన్ని మంత్రివర్గ సమిష్టి నిర్ణాయాలే అనటమే కాదు వాటిలో ఎలాంటి పొరపాట్లు జరగటానికి అవకాశమే లేదంటూ కుండబద్దలు కొట్టారు..         మరి ధర్మాన చెప్పినట్టుగా తప్పే జరగకపోతే ఇన్నాళ్లుగా జగన్‌పై కాంగ్రెస్‌ నేతలు అంతలా దాడి ఎందుకు చేస్తున్నట్టు.. ఒకవేళ ఆ జీఓలు మంత్రి వర్గ నిర్ణయమే అయితే అప్పుడు మంత్రలందరూ బాధ్యత వహించాలి కదా.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు సామాన్యులను వేదిస్తున్నాయి..         అయితే విశ్లేషకులు మాత్రం ధర్మాన మాటల వెనుక రాజకీయ వ్యూహమేదైన ఉందేమో అంటున్నారు.. జిఓలు మంత్రి వర్గ నిర్ణయం అంటే అప్పుడు తప్పైనా,  రైట్‌ అయిన మంత్రి వర్గం అంతా బాధ్యత వహిస్తుంది కనుక.. తనకు కొంత సేఫ్‌ సైడ్‌ అని భావించినట్టుగా చెబుతున్నారు..         ఏది ఏమైన తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో జగన్‌ చేతికి బలమైన ఆయుధాన్ని అందించాడని చెపుతున్నారు విశ్లేషకులు.. మరి ముందు ముందు ఈ కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయం ఇంకెన్నీ మలుపులు తిరుగుతుందో చూడాలి..  

ABK Prasad

బయటపడుతున్న కెసిఆర్ కుటుంబ అవినీతి!

- డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]       మన తెలంగాణలో చాలా మంచి సామెతలున్నాయి. వాటిల్లో ఒక జాతీయం "తుంపిళ్లబలం'' అని! "తుంపిళ్ళు'' అంటే నీటి తుంపర్లు, చెదిరిపడే నీటిబొట్లను అలా అంటారు. కరీంనగర్ జిల్లావాసి అయిన ప్రసిద్ధ జానపద సాహిత్యవేత్త అయిన వేముల పెరుమాళ్ళు ఈ "తుంపిళ్ళు'' పదం విశిష్టత గురించి వివరిస్తూ ఏ సందర్భంలో ఈ పదాన్ని వాడుతూంటారో చెప్పాడు. కొంతమందట, మనిషి నమ్మకాన్ని అవకాశంగా తీసుకుని ఏదో మహిమ చూపి మంత్రగాళ్ళు తమ ఉనికిని కాపాడుకునే రంధిలో బలహీనుల మీద తమ ప్రభావం చూపిస్తూంటారు, పిచ్చుక మీద బ్రహ్మాస్తంలాగా! ఎందుకంటే, మానసికంగా బలహీనంగా ఉండేవాళ్ళంతా మంత్రానికి దాసులే అవుతారు.   అలా మంత్రగాడు ఏ మంత్రం చదివినా తుంపిళ్ళు (నోటితుంపర్లు) వానజల్లులాగా మీద పడిపోతుంటే, ఆ తుంపర్లను భరించలేక మంత్రగాడి మంత్రానికి తలొగ్గుతూంటారట! బుర్రమీసాలు, విచిత్ర వస్త్రాలలో, కపాలం, విభూతి, మంత్రదండం. నిమ్మకాయలు - ఇలా వీటన్నింటితో ఒక మనిషి కనిపిస్తే, వాడి వేష ప్రభావంవల్ల మంత్రాలను నమ్మేవారు చాలామంది ఉంటారట. ఎప్పుడూ కొత్త దుకాణాన్ని కొందరు గొప్పగా అలంకరిస్తూంటారు. వస్తువులకు మంచి ప్యాకింగు ఎలాగో ఇలాంటి ప్రచారం, ఆడంబరమూ ఈ తుంపిళ్ళలాంటి బలమేనట! కోస్తాంధ్రప్రాంతం నుంచి తెలంగాణా ప్రాంతానికి వలస వచ్చిన 'బొబ్బిలిదొర' కె.చంద్రశేఖరరావు (కెసిఆర్) తెలుగుజాతికి వేరుపురుగుగా, విద్రోహిగా మారి వేర్పాటువాదం పేరిట కొన్నాళ్ళుగా సాగిస్తున్న 'ఉద్యమం' స్వరూపస్వభావాలు కూడా ఈ "తుంపిళ్ళు'' లాగానే ఉన్నాయి. 'తుంపిళ్ళ'కు నీటి తుంపర్లకు ఎంత విలువవుందో అంతే విలువ ఉందని పరిణామాలు నిరూపిస్తున్నాయి.   రోజులు గడిచినకొద్దీ ఆయని కుటుంబం 'అవినీతి' గురించి అతని పార్టీ "తెరాస''లోని ముఖ్యులూ, నిన్నటిదాకా ఆ పార్టీ పొలిట్ బ్యూరో ముఖ్య సభ్యుడుగానూ, మెదక్ జిల్లా పార్టీ శాఖా అధ్యక్షుడుగానూ ఉంటూ, ఇటీవలనే ఆ పార్టీనుంచి రాజీనామా చేసి బయటపడిన రఘునందనరావు గత కొలది రోజులుగా విడుదల చేస్తున్న ప్రకటనలు ప్రజలను నివ్వెరపరుస్తున్నాయి; ఆ పార్టీ కార్యకర్తల్ని గందరగోళంలోకి నెట్టి కెసిఆర్ గుణగణాల్ని, అతని కుటుంబసభ్యుల ప్రవర్తననూ ప్రశ్నించేట్టు చేస్తున్నాయి. కెసిఆర్ పోకడలను విమర్శిస్తూ రఘునందనరావు ప్రకటించడంతోనే ఆయనను(రఘునందనరావుని) పార్టీనుంచి సస్పెండ్ చేయడం అన్నది "తెరాస''లొ చెలరేగుతున్న సంక్షోభంలొ ఒక కోణం మాత్రమే. రఘునందనరావు కెసిఆర్ పైన, ఆయని కుటుంబంపైన ఆరోపణలు లేదా తీవ్రమైన అభియోగాలు సామాన్యమైనవి కావు, తేలిగ్గా కొట్టిపారేయగలివిగానూ లేవు.   గతంలో "ఇంటర్నెట్'' ద్వారానూ బిజెపిలో పూర్వనాయకుడైన నరేంద్ర, కెసిఆర్ పైన కొన్ని (టిడిపిలొ ఉన్నప్పుడు) రుజువులతో చేసిన తీవ్ర అభియోగాలు, ఆ దరిమిలా తెలంగాణా "రాష్ట్ర సాధన'' పేరుతొ కెసిఆర్ తలపెట్టిన "సెలైన్'' సత్యాగ్రం సందర్భంగా జంటనగరాల్లో "వసూళ్ళు'' గురించ్చి వెల్లువెత్తిన ఆరోపణలు పూర్వరంగంలో తాజాగా రఘునందనరావు తెరాస శాసనసభాపక్షం నాయకుడు హరీష్ రావు (కెసిఆర్ మేనల్లుడు)పైన, కెసిఆర్ ఎన్.ఆర్.ఐ. కొడుకు తారకరామారావుపైన ఎక్కుపెట్టిన అభియోగాలను తేలిగ్గా కొట్టివేయదగ్గవిగా లేదు. ఎందుకంటే ఇన్నేళ్ళుగా వేర్పాటువాద పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉంటూ వచ్చిన రఘునందనరావుకు పార్టీలో కెసిఆర్ నాయకత్వ పోకడలను ఆయని కుటుంబసభ్యుల ఆర్థిక లావాదేవీల వ్యవహారం బొత్తిగా తెలియకుండా వుండే సమస్య లేదు. దీనికితోడు సంవత్సరన్నర క్రితమే కెసిఆర్ బంధువు "తెలంగాణా భవన్'' నిర్మాణానికి పార్టీకి అవసరమైన స్థలాన్ని రాష్ట్రప్రభుత్వం 30ఏళ్ళ "లీజు''కు యిచ్చి, ఆ స్థలంలో పార్టీ కార్యాలయం తప్ప ఇతరత్రా వ్యాపార ప్రయోజనాలకు వాడరాదని అగ్రిమెంటులో షరతు విధించింది కాబట్టి, అక్కడినుంచి టీ.వీ. ఛానళ్ళునడపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి నోటీసు యిచ్చాడు. దానిపైన కోర్టు కూడా ఎందుకు చర్య తీసుకోరాదో సంజాయిషీ యివ్వమన్నది. కాగా, ఇప్పుడు రఘునందనరావు, కెసిఆర్ పైన,హరీష్ రావు, తారకరామారావులపై చేసిన తీవ్రమైన ఆరోపణలు ఇంతవరకూ ఆ కుటుంబం వరకే పరిమితమైన అంతర్గత కుమ్ములాటలను బజారున పడవేశాయి.   దీంతో తెలంగాణా ప్రజలకేగాక, మొత్తం రాష్ట్రప్రజలందరికీ కెసిఆర్ కుటుంబం తెలుగుజాతికి వ్యతిరేకంగా ప్రారంభించిన విద్యోహకర వేర్పాటు 'ఉద్యమ' రహస్యం కాస్తా వెల్లడవుతోంది. అంతకుముందు కాంగ్రెస్ లో ఉంటూ తర్వాత "తెలుగుదేశం''లోకి గెంతి, "దేశం'' ప్రభుత్వంలో తగిన కీలకస్థానం లభించకపోవడం ఆ పార్టీకి రాజీనామా చేసి, సరాసరి 'ముఖ్యమంత్రి'పదవి కోసం స్వార్థబుద్ధితో ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాన్ని తోటి తెలుగువారిపైన, ఆంధ్రులపైన బూతులతో, అబద్ధ ప్రచారాలతో నిర్మించాడు.   కాని కెసిఆర్ సహా అతని కుటుంబసభ్యులపైన రఘునందనరావు ఒక బాధ్యతాయుత స్థానం నుంచి చేసిన ఆరోపణల సారాంశం యిలా ఉంది : (1) 2008 ఉపఎన్నికల్లో 'తెరాస' పార్టీ ఘోర పరాజయం చవిచూసిన తర్వాత పార్టీ అధినేత కెసిఆర్ ను పదవినుంచి తప్పించేందుకు ఆయని మేనల్లుడు టి.