పంచాయితీల ఆదాయం కోసం ప్రభుత్వ సంస్థల మధ్య పంచాయితీ
posted on Sep 16, 2013 @ 4:04PM
సీమాంధ్ర నేతలు చెపుతున్నట్లు రాష్ట్ర విభజన జరిగితే ఆదాయ పంపకాలు, నీటియుద్దాలు వగైరాలనీ ఒట్టి అపోహలేనని తెలంగాణా వాదులందరూ చాలా గట్టిగానే వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్.యం.డీ.ఎ.) మరియు గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ (జీ.హెచ్.యం.సీ.) సంస్థల మధ్య 36 పంచాయితీల ఆదాయం కోసం జరుగుతున్నయుద్ధం గమనిస్తే సీమాంధ్ర నేతల వాదనలు నిజమేనని నమ్మక తప్పదు.
2007లో గ్రేటర్ హైదరాబాదు పరిధిని శివార్లలో ఉన్న36 పంచాయితీలకు విస్తరిస్తూ నిర్ణయం తీసుకొన్నపటి నుండి ఈ యుద్ధం మొదలయింది. ఈ 36 పంచాయితీల నుండి దాదాపు రూ. 200కోట్లు వివిధ పన్నుల రూపంలో సాలీనా ఆదాయం లభిస్తుంది. ఇంత కాలంగా తమ అధీనంలో ఉన్నఆ 36 పంచాయితీల పరిధిలో గల 10 మునిసిపాలిటీల నుండి గత ఆరు సంలుగా జీ.హెచ్.యం.సీ. వసూలు చేసిన రూ.1200 కోట్ల డెవెలప్మెంట్ చార్జీలను కక్కమని హెచ్.యం.డీ.ఎ. అధికారులు ఒక లేఖ వ్రాసారు. ఒకవేళ అందుకు అంగీకరించని పక్షంలో ఇక ముందు తమకు సదరు పంచాయితీ పరిధిలో డెవెలప్మెంట్ చార్జీలను వసూలు చేసుకొనే హక్కు ఇప్పించాలని ప్రభుత్వానికి కూడా ఒక లేఖ వ్రాసారు.
హెచ్.యం.డీ.ఎ. కమీషనర్ నీరభ్ కుమార్ “2007లో ప్రభుత్వం ఈ10 మునిసిపాలిటీలను జీ.హెచ్.యం.సీ.లో విలీనం చేస్తూ జారీచేసిన జీఓలో జీ.హెచ్.యం.సీ.కి ఆయా ప్రాంతాలలో డెవెలప్మెంట్ చార్జీలను వసూలు చేసుకొనే అధికారం ఇచ్చినప్పటికీ, ఆ మొత్తాన్ని హెచ్.యం.డీ.ఎ. ఖాతాలో జమా చేయాలని స్పష్టంగా పేర్కొందని” అన్నారు.
కానీ, జీ.హెచ్.యం.సీ. పంచాయతీల విలీనం పట్ల చూపిన ఆసక్తి అ తరువాత వసూలయిన మొత్తాన్ని హెచ్.యం.డీ.ఎ. ఖాతాలో జమా చేయడంలో మాత్రం చూపలేదని ఆయన ఆరోపించారు. డెవలప్మెంట్ చార్జీల పేరిట వసూలయిన మొత్తం అంతా జీ.హెచ్.యం.సీ. వాడుకొంటోందని, న్యాయంగా తమకు రావలసిన మొత్తం తమ ఖాతాలో జమ చేసినట్లయితే కేవలం హెచ్.యం.డీ.ఎ. పరిధిలోనే గాకుండా జీ.హెచ్.యం.సీ. పరిధిలో ఉండే ప్రాంతాలలో కూడా అవసరమయిన మౌలిక వసతులు కల్పించడానికి వీలవుతుందని ఆయన అన్నారు.
అయితే, జీ.హెచ్.యం.సీ. చీఫ్ సిటీ ప్లానర్ జీ.వీ. రఘు మాత్రం ఆయన వాదనలతో ఏకీభవించట్లేదు. 10 మునిసిపాలిటీలలో తమ సంస్థ వసూలు చేస్తున్నడెవెలప్మెంట్ చార్జీలతో ఇంతవరకు హెచ్.యం.డీ.ఎ. చేస్తున్నపనినే ఇప్పుడు జీ.హెచ్.యం.సీ. చేస్తోందని, అందువల్ల తాము ఎవరికీ డబ్బు వాపసు చేయవలసిన అవసరం లేదని అన్నారు.