తెలంగాణ అసాధ్యం!
- ఎబికె ప్రసాద్
{సీనియర్ సంపాదకులు]
తెలుగుజాతిని విచ్చిత్తి లక్ష్యంగా రాజకీయ నిరుద్యోగులు, 'చేతబడి' రాజకీయాలూ కొన్నాళ్ళుగా ప్రారంభించి కొనసాగిస్తున్న 'ప్రత్యేక తెలంగాణా' ఉద్యమం ప్రస్తుతం చీలబాటలు పట్టింది. తెలుగుజాతిని చీల్చబోయి ఉద్యమమే రెండు మూడు పాయలుగా బద్దలైంది. ఇందులో ఒక 'పాయ'కు కాంగ్రెస్ నాయకత్వంతో లోపాయికారీగా మిలాఖత్ అయిన తన టి.ఆర్.ఎస్. పార్టీ రానున్న (2014) ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తుంది, అటు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ తో గాని, ఇటు బి.జె.పి.తో గాని, కమ్యూనిస్టు (సి.పి.ఐ.) పార్టీతో గానీ ఎలాంటి పొత్తుపెట్టుకోకుండానే పోటీ చేస్తుందని 'బొబ్బిలిదొర' కెసిఆర్ ప్రకటించాడు.
కాగా, మొదట్లో కెసిఆర్ తో కలిసి ప్రొఫెసర్ కోదండరామ రెడ్డి ఏర్పాటు చేసిన సంయుక్త కార్యాచరణ సంఘం, ఇప్పుడు బయటికి ప్రకటించకపోయినా కె.సి.ఆర్. వర్గానికి దూరంగా ఉంటూ సొంత ఎజెండాతో ఉద్యమం పేరిట ఢిల్లీలో "జంతర్ మంతర్''లో గత నెల 29న "రెండురోజుల'' సత్యాగ్రహం తలపెట్టింది. అయినా కేంద్రప్రభుత్వం "తెలంగాణా రాష్ట్రం'' ఏర్పాటుకోసం ఎలాంటి ఆసక్తి కనబరచకపోవటంతో కోదండం వర్గం హతాశులై తిరిగి ఇంటికి చేరింది. ఇక జంతర్ మంతర్ 'దీక్ష'కు మద్ధతు పలికిన పార్టీలు, నాయకులు ఎవరు? తాడూ బొంగరం లేని పక్షాలు. పది-పదిహేను ఏళ్ళ నాడు కాకినాడ సభలో తెలంగాణా ఏర్పాటుకు హామీపడి, తీరా కేంద్రంలో తన ప్రభుత్వం ఏర్పరచి అయిదేళ్ళు కొనసాగించుకున్న బిజెపి-ఎన్.డి.ఎ. పరివార్ ముఠా ఆ హామీని అమలుపరచకుండా తప్పుకుంది. అయినా బిజెపి ఈసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే (ఆ అవకాశాలు కన్పించడంలేదు) గిస్తే మూడు మాసాల్లోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని మరోసారి 'మాట' వదిలింది.
ఇక "దీక్ష"కు మద్ధతు పలకడానికి వచ్చిన వారిలో - ఒకే ఒక పార్టీ సభ్యుడిగాను, అధ్యక్షుడుగానూ మిగిలిపోయిన "జనతా పార్టీ'' నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి ఒకడు. ఇతడు భారత రాజేకీయాల్లో ఆధునిక శకుని! ఇక కోదండం వర్గానికి మద్ధతు తెల్పడానికి చేరినవారిలో మరో వ్యక్తి భారత కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం ప్రతాప రెడ్డి ఒకరు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించడమేగాక బ్రిటిష్-నిజాం పరాయి పాలనల మూలంగా చెల్లాచెదురై పరాయి పంచాల్లో బతుకులీడ్చిన ప్రాచీన చరిత్రగల తెలుగుజాతినంతటినీ ఏకంచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణకు కారకులయిన కమ్యూనిస్టు పార్టీ తరువాతి కాలంలో రాజకీయంగా పతనం కావడం, ఆ పతన రాజకీయంలో భాగంగా ఉనికికోసం తెలంగాణా వేర్పాటువాదాన్ని భుజాన వేసుకోవడంతో ప్రజలలో విశ్వాసం కోల్పోయింది. శాసనవేదికలో ప్రాతినిధ్య పరంగానూ అతి బలహీనశక్తిగా మనుగడ సాగిస్తూ వచ్చిన పార్టీకి సురవరం కార్యదర్శి!
కాంగ్రెస్ ప్రభుత్వం (కేంద్రం)లో భాగస్వామిగా ఉన్న పవార్ ఎన్.సి.పి. పార్టీ సంఖ్యాపరంగా బలహీనమైన పక్షం. కోదండం దేక్షకు మద్ధతిలిచ్చిన బాపతు బలం ఇదీ! "తెలంగాణా వాదాన్ని బలంగా చాటేందుకు'' హస్తినకు చేరిన సంసద్ యాత్ర అలా ముగిసింది! కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను విలీనం చేయడానికి సిద్ధమైన కెసిఆర్ పార్టీకి చెందిన మరొక "నోటి దురుసు'' వ్యక్తి ఈటెల "కాంగ్రెస్ కు గోరీ'' కడతామని ప్రగల్భించాడు! 'ఈటెల'వారు సంసద్ యాత్రలో పాల్గొన్నది తెలంగాణా రాష్ట్రం కోసం కాదు, కెసిఆర్ పెంచుకున్న "పలుకుబడి''ని కాస్తా కోదండం కొట్టేయకుండా "చెక్'' చేయడానికే గాని మరొకందుకు కాదు. ఇక వేర్పాటు ఉద్యమానికి మద్ధతు పలికిన మరొక పార్టీ 'లెటర్ హెడ్' పార్టీగానే మిగిలిపోయిన ఫార్వర్డ్ బ్లాక్!
ఇక వేర్పాటువాదానికి మద్ధతు చెబుతున్న ఈ అమాం బాపతు రాజకీయ నిరుద్యోగులు రేపటి ఎన్నికలకోసం ప్రజలకు చేస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలూ కోటలు దాటిపోతున్నాయి. వీళ్ళందరి నినాదం ఒక్కటే - "సీమాంధ్రుల దోపిడీ నుంచి విముక్తి పొందడమే లక్ష్యం''! కాని ప్రాంతీయ పెట్టుబడిదారుల దోపిడీ నుంచి విమోచన పొందేది ఎప్పుడో వీళ్ళు చెప్పరు. ఈ చిల్లర మల్లర రాజకీయ నిరుద్యోగులందరికి - తెలంగాణలో దశాబ్దాలుగా తిష్ఠవేసి తెలంగాణా దళిత బహుజన వర్గాల ప్రజల మూల్గుల్ని పీల్చిపిప్పిచేసిన దొరలు, జాగిర్దార్లు, భూస్వామ్య స్థానిక పెట్టుబడిదారులతో పాటు అదే దోపిడీకి, దోపిడీ రాజకీయాలకూ నాయకత్వం వచించిన మహారాష్ట్ర, పంజాబీ, రాజస్థానీ, సింధీ, కర్ణాటక పెట్టుబడుదారులు తమ శ్రేయోభిలాషులై తోటి సహోదర సహోదరులయిన తెలుగుప్రజలు కాకుండా పోయారు! దూరదృష్టిలో కొరవడిన ఈ దుర్మార్గపు రాజకీయానికి పునాదులన్నీ - వేర్పాటువాదులు తమ స్వార్థప్రయోజనాల కోసం తలపెట్టిన విషప్రచారంలోనే ఉన్నాయి. తెలంగాణలోనూ, ఇతర తెలుగు ప్రాంతాలలోనూ ఉన్న తెలుగువారంతా శాతవాహనుల కాలంనుంచీ ఆదాన ప్రదానాలుగా అటువాడు ఇటూ, ఇటువారు అటూ వలసపోయిన ప్రవాసులూ, నివాసులేనని మరవరాదు!