హరీష్ రావు కుట్రపన్నాడు. (2) "దేశం''లో చంద్రబాబులాగానే 'తెరాస'లో నేనూ కష్టపడతా, పార్టీని మళ్ళీ బతికించుకుందాం'' అని హరీష్ రావు కెసిఆర్ పదవిపైన కన్నేసి ఆ విషయాన్ని మెదక్ జిల్లా శాఖ అధ్యక్షుడుగా ఉన్న తనతోనే చెప్పుకున్నాడని రఘునందనరావు వెల్లడి! (3) తిరుపతిలో హరీష్ రావు తనవద్ద డబ్బుతీసుకున్నట్టు రఘునందనరావు చెప్పాడు. (4) కెసిఆర్ కొడుకు తారక రామారావును సిరిసిల్లలో వచ్చే ఎన్నికల్లో వోడించడం కోసం "తెరాస''లో తిరుగుబాటుదారైన కె.కె. మహేందర్ రెడ్డికి హరీష్ రావు రూ.50 లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా అని రఘునందనరావు బాహాటంగా ప్రశ్నించాడు.   ఇంతకూ రఘునందనరావు కెసిఆర్ అతని సన్నిహితుడైనందున కుటుంబ వ్యవహారాలూ చాలావరకు దగ్గరగా ఉండి పరిశీలిస్తున్న రఘునందనరావు చేసిన ఆరోపణలను పార్టీ కార్యకర్తలు నమ్ముతున్న పరిస్థితి కెసిఆర్ రాజేకీయ ఉనికికే ప్రమాదకరంగా పరిణమించిందని పార్టీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయని పత్రికలూ రాస్తున్నాయి. యిది యిలా ఉండగానే, ఇంతకుముందే గుజరాత్ నుంచి హైదరాబాద్ వరకూ కెసిఆర్ పెంచుకున్న ఆస్తుల విలువ, ఇటీవల కాలంలో "ఉద్యమం'' పేరిట దండుకున్న మొత్తం విలువ వేలకోట్లలోనే ఉందని మరొకరి అంచనా! కాగా ఉస్మానియా ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఒక ప్రకటనలో కెసిఆర్ ఉద్యమం పేరిట పెంచుకున్న ఆస్తుల విలువ రూ. 40-50 వేలకోట్లు ఉంటుందని ఆరోపించారు!   అంతేగాదు, కెసిఆర్ కుటుంబం "తెలంగాణా వాదా''న్ని తడికలాగా "అడ్డంపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నార''నీ, "పెద్దమొత్తాలలో డబ్బులు వస్తూలు చేసుకుంటు''న్నారనీ రఘునందనరావు (17-05-2013) ప్రకటిస్తూ "హరీష్ రావు అక్రమ వసూళ్ళకు చెందిన పూర్తివివరాలతో, ఆధారాలతో హైకోర్టులో ప్రజాప్రయోజనవాజ్యం వేస్తున్నానని రఘునందనరావు ప్రకటించారు. ఇదిలా ఉండగా, కొలదిరోజులనాడు "సూర్య'' పత్రిక ఢిల్లీనుంచి ఒక వార్త విడుదల చేస్తూ కెసిఆర్ అక్రమఆస్తుల గురించి కేంద్రం సిబీఐ విచారణకు ఉత్తర్వులు జారీ చేయనున్నదని పతాక శీర్షిక ద్వారా వెల్లడించింది! ఒక ప్రజాప్రతినిధిగా హరీష్ రావు అక్రమవసూళ్ళపై సమగ్ర దర్యాప్తు కోరడంలో తన తప్పేమీ లేదని కూడా రఘునందనరావు స్పష్టం చేశారు. అలాగే, "సినిమాల్యా''బ్ నిర్మాణం కోసం దర్శక నిర్మాత రాఘవేంద్రకు ప్రభుత్వం కేటాయించిన భూమిలో వాణిజ్య సముదాయాలు కడుతున్నారంటూ బెదిరింపులకు పాల్పడి, రూ.80 లక్షలు వసూలు చేసినట్టు నిరూపించే సి.డీ.కూడా ఉందని రఘునందనరావు వెల్లడించడం కెసిఆర్ కుటుంబంలోనేగాక పార్టీ కార్యకర్తలలో గుబులుపుట్టింది. ఈ రూ.80 లక్షల "డీలు'' 'తెరాస' పార్టీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి నివాసంలోనే జరిగిందని రఘునందన్ స్పష్టం చేశారు. ఈ ఆరోపణలలో కొన్నింటికి హరీష్ రావు జవాబిచ్చారు, ఆరోపణలను పైకి మాత్రం ఖండించాడేగాని బలంగా తననుతాను సమర్ధించుకోలేకపోయాడు!   ఈ సందర్భంలోనే రఘునందనరావు డిజిపి దినేష్ రెడ్డిని కూడా కలుసుకుని అభియోగపత్రం ఇవ్వాలని నిర్ణయించి, డి.జి.పి.ని కలుసుకున్నారు. ఈ సంకటస్థితిలో కెసిఆర్ కుటుంబసక్షేమం సన్నివేశంలోనే హరీష్ రావి కుతుమ్బపరువును నిలబెట్టేందుకుగాను రఘునందనరావు ఆరోపణలను ఎలాగోలా ఖండించమని కెసిఆర్ కొడుకు తారక రామారావును బతిమాలుకోవడం మరో కోణం. కాని ఈ విషయంలో కెసిఆర్ తన మౌనాన్ని దారి మళ్ళించి, పదేపదే "సీమాంధ్రుల దోపిడీ''పై వక్రప్రకాహరంలో భాగంగా రాయలసీమకు కృష్ణజలాలు వెళ్ళకుండా నీటి సరఫరాను బంద్ చేస్తామని ప్రగల్భిస్తూ బెదిరింపుగానే ఒక ప్రకటన చేశాడు. కాని దశాబ్దాల తరువాత ఏ "సీమాంధ్రుల దోపిడీ'' పేరిట తెలంగాణా దొరల దోపిడీని ప్రజలు నహించారో ఆ ప్రజలు ఇప్పుడూ, రేపూ కూడా అదే 'దొరల' దోపిడీని ఇకపైన కూడా కొనసాగనివ్వరు. అందుకే రఘునందనరావు కెసిఆర్ కుటుంబసభ్యుల అవినీతి గురించి ఆధారాలతో హైకోర్టులో ప్రజావాజ్యం నడపబోవడమేగాక, 'తెరాస' నాయకులు పార్టీపేరిట వసూలు చేసిన కోట్లాది విరాళాలకు సంబంధించిన బాగోతాన్ని కూడా వెలికితాయడం కోసం సిబీఐని అర్థించబోవడంతో పాటు, ఈ భారీ విరాళాలు, జమపడని అపారమైన 'నిధుల్ని', ఆ గుప్తధనాన్ని వెలికితీయవలసిన అవసరముందని కూడా ఎన్నికల సంఘాన్ని కోరబోతున్నారు. 'డంబం' పూవులయితే పూస్తుందేమోకాని, అది కాయలు కాయదట! నేడు కెసిఆర్ 'డంబం' కూడా అలాగే ఉంది! మనకు రఘునందనరావు చెప్పేదాకా తిరుపతిలో ఆయననుంచి "డబ్బులు'' పట్టానని ఈరోజు దాకా హరీష్ రావు చెప్పలేదు, బహుశా ముఖం చెల్లకపోయి ఉండవచ్చు. అలాగే ఇప్పటిదాకా "తెలుగుదేశం'' పార్టీలో ముఖ్యనాయకుడుగా, అనేక పదవులు వెళ్ళబెట్టిన కడియం శ్రీహరి ఇన్నాళ్ళూ వూడిగం చేసి చేసి అంతకుముందు "దేశం''మీద ఈగవాలనివ్వకుండా కాపాడుతూ అకస్మాత్తుగా తెలంగాణా "సీమాంధ్ర దోర'' పంచన చేరడాన్ని కూడా ప్రాంతప్రజలు హర్షించలేకపోతున్నారు! కెసిఆర్ లక్ష్యం చీలుబాటలు కాబట్టి శ్రీహరిని 'తెరాస'లోకి ఆహ్వానించడం ద్వారా తెలుగునాడు తన మాతృదేశం కానట్టుగా "మాత్రుభూమి విముక్తికోస''మే శ్రీహరి 'తెరాస'లో ప్రవేశించాడని కోతలు కోస్తున్నాడు. నిజానికి 'పార్టీలపక్షి' కెసిఆర్ మాతృభూమి శ్రీకాకుళ-విజయనగరమేగాని తెలంగాణా కాదు, కాదు!!

