tdp guntur dccb

గుంటూరు డీసీసీబీ, డీసీఎంఎన్ టిడిపి కైవసం

        గుంటూరు జిల్లా సహకార బ్యాంకు ఎన్నికల్లో టిడిపి విజయభేరి మోగించింది. శుక్రవారం జరిగిన పోలింగ్ లో టిడిపి 16 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. అభ్యర్ధులు లేక మరో మూడు స్థానాలు ఖాళీగా మిగిలాయి. సహకార మంత్రి జిల్లాలో కాంగ్రెస్ సహకార ఎన్నికలు ఓడిపోవడం ఆ పార్టీకి మింగుడు పడడంలేదు.   గుంటూరు జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ పాలకవర్గం కూడా టిడిపి దక్కించుకుంది. మొత్తం డైరెక్టర్ల స్థానాలకు గాను టిడిపి 5 , కాంగ్రెస్ 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ 1 స్వతంత్ర అభ్యర్ధులు ఒకటి చొప్పున చేజిక్కించుకున్నారు. మరో రెండు చోట్ల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ టిడిపి కి మద్దతివ్వడంతో పాలకవర్గం టిడిపి కైవసం చేసుకుంది.   

CM N Kiran Kumar Reddy presents Rs 50 lakh to Saina Nehwal

సైనాకు 50లక్షలు బహుమతి ఇచ్చిన సీఎం

        ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనానెహ్వాల్‌కు శుక్రవారం 50 లక్షల రూపాయల చెక్‌ను అందజేశారు. సైనా ఇండోనేషియా ఓపెన్ టైటిల్‌ను గెలిచినందుకుగానూ సీఎం బహుమతిగా ఈ చెక్‌ను ఇచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు.   స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ లభించింది. మార్చి 12 నుంచి 17 వరకు ఇక్కడ జరిగే ఈ టోర్నీకి ప్రపంచ నెం.1 చైనా క్రీడాకారిణి లీ జురేయీ ఆడకూడదని నిర్ణయించుకోవడంతో సైనా టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుంది. 2011, 12 సంవ త్సరాల్లో స్విస్ ఓపెన్ చాంపియన్ అయిన సైనా.. తొలి రౌండ్‌లో ఫ్రెంచ్ క్రీడాకారిణి సాషిన విగ్నెస్ వారన్‌తో తలపడనుంది. పీవీ సింధు కూడా ఇదే విభాగం తొలి రౌండ్‌లో కొరియా షట్లర్ సంగ్ జీ హ్యున్ తో పోటీ పడనుంది.  

Nara lokesh TDP

చిదంబరం బడ్జెట్ మీద లోకేష్ ట్వీట్

        కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అని అందరికీ తెలుసు. కొంతమంది ఆయనను మీడియాలో చిద్దూ అని ముద్దుగా అభివర్ణిస్తారు. అయితే ఆయనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కొత్తపేరు పెట్టేశారు. చిదంబరాన్ని కాస్తా టాక్సంబరం అని మార్చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో దాని మీద ఆయన చిదంబరం పేరు మార్చి బడ్జెట్ మీద తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మొత్తానికి చిన్న బాసు రాజకీయ విమర్శలకోసం ప్రాసలు వెతుకుతున్నట్లు ఇటీవలి ట్వీట్స్ ను బట్టి తెలుస్తుంది. బడ్జెట్ మీద ట్వీట్ చేసిన లోకేష్  ”Taxambaram has delivered only one thing in this budget, more taxes!” అని పేర్కొన్నాడు. నాలుగు రోజుల క్రితం రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలోనూ “31 INC MP’s + Railway Budget = Disappointment, but that’s become a congress trademark!” అని విమర్శించాడు.

RAVINDRANATH REDDY jagan

జగన్ మేనమామ ఏం చెప్పలేదు

      జగన్ మోహన్ రెడ్డి మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ఒక రోజు పోలీస్ కస్టడీ ముగియడంతో ఆయనను ఈ రోజు కోర్ట్ ఎదుట హాజరుపర్చారు. కస్టడిలో రవీంద్రనాథ్ రెడ్డి పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఏమి చెప్పకపోవడంతో తిరిగి తమ కస్టడీకి అనుమతించాలని కోరనున్నారని తెలుస్తోంది. తనకి అనారోగ్యంగా ఉందంటూ కోర్ట్ అనుమతితో రిమ్స్‌లో వైద్య పరీక్షలు పొందిన సమయంలో డాక్టర్లను బెదిరించి వారి సెల్ ఫోన్ ద్వారా కొంతమంది తో మాట్లాడినట్టు సమాచారం. ఈ సంఘటన పై కూడా పోలీసులు దర్యాప్తును వేగం చేశారు. ఫిర్యాదు కాపీ పైన జిల్లా సహకార అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో రవీంద్రనాథ్ రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం రోజు రవీంద్రనాథ్ రెడ్డి కోర్టులో లొంగిపోయారు. అతని ముందస్తు బెయిల్‌తో పాటు తరవాత దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. రవీంద్రనాథ్ రెడ్డిని పోలీసులు గురువారం తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు. విచారణలో అతను తనకు ఏమీ తెలియదని చెప్పినట్లుగా తెలుస్తోంది.  

