కెసిఆర్ రహస్యాలు బయటపడ్డాయి!
-డా.ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]
ఒక స్థానిక దినపత్రిక మొదటిపేజీలో [21-05-2013] పాఠకులు ఓ చిత్రమైన ఫోటో చూసి ఉంటారు. అందులో పైనుంచి కిందివరకూ వరసక్రమంలో కనిపించే ఆధునిక "పంచపాండవుల్ని'' [కొందరు వీరిని మంచపుకోళ్ళు'' అని అంటున్నారు] పాఠకులు కనిపెట్టి ఉంటారు! అందులో ఒకాయన బాగా పాలిపోయిన ముఖంతో కనిపిస్తాడు. మిగతావారు మాత్రం తెచ్చిపెట్టుకున్న మందహాసంతో కనిపిస్తారు. అయితే ఈ అయిదుగురిలో ఒక వ్యక్తి పార్టీవేరు, మిగతా నలుగురి పార్టీ వేరు. కాని, పార్టీలు వేరైనా అయిదుగురికీ పొత్తు ఎలా కుదిరిందన్నది పాఠకుల సందేహం. ఆ పొత్తుకోసమే ఆ రెండు పార్టీల మధ్య కొన్ని మాసాలుగా మంతనాలు సాగుతున్నాయి. ఇందులో ఒక పార్టీ "తెలంగాణా'' వేర్పాటు ఉద్యమం పేరిట ముఖ్యమంత్రి పదవి కోసం వెంపరలాడుతూ తెలంగాణాలో "పరకాయప్రవేశం'' చేసిన 'సీమాంధ్ర దొర' కెసిఆర్ పెట్టిన తెలంగాణా రాష్ట్ర సమితి. కాగా మిగతా నలుగురు నాయకులు తెలంగాణా కాంగ్రెస్ ఎం.పీ.లు. రెండు మూడు మాసాల క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠాన వర్గంతో కె.సి.ఆర్. ప్రారంభించిన చర్చల వేదిక ఇప్పుడు క్రమంగా హైదరాబాద్ లోని "ఫామ్ హౌస్''ల వద్దకు, "వ్యవసాయక్షేత్రం'' వద్దకు చేరుకుంది.
దేశ సమైక్యతను, భాషా రాష్ట్రాల సమగ్రతను కోరుకునే కాంగ్రెస్ కూ కేవలం తన ముఖ్యమంత్రి పదవికోసం తెలంగాణలో పాగా వేసి తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికి కంకణం కట్టుకున్న 'సీమాంధ్ర దొర' వేర్పాటువాద స్థానిక పార్టీకీ పొత్తు ఎలా కుదిరింది? ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యపై బాధ్యతగల ఒక రాజకీయపక్షంగా ఇందిరాగాంధి మాదిరిగా ఒక మాటమీద నిలబడలేక రోజుకొక తీరుగా 'ధ్వని కవిత్వాలు' నేటి కాంగ్రెస్ కేంద్రనాయకత్వం వినిపిస్తున్నందునే రాష్ట్ర సమస్య జటిలం కావలసి వచ్చింది. ఈ సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ను బతికించుకోవడానికి కేంద్ర నాయకత్వం "తెరాస''లాంటి ఏ పూచికపుళ్ళ కనపడినా దానితో పొత్తు పెట్టుకోడానికి సిద్ధపడుతోంది.
ఈ దౌర్భాగ్యపు వ్యూహంలో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ ను బతికించుకొనే యత్నంలో తద్వారా తెలంగాణలో తోటి తెలుగువారిపై విద్వేష ప్రచారం ద్వారా సీమాంధ్రులను'' గెంటివేస్తే లక్షలాది ఉద్యోగాలు ఖాళీ అయి స్థానికులకు ఉపాధి దొరుకుతుందన్న ఆశలు కల్పించడం ద్వారా తెలంగాణా బిడ్డలను ఆత్మహత్యలకు పురిగొల్పిన రాజకీయ నిరుద్యోగి కె.సి.ఆర్.కు ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ ఆశ చూపించింది ఢిల్లీ చర్చలలో. దాని ఫలితమే నేడు తెలంగాణా కాంగ్రెస్ నూ, "తెరాస'' పార్టీని కలిపేసే ప్రయత్నం. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్ఠానం తన చేతులు కాల్చుకోకుండానే తెలంగాణా కాంగ్రెస్ ను తెరపైనిల్పి కెసిఆర్ తో పొత్తుకు ద్వారాలు తెరిచినట్టు కన్పిస్తోంది.
