ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం

      జంట నగరాల్లో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా జరుగుతోంది. అనేక ప్రాంతాల నుంచి భారీ వినాయకలను తరలిస్తున్నారు. నిమజ్జనానికి హుస్సేన్‌సాగర్ సహా 24 చెరువులను ఏర్పాటు చేశారు. 20 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనం రేపు ఉదయానికల్లా పూర్తివుతుందని సీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. నిమజ్జనానికి అన్ని ఏర్పాటు పూర్తైనట్లు చెప్పారు. నగరంలో నిమజ్జనోత్సవం ప్రశాంతంగా కొనసాగుతోందని, ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఆయన అన్నారు. నిమజ్జన ఉత్సవాన్ని  పూర్తి చేసేందుకు భక్తులు కూడా సహకరించాలని సీపీ అనురాగ్‌శర్మ కోరారు.  

బాలాపూర్ లడ్డూ రూ.9.26 లక్షలు

      బాలాపూర్ వినాయకుడు అంటేనే హైదరాబాద్ పట్టణంలో ప్రత్యేక ఆకర్షణ. అత్యంత పెద్దదయిన ఖైరతాబాద్ వినాయకుడి తరువాత రాష్ట్రంలో ఆతరువాత ఎక్కువగా ఆకర్షించేది బాలాపూర్ వినాయకుడే. బాలాపూర్ లడ్డూ వేలమే ఆ వినాయకుడికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ప్రతి ఏటా ఈ గ్రామస్తులే ఆ లడ్డూను దక్కించుకుంటారు. ఈ సారి దానికి భిన్నంగా రూ.9.26 లక్షలకు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి దక్కించుకున్నారు. గత ఏడాది ఈ లడ్డూ రూ.7.5 లక్షల రూపాయలకు గ్రామస్తుడు దక్కించుకున్నారు. ఈ లడ్డూను దక్కించుకుని పొలంలో చల్లుకుంటే పంటలు బాగా పండుతాయని, ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయని ప్రతీతి. రియల్ ఎస్టేట్, రియల్ భూం నేపథ్యంలో మిగత చోట్ల ఇంతకంటే ఎక్కువ ధరకు లడ్డూలు వేలంలో అమ్ముడుపోయినా..బాలాపూర్ లడ్డుకు మాత్ర ఆ మచ్చ అంటలేదు.

జ‌గ‌న్ బెయిల్‌పై 23న తీర్పు

      జ‌గ‌న్ బెయిల్ పిటిష‌న్ వాద‌న‌లు విన్న కోర్టు తీర్పును ఈ నెల 23కు వాయిదా వేసింది. సుప్రిం కోర్టు ఇచ్చిన గ‌డువు లోగా విచార‌ణ పూర్తిచేశామ‌ని తెలిపిన సిబిఐ జ‌గ‌న్‌కు బెయిల్ ఇవ్వవ‌ద్ద‌ని కోర్టు తెలిపింది.     రాజ‌కీయంగా బ‌ల‌మైన బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు గ‌తంలో జైళు నుంచే నిరాహారా దీక్ష కూడా చేశాడ‌నే కార‌ణాల‌ను చూపించిన సిబిఐ జ‌గ‌న్‌కు బెయిల్ ఇవ్వ‌వ‌ద్ద‌ని కోర్టుకు తెలిపింది. జ‌గ‌న్ త‌రుపు న్యావాది మాత్రం సుప్రిం కోర్టు ఇచ్చిన గ‌డువు ముగిసినందున జ‌గ‌న్‌కు బెయిల్ ఇవ్వ‌వ‌చ్చ‌ని వాదించారు. రాజ‌కీయ నేప‌థ్యాన్ని కార‌ణంగా చూపించి ఓ వ్య‌క్తికి బెయిల్ నిరాక‌రించ‌డం రాజ్యాంగ విరుద్దం అని కోర్టుకు విన్న‌వించారు.     అయితే ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం తీర్పును ఈ నెల 23కు వాయిదా వేసింది.అయితే జ‌గ‌న్ త‌రుపున ఆయ‌న భార్య భార‌తి కోర్టు హాజ‌ర‌య్యారు. వాద‌న‌లు పూర్త‌యిన అనంత‌రం ఈ సారి త‌ప్ప‌కుండా బెయిల్ వ‌స్తుందన్న ఆశాభావం వ్య‌క్తంచేశారు వైసిపి నాయ‌కులు. జ‌గ‌న్ బెయిల్ పిటీష‌న్ వేయ‌టం ఇది తొమ్మిదో సారి.

టీ-నోట్ పై ఎవరు అబద్ధం చెపుతున్నారు

  కొద్ది రోజుల క్రితమే టీ-నోట్ మొదటి దశ పనులన్నీ పూర్తయ్యాయని, త్వరలో మిగిలిన పనులు కూడా పూర్తి చేసుకొని క్యాబినెట్ ఆమోదం కోసం పంపేందుకు సిద్దం అవుతుందని సాక్షాత్ హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే ప్రకటించారు. నిజామాబాద్ యంపీ మధు యాష్కీతో సహా పలువురు టీ-కాంగ్రెస్ నేతలు కూడా ఇదే మాట బల్ల గుద్ది మరీ గట్టిగా చెపుతున్నారు.   అయితే, మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనతో భేటి అయిన సీమాంద్ర మంత్రులతో మాట్లాడుతూ ఇంకా టీ-నోట్ సిద్దం కాలేదని, అందువల్ల త్వరలో జరుగబోయే క్యాబినెట్ సమావేశంలో అది సమర్పించే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేసారు. అందుకు ఆయన తగిన కారణాలు కూడా వివరించారు. హోంశాఖ తయారు చేసిన టీ-నోట్‌ను విభ‌జ‌న‌తో సంబంధం ఉన్నప‌ది ప్రభుత్వశాఖ‌ల‌కు పంపించినపుడు, అవి దానిపై ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తకుండా, అత్యంత వేగంగా పనిచేసినప్పటికీ, అందుకు కనీసం మూడు వారాల సమయం పడుతుందని, ఒకవేళ ఏ ఒక్క శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినా ఇంకా ఆల‌స్యం అవుతుందని ఆయన వివరించారు. అందువల్ల త్వరలో జరగబోయే కేంద్ర మంత్రిమండ‌లి స‌మావేశంలో టీ-నోట్ సమర్పించే అవ‌కాశమే లేద‌న్నారు.   ఒకవేళ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెపుతున్నదే నిజమనుకొంటే, కాంగ్రెస్ పెద్దలు, టీ- నేతలు కూడా తెలంగాణా ప్రజలను మభ్యపెడుతున్నట్లు భావించవలసి ఉంటుంది.   కానీ, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన ప్రకటన చేసి నేటికి 50రోజులయింది. తెలంగాణా ఏర్పాటుకి కృత నిశ్చయంతో ఉన్నకాంగ్రెస్ అధిష్టానం ఆరు నెలలు పట్టే విభజన ప్రక్రియను కేవలం నాలుగు నెలలలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఆనాడే ప్రకటించింది. అందువల్ల హోంశాఖ టీ-నోట్ తయారు చేసి ఉండి ఉంటే, ఈ యాబై రోజుల్లో ముఖ్యమంత్రి చెప్పిన ఈ తతంగం అంతా పూర్తి చేసుకొని హోంమంత్రి షిండే చెప్పినట్లు త్వరలో క్యాబినెట్ ముందుకు రావాల్సి ఉంటుంది.   అదే జరిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్దేశ్య పూర్వకంగానే టీ-నోట్ తయారు కాలేదని చెపుతున్నట్లు అర్ధం అవుతుంది. ఈ విధంగా మాట్లాడి తెలంగాణా నేతల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడానికో, లేక వారిలో కాంగ్రెస్ అధిష్టానంపై అనుమానాలు రేకెత్తించడానికో లేక అధిష్టానం పధకంలో భాగంగానే ఈవిధంగా మాట్లాడుతూ సీమాంధ్ర నేతలను, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంగానో దీనిని చూడవలసి ఉంటుంది.   ఒకవేళ టీ-నోట్ క్యాబినెట్ ముందుకు రానట్లయితే, కాంగ్రెస్ అధిష్టానం, టీ-యంపీలు కూడా తెలంగాణా ప్రజలను మభ్యపెడుతున్నట్లు భావించవలసి ఉంటుంది. మరో రెండు మూడు రోజుల్లో ఏసంగతి స్పష్టం అయిపోతుంది.

నోట్ ఇంకా రెడీ కాలేదు : సియం కిర‌ణ్‌

  తెలంగాణ అంశంపై కేంద్రం ఎంత దూకుడుగా వ్యవ‌హ‌రిస్తున్న ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డి మాత్రం రాష్ట్ర విభ‌జ‌న జ‌ర‌గ‌ద‌ని దీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేబినేట్ నోట్ రెడీ అయింద‌ని వార్తలు వినిపిస్తున్న నేప‌ధ్యంలో కిర‌ణ్ మాత్రం ఆ వార్తలు ఖండిస్తున్నారు. ఈమేర‌కు సీమాంద్ర మంత్రుల‌తో జ‌రిగిన స‌మావేశంలో వారికి హామి ఇచ్చారు. మంగ‌ళ‌వారం కిర‌ణ్‌తో భేటి అయిన సీమాంద్ర మంత్రులు కేభినేట్ నోట్ గురించి ప్రస్తావించ‌గా, అది అంత త్వర‌గా పూర్తయ్యే విష‌యం కాద‌ని సియం తేల్చి చెప్పారు. తొలుత నోట్ రెడీ చేసిన హోం శాఖ విభ‌జ‌న‌తో సంభందం ఉన్న ప‌ది శాఖ‌ల‌కు ఆ నోట్‌ను పంపిస్తారు. అక్కడి నుంచి పిఎంఓకు, కేభినేట్‌కు చేరుతుంది. ఈ ప్రాసెస్ అంతా అతి వేగంగా జ‌రిగితేనే మూడు వారాల‌కు పైగా ప‌డుతుంది. వీటిలో ఎక్కడ అభ్యంత‌రాలు వ్యక్తం అయినా ఇంకా ఆల‌స్యం అవుతుంది. ఇప్పటి వ‌ర‌కు కేబినేట్ నోట్ రెడీ కాలేద‌న్న సియం ఈ రెండు మూడు రోజుల్లో జ‌రిగే కేంద్ర మంత్రిమండ‌లి స‌మావేశాల స‌మ‌యానికి కూడా నోట్ సిద్దమ‌య్యే అవ‌కాశం లేద‌న్నారు.

ఘ‌నంగా గ‌ణేషునికి విడ్కోలు

  భాగ్యన‌గ‌రం కాషాయ‌రంగు పులుముకుంది. తొమ్మిది రోజులుగా పూజ‌లందుకుంటున్న గ‌ణ‌నాధుడు ఇక సెల‌వంటూ క‌దులుతున్నాడు. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను రాష్ట్రా ప్రభుత్వం జిహెచ్ ఎంసి అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. హుస్సెన్ సాగ‌ర్‌తో పాటు న‌గ‌రంలోని 24 చెరువుల్లో నిమ‌జ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అయితే ఇన్ని చోట్ల ఉన్న హుస్సేన్‌సాగ‌ర్‌లో జ‌రిగే నిమ‌జ్జనానికి ప్రత్యేక‌త ఉంది. ఈ సారి దాదాపు 60 వేల‌కు పైగా విగ్రహాలు హుస్సేన్‌సాగ‌ర్‌లో నిమ‌జ్జనం చేస్తార‌ని అంచ‌నా.దీంతో హుస్సేన్‌సాగ‌ర్ ప్రాంత‌ల్లోప‌టిష్టమైన భ‌ద్రత ఏర్పాటు చేశారు. హైద‌రాబాద్ ప‌రిదిలో 15 వేల మందితో, సైబ‌రాబాద్‌ ప‌రిదిలో 7,500 మందితో భ‌ద్రత ఏర్పాట్లు చేశారు. హుస్సేస్‌సాగ‌ర్ చుట్టూ 33 ఫ్లాట్ ఫారాల‌తో పాటు 59 భారీ మొబైల్ క్రేన్‌లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చే సంద‌ర్శకుల కోసం 14 ల‌క్షల వాట‌ర్ ప్యాకెట్‌ల‌ను కూడా సిద్దం చేశారు. ఈ వినాయక నిమ‌జ్జన నేప‌ధ్యంలో జంట‌న‌గ‌రాల్లో సెల‌వు ప్రక‌టించారు.

2ల‌క్షల ఇంజ‌నీరింగ్ సీట్లు మిగిలిపోనున్నాయి

  ఈ ఏడాది కూడా ఇంజ‌నీరింగ్ సీట్లు భారీగా మిగిలిపోనున్నాయి. ఇప్పటికే తొలివిడ‌త ఇంజ‌నీరింగ్ కౌన్సిలింగ్ పూర్తికాగా ల‌క్షకు పైగా సీట్లు మిగిలిపోయాయి. దీంతో తుదివిడ‌ద కౌన్సింలిగ్ పూర్తయ్యేస‌రికి దాదాపు 2ల‌క్షల‌కు పైగా సీట్లు మిగిలిపోతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు విద్యాశాఖ అధికారులు. బీ ఫార్మసీ విభాగంలో కూడా భారీగా సీట్లు మిగిలిపోయాయి. 8500 సీట్లు ఉండ‌గా కేవ‌లం 558 సీట్లు మాత్రమే భ‌ర్తి అయ్యాయి. అంటే ఇంకా 7,900 వంద‌ల‌కు పైగా సీట్లు కాలీగానే ఉన్నాయి. ఈ మేర‌కు అన్ని వివ‌రాల‌ను విద్యాశాఖ మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. విద్యార్ధుల‌కు ఈ స‌మాచారాన్ని ఎస్ ఎం ఎస్ ద్వారా అందించింది. ఈ ఏడాది 2,18,893 మంది ఇంజనీరింగ్ అర్హత సాదించ‌గా, స‌ర్టిఫికేష‌న్ల వెరిఫికేష‌న్‌కు కేవ‌లం 1,30,20 మంది మాత్రమే హాజ‌ర‌య్యారు. ఇరు ప్రాంతాల్లో జ‌రుగుతున్న స‌మైక్య, విభ‌జ‌న ఉద్యమాల‌తో చాలా మంది విద్యార్థులు వెరిఫికేష‌న్‌కు హాజ‌రు కాలేక‌పోయారు. ఇంజ‌నీరింగ్, ఫార్మాసి విభాగంలో 2,34,488 సీట్లు అందుబాటులో ఉండ‌గా 1,08,098 సీట్లు మాత్రమే భ‌ర్తి అయ్యాయి. దీంతో ఈ ఏడాది భారీ సీట్లు మిగిలిపోనున్నాయి. యాజ‌మాన్య కోట‌లో ల‌క్షకు పైగా సీట్లు అందుబాటులో ఉండ‌గా కేవ‌లం ప‌దివేల సీట్లు మాత్రమే ఫిల్ అయ్యాయి.

ప్రభుత్వానికి హైకోర్టు ఆక్షింత‌లు

  ఎపిఎన్జీవోలు చేస్తున్న స‌మ్మె విష‌యంలో రాష్ట్రఅత్యున్నత న్యాయ‌స్థానం తీవ్రంగా స్పందించింది. స‌మైక్యాంద్ర కోసం జ‌రుగుతున్న స‌మ్మెపై దాఖ‌లైన ప్రజా ప్రయోజ‌న వ్యాజ్యంపై మంగ‌ళ వారం వాద‌న‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా కోర్టు ప్రభుత్వాన్ని స‌మ్మె విర‌మింప చేయ‌డానికి ఎలాంటి చ‌ర్యలు తీసుకున్నార‌ని, ఇన్నాళ్లు ఎందుకు ఆప‌లేక‌పోయారని ప్రశ్నించింది. ప్రభుత్వం త‌రుపు లాయ‌ర్ మాట్లాడుతు తాము ఎప్పటిక‌ప్పుడు చ‌ర్చలు జ‌రుపుతున్నామ‌ని, ప్రత్యేకంగా మంత్రులు వారితో చ‌ర్చిస్తున్నార‌ని తెలిపారు. దీంతో స‌మ్మె చేస్తున్న రోజు నుంచి ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వడం లేద‌ని, స‌మ్మె విర‌మింప చేయ‌డానికి అన్ని ప్రయ‌త్నాలు చేస్తున్నామ‌న్నారు. అయితే కోర్టు మంత్రుల సంప్రదింపుల‌తో ఉప‌యోగం ఉండ‌ద‌ని ప్రభుత్వమే చ‌ర్యలు తీసుకోవాల‌ని తెలిపింది. త‌మ‌కు కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌డానికి స‌మ‌యం కావాల‌ని ప్రభుత్వం కోరినా కోర్టు అందుకు నిరాక‌రించింది. స‌మ్మెను క‌ట్టడి చేయ‌డంపై ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవ‌హ‌రిస్తుంద‌ని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న కోర్టు విచార‌ణ బుధ‌వారానికి వాయిదా వేసింది.

మ‌రోరెండు చార్జీషీట్లు

  రేపో మాపో ఆఖ‌రి చార్జీషీట్ వేస్తార‌న్న ఆశ‌తో ఉన్న జ‌గ‌న్ ఆశ‌ల‌పై సిబిఐ మ‌రోసారి నీళ్లు చ‌ల్లింది. ఆఖ‌రి చార్జీషీట్‌కు బ‌దులుగా మ‌రో  రెండు చార్జీషీట్‌ల‌ను వేసింది సిబిఐ. లేపాక్షి నాలెడ్జ్ హ‌బ్‌, ఇందూ సంస్థలపై తాజా చార్జీ షీట్లు దాఖ‌లుచేసింది. ఇందూ సంస్ధ నుంచి జ‌గ‌న్ కంపెనీల‌లోకి దాదాపు 70 కోట్లకు పైగా నిధులు మ‌ళ్లించినట్టుగా సిబిఐ ఆరోపించింది. జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి తండ్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఇందూ సంస్థకు 8,848 ఎక‌రాల భూమిని కూటాయించారు.దీనితో పాటు శంషాబాద్‌లో మ‌రో 250 ఎక‌రాల భూమిని కూడా కేటాయించిన‌ట్టుగా సిబిఐ తెలిపింది. ఇందుకు ప్రతిగా జ‌గ‌న్ కంపెనీల్లో ఇందూ సంస్థ భారీగా పెట్టుబ‌డులు పెట్టిన‌ట్టుగా ఆరోపించింది. అయితే ఇటీవ‌ల వేసిన చార్జీషీట్లలొ మంత్రుల‌కు ఊర‌ట ఇచ్చిన సిబిఐ, లేపాక్షి అంశానికి సంబంధించిన ఛార్టీషీటులో మంత్రి గీతా రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావులపై, ఇందు ప్రాజెక్టు అంశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిలపై సిబిఐ అభియోగాలు దాఖలు చేసింది. గీతా రెడ్డిని ఎ9గా, ధర్మానను ఎ11గా, సబితా ఇంద్రా రెడ్డిని ఎ8గా పేర్కొంది.

జగన్ కేంద్రంలో నీ ఓటు ఎటు?

      తెలంగాణ ఉద్యమాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయాన్ని తీసుకోలేదని చాలామందికి సుస్పష్టం. మరి ఏమి ఆశించి విభజన నిర్ణయాన్ని తీసుకుంది?వరుసగా రెండుసార్లు అధికారాన్ని కైవసం చేసుకుని,మూడవసారి ఎన్నికలలో గెలవాలి అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ప్రజల వ్యతిరేకతను అధిగమించటానికి రాష్ట్రంలో విభజన నిర్ణయాన్ని తీసుకుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తిలేదు.     విభజన వలన తెలంగాణలో టి.ఆర్. ఎస్ ని కలుపుకుని గెలవవచ్చునని,ఆంద్ర రాయలసీమ ప్రాంతంలో వై.యస్.ఆర్.సి.పి గెలుస్తుందని,ఎన్నికల తరువాత వారు కేంద్రంలో యు.పి.ఎ ని సపోర్ట్ చేస్తారని అనే ధీమాతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జగన్ జైలుకు వెళ్లకముందు ఆయన తల్లి విజయమ్మ బి.జె.పి ని సమర్ధించటం,కేంద్రం లో యు.పి.ఏ  ని బలపరుస్తామని చెప్పటమే ఈ అభిప్రాయానికి కారణమా?                        మరి మారిన రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ని తీవ్రంగా ఆంద్ర రాయలసీమ ప్రాంత వాసులు వ్యతిరేకిస్తున్న ఈ సందర్భంగా కూడా వై.ఎస్.ఆర్.సి.పి 2014 ఎన్నికల తరువాత విభజిస్తే కేంద్రంలో యు.పి.ఎ  ని సమర్ధిస్తారా అనేది ప్రజలకు తెలియవలసి ఉంది. వై.ఎస్.ఆర్.సి.పి ఈ విషయంలో మరొకసారి స్పష్టంగా చెప్పని పక్షంలో ఈ విభజన కుట్రలో వై.ఎస్.ఆర్.సి.పి భాగస్వామ్యం ఉందని ప్రజలు భావించవలసి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టంగా రాష్ట్ర విభజన జరిగితే 2014 తరువాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని వై.ఎస్.ఆర్.సి.పి సమర్ధిస్తుందా  అని ఎందుకు నిలదీయదు?

జగన్ కేసులో ఆఖరి చార్జ్ షీట్లు నేడే

  వైయ్యస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ ఈ రోజు ఆఖరి చార్జ్ షీట్లు సీబీఐ కోర్టులో దాఖలుచేయబోతోంది. ఇదే విషయం కోర్టుకి ముందే తెలియజేసి అందుకు కోర్టు అనుమతి కూడా పొందింది. రేపు కోర్టు జగన్మోహన్ రెడ్డి బెయిలు పిటిషను విచారణకు స్వీకరించబోతున్నందున, సీబీఐ ఈ రోజే దానిపై కౌంటర్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది.   నేటితో సీబీఐ తుది చార్జ్ షీట్లు కూడా దాఖలు చేయడం పూర్తవుతుంది గనుక, సీబీఐ ఈసారయినా జగన్మోహన్ రెడ్డి బెయిలుకు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా అంగీకరిస్తుందా లేక మళ్ళీ అడ్డుపడుతుందా అనేది సంగతి రేపు కోర్టులో విచారణ మొదలయినప్పుడు తేలిపోవచ్చును. కానీ తెదేపా, వైకాపాలు జగన్ బెయిలు విషయంలో ఒకరిపై మరొకరు చేసుకొంటున్నఆరోపణలను గమనిస్తే, అతని బెయిలు సంగతి సీబీఐ కోర్టులో కాక డిల్లీలో నిర్ణయించబడుతుందనే అపోహ ప్రజలలో కలుగుతోంది.

ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టు ఫైర్

  ఏపీఎన్జీవోల సమ్మె చట్ట విరుద్దమంటూ తెలంగాణా న్యాయవాదులు వేసిన పిటిషనుపై హైకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇంత కాలంగా సమ్మె జరుగుతున్నాసమ్మెను విరమిమ్పజేసేందుకు ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయకపోవడాన్ని కోర్టు తప్పు పట్టింది. అయితే సమ్మె చేస్తున్న ఉద్యోగ సంఘనేతలతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, కానీ అవి ఫలించలేదని ప్రభుత్వ న్యాయవాదిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అయితే సమ్మె చేస్తున్నఉద్యోగులపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకొందో చెప్పాలంటూ గట్టిగా అడిగింది. ప్రభుత్వం ఈ కేసులో వాయిదాలు కోరినట్లయితే వారానికి రూ.2లక్షలు జరిమానా వేస్తామని కోర్టు హెచ్చరించింది. ప్రభుత్వమే స్వయంగా సమ్మెను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కోర్టులో ఈ కేసుపై ఇంకా వాదోపవాదాలు జరుగుతున్నాయి.

కావూరికి సమైక్య సెగ

      కావూరి సాంబశివరావు ఇంటిని సమైక్య వాదులు ముట్టడించారు. వీరిలో సమైక్యవాదం కోసం పోరాడుతున్న ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు కూడా ఉన్నారు. సీమాంధ్రను ఎడారి చేసే తెలంగాణ విభజన ప్రకటన వచ్చి యాభై రోజులు కావస్తున్నా కనీసం రాజీనామా చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆయనపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈరోజు గన్నవరం విమానాశ్రయంలో దిగి ఇంటికి వెళ్తున్న కావూరిని ఎయిరు పోర్టులో కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసుల జోక్యంతో తప్పించుకున్నారు. మళ్లీ కలపర్రు గ్రామం వద్ద సమైక్యవాదులు రోడ్డుపై బైఠాయించి ఆయన కాన్వాయిని అడ్డుకున్నారు. దీంతో వాహనాలు ముందుకు కదలకుండా ఆగిపోయాయి. ఇక చేసేది లేక కావూరీ పోలీసుల రక్షణతో వేరే కారులో వెళ్లిపోయారు. అయినా సమైక్యవాదులు శాంతించలేదు. ఆయన ఇంటిని ముట్టడించారు. కావూరి ఇంట్లో ఫర్నీచరు ధ్వంసం చేశారు. రాజీనామా చేయకపోతే ఇంకా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇంతలో కావూరి వర్గం సమైక్యవాదులపై గొడవకు దిగింది. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మంచిదని కావూరి సాంబశివరావు మీడియాతో చెప్పారు. విభజన వల్ల నష్టాలు ఎక్కువే అన్నారు.

జగన్ వెనుక కాంగ్రెస్

    వైఎస్ఆర్. కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుపై మరోసారి పోరాడేందుకు టిడిపి పార్టీ ఎంపీలు ఢిల్లీలో మకాం వేశారు. మంగళవారం ఉదయం పదకొండు గంటలకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఒకటి గంటలకు ఈడి, సాయంత్రం ఐదు గంటలకు సిబిఐ డైరెక్టర్‌తో ఎంపీలు భేటీ కానున్నారు. జగన్ ఆస్తుల కేసు విచారణ వేగవంతం చేయాలని కోరనున్నారు.     జగన్ ఆస్తుల కేసు విషయమై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ను కలిసిన అనంతరం ఖమ్మం ఎంపి నామా నాగేశ్వర రావు మాట్లాడారు. జగన్ కేసు దర్యాఫ్తును వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. హవాలా మార్గంలో నల్లధనంపై ఆరోపణలు వస్తే ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తాము సివిసి దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. దర్యాఫ్తును వేగవంతం చేసేందుకు విచారణ అధికారులకు అనుమతి ఇవ్వకపోవడంపై కూడా తాము ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. విచారణలో తేలిన అక్రమాస్తులకు, జప్థు చేసిన ఆస్తులకు ఏమాత్రం పొంతన లేదన్నారు. కాంగ్రెస్,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కలిసిపోతాయని భావిస్తున్న విధంగానే జరుగుతోందని నామా వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ విమోచన దినం

      సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను స్వర్గీయ నందమూరి తారక రామారావే తొలగించారన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదును అభివృద్ధి చేసిన ఘటన టిడిపిదే అన్నారు. తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు టిడిపితోనే ప్రారంభమయ్యాయని చెప్పారు. హైదరాబాదు చుట్టుపక్కల భూముల అమ్మకాన్ని టిడిపి మొదటి నుండి వ్యతిరేకిస్తోందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి భూములు అమ్ముతుంటే తెలంగాణపై ఇప్పుడు మాట్లాడే నేతలు అప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిటిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డి, దేవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఆ మాట ప్రజల అని చూడండి: అశోక్ బాబు

  ఏపీఎన్జీవో సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు మీడియా అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ “సీమాంధ్ర నేతలని ఎవరూ రాజీనామా చేయమని అడగనందున రాజీనామాలు చేయడం లేదని అంటున్నది నిజమయితే వారు తమ నియోజక వర్గంలో బహిరంగ సభలు పెట్టుకొని అదే మాటని ప్రజల వద్ద అంటే దానికి ఏవిధంగా స్పందించాలో ప్రజలే నిర్ణయిస్తారు,” అని అన్నారు.   ఈ నెల 30వరకు ఉద్యమాలు మరింత తీవ్రతరం చేసి ఆ తరువాత ఎన్జీవో నేతలందరూ మరో మారు సమావేశమయ్యి తమ తదుపరి కార్యాచరణ రూపొందించుకొంటామని ఆయన తెలిపారు. ఈ నెల 23 నుండి 30వరకు సీమాంధ్రలో విద్యాసంస్థల బంద్ కుఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ నెల 24న సీమాంధ్ర బంద్ కు, 25, 26 తేదీల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సర్వీసుల బంద్ కు ఆయన పిలుపునిచ్చారు.

ఎన్నికల తరువాతనే తెలంగాణా: రేణుకా చౌదరి

  మొన్న ఆదివారం హైదరాబాదులో వాడివేడిగా సాగిన టీ-కాంగ్రెస్ నేతల సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు మరియు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మాట్లాడుతూ రానున్నఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చునని చెప్పడంతో సమావేశంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.   “గత 60సం.లుగా హైదరాబాదుతో అనుబంధం పెనవేసుకొన్న సీమాంధ్ర ప్రజలు, విభజన సందర్భంగా హైదరాబాదును వదులుకోవలసి వస్తుందని ఆందోళన చెందడం సహజం. ఆ ఆందోళనతోనే వారు ఉద్యమాలు చేస్తున్నారు. అందువలన వారిని పూర్తిగా తప్పు పట్టలేము. అయితే ఈ పరిణామాల వలన రాష్ట్ర విభజనలో కొంత జాప్యం జరుగుతున్నంత మాత్రాన్న మనం కూడా ఆందోళన చెందనవసరం లేదు. దైర్యం కోల్పోనవసరం లేదు. తెలంగాణా ఏర్పాటులో కొంత ఆలస్యం జరగవచ్చునేమో గానీ ఈ విషయంలో అధిష్టానం ఇక వెనక్కి తగ్గబోదని మనకి తెలుసు. హైదరాబాద్ అంశంపై ఉన్న చిక్కుముడులు విప్పేందుకు మరికొంత సమయం పట్టవచ్చును. అందువల్ల వచ్చే ఎన్నికలలోగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము,” అని అన్నారు.   సమావేశంలో ఆమె పాల్గొనడాన్ని నిరసించిన పొన్నం ప్రభాకర్ కి ఆమె పరోక్షంగా చురకలు వేసారు. “నేను ఇంతవరకు ఏది మాట్లాడినా పార్టీకి అనుకూలంగానే మాట్లాడాను తప్పఇతర పార్టీనేతలతో చేతులు కలపలేదు,” అన్నారు.

బీజేపీకి మోడీ, కాంగ్రెస్ రాహుల్ యావ

  ప్రధాన జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలు ఏకైక ఎజెండాతో ముందుకు సాగుతున్నట్లు అర్ధం అవుతోంది. రానున్న ఎన్నికలలో ఎలాగయినా అధికారం చేజిక్కించుకోవాలని తపిస్తున్న బీజేపీ నరేంద్రమోడీని పార్టీ రధ సారధిగా చేసుకొని విజయం సాధించాలని తహతహలాడుతోంది. ఇక అధికారం ఎలాగయినా నిలబెట్టుకొని వచ్చే ఎన్నికల తరువాత రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కాంగ్రెస్ ఆరాట పడుతోంది. అధికారం చేజిక్కించుకోవడమే ఏకైక ఎజెండా చేసుకొని తదనుగుణంగానే ఈ రెండు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. అదేవిధంగా రాహుల్, మోడీల ప్రధాని మంత్రి అభ్యర్దిత్వమే జాతీయ సమస్య అన్నట్లు రెండు పార్టీలు చర్చిస్తున్నాయి, తప్ప దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచించే తీరిక, శ్రద్ద వారికి లేకుండాపోయింది.    రాష్ట్ర విభజన విషయంలోకూడా ఈ రెండు పార్టీలు దాదాపు అదే విధంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రాన్ని విభజించి, ప్రాంతీయ పార్టీలయినా తెదేపా, తెరాస, వైకాపాలను దెబ్బతీసి ఎన్నికలలో చక్రం తిప్పాలని కాంగ్రెస్ భావిస్తే, ముందు విభజనకు వత్తాసు పలికిన బీజేపీ దానివల్ల తనకెటువంటి ప్రయోజనమూ ఉండదని గ్రహించగానే వెనక్కి తగ్గడమే కాకుండా, పార్లమెంటులో తెలంగాణా బిల్లుకు మద్దతు ఇవ్వమని ప్రకటించి కాంగ్రెస్ పార్టీని ముందుకు వెనక్కు వెళ్ళకుండా అడ్డుపడుతోంది. రెండు పార్టీలు కూడా ఏవిధంగా ముందుకు వెళితే రాష్ట్రంలో తమకు ప్రయోజనం కలుగుతుందా అని ఆలోచిస్తున్నాయి తప్ప, రాష్ట్ర ప్రజల సమస్యలు, వారి మనోభాలను మాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ యావ, బీజేపీకి మోడీ యావ!

మిస్ అమెరికా-2014పై అమెరికన్ల ఆగ్రహం

  తెలుగమ్మాయి నీనా దావులూరి మిస్ అమెరికా-2014గా ఎంపికయినందుకు భారతీయులు ముఖ్యంగా తెలుగువాళ్ళు సంతోషిస్తుంటే, కొందరు అమెరికావాసులు మాత్రం దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘మిస్ అమెరికా’ అంటే అమెరికాకు చెందిన అమ్మాయే అయ్యుండాలని అనేకమంది ట్వీట్ చేసారు. నీనా అమెరికాలో పుట్టి, అక్కడే పెరిగి విద్యాభ్యాసం చేసినందున ఆమె చట్టప్రకారం అమెరికన్ అయ్యి ఉండవచ్చును కానీ ఆమెను మిస్ అమెరికాగా అంగీకరించలేమని అనేకమంది ట్వీట్ చేసారు. మరికొంత మంది ఆమె ఎంపికను అమెరికాపై తాలిబాన్ ఉగ్రవాదుల దాడితో కూడా సరిపోల్చారు. అయితే చాలా మంది ఇది అమెరికా యొక్క విశాల దృక్పదానికి చక్కటి నిదర్శనమని అబిప్రాయపడ్డారు. నీనా వైద్యవిద్యను పూర్తి చేసుకొని వైద్యురాలిగా స్థిరపడాలని భావిస్తున్నారు. ఈపోటీల్లో ‘మిస్ కాలిఫోర్నియా’ క్రిస్టల్ లీ ఫస్ట్ రన్నర్ అప్‌గా, ‘మిస్ ఒక్లహామా’ కెల్సీ గ్రిస్‌వోల్డ్ సెకండ్ రన్నర్అప్‌గా నిలిచారు.