తెదేపా నేతలకి షర్మిల సూటి ప్రశ్న
posted on Sep 16, 2013 @ 9:40PM
తెదేపా, వైకాపా నేతలలో ఎప్పుడు ఎవరు డిల్లీ బయలుదేరుతున్నారెండో పార్టీ నేతలు దానిపై వివాదం రేకెత్తించడం రివాజుగా మారిపోయింది. అయితే ఆ రెండు పార్టీ నేతలు కూడా ‘కాంగ్రెస్ పార్టీతో మీరు కుమ్మక్కయ్యారంటే మీరే’ అని వాదులాడుకొంటూ ప్రజలకి మంచి కాలక్షేపంతో బాటు కొత్త అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నారు. కానీ, ఇందులో మూడో పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం ఈవాదప్రతివాదనలు, ఆరోపణలపై ఎన్నడూ స్పందించకపోవడం విశేషం.
ఇక తల్లి, పిల్ల కాంగ్రెస్ కలయిక అనివార్యమని బల్ల గుద్ది చెపుతున్నతెదేపా నేతలకు వైకాపా నేత షర్మిల ఒక సూటి ప్రశ్న అడిగారు. తెదేపా చెపుతున్నట్లు తాము కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యి ఉండి ఉంటే, తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి 16నెలల్లుగా జైల్లో మ్రగ్గేవాడా? కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ఉంటే ఏనాడో కేంద్ర మంత్రి అయ్యి ఉండేవారు కాదా? అని ఆమె ప్రశ్నించారు. ఇప్పడు కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి బెయిలు రాకుండా అడ్డుపడేందుకే పనిగట్టుకొని డిల్లీ బయలుదేరుతున్నారని ఆమె ఆరోపించారు. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీతో ఎవరు చేతులు కలుపుతున్నారో అందరికీ అర్ధం అవుతోందని ఆమె అన్నారు.
అయితే, వైకాపా, కాంగ్రెస్ పార్టీతో ఎన్నడూ చేతులు కలపదని, కాంగ్రెస్ లో విలీనం కాదని షర్మిల హామీ ఇవ్వగలరా? అని తెదేపా నేతలు ఎదురు ప్రశ్నించారు.