ఎస్సీ, ఎస్టీ లకు ముఖ్యమంత్రి వరాల జల్లు
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీలపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలలో 50 యూనిట్లు కంటే తక్కువ విద్యుత్ వాడుకునే గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇస్తామని, ఈ రుసుమును ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికల వ్యయం నుంచి ఖర్చు చేస్తామని, ఎస్సీ, ఎస్టీల కాలనీలలోని వారు బకాయిపడిన 268 కోట్ల రూపాయలను మాఫీ చేస్తున్నట్లు, ఇందిరమ్మ గృహ రుణం ఎస్సీలకు లక్ష రూపాయలు, ఎస్టీలకు 1.05 లక్షల రూపాయలు చెల్లిస్తామని వివరించారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ కాలనీలలో 50 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులు ఏడాదికి 110 కోట్ల రూపాయలు వస్తున్నాయి, వారు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇకపై వారు బిల్లులు చెల్లించకుండా చర్యలు తీసుకున్నామని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తూ ఎస్సీ, ఎస్టీ నిధుల్ని వారికే చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారని, ఆమె ఆదేశాల్లో భాగంగానే దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ నిధుల్ని వారికీ మాత్రమే కేటాయించేలా చట్టం తీసుకువచ్చామని, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక బాబూ జగ్జీవన్ రాం జయంతి రోజున ప్రారంభిస్తామని, అంబేద్కర్ జయంతి ఏప్రిల్14 వరకు కొనసాగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు.