సోనియా ఓటు వేయకుండానే ఆహర భద్రత బిల్లు

  సోనియా మానస పుత్రికగా, యుపిఏ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎలాగైన ఈ సమావేశాల్లోనే బిల్లును పాస్‌ చేయించాలనుకున్న కాంగ్రెస్‌ తన పంతం నెగ్గించుకుంది. సోమవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం వాడివేడిగా చర్చ జరిగింది అయితే 15వ లొక్‌సభలో తొలిసారి ఆహార భద్రత బిల్లుపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రసంగించారు. అయితే సమావేశం జరుగుతున్న సమయంలోని సోనియా అస్వస్థతకు గురికావటంతో ఆమె ఓటింగ్‌లో పాల్గొన కుండానే వెళ్లిపోయారు. సోనియాతో పాటు రాహుల్‌ కూడా వెళ్లిపోయారు. బిల్లు లక్ష్యాలను సభకు వివరించిన ఆహార మంత్రి కెవి థామస్‌ బిల్లును ప్రవేశ పెట్టారు.ఆహార భద్రత బిల్లు అమలులోకి వచ్చినప్పటికీ.. రాష్ట్రాలకు ఆహార ధాన్యాల సరఫరాను తగ్గించబోమని స్పష్టంచేశారు.

సెప్టెంబర్ 2వరకు ఏపీ యన్జీవోలకు కోర్టు గడువు

  రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా జరుగుతున్నపోరాటానికి ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో కూడా ఈరోజు ఎదురు దెబ్బలు తగిలాయి.   సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం ఏపీ యన్జీవోల నిరవదిక సమ్మె చట్ట విరుద్దమని, దానిని నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేయవలసిందిగా హైకోర్టులో ప్రజాహిత వాజ్యం దాఖలయింది. కోర్టు నోటీసులు అందుకొన్నఏపీ యన్జీవో ప్రతినిధులు ఈ కేసులో తమ ప్రతిస్పందన తెలియజేసేందుకు ఈనెలాఖరు వరకు గడువు ఇవ్వవలసినదిగా కోర్టును అభ్యర్దించగా, కోర్టు అందుకు అంగీకరించి కేసును వచ్చేనెల రెండవ తేదీకి వాయిదావేసింది. ఒకవేళ హైకోర్టు వారు చేస్తున్న సమ్మె చట్ట విరుద్దమని తేల్చిచెప్పినట్లయితే ఏపీ యన్జీవోలకు ధర్మసంకటం తప్పదు. సమ్మె విరమిస్తే సమైక్య ఉద్యమం నిలిచిపోతుంది. కొనసాగిస్తే చట్టపరమయిన చర్యలు ఎదుర్కోక తప్పదు.   ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన రాష్ట్ర విభజనను సవాలు చేస్తూ పీవీ కృష్ణయ్య అనే న్యాయవాది  సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసారు. అయితే ఆ పిటిషన్ను చీఫ్ జస్టిస్ పి. సదాశివం, జస్టిస్ రంజనా దేశాయ్, జస్టిస్ రంజన్ గొగైలతో కూడిన ధర్మాసనం ఈ రోజు కొట్టివేసింది. రాష్ట్ర విభజనపై కేంద్రం ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోనందున దానిపై విచారణ జరపటం సరికాదని, అయినా రాష్ట్రాల విభజనపై తగిన నిర్ణయం తీసుకొనేందుకు పార్లమెంటు ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.    

ఆహార భద్రత బిల్లుపై తెదేపా యంపీ నామా నాగేశ్వర రావు సునిశిత విమర్శలు

  రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాల్చిపెట్టగలదని ఆశిస్తున్న ప్రతిష్టాత్మకమయిన ఆహార భద్రత బిల్లుపై ఈ రోజు లోక్ సభలో వోటింగ్ జరిగింది. జేడీ (యు), ఆర్.జే.(డీ), బీయస్పీ, మరియు యం.ఐ.యం. పార్టీలు బిల్లుకి మద్దతు తెలుపగా, శివసేన మాత్రం వ్యతిరేఖించింది. ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు సవరణలను సభ ఆమోదించగా, ప్రతిపక్ష పార్టీ యంపీలు సుష్మ స్వరాజ్ సంపత్, గురుదాస్ గుప్తాలు ప్రతిపాదించిన ఆరు సవరణలు మాత్రం తిరస్కరించింది. తెదేపా యంపీ నామా నాగేశ్వర రావు బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ గత ఐదు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆహార భద్రత బిల్లుని ప్రతిపాదించడం అంటే ఇన్నేళ్ళుగా పేదలకు కడుపు నిండా తిండి అందించడంలో వైఫల్యం చెందిందని అర్ధం అవుతోంది.ఇన్ని దశాబ్దాల పాలన తరువాత కూడా దేశంలో పేద ప్రజలు తిండికి నోచుకోవడంలేదని ఈ బిల్లు ద్వారా స్పష్టం అవుతోంది. అందుకు సిగ్గుపడవలసిన కాంగ్రెస్ ప్రభుత్వం తానేదో పేదలకి మేలు చేస్తున్నట్లు నేడు ఈ బిల్లు ప్రవేశపెడుతోంది. దానిలో ఉన్న లొసుగులను తొలగించి ప్రవేశపెట్టి ఉంటే ఆ బిల్లుయోక్క ప్రయోజనం నెరవేరేది. కానీ, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని లోసుగులమయమయిన ఈ బిల్లును హడావుడిగా ప్రవేశపెడుతోంది. దీనివల్ల పేద ప్రజలకు లాభం జరగడం సంగతి ఎలా ఉన్నపటికీ, అబిల్లు పేరు చెప్పుకొని కాంగ్రెస్ ఓట్లు దండుకోవాలని ఆత్రం పడుతోంది. ఆ ఆత్రంలో కనీసం ప్రతిపక్షాలు చేస్తున్నసూచనలను, సలహాలను కూడా అది పట్టించుకొనే స్థితిలో లేకపోవడం చాలా విచారకరం," అని అన్నారు. 

కాంగ్రెస్‌కు మ‌రొ ఎదురుదెబ్బ

  విభ‌జ‌న సెగ‌ల‌తో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ త‌గులుతుంది. తాజాగా అనంతపురంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవిభజన వ్యవహారంలో కాంగ్రెస్‌ తీరుతో ఆగ్రహంగా ఉన్న అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విభ‌జ‌న విష‌యంలో కాంగ్రెస్ వైఖ‌రిపై అసంతృప్తితో ఉన్న కేతిరెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వాధ్యక్షురాలు విజ‌య‌మ్మను క‌లిశారు. ఆమె కండువా క‌ప్పి కేతిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. కాట‌సారి, కేతిరెడ్డిల దారిలోనే మ‌రికొంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడే అవ‌కాశం ఉందంటున్నారు విశ్లేష‌కులు.

గీతారెడ్డికి సిబిఐ స‌మ‌న్లు

  రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి ఇంకా సిబిఐ గండం త‌ప్పిన‌ట్టుగా లేదు ఇప్పటికే మాజీ మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ జైలు ఊచ‌లు లెక్కపెడుతండ‌గా, ధ‌ర్మాన, స‌భిత‌లు సిబిఐ ఆఫీస్ చుట్టూ చ‌క్కర్లు కొడుతున్నారు ఇప్పుడు ఈ లిస్ట్‌లో మ‌రో మంత్రి కూడా చేరిపోయింది. లేపాక్షి నాలెడ్జ్ హ‌బ్ భూకేటాయింపుల విష‌యంలో మంత్రి గీతా రెడ్డికి సిబిఐ స‌మ‌న్లు జారీచేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ విష‌యంలో గీతారెడ్డి చేసిన భూకేటాయింపుల్లో అవ‌క‌త‌వ‌క‌లు ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌తో సిబిఐ మంత్రి గీతారెడ్డికి స‌మ‌న్లు జారీ చేసింది. ఈ వ్యవ‌హారంలో మంగ‌ళ‌వారం సిబిఐ గీతారెడ్డిని విచారించే అవ‌కాశం ఉంది. అందుకు కావాల్సిన ప‌ర్మిష‌న్స్ కోసం గతంలోనే రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించిన సిబిఐ లీగ‌ల్‌గా అన్ని ఫార్మాలీటీస్‌ను పూర్తి చేసింది. అయితే  గీతారెడ్డిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ అధికారులకు అనుమతివ్వడంతో  ఆమె నివాసంలో సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా సీబీఐ అధికారులు ఇటీవల ప్రశ్నించారు.

విజ‌య్‌కాంత్‌కు రాహుల్ శుభాకాంక్షలు

  2014 సార్వత్రిక ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతుండటంతో రాహుల్‌కు ప‌ట్టాభిషేకం చేయ‌డానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ర‌కాలుగా ఎత్తులు వేస్తుంది. వ‌చ్చిన ప్రతి అవ‌కాశాన్ని ఉప‌యోగించుకొని రాహుల్ను ప్రదాని చేయ‌డానికి మార్గం సుగ‌మం చేసుకుంటుంది. అందులో భాగంగానే త‌మిళనాట మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ విజ‌య్‌కాంత్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రాహుల్ గాంధీ స్వయంగా శుభాకాంక్షలు తెలియ‌జేశారు. 2014 లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎండీకే పార్టీ మధ్య పొత్తులు కుదిరే దిశగా అడుగులు పడుతున్నాయి. చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ డీఎండీకె పార్టీతో పొత్తుకు ప్రయ‌త్నిస్తుండ‌గా ఈ సంఘ‌ట‌న ఆ వాధ‌న‌కు మ‌రింత బ‌లానిచ్చింది. అయితే విజయ్ కాంత్ తో రాహుల్ మాట్లాడటం వెనుక ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు లేవని డీఎండీకే పార్టీకి చెందిన సీనియర్ నేత అన్నారు.  ప్రస్థుతానికి ఎవ‌రితో పొత్తుల గురించి ఆలోచ‌న లేద‌ని స‌రైన స‌మ‌యంలో దానికి సంబందించిన వివ‌రాలు వెల్లడిస్తామ‌న్నారు.

జగన్ విడుదలకు కాంగ్రెస్ మార్గం సుగమం చేస్తోందా

    సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా లక్ష్మీనారాయణ పనిచేసినంత కాలం సీబీఐ నిత్యం ఏదో రూపంలో వార్తలలో ఉండేది. అదేవిధంగా జగన్ మోహన్ రెడ్డి, అతని అక్రమాస్తుల కేసులతో సంబంధం ఉన్నమంత్రులు, ఐఏయస్ ఆఫీసర్ల కేసుల వ్యవహారం గురించి నిత్యం వార్తలు వినబడేవి. కానీ, ఆయన బదిలీపై వెళ్ళిపోయిన తరువాత వార్తలలో సీబీఐ ప్రస్తావనే వినబడటం లేదు. అంటే, సీబీఐ ఉన్నతాధికారి మారితే సీబీఐ పనితీరు కూడా మారుతుందనుకోవచ్చును.   జగన్ మోహన్ రెడ్డిని జైలులో నిర్బందించడంలో తమ హస్తం లేదని వాదిస్తున్నకాంగ్రెస్ పార్టీ, ఈవిధంగా ఒక ఉన్నతాధికారి బదిలీతో కేసును తనకు అవసరమయిన రీతిలో మలుపులు తిప్పుకోగలదని అర్ధం అవుతోంది. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం లేదా ఆ పార్టీతో ఎన్నికల పొత్తులకు అంగీకరించినట్లయితే కాంగ్రెస్ అధిష్టానం అతని కేసులను పక్కదారి పట్టించగల ‘సమర్దుడయిన’ ఉన్నతాధికారిని నియమించవచ్చును. లేకుంటే లక్ష్మినారాయణ వంటి ‘సమర్దుడిని’ నియమించి అతనిని జైలుగోడలకే పరిమితం చేయగలదని అర్ధం అవుతోంది. మరి ప్రస్తుతం సీబీఐ జగన్ మోహన్ రెడ్డి కేసుల దర్యాప్తు, మరియు చార్జ్ షీట్స్ దాఖలు విషయంలో ఎంతవరకు పురోగతి సాధించిందో సామాన్య ప్రజలకి తెలియదు.   సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నాలుగు నెలలోగా అతని కేసుల దర్యాప్తు ముగించకపోయినట్లయితే, అతను బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చును. సుప్రీంకోర్టు ఇచ్చిన నాలుగు నెలల గడువు వచ్చేనెల అంటే సెప్టెంబర్ తో ముగుస్తుంది. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం జరిగి ఉంటే, సీబీఐ అతని బెయిలుకి మార్గం సుగమం చేయవచ్చును. లేకుంటే, ఇదివరకులాగే అతని బెయిలుకి అభ్యంతరం చెపుతూ వాదనలు చేసి, అతని రిమాండును మరికొంత కాలం పొడిగించేందుకు ప్రయత్నాలు చేయవచ్చును. అతని కేసులకు సీబీఐ ఎటువంటి ముగింపు ఇస్తుందో తెలుసుకోవాలంటే మరొక నెల రోజులు ఆగవలసిందే.

ఎమ్మెల్యే పదవికి మోపిదేవి రాజీనామా

      మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణరావు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడ జైలులో దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన దీక్షకు సంఘీభావంగా మోపిదేవి ఈ రోజు తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. మోపిదేవి తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మాట్లో జైలు అధికారులకు అందజేశారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు అధికారులు పంపించనున్నారు. తాను జైలులో ఉన్నందు వల్లనే ఇలా లేఖ పంపాల్సి వచ్చిందని మరో లేఖలో స్పీకర్‌కు మోపిదేవి వివరించారు.   మోపిదేవి రాజీనామా గుంటూరులో కలకలం రేపింది. జగన్ దీక్షకు మోపిదేవి ఈ రోజు సంఘీభావం తెలిపారు. జగన్ బ్యారెక్‌కు వెళ్లి తన మద్దతును ప్రకటించారు. జగన్ ఆదివారం ఉదయం నుండి దీక్ష చేస్తున్నారు. కాగా, జగన్ దీక్షకు సంఘీభావంగా మోపిదేవి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆయన జగన్ వైపు వెళ్లినట్లే!

