ABK Prasad

'బొగ్గు'తో పూర్తిగా 'నల్లకప్పేసి' పోయిన కాంగ్రెస్ యుపిఎ సర్కారు!

- డా. ఎబికె ప్రసాద్ (సీనియర్ సంపాదకులు)       భారత రాజకీయాలలో చిత్రమైన పరిణామాలొస్తున్నాయి. మన ఇరుగు పోరుగైన పాకిస్తాన్ సైనిక నియంతృత్వానికి క్రమంగా దూరమవుతూ ప్రజాస్వామ్యం మార్గంలో కాళ్ళూనుకోడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో మన (భారత)దేశ రాజకీయ నాయకులు, ముఖ్యంగా పాలకపక్షాలు 'ప్రజాస్వామ్యం' పేరు చాటున దాగి ప్రజాస్వామిక పద్ధతులనుంచి పక్కదారులు తొక్కుతూ నియంతృత్వ పోకడలకు పట్టం కట్టె వైపుగా బలంగా అడుగులు వేస్తున్నారు.   పాకిస్తాన్ లో ఇంతకుముందు సైనిక పాలనా నియంతలలో ఒకరైన ముషారఫ్ తన హయాములో పాకిస్తాన్ న్యాయవ్యవస్థను సహితం శాసించే దశకు చేరుకున్నప్పుడు పాకిస్తాన్లోని ప్రజాస్వామ్య శక్తులు, కొన్ని రాజకీయపక్షాల దన్నుతో బలపడుతున్న పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చౌధురిని పదవినుంచి బర్తరఫ్ చేయడానికి సాహసించాడు. దాని పర్యవసానంగా పాకిస్తాన్ లోని ప్రజాస్వామ్య న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు మూకుమ్మడిగా విజృంభించి ముషారఫ్ చర్యను ఖండించడమేగాక భారీ స్థాయిలో కోర్టువద్ద, దేశంలోనూ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేయవలసి వచ్చింది. ఈ చర్య పాకిస్తాన్ లోని ప్రజాస్వామ్య శక్తులకు అంతకు ముందెన్నడూ లేని స్థాయిలో బలసంపన్నులను చేసింది. పాకిస్తాన్ పౌరసమాజం పౌర ప్రభుత్వం ఏర్పాటు కోసం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని జుల్ ఫికార్ భుట్టో ప్రదానమంత్రిత్వంతో ప్రారంభమైన (ఎన్నికల ద్వారా) పౌరప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా, భుట్టోను హత్య చేయడం ద్వారా, సైనిక నియంతృత్వ శక్తులు తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నించాయి. కాని భుట్టో హత్య అనంతరం ఆయని కుమార్తె, రాజకీయ నాయకురాలైన బెనాజిర్ భుట్టోను పాక్ ప్రజలు ప్రధానిగా ఎన్నుకున్నారు. ఈ పరిణామం జనరల్ ముషారఫ్ కు కంటగింపుగా మారి,ఆమె హత్యకు పన్నుగడ పన్నాడు.   ఆమె హత్యానంతరం అధికారానికి వచ్చినవాడు ముషారఫ్ కాని పాక్ ప్రజలు క్రమంగా ప్రజాస్వామ్య వ్యవస్థా స్థాపన కోసం అనేక త్యాతాల ద్వారా ఈ రోజుకీ అకుంఠితంగా పోరాడుతూనే ఉన్నారు. గత పదేళ్ళలోపే పాకిస్తాన్ ప్రజలు ఉగ్రవాదుల బెడద మధ్యనే తిరిగి పౌర ప్రభుత్వాలను ఎన్నికల ద్వారా ఎన్నుకోవడంద్వారా పౌర ప్రజాస్వామ్య ప్రబ్బుత్వాల సుస్థిరత కోసం పునాదులు వేసుకుంటున్నారు. అయినా, విదేశాలలో గత అయిదేళ్ళకు పైగా తలదాచుకుంటున్న ముషారఫ్ తిరిగి పాక్ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయాలని చూశాడు. ఆ ప్రయత్నాన్ని పాక్ రాజకీయ పక్షాలు, సుప్రీంకోర్టు, ఎన్నికల కమీషన్ కూడా తుత్తునీయలు చేశారు. మూడు, నాలుగు చోట్ల ముషారఫ్ వేసిన నామినేషన్ పత్రాలను స్థానిక ఎన్నికల సంఘాల రిటర్నింగ్ ఆఫీసర్లు తిరస్కరించడంతో అతగాడు డీలా పడిపోయాడు. ప్రజాస్వామిక శక్తుల అండతో తిరిగి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చౌధురి నాయకత్వంలో యిప్పటికి పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం కొంతవరకు నిలదొక్కుకుంది. ఇలాంటి పరిస్థితులలో మన దేశంలోని కాంగ్రెస్ - యు.పి.ఎ. పాలకవ్యవస్థ మాత్రం "ప్రజాస్వామ్యం'' పేరిటనే అనేక ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యలకు పాల్పడడమే గాకుండా ప్రపంచబ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్కరణలను తలకెత్తుకుని, బహుళ జాతి గుత్తసంస్థల పెట్టుబడులకు దేశపు ఆర్థికవ్యవస్థను భారత పారిశ్రామిక, వ్యవసాయ విధానాలకు విరుద్ధంగా బాహాటంగా తలుపులు తాను కూడా భారీ స్థాయిలో అవినీతికి పాల్పడింది. ఇలా దేశ సహజవనరులలో కీలకమైన  రేడియో తరంగ వ్యవస్థపై ఆధిపత్యాన్ని విదేశీ గుత్త కంపెనీలకు "2-జి స్పెక్ట్రమ్'' పేరిట గుత్తగా కట్టపెట్టడానికి చేసిన ప్రయత్నంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆర్థికమంత్రి చిదంబరం, ప్రధానమంత్రి కార్యాలయం, చివరికి జాతీయస్థాయి నేర విచారణ సంస్థ అయిన సిబీఐ ఉన్నతాధికారులు కొందరు (ఎ.కె.సింగ్) పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ దొరికిపోయారు.   