ప్రభుత్వానికి షాక్కిచ్చిన సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు

  బుధవారం అర్ధరాత్రి నుండి సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు సమైక్యాంధ్ర కోరుతూ నిరవధిక సమ్మెకు సిద్దం అవడంతో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఉద్యోగుల సంఘాల నేతలతో కొద్ది సేపటి క్రితం జరిపిన చర్చలు సఫలమయినందున విద్యుత్ ఉద్యోగులు తమ సమ్మెను ఈ నెల 16 వరకు వాయిదా వేసుకొన్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. కానీ, విద్యుత్ ఉద్యోగులు మాత్రం ముఖ్యమంత్రి కోరిక మేరకు తమ నిరవధిక సమ్మెను వాయిదా వేసుకొన్నామని, కానీ నేటి అర్ధ రాత్రి నుండి 72గంటల సమ్మె చేయబోతున్నట్లు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. అయితే ఈ సమ్మె నుండి అత్యవసర సేవలను మినహాయిస్తున్నామని తెలిపారు. కానీ కేంద్రం పార్లమెంటులో తెలంగాణా బిల్లును ప్రవేశపెట్టిన మరుక్షణం నుండే తాము నిరవధిక సమ్మెకు దిగుతామని విద్యుత్ ఉద్యోగుల సంఘాల నేతలు స్పష్టం చేసారు.   సమ్మె వాయిదా పడిందని ఊపిరి పీల్చుకొన్న ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతల ఈ ప్రకటనతో ఉలిక్కిపడ్డారు. ఎటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా ఉద్యోగులు అందుబాటులో ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులందరూ తమ అధికారిక మొబైల్ ఫోన్లను, సిం కార్డులను తమ ఉన్నతాదికారులకు వాపసు చేసారు.   ఇంతవరకు అన్నిప్రభుత్వ సంస్థల ఉద్యోగులు చేసినప్పుడు ఏర్పడే ఇబ్బందులను ప్రజలు ఎలాగో ఎదుర్కొంటున్నపటికీ, ఈ రోజు నుండి మొదలయ్యే విద్యుత్ ఉద్యోగుల 72గంటల సమ్మెతో రాష్ట్రం మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రమంతటా ఒకదానికొకటి అనుసంధానమయి ఉండే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలలో ఏ చిన్నలోపం ఏర్పడినా వాటిని సరిదిద్దేందుకు ఉద్యోగులు అందుబాటులో లేకపోతే మొత్తం గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం ఉంటుందని విద్యుత్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.   మరి ఈ విపత్కర పరిస్థితులను విద్యుత్ ఉన్నతాధికారులు అధిగమించడం నిజంగా ఒక అగ్నిపరీక్షేనని చెప్పవచ్చును. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఉద్యోగుల సంఘాల నేతలతో మళ్ళీ రేపు మరోమారు చర్చలు జరిపి, వారి చేత వెంటనే సమ్మె విరమింపజేస్తే తప్ప యావత్ రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో పడక తప్పదు.

హరీష్ రూటే వేరు..!

      రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోతుండటం.. సీమాంధ్రలో ఉద్యమం ఎగసిపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజనపై అందరిలోనూ పునరాలోచన మొదలవడం తెలంగాణ నేతల్ని అసహనానికి గురిచేస్తున్నట్లుంది. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేసేందుకు కూడా ఒప్పుకోమని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం వ్యాఖ్యానిస్తే .....తెరాస నేత హరీష్ రావు సీమాంధ్ర ప్రాంత ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేశారు. ఉద్యమం విషయంలో సీమాంధ్రుల్లో అనుమానాలు రేకెత్తించి.. ఆందోళనలు విరమింపజేయాలనే ఉద్దేశం ఆయన వ్యాఖ్యల్లో కనిపించింది.     సమ్మె పేరిట పెత్తందారుల కొమ్ముకాస్తున్నారని ఆరోపించిన హరీష్.. పేద ప్రజలు ప్రయాణించే ఆర్టీసీని బంద్ చేసి ట్రావెల్స్ లో అధిక ధరలు వసూలు చేస్తున్నారన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేందుకే సీమాంధ్ర ఉద్యమమన్నారు. సీమాంధ్రలో ఉన్న నిరుపేదల కడుపుకొట్టి సమ్మె పేరుతో దోచుకుంటున్నారన్నారు. సీమాంధ్రలో సమ్మె పేరిట గిరిజనులకు వైద్యం అందించే పీహెచ్‌సీలు బంద్ చేశారు తప్ప కార్పొరేట్ వైద్యం ఆగిందా చెప్పాలన్నారు. మొత్తంగా హరీష్ వ్యాఖ్యలు చూస్తే సీమాంధ్ర ప్రజల్లో ఉద్యమం పట్ల సందేహాలు రేకెత్తించాలన్న ఉద్దేశం కనిపిస్తోంది. సామాన్యులకు మద్దతుగా మాట్లాడితే వారు తెలంగాణకు అనుకూలంగా మారిపోతారని హరీష్ అనుకోవడం భ్రమే.