 telangana issue

అడుసు తొక్కనేల…?

        తెలంగాణ ఇష్యూ రాను రాను కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారుతుంది.. అందుకు తగ్గట్టుగానే ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్ది జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పెద్దలు మాట జారి సమస్యను మరింత జఠిలం చేస్తున్నారు.. అయితే ఇది పార్టీ స్ట్రాటజీనా లేక నిజంగానే నాయకులు నోరు జారుతున్నారా అన్న విషయం అర్ధం కాక టీ కాంగ్‌ నేతలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు..           రాజశేఖర్‌ రెడ్డి మరణం తరువాత తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దీనంగా తయారయింది.. అర్ధరాత్రి చిదంబరం చేసిన డిసెంబర్‌ 9 ప్రకటన తరువాత సీమాంద్ర సెగలతో ఆ ప్రకటన వెనక్కి తీసుకోవడంతో మొదలైన మాటల తడబాటు ఇంకా కొనసాగుతూనే ఉంది..         చిదంబరం తరువాత జాతీయ స్థాయి నాయకులే చాలా మంది తెలంగాణ పై వివాధాస్పద వ్యాఖ్యలు చేశారు.. వీరప్పమొయిలీ, గులాం నబీ అజాద్‌, రేణుక చౌదరి లాంటి సీనియర్‌ నాయకులు కూడా తెలంగాణపై అనుచిత వ్యాఖ్యాలు చేసి తరువాత నాలుక కరుచుకున్నారు..         ఇప్పడు తాజాగా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పీసీ చాకో కూడా ఇలాంటి వ్యాఖ్యనే చేశారు.. అసలు తెలంగాణ అంశం కాంగ్రెస్‌ ఎంజెండాలోనే లేదంటూ చెప్పి టి కాంగ్‌ నేతలందరినీ ఇరకాటంలోకి నెట్టేశారు.. చాకో మాటలపై తెలంగాణ నేతలు కత్తుల దూయటంతో మరోసారి ఆ మాటల్ని వెనక్కి తీసుకున్నాడు..         అయితే నిజంగానే కాంగ్రెస్‌ నేతలు మాట జారుతున్నారా.. లేక కావాలనే రాజకీయ వేడి పుట్టిస్తున్నారా.. అన్న విషయం మాత్రం ఎవరికీ అర్ధం కావటం లేదు.. కానీ ప్రతిసారి ఇలా మాట్లాడటం మళ్లీ మాట మార్చడంపై సామాన్యులు మాత్రం అడుసు తొక్కనేల అంటూ పెదవి విరుస్తున్నారు..