ఈ "స్పెక్ట్రమ్'' తాలూకూ "అయినవాళ్ళకు కంచాలలో'' పెట్టి లైసెన్సులను విచ్చలవిడిగా యు.పి.ఎ. సర్కారు పంచడాన్ని సుప్రీంకోర్టు విమర్శించి, 122 లైసెన్సులను చుప్తాగా రద్దుచేసింది. ఇది పాలకశక్తులకు "గొంతులో పచ్చి వెలక్కాయ''గా మారింది. ఈలోగా ఈ "స్పెక్ట్రమ్'' కుంభకోణం ఆనాటి టెలికామ్ మంత్రి రాజా చర్యల ఫలితమేనని ప్రకటించి, అతణ్ణి మాత్రమే నేరస్థుడిగా చిత్రించి, అరెస్టు చేసి, ఆ దరిమిలా కేంద్రంలో డి.ఎం.కె. అండకోసం అతనికి బెయిల్ మంజూరు చేసిందీ ప్రభుత్వమే! తీరా ఇప్పుడు అదే రాజా ఈ కుంభకోణానికి ప్రధానబాధ్యులు మన్మోహన్ సింగ్, చిదంబరం అనీ, ప్రధానమంత్రితో చర్చించిన తరువాతనే, అతని అనుమతి మీదనే, అతని కోరిక మేరకే తాను లైసెన్సులు మంజూరు చేయడం జరిగిందనీ రాజా విస్పష్టమైన ప్రకటనతో ముందుకొచ్చాడు. అయినా సరే ప్రధానమంత్రికి, చిదంబరానికీ ఎలాంటి సంబంధంలేనట్టు ఇతర సంబంధిత మంత్రులు ప్రభుత్వంలో దాగిన అవినీతిపరులను పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, రాజకీయపక్షాల ప్రతినిధులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ సంఘానికి అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న పి.సి.చాకో (కాంగ్రెస్) బుకాయింపులకు దిగాడు. ఈలోగా బొగ్గుగనుల కేటాయింపుల విషయంలో బి.జె.పి. హయామునుంచి నేటిదాకా కొనసాగుతున్న లైసెన్సుల కుంభకోణంతో కూడా మన్మోహన్ సింగ్ కు "సంబంధం ఉంద''ని ఆరోపణలు వెల్లువెత్తాయి. "ముగ్గురి మధ్య ముంత దాగింద''న్న సామెతలాగా ఇలాంటి కుంభకోణాల మధ్యనే నియంతృత్వశక్తులు కూడా బలుస్తూంటాయి. చివరికి, తాజాగా ప్రయివేట్ పార్టీలకు బొగ్గుగనుల కేటాయింపులలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపిన ప్రభుత్వ సంస్థ సిబీఐ సహితం రూపొందించిన నివేదికలోని అంశాలను కూడా పాలకపక్షం తారుమారు చేసి తన ప్రభుత్వాన్ని ఎలాగోలా రక్షించుకొనే ప్రయత్నంలో సిబీఐ అధికారులను అటకాయించడానికి ప్రయత్నించింది. దీని పర్యవసానంగా ప్రతిపక్షాల నిరంతర డిమాండ్ల మధ్యన ప్రభుత్వం తప్పించుకోలేని పరిస్టితులలో సుప్రీంకోర్టు జోక్యం ద్వారా సిబీఐ వాస్తవాలతో కోర్టు ముందుకు రాక తప్పలేదు. తన వాంగ్మూలాన్ని సమర్పించింది. కోర్టుకు సమర్పించడానికి ముందే న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్ కు నివేదికను చూపించిన మాట నిజమేనని సిబీఐ ఒప్పేసుకుంది.   అశ్వినీ కుమార్ కే గాక, ప్రధానమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులకూ, బొగ్గుగనులశాఖా అధికారులకూ కూడా చూపించామని సిబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా వెల్లడించడంతో పాలకపక్షం గుట్టు కాస్తా రట్టు అయింది. అయితే "మొండివాడు రాజుకంటే ఘనుడు'' అన్నట్టుగా ప్రధాని మన్మోహన్ సింగ్ నిరంకుశుడిగా మొదటిసారిగా తన నిజరూపాన్ని బయటపెట్టుకున్నారు. న్యాయశాఖమంత్రి అశ్వినీ కుమార్ రాజీనామా చేయవలసిన అవసరమే లేదని ప్రతిపక్షాల డిమాండ్ ను తోసిపుచ్చారు. అదేమంటే, యు.పి.ఎ. తొమ్మిదేళ్ళ పాలనలో ప్రతిపక్షాలు ఇలా వ్యవహరించడం వాటికి మామూలేన''ని వాదించసాగారు! చివరికి అవసరమైతే మిగిలిన పార్లమెంటు బడ్జెటరీ సమావేశం కాస్తా చుప్తాగా రద్దయ్యే పరిస్థితి వచ్చినా మన్మోహన్ సింగ్ తన వైఖరిని మార్చుకోడాని వార్తలొచ్చాయి! లార్డ్ యాక్డన్ సూక్తి ప్రకారం "కొంత అవినీతికి అలవాటుపడిన వాళ్ళు పూర్తిస్థాయిలో అవినీతికి పాల్పడడానికి జంకరు''! అలాగే రోచీ అనే ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త దృష్టిలో "ఆహికారంలో ఉన్నప్పుడు అవినీతికి అలవాటుపడ్డ వారు అధికారాన్ని కోల్పోనున్నామని భావించినప్పుడు కూడా భారీ అవినీతికి దిగుతార''ట! నిరంకుశ వ్యవస్థకు బీజాలు పడేది యిలాగనేనని మరవరాదు. చివరికి 2-జి స్పెక్ట్రమ్ కుంభకోణం సందర్భంగా ప్రజాస్వామిక పద్ధతిలో వ్యవహరించిన సుప్రీంకోర్టు చేతుల్ని కూడా మెలితిప్పాలని ఈ మధ్యలో పాలకశక్తులు ప్రయత్నించడాన్ని మనం మరచిపోలేదు. ఈ ప్రయత్నంలో భాగంగానే ప్రధానమంత్రి ఒకసారి "రాజ్యాంగం పాలకవర్గానికి, న్యాయవ్యవస్థకు మధ్య బాధ్యతలను విభజించి ఉన్నందున ఒకరి విభాగంలో మరొకరు జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిద''ని హెచ్చరించిన విషయాన్ని మరవరాదు! ఇలాంటి ఘట్టాలలోనే "ముచ్చు''కూ, "నాలిముచ్చు'' కూ ఉన్న తేడా గురించి పెద్దలు ప్రస్తావిస్తుంటారు!