సమైక్యాంధ్ర ఉద్యమంలో చీలికలు మొదలయ్యాయా

   సమైక్యాంధ్ర కోరుతూ ఏపీ.యన్.జీ.ఓ.లు నిరవధిక సమ్మెకు దిగడంతో సీమాంధ్ర ప్రాంతం దాదాపు స్తంభించిపోయింది. గత రెండు వారాలుగా సీమాంధ్ర ప్రాంతంలో వేలాది ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయిపోవడంతో సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె ప్రభావం బాగా కనబడుతోంది. అయినప్పటికీ కేంద్రం మాత్రం దిగివస్తున్న సూచనలు కనబడకపోవడంతో క్రమంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వోద్యోగులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. రోజులు కొనసాగుతున్నకొద్దీ ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులలో మునుపటి ఉత్సాహం కూడా క్రమంగా తగ్గుతోంది. ఇక నెల జీతాల మీదనే ఆధారపడిన ఉద్యోగులలో తీవ్ర ఆందోళన నెలకొంది.   బహుశః ఆ కారణంగానే విజయవాడ, కడప మరియు నెల్లూరు జిల్లాలకు చెందిన ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మిక సంఘాల నేతలు త్వరలో అంటోనీ కమిటీని కలిసేందుకు నిశ్చయించుకొన్నారు. అయితే వారు కమిటీకి సమైక్యాంధ్ర కోరుతూ వినతి పత్రం ఈయడంతో బాటు, ఆర్టీసీపై ఉన్న రూ.5000 కోట్ల రుణభారం ప్రభుత్వం స్వీకరించాలని, అదేవిధంగా సంస్థ పూర్తిగా కోలుకోవడానికి అదనంగా మరో రెండువేల కోట్లు సహాయం కూడా చేయాలని వారు కోరనున్నారు.   తమ సంస్థ తీవ్ర నష్టాలలో కూరుకుపోయి ఉందని తెలిసి కూడా ఆర్టీసీ నేతలు సమైక్యాంధ్ర ఉద్యమంలో దిగి, ఇప్పుడు తమ సంస్థను రక్షించాలంటూ అంటోనీ కమిటీని కోరబోవడం హాస్యాస్పదం. సంస్థ మనుగడపైనే వేలాది కార్మికుల జీవితాలు ఆధార పడిఉన్నాయనేది ఎవరూ కాదనలేని నిజం. అటువంటప్పుడు సంస్థను కాపాడుకోవలసిన ఉద్యోగులు నిరవదిక సమ్మెచేసి సంస్థ మూతబడే స్థితికి తీసుకువస్తే మొట్ట మొదట నష్ట బోయేది వారేననే గ్రహింపు లేకపోవడం విచిత్రం. ఇదే సూత్రం మిగిలిన సంస్థలకు కూడా వర్తిస్తుందని వేరే చెప్పనవసరం లేదు.   ఇక, సమైక్యాంధ్ర కోరుతూ సమ్మెకు దిగిన నేతలు ఇప్పుడు తమ ప్రధాన డిమాండు నేరవేర్చమని కోరకుండా ఆర్టీసిని ఆదుకోమని కోరడం విశేషం. బహుశః త్వరలోనే మిగిలిన ప్రభుత్వోద్యోగులు కూడా క్రమంగా తమ బెట్టు సడలించి ఇటువంటి కోరికల చిట్టాలతో ఆంటోనీ కమిటీ ముందు బారులు తీరినా ఆశ్చర్యం లేదు.   బహుశః కేంద్ర ప్రభుత్వం కూడా వారిలో ఈ మార్పు కోసమే బిగుసుకొని కూర్చొని ఉన్నట్లు కనబడుతోంది. ఒకసారి ఉద్యమంలో చీలికలు వస్తే, ఇక రాజకీయ పార్టీలు కూడా వెంటనే వెనక్కి తగ్గడం ఖాయం. ఆ తరువాత విభజన ప్రక్రియ ఊపందుకోవచ్చును.

జగన్ పార్టీలోకి కాటసాని

      కర్నూలు జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుండి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లాలో ఆళ్లగడ్డ నుండి శోభా నాగిరెడ్డి, బనగానపల్లి నుండి కాటసాని రాంరెడ్డిలు ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాంరెడ్డి జగన్ కు సన్నిహితంగా మారి ఆ పార్టీకి దగ్గరయ్యారు.   ఇక శోభానాగిరెడ్డికి, వైఎస్ జగన్ మేనమామ రవీంధ్రనాథ్ రెడ్డికి చుట్టరికం కారణంగా ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో భూమా దంపతులు జగన్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శోభా నాగిరెడ్డి మళ్లీ ఎన్నికయ్యారు. అయితే జగన్ కు దగ్గరయిన కాటసాని తిరిగి చిరంజీవి చేరువయ్యారు. ఇప్పుడు మళ్లీ యూ టర్న్ తీసుకుని తిరిగి జగన్  పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

హత్య కేసులో లొంగిపోయిన టిడిపి ఎమ్మెల్యే

      తన సోదరుడు జగన్మోహన్ ను హత్య చేసిన కేసులో హైకోర్టు బెయిలు పిటీషన్ ను తిరస్కరించడంతో జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ఆలియాస్ ఎర్ర చంద్రశేఖర్ మహబూబ్ నగర్ ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. జులై 17న సోదరున్ని హత్య చేసిన అనంతరం ఎర్ర శేఖర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఇప్పటి వరకు పోలీసులకు పట్టుబడలేదు. పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. పలుమార్లు బెయిలు పిటీషన్లు కోర్టులు కొట్టేయడంతో ఎట్టకేలకు తానే లొగింపోయారు. ఎర్రశేఖర్ సోదరుడు జగన్మోహన్ సర్పంచ్ పదవికి తన భార్యను పోటీకి దింపాడు. ఎర్రశేఖర్ భార్య కూడా సర్పంచ్ గా పోటీచేస్తుంది. అయితే నామినేషన్ ఉపసంహరించుకోవాలని చెప్పినా సోదరుడు వినకపోవడంతో కాల్చిచంపారు. ఆ ఘటనకు పాల్పడింది ఎర్రశేఖర్ అని ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ఆధారాలున్నాయని పోలీసులు కూడా తెలిపారు.

టిడిపి ఎంపీలు సస్పెండ్

      సమైక్యాంధ్రకు మద్దతుగా లోక్ సభలో ఆందోళన చేస్తున్న సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలు నలుగురిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్ సభలో తమ సభ్యులను సస్పెండ్ చేయడం అన్యాయమని, దీనిపై ప్రభుత్వ వివరణ కావాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు నినాదాలు చేశారు. అయితే లోక్ సభలో సస్పెన్షన్ల గురించి రాజ్యసభలో చర్చించే అలవాటు లేదని, సభ్యులిద్దరూ సహకరించి తమ తమ స్థానాలలోకి వెళ్లి కూర్చోవాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దీంతో వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి సభను అరగంట పాటు వాయిదా వేశారు. ఇప్పటికే లోక్ సభ నుండి సస్సెండ్ అయిన లోక్ సభ సభ్యులు ముగ్గురు పార్లమెంటు ఆవరణలో నిరవధిక దీక్షకు దిగారు.

హరికృష్ణ రాజీనామా వెనుక పురందేశ్వరి

      టిడిపి పార్టీ మాజీ ఎంపీ హరికృష్ణ రాజీనామా వెనుక కేంద్ర మంత్రి, ఆయన సోదరి పురందేశ్వరి హస్తం ఉందన్న ఆరోపణలను ఎమ్మెల్యే, పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఖండించారు. హరికృష్ణ రాజీనామా వెనక పురంధేశ్వరి హస్తం ఉందని టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. '' హరికృష్ణ ఎప్పుడు ఏం చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర జై కొడితే ఆయన రాజీనామా వెనక ఆయన సోదరి పురంధేశ్వరి హస్తం ఉందని ప్రచారం చేయడం చాలా తప్పు. అలాంటి అవసరం మాకు లేదు. అనవసరంగా ఇటువంటి ఆరోపణలు చేయడం మానుకోవాలి'' అని పురంధేశ్వరి భర్త, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కూడా కె.ఇ.వాదనతో విబేధించడం విశేషం.హరికృష్ణ సమైక్యం కోసం రాజీనామా చేశారని, దీని వెనుక ఎవరో ఉన్నారని అనుకోవడం లేదని ఆమె అన్నారు.

బీజేపీ కూడా సమైక్యరాగం ఆలపించబోతోందా?

  “తెలంగాణా అంశంతో కాంగ్రెస్ పార్టీ నాటకాలాడుతోంది. తెలంగాణా ప్రజలను మోసం చేస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్లమెంటులో తెలంగాణా బిల్లు పెడితే మా పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఈయకపోతే, మా పార్టీ అధికారంలోకి రాగానే కేవలం 100 రోజుల్లోనే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది,” ఇది బీజేపీ ఇంతవరకు చెపుతున్నమాటలు. కానీ బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మాటలు వింటే ఇప్పుడు బీజేపీ కూడా సమైక్యరాగం అందుకొన్నట్లు కనిపిస్తోంది.   “కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రక్రియను చాలా అనాలోచితంగా, ఎవరికీ ఆమోదయోగ్యం కాని విధంగా చేస్తోంది. జాతీయ పార్టీగా బీజేపీ ఇరు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరగాలని కోరుకొంటోంది. సీమాంధ్ర ప్రజలు చెపుతున్నఅనేక సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర విభజనకు యుపీయే ప్రభుత్వం బిల్లు పెడితే, మా పార్టీ మద్దతు తెలపదు. రాష్ట్ర విభజనలో ఇరుప్రాంతాలవారికి న్యాయం జరిగేలా కాంగ్రెస్ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా మొండిగా ముందుకు సాగాడాన్ని మేము ఖండిస్తున్నాము. అలాగని మేము తెలంగాణా ఏర్పాటుపై వెనక్కి తగ్గినట్లు భావించనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము, ” అని వెంకయ్య నాయుడు మీడియాతో అన్నారు.   కాంగ్రెస్ పార్టీ తెలంగాణాపై బిల్లు పెడితే మద్దతు ఇవ్వబోమని స్పష్టంగా చెపుతూనే, మళ్ళీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు.   ఇక, నిన్న మొన్నటి వరకు కూడా సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా, తెలంగాణా ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ అక్కడ పార్టీని బలపరుచుకోవాలని చూసిన బీజేపీ, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఏర్పాటుకి కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నపుడు, తాము ఎంత ఉద్రేకంగా తెలంగాణా కోసం పోరాడినప్పటికీ, ఆఖ్యాతి మొత్తం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని బీజేపీ ఆలస్యంగా గ్రహించినట్లుంది. ఇక, కాంగ్రెస్ పార్టీ తెరాసను విలీనం చేసుకోనో లేక ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోనో ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తున్నందున, ఇక తమకు తెలంగాణా తరపున వఖల్తా పుచ్చుకొని ఎంత వాదించినా అక్కడ తమ పార్టీకి ఉన్నరెండు మూడు యంపీ సీట్లకంటే అధనంగా ఒక్క సీటు కూడా గెలవడం అసాధ్యమని బీజేపీ ఆలస్యంగా గ్రహించింది.   అదిగాక తన తెలంగాణా వాదంతో, అసలే సీమంధ్రలోపార్టీలో అంతంత మాత్రంగా ఉన్నతమ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయే ప్రమాదం ఉందని బీజేపీకి జ్ఞానోదయం అయినట్లుంది. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఏర్పాటుకి సిద్దపడుతున్నపటికీ, సీమాంధ్ర ప్రాంతంలో ఉదృతంగా సాగుతున్నసమైక్యాంధ్ర ఉద్యమం బీజేపీకి కొత్త ఆశలు రేపడంలో అసహజమేమి లేదు. ఇంతకాలం తెలంగాణావాదంతో ముందుకు సాగుతు అక్కడ బలం పెంచుకోవాలని తపించిన బీజేపీకి కాంగ్రెస్ తీసుకొన్ననిర్ణయంతో ఎదురుదెబ్బ తగిలింది. అందువల్ల, ఇప్పుడు సిద్దంగా ఉన్నసమైక్యాంధ్ర లేదా సమన్యాయం ఉద్యమాలతో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలని బీజేపీ సరికొత్త వ్యూహంగా కనిపిస్తోంది.   అయితే, ఇప్పటికే సీమాంధ్రపై పట్టుకోసం నానా తిప్పలు పడుతున్న కాంగ్రెస్, వైకాపా, తెదేపాలతో బీజేపీ కూడా సమైక్య రేసులో పాల్గొంటుందా? పాల్గొన్నపటికీ ఇంతకాలం తమను పట్టించుకోని బీజేపీని సీమాంధ్ర ప్రజలు విశ్వసిస్తారా? తెలంగాణావాదాని పక్కనపెడితే బీజేపీ పరిస్థితి రెంటికీ చెడిన రేవడిగా మారుతుందని ఆ పార్టీ నేతలకి తెలియదా? అనే ధర్మ సందేహాలకు సమాధానాలు బీజేపీయే జవాబు చెప్పాల్సి ఉంటుంది.

పేదవాడి పెన్నిధి.

    .......Vijaykumar Ponnada     దేశంలో పెదవాళ్ళకి మా చెడ్డ కరువొచ్చినట్టుంది. వీళ్ళు రోజురోజుకీ తగ్గిపోతున్నారుట. అంటే డైనాసర్లులాగా, కొన్ని సంవత్సరాలకి పేదవాళ్ళు కూడా అంతరించిపోయే ప్రమాదం వుంది. మన రాష్ట్రంలో మన ప్రభుత్వానికి తెలియకుండానే, వీరి శాతం తగ్గిపోతోందిట. ఔరా! ఎంత పని జరిగింది.   అదేదో టెండూల్కర్ నివేదికటండి. దాని ప్రకారం మన రాష్ట్రంలో పేదవాళ్ళు 9 శాతం మాత్రమే వున్నారుట. పాపం ప్రభుత్వానికి ఈ విషయం తెలియక, ప్రపంచ బ్యాంకుని నమ్ముకుని, రాష్ట్రంలో జనాభాతో పేదలు కూడా పెరుతారని ప్రఘాడ విశ్వాసంతో, 2017-18 సంవత్సరానికి ఇప్పుడున్న 21 శతాన్ని 12 శాతానికి తగ్గించాలని ప్రణాలిక వేసుక్కూర్చుంది. తీరా చుస్తే ఇప్పుడే దానికన్న తక్కువున్నారుట. ఏమిటి సాధనం? ఇదేదో పరువు పోయేట్టుగావుంది. తక్షణం ఏదోకటి చేయాలి. లేక పోతే లేనివి వున్నట్టు చూపిస్తున్నామన్న చెడ్డపేరొచేస్తుంది. అసలు రాష్ట్రంలో ఎంతమంది పేదవాళ్ళున్నారో ఓ మారు లెక్కెట్టి చూసి, ఆపైన ప్రాణాలిక వేసుకునుంటే బాగుండేది. ఇక బుర్ర బద్దలుకొట్టుకుని లాభంలేదని తలచి, ఎలాగయినా వున్నఫళంగా పేదవాళ్ళ శాతం 21 కి పెంచి, వేసుకున్న ప్రణాలికకి అనుగుణంగా, వారిని 12 కి తగ్గించాల్సిందే అని ప్రభుత్వం నిర్ణయించింది. పేదవాళ్ళకోసం వేట మొదలెట్టింది.   ముందస్తుగా తమ ఆస్తి వివరాలు బహిర్గతం చేసిన ఎమ్మెల్యేల జాబితా తెప్పించి పరిశీలించింది. ఆశ్చర్యంగా 295 మంది పేదవాళ్ళు ఇట్టే దొరికేసారు. అందరూ కూడా ఆస్తిపాస్తుల్లేని వాళ్ళే. వెంటనే వాళ్ళని పేదవాళ్ళ సంఖ్యకి కలిపేసింది. అయితే పేదవాళ్ళ శాతం 0.90 మాత్రమే పెరిగింది. 'చా! మనకి ఓ పది శాసన సభలుంటే ఎంత బాగుండేది ' అని వాపోయి, మళ్ళీ ఆలోచన్లో పడింది. ఇంకా బోల్డుమంది కావాలి. ఇప్పుడుకిప్పుడు పేదవాళ్ళని తయ్యారు చేయటమంటే, ప్రణాలిక తయ్యారు చేసినంత సుళువేం కాదు. అందుకే పేదవాళ్ళని దిగుమతి చేసుకునే కార్యక్రమం చేపట్టింది.   కార్యక్రమం క్రమంగా వున్నా, కార్యం ఎలా సాధించాలాని ఆలోచనలో పడింది ప్రభుత్వం. మన రాష్ట్రంలో కన్నా ఎక్కువగా పేదవాళ్ళు వున్న రాష్ట్రాలకి వెళ్ళి, అక్కడున్న పేదవాళ్ళని బతిమాలో, బామాలో మన రాష్ట్రాలకి తెచ్చుకుంటే, తగ్గిన శాతాన్ని బర్తీ చేయచ్చు. అందుకే, మన ప్రభుత్వ పధకాలని, వాటికి సంబంధించిన ప్రయోజనాలని అక్కడ పెదవారికి తెలియచెప్పి, వారిని మన రాష్ట్రానికి వలస తెచ్చే పనికోసం, మెరికల్లాంటి వారిని ఎంపిక చేసి పంపింది. వారు ఒక రాష్ట్రానికి వెళ్ళి మన పధకాలని ఏకరువు పెట్టారు. కానీ అక్కడ మన 'నేటివిటీకి ' తగ్గట్టుగా లేరు. చాలా బలిష్టంగా, కండలు పెంచి వస్తాదుల్ల వున్నారు. తీరా ఆరా తీస్తే, వారు అక్కడ ఎమ్మెల్యేలు  అని తేలింది. హడలిపోయి మరో రాష్ట్రానికెళ్ళారు. అక్కడా మనకి కావలసిన వాళ్ళు దొరకలేదు. అలా ఎడారిలో నీళ్ళకోసం అన్వేషించినట్టు, అన్ని రాష్ట్రాలు తిరిగి, ఆఖరికి ఓ రాష్ట్రంలో కొంతమందిని వెదకి పట్టుకున్నారు. కానీ, అక్కడ మన భాష మాట్లాడే వాళ్ళు అస్సలు లేరు. పోనీలే భాష నేర్పిస్తే పోలే అని, మళ్ళీ మన పధకాలని ఎకరువు పెట్టారు. ఆ పేదవాళ్ళని మన రాష్ట్రానికి వలస రమ్మని ప్రాదేయ పడ్డారు. 'అబ్బే, ఇంతకన్నా ఎక్కువే ఇక్కడ మాకు ముడుతోంది, అక్కడకొచ్చి కొత్తగా పులుముకునేది ఎముంది కనుక,' అని వీల్లేదు పొమ్మన్నారు. దొరక్క దొరక్క దొరికారు. అలా వాళ్ళని వదిలేస్తే, మరో నాల్రోజుల్లో గొప్పవాళ్ళయ్యిపోయే ప్రమాదం వుందని, మళ్ళీ ఈ సారి ప్రాధేయపట్టంతో పాటు, కాళ్ళ మీద కూడా పడ్డారు. ఇక వాళ్ళకి చిరాకేసి, కాళ్ళు విడిపించుకుని, కుర్చీపైనెట్టేసుకుని, 'సరే, ఇంతకన్న ఎక్కువిస్తే వస్తాము ' అన్నారు. ఇప్పటికే అమ్మ హస్తము, నాన్నా కాలూ అని బోల్డు పధకాలు పెట్టినా, ఇంకా కావాలనే సరికి, మన వాళ్ళకి కోపం వచ్చి, 'చస్! మీ దిక్కున్న చోటుకి పొండి ' అని తిరిగొచ్చేసారు.      ఇంటికొచ్చేసి, పెట్టే బేడా దించేసి, కాస్త కునుకు తీద్దమనేసరికి, సీయం దగ్గరినుంచి కబురొచ్చింది. ఇలా జరిగినది చెప్పేసరికి, ఆయన మండి పడి, 'దొరికిన వాళ్ళని వదలి వచ్చేసారా? ఎంత పని చేసారు. ఇవాళ వెదక్కుండానే కుందేటి కొమ్ము ఇట్టే దొరుకేస్తోంది కానీ, పేదవాళ్ళు దొరకటం ఎంత కష్టమో మీకు తెలియటంలెదు. పేదవాడి విలువ మీకేంతెలుసు? నెలకి మీ జీతాలు మీకు వచ్చేస్తాయి. పాపం వాళ్ళ గురించి ఆలోచించండి.' అనే సరికి, వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగొచ్చిన యావత్మంది భోరున ఏడ్చేసారు. 'వెళ్ళండి, వాళ్ళు కోరినట్టుగా మరి కాస్త ఎక్కువిస్తామని బుజ్జగించి తీసుకురండి.' అన్నారు, సీయం. అంతే, దించిన పెట్టే బేడా మళ్ళి తలమీదెట్టుకుని, ఆ రాష్ట్రానికి పరుగులంకించారు. అక్కడ ఎవ్వరు కనిపించలేదు. ఏక్కడికెళ్ళారు చెప్మా అని వుప్మా తింటూ వాళ్ళ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. అక్కడేవున్న ఓ ముసలి పేదవాడిని అడిగారు, మొన్న మేము మాట్లాడి వెళ్ళిన వారంతా ఏరనీ? ఆ ముసలాడు వీళ్లని ఎగా దిగా చూసి, 'వాళ్ళు ఇంకా ఇక్కడే ఎదుకుంటారు. మొన్న మీరెళ్ళకా, వేరే రాష్ట్రం వారొచ్చి, వాళ్ళ రాష్ట్రానికి పేదవాళ్ళు కావాలని వీళ్ళకి ఏదికావాలంటే అదిస్తామని చెప్పి తీసుకుపోయారు.' అన్నాడు.