jr.ntr dailogue

తెదేపా నేతలపై జూ. యన్టీఆర్ పంచ్ డైలాగులు

  యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అయన నటిస్తున్న 'రామయ్యా వస్తావయ్యా' టీజర్ నిన్న విడుదల చేసారు. ఆ టిజర్ లో ఎన్టీఆర్ ఒక పంచ్ డైలాగు పేల్చారు. ''ఎవడు పడితే వాడు బుడ్డోడు, బుడ్డోడు అని అంటే గుడ్డలూడతీసి కొడత..అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమాని అయ్యుండాలి.''   ఇది సినిమాకు సంబంధించిన డైలాగయినప్పటికీ, అది తెదేపాలో తనను విమర్శిస్తున్న కొందరు నేతలను ఉద్దేశించి అన్నవేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ ఫ్లెక్సీ బ్యానర్ యుద్ధంలో బలయిన తనను, తన తండ్రి హరికృష్ణను చంద్రబాబు ప్రోద్బలంతో బాలకృష్ణతో సహా కొందరు తెదేపా నేతలు తీవ్రంగా విమర్శించడం, సంజాయిషీలు కోరడంపై ఆగ్రహించిన జూ.యన్టీఆర్, ఈ డైలాగుతో వారిని హెచ్చరించినట్లు అర్ధం అవుతోంది.   కానీ, ఇటువంటి డైలాగులు దియేటర్లో ప్రేక్షకుల చేత చప్పట్లు చరిపించుకోవడానికే తప్ప వేరేవిధంగా ఉపయోగపడవని ఆయనకు తెలిసే ఉండాలి. పార్టీలో తనను వ్యతిరేఖిస్తున్న వారిని, విమర్శించేవారిని ఎదుర్కొని గట్టిగా సమాధానం చెప్పదలచుకొంటే, ఆయన కూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావలసి ఉంటుంది. అయితే, తనకు ప్రస్తుతం అటువంటి ఆలోచనలు లేవని జూ.యన్టీఆర్ స్వయంగా చెప్పారు గనుక, అంతవరకు ఇటువంటి పంచ్ డైలాగులతోనే తన కోపం చల్లార్చుకోక తప్పదు మరి.

sabita

ఒకరు చేస్తే తప్పు! పదిమంది కలిసి చేస్తే ఒప్పు?

  ఇంతకాలంగా ఎంతమంది వేలెత్తి చూపినప్పటికీ వెరవని మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి ఇద్దరూ అధిష్టానం నిర్ణయంతో తమ పదవులనుండి దిగిపోక తప్పలేదు. సీబీఐ కోర్టు ధర్మాన విచారణకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని ప్రకటించిన తరువాత, సీబీఐ ఆయనను విచారించేందుకు సిద్దపడినప్పుడు, తనపై సీబీఐ విచారణ నిలిపివేయాలని హైకోర్టునాశ్రయించి కేసులోంచి బయటపడిన ధర్మాన, నేడు తానూ నిర్దోషిగా బయటపడతానని చెప్పడం హాస్యాస్పదం.   తనకు కోర్టులపై నమ్మకం ఉందని, తానూ నిర్దోషినని ఆయన ధృడంగా విశ్వసిస్తున్నపుడు, ఇంత కాలం ప్రభుత్వ రక్షణ అనుభవిస్తూ సీబీఐ విచారణ నుండి ఎందుకు తప్పించుకు తిరిగారు? హైకోర్టులో సీబీఐ విచారణ నిలిపివేయాలని ఎందుకు పిటిషను వేసినట్లు?ఇంత కాలంగా తన వల్ల పార్టీకి, ప్రభుత్వానికి కూడా అప్రదిష్ట కలుగుతోందని తెలిసి కూడా పదవులలో కొనసాగిన ఆయన ఈ రోజు తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేసిన తరువాత, తన వల్ల పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలగకూడదనే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పడం కూడా హాస్యాస్పదం గానే ఉంది. మరి, మిగిలిన మంత్రులు కూడా రేపు ఇదేవిధంగా చెప్తారేమో?   ఇక,‘క్యాబినెట్ సమిష్టి నిర్ణయాలనే తానూ అమలు చేసాను తప్ప వ్యక్తిగతంగా ఏమి చేయలేదని అందువల్ల తనకు తప్పు ఆపాదించడం సరికాదని’ ఆయన అన్నారు. ఆయన తనకు అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తానని దేవుడి మీద ప్రమాణం చేసారు. మరి ఆయన క్యాబినెట్ తప్పుడు నిర్ణయాలు తీసుకొన్నపుడు దానిని ఆయన వ్యతిరేఖించి ఉండాలి. కానీ ఆయన తన మంత్రి పదవి కాపాడుకొనేందుకు క్యాబినెట్ నిర్ణయాన్నితప్పుపట్టలేదు. ఒకవేళ వ్యతిరేఖించి ఉండి ఉంటే, ఆయనకి నేడు ఈ దుస్థితి వచ్చేదే కాదు. ఇంచు మించుగా ఇదేవిధంగా ప్రవర్తించిన సబితా ఇంద్రారెడ్డికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.   ధర్మానను సీబీఐ ప్రాసికుషన్ చేయడానికి అనుమతి నిరాకరిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ సమిష్టి నిర్ణయం తీసుకొన్నపుడు, ఆరోగ్య శాఖా మంత్రిగా డా. డీ.యల్. రవీంద్రా రెడ్డి క్యాబినెట్ నిర్ణయాన్ని తానూ వ్యతిరేఖిస్తున్నానని చెప్పడమే కాకుండా అందులో తన అభ్యంతరాలను నమోదు కూడా చేయించారు.   అప్పుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ‘క్యాబినెట్ సమిష్టి నిర్ణయాలను వ్యతిరేఖించేవారు తమ పదవుల నుండి తప్పుకొంటే మేలని’ వ్యాక్యానించారు కూడా. అయినా డా.డీ.యల్ వెనక్కి తగ్గలేదు. చివరికి ఆయన నిర్ణయమే సరయిందని నేడు రుజువయ్యింది.   మరి సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన మంత్రులు కూడా ఇదేవిధంగా నాటి ముఖ్యమంత్రి తప్పుడు నిర్ణయాలను వ్యతిరేఖించి ఉండవచ్చును. కానీ, అందరికీ పదవుల చింతే! పైగా డా.రాజశేఖర్ రెడ్డి కొండంత అండగా నిలబడటంతో నాడు తప్పులు కూడా ఒప్పులుగానే కనిపించాయి. అందుకే, మంత్రులు అంత నిర్భయంగా ఫైళ్ళ మీద ఎడా పెడా సంతకాలు చేసేసారు.   కానీ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. బహుశః ఆయన తదనంతరం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేప్పటి ఉండి ఉంటే, నేటికీ ఈ తంతు నిర్భయంగా కొనసాగుతూనే ఉండేదేమో?   మంత్రు లిద్దరూ కూడా “తమకి వ్యక్తిగతంగా లబ్ది చేకూరలేదు గనుక, క్యాబినెట్ సమిష్టి నిర్ణయాలనే అమలు చేసాము గనుక తాము తప్పు చేయలేదని” వాదించడం కూడా చాల అసమంజస వాదన. ప్రజలు చెల్లిస్తున్న పన్నులతో జీతాలు అందుకొంటూ, సకల రాజభోగాలు అనుభవిస్తూ తాము చేప్పటిన పదవులకి న్యాయం చేయలేని వారు, ప్రభుత్వ ఆస్తులను కాపాడలేనివారు తప్పు చేసినట్లు కాదా?   ఒక తప్పును పదిమంది కలిసి చేస్తే ఒప్పు అవుతుందా? ఇటువంటి వితండ వాదనలు ఒక సరికొత్త సంప్రదాయానికి తెర తీస్తాయి. మంత్రిగా ఎవరికీ బాధ్యత ఉండదు. సమిష్టి నిర్ణయానికీ ఎవరూ బాధ్యులు కారు. అటువంటప్పడు జరిగిన తప్పుకి ఎవరు భాద్యత వహిస్తారు? జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఎవరు పూడుస్తారు? ఎవరు శిక్ష అనుభవిస్తారు?   మంత్రులు అనాలోచిత నిర్ణయాల వల్ల అంతిమంగా నష్టబోయేది ప్రజలే, వృధా అయ్యేది కూడా ప్రజా ధనమే. నేడు మంత్రుల, అధికారుల అవినీతిని బయటపెట్టి, నేర నిరూపణ చేయడం కోసం సీబీఐ, కోర్టులు, ఇంకా ఇతర ప్రభుత్వ శాఖలపైనా వందల కోట్ల ప్రజాధనం ఖర్చు అవుతోందంటే, దానికి ఆనాడు మంత్రివర్గం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలననే కదా? ఆ నాడు మంత్రి వర్గం బాధ్యతలెరిగి, సక్రమంగా వ్యవహరించి ఉండి ఉంటే నేడు ప్రజలు ఈ అదనపు ఆర్ధిక భారం మోయవలసి ఉండేదే కాదు కదా?   మంత్రులిద్దరూ ప్రస్తుతం మీడియా ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు వారు ఎటువంటి వాదనలయినా చేయవచ్చును. దాని ప్రజలు ఖండించలేరు కూడా. కానీ, రేపు బోనులో నిలబడి ఇటువంటి వాదనలతోనే న్యాయస్థానాన్నికూడా ఒప్పించగలరా?ఒకవేళ ఒప్పించగలిగితే, వారి నీతి నిజాయితీలను ఇక ఎవరూ కూడా శంఖించలేరు.

gadde ram mohan rao

విజయవాడ తెదేపా తమ్ముళ్ళ లుకలుకలు

  రాబోయే ఎన్నికలలో విజయవాడ తూర్పు నియోజక వర్గం నుండి లోక్ సభకు పోటీ చేయాలనీ ఆశలు పెట్టుకొన్న గద్దె రామ్మోహన్ రావు, ఇటీవల చంద్రబాబు పాదయాత్రలో తన స్థానాన్ని కేశినేని నానికి కేటాయించడంతో పార్టీపై అలిగారు. అప్పుడు చంద్రబాబు ఆయనను తన వద్దకే రప్పించుకొని తానూ పాదయత్ర ముగించుకొని పార్టీ కార్యాలయానికి తిరిగి వచ్చిన తరువాత అన్నీ మాట్లాడుకొందామని సర్దిచెప్పి పంపించేసారు. కానీ, చంద్రబాబు తిరిగి వచ్చి అప్పుడే మూడు వారాలు అవుతున్నపటికీ, తనను ఇంతవరకు పిలిచి మాట్లాడకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందిన ఆయన, తానూ పార్టీకి చేసిన సేవలు, తన రాజకీయ అనుభవం అన్నీ వివరిస్తూ గత రెండు ఎన్నికల సందర్భంలో ఇతరులకోసం తనను పార్టీ ఏవిధంగా పక్కన బెట్టినదీ, అయినా తానూ ఏవిధంగా పార్టీకి సహకరించారో తెలియజేస్తూ కరపత్రాలు ముద్రించారు. వాటిలో పార్టీకి సేవలు చేసిన వారిని కాదని పెట్టుబడి దారులకు మాత్రమే పార్టీ టికెట్స్ కేటాయించే సంస్కృతి పెరిగిపోయిందని, ఇది పార్టీ భవిష్యత్తుకు ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. అంతేకాక, పార్టీ అధిష్టానంపై కూడా తీవ్ర విమర్శలు చేసినట్లు సమాచారం. దాదాపు లక్ష కరపత్రాలను ఆయన తన పేరిటే ముద్రించి ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి పంచేందుకు సర్వం సిద్ధం చేసుకొన్నట్లు తెలియడంతో తెదేపా అధిష్టానం తన దూతలను హుటా హుటిన గద్దె రామ్మోహన్ రావు వద్దకు పంపినట్లు తెలుస్తోంది. ఎన్నికలకి ఇంకా 10 నెలల సమయం మిగిలి ఉండగానే పార్టీలో అసంతృప్తి నేతలు ధిక్కార స్వరాలూ వినిపించడం, పార్టీ వారిని బుజ్జగించడం కూడా అప్పుడే మొదలయిపోయాయి.

