జగన్ వైపు దోపిడీ దారులు

      రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీదారులంతా జగన్ పార్టీలో చేరిపోతున్నారు. కేవీపీ రాంచంద్రరావు వియ్యంకుడు రఘురామకృష్ష్ణంరాజు, బాలశౌరిలు జగన్ పార్టీలో చేరారు. రేపో మాపో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా రేపో మాపో జగన్ పార్టీలో చేరబోతున్నాడు. సోనియాగాంధీకి కేవీపీ రాంచంద్రరావు మధ్యవర్తి అయితే కేవీపీకి పవర్ ఆఫ్ అటార్నీ రఘురామకృష్ణం రాజు అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆస్తి 2004లో తొమ్మిది కోట్లకు పైగా ఉంటే ఇప్పుడు 122 కోట్లకు ఎలా పెరిగిందని, జగన్ ఆస్తి 2004కు ఇప్పటికి ఇరవై వేల రెట్లు పెరిగిందని ఇలా దోపిడిదారులు, అవినీతి పరులు ఒకే పార్టీలో చేరిపోయి ముఠాగా మారుతున్నారని విమర్వించారు. రాజ్యాంగ విరుద్దంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిందని, ఈ విభజన కోర్టు ముందు నిలబడదని సోమిరెడ్డి అభిప్రాయ పడ్డారు. సీమాంధ్రకు చెందిన 19 మంది ఎంపీలు రాజీనామా చేస్తే యూపిఏ బలం 263కు పడిపోతుందని, రాజీనామాల విషయంలో లగడపాటి, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు దాగుడు మూతలు ఆడుతున్నారని అన్నారు.

సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు తిరస్కరణ

    రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ కాంగ్రెస్, టిడిపి, వైకాపా సీమాంధ్ర ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్ మీరా కుమార్ తిరస్కరించారు. రాజీనామలు ఇచ్చిన వెంటనే ఆమోదించాల్సిన అవసరం లేదని, ఆర్టికల్ 101(3బి) ప్రకారం పూర్తి స్థాయి విచారణ జరపొచ్చని, సమాచార సేకరణ కూడా చేయొచ్చని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. రాజీనామలు చేసిన సీమాంధ్ర ఎంపీలు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ కార్యాలయం కోరింది. గతంలోనే స్పీకర్ మీరాకుమార్‌ను ఎంపీలు ఎస్పీవైరెడ్డి, లగడపాటి, అనంత, మేకపాటి, ఉండవల్లి, సాయిప్రతాప్, సబ్బంహరి,  కలిసిని విషయం తెలిసిందే.

రాయపాటి కబుర్లు

  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించగానే అందరికంటే ముందుగా గుంటూరు కాంగ్రెస్ యంపీ రాయపాటి సాంబశివరావు తన యంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసారు. కొద్ది రోజుల క్రితం, లగడపాటి, ఉండవల్లి తదితరులు తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోవడానికి స్పీకర్ ను కలవాలని నిర్ణయించుకొన్నపుడు, రాయపాటి మాత్రం ఏవో కుంటి సాకులు చెప్పి మొహం చాటేశారు. ఇంతవరకు ఆయన తన రాజీనామాను ఆమోదింపజేసుకొనే ప్రయత్నం కూడా చేయలేదు. అదేవిధంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరగడమూ మానేయలేదు.   మొన్న చంద్రబాబు డిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నపుడు ఆయన దీక్షకు సంఘీభావం తెలిపివచ్చారు. కానీ తెదేపాలో చేరే ఆలోచనేమి లేదని చెప్పారు. తనకు యంపీ పదవి రావడానికి చంద్రబాబు చాలా సహాయ పడ్డారని అన్నారు. అదే సమయంలో తెదేపా, వైకాపా ఇచ్చిన లేఖల కారణంగానే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆయన ఆరోపించారు.   మళ్ళీ నిన్న మీడియాతో మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం కృషిచేస్తున్న వైకాపాతో కలిసి పనిచేయడానికి కూడా తనకు అభ్యంతరం లేదని ప్రకటించారు. తాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోలేనని, ఏ పార్టీలో జేరాలనే విషయాన్ని త్వరలో తేల్చుకొంటానని తెలిపారు. కానీ మళ్ళీ అదే నోటితో పార్టీలు మార్చే రాజకీయ నాయకులను ప్రజలు చెప్పుతో కొడతారని ఆయన అన్నారు.   ఇంతకీ రాయపాటి సాంబశివరావు తెలివిగా మాట్లాడుతున్నారా లేక అతితెలివి ప్రదర్శిస్తున్నారా? “మేము ఎట్టి పరిస్థితుల్లో రాజీనామాలు చేసేది లేదని, రాష్ట్ర విభజనపై అధిష్టాన నిర్ణయమే మాకు శిరోదార్యమని” కుండ బ్రద్దలు కొట్టినట్లు చెపుతున్నకేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, జేడీ శీలం ఈ రాయపాటి కంటే ఎంతో నిలకడతనం చూపుతున్నారని చెప్పుకోక తప్పదు.

శరత్ పవార్ హస్త సాముద్రికం

  రెండు నెలలుగా ఉవ్వెత్తున ఎగిసిపడిన సీమాంధ్రలోని సమైక్యాంధ్ర ఉద్యమాలు, కారణాలేవయితేనేమి ఒక్కసారిగా చల్లబడ్డాయి. ప్రభుత్వోద్యోగులు కూడా సమ్మె విరమించు కోవడంతో సీమాంద్రాలో మళ్ళీ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొంటున్నాయి. ఇంత కాలం ఇంటి మొహం చూడలేక హైదరాబాద్, డిల్లీలలో తలదాచుకొని తిరుగుతున్న యంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా మెల్లగా గూటికి చేరుకొంటున్నారు. ఇక యంపీలు, మంత్రుల రాజినామాలేవీ కూడా ఇంతవరకు ఆమోదం పొందలేదు గనుక, వారు తమ పదవులలో కొనసాగవచ్చును. ఇక రాజీనామాలు చేయమని భీష్మించుకొని కూర్చొన్నమంత్రులు, కష్టకాలంలో అధిష్టానానికి బాసటగా నిలిచినందుకు గాను వీర త్రాళ్ళు వేయించుకొని, మరింత నిబద్దతతో అధిష్టాన సేవ వీలు చిక్కితే ప్రజాసేవ కూడా చేసుకోవచ్చును.   అయితే వయసు మీద పడుతున్నకేంద్రమంత్రి శరత్ పవార్ మాత్రం ఇవేమీ చూడకుండా కేవలం కాంగ్రెస్ హస్త రేఖలు చూసి త్వరలో సీమాంద్రా యంపీలు, కేంద్రమంత్రులు రాజీనామాలు చేస్తే, తమ యూపీయే ప్రభుత్వం పడిపోవచ్చునని, అందువల్ల మధ్యంతర ఎన్నికలు ఎప్పుడయినా రావచ్చునని జోస్యం చెప్పేసి రాజకీయ విశ్లేషకులకి, మీడియాకు అందరికీ మళ్ళీ పని కల్పించారు.   ఆయన జోస్యం వమ్ము కాకూడదంటే శాసన సభకు టీ-బిల్లు రావాలి. దానికి వ్యతిరేఖంగా సీమాంధ్ర శాసనసభ్యులందరూ పార్టీలకతీతంగా ఓటేసి, ఓడించాలి. అప్పుడు ముందే అనుకొన్నట్లు ముఖ్యమంత్రితో సహా అందరూ రాజీనామాలు చేయాలి. రెండు సమావేశాలతోనే రెండు నెలల ఉద్యోగుల సమ్మెను చల్లార్చగలిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళీ స్విచ్ ఆన్ చేయగానే ఉద్యోగుల సమ్మెలు, ప్రజా ఉద్యమాలు మొదలవ్వాలి. ఆ ఒత్తిడితో మిగిలిన యంపీలు, కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు చేయాలి. అప్పుడే శరత్ పవార్ జోస్యం నిజమవుతుంది.   అయితే కేంద్ర హోం మంత్రి షిండే శాసనసభకు టీ-బిల్ వెళ్ళదు, దాని ఆమోదం కూడా మాకవసరం లేదు. ఏదో సంప్రదాయాన్ని కాదనలేక శాసనసభ్యుల ముచ్చట కోసం కేవలం ఓ డ్రాఫ్ట్ కాయితం మాత్రం పంపుతాము. దానిని వారు చింపి చెత్త బుట్టలో పడేసినా, దానితో తెలంగాణా ప్రక్రియ ఆగిపోదని ఇటీవలే శలవిచ్చారు. అంటే ఇంత కాలం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టీ-బిల్లుపై చెపుతున్నవన్నీ పిట్ట కధలేనని అర్ధం అవుతోంది.   అందువల్ల ఆయనతో సహా ఆయన సీమాంధ్ర మత్రులందరూ రాజీనామాలు చేసి తప్పుకొన్నా, ప్రజలు కూడా వారిని నమ్మే పరిస్థితుల్లో లేరు గనుక, వారందరూ కూడా మరో కొత్త సాకుతో మరో కొత్త ‘డెడ్ లైన్’ సెట్ చేసుకొని తమ పదవులలో కంటిన్యూ అయిపోవచ్చును. ఇక రెండు నెలలు నిష్పలమయిన ఉద్యమాలు చేసి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులు కూడా మళ్ళీ ఇంత త్వరగా సమ్మె చేస్తారని భావించలేము.   అటువంటప్పుడు మిగిలిన యంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామాలు చేస్తారనుకోవడం కంటే, రాజీనామాలు చేసిన వారు కూడా తమ రాజీనామా పత్రాలను వెనక్కు తీసేసుకొని, ఈ ఆరు నెలల పుణ్యకాలంలో పరిస్థితులు మళ్ళీ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వీలయినంత ఎక్కువ ప్రజాసేవ చేసేయవచ్చును. గనుక శరత్ పవార్ తన మెదడు మీద ఒత్తిడి తెచ్చుకొని ఇటువంటి జోస్యాలు చెప్పడం కంటే ఒక చిలుకను తెచ్చుకొంటే మంచిదేమో!

చంద్రబాబుకి మోడీ ఫోన్లో పరామర్శ

  చంద్రబాబు నాయుడు ఐదు రోజులు డిల్లీలో నిరాహార దీక్ష చేసినప్పుడు అక్కడే ఉండే బీజేపీ అగ్రనేతలెవరూ కూడా ఆయనను పరామార్శించడానికి కూడా రాకపోవడం విశేషం. బీజేపీ, తెదేపాల మధ్య ఎన్నికల పొత్తులు ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్ననేపద్యంలో కూడా బీజేపీ నేతలెవరూ చంద్రబాబుని పరామర్శించడానికి రాకపోవడం వెనుక బీజేపీ తెలంగాణా నేతల ఒత్తిడి ఉన్నట్లు సమాచారం.   తెలంగాణా అంశంపై స్పష్టత ఈయని చంద్రబాబుకి సంఘీభావం తెలుపడం వలన, తెలంగాణాలో పార్టీకి ఇబ్బందికరమయిన పరిస్థితి ఎదురవుతుందని వారు అభ్యంతరాలు తెలిపినందునే, బీజేపీ అగ్రనేతలెవరూ కూడా ఆయనను పరామర్శించడానికి వెళ్లలేదని తెలుస్తోంది. అయితే బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ మాత్రం చంద్రబాబుకి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తుల గురించి ఆలోచించుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది గనుక, ఈలోగా తెలంగాణా ఏర్పాటుపై మరికొంత స్పష్టత ఏర్పడితే అప్పుడు మాట్లాడుకోవడం మేలని రెండు పార్టీలు భావిస్తున్నట్లున్నాయి. తెదేపా బీజేపీలు క్రమంగా దగ్గరవుతున్నందునే, లెఫ్ట్ పార్టీ నేతలెవరూ కూడా ఆయనను పరామర్శించడానికి రాలేదనుకోవచ్చును.

గండం గడిచింది

  తీరం దాటిన పైలిన్‌ తుఫాన్‌ తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. తుఫాన్‌ తీవ్రత కాస్త తగ్గటంతో అధికారుల నష్ట నివారణ చర్యలపై ద్రుష్టి సారించాలని కిరణ్‌ ఆదేశించారు. అయితే ఈ ప్రభావం మన రాష్ట్రంతో పొల్చుకుంటే ఒరిస్సా మదే తీవ్రంగా ఉంది.     తుఫాన్‌ ప్రభావం భారీగా ఉంటుందని అందరూ భావించిన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో ప్రాణనష్టాన్ని ఘననియంగా తగ్గించగలిగారు. అయితే తుఫాను వల్ల దాదాపు రూ.1400 కోట్లు ఆస్తి నష్టం జరిగినట్లుగా ఒడిశా ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. తుఫాను తీవ్రతకు ఎడుగురు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది.   మన రాష్ట్రంలో ఫైలిన్ ప్రభావం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా పడింది. నాలుగు మండలాల్లో భారీగా పంట నష్టం ఏర్పడింది. తుఫాను వల్ల 7,500 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. కూరగాయలు, అరటిలకు వెయ్యి హెక్టార్లలో నష్టం వాటిల్లింది. నలభై వేలకు పైగా మత్సకారుల కుటుంబాలు ఉపాధి కోల్పోయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

పైలిన్‌ ప్రభావం

  ఆంద్ర ప్రదేశ్‌, ఒడిసా రాష్ట్ర మీద పైలిన్‌ ప్రభావం కొనసాగుతుంది. ఉత్తరాంద్ర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నారు నిన్న రాత్రి తీరం దాటిన  పైలిన్‌ చాలా చోట్ల భారీ విద్వంసం స్రుష్టించింది. ఈ ప్రభావం ఆంద్ర ప్రదేశ్ లోని రెండు మూడు జిల్లాల్లోనే భారీగా ఉండగా ఒడిస్సా మాత్రం తీవ్రంగా నష్టపోయింది.   అయితే పైలిన్‌ ప్రతాపానికి విజయనగరం జిల్లాలో సుమారు 40 గ్రామాలు పూర్తిగా అంధకారంలో చిక్కుకున్నాయి. తుఫాను గాలుల ప్రభావానికి అరటి, నీలగిరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఒడిశాలోని ఎగువ ప్రాంతాలలో, ఉత్తరాంధ్ర జిల్లాలలోని పలు ప్రాంతాలలో కురిసిన భారీవర్షాల కారణంగా ఉత్తరాంద్ర  జిల్లాల్లోని అన్ని రిజర్వాయర్‌లు నిండిపోయాయి.. దీంతో అన్ని చోట్ల నీరు విడుదల చేశారు. ఇప్పటికే పలు రిజర్వాయర్‌లలో నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంది.   ఫైలిన్‌ దాటికే రైల్వే శాఖ కూడా తీవ్రంగా నష్టపోయింది. తుఫాను హెచ్చరికలతో చాలా రైళ్లను రద్దు చేయగా చాలా ప్రాంతాల్లో స్టేషన్లు, ట్రాక్‌లు, ఓవర్‌ బ్రిడ్జ్‌ లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైళ్లశాఖకు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లింది. కొన్ని స్టేషన్ల వద్ద సిగ్నల్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది.

కేంద్రంలో ముందస్తు ఎన్నికలు ; పవార్‌

  తెలంగాణ విషయంలో రోజుకో మాట చెపుతూ అయోమయం కలిగిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ మిత్రపక్షనాయకుడైన శరద్‌పవార్‌ షాక్‌ ఇచ్చారు. తెలంగాణ అంశాన్ని కదిలించిన కాంగ్రెస్‌ ముందస్తు ఎన్నికలకు సిద్దం కావాలన్న సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ అంశం అంత త్వరగా తేలే విషయం కాదన్నారు పవార్‌.   రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం పై అలిగిన కాంగ్రెస్‌ ఎంపిలు ఏ క్షణం అయినా రాజీనామా చేసే అవకాశం ఉందన్నారు.. సీమాంద్ర నాయకుల రాజీనామాలు స్పీకర్‌ అంగీకరించినట్టయితే ప్రభుత్వం మైనారిటీలో పడి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు.   అయితే ఎన్నికల ఎప్పుడు వచ్చినా తాము కాంగ్రెస్‌ పార్టీతో కలిసే పోటి చేస్తామన్నారు. అయితే ఈ సారి తాను ప్రత్యక్షరాజకీయాల్లో పోటి చేయదలచుకోలేదని.. వచ్చే ఏడాది రాజ్యసభకు వెళ్లే ఆలోచనలో ఉన్నానని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి కిరణ్, జగన్ రెండు కళ్ళు

  ఇంత కాలంగా అధిష్టానం నిర్ణయాన్ని సవాలు చేస్తూ చాలా గట్టిగా సమైక్యవాదం వినిపించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు ఉద్యోగుల సమ్మెను విరమింపజేయడం చూస్తే ఆయన అధిష్టానం హెచ్చరికలకు వెనక్కి తగ్గినట్లే ఉంది. అసలు కిరణ్ కుమార్ రెడ్డి నిజంగా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నందునే అధిష్టానాన్ని దిక్కరిస్తున్నారా? లేక కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంలో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా సమైక్య డ్రామాను రక్తి కట్టిస్తున్నారా అనే అనుమానాలున్నాయి.   ఎందుకంటే, శాసనసభకి తెలంగాణా బిల్లు రాదని తెలియకనే, ఆయన ఇంత కాలం బిల్లుని ఓడిస్తామని చెపుతున్నారని భావించలేము. అంటే బిల్లు రాదని తెలిసినప్పటికీ అదేమి తెలియనట్లు నటిస్తూ ఇంత కాలం ఆయన సమైక్యవాదం చేస్తునట్లు అర్ధం అవుతోంది. మిగిలిన మంత్రులు, శాసన సభ్యులు కూడా ఆయన అడుగు జాడలలోనే నడుస్తున్నారు. గనుక అందరూ ఆ తానులో ముక్కలేనని అర్ధం అవుతోంది. అంటే చాలా ముందుగానే సిద్దం చేసుకొన్నఈ సమైక్య స్క్రిప్ట్ ప్రకారమే ఈ సమైక్య డ్రామా నడుస్తోందని చెప్పవచ్చును.   అందుకు కారణం ఏమిటంటే రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంద్రాలో తనకు తీవ్ర వ్యతిరేఖత ఎదురయితే, అది తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చుతుందని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలతో సమాంతరంగా ఈ సమైక్య డ్రామా నడిపిస్తోంది. ఇదే నిజమయితే త్వరలో ఆయనని బలవంతంగా పదవి నుండి దింపో లేక ఆయనే టీ-నోట్ ను వ్యతిరేఖిస్తూ పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేసి కొత్త సమైక్య పార్టీని పెట్టడమో జరుగుతుంది.   అప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకవైపు సమైక్య హీరోగా బయటకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డిని, మరో వైపు సమైక్యంద్రా ఏకైక హక్కుదారుగా చెప్పుకొంటున్నజగన్మోహన్ రెడ్డిని డ్డీ కొనవలసి ఉంటుంది. వారిద్దరూ రంగంలోకి దిగితే, ప్రజలు ఆ ఇద్దరు సమైక్య హీరోలకే ఓటువేసే అవకాశం ఎక్కువ ఉంటుంది.   గత ఎన్నికలలో ప్రజారాజ్యం వచ్చి ఇదేవిధంగా ఓట్లు చీల్చడంతో తెదేపా దెబ్బతింది. మళ్ళీ ఈసారి కూడా కాంగ్రెస్ అధిష్టానం అదే వ్యూహం అమలు చేస్తున్నట్లు కనబడుతోంది. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీ ఏవిధంగా కాంగ్రెస్ గంగలో కలిసిపోయిందో ఈ సారి కూడా ఎన్నికల తరువాత కిరణ్ పెట్టబోయే కొత్త పార్టీ, వైకాపా కూడా కాంగ్రెస్ లో కలిసిపోవచ్చును.   ఒకవేళ వైకాపా కలవకపోతే ఆ పార్టీతో కలిసి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కి అభ్యంతరం ఉండకపోవచ్చును. ఎందుకంటే, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికే కాంగ్రెస్ అధిక ప్రాదాన్యత ఇస్తుంది. ఈ అంచనా నిజమయితే కాంగెస్ పార్టీకి కూడా కిరణ్, జగన్ ఇద్దరూ రెండు కళ్ళవంటి వారని చెప్పవచ్చును.

బలవంతంగా బాబు దీక్ష భగ్నం

      టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్ష భగ్నమైంది. శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఆర్ఎమ్ఎల్ ఆస్పత్రి వైద్యులు బలవంతంగా ఫ్ల్యూయిడ్స్ ఎక్కించి బాబు దీక్షను భగ్నం చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలుగు వారికి న్యాయం చేయాలంటూ గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న చంద్రబాబు ఆరోగ్యం క్షీణించింది. దీక్ష విరమించాలని వైద్యులు సూచించినప్పటికీ బాబు ఒప్పుకోలేదు. దీంతో నిన్న(శుక్రవారం) పోలీసులు ఆయనను ఆర్ఎమ్ఎల్ ఆస్పత్రికి తరలించారు. అయినా బాబు ఆస్పత్రిలో దీక్షను కొనసాగించారు. ఈ ఉదయం బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆరోగ్యం క్షీణించడంతో మూడు గంటల ప్రాంతంలో ఫ్ల్యూయిడ్స్ ఎక్కించి దీక్షను భగ్నం చేశారు

చంద్రబాబు ఆరోగ్యం సీరియస్

      టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు వెల్లడించారు. అత్యవసర చికిత్స చేపట్టకపోతే బాబు ఆరోగ్యం డేంజర్ జోన్ లో పడే అవకాశం వుందని వారు హెచ్చరిస్తున్నారు. తెలుగు ప్రజల డిమాండ్ లను నెరవేర్చే వరకు ఆమరణ దీక్ష విరమించనని... ఆసుపత్రిలోనూ దీక్షను కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం విషమిస్తున్నా ఆయన దీక్ష విరమించేందుకు ససేమిరా అంటున్నారు. వైద్యుల చికిత్సకు ఆయన సహకరించడం లేదు.     మరోవైపు ఏపీభవన్ నుంచి టీడీపీ అధినేత చ౦ద్రబాబును అక్రమంగా తొలగించినందుకు నిరసనగా శనివారం యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నివాస ముట్టడికి టీడీపీ నేతలు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో తోపులాట జరిగింది.

సీమాంధ్ర నేతలకి కాంగ్రెస్ ఎర

  రానున్నఎన్నికలలోగా రాష్ట్ర విభజన చేసినా చేయకున్నా సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినడం ఖాయం. రాష్ట్ర విభజనను పార్లమెంటు ఆమోదిస్తేనే గానీ అడుగు ముందుకు వేయలేదని తెలిసి ఉన్నపటికీ, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసమంటూ భారీ నిధులను కేటాయిస్తూ ప్రకటించవచ్చును. అయితే రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేవరకు అది మీడియా ప్రకటనలకి, కాగితాలకే పరిమితమవుతుంది. అయినప్పటికీ కాంగ్రెస్ వ్యూహం మాత్రం చక్కగా ఫలిస్తుంది.   వాటిని దక్కించుకోవడం కోసం భారీ కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకొంటూ ‘పార్ట్ టైం ప్రజాసేవ’ చేసుకొంటున్న సీమాంధ్రలో అన్నిరాజకీయ పార్టీల యంపీలు, మంత్రులు, శాసన సభ్యులు, రాజకీయ నేతలు పైరవీలు మొదలుపెడతారు గనుక, వారిని లొంగ దీసుకోవడం తేలికవుతుంది. ఈ సారి సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని గెలవడం అసాద్యం. స్థానిక మంత్రులు, యంపీలు, శాసన సభ్యుల వ్యక్తిగత పలుకుబడి, ప్రజాదరణ, కుల సమీకరణాలు, డబ్బు వగైరా అంశాలపైనే కాంగ్రెస్ విజయం ఆధారపడి ఉంటుంది. గనుక ముందుగానే వారికి ఈ కాంట్రాక్ట్ ఎరలు వేసి లోబరచుకొంటే వారి గెలుపుకోసం వారే తిప్పలు పడి గెలిస్తే, గండం గట్టేక్కవచ్చును. ఒకవేళ వారు గెలిచినా గెలువకపోయినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే తన ఏర్పాట్లు తను చేసుకొని తన జాగ్రత్తలో తను ఉంది.   తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతోనే సగం విజయం సాదించిన కాంగ్రెస్ పార్టీ, కొత్తగా ఏర్పాటు చేసిన మంత్రుల బృందం చేసే హడావుడితో తెలంగాణా ప్రజలకు తెలంగాణా ఏర్పడుతుందనే నమ్మకం కలిగిస్తూ చివరికి రాష్ట్ర విభజన చేయకుండానే ఎన్నికలకి వెళ్ళవచ్చును. ఆవిధంగా చేయడం వలన కాంగ్రెస్ పార్టీకి మూడు ప్రయోజనాలున్నాయి.   1. కాంగ్రెస్ ను గెలిపిస్తేనే మిగిలిన ప్రక్రియ వేగంగా పూర్తవుతుందనే ప్రచారం చేసుకొని తెలంగాణాలో గెలిచే అవకాశం ఉంది.   2. ఇంత క్లిష్టమయిన సమస్యను ఇంత హడావుడిగా పరిష్కరించేకంటే, ఎన్నికలలో గెలిస్తే తాపీగా చేసే వెసులుబాటు దొరుకుతుంది.   3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు అవసరముంటుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేకపోయినా, భారీగా నిధులు మంజూరు చేసేయడం వలన సీమాంధ్ర ప్రజలు, నేతలు అందరూ కూడా చల్లబరచవచ్చును. కానీ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోతే, సరిగ్గా ఇదే అంశం ఆ తరువాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వానికి శాపంగా మారుతుంది.

తీరం దాటనున్న 'ఫైలిన్'

      'ఫైలిన్' తుఫాన్ వేగం పెరిగింది. పారదీప్‌కు 375 కి.మీ దూరంలో , కళింగపట్నానికి 270 కి.మీ దూరంలో, గోపాలపూర్‌కు 345 కి.మీ దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. గోపాలపూర్ వద్ద ఈరోజు తుఫాను తీరం దాటే అవకాశం ఉంది.   తుఫాన్ కారణంగా అన్ని ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. జాలర్లు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 'ఫైలిన్' తుఫాన్ ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సుమారు 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా. 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 6 గంటల్లో తీర ప్రాంతంలో 45-65 కి.మీ వేగంతో గాలలు వీచనున్నాయి. గాలులు క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నానికల్లా గాలుల తీవ్రత 100-150 కి.మీ పెరిగే అవకాశం ఉండగా... సాయంత్రానికి 210-220 కి.మీ మధ్య గాలుల వేగం పెరుగనుంది.

చంద్రబాబు డిమాండ్ నేరవేరినట్లేనా

  ముందు అన్నిసమస్యలకి పరిష్కారం చూపి, సీమంధ్ర ప్రజల భయాందోళనలు పోగొట్టి, ఆ తరువాత రాష్ట్ర విభజనపై అడుగు ముందుకు వేయమని కోరుతూ చంద్రబాబు డిల్లీలో నిరాహార దీక్ష చేసారు.   రాష్ట్ర విభజన కొరకు ప్రత్యేకంగా ఏర్పాటయిన కేంద్ర మంత్రుల బృందం నిన్నమొదటి సారి సమావేశమయిన తరువాత, రాష్ట్ర విభజన సందర్భంగా ఎదురయ్యే అన్ని సమస్యలకి నిష్పక్షపాతంగా పరిష్కారాలు చూపుతామని, అదేవిధంగా సీమంధ్ర ప్రజలు, నేతలు లేవనెత్తుతున్నఅన్నిసమస్యలకి పరిష్కరించి, వారి భయాందోళనలు తొలగిస్తామని ప్రకటించారు.   ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్నహోం మంత్రి సుషీల్ కుమార్ షిండే మాట్లాడుతూ తమ బృందం రాష్ట్ర విభజనపై పూర్తి నివేదిక తయారు చేసిన తరువాతనే, అది క్యాబినెట్ ముందుకు, అక్కడి నుండి రాష్ట్రపతికి, శాసనసభకి, పార్లమెంటుకి వెళుతుందని తెలిపారు.   అంటే తెదేపా కోరుతున్నట్లుగానే ముందు సమస్యలను పరిష్కరించిన తరువాతనే పార్లమెంటు ఆమోదానికి వెళ్ళబోతోందన్న మాట. అంటే చంద్రబాబు డిమాండ్స్ కు కేంద్రం అంగీకరించినట్లే భావించవచ్చును. కానీ, అంటోనీ కమిటీ వంటి ఒక డమ్మీ కమిటీని సృష్టించి దానితో టీ-నోట్ వరకు ఎంతో చాకచక్యంగా వ్యవహారం నడిపించిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు మంత్రుల బృందంతో మాత్రం అదే విధంగా కధ నడిపించదని భావించలేము.

ఆర్టీసీ కదిలింది

      రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని డిమాండ్ తో చేపట్టిన సమ్మెను సీమాంధ్ర ఆర్టీసీ కార్మికులు విరమించుకున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించుకోవడంతో తిరిగి బస్ ల రాకపోకలు ఆరంభమయ్యాయి. ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలతో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఏకే ఖాన్ ఇతర ఉన్నతాధికారులు శుక్రవారం సుదీర్ఘ చర్చలు జరిపారు. రాత్రి 10.30 గంటల సమయంలో చర్చలు ఫలించాయి. సమ్మెను విరమించుకుంటున్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు. మరి వీరు సమ్మె చేసింది సమైక్య రాష్ట్రం కోరుతూనా?లేక వీరి డిమాండ్ల కోసమా?