"పచ్చని తెలంగాణా రాష్ట్రం నా కల'' అని ఎన్నికల నినాదంగా చేపట్టిన కె.సి.ఆర్. పుట్టుపూర్వాలన్నీ "అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక'' అన్నట్టుగా ఉత్తరాంధ్ర ప్రజలకు బాగా తెలుసు. అందువల్ల ఇతగాడు ఉద్దేశించిన లక్ష్యం అధికారం కోసం తన "కుటుంబ పచ్చదనమే'' గాని తెలంగాణా ప్రాంత పచ్చదనం మాత్రం కాదని! జాతిని చీల్చే విద్వేష ప్రచారంగాని, ప్రజల ఐక్యతను భంగపరిచే ప్రకటనలుగానీ, మత విద్వేష ప్రచారంగానీ రాజ్యాంగ విరుద్ధచర్యలుగా భావించి అలాంటి వారిని శిక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యంతో ముందుకు రావాలని కొలది రోజులనాడే (ఏప్రిల్ లో) సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని మరవరాదు. ఒక వైపున పంటలు కోల్పోయి, అప్పులపాలైన రైతులు, మరొక వైపున చేనేతకారులు అనేకమంది తెలంగాణలో కూడా ఆత్మహత్యలు చేసుకొంటూండగా పట్టించుకోని కెసిఆర్, కోదండం వర్గం, ఇంకొక వైపున విద్వేష ప్రచారం ద్వారా అక్కరకు రాణి హామీలపైన యువతలో ఆశలు రెచ్చగొట్టి వారిని ఆత్మహత్యలకు పురిగొల్పారు. ఈ పాపంనుంచి తప్పుకొనే మార్గం లేకనే ఇప్పుడు కుడితిలో పడిన ఎలుకల్లా కొట్టుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం రాకపోతే తమను స్థానిక ప్రజలు బతకనివ్వరన్న భయం వారిని వెంటాడుతోంది కాబట్టే కాలుకాలిన పిల్లుల్లాగా హైదరాబాద్ నుంచి హస్తినకు ఢిల్లీ నుంచి హైదరాబాదుకూ 'బరాట్లు' కొడుతున్నారు.
ఈ సందట్లోనే ఉస్మానియా ఆచార్యుడు, దళితమేధావి అయిన కంచి ఐలయ్య ఒక ప్రకటనలో [11.04.2013] "తెలంగాణా ఉద్యమం పేరుతొ కెసిఆర్ రూ. 50 వేలకోట్లు కూడబెట్టుకున్నారని బాహాటంగా ఆరోపించడం యువతలో సంచలన కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో కెసిఆర్ ప్రజల దృష్టిని మళ్ళించడంకోసం 2014లో జరిగే ఎన్నికలు "మధ్యంతరంగానే రేపో మాపో వస్తా''యన్న ప్రకటనలతోనూ "త్వరలో మరికొందరు ఇతర పార్టీల ఎం.ఎల్.ఎ.లు టి.ఆర్.ఎస్.లో చేరనున్నారన్న చిట్కాలతోనూ కాలక్షేపం చేస్తున్నాడు! ఇది కె.సి.ఆర్. 'ఒంటరి' పోరాటంతో చేస్తున్న 'తుంటరి' రాజకీయం తప్ప మరొకటి కాదు! ఈ భాగోతం యిలా వుండగా, కాంగ్రెస్ లో తన టి.ఆర్.ఎస్. పార్టీని కలిపివేయడానికి రెండు నెలలనాడు ఢిల్లీలో హామీపడి వచ్చిన ఈ 'చేతబడుల' రాజకీయవేత్త అందుకు విరుద్ధంగా తన రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ పైన వ్యతిరేక ప్రచారాన్ని పూర్తిగా వదులుకోలేక పోతున్నాడు. ఈ 'గోడదూకుడు వ్యక్తిని తమకిచ్చిన మాటనుంచి తప్పుకోజూడడాన్ని అనుమానించిన కేంద్రనాయకత్వం ఇప్పుడు కె.సి.ఆర్. ఆస్తులపైన కూడా సి.బి.ఐ. ద్వారా ఆరా తీయిస్తున్నట్టు ఢిల్లీ నుంచి "సూర్య'' దినపత్రిక ప్రత్యేక ప్రతినిధి పంపించిన భారీ వార్తను ప్రచురించి రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది!
ఈ కూపీలో భాగంగానే ఆ పత్రిక కేసిఆర్ మరొక స్థానిక బడా పట్టుబడిదారుడైన ఒక 'ఘరానా'తో కలిసి ఒక దినపత్రికను ఒక ఛానెల్ ను నెలకొల్పడంపైన ఆ పత్రిక యజమానికి కెసిఆర్ కి ఉన్న వ్యాపార సంబంధాల గురించి కూడా సిబీఐ దర్యాప్తులోకి దిగనున్నట్టు రాసింది. దోపిడీ వ్యవస్థను కాపాడుకోగోరే పెట్టుబడీదారీ వర్గాలు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా వారి దోపిడీ స్వభావం మారదు. కాని ఒక దోపిడీదారు మరొక దోపిడీదారుతో లాభాపేక్షతో పోటీపడుతున్నప్పుడు ఒక్కో సందర్భంలో వారి మధ్య ఘర్షణ 'కపట కలహంగా' తలెత్తుతూ ఉంటుంది! కాని దోపిడీ స్వభావంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోని భూస్వామ్య పెట్టుబడి వర్గాల మధ్య తేడా ఉండదు. కాని రాజకీయాలలోకి దిగి 'రాజకీయ నిరుద్యోగులు'గా ఉండే ఒక ప్రాంతపు పెట్టుబడిదారీ వర్గ ప్రతినిధులు మాత్రం ఇతర ప్రాంతాలకు చెందిన దోపిడీదారుల దోపిడీని మాత్రమే ఉదాహరిస్తూ "కపట కలహం'' తో ప్రజలమధ్య చిచ్చుపెట్టి ఐక్యతను విచ్చిన్నం చేయడానికి వెనుకాడరు.
