telangana

తెలంగాణ కోసం యువకుడు బలిదానం

      తెలంగాణ కోసం మరో యువకుడు ప్రాణాలర్పించాడు. ప్రత్యేక రాష్ట్రం రావాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని, బీజేపీతోనే తెలంగాణ సాధ్యమని లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ ఎంపీగా బీజేపీ నేత విద్యాసాగర్ రావును గెలిపించాలని సూసైడ్ నోట్‌లో కోరాడు. తెలంగాణ కోసం తన చావే చివరిది కావాలని అందులో పేర్కొన్నాడు. కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన పెరుమాండ్ల నరేష్ బీజెవైఎం మండల ఉపాధ్యక్షుడు. బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి, రాత్రివరకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అర్ధరాత్రి వెతకగా పొలం వద్ద పురుగుల మందు డబ్బా కనిపించింది. ఆ పక్కనే నరేష్ పడి ఉండడం గమనించిన అతని తండ్రి నారాయణ 108కు సమాచారాన్ని అందించాడు. 108 సిబ్బంది వచ్చి నరేష్ మరణించినట్లు తెలిపారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లభించింది. తెలంగాణ కోసం బలిదానం చేసుకుంటున్నట్లుగా అందులో పేర్కొన్నాడు. బీజేపీ అధికారంలోకి వస్తే వెంటనే తెలంగాణను ఇస్తుందని, బీజెపీని ప్రజలు గెలిపించాలని ఆ లేఖలో రాశాడు.

TRS Opposes Bayyaram Mines Allotment To VSP

బయ్యారం గనుల కేటాయింపుపై టి.ఆర్.ఎస్. గరం గరం

  బయ్యారం గనులలోని ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టి.ఆర్.ఎస్. నేతలు హరీష్ రావు, టి.ఆర్.ఎస్.ఎల్పీ నేత ఈటెల రాజేందర్, కాంగ్రెస్ ఎంపి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సబ్యుడు వి.హనుమంతరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విభేదించగా లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ స్వాగతిస్తున్నారు. గనుల కేటాయింపుపై మాట్లాడుతూ హరీష్ రావు ... విశాఖ స్టీల్స్ కు తెలంగాణాలోని గనులు అప్పగిస్తే తెలంగాణాకు ఎలాంటి లాభం చేకూరుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని , తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే బొకారో స్టీల్ ఫ్యాక్టరీ లాంటి భారీ ఫ్యాక్టరీ బయ్యారంలో స్థాపించి లక్షలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని, విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎంతమంది తెలంగాణా యువతకు ఉద్యోగాలు కల్పించారో స్పష్టం చేయాలని వ్యాఖ్యానించారు. టి.ఆర్.ఎస్. ఎల్పీ నేత ఈటెల రాజేందర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణాలోని సహజ వనరులను తాతజాగీరులా సీమాంధ్రకు కట్టబెడితే ఖబడ్దార్ అని ఘాటుగా ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.  బయ్యారం ఉక్కు తెలంగాణా హక్కు అని ఖమ్మం జిల్లాలోని ఖనిజాన్ని ఇక్కడే వినియోగించుకునేందుకు వీలుగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బయ్యారం, తెలంగాణాలోని బాగా వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడే ఉక్కుపరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే నెలకొల్పాలని, దీనిపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సిఎంకు లేఖ రాశారు. బయ్యారం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయిస్తే సరిపోదని, దాని ద్వారా ఖమ్మంలో పూర్తీస్థాయి స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రప్రభుత్వం ఆలస్యంగానైనా బయ్యారం సహా 5342 హెక్టార్ల ఇనుపగనులను విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయ ప్రకాశ్ నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనియాడారు

ERC to charge 70 paise per unit surcharge

యూనిట్ కు 70 పైసలు పెరగనున్న విద్యుత్ ఛార్జీలు

  విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాల ఆందోళనలు, నిరాహార దీక్షలు, బంద్ లతో కాస్త వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి యూనిట్ కు 70 పైసలు చొప్పున వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (ఈ.ఆర్.సి.) ప్రస్తుత చైర్మన్ రఘోత్తమరావు ఈ నెల 24వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈలోగానే విద్యుత్ ఛార్జీల పెంపు తీర్పు రాబోతోంది. సర్ ఛార్జీ (ఎఫ్.ఎన్.ఏ.) పేరిట ఈ.ఆర్.సి. 2012-2013 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడో అక్టోబరు, నవంబరు, డిసెంబరు(త్రైమాసికం)లో వాడిన విద్యుత్ కు ఒక్కొక్క యూనిట్ కు 70 పైసలు వసూలు చేయాలని నిర్ణయించింది. మొత్తం 850కోట్ల రూపాయలు సర్ ఛార్జీని ఈ.ఆర్.సి. విధించాబోతోంది. డిస్కంలు 1098కోట్ల రూపాయల ఇంధన సర్ ఛార్జీ వసూలుకు అనుమతి కోరాయి. దీని వసూలు జూన్ నెల బిల్లు నుంచి ఆగస్టు బిల్లు వరకు ఉంటుందని ఈ.ఆర్.సి. వసూలు చేసేందుకు సిద్ధమైంది.