తద్వారా కెసిఆర్ ఆశ, ఇటు కాంగ్రెస్ కు ఉన్న స్థానిక బలంతో తాను ఆత్మహత్యలపాలైన వారి కుటుంబాలనుంచి ఆగ్రహాన్ని, ప్రమాదాన్నీ తప్పించుకోవచ్చు, అటు ప్రత్యేక తెలంగాణా ఏర్పడని పక్షంలో తెలంగాణా ప్రజలనుంచీ ఆగ్రహావేశాలకు తాను గురికాకుండా కాంగ్రెస్ పార్టీ అండతో బయటపడనూవచ్చు! ఇదీ వ్యూహం. అందుకనే తన ముఖ్యమంత్రి పదవికోసం, తెలంగాణా పేరిట ఎంతమంది కుర్రకారును ఆత్మహత్యల వైపుకు నెట్టినా అతనికి చింతలేదు. ఆ చింత అతనికి లేదనడానికి తాజాగా గతవారం పదిరోజులలో జరిగిన మూడు యువకుల ఆత్మహత్యలే నిదర్శనం.
వీళ్ళ జేబుల్లో దొరికాయని లేదా కనిపించాయని ["పర్ పోర్డెడ్ టు బి''] పత్రికలూ అనుమానాస్పదంగా ప్రకటించిన "సూసైడ్'' లేఖల్లో కెసిఆర్ నాయకత్వాన్ని పొగుడుతూ, మిగతా రాజకీయ పక్షాలను తిడుతూ రాయడాన్ని బట్టి 'తెరాస', ఉస్మానియాలో దాని అనుబంధ విద్యార్థి సంఘమూ కలిసి ఆ లేఖను కెసిఆర్ ప్రయోజనాల కోసమే డ్రాఫ్ట్ చేసినట్టు అనిపిస్తోంది! లేకపోతే ఆ ముగ్గురి యువకుల జేబుల్లో ఒకే తరహా లేఖలు ఉండవలసిన అవసరంలేదు. అంటే ఒక నిరుద్యోగి రాజకీయుడు పదవులకు ఎగబాకడం కోసం తన కుటుంబసభ్యుల్ని తన బంధుమిత్రుల్ని మినహాయించుకుని ముక్కుపచ్చలారని, ఎంతో భవిష్యత్తు చూడవలసిన, అనుభవించవలసిన యువకుల్ని ఆత్మహత్యల వైపునకు తప్పుడు ఆశలతో నెట్టడం ప్రజాస్వామిక రాజకీయ పద్ధతులకు పూర్తి విరుద్ధం. పైగా దశాబ్దాల తరబడి దొరల, భూస్వాముల, జాగిర్దార్ల, దేశ్ ముఖ్ ల దాష్టీకాలకు గురవుతూ వచ్చిన తెలంగాణా ప్రజలను తిరిగి 'దొర'ల పాలనా విషకౌగిలిలోకి నెట్టడమంటే, దారుణ చరిత్రను పునరావృత్తం చేయడమే అవుతుంది.
తెలంగాణా ప్రజా బాహుళ్యంలో, ముఖ్యంగా వెట్టిచాకిరీ ద్వారా బానిస బతుకులు అనుభవించిన దళిత బహుజన అట్టడుగు వార్తాలు ఈ పరిణామాన్ని వ్యతిరేకించి, ప్రతిఘతిస్తారని తెలిసిన కెసిఆర్ పన్నిన కొత్త నాటకం - తన పార్టీ (తెరాస) అధికారంలోకి వస్తే దళితుడ్నే "ముఖ్యమంత్రి''ని చేస్తానని పాత 'దొర'తనపు అహంకారాన్ని ఇంతకుముందే ప్రదర్శించడం జరిగింది. కాని, అదే నోటితో, తెరాసలో కొత్తగా తీర్థం పుచ్చుకున్న దళిత నాయకుడు, నిన్నిటిదాకా "తెలుగుదేశం''పార్టీలో అనేక ప్రధానపదవులను అనుభవించిన కడియం శ్రీహరినే 'తెరాస' గెలిస్తే, గిలిస్తే ముఖ్యమంత్రిగా నియమిస్తామని మాత్రం చెప్పలేకపోయాడు! చెప్పడు. ఎందుకంటే దళితులంటే కెసిఆర్ నాయకత్వానికి ఎంతటి చులకనో ఢిల్లీలోని ఆంధ్రభవన్ లో రాష్ట్రప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న దళిత ఆఫీసరు మీద కెసిఆర్ కుటుంబసభ్యుడే చేయి చేసుకొని గాయపరిచిన సంగతిని తెలంగాణాలోని బడుగు బలహీనవర్గాలు మరిచిపోయే ప్రసక్తిలేదు. ఈ దశలో తిరిగి రకరకాల గొంతెమ్మకోరికలు లేదా ఆశలతో ఇటీవల కెసిఆర్ ప్రకటనలు గుప్పిస్తున్నాడు, అవి అమలుకురాని శుష్క వాగ్దానాలు, శూన్యహస్తాలుగా రూపుదిద్దుకుంటాయి.
కాని ఈలోగా కెసిఆర్ చేస్తున్న మరోకపని - 'తెరాస'లోకి ఇతర పార్టీలనుంచి దూకివచ్చే 'జంప్ జిలానీల' సంఖ్య నామమాత్రమేనని పరిణామాలు నిరూపిస్తున్నందున, "ఆ పార్టీనుంచి ఇద్దరు, ఈ పార్టీనుంచి ముగ్గురు'' టి.ఆర్.ఎస్.లోకి వచ్చేస్తున్నారు, రేపోమాపో చేరబోతున్నారు అంటూ చేరబోయే వారి అనుమతితో నిమిత్తం లేకుండానే ముందస్తు ప్రచార ప్రకటనలు యివ్వడం, వాళ్ళని బలవంతాన 'చక్రబంధం'లోకి లాగడంకోసం శ్రమపడి 'డీలా' అయిపోతున్నాడు! కాని ఈలోగా తెరాసనుంచి ఇతర పార్టీలలోకి జారుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. "కాంగ్రెస్ లోనే ఉంటూ తెలంగాణాకోసం పోరాడతామేగాని మరో పార్టీలో చేరే సమస్యలేదని కొందరు తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యులు తెగేసి చెబుతున్నారు. కాగా, ఈలోగానే తెలంగాణా విద్యార్థి సంయుక్త కార్యాచరణ సంఘం అధ్యక్ష పదవిలో గత పన్నెండేళ్ళుగా ఉన్న రాజారాం యాదవ్ ఆ పదవికి రాజీనామా చేసి రేపోమాపో "తెలుగుదేశం'' పార్టీ తీర్థం పుచుకోడానికి సిద్ధపడ్డాడు! కెసిఆర్ ముఠా అవకాశవాద రాజకీయాలతో విసిగివేసారిన ఉస్మానియా విద్యార్థి సంఘంలో కూడా తీవ్ర అసంతృప్తి రాజుకుంటోందని కొందరు విద్యార్థి మిత్రులు చెప్పారు.
ఇక టి.ఆర్.ఎస్. రాజకీయంతో, కెసిఆర్ వర్గం కుట్రలతో విసిగివేసారిన టి.ఆర్.ఎస్. పొలిట్ బ్యూరో ముఖ్యసభ్యులు, టి.ఆర్.ఎస్. నాయకుడైన ఎం. రఘునందన్ 'తెరాస' నాయకులు సూటిగా సమాధానం చెప్పలేని కుటుంబ అవినీతి గురించి చేసిన ఆరోపణలు మొత్తం రాష్ట్రరాజకీయాల్లోనే పెద్ద సంచలనం కల్గిస్తున్నాయి.అనేక స్పష్టమైన రుజువులతో ఆ కుటుంబం అవినీతి గురించి రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యానికి రఘునందన్ సిద్ధం కావడంతో తన ప్రాణానికి ఆ కుటుంబంనుంచి ప్రమాదముందని భావించి, రాష్ట్ర డి.జి.పి.ని కలుసుకుని తనకూ, తన కుటుంబానికీ రక్షణ కల్పించాలని రఘునందన్ విజ్ఞప్తి చేయడం గమనార్హం!
అంతేగాదు "సిబీఐ''కి కూడా రఘునందన్ కెసిఆర్ లావాదేవీల గురించి ప్రత్యేక నివేదికను అందజేయడం విశేషం. రఘునందన్ ఆరోపణలకు సమాధానం చెప్పలేక "అతనికి మతిభ్రమించింద''న్న ఒక్క మాటతో తప్పించుకోజూస్తున్నారు కెసిఆర్ కుటుంబసభ్యులు. రఘునందన్ ఆరోపణలకు పునాది, స్వయంగా ఆ కుటుంబానికి ఆయన అతి సన్నిహితంగా ఉండటంతో పాటు కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద ఉన్న సమాచారం కూడా రఘునందన్ కు అందినట్టు కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి! ఇదిలా ఉండగానే "తెరాస''లో కొత్తగా తీర్థం పుచ్చుకున్న "దేశం'' ముఖ్యుడు కడియం శ్రీహరికి గతంలో ఇప్పగూడెంలో జరిగిన 'తెరాస' కార్యకర్త పరుశురాం హత్య కేసుతో సంబంధం ఉందన్న రఘునందన్ ఆరోపణను శ్రీహరి ఖండించాల్సి రావటం 'తెరాస' రాజకీయ కుమ్ములాటల్లో సరికొత్త కోణం! కాగా, ఆ హత్యకు మార్కిస్టుపార్టీ కార్యకర్తలు కారణమని శ్రీహరి ప్రకటించి మరొక కల్లోలానికి దారితీశాడు! ఇది యిలా ఉండగా, తెలంగాణాలోని దళితులలో అసంఖ్యాకులు జిల్లాల్లో మారుమూల ప్రాంతాలలో సహితం, గ్రామాలలోనూ కెసిఆర్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి సన్నద్ధమవుతున్నారని దళితమిత్రులు చెబుతున్నారు.