 jagan bail

వైఎస్ జగన్ బెయిల్ కు సుప్రీం 'నో'

      అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. జగన్ బెయిల్‌పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. జగన్ కేసుకు సంబంధించి సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సీబీఐ తరఫున న్యాయవాదులు ఎవరూ హాజరుకాలేదు. కేసు ఇన్వేష్టిగేషన్ చేస్తున్న ఎస్.పి. వెంకటేష్ మాత్రమే హాజరయ్యారు. విజిటర్స్ హాలులో కూర్చుని వాదనలు విన్నారు. జగన్ తరఫున న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.

minister ganta srinivasa rao

వైజాగ్ కాంగ్రెస్ లో సిగపట్లు

  ఇంకా ఎన్నికలకి ఏడాది సమయం ఉండగానే, వైజాగ్ లో కాంగ్రెస్ నేతలందరూ ఎవరి ప్రయత్నాలలో వారు బిజీ అయిపోయారు. కొందరు తమకే టికెట్ ఇప్పించవలసిందిగా పార్టీ పెద్దల దగ్గర పైరవీలు చేసుకొంటుంటే, మరికొందరు తమకు పోటీగా ఉన్న వారిని రంగంలోంచి తప్పించేందుకు పావులు కదుపుతున్నారు.   ఈ విషయంలో అందరి కంటే ముందుగా రాజ్యసభ సభ్యుడు టీ.సుబ్బిరామి రెడ్డి రంగంలోకి దిగి అటు డిల్లీలోను, ఇటు నగరంలోనూ ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల నగరంలో అంబులెన్స్ సర్వీసులను కూడా ప్రారంబించారు.   ఇక కాంగ్రెస్ పార్టీలో ముటాలు కట్టుకోవడానికి పెద్ద కారణాలేవీ అక్కరలేదనే సంగతి అందరికీ తెలిసిందే. మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి, అనకాపల్లి ప్రాంతాలను విశాఖలో విలీనం చేద్దామనే ప్రతిపాదన చేయగా దానిని సుబ్బిరామి రెడ్డి సమర్దించారు. కానీ, పురందేశ్వరి మరియు విశాఖ దక్షిణ శాసన సభ్యుడు మరియు నగరంపార్టీ అధ్యక్షుడు తైనాల విజయకుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమస్యను పరిష్కరించేదుకు శాసనసభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. ఆ కమిటీ విలీన ప్రతిపాదనను నిర్ద్వందంగా ఖండించడంతో దానిని సమర్దిస్తున్న వారిరువురి అహం దెబ్బతింది.   అటువంటి సమయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ రాష్ట్రంలో జిల్లా, నగర, మండల స్థాయి వరకు పార్టీలో మార్పులు, చేర్పులు చేస్తుండటంతో ఇదే అదునుగా గంటా శ్రీనివాసరావు ‘ఒక వ్యక్తికి ఒక పదవి’ అనే రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ఫార్ములాను తెలివిగా ఉపయోగించుకొని, తనను వ్యతిరేకిస్తున్న తైనాలను ఆ పదవిలోంచి తప్పించి తన అనుచరుడు బెహరా భాస్కర్ రావుని నియమించుకొన్నారు. అందుకు సుబ్బిరామిరెడ్డి కూడా ఓ చెయ్యేసి తోడ్పడారని సమాచారం.   తద్వారా మంత్రి గంటా తనను వ్యతిరేకించినందుకు తైనాల పదవికి కత్తెరవేసి తన తడాఖా చూపించానని సంతోషిస్తే, తద్వారా పురందేశ్వరికి తన తడాఖా చూపానని సుబ్బిరామిరెడ్డి కూడా సంతోషిస్తున్నారు. పనిలో పనిగా ఆమెను కూడా మెల్లగా పోటీలోంచి తప్పించాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, గతంలో కార్పొరేటర్ గా ఉన్న తన అనుచరుడు భాస్కర్ రావుని ముందుకు తేవడం ద్వారా రాబోయే ఎన్నికలలో తనను వ్యతిరేకిస్తున్నమరో విశాఖ శాసనసభ్యుడిని కూడా రేసులోంచి తప్పించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.   ఈ సిగపట్లు ఎన్నికలు దగ్గిరపడుతున్న కొద్దీ ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు. ఇటువంటి రాజకీయాలను చూస్తుంటే రాహుల్ గాంధీ వల్లె వేస్తున్న నీతి సూత్రాలని కాంగ్రెస్ పార్టీలో అమలు చేయడం ఎన్నటికయినా సాధ్యమేనా అనే ప్రశ్న ప్రజలకి ఉదయించక మానదు.

 former Ap minister Sripathi Rajeshwar Rao

శ్రీపతి రాజేశ్వర్ కు బాలకృష్ణ నివాళి

        అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన శ్రీ పతి రాజేశ్వర్ బౌతికకాయానికి మారేడుపల్లిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో శ్రీపతి రాజేశ్వర రావు మంత్రిగా పని చేశారు. ఎన్టీఆర్‌కు ఆయన విపరీతమయిన అభిమాని. ఆయన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. అరవై ఏళ్ల క్రితమే ఆయన అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఎన్టీఆర్ పార్టీ పెట్టాక అందులో చేరి మూడుసార్లు శాసనసభ్యులుగా గెలుపొంది, రెండుసార్లు మంత్రిగా పని చేశారు. పార్టీ పెట్టక ముందు నుండే ఎన్టీఆర్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ మీద అభిమానంతో శరీరంపై ఆయన ఎన్టీఆర్ బొమ్మను పచ్చ పొడిపించుకున్నారు. నిజాయితీ గల నేతగా ఆయన పేరుంది.