ఢిల్లీ గ్యాంగ్ రేప్: శిక్షపై తీర్పు వాయిదా

      ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసుపై తీర్పు శుక్రవారానికి వాయిదా పడింది. ఈ కేసులో దోషులకు శిక్ష ఖరారుపై సాకేత్ కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. అనంతరం న్యాయవాది శిక్షపై తీర్పును శుక్రవార౦ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేశారు. దోషులపై ఏ విధమైన జాలి చూపవద్దని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దోషులకు గరిష్ట స్థాయి శిక్ష వేయాలని, వారికి మరణశిక్ష విధించడమే సరైందని అన్నారు. దోషులను కోర్టుకు బుధవారం ఉదయంతీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా దోషులుగా తేలినవారిలో ఒకతను తాను నిర్దోషినని గట్టిగా అరిచాడు. రెండు సార్లు అతను గట్టిగా అరిచి ఆ మాట అన్నాడు. దోషులకు మరణశిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు, తమకు భారత న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని నిర్భయ తండ్రి అన్నారు.

జగన్, చంద్రబాబు విభజనకే మొగ్గు

      వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ లు రాష్ట్ర విభజనకే మొగ్గుచూపుతున్నాయని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. అఖిలపక్షంలో తెలంగాణకు అనుకూలమని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సమన్యాయం అని, సమైక్యం అని నాటకాలు ఆడుతోంది. సమన్యాయం అంటే విభజించమనే అర్ధం కదా ? సమైక్యాంధ్ర కోసం తాను విభజన వైఖరిని వెనక్కి తీసుకున్నానని చంద్రబాబు అనడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రం రావణకాష్టంలా మండుతుంటే ఇప్పుడు అధికారం ఇవ్వండి ఆరునెలల్లో రాష్ట్రాన్ని మారుస్తానంటూ చంద్రబాబు నాయుడు అంటున్నారని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ విమర్శించారు. హైదరాబాద్‌లో ఎపి ఎన్జీవోల సభను చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుకు వణుకు పుట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నేతలుగా తాము విభజనను ఒప్పుకోవడం లేదని, దీని మీద ఎటువంటి ప్రత్యామ్నాయాలు కోరుకోవడం లేదని, ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే అభిప్రాయం చెప్పాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. అసేంబ్లీలో తెలంగాణ తీర్మానం వచ్చినప్పుడు దానిని ఓడిస్తామని, ప్రతిపక్షాలు తమ రాజీనామాల ఆమోదం కోరుతుండడం అనుమానాలకు తావిస్తుందని ఆయన అన్నారు.

జగన్ కేసులో శ్రీనివాసన్ గుగ్లీలు

  భారత క్రికెటర్లు మైదానంలో ఆడితే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు శ్రీనివాసన్ తన ఆఫీసులో కూర్చొనే ఆట నడిపిస్తాడని, కొద్ది నెలల క్రితం ఆయన అల్లుడు గురునాథ్ మెయప్పన్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయినప్పుడు జనాలకి తెలిసింది. ఏమయినప్పటికీ, ఆయన అల్లుడి గిల్లుడికి శ్రీనివాసన్ పదవికి గోవిందా గోవిందా అనుకోవలసి వచ్చింది. అయితే కేవలం ‘ఇండియాలో మాత్రమే ఏదయినా సాధ్యం’ అనే సూత్రం ప్రకారం, స్పాట్ ఫిక్సింగ్ కధ కంచికి, అందులో అరెస్టయిన క్రికెటర్స్ బెయిలుపై ఇంటికి చేరుకోగలిగారు.   షరా మామూలుగానే మన జనాలు ఆ టాపిక్ గురించి ఎప్పుడో మరిచిపోయి ఏనాడో మరో లేటెస్ట్ టాపిక్ కి జంప్ అయిపోయారు. బహుశః జనాల నాడిని సీబీఐ అర్ధం చేసుకొన్నట్లు మరొకరు అర్ధం చేసుకోలేరేమో! అందుకేనేమో శ్రీనివాసన్ పేరుని మళ్ళీ జగన్ అక్రమాస్తుల కేసులో నిన్నసీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీటులో జోడించి కేసుకి మంచి ఊపు, ట్విస్ట్ ఇచ్చింది.   బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శ్రీనివాసన్, ఇండియా సిమెంట్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టరుగా కూడా. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన కంపెనీకి సున్నపు గనులు, వాటిని త్రవ్వుకోవడానికి అనుమతులు, కంపెనీకి అవసరమయిన నీటిని విరివిగా వాడుకొనేందుకు అనుమతులు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆయన కంపెనీ, జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతీ పబ్లికేషన్స్ మరియు భారతి సిమెంట్స్ కంపెనీలలో రూ.140కోట్లు (అక్షరాలా నూట నలబై కోట్లు మాత్రమే) పెట్టుబడులు పెట్టడాన్నితప్పుబడుతూ, జగన్ అక్రమాస్తుల కేసులో సదరు శ్రీనివాసన్ గారిని 3వ ముద్దాయిగా పేర్కొంటూ సీబీఐ నిన్న చార్జ్ షీట్ దాఖలు చేసింది.   ఆయనని సీబీఐ గత ఏడాది రెండు సార్లు ఇదే విషయమై విచారించినప్పటికీ, బీసీసీఐకి ఆయన అల్లుడు పెట్టిన స్పాట్ ముందు ఇవేవీ జనాల కళ్ళకి ఆనలేదు. ఇప్పుడు వేరే కధలేవీ నడవడం లేదు గనుక, మరో కొత్త టాపిక్ వచ్చి పడేవరకు జనాలు దీనిపై కొంచెం ఆసక్తి చూపించే ప్రమాదం ఉంది.

సమైక్యమా, పార్టీయా? కిరణ్ కుమార్ రెడ్డి ప్రాధాన్యం దేనికి

  తన సమైక్యవాదనలతో ఇంతవరకు రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ అధిష్టానాన్నిఎదిరిస్తున్నఏకైక మొనగాడుగా సీమాంధ్రలో పేరు సంపాదించుకొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నిన్నఆయన క్యాబినెట్ లోని తెలంగాణా మంత్రులు కలిసి, ఆయన పక్షపాత వైఖరికి పద్దతికి నిరసన తెలియజేసినప్పుడు, ఇదివరకు తెలంగాణా ఉద్యమాలు జోరుగా జరుగుతున్నసమయంలో యావత్ రాష్ట్రానికి మంత్రులుగా వ్యవహరించవలసిన వారు ఏవిధంగా తెలంగాణా తరపున పోరాడారో గుర్తు చేసి చురకలు వేసారు. అదేవిధంగా నేడు సీమాంధ్ర ప్రజల అభీష్టం మేరకు పోరాడుతున్న అక్కడి మంత్రులను తప్పు పట్టలేమని అన్నారు. అయితే, తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినయినప్పటికీ, తానూ ఎవరికీ వెనుక నుండి సహాయపడటం లేదని, తన సమైక్యవాదానికి అర్ధం తాను సీమాంధ్రలో జరుగుతున్నఉద్యమాలను వెనుక నుండి నడిపిస్తున్నానని భావించడం తప్పని, యావత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తనకు రాష్ట్ర ప్రజలందరూ కూడా సమానమేనని ఆయన బదులిచ్చారు.   అంతే గాక ఈ రోజు ఇరుప్రాంతల నేతల మధ్య సమన్వయం సాధించేందుకు, ఈరోజు సాయంత్రం ఆయన ఒక విందు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక మీడియాలో వస్తున్న వార్తలు నిజమనుకొంటే, తెదేపా, వైకాపాల దాడితో నోరెత్తలేకపోతున్నతన పార్టీని కాపాడుకొనేందుకు ఆయన త్వరలో సీమాంధ్రలో పర్యటించనున్నారు. రెండు ప్రాంతాలలో పార్టీ ప్రయోజనాలను కాపాడాలని ఆయన స్వయంగా ప్రయత్నించడమే కాకుండా, అదే విషయాన్నిఇరు ప్రాంతాల నేతలకు ఆయన చెప్పబోతున్నారు.   ఇదే నిజమయితే, ఇంతకాలంగా ఆయన రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ పదవికి, పార్టీకి రాజీనామా చేసి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పెట్టబోయే సరికొత్త రాజకీయ పార్టీకి సారధ్యం వహిస్తారనే మీడియాలో వస్తున్నవార్తలు కూడా కేవలం పుకార్లుగానే భావించవచ్చును. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా, భాద్యతాయుతమయిన పదవిలో ఉన్నకారణంగా ఆయన సరయిన విధంగానే వ్యవహరిస్తున్నట్లు భావించవచ్చును.   కానీ, పార్టీని రక్షించుకోవడం కోసం ఆయన తన సమైక్యవాదాన్ని పక్కన పెడితే, ఇంతకాలంగా ఆయన చేస్తున్న సమైక్యవాదం అంతా భూటకమేనా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏమయినప్పటికీ, కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి కత్తి మీద సాము వంటిదేనని చెప్పక తప్పదు.

కాంగ్రెస్ పై మోడీ సెటైర్లు

      బీజీపీ పార్టీ ఎన్నికల ప్రచార సారథి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఆయన కాంగ్రెస్ పార్టీ అవినీతిపై...ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పైనా విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అవీనితి దినచర్యగా మారిపోయిందని అన్నారు. మన దేశంలో అవీనితిని తరిమేయాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి తరిమేయలన్నారు.   ఇప్పటి కాంగ్రెస్ కేవలం ఒక కుటుంబానికే పరిమితమని, దేశంలోని చిన్నారుల కోసం ఆ పార్టీ కొత్త ఎబిసిడి పుస్తకాన్ని రాసిందన్నారు. 'ఎబిసిడి'లను కొత్తగా విపులీకరించారు...ఎ అంటే ఆదర్శ్ అక్రమాలు, బి అంటే బోఫోర్స్ కుంభకోణం, సి అంటే బొగ్గు, కామన్వెల్త్ కుంభకోణాలు, డి అంటే అల్లుడి కుంభకోణం అని మోడీ ఎద్దేవా చేశారు.   దేశం కోసం సరైన నిర్ణయాలు తీసుకోలేని, ఎటువంటి బాధ్యత లేని ప్రభుత్వం పదేళ్లుగా అధికారంలో కొనసాగుతోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ వైఫల్యం కారణంగా రూపాయి ఆస్పత్రిలో చేరిందని, ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందన్నారు.

పొన్నాల, సబితలకు రిలీఫ్

      వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సబిత కు ఊరట లభించింది. దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో సబితపై అభియోగాలు నమోదైనప్పటికీ.. పెన్నా కేసులో మాత్రం ఆమెకు ఊరట లభించింది. వైఎస్ హయాంలో ఇండియా సిమెంట్స్‌కు అడ్డగోలుగా జలదానం చేసిన అంశానికి సంబంధించి... పొన్నాలను సీబీఐ ప్రశ్నించినప్పటికీ, నిందితుడిగా చేర్చకుండా పక్కన పెట్టింది. జగన్ అక్రమాస్తుల కేసులో మంగళవారం మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది.     ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, భారతీ సిమెంట్స్‌లకు సంబంధించి జరిగిన అవకతవకలపై మూడు వేర్వేరు చార్జిషీట్లను సీల్డు కవర్లలో సీబీఐ ప్రత్యేక కోర్టుకు అందించారు. ఎప్పట్లాగానే మూడు కేసుల్లోనూ మొదటి నిందితుడిగా జగన్ పేరును, రెండో నిందితుడిగా విజయ సాయిరెడ్డి పేరును చేర్చారు. ఇండియా సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించి.. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌పై సీబీఐ అభియోగాలు మోపింది. జగన్‌ను మినహాయిస్తే.. మూడు చార్జిషీట్లలో ఆయనొక్కడే బిగ్‌షాట్ కావడం గమనార్హం. ఇండియా సిమెంట్స్ కేసులో ఐఏఎస్‌లు శామ్యూల్, ఆదిత్యనాథ్ దాస్‌లను సీబీఐ నిందితులుగా చేర్చింది. వీరిపై ఇదే కేసులో గతంలోనూ అభియోగాలు నమోదయ్యాయి.

ముజఫర్‌నగర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

  ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్ లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. గత 5 రోజులుగా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వర్గాలను అదుపు చేసేందుకు  కేంద్ర బలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాఅల్లర్లు అదుపు చేయడం మాత్రం వారి వల్ల కావటం లేదు. ఇప్పటికే ఈ ఘటనలో దాదాపు 45 మందికి పైగా మరిణించారు.      కేంద్ర బలగాలు , సీఆర్ఫీఎఫ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా సైన్యం రంగంలోకి దిగింది.  ముజఫర్ నగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహించింది. ముందు జాగ్రత్తగా చర్యగా ముజఫర్‌నగర్‌ జిల్లాలోని అన్ని ఆయుధాల లైసెన్స్‌లను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. ఇప్పటికే 300 మందిని అదుపులోకి తీసుకున్న ప్రభుత్వం మరికొంత మంది అరెస్ట్‌కు రంగం సిధ్దం చేసింది.       యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్  అల్లర్లపై ప్రత్యేకం సమావేశం అయ్యారు. వెంటనే పరిస్ధితిని సాదారణ స్థితికి తీసుకురావటంతొ పాటు నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామి ఇచ్చారు. కేంద్ర హోంశాఖ  సైతం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.

నేడు ఢిల్లీకి సోనియా

  ట్రీట్‌మెంట్‌ కోసం అమెరికాకు వెళ్లిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీ రానున్నరు. గత ఏడాది జరిగిన ఆపరేషన్ కు సంబంధించి సోనియా అమెరికాలో వైద్యపరీక్షలు చేయించుకున్నరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆహారభద్రతా బిల్లుపై లోక్ సభలో చర్చ జరుగుతున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయిన సోనియాగాంధీ తరువాత వైధ్యపరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారు. వారం రోజుల రెస్ట్  తర్వాత సోనియాగాంధీ అమెరికా నుంచి వస్తుండటంతో రాష్ట్ర నేతలు డిల్లీ బాటపట్టనున్నారు. ఇప్పటికే తెలంగాణ విషయంలో కేబినేట్‌ నోట్‌ రెడీ చేసిన హోం శాఖ కూడా సోనియా ఆమోదం కోసం ఎదురుచూస్తుంది. దీంతో సోనియా ఢిల్లీ వచ్చిన వెంటనే మరోసారి రాజకీయసమీకరణాలు వేగంగా మారనున్నాయంటున్నారు విశ్లేషకులు.

సమైక్య రాష్ట్ర సమితి పార్టీ

  తెలంగాణ ప్రకటనకు వ్యతిరేకంగా సీమాంద్ర జిల్లాల్లో ఉధ్యమం ఉవ్వెత్తున్న ఎగసి పడుతున్న నేపధ్యంలో ఇప్పుడు సమైక్యాంద్రకు మద్దతుగా ఓ రాజకీయపార్టీ కూడా ఆవిర్భవించబోతుంది. ఈ మేరకు విజయవాడకు చెందిన హోమియోపతి డాక్టర్‌ ఎస్‌. విశ్వనాధం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ సాదన కోసం ఏర్పాడిన తెలంగాన రాష్ట్ర సమితి లాగానే సమైక్యాంద్ర కోసం సమైక్య రాష్ట్రసమితీ అనే పార్టీని స్ధాపించనున్నారు. ఈ పార్టీకి అధ్యక్షుడిగా విశ్వనాధం, సెక్రటరీగా ఎస్‌. శరత్‌బాబు వ్యవహరిస్తామని పార్టీ వ్యవస్థాపకులు ప్రకటించారు. దీంతో పాటు తమ వెనుక ఏ రాజకీయనాకుల అండలేదని, ఎవరి బినామీగా ఈ పార్టీని స్ధాపించడం లేదని సెప్టెంబర్‌ 12న అధికారికంగా పార్టీ ఏర్పాటును ప్రకటిస్తామని విశ్వనాథం తెలిపారు.

నేటి నుంచి కేదారనాథునికి పూజలు

  ప్రకృతి సృష్టించిన జల విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రముఖ శైవ క్షేత్రం కేదార్‌నాద్‌లో ఈ బుధవారం నుంచి పూజలు మొదలు కానున్నాయి. గత 86 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సైన్యం సహాయక చర్యలు నిర్వహించిన ఈ క్షేత్రంలో ఇక పరిస్థితి పూర్తి చక్కబడలేదు.. అయినా ఇప్పటికే చాలా రోజులు ఆలస్యం కావటంతో నేటి నుంచి పూజలు నిర్వహించటానికి ఆలయ అధికారులతో పాటు కమిటీ సభ్యులు కూడా తీర్మానించారు. 24 మంది పురోహితులతో కూడిన బృంధం ఆలయ కమిటీ సమక్షంలో ఈ రోజు శాస్త్రోక్తంగా పూజలు మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే పూజలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసినా. భక్తులను మాత్రం ఇప్పట్లో అనుమతించే అవకాశం లేదంటున్నారు ఆలయ కమిటి.

