పాలన గాలికొదిలి రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ రాజకీయాలు
తెలంగాణా ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న తెలంగాణా అంశాన్నిరాజకీయ పార్టీలన్నీకూడా ఒక రాజకీయ అంశంగానే భావిస్తూ, దానిని ఏవిధంగా తమ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే ఎత్తులు వేయడం, తెలంగాణా ప్రజలని అపహాస్యం చేయడమేనని చెప్పవచ్చును. దీనికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీనే తప్పు పట్టవలసి ఉంటుంది. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీనిని తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత కాలంగా సాగదీస్తూ వచ్చింది. తన పార్టీ సభ్యులే రెండు వర్గాలుగా వేర్వేరు వాదనలు వినిపిస్తూ ఉద్యమాలు చేస్తూ రాష్ట్రంలో అశాంతికి మూల కారణమయితే, వారిని అదుపుచేయకపోగా వివిధ కారణాలరీత్యా వారిని వెనుక నుండి ప్రోత్సహించడమో లేక ఉపేక్షిస్తూ పరిస్థితిని మరింత జటిలం చేసింది.
నేటికీ ఆ పార్టీలో ఇదే పరిస్థితి కొనసాగుతుంన్నపటికీ కేంద్ర రాష్ట్ర పార్టీ నాయకత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొని చోద్యం చూస్తున్నాయి. అంటే, నేటికీ కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై ఒక స్పష్టమయిన నిర్ణయానికి రాలేదని అర్ధం అవుతోంది. ఒకవేళ నిజంగా ఈ సమస్యపై పరిష్కారం కనుగొని ఉండి ఉంటే, నేడు రెండు ప్రాంతాలలోఆందోళనలు చేస్తున్నతన పార్టీ నేతలను తప్పక అదుపుచేసి ఉండేది.
కానీ, కాంగ్రెస్ నాయకత్వం అటువంటి ప్రయత్నాలేవీ చేయకపోవడంతో, మళ్ళీ సీమంధ్ర నేతల సమైక్య డ్రామా మొదలయింది. వీరు ఇక్కడ ఏదో ఒక వాదన చేయడం, దానిని అక్కడి కాంగ్రెస్ నేతలు ఖండిస్తుండటం ఒక నిత్యకృత్యంగా మారిపోయింది.
నిన్న మొన్నటి వరకు సమైక్యవాదం వినిపించిన కావూరి, ఇప్పుడు మంత్రి పదవి పుచ్చుకోవడంతో ఇప్పుడు ఈ సమస్యపై జాతీయ ద్రుక్పధంతో మాట్లాడాలని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడం చూస్తే వారి ఉద్యమాలపట్ల నిబద్దత ఏపాటిదో, దేనికోసం చేస్తున్నారో అర్ధం అవుతుంది.
తెరాస తెలంగాణా ఉద్యమం మొదలుపెట్టినప్పటికీ, దానిని తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్రమంతా వ్యాపింపజేసింది మాత్రం కాంగ్రెస్ నేతలే. ఈ వ్యవహారంలో ఒకరికి తమ వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవాలనే తాపత్రయమయితే, మరొకరికి పదవుల కోసం, ఇంకొకరికి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆరాటం. అందుకు అమాయకులయిన ప్రజలను, ఉడుకు రక్తంగల విద్యార్ధులను వాడుకొని ఇదంతా వారి ప్రయోజనాలు కాపాడేందుకేనని నమ్మ బలుకుతున్నారు. ఈవిధంగా రాజకీయ పార్టీలు, వాటి నేతలు ఉద్యమాలతో రాజకీయాలు చేస్తూ తమ భవిష్యత్తుని నిర్మించుకొంటుంటే, వారి మాటలు నమ్మి వారి వెనుక తిరుగుతున్న ప్రజలు, ముఖ్యంగా విద్యార్ధులు వారి భవిష్యత్తుని పణంగా పెడుతున్నారు.
రాష్ట్రంలో ఇంత అశాంతి నెలకొని ఉన్నపటికీ, కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీటవేస్తూ ఒకసారి రాయల తెలంగాణా అని మరోసారి మరొకటి అంటూ ఆ పరిస్థితులను మరింత జటిలం చేస్తోంది. వీటివల్ల రాజకీయ పార్టీలకి, వాటి నేతలకి వచ్చే నష్టం ఏమిలేకపోయినా, ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టబోతున్నారు.
పరిపాలనా వ్యవహారాలూ చూసుకోవడానికి ఎన్నుకోబడిన శాసనసభ్యులు, మంత్రులు అందరూ ఉద్యమాల పేరిట పరిపాలనను గాలికొదిలేసి తిరుగడం కేవలం జవాబు దారీ లేకపోవడమే. అయితే దీనిని ప్రశ్నించే వారు కాని, వ్యవస్థ గానీ లేకపోవడంతో ఇది కొనసాగుతోంది. దీనినే ‘కాంగ్రెస్ మార్క్ పరిపాలన’ అంటారేమో మరి తెలియదు.