జగన్ తో సచివాలయ సీమంధ్ర ఉద్యోగుల సమావేశం
posted on Sep 25, 2013 @ 12:09PM
దాదాపు రెండు నెలలుగా మహోదృతంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాకతో మరో కొత్త మలుపు తిరుగనున్నాయా? అంటే అవుననే చెప్పవచ్చును. దాదాపు నెల రోజులుగా సమైక్యాంధ్ర కోసం సమ్మె చేస్తున్న సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు, జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు కొద్ది సేపటి క్రితమే అతను నివసించే లోటస్ పాండ్ వద్దకు చేరుకొన్నట్లు తాజా సమాచారం. వారు తమ ఉద్యమానికి, సమ్మెకి అతని మద్దతు కోరేందుకు వెళ్ళినట్లు సమాచారం.
ఇంతవరకు వైకాపాతో సహా అన్ని రాజకీయ పార్టీలను దూరంగా ఉంచిన సీమాంద్రా ఉద్యోగులు, మొట్ట మొదటిసారిగా వారంతట వారే జగన్ మద్దతు కోరుతూ అతనిని కలవలనుకోవడంతో సమైక్యాంధ్ర ఉద్యమం కొత్త మలుపు తీసుకోబోతోందని స్పష్టం చేస్తోంది.
ఈ విషయం గురించి సచివాలయ ఉద్యోగులు ముందుగానే ఏపీయన్జీవోల నేతల చర్చించి వారి అనుమతితోనే జగన్ కలిసేందుకు వెళ్లి ఉంటారని భావించవలసి ఉంటుంది. అదే జరిగితే, త్వరలో ఉద్యమం ఉద్యోగుల చేతిలోంచి వైకాపా చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంది. తద్వారా ముందుగా తెదేపా నష్టబోవచ్చును.
ఒకవేళ సచివాలయ ఉద్యోగులు ఏపీ ఎన్జీవో నేతలను సంప్రదించకుండా జగన్మోహన్ రెడ్డిని కలిసిన పక్షంలో అది ఉద్యోగులలో చీలికలు తేవడం ఖాయం. వీటిలో ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీ ఒడ్డున పడుతుంది.
ఏపీ యన్జీవోలు వైకాపా సారధ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయదలిస్తే, రానున్న ఎన్నికలలో ఆ పార్టీకి విజయవకాశాలు మెరుగవుతాయి. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచే పరిస్థితిలోఉంటే అప్పుడు వైకాపా మద్దతు స్వీకరించవచ్చును. వైకాపా అద్వర్యంలో మరికొంత కాలం సమైక్య ఉద్యమాలు సాగిన తరువాత ఎన్నికల గంట కొట్టి, ఉద్యమాలకు ఫుల్ స్టాప్ పెట్టించడం ద్వారా కాంగ్రెస్ తన ఈ వ్యూహం బహు చక్కగా అమలు చేయగలదు.
అలా కాకుండా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏపీ యన్జీవోలలో చీలికలు వచ్చినట్లయితే, ఇంతవరకు వారి సమైక్యాంధ్ర ఉద్యమాల ప్రభావం వలన తెలంగాణా ఏర్పాటుపై అడుగు ముందుకు వేయలేని పరిస్థితిలో ఉన్నకాంగ్రెస్ అధిష్టానం ఇక చకచకా రాష్ట్ర విభజన చేసి రెండు ప్రాంతాలలో తనకనుకూలంగా పావులు కదపవచ్చును.
కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి విడుదల ద్వారా ఆశిస్తున్నఅనేక రాజకీయ ప్రయోజనాల్లో బహుశః ఇది కూడా ఒకటి అయ్యి ఉండవచ్చును.