కాంగ్రెస్ రాష్ట్ర విభజన సమస్యను కొత్త ప్రభుత్వం పైకి నెట్టేస్తుందా
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేసి ఇప్పటికి దాదాపు రెండు నెలలు పూర్తి కావస్తున్నా, సమైక్యాంధ్ర ఉద్యమాలు, సీమాంధ్ర నేతల ఒత్తిళ్ళ కారణంగా ఇంతవరకు విభజన ప్రక్రియను మొదలుపెట్టలేకపోతోంది. కానీ, తన నిర్ణయంపై ఎట్టి పరిస్థితుల్లో వెనకడువేసే ప్రసక్తే లేదని మాత్రం చాలా గట్టిగా పదేపదే చెపుతోంది. అంటే జాప్యం చేస్తూ సీమాంద్రులని, విభజన ఆపేది లేదని తెలంగాణా ప్రజలని ఇరువురినీ మభ్యపెడుతూ రోజులు నెట్టుకొస్తోందన్నమాట. ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేస్తానని చెపుతున్నపటికీ అది చేసే వరకు ఎవరికీ నమ్మకం లేదు.
నరేంద్ర మోడీ ప్రధాని పదవి చెప్పట్టేందుకు ఉన్నఅన్నిఅడ్డంకులను ఒకటొకటిగా తొలగించుకొని వస్తూ ఎలాగయినా ఈ సారి పార్టీని ఎన్నికలలో గెలిపించుకొని ప్రధాని పదవి చెప్పట్టాలని ఉత్సాహం చూపిస్తుంటే, ప్రధాని పదవి చెప్పటేందుకు యావత్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఎర్రతివాచీ పరిచి మరీ స్వాగతం చెపుతున్నా ఆయన ఆ పదవి చెప్పట్టేందుకు ఆసక్తి చూపక పోగా “ప్రజల కలలను నెరవేర్చేందుకు తన కలలను చంపుకొంటానని” పలికి కాంగ్రెస్ పార్టీని తీవ్ర నిరాశపరిచారు.
ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక అత్యంత సాహసోపేత నిర్ణయం-‘తెలంగాణా ఏర్పాటు’ ప్రకటన చేసింది. కానీ తీరా చేసి దానిని ఇప్పుడు అమలు చేయడానికి మీన మేషాలు లెక్కపెడుతోంది. ఒకవేళ ఏర్పాటు చేసినా వచ్చే సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండు రాష్ట్రాలలో, కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం కూడా లేదు. గనుక, ఈ సమస్యను వీలయినంత వరకు సాగదీసే అవకాశాలే ఎక్కువున్నాయి.
ఒకవేళ రానున్న ఎన్నికలలో గెలిస్తే ఈ సమస్యను పరిష్కరించడం, ఓడిపోయే సూచనలు కనిపిస్తే ఈ సమస్య మరింత ముదిరి పాకాన పడే విధంగా ఆఖరి నిమిషంలో మరికొన్నివివాదస్పదమయిన నిర్ణయాలు ప్రకటించవచ్చును. తద్వారా రాబోయే ప్రభుత్వానికి కూడా రాష్ట్ర విభజన సమస్య ఒక గుదిబండలా తయారు చేసి చేతులు దులుపుకొని బయటపడవచ్చును. అప్పుడు కొత్త ప్రభుత్వం ఈ సమస్యతో కుస్తీలు పడుతుంటే కాంగ్రెస్ పార్టీ వినోదిస్తూ, కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని ఉంటే ఈ సమస్యను అవలీలగా తెల్చిపారేసేవారమని ఉత్తర కుమార ప్రగల్భాలు పలకవచ్చును.