మోడి జీవిత కథ ఆధారంగా సినిమా

  నిజ జీవిత కథలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇప్పుడు మరో బయోపిక్‌ తెరకెక్కడానికి సిద్దమవుతుంది.  అయితే ఇన్నాళ్లు స్వాతంత్ర్య సమర యోధులు, క్రీడాకారుల జీవితాలు మాత్రమే తెరకెక్కించిన బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో సత్తా చాటుతున్న ఓ డైనమిక్‌ జీవితాన్ని సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్థుత రాజకీయాల్లో సెన్సెషన్‌ సృష్టిస్తూ భవిష్యత్‌ ప్రదానిగా భావిస్తున్న గుజరాత్‌  ముఖ్యమంత్రి నరేంద్రమోడి జీవిత కథను సినిమా తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు బాలీవుడ్‌ సినీ జనాలు. ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ అయిన మితేష్ పాటిల్‌ ఇప్పటికే ఇందుకు సంభందించిన వర్క్‌ కూడా స్టార్ట్‌ చేసేశాడు. ఒక టీస్టాల్‌లో సామాన్యుడిగా జీవితాన్ని మొదలు పెట్టిన ఓ వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగటంతో పాటు భావి ప్రదానిగా కీర్తించబడటంలో ఓ కమర్షియల్‌ సినిమా కు కావలిసిన ఎలిమెంట్స్‌ బాగా ఉన్నాయని భావిస్తున్నారు మితేష్‌. అంతేకాదు ఈ సినిమా తెరకెక్కించాడానికి ఇప్పటికే మోడి ఆమోదాన్ని కూడా పొందిన మితేష్‌ త్వరలోనే సినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్లనున్నాడు. అయితే సినిమాను పూర్తిగా బయోపిక్‌లా కాకుండా సినిమాకు కావాల్సిన డ్రామాను కూడా కాస్త జోడిస్తూ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. నాయకుడిగా ఓట్లు కురిపించిన నరేంద్రమోడి, కథానాయకుడిగా కాసులు కూడా కురిపిస్తాడేమో చూడాలి.

రణరంగంగా మారిన సీమాంద్రుల సమావేశం

  తెలంగాణ, సమైక్య ఉద్యమాలతో హైదరాబాద్‌ రణరంగంగా మారుతుంది. సమైక్య వాదులు హైదరాబాద్‌ నగరంలో సమావేశాలు నిర్వహిస్తుండటంతో తెలంగాణ వాదులు వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో సమావేశా ప్రాంగణాలలో యుద్ద వాతావరణం కనిపిస్తుంది. ఆదివారం సాయంత్రం సీమాంద్ర న్యాయవాదులు  సమైక్యాంద్ర పరిరక్షణ సమితి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపి ఎన్టీఓ అధ్యక్షుడు అశోక్‌బాబుతో పాటు, నగర అధ్యక్షుడు పివీవీ సత్యానారాయణ పాల్గొన్నారు.ఈ సమావేశంలో సెప్టెంబర్‌ 7న హైదరాబాద్‌లో తలపెట్టిన సభకు సంభందించిన చర్చించారు. అయితే సమావేశం ప్రారంభమై 20 నిమిషాలు కాగానే తెలంగాణ ప్రాంతానరి చెందిన కొందరు లాయర్లు ఏపిఎన్జీవోల సమావేశం జరిగే ప్రాంతానికి వచ్చి పెద్ద ఎత్తున తెలంగాణకు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో సీమాంద్ర న్యాయవాధులు కూడా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో, ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. వివాదం మరింత ముదిరి కుర్చీలతో దాడి చేసుకునే వరకు వెళ్లారు ఇరుపక్షాల వారు. గొడవ జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ముందుగానే అక్కడి వచ్చిన పోలీసులు వారిని వారించి పంపించే ప్రయత్నం చేశారు. అయినా పరిస్ధితి అదుపులోకి రాకపోవడంతో 13 మంది తెలంగాణ న్యాయవాదులను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తరువాత బెయిల్‌నై విడుదల చేశారు.

వారం రోజుల పాటు ఎంపిల‌కు విప్ జారీ చేసిన కాంగ్రెస్‌

  సోనియా గాంధి మాన‌స పుత్రికగా భావిస్తున్న ఆహార‌భ‌ద్రత బిల్లు ఈ వారం స‌భ‌లో చ‌ర్చకు రానుండ‌టంతో పాటు ప‌లు కీలక‌మైన బిల్లులు ఆమోదం పొందాల్సి ఉండ‌టంతో కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. మరోవైపు తెలంగాణ, ఇతర అంశాల కారణంగా పార్లమెంటు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో ఎంపీలందరిని క‌ట్టడి చేయ‌డానికి కూడా విప్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తుంది కాంగ్రెస్‌.  సోమవారం నుంచి వరుసగా వారం రోజుల పాటు పార్టీ ఎంపీలందరూ తప్పనిసరిగా సభలోనే ఉండాలంటూ మూడు వాక్యాలతో కూడిన విప్ను జారీ చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల త‌మ ముఖ్య ప్రచారాస్త్రంగా భావిస్తున్న ఆహార భ‌ద్రత బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ అన్ని ర‌కాలుగా శ్రమిస్తుంది. ఈ బిల్లు ఈ సోమ‌వారం చ‌ర్చకు రానుంది. రాష్ట్రనికి చెందిన 12 మంది సీమాంద్ర ఎంపిలు స‌స్పెండ్ కావ‌టంతో, సోమ‌వారం నుంచి స‌భ స‌జావుగానే సాగుతుంద‌న్న ఆశాభావంలోనే ఉంది కాంగ్రెస్‌.ఇప్పటికే శనివారం మూడు బిల్లులను ఆమోదించారు. ఇక ఈ వారం ఆహార భ‌ద్రత బిల్లుతొ పాటు భూసేక‌ర‌ణ బిల్లు కూడా చ‌ర్చకు రానుంది. ఈ రెండు బిల్లులే ఈ సారి ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఓట్లు కురిపిస్తాయ‌ని కాంగ్రెస్ భావిస్తుంది.