cm kiran kumar reddy

కాంగ్రెస్ లో ఒంటరయిన ముఖ్యమంత్రి

  ఏ కార్యక్రమమయినా సాదాసీదాగా జరిగితే అది ఖచ్చితంగా కాంగ్రెస్ కి సంబందించినది మాత్రం కాదని చెప్పవచ్చును. అది కాంగ్రెస్ సమావేశం అయినా, పధకం అయినా నియామకం అయినా ఎంతో కొంత రాజకీయం తప్పని సరి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ హస్తం’, ‘ఇందిరమ్మ కలలు’, ‘బంగారు తల్లి’ పధకాలను ఈ రోజు మెదక్ జిల్లా సంగారెడ్డిలో ప్రారంభించనున్నతరుణంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఈ కార్యక్రమాలకి మొహం చాటేసి విదేశాలకు వెళ్ళిపోయారు. ముఖ్య మంత్రి తనకు ఏమాత్రం విలువ ఈయడం లేదని ఆయన అలిగారు. కానీ, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సునితా రెడ్డి మాత్రం వారిరువురి మద్య ఎటువంటి విభేదాలు లేవవి ఒక సర్టిఫికేట్ జారీచేసారు.   ఇక, మొన్న కరీంనగర్ లో జరిగిన మరో సభలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణా విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకోవాలని, తెలంగాణా రాష్ట్రం కోసం కేంద్రాన్ని ఒప్పించవలసిన బాధ్యత తీసుకోవాలని సభాముఖంగా కోరిన తరువాత ‘జై తెలంగాణా!’ అంటూ నినాదాలు చేసారు. దానితో వేదిక మీదున్న కిరణ్ కుమార్ రెడ్డి కొంచెం అసహనం ప్రకటిస్తూ తెలంగాణా అంశం కేంద్రం పరిధిలో ఉందని కేంద్రం ఏ నిర్ణయం తీసుకొన్నా దానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ప్రకటించవలసి వచ్చింది.   ఒకవైపు ఎంతో ఆర్భాటంగా ఆయన తన పధకాలను ప్రచారం చేసుకొని ప్రజలలో తన ప్రతిష్ట పెంచుకోవాలని ఆయన ప్రయత్నిస్తుంటే, అది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయం, దానితో తమకేమి సంబంధం లేదన్నట్లు ఆయన క్యాబినెట్ మంత్రులే ప్రవర్తించడం విశేషం. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రితో ఆయనకున్న విబేదాలు తరచూ బయట పడుతూనే ఉన్నాయి.   ఇక రాష్ట్ర మంత్రి వర్గం, శాసన సభ్యులలో సగం మంది తెలంగాణా కారణంగా ఆయనను వెలివేస్తే, వివిధ కారణాలతో డా.రవీంద్రా రెడ్డి, వీ.హనుమంత రావు, చిరంజీవి, రామచంద్రయ్య వంటివారు అనేక మంది ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఇక, మాజీ మంత్రి శంకర్ రావు అయితే తీవ్ర విమర్శలు చేసారు. ముఖ్యమంత్రి పరిస్థితి చూస్తే ఆయనకు కేవలం అధిష్టానం మద్దతు ఉండనే ఏకైక కారణంతోనే మిగిలిన వారందరూ ఆయనని బలవంతంగా భరిస్తున్నట్లు ఉంది తప్ప, ఆయనతో కలిసి పనిచేసే ఆసక్తి ఎవరికీ ఉన్నట్లు కనబడటం లేదు. అందుకు ఆయననే తప్పుపట్టాల్సి ఉంటుంది.   పార్టీలో, ప్రభుత్వంలో అందరిని కలుపుకుపోవలసిన పార్టీలో ఒంటరివాడుగా తిరుగుతున్నారు. కానీ పార్టీలో, ప్రభుత్వంలో తనను ఎంతమంది వ్యతిరేఖిస్తున్నా ఆయన మాత్రం తన పద్దతిలో ముందుకు సాగిపోతున్నారు. మరి, ఇటువంటి నేపద్యంలో ఆయన సారద్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కొంటుందో, ఏవిధంగా గెలుస్తుందో కాలమే చెప్పాలి.

 kiran kumar reddy

లోకేష్ రాజకీయ ప్రవేశం

        సరైన సమయంలో రాజకీయరంగ ప్రవేశం చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనయుడు లోకేశ్ అన్నారు. ప్రస్తుత రాజకీయాలను ఎప్పటికప్పుడు దగ్గరగా, సునిశితంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. పార్టీ శ్రేణుల్లో తనకు ఆదరణ పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించగా... "అది అంత ప్రధానం కాదు. మా అందరికీ చంద్రబాబు ముఖ్యం. ప్రజలతో ఆయన పూర్తిగా మమేకమయ్యారు. మేమంతా ఆయన వెంట సేవకుల్లా నడుస్తున్నాం'' అని తెలిపారు. చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర పూర్తిస్థాయిలో విజయవంతమైందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని లోకేశ్ తెలిపారు. ఇందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

kiran kumar reddy

దామోదర ఇలాకాలో కిరణ్

        ఒకరు ముఖ్యమంత్రి. మరొకరు ఉప ముఖ్యమంత్రి. కలసి ఉండి ప్రభుత్వాన్సి నడిపించాల్సిన వారికి ఎవరికి వారే పై చేయి అనిపించుకోవాలన్న ఆశ. ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ కలలు కార్యక్రమంలో తనకు ప్రాధాన్యం లేదని, ఆ కార్యక్రమ ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లలో నా ఫోటో పెట్టలేదని కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఆయన హాంకాంగ్ కు ఫ్లైటెక్కి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహల మధ్య విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. తనకు సరయిన ప్రాధాన్యం లభించడం లేదని ముఖ్యమంత్రి మీద అలిగిన రాజనర్సింహ ముఖ్యమంత్రితో జరిగిన సమావేశం తరువాత కూడా అలకవీడలేదు. ఆయన రాజనర్సింహ సొంత జిల్లాలో పర్యటిస్తుంటే అందుబాటులో లేకుండా పోయారు. ఆరు జిల్లాలలో ఇప్పటికి ఇందిరమ్మ కలలు పథకం కార్యక్రమం సాగింది. కానీ ఎక్కడా ఉప ముఖ్యమంత్రికి ప్రాధాన్యం లేదు. దానికితోడు ఇన్నాళ్లు తన వెంటనే ఉన్న జిల్లా ఎమ్మెల్యే జగ్గారెడ్డితోనే ఇప్పుడు తన మీద ముఖ్యమంత్రి విమర్శలు గుప్పిస్తున్నారని రాజనర్సింహ గుర్రుగా ఉన్నారు. మొత్తానికి ఆయన లేకుండానే ఆయన జిల్లాలో నేటి ముఖ్యమంత్రి పర్యటనకు రంగం సిద్దమయింది.  

konda sureka

కొండా సురేఖ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకే!

  దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులు, విశ్వాసపాత్రులని పేరొందిన కొండా సురేఖ ఆమె భర్త మురళి, ఆయన మరణించిన తరువాత కూడా ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి పట్ల అదే వినయ విదేయతలు కనబరిచారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిరువురూ ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతున్నపుడు కూడా వారు తమ విస్వసనీయతకే ప్రాముఖ్యత ఇచ్చారు తప్ప కేసీఆర్ వంటి తెలంగాణ నేతల మాటలకు జడిసి ఎన్నడూ కూడా జగన్ మోహన్ రెడ్డి చేయి వీడే ప్రయత్నం చేయలేదు. అంతే గాకుండా వారిరువురూ తమ పార్టీకి తెలంగాణలోబలమయిన పునాదులు వేసి, పార్టీని వరంగల్ పరిసర జిల్లాలలో వ్యాపింపజేశారు కూడా.   తెలంగాణలో పార్టీకి వ్యతిరేఖ గాలులు వీస్తున్న తరుణంలో షర్మిల చేప్పటిన ‘మరో ప్రస్థానం’ పాదయాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన వచ్చిందంటే దానికి కారణం కొండ దంపతుల కృషి తప్ప జగన్ మోహన్ రెడ్డి ప్రభావంవల్ల మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఒకానొక సమయంలో కొండ సురేఖ దంపతులే పార్టీకి తెలంగాణలో పెద్ద దిక్కుగా నిలుస్తూ పార్టీని తెరాస నేతల దాడి నుండి కాపాడుకొన్నారు.   కానీ, క్రమంగా పార్టీలో వారి వ్యతిరేఖ వర్గాలు బలం పుంజుకొని పార్టీ అధిష్టానం వద్ద వారిపై పిర్యాదులు చేస్తుండటంతో, పార్టీ కొండా దంపతుల విధేయతను కూడా పరిగణలోకి తీసుకోకుండా, వారిని దూరం చేసుకోవడం ఆరంబించింది. గత ఏడాది డిశంబరు నెలలో కేంద్ర హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే నేతృత్వంలో డిల్లీలో తెలంగాణాపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి పార్టీ తరపున కొండా సురేఖను కాదని వేరొకరిని పంపడంతోనే, పార్టీలో వారి ప్రాధాన్యం తగ్గించడం మొదలయిందని చెప్పవచ్చును. నాటి నుండి కొండా దంపతులు కూడా పార్టీ వ్యవహారాలలో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. వారు గత కొంత కాలంగా షర్మిల పాదయాత్రలో కానీ, పార్టీ సభలు, సమావేశాలలోగానీ కనబడలేదు.   ఇటీవల వరంగల్‌ జిల్లాలో పార్టీ కన్వీనర్‌ పదవుల ఎంపికలో వారిని పక్కన పెట్టి, వారి వ్యతిరేఖ వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో, పార్టీలో తమ పరిస్థితి పూర్తిగా తారుమారయిందని వారికి అర్ధం అయింది. పార్టీ అధిష్టానానికి ఎంత విదేయత కనబరిచినా, ఎంత సేవచేసినా తగిన గుర్తింపు గౌరవం దక్కకపోగా, చివరికి ఈవిధంగా అవమానకర పరిస్థితులు ఎదుర్కోవలసిరావడంతో జీర్ణించుకోలేని కొండా దంపతులు, ఇటీవల తమ అనుచరులు వరంగల్ పట్టణంలో పార్టీ కార్యాలయానికి తాళం వేసి నిరసనలు తెలిపినప్పుడు వారిరువురూ మౌనం వహించడంతో, వారిని దెబ్బతీయాలని చూస్తున్నవ్యతిరేఖవర్గానికి మరో సదవకాశం కల్పించినట్లయింది. ఈ విషయన్నివారు పార్టీ అధిష్ఠానం చెవిలో వేయడం, వెంటనే వారిరువురికీ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు నోటీసులు జారీ చేయడంతో, కొండా సురేఖ దంపతుల ఉద్వాసనకు రంగం సిద్దం అయింది. వారు కూడా తమ పట్ల పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుకి తీవ్ర మనస్తాపం చెంది ఇక నేడో రేపో పార్టీని వీడేందుకు సిద్దపడుతున్నట్లు సమాచారం.   తెలంగాణ ప్రాంతంలోబలమయిన నేతయిన కొండా సురేఖ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న తెరాస వారిరువురినీ తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేసింది. కానీ, వారు తిరిగి తమ కాంగ్రెస్ పార్టీ గూటికే చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కూడా వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికయినా తమపట్ల పార్టీ అధిష్టానం వైఖరిలో మార్పు కనబడకపోతే బహుశః వారు త్వరలోనే పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.

chandrababu padayatra

చంద్రబాబుకు హైదరాబాద్ లో ఘన స్వాగతం

        తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న ప్రారంభించిన 'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర ముగించుకుని ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న బాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట కుమారుడు నారా లోకేష్‌నాయుడు, సినీ నటుడు బాలకృష్ణ, పార్టీ నేతలు తదితరులు ఉన్నారు. చంద్రబాబునాయుడు విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. భారీగా టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. రాజేంద్రనగర్‌వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో బాబు పాల్గొని ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి ఎన్టీఆర్‌కు నివాళులర్పించి ఇంటికి చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఈ సాయంత్రం ఉప్పల్‌లో జరగనున్న ఎమ్మార్పీస్ యుద్ధభేరి సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఏడు నెలల సుదీర్ఘ పాదయాత్ర ముగించుకుని చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు.

Ex Minister Sripathi Rajeshwar Rao Died

టిడిపి మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వరరావు కన్నుమూత

      మాజీ మంత్రి, అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీపతి రాజేశ్వర రావు ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో రాజేశ్వర రావు బాధపడుతున్నారు. ఈ ఉదయం ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో శ్రీపతి రాజేశ్వర రావు మంత్రిగా పని చేశారు. ఎన్టీఆర్‌కు ఆయన విపరీతమయిన అభిమాని. ఆయన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. అరవై ఏళ్ల క్రితమే ఆయన అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఎన్టీఆర్ పార్టీ పెట్టాక అందులో చేరి మూడుసార్లు శాసనసభ్యులుగా గెలుపొంది, రెండుసార్లు మంత్రిగా పని చేశారు. పార్టీ పెట్టక ముందు నుండే ఎన్టీఆర్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ యువసేన పెట్టి ఆయన దగ్గరయ్యారు. ఎన్టీఆర్ మీద అభిమానంతో శరీరంపై ఆయన ఎన్టీఆర్ బొమ్మను పచ్చ పొడిపించుకున్నారు. నిజాయితీ గల నేతగా ఆయన పేరుంది. ఆయన అంత్యక్రియలు రేపు బన్సీలాల్ పేట స్మశానవాటికలో నిర్వహిస్తారు.

ntr statue

త్వరలో పార్లమెంటు ఆవరణలో నందమూరి వారి విగ్రహం

    ఎట్టకేలకు పార్లమెంటు ప్రాంగణంలో తెలుగు సినీ జగత్తులో రారాజుగా వెలిగిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుగారి విగ్రహం పెట్టబోతున్నారు. ఆయన కుమార్తె శ్రీమతి పురందేశ్వరి కృషివల్లనే ఇది సాద్యం అయింది. లోక్ సభ స్పీకర్ మీరా కుమారిగారు వచ్చేనెల 7వ తేదీన ఈ విగ్రహావిష్కరణ చేయనున్నారు. శ్రీమతి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ, తన చిర కాల స్వప్నం ఈ నాటికి సాకారం అవుతున్నదుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. నందమూరి కుటుంబ సభ్యులందరినీ ఈ విగ్రహావిష్కరణ సభలో పాల్గొనమని తానూ స్వయంగా ఆహ్వానిస్తానని ఆమె తెలిపారు. తెలుగు జాతి కీర్తిప్రతిష్టలకు, ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే నందమూరి వారి విగ్రహం దేశ రాజధాని డిల్లీలో ఆవిష్కరించబడటం తెలుగు ప్రజలందరికీ సంతోషం కలిగించే విషయమే.