parwez musharaf

పాక్ బోనులో చిక్కుకొన్న ముషారఫ్

  నాలుగేళ్ళ క్రితం దేశం విడిచి దుబాయ్ పారిపోయిన పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తనపై కోర్టుల్లో అనేక కేసులున్నాయని తెలిసికూడా ఆ దేశంలో వచ్చేనెలలో జరగనున్నసాధారణ ఎన్నికలలో పాల్గొనేందుకు కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్ తిరిగి వచ్చారు. ఆయన దేశంలో అడుగుపెడితే చంపకుండా వదిలిపెట్టమని తాలిబాన్ ఉగ్రవాదులు తీవ్రహెచ్చరికలు జారీ చేశారు.   కానీ, అల్లకల్లోలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో, దైర్యం చేసి వచ్చి ఎన్నికలలో పోటీ చేస్తే అవలీలగా విజయం సాదించి తిరిగి పాకిస్తాన్ దేశాధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలున్నట్లు భావించిన ముషారఫ్ దేశం కోసం అవసరమయితే ప్రాణ త్యాగాలకి కూడా వెనకాడనని భారీ డైలాగులు చెపుతూ బోనులోకి పులి ప్రవేశించినట్లు తిరిగి పాకిస్తాన్ లోకి అడుగుపెట్టారు.   ఆయన దేశాధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశంలో న్యాయ వ్యవస్థపట్ల కనీస మర్యాద, గౌరవం చూపకపోగా, 2007 ఎమర్జన్సీ సమయంలో ఒకేసారి 60 మంది జడ్జీలను ఉద్యోగాల నుండి తొలగించడమే కాకుండా వారిలో చాలా మందిని ఆయన జైళ్ళలో నిర్బంధించారు కూడా. అందువల్ల అతనిపై న్యాయవ్యవస్థ సైతం కక్ష కట్టిందిప్పుడు.   ఆయన దేశంలో అడుగు పెట్టగానే, అందరూ ఊహించినట్లే, కోర్టులు ఆయనపై ఉన్న కేసులన్నిటినీ బయటకి తీసి అతని చుట్టూ ఉచ్చుబిగించడం మొదలుపెట్టాయి. మొదట హైకోర్టు ఆయనకి వారం రోజులు బెయిలు మంజూరు చేసింది. ఆ సమయంలో దేశంలో నాలుగు చోట్ల నుండి ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేయబోతే పోలింగ్ అధికారులు మూడు చోట్ల వివిధ కారణాలతో తిరస్కరించగా మరో చోట ఆయన నామినేషన్ వేయడానికి అనర్హుడని కోర్టు ప్రకటించడంతో అక్కడ కూడా ఆయన నామినేషన్ వేయలేకపోయారు.   ముషారఫ్ పాకిస్తాన్ లో అడుగు పెట్టిన మరునాటి నుండే జడ్జీలను నిర్బందించిన కేసు, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో పై హత్యా యత్నం కేసులలోకోర్టుల తిరుగుతున్న ఆయన ఈరోజు మళ్ళీ తన బెయిలు పొడిగింపు కోరుతూ ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చినప్పుడు కోర్టు “ఆయన ఒక తప్పించుకొని పారిపోయిన ఖైదీ” అని, అటువంటి వ్యక్తికి బెయిలు మంజూరు చేయడం కుదరదని తేల్చి చెప్పి ఆయనని వెంటనే అరెస్ట్ చేయమని పోలీసులకి ఆదేశాలు ఇచ్చింది.   సాధారణంగా అటువంటప్పుడు ఎవరయినా పోలీసులకి లొంగిపోయి ఆ తరువాత పై కోర్టులో అప్పీలు చేసుకొంటారు. కానీ, కోర్టు అరెస్ట్ ఉత్తర్వులు జారీ చేయగానే ఆయన హడావుడిగా బయటకి వచ్చి, పోలీసులకు దొరక్కుండా తన అంగరక్షకుల సహాయంతో నగరం శివార్లలో ఉన్న చక్ షహాద్ అనే ప్రాంతంలో ఉన్న తన ఫాంహౌస్ కి తనకారులో పారిపోయారు.   ఆయన ఫాం హౌసులో ప్రవేశించిన కొద్దిసేపటికే పాకిస్తాన్ రెంజర్స్ ఆ ఇంటిని చుట్టుముట్టాయి. అయితే వారు ఇంతవరకు ముషారఫ్ ను అరెస్ట్ చేయలేదు. ప్రభుత్వం ఆయనను గృహనిర్బంధం చేయాలని ఆలోచిస్తునందున ఆయన అక్కడి నుండి తప్పించుకొని పారిపోకుండా ఈ ఏర్పాటు జరిగినట్లు సమాచారం.   ఇప్పుడు ఆయన పరిస్థితి మేకపిల్లను చూసి లొట్టలేసుకొంటూ వచ్చి బోనులో ఇరుకొన్న పులిలాగ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలలో పోటీ చేయడం సంగతి మాటెలా ఉన్నా, అందరి కళ్ళు గప్పి మళ్ళీ దేశం నుండి పారిపోగలిగితే, బ్రతికుంటే బలిసాకు తినయినా బ్రతకొచ్చునని ఆయన కోరుకొంటున్నారు. కానీ,యావత్ దేశం ఆయనపై కక్ష కట్టి ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ సారి తప్పించుకోవడం కష్టమే.ఆయనకు కోర్టు ఉరి శిక్ష విధించినా ఆశ్చర్యం లేదు.తన నేతృత్వంలో భారత్ పై చేసిన కార్గిల్ దాడికి చాలా గర్వపడే ముష్కర్ ముషారఫ్ ఇప్పుడు తానూ తవ్వుకొన్న గోతిలో తానేపడి ప్రాణభయంతో విలవిలలాడుతున్నారు పాపం!

