బీజేపీకి మోడీ, కాంగ్రెస్ రాహుల్ యావ
posted on Sep 17, 2013 @ 10:34AM
ప్రధాన జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలు ఏకైక ఎజెండాతో ముందుకు సాగుతున్నట్లు అర్ధం అవుతోంది. రానున్న ఎన్నికలలో ఎలాగయినా అధికారం చేజిక్కించుకోవాలని తపిస్తున్న బీజేపీ నరేంద్రమోడీని పార్టీ రధ సారధిగా చేసుకొని విజయం సాధించాలని తహతహలాడుతోంది. ఇక అధికారం ఎలాగయినా నిలబెట్టుకొని వచ్చే ఎన్నికల తరువాత రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కాంగ్రెస్ ఆరాట పడుతోంది. అధికారం చేజిక్కించుకోవడమే ఏకైక ఎజెండా చేసుకొని తదనుగుణంగానే ఈ రెండు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. అదేవిధంగా రాహుల్, మోడీల ప్రధాని మంత్రి అభ్యర్దిత్వమే జాతీయ సమస్య అన్నట్లు రెండు పార్టీలు చర్చిస్తున్నాయి, తప్ప దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచించే తీరిక, శ్రద్ద వారికి లేకుండాపోయింది.
రాష్ట్ర విభజన విషయంలోకూడా ఈ రెండు పార్టీలు దాదాపు అదే విధంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రాన్ని విభజించి, ప్రాంతీయ పార్టీలయినా తెదేపా, తెరాస, వైకాపాలను దెబ్బతీసి ఎన్నికలలో చక్రం తిప్పాలని కాంగ్రెస్ భావిస్తే, ముందు విభజనకు వత్తాసు పలికిన బీజేపీ దానివల్ల తనకెటువంటి ప్రయోజనమూ ఉండదని గ్రహించగానే వెనక్కి తగ్గడమే కాకుండా, పార్లమెంటులో తెలంగాణా బిల్లుకు మద్దతు ఇవ్వమని ప్రకటించి కాంగ్రెస్ పార్టీని ముందుకు వెనక్కు వెళ్ళకుండా అడ్డుపడుతోంది. రెండు పార్టీలు కూడా ఏవిధంగా ముందుకు వెళితే రాష్ట్రంలో తమకు ప్రయోజనం కలుగుతుందా అని ఆలోచిస్తున్నాయి తప్ప, రాష్ట్ర ప్రజల సమస్యలు, వారి మనోభాలను మాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ యావ, బీజేపీకి మోడీ యావ!