dadi veerabadra rao

బాబు సభకి హరికృష్ణ, కడియం, దాడి డుమ్మా

                        ఎంతో ఘనంగా, ఆర్భాటంగా జరుగుతున్నచంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకి హరికృష్ణ రాకపోవచ్చునని అందరూ ఊహిస్తున్నపటికీ, ఎవరూ ఊహించని విదంగా తెదేపా సీనియర్ నేతలు కడియం శ్రీ హరి మరియు దాడి వీరభద్రరావులు కూడా మొహం చాటేశారు.   గతంలో తనకు ప్రాదాన్యం ఈయలేదని మోత్కుపల్లి నరసింహులు అలిగితే, చంద్రబాబు ఆయనను ఎలాగో బుజ్జగించుకొని దారికి తెచ్చుకొన్నారు. కానీ ఇటీవల పార్టీ తెలంగాణా ఫోరం సమావేశంలో కడియం, మోత్కుపల్లి మద్య మొదలయిన ‘పార్టీలో చీడపురుగుల గొడవ’ ముదిరినప్పుడు చంద్రబాబు మొత్కుపల్లిని వారించకపోవడంతో మనస్తాపం చెందిన కడియం ఈ సభకి మొహం చాటేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలకి మనస్తాపం చెంది సభకు రాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు.   ఇక దాడి వీరభద్రరావు తనని మళ్ళీ రెండో సారి శాసనమండలికి నామినేట్ చేయనందుకు అలిగిన సంగతి తెలిసిందే. కానీ వచ్చే ఎన్నికలలో ఆయనకి లోక్ సభ టికెట్, ఆయన కొడుక్కి శాసనసభ టికెట్ కోరుతునట్లు సమాచారం.   ఇక హరికృష్ణ ఇటీవల జరిగిన పరిణామాలతో పార్టీకి మరింత దూరం అయినట్లు కనిపిస్తోంది. అందుకు చంద్రబాబు కూడా చింతిస్తున్నట్లు లేదు.   నిన్న ఈనాడు న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో “మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం.  తల్లి కాంగ్రెస్ లోఒకరు, పిల్ల కాంగ్రెస్ లో మరొకరు మావాళ్ళున్నారు. పార్టీకోసం అవసరమయితే కుటుంబ సభ్యులను కూడా వదులుకోవడానికి సిద్దం” అని చెప్పడం ఆయనను ఉద్దేశించినవేనని భావించవచ్చును.   ఇటువంటి పరిస్థితుల్లో ఈ సభకు హరికృష్ణ వస్తారని ఎవరూ భావించలేదు. కానీ, తన జీవితాంతం తెదేపా లోనే ఉంటానని, పార్టీ కోసమే పని చేస్తానని చెప్పిన జూ.యన్టీఆర్ ను కూడా సభకు పంపకపోవడం ద్వారా హరికృష్ణ తమ అభిప్రాయం చాలా స్పష్టంగానే తెలియజేసారు. అంతిమంగా ఈ పరిణామాలన్నీ తెదేపాలో ఉన్న అంతర్గత విబేధాలను మరోమారు బయట పెట్టింది. అంతే గాకుండా ఇప్పటికే ఉన్న దూరాన్ని మరింత పెంచింది.

 kcr telangana

టీఆర్ఎస్ లోకి 8 మంది ఎంపీలు,ఎమ్మెల్యేలు

      నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో శనివారం జరుగుతున్న టీఆర్ఎస్ 13వ ఆవిర్భావ సభలో కేసీఆర్ ప్రసంగించారు. త్వరలోనే ఏడు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మే నెల చివరి వరకు మిగతా పార్టీలన్నీ ఖాళీ అవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. పార్టీ నేతల రంగు బయట పడిందని, ఉద్యమం కొనసాగిస్తూనే రాజకీయశక్తిగా ఎదగాలని కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కొంత మంది తెలంగాణ నేతలే తెలంగాణకు అడ్డంకిగా ఉన్నారని కేసీఆర్ ఆరోపించారు. ఇప్పటి వరకు తెలంగాణ కోసం చాలా ఉద్యమాలు, నిరసనలు చేపట్టినప్పటికీ ఫలితం దక్కలేదని, అయినప్పటికీ తమ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం చేసిన వాగ్ధానాలను నిలుపుకోవాలంటే ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.వరుసగా ఏడోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడుగా కేసీఆర్ ఎన్నికయ్యారు.

jayaprada

జయప్రదకు రాజమండ్రీ టికెట్ దొరికినట్లే

  ఆమె సోనియాగాంధీని కలిసి గట్టిగా రెండు రోజులయినా కాక మునుపే రాజమండ్రి లోక్ సభ సభ్యడు ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఆమె గనుక రాజమండ్రీ నుండి పోటీ చేయదలిస్తే తానూ ఆమెకు అన్నివిధాల సహకారం అందిస్తానని చెప్పడం విశేషం. తనకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని మారు మాట్లాడకుండా చేపడతానని , ఒక వేళ పార్టీ ఆదిష్టానం తనను రాజ్యసభకు పంపించినా తనకు ఆనందమేనని ఆయన చెప్పడం గమనిస్తే, తానూ లోక్ సభ సీటుని జయప్రదకు అప్పగిస్తునందున బదులుగా పార్టీ తనను రాజ్యసభకు పంపిస్తే బాగుంటుoదని ఆయన సూచన ప్రాయంగా చెప్పడమే కాకుండా, పార్టీ కూడా ఆదే నిర్ణయించడం వలననే ఆయన ఈ ప్రకటన చేస్తున్నట్లు భావించవచ్చును.ఈ విషయంలో కేంద్రమంత్రి మరియు అలనాటి ఆమె హీరో చిరంజీవి కూడా ఆమె గురించి సోనియాగాంధీ చెవిలో ఒక ముక్క వేసి సాయపడ్డారేమో మరి తెలియదు. ఏమయితేనేమి ఎట్టకేలకు జయప్రద తన పంతం నెగ్గించుకోగలిగారు. ఇక నేదో రేపో మంచి రోజు చూసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఆమె ప్రకటించడమే తరువాయి.