Nagarjuna denies Rumours on Special Chabbis remake

‘స్పెషల్‌ ఛబ్బీస్‌’ చేయడం లేదు: నాగార్జున

        బాలీవుడ్ లో విడుదలైన సూపర్ హిట్ అయిన అక్షయ్ కుమార్ ‘స్పెషల్‌ ఛబ్బీస్‌’ తెలుగు లో రీమేక్ చేయనున్నారు. తమిళ దర్శకుడు లింగుస్వామి ఈ సినిమా హక్కులు సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ బాషలలో ఒకేసారి తెరకెక్కించనున్నట్లు ఆయన ప్రకటించారు. స్టార్ హీరోహీరోయిన్లతో ఈ సినిమా చేయాలన్నది ఆయన ఆలోచన. తెలుగులో అక్కినేని నాగార్జున ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తని ఆయన ఖండించారు. తాను చేస్తే బావుంటుందని అందరూ అంటున్నారు, కానీ తన వద్దకు ఆ ప్రతిపాదన రాలేదని చెప్పారు. అక్షయ్‌ కుమార్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘స్పెషల్ చబ్బీస్’కు ‘ఎ వెడ్నస్ డే’ ఫేమ్ నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలు సమకూర్చారు. 1980వ దశకంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

 Andhra Pradesh Budget 2013

13 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

      రాష్ట్ర బడ్జెట్ ప్రకటనకు సర్వం సిద్ధం అవుతోంది. ఈ నెల 18 వ తేదీన రాష్ట్రబడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రాష్ట్ర శాసన సభ సమావేశాలు మార్చి 13 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో 18 వతేదీన బడ్జెట్ ఉంటుంది. శాసనసభ సమావేశాలు మార్చి 13నుంచి మే 2 వరకు జరుగుతాయి. 22న శాసనసభ వాయిదా పడుతుంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 22 వరకు స్థాయిసంఘంల్లో బడ్జెట్ పద్దులపై చర్చలు జరుగుతాయి. ఏప్రిల్ 23న అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. మే 2 వరకు సమావేశాలు కొనసాగుతాయి. ఈ సారి రాష్ట్ర బడ్జెట్ ను ఆనం రామనారాయణరెడ్డి ప్రవేశపెడతారు. కేంద్రంలో యూపీఏ చివరి బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదే అవుతుంది.

chandrababu padayatra

చంద్రబాబు పాదయాత్ర: 29 సార్లు పెట్రోలు, డీజిల్ పెంపు

        కృష్ణాజిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. టీడీపీ పాలనలో సంస్కరణలు బలంగా అమలు జరిగాయని చెప్పుకొచ్చారు. తమ హయాంలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయనే విషయం ఇప్పుడిప్పుడే జనం గ్రహిస్తున్నారని వివరించారు. అవినీతిపరులను మదర్ థెరెస్సా, అంబేద్కర్, గాంధీవంటి మహాత్ముల ఫొటోలతో జతచేయడం విచారకరమని చెప్పారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. పెదప్రోలు, కప్టాన్ పాలెం, కాసానగర్, చల్లపల్లి, వక్కలగడ్డ, చిట్టూర్పు మీదుగా 15,1 కిలోమీటర్లు నడిచి వేములపల్లి చేరుకున్నారు. అంతకుముందు..మోపిదేవి ప్రధాన సెంటరులో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు. అవినీతిరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ప్రజలపై భారాన్ని మోపడం మాత్రమే నేర్చుకున్న ఈ ప్రభుత్వాలు 29 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలుపెంచి ఘనత వహించాయని దుయ్యబట్టారు. టిడిపి అదికారంలోకి వస్తే ఆడపిల్లలు పుడితే పాతికవేల రూపాయలు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే లంబాడీలకు జిల్లాలవారీగా రిజర్వేషన్లు ఇస్తామని ఆయన ప్రకటించారు. ముస్లింలకు ఎనిమిది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆయన అన్నారు. దేశంలో గజదొంగలుపడ్డారని, వైఎస్ తన కొడుక్కి లక్ష కోట్లు దోచిపెట్టారని విమర్శించారు.  