Indian sentenced to jail for raping TV star

టీవి నటి పై అత్యాచారం, పదేళ్లు శిక్ష

        బ్రిటన్ లో టీవి నటి పై అత్యాచారం చేసిన కేసులో ఓ బారతీయ విద్యార్ధికి బ్రిటన్ కోర్ట్ పదేళ్ళ జైలు శిక్ష విదించింది. పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న టీవి నటి మద్యం సేవించి హోటల్ గదిలో నిద్రిస్తుండగా అత్యాచారానికి గురైంది. తాను మద్యం మత్తులో నిద్రిస్తుండగా తనపై జాన్ సోబి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె లండన్ పోలీసులకు పిర్యాదు చేసింది. ఆమె పిర్యాదు మేరకు కోర్ట్ విచారణకు ఆదేశించింది. టెలివిజన్ స్టార్ పై అత్యాచారం చేసినట్లు జాన్ సోబి విచారణంలో అంగీకరించాడు. హోటల్ సిబ్బంది సహాయంతో ఆమె గదిలోకి ప్రవేశించిన జాన్ మద్యం మత్తులో వున్న నటి పై అత్యాచారం జరిపినట్లు కోర్ట్ కి వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో అతనికి పదేళ్లు శిక్ష విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత సోబీ జాన్‌ను భారతదేశానికి పంపించనున్నట్లు బ్రిటిష్ టాబ్లాయిడ్ 'ది సన్' రాసింది.

 Cm kirankumar reddy missing two hours from ap bhavan

ఢిల్లీ లో మాయమైన ముఖ్యమంత్రి

        ఢిల్లీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండు గంటల పాటు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా వదిలిపెట్టి ఎవరికి చెప్పా పెట్టకుండా మాయమైపోయాడు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరికీ సమచారం ఇవ్వకుండా రెండు గంటల పాటు ఎవరికీ తెలియని చోటుకు వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. గురువారం ఉదయం ఆయన సెక్యురిటీ ఎవ్వరూ తోడు లేకుండా, ఎవరికీ చెప్పా పెట్టకుండా ఆయన ఓ ప్రైవేట్ వాహనంలో బయటకు వెళ్లిపోయారు. ఎపి భవన్‌లో ఉన్న ఆయన సెక్యురిటీ సిబ్బందికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా బయటకు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి ఎక్కడు వెళ్లారు, ఎవర్ని కలిశారు అనేది తెలియడం లేదు. ఈ విషయం తీవ్ర ఉత్కంఠకు కారణమైంది.

congress meeting

డిల్లీ సమావేశంలో తేల్చేదేమిటి

  ఈ రోజు డిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. సబితా ఇంద్రరెడ్డిపై సీబీఐ చార్జ్ షీటు దాఖలు చేసినందున ఆమెను పదవి నుండి తొలగించాలనే విషయంపై ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ కి తలొగ్గబోమని మొన్ననే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గులాం నబీ ఆజాద్ స్పష్టం చేసినందున ఆమెను హోంమంత్రి పదవినుండి వేరే శాఖకు మార్చి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభ్యంతరం చెప్పకపోతే బొత్ససత్యనారాయణకు ఆ పదవి కట్టబెట్టవచ్చును.   ఈ సమావేశంలో కేవలం పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ పదవి మార్పు విషయమే ప్రధాన చర్చాంశం కావచ్చును. ఇప్పటికే మాజీ పీసీసి అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ డిల్లీకి ఆహ్వానించబడ్డారు గనుక, బొత్స స్థానంలో ఆయనను నియామకం ఖరారు చేసి, బొత్సకు తగిన ఉపాధి చూపడమే ప్రధాన అజెండాగా సమావేశం జరుగవచ్చును. తద్వారా, ఒకేసారి మూడు అంశాలు పరిష్కరించినట్లవుతుంది. బొత్సకు మంత్రి పదవి, సబితకు శాఖా మార్పు, పీసీసీ కొత్త అధ్యక్షుని నియామకం జరుగుతాయి. నేరారోపణలు ఎదుర్కొంటున్న సబితా ఇంద్రారెడ్డిని వెనకేసుకు వస్తూనే, తనను దిక్కరిస్తున్నాడనే కారణంతో ఆరోగ్య శాఖామంత్రి డా. డీ.యల్.రవీంద్రారెడ్డిని పదవి నుండి తొలగించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరనున్నట్లు వార్తలు రావడం విశేషం.   ఇక పార్టీ నుండి తెరాసలోకి వలసల గురించి, జగన్ మోహన్ రెడ్డితో, అతని పార్టీతో ఏవిధంగా వ్యవహరించాలనే విషయం కూడా ఈ సమావేశంలో చర్చించవచ్చును. అదే విధంగా తిరుగుబాటు యం.యల్.యేలపై అనర్హత వేటు వేయాలా వద్దా? వేస్తే ఎప్పుడు వేయాలి? అనే అంశం కూడా వారి మద్య చర్చకు రావచ్చును. అయితే, కాంగ్రెస్ పధ్ధతి ప్రకారం ముఖ్యమయిన అన్ని విషయాల గురించి కేవలం చర్చలు మాత్రమే చేసి నిర్ణయాలు మాత్రం తీసుకోకపోవచ్చును.

Telugu writer Dr Ravuri Bharadwaja chosen for Jnanpith award

రావూరి భరద్వాజను వరించిన జ్ఞానపీఠ్ అవార్డు

  86 ఏళ్ళ ప్రఖ్యాత తెలుగు సాహితీవేత్త రావూరి భరద్వాజ తన సాహితీ ప్రస్థానంలో ఇప్పటివరకు 37కు పైగా కథల సంపుటాలు, 17 నవలలు రాశారు. సినిమా (అథో)జగత్తుపై ఆయన రాసిన పాకుడురాళ్ళు, జీవన విజయంపై అందించిన కాదంబరి నవలలు ఆయనకు ఎనలేని పేరుప్రతిష్ఠలు సాధించిపెట్టాయి. ప్రముఖ ఒరియా కవి సీతాకాంత్ మహాపాత్ర నేతృత్వంలోని జ్ఞానపీఠ అవార్డు కమిటీ 2012కి గాను రావూరి భరద్వాజను ఎంపిక చేసింది. భారతీయ సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠం అవార్డు సొంతం చేసుకుంటున్న తొలి తెలుగు వచన రచయిత రావూరి భరద్వాజ. తెలుగులో ఇదివరకు 1970లో జ్ఞానపీఠం సాధించిన విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షం, 1988లో డాక్టర్ సి.నారాయణ రెడ్డి విశ్వంబర ... కవితా వాక్యాలే.భరద్వాజ రచనలు పలు విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశాలుగా, పరిశోధకులకు ఆధారాలుగా నిలిచాయి. భరద్వాజకు పలు రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు గెలుచుకున్నారు. సోవియట్ ల్యాండ్ అవార్డు, తెలుగు అకాడమీ, బాల సాహిత్య పరిషత్ అవార్డులూ అందుకున్నారు.

Karnataka Ex-Governor V S Ramadevi passes away

మాజీ గవర్నర్ వి.ఎస్. రమాదేవి మృతి

  కర్నాటక మాజీ గవర్నర్ వి.ఎస్. రమాదేవి (78) పదేళ్ళ క్రితం గవర్నర్ గా పదవీ విరమణ చేసిన తరువాత హైదరాబాద్ లో ఉంటున్నారు. రమాదేవి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోనే ఉంటున్న తన సోదరితో మాట్లాడుతూ ఉన్నట్లుండి ఛాతీ పట్టుకుని పక్కకు ఒరిగిపోయారు. చికిత్స కోసం కుటుంబసభ్యులు ఆమెను సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించే సరికే తుదిశ్వాస విడిచారని వైద్యులు నిర్థారించారు. రమాదేవి దేశ చరిత్రలోనే మొట్టమొదటి కేంద్ర ఎన్నికల కమీషనర్ గా సేవలందిచిన మహిళగా గుర్తింపు పొందారు. తరువాత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా, కర్నాటక గవర్నరుగా సేవలందించారు. రమాదేవి పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు లో 1934 జనవరి 15న జన్మించారు. సివిల్ సర్వెంట్ గా, ఆబ్కారీ సీఏటీ జ్యుడిషియల్ సభురాలిగా, రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా ఉన్నత హోదాలో సేవలు అందించారు. రమాదేవి ప్రస్తానం హైదరాబాద్ లోనే జరిగింది. హైదరాబాద్ లోని ఆకాశవాణి రేడియోలో  పిల్లల కార్యక్రమం ద్వారా రచయిత్రిగా ప్రస్థానం ఆరంభించారు. రేడియోలో పనిచేస్తున్న సమయంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, గోపీచంద్, స్థానం నరసింహారావు లాంటి పరిచయంతో తానూ రచయితగా రాణించారు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి పత్రికల్లో వివిధ వ్యాసాలూ నిర్వహించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఎర్రగడ్డ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

kcr

తెదేపా నేతకి గాలం వేస్తున్న కేసీఆర్

  తెరాస అధ్యక్షుడు కేసీఆర్ హుషారుగా మొదలుపెట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష’ అటు ఎదుట పార్టీలలోనే కాకుండా స్వంత పార్టీలో కూడా చిచ్చుపెట్టడంతో కొంచెం వెనక్కి తగ్గక తప్పలేదు. అయినప్పటికీ, ఆయన ఆ ఆకర్షణలోనుండి ఇంకా బయటపడనట్లున్నారు. ఆయన చొప్పదండి నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెదేపా శాసనసభ్యుడు సుద్దాల దేవయ్యతో మొన్నరాత్రి మెదక్ జిల్లాలో జగదేవ్ పూర్ లోగల తన ఫాంహౌసులో దాదాపు అర్ధగంట పైగా రహస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఆ విషయాన్ని కేసీఆర్ కానీ, దేవయ్య గానీ దృవీకరించలేదు. వారు దృవీకరించకపోయినప్పటికీ, గతంలో తెదేపా నుండి తెరాసలోకి మారిన హరీశ్వర్ రెడ్డి వ్యతిరేఖిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.   అదేవిధంగా కేసీఆర్ ఇప్పటికీ కాంగ్రెస్ నేతలతో పూర్తీ ‘టచ్’ లోనే ఉన్నట్లు సమాచారం. ఈ నెల 27న అర్మూరులో పార్టీ 12వ వార్షికోత్సవ సభ నిర్వహిస్తునందున ఆలోగా తెరాసలో ఎవరెవరు చేరబోతున్నారనే విషయం స్పష్టం అయ్యే అవకాశాలున్నాయి. రాబోయే ఎన్నికలకు పోటీ చేయనున్న అభ్యర్ధుల మొదటి లిస్టును మేనెలాఖరులోగా విడుదల చేయ నున్నట్లు తెరాస ఇదివరకే ప్రకటించింది గనుక ఆలోగా మిగిలినవారు ఎవరయినా ఉంటే వారు కూడా ఆలోగా తెరాసలో చేరుతారని కేసీఆర్ భావిస్తున్నారు.

jagan is ghaznavi says ED Lawyer

మొహమ్మద్ గజ్నివీ చరిత్రను జగన్ పునరావృత్తం చేశారు

  మొహమ్మద్ గజ్నవీ చరిత్రను జగన్ పునరావృత్తం చేశారు ... వ్యవస్థను తనకు అనువుగా మార్చుకున్నారు అని ఈడీ లాయర్ విపుల్ కుమార్ తెలిపారు. ఈ వ్యాఖ్యలను హైకోర్టు చేసిందా? అని ధర్మాసనం ప్రశ్నించగా ... "హైకోర్టు నేరాన్ని గుర్తించింది. హైకోర్టు వైఖరి ఆధారంగా నేనీ వ్యాఖ్యలు చేస్తున్నాను అని, తండ్రి అధికారంలోకి రాగానే జగన్ సంపద కూడగట్టారు, ప్రభుత్వ భూ కేటాయింపులు, సెజ్ లు, రియల్ ఎస్టేట్ అనుమతులు, కాంట్రాక్టులు, మైనింగ్ తవ్వకాల అనుమతుల్లో అవినీతికి పాల్పడ్డారని, తండ్రి అధికారాన్ని అడ్డం పట్టుకుని భారీగా అవినీతికి పాల్పడినందునే జగన్ ను గజ్నవీతో పోల్చాను అని విపుల్ ధర్మాసనానికి విన్నవించారు. జగన్ అక్రమాస్తుల కేసులో జనవరి 8వ తేదీనాటి రూ.143.74 కోట్ల విలువైన ఆస్తుల జప్తుపై ఈడీ న్యాయ ప్రాధికార సంస్థ సభ్యులు పి.జె.శర్మ, రామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం ఎదుట బుధవారం తుది వాదనలు జరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను తనకు ఇష్టం వచ్చినట్లు మార్చుకుని, ప్రజాధనాన్ని దోచుకున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) స్పష్టం చేసింది. నేరుగా లంచాలు తీసుకుంటే అవినీతి నిరోధక చట్టం కింద దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 36 కంపెనాలను సృష్టించి ముడుపులకు పెట్టుబడుల రూపం ఇచ్చారని, జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టినవారంతా ప్రభుత్వం నుంచి లబ్ది పొందినవారేనని, లంచాలను షేర్ల కొనుగోలుకు చెల్లించారని ఈడీ తరపు న్యాయవాది ధర్మాసనం ముందు వాదించారు. వైఎస్ అధికారంలోకి రాకముందు వారి ఐటీ రిటర్న్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని, 36పైగా కంపెనీలను ప్రారంభించిన జగన్ అవినీతి సొమ్మును పెట్టుబడుల రూపంలో మళ్ళించారని, జగతి పబ్లికేషన్స్ లోకి కూడా ఇదే తరహాలో నిధులు మళ్ళించారని ఈడీ తరపు న్యాయవాది విపుల్ కుమార్ తెలిపారు. జగతి ఆస్తుల విలువపై డెలాయిట్ నివేదిక తప్పుల తడక అని జగన్, విజయసాయి రెడ్డి ఒత్తిడి మేరకే ఈ నివేదిక తయారు చేశారని తెలిపారు. ధర్మాసనం సభ్యుడు రామ్మూర్తి కల్పించుకుని "ఆస్తులను మదింపు చేసే కంపెనీల కారణంగానే అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి, సత్యం కుంభకోణంలో జప్తు సందర్భంగా సంబంధిత ఆడిటింగ్ సంస్థపై భారీ జరిమానా విధించాలని సిఫారసు చేశానని ఆయన గుర్తు చేశారు. విపుల్ కుమార్ వాదించుతూ సిబీఐ జగతి అప్బ్లికేశంస్ ఆస్తులను ఎస్.బి.ఐ. క్యాపిటల్ సంస్థ చేత ముదింపు చేయించిందని, ఈ సందర్భంగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.