 Sarabjeet Singh

సరబ్జిత్ సింగ్ పై ఖైదీల దాడి, కోమాలోకి

        పాకిస్థాన్ లోని కోట్ లఖ్ పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత ఖైదీ సరబ్జిత్ సింగ్ నిన్న ఖైదీల దాడిలో గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన మీద తోటి ఖైదీలు ఇటుకలు, కత్తితో దాడి చేశారు. దీంతో ఆయన ఇంకా కోమాలోనే ఉన్నాడు. పాక్ లోని జిన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన ఆయన తలకు గాయం కారణంగా కోమాలో ఉన్నారు. ఆపరేషన్ చేసేందుకు ఐసీయూలో ఉంచినా కోమాలో ఉన్న కారణంగా ఎలాంటి శస్త్ర చికిత్స చేయకుండా ఆపారు. ప్రస్తుతం అతను ఉన్న పరిస్థితిలో ఎలాంటి చికిత్స చేయలేమని వైద్యులు చెబుతున్నారు. 23 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్న సరబ్ జిత్ ఉరిశిక్ష పడ్డ ఖైదీ. మరోవైపు సరబ్ జిత్ పరిస్థితిపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జైలులో ఇంతకుముందు ఓ హత్యతో పాటు అనేక దాడులు జరిగాయి. అఫ్జల్ గురు ఉరి నేపథ్యంలో సరబ్ జిత్ కు భద్రత పెంచారు. నాలుగువేల మంది ఉండాల్సిన ఈ జైలులో 17 వేల మంది ఖైదీలు ఉన్నారు. దాడికి జైలు అధికారులు భాద్యత వహించాలని సరబ్ తరపు న్యాయవాది ఒవైస్ షేక్ డిమాండ్ చేస్తున్నారు.

విశాఖకు హరికృష్ణ, ఎన్టీఆర్ వస్తారా?

        తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖపట్నం బహిరంగ సభకు నందమూరి వారసులు ఎవరెవరు వస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ సభలో పాల్గొనవలసిందిగా కోరుతూ పార్టీ నేతలకు, నందమూరి కుటుంబ సభ్యులకు, మిత్ర పక్షాల నేతలకు, దేశ విదేశాలలో ఉన్న పార్టీ అభిమానులకు టిడిపి ఆహ్వానాలు పంపింది. చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ తప్ప మిగతా నందమూరి కుటుంబ సభ్యులెవరూ ఈ సభలో పాల్గొనకపోవచ్చునని ప్రచార౦ జరుగుతోంది. విశాఖలో చంద్రబాబు, బాలయ్య, లోకేష్ ప్లెక్సీలు మాత్రమే కనిపిస్తున్నాయన్న వార్తలు కూడా రకరకాల ఊహాగానాలకు తెరతీస్తున్నాయి. ఇటీవల ఫ్లెక్సీబ్యానర్లతో నందమూరి కుటుంబ సభ్యుల మద్య తలెత్తిన వివాదాల కారణంగా హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వెళ్లకపోవచ్చని చెబుతున్నారు. బాలకృష్ణ మినహా నందమూరి వారసులేవ్వరూ సభకు హాజరుకాకపోతే..ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళా తాయంటూ పార్టీ నేతలు కొందరు హరికృష్ణ ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పాదయాత్ర ముగింపు సభకు టిడిపి కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నపార్టీ కార్యకర్తలు, నాయకులూ అందరు కలిసి దాదాపు 10లక్షల మంది వరకు రావచ్చునని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే 12 ప్రత్యేక రైళ్ళను, 500 బస్సులను, అనేక మినీ వ్యాన్లను ముందుగానే బుక్ చేసారు. అదేవిధంగా నగరంలో ఉన్న చిన్న పెద్దా హోటల్స్ మరియు గెస్ట్ హౌసులలో రూములు కూడా ఇప్పటికే చాలావరకు బుక్ అయిపోయినట్లు సమాచారం.   ఇంత భారీ ఎత్తున తరలి వస్తున్న జనాలను అదుపుచేసేందుకు పోలీసులు కూడా అదనపు బలాలను ఇతర జిల్లాల నుండి రప్పిస్తున్నారు. ఇక 26వ తేదీ నుండే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్ళింపులు ఉంటాయని పోలీసు అధికారులు తెలియజేసారు. సభాస్థలి జనసాంద్రత ఎక్కువ ఉండే నగరం నడిబొడ్డున ఉండటంతో పోలీసులు మరింత జాగురకతో వ్యవహరించాల్సి ఉంటుంది. చంద్రబాబు తన 63 ఏళ్ల వయసులో దాదాపు 2,900కి.మీ. పాదయాత్ర దిగ్విజయంగా చేసుకొని ఇంత భారీ ఎత్తున ర్యాలీ, సభ నిర్వహించతుండటంతో పార్టీ కార్యకర్తలలో, నేతలలో మళ్ళీ చాలారోజుల తరువాత సమరోత్సాహం కనిపిస్తోంది.      

రాష్ట్రంలో హడావుడి చేస్తున్న ప్రతిపక్షాలు

  ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు తెదేపా మరియు తెరాసలు వేర్వేరు ప్రాంతాలలో సభలు నిర్వహించుకొంటుండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి తెలంగాణాలో తన పార్టీని విస్తరించి, బలపరుచుకొనే ప్రయత్నంలో ఈరోజు నుండే తెలంగాణా ప్రాంతంలో పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ మూడు పార్టీలు ఒకేరోజున తమ కార్యక్రమాలు నిర్వహించుకోవడం యాదృచ్చికమే అయినా మూడింటికీ చాలా ప్రాముఖ్యత ఉంది.   చంద్రబాబు నాయుడు తన పార్టీకి పునర్వైభవం తెచ్చే ప్రయత్నంలో చేపట్టిన తన సుదీర్గ పాదయాత్రను ఈ రోజు ముగించుకొంటున్న సందర్భంగా సాయంత్రం విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీనికి దాదాపు 5లక్షల మంది తరలి వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. చాలా రోజుల తరువాత పార్టీ ఇంత అట్టహాసంగా భారీ కార్యక్రమం చెప్పటడంతో పార్టీ శ్రేణుల్లోఇప్పుడు నూతన సమరోత్సాహం వెల్లివిరుస్తోంది.   ఇక, తెరాస ఆవిర్భవించి నేటికి సరిగ్గా 12సం.లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు సాయంత్రం నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఆ పార్టీ కూడా ఒక భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. గత 12సం.లుగా తెరాస ఎన్నడూ అధికారం చెప్పట్టకపోయినప్పటికీ, కేవలం ఉద్యమాలే ఊపిరిగా చేసుకొని, పార్టీ శ్రేణులను ఇంత సుదీర్గ కాలం ఏకత్రాటిపై నడపడం సామాన్యమయిన విషయం కాదు.   ఇటువంటి సమయంలో పార్టీ అధినేత కేసీఆర్ అకస్మాత్తుగా తన పంధా మార్చుకొని, ఎన్నికలలో పోటీ చేసి పార్టీకి ఎక్కువ సీట్లు సాదించడం ద్వారా తెలంగాణా సాదిద్దామనే కొత్త ప్రతిపాదన చేయడంతో, నేటి సభకు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. మళ్ళీ తెరాస అధ్యక్షుడిగా ఎన్నికయిన చంద్రశేఖర్ రావు తన నేతృత్వంలో ఎన్నికలను ఎదుర్కోనున్న తెరాస శ్రేణులకు ఈ సభలో బహుశః దిశా నిర్దేశం చేసి, ఎన్నికలకి సమార శంఖం పూరించవచ్చును. అదే సమయంలో తెలంగాణ సాదన కోసం తన భావి ప్రణాళికలను కూడా ప్రకటించవచ్చును.   ఇక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా తెలంగాణా ప్రాంతంలో తమ పార్టీని బలోపేతం చేసుకొని మరింత వ్యాపింపజేసేందుకు ఈ రోజునుండే ఆమె తెలంగాణలోరచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంతవరకు, తన కొడుకు జగన్ మోహన్ రెడ్డి త్వరలో జైలు నుండి విడుదలయి, పార్టీ కార్యకలాపాలను స్వయంగా చూసుకొంటాడని భావిస్తూ ఎదురు చూసిన విజయమ్మగారు, ఇక ఆయన ఇప్పుడప్పుడే విడుదల అయ్యే సూచనలు కనబడకపోవడంతో ఆమె స్వయంగా నడుం బిగించి యాత్రలకు బయలు దేరక తప్పలేదు.   మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్వహించిన ‘ప్రజా ప్రస్థానం’కు ఈరోజుతో 10సం.లు పూర్తయిన సందర్భoగా ఆమె కూడా తన భర్తకు అచ్చొచ్చిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తన రచ్చబండ కార్యక్రమాలు మొదలుపెడతారు.   ఈవిధంగా మూడు ప్రధాన ప్రతిపక్షాలు తమ పార్టీలను పునరుజ్జీవింపజేసుకొని, అధికారం కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుండగా, రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం వాటిని చాలా తేలికగా తీసిపారేస్తోంది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణలను “రాష్ట్రంలో ప్రజల మీద ప్రతిపక్ష పార్టీల ప్రభావం ఏవిధంగా ఉంది? వారు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా చేస్తున్న ప్రచారం వలన రాబోయే ఎన్నికలలో పార్టీ మీద ఏవిధంగా, ఎంత ప్రభావం ఉంటుంది?” వంటి ప్రశ్నలు సందించడం చూస్తే, రాష్ట్ర కాంగ్రెస్ కంటే, కాంగ్రెస్ అధిష్టానమే అప్రమత్తంగా ఉన్నట్లు అర్ధం అవుతోంది. ఆయన సందించిన ప్రశ్నలు గమనిస్తే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూసి కాంగ్రెస్ అధిష్టానం చాలా ఆందోళనచెందుతున్నట్లు అర్ధం అవుతోంది.   కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం అధికారం చేప్పటి దాదాపు 18నెలలు గడుస్తున్నపటికీ, ఇంతవరకు స్వంతపార్టీ వారితోనే ఎవరితోనూ సక్యత, నమ్మకం సాదించలేక అమ్మ హస్తం పట్టుకొని ఒంటరిగా ఇందిరమ్మ (పగటి) కలలు కంటున్నారు.

'వస్తున్నా మీకోస౦' ముగింపు

        'వస్తున్నా మీకోస౦' అంటూ గత ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతిన మొదలు పెట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఈ రోజుతో ముగియనుంది. ఏడు నెలల పాటు సుధీర్ఘంగా సాగిన పాదయాత్రతో చంద్రబాబు చరిత్ర సృష్టించాడు. ఏకధాటిగా 2800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నేతగా రికార్డుల కెక్కారు. పాదయాత్ర ముగింపుకు పార్టీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. విశాఖలో నేడు పాదయాత్ర ముగింపు పైలాన్ ను ఆవిష్కరించి, ఆ తరువాత అక్కడి బహిరంగ సభలో ప్రసంగించి చంద్రబాబు రేపు ఉదయం విశాఖలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ ప్రారంభిస్తారు.   గడచిన ఏడు నెలలుగా ఇంటి మొహం చూడకుండా 16 జిల్లాలలో పాదయాత్ర చేశారు. రేపు మధ్యహ్నం విశాఖలో బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ బాబుకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఒకరోజు విశ్రాంతి అనంతరం చంద్రబాబు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకుని ఓ రోజంతా విశ్రాంతి తీసుకుంటారు.

సినిమా టిక్కెట్ ధరలు పెంచారు

        రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లకు మళ్లీ రెక్కలొచ్చాయి. రూ.10 నుంచి 20 దాకా పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తూ పచ్చజెండా ఊపేసింది. ప్రభుత్వం పొద్దున ఇలా ఉత్తర్వులు ఇచ్చిందో లేదో.. థియేటర్ల యజమానులు మధ్యాహ్నం రెండుగంటల ఆట (మ్యాట్నీ) నుంచే రేట్లు పెంచి టికెట్లు అమ్మడం మొదలుపెట్టేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని సినిమా థియేటర్లను ఐదు కేటగిరీలుగా విభజించి పెంపును అమలు చేస్తారు. అవి ఇలా ఉంటాయి...   - హైదరాబాద్‌లో ఏసీ థియేటర్లలో రూ.55గా ఉన్న బాల్కనీ టికెట్ ధర ఇకపై రూ.75, ఎయిర్ కూల్డ్ థియేటర్లలో రూ.70, ఫస్ట్‌క్లాస్ టికెట్ల వెల రూ.45. -విశాఖ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, వరంగల్, తిరుపతి, కర్నూలు, అనంతపురం లాంటి కార్పొరేషన్‌లలో బాల్కనీ రూ.75 (ఎయిర్‌కూల్డ్ రూ.70), తర్వాతి తరగతి టికెట్ల వెల రూ.40 . -సెలక్షన్, స్పెషల్, ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీల్లో బాల్కనీ రూ.55 (ఎయిర్‌కూల్డ్ 50), తర్వాతి తరగతి టికెట్ల వెల రూ.35 అవుతాయి. -సెకండ్, థర్డ్‌గ్రేడ్ మున్సిపాలిటీల్లో హైక్లాస్ రూ.50 (ఎయిర్‌కూల్డ్ రూ.45), దాని ముందు వరుస రూ.30. -నగర, గ్రామ పంచాయతీల్లో ఏసీ మొదటి తరగతి రూ.45 (ఎయిర్‌కూల్డ్ 40), రెండో తరగతి రూ.30 . - కేటగిరీలతో సంబంధం లేకుండా ఆఖరు తరగతి టికెట్లను రూ.10కే విక్రయించాలి.