పతనంలోనే రూపాయి
posted on Aug 28, 2013 @ 2:40PM
రూపాయి పతనం మరింత కొనసాగుతోంది. ఆర్థికలోటును ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామన్న ప్రభుత్వ హామీలు నిలబడకపోవటం, ఆహార సబ్సిడీ బిల్లు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో మంగళవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపువిలువను మరింత చితికి పోయేలా చేసింది.ఇంట్రాడే ట్రేడింగ్‌లో 66.30 పైసల కనిష్ట నష్టానికి చేర్చగా, ముగింపు సమయానికి రూపాయి మారకపువిలువ 66.24పైసల వద్ద ఆగింది. ఇది 3.02శాతం అంటే 194పైసల నష్టాన్ని మిగిల్చింది.
ఆగస్టు 19న రూపాయి 148పైసల నష్టాన్ని నమోదు చేయగా, మునుపెన్నడూ లేని రీతిలో మంగళవారం ఇంట్రాడే లావాదేవీల్లో రూపాయి మారకపువిలువ కనిష్ఠ స్థాయిలో పడిపోయి రికార్డు సృష్టించింది. స్థానిక ఈక్విటీ మార్కెట్ గణనీయస్థాయిలో పడిపోవటం నడుమ ఈ నెలాఖరున దిగుమతుదారులు, బ్యాంకుల నుంచి యుఎస్ కరెన్సీకి బాగా డిమాండ్ పెరిగింది. ఇక్కడ ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజీ వద్ద మధ్యాహ్నం 12గంటలకు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 65.72పైసలకి మునుపెన్నడూ లేనిరీతిలో పడిపోయింది.
నెలాఖరులో దిగుమతిదారులు, ప్రధానంగా ముడిచమురు దిగుమతి చేసుకునే ఆయిల్‌కంపెనీలతోపాటు విదేశీ మూలధన ప్రవాహాల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో, ఈక్విటీ మార్కెట్ పడిపోయి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపువిలువ మరింత క్షీణదశకు చేరిందని ఒక ఫారెక్స్ డీలర్ చెప్పారు. ఇదిలాఉండగా, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సెన్సెక్స్ 2.24శాతానికి అంటే 415.74పాయింట్లకు నష్టపోయి 18,142.39 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది.అయితే, ముగింపు సమయానికి సెన్సెక్స్ సూచీ మార్కెట్ ముగింపు సమయానికి 590.05 పాయింట్ల మేరకు నష్టపోయి 17,968.08 పాయింట్ల వద్ద ముగిసింది.