power cuts

అధికారిక కోతలు మొదలు

  కొత్త సంవత్సరంలో జనవరి నెల నుండే అనధికారిక విద్యుత్ కోతలు మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, మార్చి1వ తేది నుండి అధికారికంగా కోతలు మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించింది. హైదరాబాదుతో సహా అన్ని ప్రధాన నగరాలలో రోజుకు 2గంటలు చొప్పున కోతలు విదించబోతున్నారు.   ఇక ఇప్పటికే, రోజుకి 3-4గంటలు కోతలు విదిస్తున్న జిల్లా కేంద్రాలలో ఇప్పుడు రోజుకి 4గంటలు, పురపాలక సంఘాలలో 6 గంటలు, మండల కేంద్రాలలో 8 గంటలు, గ్రామాలలో రోజుకి 12 గంటలు విద్యుత్ కోతలు రేపటి నుండి ఖచ్చితంగా అమలుకానున్నాయి. బహుశః ప్రస్తుతం ఉన్న అనధికారిక కోట్లకు ఇవి అదనంగా ఉండవచ్చును. అంటే, ప్రస్తుతం నగరాలలో అనడికారికంగా 2 నుంచి 3గంటలవరకు విద్యుకోతలు అమలవుతున్నాయి. అవి ఇక రోజుకి 5గంటలు అయ్యే అవకాశం ఉంది. నగరాలలో పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే, ఇక పల్లెలో ఎలాఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.   మర్చి నెల మొదటివారంలో ఇంతభారీ విద్యుత్ కోతలు తప్పనపుడు, మే జూన్ నెలల్లో పరిస్థితిని తలుచుకోవడానికే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావం వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపారాలు, ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులు బాగా దెబ్బతినే అవకాశం ఉంది. తద్వారా నిరుద్యోగం పెరిగి అది సామజిక సమస్యలకు దారి తీసే అవకాశం కూడా ఉంది.   గత రెండు మూడు సంవత్సరాలుగా నానాటికి విద్యుత్ సమస్య తీవ్రతరం అవుతున్నదని గ్రహించినప్పటికీ, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేప్పట్టకుండా, కొత్త విద్యుత్ ప్లాంటుల స్థాపనకు పూనుకొనక, కేవలం తెలంగాణా అంశం, పార్టీలో అసమ్మతి రాజకీయాలు వంటి వాటితో కాలక్షేపం చేస్తువచ్చిన ప్రభుత్వం, విద్యుత్ సంక్షోభం నివారణకు కనీస చర్యలు కూడా చేప్పటకపోవడమే నేటి ఈ దుస్థితికి కారణం.   దాహం వేసినప్పుడు నుయ్యి త్రవ్వడం మొదలుపెట్టినట్లు, విద్యుత్ సంక్షోభం తీవ్రతరమయిన తరువాత, కిరణ్ కుమార్ గుజరాత్ రాష్ట్రం నుండి గ్యాస్ ఇప్పించమని కోరడం విచిత్రం. ఆ రాష్ట్రంలో ఇదే దుస్థితి నెలకొన్నపుడు అక్కడి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆ పరిస్థితులను ఏవిధంగా అదిగమించాడో తెలుసుకోవాలంటే పార్టీల బేషజాలు, అహం అడ్డొస్తాయి. ప్రభుత్వాల చేతకానితనానికి, నిర్లిప్త వైఖరికి ప్రతీసారీ ప్రజలే మూల్యం చెల్లించక తప్పట్లేదు.

chandrababau pdayatra

మోపిదేవిలో చంద్రబాబు 'వస్తున్నా మీకోసం'

        తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర కృష్ణా జిల్లా మోపిదేవిలో సాగుతో౦ది. అక్కడా మధ్యాహ్న సమయంలో విజయవాడ పశ్చిమ, మచిలీపట్నం నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆతరువాత మోపిదేవిలోని టిడిపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. పాదయాత్ర మొదలు పెట్టి మోపిదేవి, వక్క గడ్డల మీదుగా రాత్రికి చిట్టూర్పు చేరుకుంటారు. వక్కల గడ్డలో హత్యకు గురైన మాజీ జెడ్పీటీసీ తాతినేని బలరాం విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాత్రికి చిట్టూర్పు లోనే బస చేయనున్నారు.

