tdp chandrababu

టిడిపి శాసనసభాపక్షం భేటి

        ఈ నెల 13వ తేది నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించేందుకు తెలుగుదేశం శాసనసభాపక్షం ఈ రోజు సమావేశం కానుంది. కృష్ణా జిల్లాలో వస్తున్నా మీ కోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబు అధ్యక్షతన కైకలూరు మార్గంలో దాకరంలో ఉదయం 11గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు వస్తున్న౦దున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఈ సమావేశాలకు దూరంగా ఉంటున్న౦దున శాసనసభలో పార్టీ వైఖరి, అవిశ్వాసంపై పార్టీ విధానం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సభలో పార్టీని ముందుకు నడిపించే అంశంపై నిర్ణయం తీసుకున్నారు.

kcr

షర్మిల, చంద్రబాబులతో కేసీఆర్ పోటీ

  ఒకవైపు చంద్రబాబు, షర్మిల నిర్విరామంగా పాదయాత్రలు చేస్తూ స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా వాగ్దానాలు చేసుకుపోతున్నారు. వారిద్దరిలో అధికారంలోకి వచ్చేదెవరో, వచ్చినప్పుడు చేసిన వాగ్దానాలను తీర్చేదెప్పుడో ఎవరికీ తెలియదు. గానీ, ఆకాశం నుండి జడివాన కురుస్తున్న తీరుగా ఇద్దరూ ఒకరితో మరొకరు పోటీలుపడుతూ మరీ వాగ్దానాలు చేసేస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు.   ఇక, వీరిద్దరూ ‘వాగ్దానాల బాట’లో సాగిపోతుంటే, ‘తెలంగాణా బాట’లో సాగిపోతున్న కేసీఆర్ కూడా ఎక్కడ పదిమందిని ఉద్దేశించి ప్రసంగించినా ముందు ఆంధ్రోల్లను నాలుగు బూతులు లంకించుకొన్న తరువాత, ఎదురుగా ఉన్న జనాలను బట్టి వారికి తగిన వాగ్దానాలు చేసేస్తుంటారు. సభికులు ప్రభుత్వోద్యోగులయితే వారికి ఇంక్రిమెంటులు, ప్రమోషన్లూ, విద్యార్దులయితే ఉచిత విద్య, ముసలి వారయితే, పెన్షన్లు పెంపుదల, యస్సీ, ఎస్టీ, బీసీ లయితే, ఉద్యోగాలలో రిజర్వేషన్ల పెంపుదలవంటివి ఉంటాయి.   ఆయన నిన్న హైదరాబాదులో ఆర్టీసీ మహిళా కాంట్రాక్టు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు, కేసీఆర్ వారందరి ఉద్యోగాలు పర్మనంట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ పర్మనెంట్ చేయగా ఇంకా ఎవరయినా కాంట్రాక్టు ఉద్యోగులుగా మిగిలిపోతే వారందరికీ ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక, మహిళలకి (తెలంగాణా మహిళలకి) ప్రభుత్వోద్యోగాలలో రిజర్వేషన్ల అమలు చేస్తామని హామీ ఇచ్చారు.   ఈ ముగ్గురు నేతలు ప్రస్తుతం చేస్తున్న వాగ్దానాలను కనీసం మీడియావారయినా శ్రమ అనుకోకుండా రికార్డు చేసి భద్రపరిస్తే ఎవరు అధికారంలోకి వస్తే వారికి వారు చేసిన వాగ్దానాల లిస్టులు అందించి వాటిలో ఏమయినా అమలు చేయగలరేమోనని జ్ఞాపకం చేసే అవకాశం ఉంటుంది.

chandrababu

ఆయనకీ నిద్రలో కూడా అవే ఆలోచనలట!

  గత ఐదు నెలలుగా నిర్విరామంగా పాదయాత్రలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి నిద్రలోకూడా అవే ఆలోచనలని చెప్పారు. అంటే కాదు మెలుకువగా ఉన్నపుడు కూడా అవే ఆలోచనలుట! అపార్ధం చేసుకోవద్దు, ప్రజల సమస్యల గురించే ఆ ఆలోచనలుట.   మెలకువగా ఉన్న, నిద్రపోతున్నా ప్రజల సమస్యలే తన మెదడును ఆక్రమిస్తున్నాయని ఆయన చెప్పారు. అందువల్ల ఈ సమస్యలన్నిటినీ ఒకేసారి పరిష్కరించి పడేసేందుకు అప్పుడే ఆయన  చాలా ప్రణాలికలు కూడా సిద్దం చేసుకోన్నానని ఇటీవల పాదాయత్రలో ప్రజలకు తెలిపారు. ఇక, ప్రజలు కూడా సిద్దమయితే వెంటనే అన్ని సమస్యలను తానూ చక చకా పరిష్కరించేయదలుచు కొన్నట్లు  చెప్పారు.   ఇదివరకు అధికారంలో ఉన్నపుడు ప్రజల మైండ్ సెట్ మారాలని చెపుతూ వచ్చిన చంద్రబాబు పాదయాత్ర మొదలుపెట్టిన తరువాత ఇప్పుడు తన మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఇప్పుడు తానూ మారిన మనిషినని ఆయన అన్నారు.   ఇక తన జీవితం సర్వస్వం ప్రజలకే అంకితం అని చెప్పారు. అసలు మన స్వంత బంధువులు, స్నేహితులే మన సమస్యలని పట్టించికోని ఈ రోజుల్లో మన మొహం కూడా ఎన్నడూ చూడని చంద్రబాబు ఈ విధంగా మన కోసం (?) పాపం రాత్రనకా, పగలనకా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక పాదయాత్రలు చేయడం, మన కోసమే ఆలోచించడం నిజంగా తెలుగు ప్రజల పూర్వ జన్మ సుకృతమేనేమో.

brother anil kumar

ప్రభువే కాపాడును నన్ను: అనిల్

  తనపై క్రమంగా ఉదృతమవుతున్న బీజేపీ దాడులకు బ్రదర్ అనిల్ కుమార్ మొట్టమొదటిసారి స్పందిస్తూ తానూ ఏపాపము చేయలేదని, తన స్నేహితుడికి చెందిన సంస్థలో ఎవరో వ్యక్తీ చనిపోయినా కూడా అది తనకే ముడిపెట్టి తనపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. మహాపురుషుడయిన రాజశేఖర్ రెడ్డి కుటుంబములో సభ్యుడినయినందుకు తానూ చాలా గర్వ పడుతున్నానని, తమ కుటుంబములో ఎవరూ కూడా తప్పులు చేయలేదని అన్నారు. దైవసేవలో నిమగ్నమయి ఉన్న తనపై ఈ విధంగా లేనిపోని అభాండాలు వేయడం చాలా అన్యాయమని, తనను ఆ ప్రభువే కాపాడుకొంటాడని అనిల్ అన్నారు.   కానీ, బీజేపీ మాత్రం బ్రదర్ అనిల్ కుమార్ కి వ్యతిరేఖంగా తన వద్ద ఖచ్చితమయిన ఆధారాలున్నాయని చెపుతోంది.   ఇక మరో వైపు బీజేపీ, బ్రదర్ అనిల్ యొక్క బినామి సంస్థగా ఆరోపిస్తున్న బెనిటా ఇండస్ట్రీస్ ఎండీ వీరభద్రారెడ్డి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు చేసేందుకు పోలీసులు కూడా రంగంలో దిగి కడప, పెండ్లిమర్రి మైనింగ్ కార్యాలయాల్లో సోదాలు జరిపి పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీరభద్రారెడ్డి చేతిరాత ఫైళ్లను, ఆయన వివిధ సంస్థలతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా సేకరించి, ఆ సంస్థ అసలు యజమాని ఎవరో కనిపెట్టే పనిలోపడ్డారు.   వారు సేకరించిన ఫైళ్ళలో బ్రదర్ అనిల్ కు చెందినవిగా భావిస్తున్న రక్షణ స్టీల్స్, బయ్యారం గనులకు ఏమయినా లింకు దొరికినట్లయితే, అప్పుడు అనిల్ కుమార్ చెప్పినట్లు ఆయనను ఆ ప్రభువే కాపాడుకోవలసి ఉంటుంది.   అయితే, ఒకవేళ కీలక ఆధారాలు దొరికినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ దానిని అవసరమయిన సమయంలోనే ఒక అస్త్రంగా వాడుకొని తన ప్రభుత్వం కాపాడుకొనే ఆలోచన చేసినా ఆశ్చర్యంలేదు. లేకుంటే, వేరే సమయంలో దానినే ఒక బ్రహ్మాస్త్రంగా చేసుకొని జగన్ మోహన్ రెడ్డి పై ప్రయోగించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

JAGAN MOHAN REDDY

ఏప్రిల్ నెలకోసం జగన్ ఎదురుచూపులు

  అక్రమాస్తులకేసులో అరెస్ట్ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్. జగన్ మోహన్ రెడ్డి పట్టువదలని విక్రమార్కుడివలె బెయిలు కోసం అనేక సార్లు ప్రయత్నించినపటికీ, సీబీఐ ఎప్పటికప్పుడు సైంధవుడిలా అడ్డుపడుతుండటంతో, తొమ్మిది నెలలు గడిచినా ఆయనకీ ఇంతవరకు బెయిలు భాగ్యం దొరకలేదు. అయితే, పాదయాత్ర చేస్తున్న ఆయన సోదరి షర్మిల గత కొన్ని రోజులుగా త్వరలో అన్న బయటకి వచ్చేస్తున్నాడంటూ కొంచెం నమ్మకంగానే చెపుతున్నారు.   జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి బయటకి రావడానికి మరెంతో కాలం పట్టదని ఆయన పార్టీ నేతలు కూడా చాల గట్టిగానే చెపుతున్నారు. అయితే, వారు అంత ధృడంగా విస్వసించడానికిగల కారణాలు ఏమిటంటే, గతంలో జగన్ మోహన్ రెడ్డి బెయిలు కోసం సుప్రీం కోర్టులో పిటిషను వేసినప్పుడు, రాష్ట్ర కోర్టుల్లో తేల్చుకోవలసిన అంశాన్ని తన వద్దకు తీసుకురావద్దని హెచ్చరిస్తూనే, ఒకవేళ సీబీఐ గనుక ఇప్పట్లో విచారణ పూర్తిచేయలేదని తాము భావించినట్లయితే అప్పుడు బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని జగన్ మోహన్ రెడ్డి లాయర్లకు హామీ ఇచ్చింది. అంతే గాకుండా, సీబీఐను త్వరగా విచారణ పూర్తిచేయడం మంచిదని హెచ్చరించింది. అదే సమయంలో మార్చి నెలలోగా విచారణ పూర్తిచేయడానికి ప్రయత్నించామని సీబీఐ ను కోరింది.   ఇటీవల సిబీఐ నాంపల్లి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయడానికి ప్రయత్నించినప్పుడు, బహుశః అదే కారణంతో జగన్ లాయర్లు తీవ్రంగా వ్యతిరేఖించి ఉంటారు. వచ్చేనెలలోగా సిబీఐ విచారణ ఎలాగు పూర్తిచేయలేదు కనుక, ఇప్పుడు దానిని అభియోగాపత్రం నమోదు చేయనిచ్చినట్లయితే, అప్పుడు బెయిలు కోరెందుకు సమస్యలు వచ్చే అవకాశం ఉందనే ఆలోచనతోనే వారు సిబీఐను అడ్డుకొని ఉండవచ్చును. బహుశః వారు జగన్ మోహన్ రెడ్డికి తప్పనిసరిగా ఏప్రిల్ నెలలో బెయిలు వస్తుందని భరోసా ఈయడం వల్లనే, షర్మిలతో సహా ఆ పార్టీ నేతలందరూ జగన్ మోహన్ రెడ్డి త్వరలో జైలు నుండి విడుదల అవుతాడని నమ్మకంగా ప్రజలకి చెపుతున్నారనుకోవచ్చును.   అందుకే జగన్ మోహన్ రెడ్డి కూడా ఏప్రిల్ నెల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సారి కూడా బెయిలు దొరకకపోతే జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర నిరాశ తప్పదు. తత్ఫలితంగా, ఆయన ఆగ్రహావేశాలకి సహజంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమే బలయిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన గనుక బెయిలుపై విడుదల అయినట్లయితే, జగన్ మోహన్ రెడ్డి కొంచెం సర్ధుకొనే వరకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మరి కొద్ది రోజులు అవకాశం దక్కే అవకాశం ఉంటుంది.

Bomb Hoax In Bhuvanagiri

భువనగిరి థియేటర్ లో బాంబు ...?

భువనగిరిలోని భద్రాది థియేటర్ లో మార్నింగ్ షో సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. వారు సినిమా టిక్కెట్లు తీసుకుని లోపలికి వెళుతుండగా గేటు దగ్గర సిబ్బంది వారిని ఆపి వారి చేతిలోని బ్యాగ్ చూపించావలసిందిగా కోరారు. కానీ ఆ నలుగురూ బ్యాగ్ తెరవకుండానే వెనుతిరిగి పోతుండగా సిబ్బందికి అనుమానం వేసి వారిని నిలదీసి బ్యాగ్  చూపించాలని పట్టుబట్టారు. దీంతో ఆ నలుగురు వ్యక్తులు పరుగుప్రారంభించడంతో థియేటర్ కి వచ్చిన వారు పట్టుకోవాలని ప్రయత్నించారు. ముగ్గురు వ్యక్తులు పారిపోగా ఒకతన్ని పట్టుకుని భువనగిరి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. డి.ఎస్.పి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో సి.ఐ. మధుసూదనరెడ్డి విచారణ ప్రారంభించారు. విచారణ తరువాత డి.ఎస్.పి. మాట్లాడుతూ వారు తీవ్రవాదులు కారని మహారాష్ట్రలోని షోలాపూర్ కి చెందినవారని, వారు చిల్లర దొంగతనాలు చేస్తుంటారని తెలిపారు. మిగిలిన ముగ్గురి గురించి పట్టుబడ్డ వ్యక్తి ద్వారా వివరాలు సేకరిన్స్తామని చెప్పారు.

nagam janardhan reddy

నాగమన్నా అట్టా ఆగం సేయకే

  ఇటీవల మీడియాలో తెరాస మరియు తెలంగాణా జేయేసిలకు వ్యతిరేఖంగా మళ్ళీ మరోసారి నిప్పులు కక్కిన నాగం జనార్ధన్ రెడ్డిని మంచి చేసుకొనే ప్రయత్నంలో పడ్డారు తెరాస నేతలు. నిన్నగాక మొన్న ఉద్యమంలోకి వచ్చి, తెరాసలో చేరిపోయి వెన్వెంటనే తెలంగాణా జేయేసి కూడా స్థానం సంపాందించడమే గాకుండా మొన్న శాసన మండలి సభ్యుడిగా కూడా పదోన్నతి పొందిన స్వామీ గౌడ్, నాగం ఆగం ఎందుకో గ్రహించలేకపోలేదు.   అందుకే , ఇటీవల టీఎన్‌జీవోభవన్‌లో నిర్వహించిన జేఏసీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన నాగం జనార్ధన్ రెడ్డిని ‘పదవీత్యాగం చేసిన మహానేత, తెలంగాణా ఉద్యమంలో కీలక వ్యక్తీ’ అంటూ తెగ పొగిడేశారు. నాగం తెలంగాణా జేయేసిలో సభ్యుడు కాకపోయినా, తాము ఆయనని జేయేసీలో అంతర్భాగంగానే చూస్తున్నామని అందుకే ఆయన చేపట్టిన భరోసా యాత్రకు మద్దతు తెలిపామని అన్నారు. ఇకపై జేఏసీ చేపట్టే అన్ని కార్యక్రమాలకు నాగమన్నను తప్పక ఆహ్వానిస్తామని అన్నారు. ఒకవైపు కేసీఆర్, ప్రొఫసర్ కోదండరామ్ తనను తెలంగాణా జేయేసిలోకి రాకుండా అడ్డుకొంటున్నారని మీడియా ముందు బాహాటంగానే చెపుతున్న నాగం జనార్ధన్ ప్రచారం వల్ల తనకీ, తెరాసా పార్టీకి, తెలంగాణా జేయేసికి కూడా కొత్త సమస్యలు ఎదురవుతాయనే భయంతోనే స్వామీ గౌడ్ ఆయనను మంచి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.   అయితే, తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన కేసీఆర్, ప్రొఫసర్ కోదండరామ్ ల అభీష్టానికి వ్యతిరేఖంగా స్వామీగౌడ్ నాగం జనార్ధన్ రెడ్డిని జేయేసిలోకి ఆహ్వానించడం సాధ్యం కాకపోవచ్చును. ఒకవేళ, నాగం అందుకు సిద్దపడినా ఇప్పటికీ ఆయనని అనుమానంగా చూస్తున్న కేసీఆర్ అంగీకరించకపోవచ్చును. తత్ఫలితంగా, నాగం ముందే చెపుతున్నట్లు స్వయంగా కొత్త రాజకీయ పార్టీని స్తాపించడమో లేక బీజేపీలో చేరడమో జరగవచ్చును. అప్పుడు తెరాసకు నాగం జనార్ధన్ రెడ్డి నుంచి మరిన్నికొత్త సవాళ్ళు ఎదురయే అవకాశం ఉంది.

Delhi Gang Rape Victim

ఢిల్లీలో రేప్ కు గురైన నిర్భయకు అమెరికా అవార్డ్

  ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయకు  అమెరికా ఇచ్చే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సాహస మహిళా అవార్డు ప్రకటించింది . లైంగిక దాడులను ఎదురోడ్డేవారికి స్ఫూర్తినిచ్చేందుకు మరణానంతరం ఆమెకు ఈ అవార్డు ఇస్తున్నట్లు అమెరికా ప్రథమ మహాల మిషెల్లీ ఒబామా, విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఒక ప్రకటనలో ప్రకటించారు. ఈ అవార్డును జ్యోతిసింగ్ పాండే కుటుంబ సభ్యులకు ఫిబ్రవరి 8న నిర్వహించే అంతర్జాతీయ  మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అందజేయనున్నారు. ఈ అవార్డును అమెరికా ప్రభుత్వం 2007న ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా 10 మంది మహిళలకు అందజేస్తారు. ఈ అవార్డును ప్రకటించడంతో జ్యోతిసింగ్ పాండే కుటుంబసభ్యులు తమ హర్షాన్ని ప్రకటించారు.

Another Blast may be Twin Cities

జంటనగరాలకు మరో పేలుడు ముప్పు

దిల్ షుక్ నగర్ ప్రేల్లుళ్ళు మరవక ముందే బుధవారం ఉదయం కేంద్ర నిఘావర్గాల నుంచి మరోసారి హెచ్చరికలు జారీ అయినట్లు తెలుస్తుంది. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో జంటనగరాల పోలీస్ వ్యవస్థ అప్రమత్తతై నగర ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గుర్తిన్చ్నినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను పోలీసులు కోరుతున్నారు. ఇంటర్మీడియ పరీక్షలు జరుగుతున్నా సమయంలోనే కేంద్ర నిఘావర్గాల నుండి హెచ్చరికలు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసు వర్గాలు నగరంలో హై అలర్ట్ ప్రకటించి తనీఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

ysrcp

విద్యుత్ సంక్షోభంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా

  ఈ రోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ కోతలకు, పెరిగిన కరెంటు చార్జీలకు నిరసనగా మహాధర్నా కార్యక్రమం చేప్పటింది. ఆ పార్టీ గౌరవాద్యక్షురాలు విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల ఇద్దరూ ఈ మహా ధర్నాలో పాల్గొని ప్రసంగించారు.   విజయమ్మ ప్రసంగిస్తూ “నేటి విద్యుత్ సంక్షోభానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎంత బాధ్యత ఉందో, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడుకి కూడా అంతే బాధ్యతా ఉంది. ఇద్దరూ కూడా విద్యుత్ సంక్షోభాన్ని నివారించగలిగే అవకాశం ఉన్నపటికీ, ఒకరు ఆలోచనా రహితంగా, నిర్లక్ష్యంతో, మరొకరు స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారకులయ్యారు. రాష్ట్రంలో తగినంత విద్యుత్ ఉత్పాదన లేదని తెలిసి, అందుకు అవసరమయిన ఏర్పాట్లు చేయడంలో కిరణ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారు. తన హయాంలో ఎన్నడూ ఉచిత విద్యుత్ గురించి మాట్లాడని చంద్రబాబు నేడు ఊరూరు తిరుగుతూ ఉచిత విద్యుత్ ఇస్తానని భూటకపు వాగ్దానాలు చేస్తున్నాడు. ఆయన తన హయంలో కొన్ని మినీ విద్యుత్ ప్రాజెక్టులను నిబందనలకు విరుద్ధంగా ఎంవీఎస్ మూర్తి లాంటి తన వారికి కట్టబెట్టారు. మరణించిన నా భర్తను నిత్యం ఆడిపోసుకొనే చంద్రబాబు తన హయంలో జరిగిన ఈ అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్దమేనా? నాడు రాజశేఖర్ రెడ్డి గారి హయం లో లేని విద్యుత్ సంక్షోభం నేడు ఎందుకు ఏర్పడింది? ప్రభుత్వాల అసమర్ధత వల్లనే కదా? మరి అటువంటప్పుడు మీరు చేసిన తప్పులకు ప్రజలను ఎందుకు శిక్షిస్తున్నారు?” అంటూ ఆమె ప్రశ్నించారు.

Rahul Gandhi not to marry

రాహుల్ పెళ్ళి చేసుకుంటారా..!

        కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీకి పెళ్ళి కబురు కోసం కాంగ్రెస్ నేతలే కాకుండా, దేశంలో ప్రజలు ఆశక్తితో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయనను కలిసిన లోక్ సభ సభ్యులు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. అయితే “నేనా పెళ్లి చేసుకుంటాను గానీ..ఇప్పట్లో పెళ్లి చేసుకోను” అని రాహుల్ సెలవిచ్చారు. అంతే కాకుండా నేను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని అన్నారు. వారసత్వం పరంగానే 2014లో రాహుల్ ను దేశ ప్రధాని చేయాలని తల్లి సోనియాగాంధీ ఆశపడుతుంటే, ఆయన మాత్రం దీనికి వ్యతిరేకం అంటున్నారు. ఇప్పటికే 42 ఏళ్లు నిండిన రాహుల్ ఇక ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా,లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో ఎవరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడని, ప్రేమలో పడ్డాడని వార్తలు వచ్చాయి. అలాంటిది ఇప్పట్లో పెళ్ళి లేదనడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

 Punjab police thrash girl for complaining of sexual harassment

పిర్యాదుచేస్తే...యువతిని చితకబాదిన పోలీసులు

        భారతదేశంలో మహిళాలకి ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారనేది గత కొంత కాలంగా జరుతున్న సంఘటనలు చూస్తే అర్థమవుతోంది. రోజు రోజుకి మహిళలపై అరాచకాలు పెరుగుతున్నాయే తప్ప, తగ్గే మార్గం కనపడడం లేదు. తాజాగా పంజాబ్ లో మరో ఘోరం జరిగింది. కాపాడవాలిసిన రక్షక భటులే రాక్షసుల్లాగా ప్రవర్తించారు. ఓ యువతని రోడ్డుపై ట్రాక్ డ్రైవర్లు ఎడిపించగా కంప్లైంట్ చేయడానికి వెళ్తే..పోలీసులు ట్రక్కు డ్రైవర్లను వెనుకేసుకు వచ్చి తండ్రీ కూతుళ్లను నడి వీధిలో చితకబాదారు. అక్కడ ఉన్నవారు కూడా పోలీసులకు అడ్డుపడకుండా..సినిమా షో చూసినట్టు చూసి వెళ్ళిపోయారు. ఈ సంఘటనను ఓ వ్యక్తి సెల్ ఫోన్‌లో చిత్రీకరించడ౦తో పోలీసులు వ్యవహారం బయటకు వచ్చింది. ప్రభుత్వం ఆ పోలీసులను సోమవారం నాడు సస్పెండు చేసింది. ఈ ఘటనపై బాధిత యువతి స్పందిస్తూ.. తనపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయడం కాదని, ఉద్యోగంలో నుండి తొలగించాలని డిమాండ్ చేసింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని బాధిత మహిళ చెప్పింది. ఈ ఘటనపై ఎంపి జయబాచ్చన్ పార్లమెంటులో ప్రస్తావించారు. మీడియా రోజుకో కొత్త అంశాన్ని వెలుగులోకి తీసుకు వస్తుందని, సామాన్యుడికి రక్షణ లేకుండా పోయిందన్నారు.  

'బాద్ షా' ఆడియోకి స్పెషల్ గెస్ట్

    ఈ వేసవిలో టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడాని ఎదురుచూస్తున్న సినిమాలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' మూవీ ఒకటి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా పై టాలీవుడ్ లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా ఆడియో ను శివరాత్రి రోజు గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈ ఆడియో రిలీజ్ వైవిధ్యంగా చెయ్యనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఆడియో ఫంక్షన్ కు హైలైట్ గా ఓ స్పెషల్ గెస్ట్ రానున్నారని, ఆయన పేరును బండ్ల గణేష్ సీక్రెట్ గా వుంచారని తెలుస్తోంది.   మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే  'బాద్ షా' మూవీ ఓపెనింగ్ కు మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' ను గెస్ట్ గా పిలిచి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు ప్రొడ్యూసర్ గణేష్. మరీ ఈ సారి వచ్చే అతిథి ఎవరో తెలుసుకోవాలంటే 'బాద్ షా' పాటల వేడుక వరకు ఆగాల్సిందే.   

హైదరాబాద్ పేలుళ్ళ కేసు కంచికేనా?

  హైదరాబాద్ బాంబు ప్రేలుళ్ళపై జరుగుతున్న దర్యాప్తు ఇప్పుడపుడే ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడంలేదు. డిల్లీ నుండి తీసుకువచ్చిన ఇద్దరు నేరస్తులు ఇక్బాల్, సయీద్ లను నగరం అంతా తిప్పినా పోలీసులకి తగిన సమాచారం మాత్రం ఏమి దొరకలేదు. అందువల్ల వారిని మళ్ళీ డిల్లీకి పంపించేసారు.   ఇక, ఈ కేసు దర్యాప్తులో వివిధ శాఖలు, రాష్ట్రాలకు చెందిన కనీసం ఏడూ నుండి పది వరకు బృందాలు పనిచేస్తున్నపటికీ, ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు సాగుతున్న దర్యాప్తు వల్ల కేసులో పురోగతి కనిపించలేదు. అందువల్ల, ఈ కేసులో మొదటి నుండి దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (యన్.ఐ.ఏ) కే మొత్తం బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొన్నాయి. అయితే, రాష్ట్ర పోలీసులతో బాటు ఇంతవరకు ఈ కేసు దర్యాప్తులో పనిచేస్తున్న వివిధ సంస్థలు తమ దర్యాప్తు కొనసాగించడానికి కేంద్రం అనుమతించినప్పటికీ, తమకి అందిన సమాచారం జాతీయ దర్యాప్తు సంస్థకు అందజేస్తూ ఉండాలని ఆదేశించింది.   అయితే, కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంలో చేసిన జాప్యం వల్ల ఇప్పటికే చాల విలువయిన కాలం గడిచిపోయింది. తద్వారా బాంబు ప్రేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు తప్పించుకోవడానికి తగిన అవకాశం కూడా కల్పించినట్లయింది. ఇటువంటి సంఘటనలు జరగడం మన రాష్ట్రంలో, దేశంలో ఇదే తొలిసారి కాకపోయినపట్టికీ, ఇంతవరకు ప్రభుత్వాలు కానీ, సంబందిత శాఖలు కానీ కొత్తగా నేర్చుకొన్నది ఏమిలేదని అర్ధం అవుతోంది.   ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏవిధంగా స్పందించాలి, ఎవరు స్పందించాలి, ఎవరు విచారణ చేయాలి, ఎవరు ఏ ఏ బాధ్యతలు నిర్వర్తించాలి అనే విషయాలపై ఇంకా సరయిన అవగాహన కానీ, ప్రణాళిక గానీ ఏర్పరుచుకోలేదని ఈ నిర్ణయం వల్ల అర్ధం అవుతోంది. ఇటువంటి దుర్ఘటన జరిగిన ప్రతీసారి కూడా మన భద్రతా వ్యవస్థలలో వృత్తి నైపుణ్యానికి బదులు అయోమయం కనిపించడం సామాన్య ప్రజలను సైతం ఆశ్చర్య పరుస్తుంటుంది.   సామన్య ప్రజలు వారు చేపట్టిన వృత్తిలో పూర్తి స్థాయిలో నైపుణ్యం చూపడం ద్వారానే వారి జీవిక పొందగలుగుతున్నారు. కానీ, దేశ రక్షణ, అంతర్గత భద్రత వంటి కీలక వృత్తిని చేపట్టిన వ్యక్తులు మాత్రం ఈవిదంగా తరచూ అయోమయంగా ప్రవర్తించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః వ్యక్తుల మద్య, వ్యవస్థల మద్య సరయిన సమాచార మార్పిడి లేకపోవడం, రాజకీయాలు, బేషజాలు మొదలయినవి ఈ అయోమయానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చును. అయితే, ఇటువంటి చిన్న సమస్యలను సైతం అధిగమించలేని సదరు బృందాలు, ప్రభుత్వాలు ఇక కీలకమయిన దర్యాప్తులు ఏవిధంగా కొనసాగించగలవనే అనుమానం ప్రజలలో కలగడం సహజం.   అయినప్పటికీ, ఇంతవరకు సదరు సంస్థల పనితీరులో కానీ, ప్రభుత్వం ఆలోచన తీరులో గానీ పెద్ద మార్పు లేకపోవడం విడ్డూరం. ఇప్పటికయినా ప్రభుత్వాలు మేల్కొని ఇటువంటి దాడులను అరికట్టేందుకు, ఇటువంటి కేసులను పరిష్కరించేందుకు తగిన భద్రతా వ్యవస్థను, ప్రణాళికను ఏర్పరుచుకోకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలే అవుతుంటాయి.