T Subbirami Reddy Firm On Contesting From Vizag

సిఎంపై ఒత్తిడి తెస్తున్న సుబ్బిరామి రెడ్డి

  కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు నెల్లూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ సారి తాను విశాఖపట్నం నుండి పోటీ చేస్తున్నాని, తాను రాజ్యసభకు ఎన్నిక అవడంవల్ల పురందీశ్వరి విశాఖపట్నం నుండి పోటీ చేశారని, వచ్చే ఎన్నికల్లో పురందీశ్వరి నరసరావుపేట నుండి పోటీ చేయనున్నారని అందుకు ఆమె సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 32 ఏళ్ళుగా తనకు విశాఖపట్నం ప్రజలతో ప్రేమానుబంధాలు ముడిపడి వున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే తాను మైనారిటీ, మత్సకారులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, క్రీడాకారుల కమిటీలను ఎప్పుడో నియమించానని, వంద మందిరాలు, వంద చర్చిలను, వంద మసీదులను పునర్మిస్తున్నానని చెప్పారు. అలాగే తాను మైనారిటీ, అట్టడుగు, అణగారిన వర్గాల కోసం లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నాని తెలిపారు. ఈ నెల 28న ఎస్సీ, ఎస్టీలతో ఏర్పాటు చేసిన సమావేశానికి రావాల్సిందిగా పిసిసి చీఫ్ బొత్సా సత్యనారాయణను ఆహ్వానించడానికి తాను కలిసానని తెలిపారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, బొత్సా సత్యనారాయణను సుబ్బిరామిరెడ్డి వేరువేరుగా కలిసి సమావేశమయ్యారు.

TDP Telangana Forum press conference at TDLP office

కెసిఆర్ పై తెలంగాణా టిడిపి నేతల ధ్వజం

  ఎన్టీఆర్ భవన్ లో బుధవారం తెలంగాణా టిడిపి నేతలు టిడిపి తెలంగాణా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్, శాసనసభాపక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు, టిడిపి అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమాన్ని గాలికి వదిలేసి ఇతర పార్టీల నాయకుల కోసం వెంపర్లాడుతున్న కెసిఆర్ రాజకీయ వ్యభిచారి అని, లాబీయింగ్ తోనే తెలంగాణా వస్తుందని కొంతకాలం, ఉద్యమం చేస్తేనే తెలంగాణా వస్తుందని మరికొంతకాలం, వంద సీట్లు వస్తేనే తెలంగాణా వస్తుందని కొన్ని రోజులు, తాజాగా ఇప్పుడు పక్క పార్టీలవారికోసం పాకులాడుతున్నాడని ధ్వజమెత్తారు. టిడిపి తెలంగాణాకోసం లేఖ ఇచ్చింది, రాజీనామాలు చేసింది, ఉద్యమాల్లో పాల్గొంది. అయినా కెసిఆర్ టిడిపిని శత్రువుగా చేసి, కాంగ్రెస్ ను కాపాడే ప్రయత్నం చేశారు అని ఎర్రబెల్లి దయాకర్ ఘాటుగా విమర్శించారు. మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ చేతగాని దద్దమ్మలు, చవటలే కెసిఆర్ పంచన చేరుతున్నారు, అచ్చమైన టిడిపి వాడెవడూ చేరట్లేదు, కెసిఆర్ మరోసారి తెలంగాణా ప్రజలను దొరలపాలన కిందకు తీసుకెళ్ళాలని చూస్తున్నాడు, తెలంగాణా వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటున్నాడు కదా మరి గద్దర్ పేరు పకతించాలి లేదా విమలక్క పేరు ప్రకటించాలి, రాష్ట్రంలో కెసిఆర్, వైఎస్ కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని, ఒక కుటుంబం లక్షల కోట్లు సంపాదిస్తే మరొక కుటుంబం వేల కోట్లు సంపాదించిందని, ఒకప్పుడు ఇతర పార్టీల నాయకులంటే లెక్కలేనట్టు మాట్లాడిన కెసిఆర్ ఇప్పుడు తన పార్టీలోకి రమ్మని వారి గడపగడపకూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు

bjp

బీజేపీ పాలిట సైంధవుడిలా తయారయిన నితీష్ కుమార్

  దేశంలో స్పష్టంగా కనిపిస్తున్న కాంగ్రెస్ వ్యతిరేఖతను, అదే సమయంలో తమ పార్టీ నాయకుడు నరేంద్ర మోడీకి అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని చూసి రాబోయే ఎన్నికలలో ఆయనను ముందు పెట్టుకొని అవలీలగా విజయం సాదించి కేంద్రంలో అధికారం కైవసం చేసుకోవచ్చునని బీజేపీ ఆవేశపడిపోతుంటే, తమ ఎన్డీయే భాగస్వామి జేడీయు పార్టీ నాయకుడు మరియు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైంధవుడిలా అడ్డుపడుతుండటంతో, తన నోటికాడ కూడు లాగేసుకొన్నట్లు బీజేపీ విలవిలలాడుతోంది.   ఇటు నరేంద్ర మోడీని వదులుకోలేక, అటు 40మంది లోక్ సభ సభ్యుల మద్దతు అందించే నితీష్ కుమార్ ను వదులుకోలేక దిక్కుతోచని స్థితిలో ఉంది. వచ్చేనెల కర్ణాటక శాసన సభ ఎన్నికలలో నరేంద్ర మోడీ ప్రధాన పాత్ర పోషించి తన సత్తా ఏమిటో దేశప్రజలకు మరో మారు చాటిచెపుతారని అందరూ ఊహిస్తున్న తరుణంలో, జేడీయు హెచ్చరికలకు జడిసిన బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మీడియా ప్రశ్నకు బదులిస్తూ నరేంద్రమోడీ ఒక్క కర్ణాటకలోనే కాదు లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకుని దేశమంతటా కూడా ప్రచారంలో   పాల్గొంటారని చెప్పారు. ఆయనకు కర్ణాటక ఎన్నికల బాధ్యతను పూర్తిగా అప్పగించేస్తున్నట్లు ప్రకటిస్తే, అది మిత్రపక్షమయిన జేడీయును ఇప్పటి నుంచే దూరం చేస్తుందనే భయంతోనే ఆవిధంగా చెప్పుకోవలసి వచ్చింది. అంటే కర్ణాటక ఎన్నికలు మోడీకి ప్రత్యేక బాధ్యత కాదని మిగిలిన ఎన్నికలలాగే ఇక్కడా ఆయన ప్రచారం చేస్తారని చెప్పుకోవలసిన దుస్థితిలో బీజేపీ ఉందిప్పుడు. అదేవిధంగా మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎప్పుడు ప్రకటిస్తారు అనే మీడియా ప్రశ్నలకు చిరుబుర్రులాడుతూ ‘నేను పార్టీ అధ్యక్షుడిని’ అంటూ అసందర్భం సమాధానం చెప్పారు.   ఇక మోడీ ప్రధాని అభ్యర్థిత్వానికి తీవ్ర అభ్యంతరం చెపుతున్న నితీష్ కుమార్ ఎన్డీయే నుంచి జారిపోకుండా కాపాడుకోవాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే, ఆయనకి ఎలాగయినా వలవేసి పట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పనిలో పనిగా నితీష్ కుమార్ ను తీవ్రంగా వ్యతిరేఖించే లాలూ ప్రసాద్ ను కూడా దువ్వుతోనే ఉంది.   తమను ఈ విధంగా ఇబ్బందిపెడుతున్నందున బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని అక్కడి స్థానిక నేతలు కోరుతున్నారు. కానీ, ఆయనతో తమకున్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఆ సాహసం చేయలేకపోతోంది. ఒకవేళ తాము మద్దతు ఉపసంహరించుకొంటే వెంటనే ఆయన ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి కాంగ్రెస్ కాసుకొని కూర్చొని ఉండటంకూడా దాని భయానికి మరోకారణం. ఏది ఏమయినప్పటికీ, బహుశః ఎన్నికల ప్రకటన వెలువడే వరకు బీజేపీలో ఈ సందిగ్ధత తప్పదు. అప్పటికయినా ఆ పార్టీ దైర్యంగా నిర్ణయం తీసుకొంటుందో లేదో చూడాలి.   ఇటువంటి సందిగ్ధ పరిస్థితికి కారణమయిన నరేంద్రమోడీకే ఈ సమస్య పరిష్కరించే బాధ్యత కూడా అప్పగించితే ఆయన తన సామర్ధ్యం నిరూపించుకొనే అవకాశం ఉంటుంది. తద్వారా ఆయన ప్రధాని పదవికి అర్హుడో కాదో స్వయంగా నిరూపించుకోవచ్చును.

Serial Bomb Blasts in Bangalore

బెంగళూరు లో వరుస బాంబు పేలుళ్ళు

  కర్ణాటక ఎన్నికలకు మరో ఇరవై రొజులు మాత్రమే ఉన్న సమయంలో మల్లెశ్వరంలోని భారతీయ జనతాపార్టీ కార్యాలయంలో పేలుడు జరిగిన కొద్ది గంటలలోనే హెబ్బల ఫ్లై ఓవర్ ప్రాతంలో మరో పేలుడు సంభవించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలోని భారతీయ జనతాపార్టీ కార్యాలయం ఎదుట ఓ ద్విచక్ర వాహనంపై బాంబు ఉంచడంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పదకొండు మందికి గాయాలయ్యాయి. అందులో ఎనిమిది మంది పోలీసులు ఉండడం విశేషం. పెబ్బల పేలుడులో పదహారుమందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిసింది. దీంతో పోలీసులు బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

