మిస్ అమెరికా-2014పై అమెరికన్ల ఆగ్రహం
posted on Sep 17, 2013 @ 10:04AM
తెలుగమ్మాయి నీనా దావులూరి మిస్ అమెరికా-2014గా ఎంపికయినందుకు భారతీయులు ముఖ్యంగా తెలుగువాళ్ళు సంతోషిస్తుంటే, కొందరు అమెరికావాసులు మాత్రం దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘మిస్ అమెరికా’ అంటే అమెరికాకు చెందిన అమ్మాయే అయ్యుండాలని అనేకమంది ట్వీట్ చేసారు. నీనా అమెరికాలో పుట్టి, అక్కడే పెరిగి విద్యాభ్యాసం చేసినందున ఆమె చట్టప్రకారం అమెరికన్ అయ్యి ఉండవచ్చును కానీ ఆమెను మిస్ అమెరికాగా అంగీకరించలేమని అనేకమంది ట్వీట్ చేసారు. మరికొంత మంది ఆమె ఎంపికను అమెరికాపై తాలిబాన్ ఉగ్రవాదుల దాడితో కూడా సరిపోల్చారు. అయితే చాలా మంది ఇది అమెరికా యొక్క విశాల దృక్పదానికి చక్కటి నిదర్శనమని అబిప్రాయపడ్డారు. నీనా వైద్యవిద్యను పూర్తి చేసుకొని వైద్యురాలిగా స్థిరపడాలని భావిస్తున్నారు. ఈపోటీల్లో ‘మిస్ కాలిఫోర్నియా’ క్రిస్టల్ లీ ఫస్ట్ రన్నర్ అప్‌గా, ‘మిస్ ఒక్లహామా’ కెల్సీ గ్రిస్‌వోల్డ్ సెకండ్ రన్నర్అప్‌గా నిలిచారు.