 Dharmana Prasada Rao cbi

నిర్దోషిగా నిరూపించుకుంటా: ధర్మాన

        కాంగ్రెప్ పార్టీ అధిష్టానం ఆదేశాలను గౌరవిస్తానని, పార్టీకి సేవ చేస్తానని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. చార్జీషీటులో పేరు ఉన్నంత మాత్రాన దోషులం కాదని,న్యాయవిచారణలో అన్ని నిజాలు బయటకు వస్తాయని అన్నారు. దర్యాప్తు సంస్థలు పేరు నమోదు చేసినప్పుడే తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని ధర్మాన చెప్పారు. పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బంది ఉండకూడదని తాను రాజీనామా చేశారని, అప్పటి రాజీనామాకే కట్టుబడి ఉన్నానని ధర్మాన తెలిపారు. భూ కేటాయింపుల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోలేదని, మంత్రివర్గానికి తెలిసే అన్ని నిర్ణయాలు జరిగాయని దర్మాన పేర్కొన్నారు. తమకు న్యాయవ్యావస్థపై నమ్మకం ఉందని, త్వరలోనే నిర్దోషులగా బయటకు వస్తామని ధర్మాన ప్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేశారు.

chandrababu

ఆ క్రెడిట్ అంతా నాదే: చంద్రబాబు

  నా కోడి కూయకపోతే లోకానికి తెల్లారదందిట వెనకటికి ఒక ముసలవ్వ. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కళంకిత మంత్రులను తొలగించడం తన ఒత్తిడివల్లె జరిగిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు చెప్పుకోవడం కూడా అలాగే ఉంది. ఈ రోజు రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు ఆయన అనుచరులు రాష్ట్రంలో కళంకిత మంత్రులను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించమని కోరుతూ ఒక వినతి పత్రం సమర్పించి వచ్చారు.   తిరిగి వస్తున్నపుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ “మేము కళంకిత మంత్రులను తొలగించాలని రాష్ట్రపతిని కలవబోతున్నట్లు మీడియాలో వార్తలు రావడం మొదలవగానే, నిన్న రాత్రి హుటాహుటిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన కళంకిత మంత్రులిద్దరినీ రప్పించుకొని వారిచేత రాజీనామాలు చేయించినట్లు తెలిసింది. వారు ఇంకా రాజీనామాలు చేసారో లేదో ఇంకా తెలియదు కానీ, బాధ్యతగల ప్రతిపక్షంగా కళంకిత మంత్రులిద్దరినీ తప్పించేవరకు ప్రభుత్వంపై మేము పోరాటం చేస్తూనే ఉంటాము. కేంద్రంలో ఒక పద్ధతి, రాష్ట్రంలో మరో పద్ధతి, ఒక రాష్ట్రంలో ఒక పద్దతి, మరో రాష్ట్రంలో మరో పద్ధతి కాకుండా దేశం మొత్తం మీద అవినీతికి వ్యతిరేఖంగా చర్యలు ఒకే రకం ఉండాలని మేము కోరుకొంటున్నాము,” అన్నారు.   గత నాలుగయిదు రోజులుగా డిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో కళంకిత మంత్రుల విషయంలో ఏమిచేయాలని తలలు బ్రద్దలు కొట్టుకొన్నాక, చివరికి దైర్యం చేసి ఇద్దరు మంత్రులను తొలగిస్తే, అదంతా తన పోరాటం వలననే జరిగిందని చంద్రబాబు చెప్పుకోవడం చాలా హాస్యాస్పదం. ఇది చంద్రబాబు రాజకీయ చతురతకు బదులు చవకబారు ప్రయత్నంగా మాత్రమే కనబడుతోంది. ఈవిధంగా ప్రతీ అంశంలో రాజకీయ ప్రయోజనం పొందాలని ఆశించడం ఆయన స్థాయి నేతలకి తగదు.

కాంగ్రెస్ పార్టీని వీడను: సబిత

      ''కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. నిబంధనల ప్రకారమే అంతా చేశాం. నా మీద పెట్టిన కేసు విషయంలో న్యాయపోరాటం చేస్తాను. జీవితంలో ఎన్నో పోరాటాలు చేసిన నాకు ఇది లెక్కకాదు. కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలి. నేను హోంమంత్రిగా ఉన్నా కార్యకర్తగానే పనిచేశా. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా ప్రయత్నం నేను చేస్తాను” అని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆమె రాజీనామా కు నిరసనగా ఆమెకు మద్దతుగా నిరసనలు మిన్నంటాయి. సబిత రాజీనామా ఆమోదించవద్దని మహేశ్వరంలో ఆమె అభిమానులు నిరసన కార్యక్రమాలు చేప్టారు. మందమల్లమ్మ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి.. రాస్తారోకో చేపట్టారు. సబితను మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, రాంరెడ్డి వెంకట్ రెడ్డి, వట్టి వసంత్ కుమార్, మాజీ ఎంపీ కేశవరావులు కలిసి పరామర్శించారు. రాజీనామా చేసినందుకు బాధపడవద్దని ధైర్యం చెప్పారు. మరో వైపు రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి కూడా ఆమెను కలిశారు.

బీజేపీలో జేరనున్ననాగం జనార్ధన్ రెడ్డి

  ఎన్నో పెద్ద కలలు కంటూ తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణా ఉద్యమాలలోకి ప్రవేశించిన నాగం జనార్ధన్ రెడ్డి, తెరాస అధక్షుడు హ్యాండివడమే కాకుండా, తెలంగాణా జేయేసీలోకి కూడా ప్రవేశించనీయకుండా సైంధవుడిలా అడ్డుపడటంతో ఆయన భవిష్యత్ అగమ్య గోచరంగా మారిపోయింది. తెదేపాలోకి తిరిగి వెళ్ళలేక, తెరాసలో చేరే అవకాశంలేక ఆయన చాలా నిరాశ నిస్పృహలకి లోనయ్యారు. మరిక మిగిలి ఉన్న ఏకైక పార్టీ బీజేపీలో చేరుతున్నారు. కొద్ది వారాల క్రితమే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి డిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కలిసినప్పటికీ, పార్టీలో చేరకుండానే వెనక్కి తిరిగి వచ్చేసారు. వచ్చేనెల 3వ తేదీన హైదరాబాదులో జరుగనున్న ఒక బహిరంగ సభలో బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరుతారని కిషన్ రెడ్డి ప్రకటించారు.   నాగం వంటి బలమయిన నాయకుడు బీజేపీకి అవసరమయితే, బీజేపీ వంటి బలమయిన పార్టీ అండ దొరకడం ఆయనకీ కలిసి వచ్చింది. ఒకవేళ వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ గనుక అధికారంలోకి వచ్చినట్లయితే నాగం జనార్ధన్ రెడ్డికి ఇక దశ తిరిగినట్లే భావించవచ్చును. ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాలేకపోయినా, ఆయనకి వచ్చే నష్టం ఏమి ఉండదు.

జాతీయ ఉపాధ్యక్షుడిగా దత్తాత్రేయ

    సికింద్రాబాద్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా భారతీయ జనతా పార్టీలో మాజీ మంత్రి బండారు దత్తాత్రేయది కీలక పాత్ర. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన దత్తాత్రేయ సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచారు. నమ్మిన సిద్దాంతానికి కట్టుబడ్డ ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే తాజాగా పార్టీకి ఆయన సేవలకు గుర్తింపుగా అన్నట్లు దత్తాత్రేయను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అంతే కాకుండా ఆయనను కేరళ రాష్ట్ర పార్టీ ఇంఛార్జిగా కూడా నియమించారు. ఇంతకుముందు రాష్ట్రం నుండి బంగారు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన తరువాత వెంకయ్యనాయుడుకు కూడా ఆ పదవి దక్కింది. ఇటీవల రాజ్ నాథ్ సింగ్ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యాక రాష్ట్రానికి చెందిన మురళీధర్ రావు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఇప్పుడు బండారు దత్తాత్రేయకు కూడా పార్టీలో సముచిత ప్రాధాన్యం దక్కింది.

కడియంపై రఘునందన్ రావు హత్యారోపణలు

  ఇటీవల తెరాస నుండి సస్పెండయిన రఘునందన్ రావు, తెదేపా నాయకుడు కడియం శ్రీహరిపై పరశురాం అనే వ్యక్తి హత్యలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయని, ఏళ్లతరబడి పార్టీ జెండామోసిన తనను పార్టీనుండి సస్పెండ్ చేసి అటువంటి వ్యక్తిని తెరాసలోకి చేర్చుకోవడం ఏవిధంగా సమంజసమని ప్రశ్నించారు. రఘునందన్ రావు ఆరోపణలకు కడియం శ్రీహరి స్పందిస్తూ తనను వ్యతిరేఖించే పార్టీ నేతలు కూడా ఎన్నడూ తనపై ఇటువంటి నీచమయిన ఆరోపణలు చేయలేదని, పార్టీ నుండి సస్పెండ్ అయిన రఘునందన్ రావు ఇటువంటి ఆరోపణలు చేయడం చాలా విచారకరమని, ఆయన తన ఉనికిని కాపాడుకొనేందుకే ఇటువంటి చవకబారు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తానూ మొదటి నుండి విలువలతో కూడిన రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చానని, భూ వివాదాలు, వసూళ్ళు, హత్యా రాజకీయాలకు తానూ ఎప్పుడూ దూరంగానే ఉంటున్నాని ఆయన అన్నారు. తనపై ఆయన చేసిన హత్యారోపణలపై 48గంటలలో ఆయన రుజువులు చూపాలని లేకుంటే ఏ మీడియా ముందు ఇటువంటి ఆరోపణలు చేసారో అదే మీడియా ముందు నిలబడి తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన హెచ్చరించారు. లేకుంటే, ఆయనపై తానూ కోర్టులో కేసు వేస్తానని హెచ్చరించారు. అయితే, ఇంత వరకు రఘునందన్ రావు ఆయన సవాలుకు స్పందించలేదు.