సబితా దోషే ... సిబీఐ

  అక్రమాస్తుల కేసులో జగన్ ను ఎ1గా, విజయసాయిరెడ్డిని ఎ2గా, సబితా ఇంద్రారెడ్డిని ఎ4గా సిబీఐ దాఖలు చేసిన ఐదవ ఛార్జిషీటులో చేర్చడం తెలిసిందే. వై.ఎస్. రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో గనులశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి అధికారాన్ని దుర్వినియోగం చేశారని, దాల్మియా సిమెంట్స్ కు సున్నపురాయి లీజుల బదలాయింపుపై కుట్రపూరితంగానే నిర్ణయం తీసుకున్నారని సిబీఐ ఘంటాపథంగా చెబుతోంది. అలాగే సబితా ఇంద్రారెడ్డి జయా మినరల్స్ కు ఇచ్చిన ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ ను మూడు నెలల్లో ఈశ్వర్ సిమెంట్స్ కు బదలాయించే ఫైలుపై సంతకం చేసినట్టు సిబీఐ తన ఛార్జిషీటులో పేర్కొంది. మినరల్స్ యాక్ట్ ప్రకారం 1960 రూల్ 9ని ఉల్లంఘించడమేనని సిబీఐ తేల్చింది. 2006 14 జులై జివో 183 జారీ చేశారని సిబీఐ తెలిపింది. సిబీఐ దాఖలు చేసిన ఐదవ ఛార్జిషీటులో సబిత కడప జిల్లాలోని 407 హెక్టార్ల ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ను జయా మినరల్స్ కు కేటాయిస్తూ సబితా ఇంద్రారెడ్డి ఆర్డర్స్ జారీ చేసిందని, ఒప్పందం కుదుర్చుకున్న మూడు నెలల్లోనే ప్రాస్పెక్టింగ్ ఈశ్వర్ సిమెంట్స్ కు బదలాయించాలనే నిబంధన పెట్టి దానికి అనుగుణంగానే లీజు జయా మినరల్స్ నుంచి ఈశ్వర్ సిమెంట్స్ కు బదిలీ అయ్యింది. అనంతరం ఈశ్వర్ సిమెంట్స్ లీజు దాల్మియా సిమెంట్స్ కు మారింది. ఇది చట్టవిరుద్దమని అని సబితా ఇంద్రారెడ్డి  గురించి సిబీఐ తెలిపింది.

భారీగా హెచ్1 బీ వీసాల పెంపు

  అమెరికాలోని రెండు ప్రధాన పార్టీలు రిపబ్లికన్, డెమోక్రాట్లు 30 ఏళ్ళ తరువాత వలస చట్టాలను సవరిస్తున్నారు. ఎగువసభ సెనెట్ లో ఇరు పార్టీలకు చెందిన ఎనిమిదిమంది సభ్యులు బిల్లుపై నెలల తరబడి కసరత్తు చేసి దశాబ్దాలుగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న లక్షలమంది మెక్సికన్ల పౌరసత్వ సమస్యను వలస చట్టాలను సవరిస్తున్నారు. ప్రస్తుతం 65వేలు ఉన్న హెచ్ 1బీ వీసాలను 1.1 లేదా 1.8 లక్షలకు పెంచాలని యోచిస్తున్నారు. ఈ పరిణామం భారతీయ ఐటీ నిపుణులకు తీపి కబురే. అమెరికాలో పనిచేస్తున్న టిసీఎఫ్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి భారతీయ ఐటీ కంపెనీలో అమెరికాయేతర ఉద్యొగూ 30 శాతం దాటితే ఒక్కో ఉద్యోగికి కొంత అపరాధ రుసుమును ఆ కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీల  అమెరికా శాఖల్లో 75 శాతం కంటే ఎక్కువమంది భారతీయులే ఉన్నారు. ఈ కంపెనీలు ఇక కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వాలన్నా అది అమెరికన్లకే ఇవ్వాల్సి ఉంటుంది.

పెళ్ళిపందిరికీ తప్పని "పన్ను"పోటు

  సామాన్యప్రజలకు ప్రభుత్వం అనేక విధాలుగా పన్నులు వేసి బాదుతోంది. ఇప్పుడు తాజాగా ఎక్సైజ్, కస్టమ్స్ పన్నుల కేంద్రమండలి ఇంటిముందు పెళ్ళిపందిరి, షామియానా వేసినా ఈ సేవలకు గాను 12 శాతం పన్ను చెల్లించాల్సిందేనని అంటోంది. పెళ్ళిపందిరే కాదు షామియానా వేసినా దానికీ సేవాపన్ను వర్తిస్తుందని తేల్చిచెప్పింది. వేడుక జరుపుకొనే స్థలం, పందిరి లేదా షామియానా విస్తీర్ణం, నిర్వహణ తీరును బట్టి పన్ను విధింపు ఉంటుందని ఒక ప్రకటనలో తెలియచేసింది. వేడుకపందిరి, షామియానా నెలకొల్పిన నిర్ణీత ప్రదేశంలో విద్యుత్ అలంకరణాలు, లౌడ్ స్పీకర్లు, భోజన ఏర్పాట్లు, ఫర్నీచర్ తదితర సేవల వినియోగం జరుగుతుంది కాబట్టి అక్కడ జరిగే కార్యకలాపాలన్నీ సేవాపన్ను పరిథిలోకే వస్తాయని ఎక్సైజ్, కస్టమ్స్ పన్నుల కేంద్రమండలి స్పష్టం చేసింది.