బ్లాక్ బెర్రీని కాపాడిన హైదరాబాదీ
posted on Sep 25, 2013 @ 1:12PM
ప్రపంచ ప్రసిద్ది చెందిన బ్లాక్ బెర్రీ మొబైల్ ఫోన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల కాలంలో ఆ ఫోన్ తయారీ సంస్థ పీకల్లోతు ఆర్ధిక సమస్యలలో కూరుకుపోవడంతో వందలాది ఉద్యోగులను తొలగించే పరిస్థితి కూడా ఏర్పడింది.
కష్టాలలో మునిగున్న బ్లాక్ బెర్రీని హైదరాబాద్ పబ్లిక్ స్కూలుకు చెందిన పూర్వ విద్యార్ధి ప్రేమ్ వత్స ఆదుకొన్నారు. ప్రస్తుతం కెనడా దేశంలో స్థిరపడిన ఆయన ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్సియల్ హోల్డింగ్స్ అనే సంస్థకు ముఖ్యకార్యనిర్వకుడు (సీ.ఈ.ఓ) మరియు అధిపతిగా ఉన్నారు. అదేవిధంగా బ్లాక్ బెర్రీ సంస్థలో ఆయన సంస్థ ప్రధాన షేర్ హోల్డర్ కూడా. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందిన బ్లాక్ బెర్రీ ఇప్పుడు కష్టకాలంలోఉండటంతో ఆయన ఆ సంస్థను కొనుగోలు చేసారు. ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్సియల్ హోల్డింగ్స్ మరియు బ్లాక్ బెర్రీ సంస్థలు ఈ ఒప్పందంపై ఇటీవలే సంతకాలు చేసారు.
ఒక భారతీయుడు బ్లాక్ బెర్రీ వంటి ప్రపంచ ప్రసిద్ది చెందిన ఒక ప్రముఖ సంస్థను ఆదుకొని దాని బాధ్యతలు స్వీకరించడం ప్రజలందరికీ గర్వ కారణం. హైదరాబాద్ పబ్లిక్ స్కూలు బోర్డు సభ్యులలో ఒకరయిన ఫయీజ్ ఖాన్ ఇందుకు తాము ఎంతో గర్వపడుతున్నామని తెలిపారు. ఈ డిశంబర్ నెలలో జరగనున్న తమ కళాశాల 90వవార్షికోత్సవ వేడుకలకు హాజరవనున్న ప్రేమ్ వత్స రాక కోసం తామంతా చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నామని అన్నారు.
ప్రేమ్ వత్స తండ్రి యంసీ. వత్స గతంలో అదే కళాశాలలో వైస్ ప్రినిసిపాల్ గా, ప్రినిసిపాల్ గా కొంత కాలం పనిచేసి ఆ తరువాత కుటుంబముతో సహా కెనడా వెళ్లి స్థిర పడిపోయారు. ప్రేమ్ వత్ససోదరి ఒకామె హైదరాబాద్ కు చెందిన వ్యక్తిని వివాహమాడారు. కానీ వారు కూడా ఆ తరువాత కెనడాకు వెళ్ళిపోయి అక్కడే స్థిరపడ్డారు.