Budget 2013 Highlights

చిదంబరం బడ్జెట్ ముఖ్యంశాలు

        కేంద్ర వార్షిక బడ్జెట్ 2013-14ను కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంటుకు సమర్పిస్తూ ఎన్నో ఆటంకాలను సమర్ధవంతంగానే ఎదుర్కొంటూ దేశ యువతకు ఆశాజనకమైన భవిష్యత్తును అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ప్రజలకు ఏం కావాలి అంటే సమాజంలో ఎదుగుదలకు అవకాశాలు, విద్య, నిపుణత, ఉపాధి అవకాశాలు. వీటి ఆవశ్యకత దేశంలో యువతకు బాగా తెలుసు, ప్రతి తల్లికీ తెలుసు. వారికి విస్తృతావకాశాలు కల్పించడం కోసమే ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాలన, విత్త యాజమాన్యం రెండింటినీ సమతౌల్యం చేసుకుంటూ 2013-14 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రూపొందించినట్టు మంత్రి చెప్పారు.   చిదంబరం బడ్జెట్ ముఖ్యంశాలు:   - ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.41,561 కోట్లు - ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.24,598 కోట్లు - మహిళా సంక్షేమానికి రూ.200 కోట్లు - వికలాంగుల పథకానికి రూ.110 కోట్లు. - వైద్య శాఖకు రూ.37,330 కోట్లు - చిన్నారులకు రూ.76,200 కోట్లు - వైద్య విద్యా శిక్షణ కోసం రూ.4727 కోట్లు - ఆయూష్‌కు రూ.1069 కోట్లు - విద్యాశాఖకు రూ.65,857 కోట్లు. - సర్వశిక్ష అభియాన్‌కు రూ.27,368 కోట్లు. - స్కాలర్‌షిప్‌లకు రూ.5,284 కోట్లు. - మధ్యాహ్న బోజనం రూ.13,837 కోట్లు - మహిళలు, శిశివు పోషకాహార పథకానికి రూ.300 కోట్లు, 100 నుంచి 200 జిల్లాలకు ఈ పథకం విస్తరణ - గ్రామీణాభివృద్ధికి రూ.80,195 కోట్లు. - ఇందిరా ఆవాస్ యోజన కోసం రూ.15,184 కోట్లు. - తాగునీటి, పారిశుధ్యానికి రూ.15,260 కోట్లు. - ఫ్లోరైడ్ ప్రాంతాల్లో తాగునీటి శుద్ధికి రూ.1400 కోట్లు - గ్రామీణ సడక్ యోజన రెండో ధఫా ప్రారంభిస్తాం. - 12వ ప్రణాళికలో నగరాభివృద్ధి పథకం కొనసాగింపు. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 250 మినియన్ టన్నుల పైనే. - రవాణా శాఖకు అదనంగా 10 వేల బస్సులు. - రవాణా శాఖకు రూ.14,873 కోట్లు - వ్యవసాయ మంత్రిత్వ శాఖకు రూ.27,049 కోట్లు. - వాటర్ షెడ్ల నిర్వహణకు రూ.5,387 కోట్లు. - ఎస్సీ,ఎస్టీ స్కాలర్‌షిప్‌ల కోసం రూ.5,284 కోట్లు. - మైనార్టీ సంక్షేమానికి రూ.3,511 కోట్లు. - ఉపాధి పనులకు రూ.70 వేల కోట్లు. - ఉపకార వేతనాలకు రూ.5,284 కోట్లు. - రూ. 7లక్షల కోట్ల మేర పంట రుణాలు, సకాలంలో రుణాలు చెలించే రైతులకు రాయితీ. - ఆహార భద్రత పథకానికి అదనంగా రూ.10 వేల కోట్లు. - పంట మార్పిడికి ప్రోత్సాహం. - మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడుల కోసం కొత్త పథకాలు. - 2013-14 బడ్జెట్ రూ16,65,282 కోట్లు. - ఈ ఏడాది ప్రణాళిక వ్యయం రూ.5,55,322 కోట్లు. - ఆంధ్రప్రదేశ్, బెంగాల్‌లో మేజర్ ఓడరేవులు. - ఎయిమ్స్ తరహా ఆరు వైద్య సంస్థలు. - పంట శీతలీకరణ గోదాముల కోసం రూ.500 కోట్లు. - తొలిసారి రూ.25 లక్షల గృహ రుణం తీసుకున్నవారికి లక్ష వడ్డీ తగ్గింపు. - బొగ్గు ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యానికి ప్రాధాన్యం - బొగ్గు దిగుమతులు తగ్గించడం ప్రాధాన్యం. - చిన్న తరహా పరిశ్రమలకు మూడున్నరేల్ల పన్ను రాయితీ. - చెన్నై - బెంగుళూరు మధ్య పారిశ్రామిక కారిడార్. - త్వరలో రోడ్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు. - మరమగ్గుల ఆధనికీకరణకు రూ.2400 కోట్లు. - జౌళి పరిశ్రమలో కాలుష్య నియంత్రీకరణకు రూ.500 కోట్లు. - 12వ ప్రణాళికలో ఖాది పరిశ్రమకు రూ.850 కోట్లు. -  వ్యవసాయ పరిశోధనకు రూ.3145 కోట్లు. - 13 జాతీయ బ్యాంకులకు రూ.12,570 కోట్ల అదనపు పెట్టుబడి. ప్రతి బ్యాంకుకు ఏటీఎమ్ తప్పనిసరి. - ప్రభుత్వ రంగంలో మహిళల కోసం ప్రత్యేక బ్యాంకు. - మహిళా బ్యాంకుకు వెయ్యి కోట్లు మూలధనం. రుణ పరపతికి వీలుగా జాతీయ మహిళా బ్యాంకు. - వాణిజ్య బ్యాంకుల ద్వారా వ్యక్తిగత భీమా పథకాలు. - టెక్స్‌టైల్స్ పార్కులకు రూ.50 వేల కోట్లు. - 10 వేల జనాభా దాటిన గ్రామంలో జాతీయ బ్యాంకు, ఎల్ఐసీ కార్యాలయాల ఏర్పాటు. - త్వరలో సెబీ చట్ట సరవరణకు చర్యలు. - అంగన్‌వాడీ వర్కర్లకు గ్రూప్ భీమా పథకాలు. - పవన విద్యుత్‌కు రూ.800 కోట్లు. - ఆరు శాతం వడ్డీతో చేనేత మహిళలకు రుణాలు. - రక్షణ రంగానికి రూ.2,03,670 కోట్లు. - సైన్స్ అండ్ టెక్నాలజీకి రూ.6 వేల కోట్లు. - పాటియాలాలో జాతీయ క్రీడా శిక్షణ సంస్థ. - లక్ష జనాభా దాటిన పట్టణాల్లో ఎఫ్ఎం రేడియోలు. ఈ ఆర్థిక ప్రణాళికలో 800 పైగా ఎఫ్ఎమ్ స్టేషన్లు. - పోస్టాఫీస్ బ్యాంకింగ్ కోసం రూ.532 కోట్లు. - మహిళా భద్రత సమిష్టి బాధ్యత. నిర్భయ ఫండ్ కోసం రూ.1000 కోట్లు. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణ లోటు 5.2 శాతం. - పన్నుల విధానంలో పారదర్శకత టాక్స్ అడ్మిస్టేషన్ రిఫార్మ్స్ కమిషన్ ఏర్పాటు. - ఆదాయ పన్ను విధానం యథాతథం. - ఏడాదికి రూ.2-5 లక్షలు లోపు ఆదాయం ఉన్న వారికి రెండు వేల పన్ను మినహాయింపు. - ఏడాదికి కోటి ఆదాయంపైన ఉన్నవారికి 10 శాతం సర్‌చార్జి. మొత్తం 42,800 మందికి వర్తింపు. - ఉద్యోగులకు పన్ను రాయితీ. - రూ.50 లక్ష లు దాటిన స్థిరాస్తి విక్రయంపై ఒక శాతం పన్ను . వ్యవసాయ భూములకు మినహాయింపు. - టీవీ సెట్అప్ బాక్స్ దిగుమతులపై 5 శాతం సుంకం. - ఏసీ లగ్జరీ కార్లపై సుంకం పెంపు. - సిగిరెట్లపై 18 శాతం పన్ను పెంపు. - పెరుగనున్న విదేశీ కార్ల ధరలు. - రెండు వేలు దాటిన సెల్‌ఫోన్‌పై 6 శాతం సుంకం పెంపు. - ఏసీ ఉన్న అన్ని హోటళ్లకు సర్వీస్ ట్యాక్స్.

finance minister

చిదంబర బడ్జెట్: వరాలు, వడ్డింపులు లేవు

  నేడో రేపో మధ్యంతర ఎన్నికల గంటలు మొగుతాయనే రాజకీయనాయకుల ప్రకటనల నేపద్యంలో ఈ రోజు ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పేద,మధ్యతరగతిని బుట్టలో వేసుకొనే అంశాలు తప్పనిసరిగా ఉంటాయనుకొన్న అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఒక సాదాసీదా బడ్జెట్ సమర్పించడం జరిగింది. ఈ బడ్జెట్లో పేదలకు, మద్య తరగతి వర్గాలకు ప్రత్యేక వడ్డింపులు కానీ,వరాలు కానీ లేవు.   కానీ, రూ.2-5 లక్షల వార్షిక ఆదాయం గలవారికి 10% పన్ను వడ్డింపు ఉంటుంది. అయితే, రూ.5లక్షల లోపు ఆదాయం గలవారికి రూ.2000 టాక్స్ క్రెడిట్ ప్రకటించారు. రూ.5-10లక్షల వార్షికాదాయం గలవారికి రూ.20% పన్నుకట్టవలసి ఉంటుంది.   బడ్జెట్ లో మన రాష్ట్రానికి ఒక భారీ ఓడరేవును ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ మరో విశేషం పూర్తిగా మహిళల ఆద్వర్యంలో నడిచే ఒక జాతీయ బ్యాంకు ఏర్పాటు చేయడం. అదేవిధంగా మహిళల రక్షణకు రూ.1000 కోట్లు కేటాయించడం కూడా పేర్కొనవలసిన అంశం. ఈ మొత్తాన్ని ఏవిధంగా సద్వినియోగం చేయాలో తెలుపమంటూ చిదంబరం కోరారు.   ఇక, ఈ బడ్జెట్లో సిగరెట్లు, సెల్ ఫోన్లు, సెట్ టాప్ బాక్సుల ధరలు కొద్దిగా పెంచారు. రూ.2000 ధర దాటిన సెల్ ఫోన్ ఖరీదు కొద్దిగా పెరగబోతున్నాయి. క్రమంగా దేశ వ్యాప్తంగా టీవీ ప్రసారాలు డీటీహెచ్ కు మారుతున్న ఈతరుణంలో సెట్ టాప్ బాక్సులపై 10% సుంకం విదించడం సామాన్యులకు, మధ్యతరగతివారికి కొంచెం ఇబ్బంది పెట్టినట్లయింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే వేరే గత్యంతరం కూడా ఏమి లేదు గనుక ప్రజలు భరించక తప్పదు.   దేశంలో ఏవర్గానికి ప్రత్యేక తాయిలాలు పంచకుండా ప్రవేశపెట్టిన ఈ సామాన్యమయిన బడ్జెట్ బహుశః రాహుల్ గాంధీ ఆలోచనలకు అద్దం పడుతోందని అనుకోవచ్చును. ఇటీవల రాజస్తాన్ లో జరిగిన కాంగ్రెస్ మేధోమధనంలో రాహుల్ గాంధీ తన ప్రసంగంలో వాస్తవిక పరిస్థులకు అనుగుణంగా మనం ఆలోచనలు, ప్రణాలికలు మారాల్సిఉందని చెప్పారు. మరి ఆయన ఆశయాలను ప్రతిబింబించే విదంగా చిదంబరం ఈ బడ్జెట్ ను రూపొందించి ఉండవచ్చును.

Wife killed Husband

ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన భార్య

        ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చిన దారుణమైన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా పరుచూరు మండలం రాజుగారిపాలెంలో కోటేశ్వర రావు భార్య పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తమ విలాసాలకు తన భర్త అడువస్తున్నాడని చెప్పి అతన్ని చంపి శవాన్నిఇంట్లో పూడ్చి పెట్టింది. కోటేశ్వర రావు ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు పోలీసులను ఆశ్రయించేసరికి అసలు నిజం బయటపడింది. పోలీసులు కోటేశ్వర రావు భార్యను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయట పెట్టింది. తాను ఆ ఉరికి చెందిన వేరే మగాడితో అక్రమసంబంధం పెట్టుకున్నానని, అందుకే తన భర్తను చంపానని చెప్పింది. దీంతో పోలీసులు ఆమెను,ఆమె ప్రియుడి ని అరెస్ట్ చేశారు.

Budget 2013 Highlights

చిదంబరం బడ్జెట్: 1000 కోట్లతో మహిళలకు బ్యాంకు

      స్త్రీల భద్రతకు పెద్దపీట వేస్తామని ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఎన్నో రకాల కలలతో స్త్రీ సమాజంలోకి అడుగుపెడుతుందని, వారి భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ...ప్రభుత్వ రంగంలో మహిళలకు ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ప్రకటించారు. ఇందుకు వీలుగా మొత్తం రూ. 1000 కోట్ల మూలధనంతో మహిళలకు ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ బ్యాంకు త్వరలోనే రూపుదిద్దుకుంటుందని ఆయన చెప్పారు. ఈ బ్యాంకు నిర్మాణం శంకుస్థాపనకు విచ్చేయవలసిందిగా పార్లమెంటు సభ్యులు అందరికీ ఇదే ఆహ్వానం అని ఆయన చెప్పారు.

 Budget 2013 Highlights

చిదంబరం బడ్జెట్: దేశ రక్షణ రంగానికి 2,03,670 కోట్లు

        దేశ భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం పునరుద్ఘాటించారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంటుకు సమర్పిస్తూ రక్షణ రంగానికి రూ. 2,03,670 కోట్లు కేటాయిస్తున్నట్టు చిదంబరం ప్రకటించారు. దేశ రక్షణ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాముఖ్యం ఇస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించిన వెంటనే పార్లమెంటు సభ్యులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.   82వ కేంద్ర వార్షిక బడ్జెట్ గా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం గురువారం 2013-14 బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. చిదంబరం గురువారం ఉదయం 11 గంటలకు లోకసభలో. బడ్జెట్ ప్రసంగం మొదలెట్టారు. ఎనిమిదోసారి ఆయన బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. కాగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లోక్సభలో అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తొలిస్థానంలో ఉండగా,ఆ తర్వాత స్థానంలో చిదంబరం ఉన్నారు. మొరార్జీ దేశాయ్ 8 సార్లు పూర్తి స్థాయి బడ్జెట్ను, రెండు సార్లు మధ్యంతర బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. చిదంబరం ఇప్పటి వరకు ఏడు సార్లు సమర్పించగా, గురువారం తన ఎనిమిదో వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టి నట్లయ్యింది. ఆర్థిక వృద్ధిరేటు, సమ్మిళత అభివృద్ధే తమ ప్రధాన అజెండా అని చిదంబరం తెలిపారు.

బాబ్లీ పై తీర్పు: రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యం

  ఈ రోజు సుప్రీంకోర్టు వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పును వెలువరించింది. మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టును పూర్తిగా తొలగించడం అసాద్యం అని చెపుతూనే ఇరు రాష్ట్రాల సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించిన సుప్రీంకోర్టు, గొడవలు పడకుండా నిజాయితీగా ఇద్దరూ నీళ్ళు పంచుకోమని సలహా ఇచ్చింది. అంత భారీ కట్టడం పూర్తయిన తరువాత సుప్రీంకోర్టయినా అంతకంటే గొప్ప ఉపాయం చెప్పలేదు కూడా. అయితే, పక్క రాష్ట్రాలు అంత భారీ ప్రాజెక్ట్ ను రాత్రికిరాత్రే ఏమి నిర్మించలేదు అని అందరికీ తెలుసు. అందరి కళ్ళ ముందే పకడ్బందీ ప్రణాలికతో అత్యంత వేగంగాఆ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. అయినప్పటికీ, రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు ఇటువంటి దుశ్చర్యలకు కళ్ళెం వేయాలనే ఆలోచన రాకపోవడం తెలుగు ప్రజల దురదృష్టం.   ఇప్పటికే, కర్ణాటక రాష్ట్రం ఆల్మటి డ్యామ్ ఎత్తుపెంచి మనకి న్యాయంగా దక్కవలసిన నీళ్ళను కాజేయగా, ఇప్పుడు మహారాష్ట్ర బాబ్లీ డ్యామ్ నిర్మించి మన నోట్లో మన్ను కొట్టబోతోంది. ఇందుకు, మహారాష్ట్రను తప్పు పట్టడం శుద్ధ అవివేకం. ఆ రాష్ట్రం తన రైతుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి అంతకు తెగించింది. కానీ, మన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుపక్షపాతినంటూ టముకు వేసుకోవడం మినహా రైతులకు చేసిందేమీ లేదు. రైతులకు నీళ్ళు తెచ్చి ఈయకపోతే పోయే, కనీసం పైనుండి వచ్చే నీటి ధారలను సక్రమంగా రాష్ట్రంలోకి వచ్చేందుకు కూడా ప్రభుత్వం చొరవచూపలేకపోయింది.   ఆల్మటి, బాబ్లి డ్యామ్ ల సంగతి పక్కన పెడితే, మన రాష్ట్రం నుండి యదేచ్చగా గ్యాసును కూడా గుజరాత్ రాష్ట్రానికి తరలించుకు పోయేందుకు అనుమతించిన మన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు గ్యాస్ కొరత ఏర్పడిన తరువాత, కేంద్రం కాళ్ళు, గుజరాత్ కాళ్ళు పట్టుకొని ప్రాదేయపడే దుస్థితి చేజేతులా తెచ్చింది. ఇక, నిన్నటి రైల్వే బడ్జెట్ లోను మన రైల్వే మంత్రిగారి, మన యం.పీ.ల నిర్వాకం చూసాము. రెండు మూడు కొత్త రైళ్ళు, ఒక పేరుగొప్ప బాటిలింగు ప్లాంటు, వేగన్ వర్క్ షాప్ తప్ప కొత్తగా సాదించింది ఏమి లేదు. ఇదివరకు మంజూరు చేసిన ప్రాజెక్టులే ఇంతవరకు పూర్తికాలేదు. మరిప్పుడు కొత్తగా మంజూరయినవి పూర్తయి, అవి ప్రజలకు ఉపయోగపడేనాటికి మరెన్ని దశాబ్దాలు పడతాయో ఎవరికీ తెలియదు.   అదే విధంగా, తెలంగాణా సమస్యవల్ల రాష్ట్రం తిరోగమన దిశలో వేగంగా సాగిపోతున్నపటికీ, కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజకీయలబ్ది కోసమే ఏళ్లతరబడి నాన్చుతూ రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చుచేసి, జస్టిస్ శ్రీకృష్ణ కమిటి వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ నివేదిక చెత్తబుట్టలోకి విసిరేసి మళ్ళీ చర్చలు అంటూ కొండని తవ్వి ఎలుకను పట్టే ప్రయత్నం చేస్తోందిప్పుడు.   ఇక, మొన్న జరిగిన బాంబు ప్రేలుళ్ళలోను అదే నిర్లక్ష్యం. కేంద్రం నుండి గట్టి హెచ్చరికలు వచ్చినప్పటికీ, ప్రభుత్వంలో ఏదో తెలియని నిరాసక్తత, నిర్లిప్తత అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంది. ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరితో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. నిన్న దిల్ షుక్ నగర్ సంఘటన అయితే, ఈ రోజు బాబ్లీ, రేపు మరోటి.   ప్రభుత్వం చేస్తున్న తప్పులను, నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టి దారిన పెట్టవలసిన ప్రతిపక్షాలు అధికారంలోకి రావడం కోసం పాదయాత్రలు చేసుకొంటూ తమ బాధ్యతలను విస్మరిస్తున్నాయి గనుకనే ప్రభుత్వం కూడా ఇంత బాధ్యతా రాహిత్యంగా, ఇంత నిర్లక్ష్యంగా ఉండగలుగుతోందని చెప్పవచ్చును.

బాబ్లీ ప్రాజెక్టు పై సుప్రీం తీర్పు: ఎపికి ఎదురుదెబ్బ

        బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ పై ఆంధ్ర ప్రదేశ్ కు ఎదుదెబ్బ తగిలింది. మహారాష్ట్రకు అనుకూలంగా తీర్పు వెలువడింది. మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టును పూర్తిగా తొలగించలేమని సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. ప్రాజెక్టుపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర వాటా కింద నీటిని వాడుకునేందుకు పర్యవేక్షక కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. త్రిసభ్య కమిటీ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్క ప్రతనిధి, చైర్మన్‌గా జలవనరుల సంఘం సభ్యుడి నియామకం జరుగనుంది. అలాగే 2.47 టీఎంసీల నీటిని మాత్రమే మహారాష్ట్ర ఉపయోగించుకోవాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం 0.6 టీఎంసీల నీటిని వీడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏడేళ్ల సుదీర్ఘ వాదనల అనంతరం బాబ్లీ వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించింది.    

త్రిపురలో వామపక్ష కూటమి హావా

        మూడు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ శాసనసభల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైన ఈ రాష్ట్రాలలో ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారోనని ప్రధాన రాజకీయపార్టీలు ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నాయి. నాగాలాండ్‌లో 60 స్థానాలకు గాను 59 స్థానాలకు ఓట్లను లెక్కిస్తున్నారు. త్రిపురలో 60 శాసనసభా స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఫలితాల సందర్భంగా మూడు రాష్ట్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. త్రిపురలో వామపక్ష కూటమి అధికారం చేజిక్కుంచుకునే దిశగా దూసుకుపోతుంది. 60 శాసనసభ స్థానాలకు గాను వామపక్ష కూటమి అభ్యర్ధులు 40స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు.

కోల్ కతా అగ్నిప్రమాదం లో 20 మృతి

        కోల్‌కతాలోని సూర్య సేన్ మార్కెట్‌లో ఓ గోదాంలో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20మంది మరణించారు. చనిపోయిన వారిలో ఎక్కవగా దుకాణాల యజమానులు, పనిచేసేవారు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నించారు. సుమారు 20 అగ్నిమాపక యంత్రాలతో మూడు గంటలు శ్రమించి మంటలను అదుపుచేశారు. అగ్నిప్రమాద స్థలాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంభాలకు రెండు లక్షల చొప్పున, గాయపడిన వారికి యాభై వేల చొప్పున పరిహారం ప్రకటించారు. కాగా, మార్కెట్‌లో కాయకష్టం చేసి.. అలసిపోయి.. నిద్ర పోయిన కూలీలను అగ్నిజ్వాలలు బలిగొన్నాయి. ప్లాస్టిక్ వస్తువులు, కాగితాలు, వస్త్రాలకు నిప్పంటుకొని పొగలు సుడులు తిరగడంతో ఊపిరాడక.. తప్పించుకునే దారి కానరాక అక్కడ నిద్రించిన వారిలో ఎక్కువ మంది సజీవదహనమయ్యారు.