నైతిక సూక్తులు వల్లిస్తున్న కావూరి
మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు అలిగానందిట వెనకటికి ఓ ఇల్లాలు. ఏలూరు యంపీ కావూరి సాంబశివరావు తనకు కేంద్రమంత్రి పదవి ఈయనందుకు కాదు, నిన్నగాక మొన్న రాజకీయాలలోకి, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిపడిన పిల్లకాకి చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇచ్చినందుకే అలిగి తన పదవులకి రాజీనామా చేసారు.
చిరకాలంగా నానుతున్న కొల్లేరు సమస్యను అందిపుచ్చుకొన్న ఆయన, అవసరమయితే సమస్య పరిష్కారానికి హై-వే రోడ్లు దిగ్బంధం చేయడానికి కూడా వెనుకాడనని ప్రభుత్వoపై బెదిరింపులకు కూడా దిగారు. పనిలో పనిగా ఆ చేత్తోనే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కూడా ఎగదోసే ప్రయత్నం చేసారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో, ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో ఇంకా బెట్టుచేస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించి, తప్పనిసరి పరిస్థితుల్లో తన ఎంపి పదవికి, సమన్వయ కమిటీకి, పార్లమెంటు స్టాండింగ్ కమిటీలకు చేసిన రాజీనామాలన్నిటినీ ఉపసంహరించుకొంటున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ సందర్భం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోయాయని ఆవేదన కూడా వ్యక్తం చేయడం విశేషం. ఈ రోజు ఆయనకు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం కల్పించిన కాంగ్రెస్ పార్టీనే తనకు కేంద్రమంత్రి పదవి ఈయలేదని అల్లరి పెట్టాలని చూసిన ఆయన ఇప్పుడు రాజకీయాలలో నైతిక విలువల గురించి మాట్లాడటం విడ్డూరం. స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రిగారు తన హయంలో జరిగిన ఒక రైలు ప్రమాదానికి నైతిక బాధ్యతవహిస్తూ రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ కాలంలో అటువంటి నేతలు, నైతిక విలువలు లేవని కావూరి వాపోవడం మరో విశేషం. ఇటువంటి ఉదాహరణలు పేర్కొంటూ, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతూ ఆయన తన స్వంతపార్టీనే ఇబ్బంది పెడుతూనే అదే నోటితోనే నైతిక విలువల గురించి వాపోవడం ఆయన ద్వంద వైఖరికి అద్దం పడుతోంది. తనకి కోరిన వెంటనే కోరిన పదవి ఇచ్చి ఉంటే, బహుశః ఈ నైతిక విలువల గోల ఉండేది కాదేమో!
బహుశః ఇటువంటి నేతల వైఖరితో విసుగెత్తిపోయినందునే రాహుల్ గాంధీ ఇటువంటి వారిని వదిలించుకొనే ప్రయత్నంలో యువమంత్రం పటిస్తున్నారనుకోవచ్చును. కానీ, దానికి ఇటువంటి నేతల దగ్గర ఒక విరుగుడు మంత్రం ఉంటుంది. తమ స్థానంలో తమ కొడుకులను లేదా కుటుంబములో సభ్యులను ప్రతిష్టించడమే ఆ మంత్రం.