రాష్ట్ర విభజన ప్రకటనతో తెదేపా చిత్తయిపోయిందా
posted on Aug 28, 2013 @ 1:19PM
రాష్ట్ర విభజన ప్రకటన తరువాత తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం చాలా అయోమయ పరిస్థితుల్లోపడింది. చంద్రబాబు నాయుడు పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు ‘ఆత్మగౌరవ యాత్ర’ చెప్పట్టబోతే అడ్డుపడిన తెదేపా నేతలు, సమైక్యాంధ్ర కోసం పాదయాత్రలు మొదలుపెట్టబోతున్నారు. ఇక పార్టీకి ఎటువంటి సమాచారం ఈయకుండా, అనుమతి కోరకుండా నందమూరి హరికృష్ణ సెప్టెంబర్ 2నుండి చైతన్యయాత్ర మొదలుపెట్టేందుకు సిద్దం అవుతున్నారు.
చంద్రబాబు రాష్ట్ర విభజనపై తమ పార్టీ ఆలోచనలని, తమ భావి ప్రణాళికలను ప్రజలకు వివరించి వారిలో పార్టీ పట్ల నెలకొన్న అపోహలు దూరం చేసి తద్వారా పార్టీని ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలో బలపరుచుకోవాలని ఆలోచిస్తుంటే, తెలుగు తమ్ముళ్ళు మాత్రం కేవలం సీమాంధ్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం అన్నట్లు సమైక్యాంధ్ర కోసం పాదయాత్రలు, దీక్షలు, బస్సు యాత్రలంటూ చంద్రబాబుకి అగ్నిపరీక్ష పెడుతున్నారు.
సీమాంధ్రలో పార్టీ నేతలు చేస్తున్నసమైక్యాంధ్ర ఉద్యమాలను చూసి ఆ పార్టీకి చెందిన తెలంగాణా నేతలు చాలా ఆందోళనకు గురవుతున్నపటికీ, చంద్రబాబుతో సహా అందరూ కూడా నిస్సహాయంగా చూస్తూ కూర్చోవలసి వస్తోంది. అయితే, వారు ఇదే తీరుగా కొనసాగితే పార్టీ రెండు చోట్ల తీవ్రంగా నష్టపోవడం ఖాయమని ఆ పార్టీ నేతలందరికీ కూడా బాగా తెలుసు. కానీ, సమైక్యరేసులో వెనుకబడిపోతే రాజకీయంగా నష్టపోతామనే భయంతో ఎవరికీ తోచిన రీతిలో వారు ముందుకు సాగిపోతుంటే వారిని ప్రోత్సహించలేక, ఆపనూ లేక తెదేపా ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకొంది. ఈ సంకట పరిస్థితి నుండి తెదేపాను కాలమే బయటపదేయాలి తప్ప స్వతహాగా బయటపడే అవకాశం కనుచూపుమేర కనబడుటలేదు.