ఆ అధికార దాహంతోనే ప్రాంతీయ భూస్వామ్య పెట్టుబడివర్గాలకు నాయకత్వం వహిస్తున్న కెసిఆర్ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంకోసం స్వార్థపూరిత ఉద్యమాన్ని నిర్మించి 'సీమాంధ్రుల దోపిడీని నుంచి తెలంగాణాను విముక్తి చేయడం' తన లక్ష్యంగా ప్రకటించి, "సీమాంధ్రులను తరిమికొట్టండి'' వారి "ఆస్తిపాస్తుల్ని, ఇళ్లను స్వాధీనం చేసుకోండి "పరిశ్రమలనుంచి వారిని తరిమేస్తే, ఉద్యోగాలన్నీ తెలంగాణా యువతకే దక్కుతాయి'', "మధ్యలో ఉద్యమాన్ని ఆపేశామా సీమాంధ్రులు మనల్ని బతకనివ్వరు, చంపేస్తారు'' అంటూ నోటికొచ్చిన బజారు కూతలతో సామాన్యప్రజలనూ, నిరుద్యోగ విద్యార్థులనూ రెచ్చగొడుటూ నినాదాలు యిచ్చాడు. ఈ పరిణామం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బ తీయడానికీ, ఏ సోదర సీమాంద్రులపై కెసిఆర్ తన స్వార్థం కోసం కత్తికట్టాడో తిరిగి ఆ సీమాంధ్రలోని డిగ్రీ కళాశాలకు, వృత్తి కళాశాలలకూ ప్రాంతంలోని మన తెలుగుపిల్లలూ, ఇతర రాష్ట్రాల పిల్లలూ చదువుల కోసం వలసపోవలసి వచ్చింది; ఇతగాడి ప్రవర్తన మూలంగా కొన్ని పారిశ్రామిక సంస్థలూ, ముఖ్యంగా కొన్ని ఐ.టి. కంపెనీలు మూతపడి, వేలాదిమంది యువకులు, ఉద్యోగాలూ ఉపాధి కోల్పోవలసి వచ్చింది.
ఆ మాటకొస్తే సీమాంధ్ర పెట్టుబడిదారులకే కాదు, మన తెలంగాణాలోని పెట్టుబడిదారులకూ ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత బడా బడా "ఫామ్ హౌస్''లూ "విలాసక్షేత్రాలూ'' (ఫామ్ హౌస్ లు)ఉన్నాయి. అవి ఉభయత్రా రాజకీయ మంత్రంగాలకూ కేంద్రాలు; ఇక హైదరాబాద్ లోని సినిమా పరిశ్రమ ఉనికి అంటారా, ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఎన్.టి.రామారావు కంటే చాలా ముందుగా తెలుగు సినిమా పరిశ్రమను మద్రాసునుంచి హైదరాబాద్ కు ఆహ్వానించిన తొలి ముఖ్యమంత్రి మన తెలంగాణాకు చెందిన సమర్థమైన పరిపాలనా దక్షుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డిగారేనని మరిచిపోయి కెసిఆర్ వర్గం కళ్ళున్న కబోధి పాత్ర వహిస్తే ఎలా?!
ఎటుతిరిగీ ముఖ్యమంత్రి హోదా కోల్పోయిన తరువాతనే కాంగ్రెస్ రాజకీయ కుమ్ములాటల్లో చెన్నారెడ్డి తన నిరుద్యోగ బాధ తనకు దుస్సహమై తిరిగి అధ్కారంలోకి రావడంకోసం "తెలంగాణా ప్రజాసమితి''ని ఏర్పాటు చేసి వేర్పాటు ఉద్యమానికి బీజాలు నాటాడు. ఆ చరిత్ర తెలుగుప్రజలు మరచిపోలేరు! అలాగే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాతనే దోపిడీకాండలో భాగాస్వాములయిన మన తెలంగాణాలోని భూస్వామ్య-పెట్టుబడిదారుల కనీసం 20 మంది దాకా ఎంతలేదన్నా ఒక్కొక్కరు రూ.500 కోట్లనుంచి రూ.4,000కోట్ల వరకూ విలువగల ఆస్తులు ఏ రూపంలోనైతేనేమి కూడబెట్టుకున్నవారేనని ప్రాంతీయ సామాజికశాస్త్రవేత్తల అంచనా!
ఈ క్రమంలో, ప్రొఫెసర్ కంచి ఐలయ్య టి.ఆర్.ఎస్. నాయకుడు 'బొబ్బిలిదొర' కె.సి.ఆర్. మన తెలంగాణలో కూడగట్టుకున్న ఆస్తుల విలువ (రూ. 50,000 కోట్లు) [పమీ అతిగా ఉన్న అంచనా అని అనుకున్నా "ఇంటర్నెట్'' సమాచారం ప్రకారం గుజరాత్ నుంచి (కాండ్లా రేవునుంచి వ్యాపార లావాదేవీల్లో భాగంగా కెసిఆర్ నడుపుతున్నాడని చెబుతున్న ఎందు షిప్పులు) హైదరాబాద్ వరకూ అతనికి ఉన్న ఆస్తుల విలువ రూ.6,000 కోట్లు అని అంచనా! తల దాచుకోడానికి కేవలం 75 గజాల స్థలం కోసం తెలంగాణా పేదసాదలు పడిగాపులు పడుతూన్న దశలో 75 ఎకరాల్లో ఫాం హౌస్ కట్టుకోడానికి సాహసించిన 'ఉద్యమ' నాయకుడు రేపు మన తెలంగాణలో అధికారంలోకి వస్తే దళిత బహుజన, పేద, మధ్యతరగతి వర్గాలకు, యువతకూ ఏదో తవ్వి తలకెత్తుతాడను కోవడం కేవలం భ్రమ మాత్రమేనని గుర్తించాలి.
ఇక పేదసాదలు అంతో ఇంతో ఆశలుపెట్టుకున్న మావోయిస్టుల తెలంగాణా రాజకీయం మావో నిర్వహించిన ఐక్య చైనా, అఖండ చైనా విప్లవోద్యమానికి పూర్తి విరుద్ధం. చైనాలో ఏ రాష్ట్రాన్నీ మావో "వేర్పాటువాదం''తో విచ్చిన్నం చేయలేదు, భాషా రాష్ట్రాలనూ విడదీయలేదు. జాతీయ మైనారిటీల రక్షణ దృష్ట్యా మెజారిటీ 'హాన్' జాతి దురహంకారాన్ని విజయవంతంగా నిరోధించగలిగిన వాడు మావో. విప్లవోద్యమంలో తనకు అవసరమైన రక్షణ స్థావరాల నిర్మాణం కోసం ఏ రాష్ట్రాన్నీ మావో వేర్పాటు ఉద్యమం ద్వారా విడగొట్టడానికి ప్రయత్నించలేదు. అలాంటి ఉదాహరణ ఏదైనా ఉంటే ఇక్కడి వేర్పాటువాదులు గానీ, లేదా వారిని వ్యతిరేకిస్తూనే "స్థావరం'' కోసం తెలుగుజాతి ఐక్యమత్యాన్ని విచ్చిన్నం చేయగల వ్యూహరచనలో ఉన్న మావోయిస్టు సోదరులు గానీ పేర్కొంటే సంతోషిద్దాం!
ఏది ఏమైనా తెలంగాణా యువతను అబద్ధాలతో మభ్యపెట్టి, వారిని ఆత్మహత్యల వైపునక్కు పురిగొల్పిన కెసిఆర్, అతని ప్రాంతీయపార్టీ భవిష్యత్తు సంక్షోభదశలో ప్రవేశించి, పతనోన్ముఖంగా అడుగులు వేయడం అనివార్యమని ఆ పార్టీలోని కొందరు నాయకులు సహా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తన ప్రత్యర్థిపక్షాల నుంచి తన పార్టీ వైపుకు "ఆకర్షితులవుతు''న్నారని ఆశించిన కెసిఆర్ కు ఇటునుంచి అటువైపుగా వలసలు ప్రారంభం కావడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ!