రాష్ట్ర విభజనపై బీజేపీలో అంతర్మధనం
posted on Sep 16, 2013 @ 10:22AM
మొదటి నుండి చిన్న రాష్ట్రాలకు మొగ్గుచూపుతున్న బీజేపీ ఆంధ్ర రాష్ట్ర విభజనకు కూడా పూర్తి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెడితే, తమ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తామని కూడా ప్రకటించింది. అదేవిధంగా ఇటీవల హైదరాబాదు పర్యటనలో నరేంద్ర మోడీ కూడా రాష్ట్ర విభజనకే మొగ్గు చూపారు. అయితే, ఇటీవల ఏపీఎన్జీవో నేతలు సమైక్యాంధ్రకు మద్దతు కోరుతూ డిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసిన తరువాతనే వారి ఆలోచనల్లో మార్పు మొదలయింది.
బీజేపీ సహకారంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఏర్పరిచి ఆ ప్రాంతంలో మరింత బలపడుతుంటే, అందుకు సహకరించిన తాము అక్కడ ఎటువంటి రాజకీయ ప్రయోజనమూ పొందకపోగా, సీమాంధ్రలో చేజేతులా పార్టీని నాశనం చేసుకోవడం ఎందుకనే ఆలోచన బీజేపీలో మొదలయింది. తమ వైఖరి వలన తమ కంటే కాంగ్రెస్ పార్టీయే ఇందులో ఎక్కువ లాభపడుతుందని గ్రహించిన వెంటనే బీజేపీలో రాష్ట్ర విభజనపై మాట మర్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాలకు ‘సమన్యాయం’ చేయలేకపోతే, పార్లమెంటులో తెలంగాణా బిల్లుకు తాము మద్దతు ఇవ్వబోమని బీజేపీ ప్రకటించింది. ఇక, ప్రస్తుతం తాము తెలంగాణా రాష్ట్రం ఏర్పరిచే పరిస్థితిలో లేనప్పుడు, పదేపదే తెలంగాణా గురించి మాట్లాడటం వలన నష్టమే తప్ప లాభం ఏమీ ఉండదని ఆ పార్టీకి జ్ఞానోదయం అవడంతో, ఇప్పుడు ఇరు ప్రాంతాలలో తమ పార్టీని ఎలా కాపాడుకోవాలనే కొత్త ఆలోచన కూడా మొదలయింది.
అందుకే బీజేపీకి చోదకశక్తి (డ్రైవింగ్ ఫోర్స్)గా పనిచేస్తున్న ఆర్.యస్.యస్. ఈ నెల 17న బీజేపీ టీ-నేతలతో హైదరాబాదులో, ఆ మరునాడే బీజేపీ-సీమాంధ్ర నేతలో విజయవాడలో సమావేశమయ్యి, రెండు ప్రాంతాలలో పార్టీని కాపాడుకొనేందుకు ఎటువంటి వైఖరి అవలంభించాలనే అంశంపై చర్చించబోతున్నారు. ఒకవేళ బీజేపీ కూడా రెండు ప్రాంతాలకు అనువయిన వైఖరి తీసుకోదలిస్తే, బహుశః అది కూడా ప్రస్తుతం తెదేపా అనుసరిస్తున్నవైఖరినే అవలంభించవచ్చును. తద్వారా ఇంతవరకు సమైక్యాంధ్ర ఉద్యమాలకు దూరంగా ఉంటూ అక్కడ ప్రజల నుండి వ్యతిరేఖత మూటగట్టుకొన్న బీజేపీ కూడా ఇక నుండి జోరుగా ఉద్యమాలలో పాల్గొనడం ద్వారా పార్టీని మళ్ళీ ప్రజలకు దగ్గరచేయవచ్చునని బీజేపీ-సీమాంధ్ర నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక దీనివలన మరో ప్రయోజనం ఏమిటంటే, రానున్నఎన్నికల కోసం తెదేపాతో దోస్తీ చేయాలని తహతహలాడుతున్నబీజేపీ, ఈ విధంగా తేదేపాకు దగ్గరయ్యే అవకాశం కూడా ఉంది.