కృష్ణా జిల్లా 48 గంట‌ల బంద్‌

  స‌మైక్యాంద్ర కోరుతూ సీమాంద్ర ప్రాంతాల్లో ఆందోళ‌న‌లు మిన్నంటుతున్నాయి. రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ప‌లు ర‌కాలుగా నిర‌స‌న‌లు తెలుపుతున్న ప్రజ‌లు ఇప్పుడు బంద్‌కు పిలుపు నిచ్చారు. 48 గంట‌ల పాటు కృష్ణా జిల్లాలో స‌కలం బంద్ కానున్నాయి. అత్యవ‌స‌ర సేవ‌లు మిన‌హా వ‌ర్తక‌, వాణిజ్య, వ్యాపార‌, ర‌వాణా లాంటి విభాగాల‌న్ని బంద్‌లో పాల్గొన‌నున్నాయి. ఈ రోజు భారీ బైక్ ర్యాలీతో పాటు కెసిఆర్ దిష్టిబొమ్మను ద‌హనం చేసిన స‌మైక్యాంద్ర ఉద్యమ‌కారులు, బుధ‌వారం నుంచి 48 గంట‌ల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈబంద్ ఇప్పటికే ప‌లు సంఘాలు స‌హ‌క‌రిస్తుండ‌గా, రాజ‌కీయ పార్టీలు కూడా మ‌ద్దతు తెలుపుతున్నాయి.

నేటితో ముగియ‌నున్న తొలివిడ‌త ఆత్మగౌర‌వయాత్ర

  రాష్ట్ర నెల‌కొన్న ప్రత్యేక ప‌రిస్థితుల నేప‌ధ్యంలో తెలుగు జాతి ఆత్మగౌర‌వయాత్ర చేప‌ట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు యాత్ర బుధ‌వారంతో తొలివిడ‌త ముగియ‌నుంది. తొలి విడ‌త‌లో భాగంగా గుంటూరు, కృష్ణ జిల్లాల్లో యాత్రను చేప‌ట్టారు బాబు. గుంటూరు జిల్లా పొందుగుల‌లొ చేప‌ట్టిన యాత్ర బుధ‌వారం కృష్ణా జిల్లా తిరువూరులో ముగియ‌నుంది. వెంట‌నే చంద్రబాబు బ‌య‌లు దేరి హైద‌రాబాద్ వ‌స్తారు. నాలుగు రోజుల విశ్రాంతి అనంత‌రం రెండో విడ‌త ఆత్మగౌర‌వ యాత్ర షెడ్యూల్‌ను ప్రక‌టించ‌నున్నారు. అయితే రెండో విడ‌త యాత్రకు వెళ్లే లోపు ఢిల్లీకి వెళ్లి వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నాయి పార్టీ వ‌ర్గాలు. రెండో విడ‌త యాత్రను ప‌శ్చివ‌గోదావ‌రి జిల్లా ఏలూరు నుంచి ప్రారంభిస్తారు. తొలి విడ‌త ఆత్మగౌర‌వ యాత్రకు మంచి స్పంద‌న రావ‌టంతో ఇప్పుడు రెండో విడ‌త‌లో మ‌రింత ఉత్సాహంగా పాల్గొన‌నున్నారు బాబు.

షర్మిల నోటికి ఎవరయినా లోకువే

  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పాద యాత్రలు, బస్సుయాత్రలు చేస్తున్నషర్మిల కనీసం ఇంతవరకు ఆ పార్టీ సభ్యత్వమయినా తీసుకొన్నారో లేదో తెలియదు. ఆమె పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి అనే ఏకైక అర్హతతో పార్టీ తరపున పనిచేస్తున్నారు. ఆమె చిరకాలం రాజకీయాలలో ఉండబోదని స్వయంగా ఆమె భర్త అనిల్ కుమార్ ఇటీవలే మీడియాతో అన్నారు. అయినప్పటికీ ఆమె వైకాపా తరపున ప్రజలకు చాలా వాగ్దానాలు, హామీలు గుప్పిస్తూనే ఉన్నారు. పార్టీలో ఏ హోదా లేకపోయినా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన చప్రాసీ దగ్గర నుండి ప్రధాని మంత్రి దాకా ఎవరినీ విడిచిపెట్టకుండా తీవ్ర విమర్శలు చేస్తూన్నారు. అదేవిధంగా తెదేపా, తెరాస తదితర రాజకీయ పార్టీల నేతలు తన నోటి ముందు బలాదూర్ అన్న రీతిగా తన వయసుకు, పార్టీలో హోదాకు(?) మించి మాట్లాడుతున్నారు.   ఆమె ఇంత వరకు కనీసం ఒక కార్పొరేటర్ వంటి చిన్న పదవిలో కూడా పనిచేసిన అనుభవం లేదు. రాష్ట్రాన్ని,దేశాన్నినడిపించడంలోఉండే కష్ట సుఖాలు ఆమెకు తెలియకపోయినా ముఖ్యమంత్రి దగ్గర నుండి ప్రధాని వరకు అందరూ కూడా ఆమెకు లోకువే. ఈ రోజు ఆమె ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేయాల్సిందంతా చేసి, ఇప్పుడు ఏమి తెలియనట్లు దిష్టి బొమ్మలా కూర్చోన్నారని, ఆయన నిజంగానే రాష్ట్ర సమైక్యత కోరుకుంటున్నట్లయితే వెంటనే రాజీనామా చేసి ఉండాల్సిందని అన్నారు.   వైకాపాలో కనీసం కార్యకర్తకూడా కాని ఆమె యావత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కీలక భాద్యతలు నిర్వహిస్తున్నవ్యక్తిని పట్టుకొని దిష్టిబొమ్మ అనడం, రాజీనామా చేయమనడం చాల అనుచితం. ఆయన ఆ పదవిలో కొనసాగాలో వద్దో చెప్పడానికి కూడా ఆమెకు తగిన అర్హత, రాజకీయానుభవం లేవు. రాజకీయాలంటే కేవలం నోరు పారేసుకోవడం కాదనే సంగతి ఆమె తెలుసుకోవలసి ఉంది. తనకంటే వయసులో, రాజకీయాలలో అన్ని విషయాలలో ఎంతో అనుభవం కలిగిన వారి పట్ల ఆమె మాట్లాడుతున్నతీరు చాలా ఆక్షేపనీయంగా ఉంది.   కనీసం వారి అనుభవంత వయసు కూడా లేని ఆమె చిన్నాపెద్దా చూడకుండా నోటికి వచ్చినట్లు తూలనాడుతూ, దానినే రాజకీయాలనే భ్రమలో ముందుకు సాగుతోంది. సమైక్యాంధ్ర కోసం బస్సు యాత్ర మొదలుపెట్టిన ఆమె, కేవలం అందుకు సంబందించిన మాటలు మాట్లాడితే ఎవరయినా హర్షిస్తారు. లేదా ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించావచ్చో చెప్పినా ప్రజలు హర్షిస్తారు. లేకుంటే ప్రజలను తమ పార్టీకే ఓటేసి గెలిపించమని నేరుగా కోరినా అర్ధం ఉంది. కానీ, ప్రజలను ఆకట్టుకోవడం కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడటాన్ని మాత్రం ఎవరూ హర్షించరు.

వైఎస్ జగన్ అక్రమాస్తులపై సీబీఐ మరో మూడు చార్జ్ షీట్లు

  జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులలో విచారణ ముగించేందుకు సుప్రీంకోర్టు సీబీఐకి ఇచ్చిన నాలుగు నెలల గడువు మొన్న 8వ తేదీతో ముగిసింది. అందువల్ల సీబీఐ తన విచారణ పూర్తి చేసి తుది చార్జ్ షీట్ దాఖలు చేస్తుందని అందరూ ఆశిస్తుంటే, సీబీఐ అందరినీ ఆశ్చర్యపరుస్తూ మంగళవారం నాడు మరో మూడు కొత్త చార్జ్ షీట్స్ దాఖలు చేసింది. దీనితో సీబీఐ ఇంత వరకు మొత్తం 8 చార్జ్ షీట్లు దాఖలు చేసినట్లయింది. త్వరలో మరో రెండు దాఖలు చేస్తామని సీబీఐ కోర్టుకు తెలియజేసింది.   ఇక సీబీఐ ఈ రోజు పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్ మరియు భారతి సిమెంట్స్ పై వేర్వేరుగా దాఖలుచేసిన మూడు చార్జ్ షీట్లలో కూడా జగన్మోహన్ రెడ్డి ని ఏ1 నిందితుడిగా పేర్కొంది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఈ మూడు సిమెంట్ కంపెనీలకు కాగ్నానదీ జలాలను విరివిగా వాడుకోవడానికి అనుమతులు, అదేవిధంగా వివద జిల్లాలలో సున్నపురాయి గనులు, వాటిని తవ్వుకోవడానికి అనుమతులు మంజూరు చేసినందుకు ప్రతిగా, ఈ మూడు కంపెనీలు జగన్మోహన్ రెడ్డి కి చెందిన జగతి పబ్లికేషన్స్ మరియు కార్మెల్ ఏసియా కంపెనీలలో వందల కోట్ల రూపాయలు పెట్టుబడులను పెట్టడం లంచంమే అవుతుందని ఆరోపిస్తోంది.   ఇక ఈ రోజు సీబీఐ వేసిన చార్జ్ షీట్లలో భారీ నీటి పారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్యకి, మాజీ గనుల శాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి సీబీఐ ఉచ్చుబిగిస్తుందని మీడియాలో వస్తున్న ఊహాగానాలకు విరుద్దంగా వారిద్దరి పేర్లను చార్జ్ షీట్ల నుండి మినహాయించడం వారిరువురికీ చాలా ఉపశమనం కలిగించింది.   ఇక సీబీఐ తన విచారణ పూర్తి చేసినా చేయకున్నా జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో బెయిలుకి దరఖాస్తు చేసుకోవచ్చునని నాలుగు నెలల క్రితమే సుప్రీంకోర్టు చెప్పినందున అతను త్వరలో బెయిలుకు దరఖాస్తుకు చేసుకోవచ్చును. మూడు రోజుల క్రితమే కోర్టు ఆయన రిమాండ్ ఈ నెల 20వరకు పొడిగించింది. గనుక ఆ సమయానికి ఆయన తన బెయిలు దరఖాస్తును కోర్టుకి సమర్పించవచ్చును. అయితే, మారిన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో అతనికి బెయిలు మంజూరు అవుతుందా లేదా అనేది ప్రశ్న.   ఒకవేళ అతను బెయిలుపొంది బయటకు రాగలగితే, రాష్ట్ర రాజకీయ సమీకరణాలు పెద్ద ఎత్తున మారవచ్చును. సమైక్యాంధ్ర నినాదంతో దూసుకుపోతున్న ఆయన పార్టీలోకి, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు దూకే అవకాశం ఉంది.

తెలంగాణ నిజం...సమైక్యాంధ్ర ఒక కల

      తెలంగాన అనేది ఒక నిజం … సమైక్యాంధ్ర అనేది ఓ కల. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం జరిగిపోయింది. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం. దాని గురించి ఎలాంటి అనుమానమూ లేదు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వి ఉత్తర కుమార ప్రగల్భాలు. ఆయన కలలు నిజం కావు అని కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కీ అన్నారు. తెలంగాణ నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.     పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే వస్తుందని, హైదరాబాద్ విషయంలో కేంద్రం ఓ స్పష్టమయిన అవగాహనతో ఉందని అన్నారు. అసలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏ ప్రాంతానికి ముఖ్యమంత్రి అన్నది స్పష్టం చేయాలని, త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తుందని, ఈ నెల 15న జరిగే తెలంగాణ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలోని బహిరంగ సభ విషయం ఖరారు చేస్తామని అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతల సభలో జేసీ దివాకర్ రెడ్డి

      ఒక సమైక్యాంధ్ర ప్రయత్నాలు, మరో వైపు రాయల తెలంగాణ ప్రయత్నాలు ఏదయితే అదయింది ఏదో ఒక ప్రయత్నం నెరవేరితే చాలు అన్నట్లు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తరువాత జేసీ దివాకర్ రెడ్డి ఎలాగయినా రాయల తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.     సమైక్యాంధ్ర కొరకు ప్రయత్నిస్తున్న మంత్రి సాకె శైలజానాథ్ కు భంగపాటు తప్పదని, రాయల తెలంగాణ కొరకు కలసి రావాలని, ఆయన రాకున్నా కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలను కలుపుకుని రాయల తెలంగాణ కోరతానని జేసీ చెబుతూ వస్తున్నారు. ఇటీవల ఏపీఎన్జీఓల సభ విజయవంతం అయినప్పుడు జేసీ ముఖ్యమంత్రిని కలిశారు. ఇప్పుడు తాజాగా రాయల తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని ఏకంగా సీఎల్పీలో కాంగ్రెస్ తెలంగాణ నేతల సమావేశానికి వెళ్లి కోరారు. అయితే వారు దానికి నిరాకరించారు. మా రాష్ట్రానికి మీరు గవర్నర్ గా రావాలని కోరారు. ఈ సంధర్భంగా జేసీ జై ఆంధ్రప్రదేశ్ నినాదాలు ఇవ్వగా తెలంగాణ నేతలు జై తెలంగాణ నినాదాలు ఇచ్చారు.