రెండో రోజుకు చేరిన చంద్రబాబు ఢిల్లీ దీక్ష

      రాష్ట్రవిభజనపై కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ డిల్లీలో చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. చంద్రబాబు మాట్లుడుతూ..రాజకీయాలు చేయడానికి తాను నిరవధిక దీక్ష చేపట్టలేదని స్పష్టం చేశారు. తెలుగువారి కోసం దీక్ష చేయాలంటే తాను ఇటలీ మహిళ పరిమిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు.   రాష్ట్రంలో పరిస్థితులను వివరించి వాటిని సరిద్దిద్దామని రాష్ట్రపతిని కోరినా ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు సిద్దపడుతున్న కేంద్రం, సీమాంధ్ర ప్రజల ఆందోళన పట్ల కనీస స్పందన చూపకపోవడం వలనే నేడు రాష్ట్రంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయని తెలిపారు.     కోట్లాది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయకోణం నుండే పరిష్కరించాలని ప్రయత్నించుతున్నందున, అది తెలుగు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్, షిండే వంటి కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు పొంతన లేని విధంగా మాట్లాడుతూ ఇరు ప్రాంతాల ప్రజలని ఎందుకు రెచ్చగొడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

2011 గ్రూప్-1 మళ్ళీ నిర్వహించండి: సుప్రీంకోర్టు

      ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) 2011లో జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోసారి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని, ఇంటర్వ్యూలు జరపాలని కమిషన్ ను న్యాయస్థానం ఆదేశించింది. ప్రిలిమ్స్ పరీక్ష అనంతరం ఏపీపీఎస్సీ ప్రకటించిన కీలో ఆరు ప్రశ్నలు తప్పుగా ఉన్నట్లు పరీక్షకు హాజరైన అభ్యర్థులు గుర్తించారు. వాటిని తొలగించి ఉత్తీర్ణతను నిర్ధారించాలని, ఆ మేరకు మెరిట్ లిస్ట్‌ను సవరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.       ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీని నియమించాలని ఈ ఏడాది జనవరి 4న ఏపీపీఎస్సీని ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే, ఏపీపీఎస్సీనే తప్పు చేసిందని, మళ్లీ వారిచేతే నిపుణుల కమిటీ వేయించడం సరికాదంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఈ అంశాన్ని యూపీపీఎస్సీకి సిఫార్సు చేస్తూ జూలైలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

రాజకీయ భవిష్యత్తు కోసమే చిరు రిజైన్!

      కేంద్రమంత్రి చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసినట్లుగా లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీమాంద్రలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి ఆయన కూడా రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే ఇప్పటికయినా రాజీనామాలు చేయకపోతే తాను ప్రజలలోకి వెళ్ళలేనని అందుకనే రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు.   చిరంజీవి ఇంట్లో మంత్రుల భేటి తరువాత మీడియా తో మాట్లాడుతూ..రాజీనామాలను ఆమోదిస్తే తప్ప ప్రజల్లోకి వెళ్లలేమని ప్రధానికి చెప్పామని, వాటిని ఆమోదించాలని ఒత్తిడి చేశామని చిరంజీవి అన్నారు. రాజీనామాలను ఆమోదించిన తర్వాతే కేంద్రం, అధిష్ఠానం ఇచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని, ప్రజల వాణిని వినిపిస్తామని షిండేకు చెప్పామన్నారు. అంటే రాజీనామాలు ఆమోదించిన తర్వాత కొత్త బాధ్యతలు ఇస్తారని చిరంజీవి అనుకుంటున్నారా? లేక మరేదైనా ఉద్దేశం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.     ఇదంతా గమనిస్తే మంత్రులు కేవలం ఏపీ యన్జీవోల ఒత్తిడి కారణంగానే ఇప్పుడు రాజీనామాలు చేసి తమ రాజకీయ జీవితాన్నికాపాడుకొనేందుకే ప్రయత్నిస్తున్నారు తప్ప నిజంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే చిత్తశుద్దితో లేదా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తోనో కాదని స్పష్టం అవుతోంది.

వాటీస్ దిస్ నాన్సెన్స్?

  మమ్మీ..మమ్మీ వాళ్ళు నన్ను మళ్ళీ నాన్సెన్స్ అనమంటునారు...   ఎవరురా?   అదే సీమంద్రా వాళ్ళు మమ్మీ   మళ్ళీ దేనికిరా?   అదే మమ్మీ మొన్న మన్మోహన్ అంకుల్ వాళ్ళు ఏదో టీ-నోట్ పాస్ చేసారట కదా! దానిని కూడా ఓసారి నాన్సెన్స్ అనమని సీమంద్రా వాళ్ళు ఒకటే బ్రతిమాలుతున్నారు మమ్మీ. పోనీ ఓసారి దాన్నికూడా నాన్సెన్స్ అనేయమంటావా? వాళ్ళు కూడా మనల్నిమెచ్చుకొంటారు...   మొన్నే కదరా మనవాళ్ళు చేసిన ఆర్డినెన్స్ ని నువ్వు నాన్సెన్స్ అని మన పరువు తీసావు...ఇంకా మన పరువేమయినా మిగిలుంటే దానిని కూడా తీసేద్దామనా? నాన్సెన్స్...మళ్ళీ నాన్సెన్స్ అన్నావంటే ఈ సారి ఊరుకొనేది లేదు..జాగ్రత్త!   నాన్సెన్స్! మన వాళ్ళు అందరూ నన్ను తెగ మెచ్చుకొంటుంటే నువొక్కదానివే ఇలా అంటున్నావు మమ్మీ. రియల్లీ ఇటీజ్ నాన్సెన్స్ మమ్మీ.   అవునురా నాన్సేన్సే... మనవాళ్ళు నేను చెప్పినట్లు నీకు చెక్కభజన భజన చేసారు గాబట్టి బ్రతికిపోయావు లేకుంటే ఆ మోడీ అంకుల్ చేతిలో నీ పనయిపోయేది తెలుసా? నువ్వు గొప్ప అవినీతి వ్యతిరేఖివని అందుకే నాన్సెన్స్ అనగలిగావని మనవాళ్ళు నిన్ను వెనకేసుకు వచ్చేసరికి వాళ్ళ తల ప్రాణం తోక్కి వచ్చింది తెలుసా? నీ నాన్సెన్స్ వల్ల పాపం మన్మోహన్ అంకుల్ ఎంత బాధ పడ్డారో తెలుసా? ఆయనని సముదాయించలేక చచ్చేను తెలుసా? నువ్వీసారి నాన్సెన్స్ అంటే నేనా టీ-నోట్ వెనక్కి తీసుకోమని చెప్పలేను కూడా.   పోనీ సీమంధ్ర ఉద్యమాన్ని నాన్సెన్స్ అనమంటావా మమ్మీ? కేసీఆర్ అంకుల్ మనల్ని బాగా మెచ్చుకొంటారు కదా...?   అప్పుడు గానీ మనకి బుద్ది రాదు. ఆ మాటన్నావంటే వాళ్ళు మనల్ని, మన పార్టీని మళ్ళీ ఆ రాష్ట్రంలో కాళ్ళు కూడా పెట్టనీయరు.. గుర్తుంచుకో...   నేను అనకపోయినా సీమంద్రా వాళ్ళు ఈ సారి కాంగ్రెస్ వాళ్ళని కాలుపెట్టనీయరని మన లగడపాటి, దివాకర్ అంకుల్స్ అందరూ చెపుతున్నారు కదా?   నాన్సెన్స్! వాళ్ళు అలా అంటున్నారనే నేను వేరే ఏర్పాటు చేసాను. మనకేమి డోకా లేదక్కడ.. నువ్వు మాత్రం ఇంక ఎవరు వచ్చి ఎంత బ్రతిమాలినా నాన్సెన్స్ అని మాత్రం అనకు.. గుర్తుంచుకో...   నువెప్పుడు ఇంతే మమ్మీ..నన్నేమి మాట్లాడొద్దంటావు. నేనేమి మాట్లాడినా నాన్సెన్స్ అని తీసి పారేస్తావు! నాన్సెన్స్!   నిన్ను మాట్లాడనీయకపోవడం ఏమిటి? నువ్వు దేశం..సుపరిపాలన..అధికార వికేంద్రీకరణ...అభివృద్ధి...ప్రజలు..త్యాగాలు...అంటూ మాట్లాడినప్పుడు మన వాళ్ళందరిచేతా నీకు ఎవరు చెక్క భజన చేయించారనుకొన్నావు? నువ్వు అలాంటి టాపిక్ ఎంతసేపయినా మాట్లాడుకో నాకేమి అభ్యంతరం లేదు. కానీ నీ ఉపన్యాసంలో ఎక్కడా నాన్సెన్స్ అనే పదం మాత్రం వాడకూడదు. గుర్తుంచుకో...   అలాగే మమ్మీ! కానీ ప్రజలు మాత్రం నా ఉపన్యాసాలు ఎంత కాలం వింటారు? ఏదో ఒకరోజు వాళ్ళు కూడా నాన్సెన్స్ అంటారేమో మమ్మీ?   మరేం పర్వలేదురా..మనకీ చెక్కభజన బృందం ఉన్నంత కాలం నువ్వు ప్రజలేమనుకొంటారోనని ఆలోచించనవసరం లేదు.   థాంక్స్ మమ్మీ మన వాళ్ళని ఇంత బాగా ట్రయిన్ చేసినందుకు...యువ్వార్ రియల్లీ గ్రేట్ మమ్మీ!   అద్సరే గానీ.. మరో విషయం బాగా జ్ఞాపకం ఉంచుకో..మనం దేశం కోసం ప్రజలని త్యాగాలు చేయమని చెపుతుండాలి గానీ, మనం త్యాగాలు చేస్తామని నోరు జారకూడదు..నువ్వు ఇవ్వాళ్ళ కాకపోతే రేపయినా ఆపెద్ద కుర్చీలో కూర్చొంటే, మన వాళ్ళు అందరూ నీ ఎదురుగా చేతులు కట్టుకొని నీకు భజన చేస్తుంటే చూసి ఆనందించాలని ఈ తల్లి మనసు ఆరాటపడుతోంది...అందుకే నాకా కుర్చీ వద్దని మాత్రం ఎప్పుడు ఎక్కడా నోరు జారకు గుర్తుంచుకో...   ఒకే గాటిట్ మమ్మీ.   ఈ రోజు కాలేజీ పిల్లలకి దేశసేవ గురించి లెక్చర్ ప్రోగ్రాం ఒకటుంది. ఎనీ అబ్జక్షన్స్?   నో..నాటెటాల్ మై సన్ క్యారీ ఆన్...పనిలో పనిగా ఆ పక్కనే ఉన్నఎలిమెంటరీ స్కూలు పిల్లలకి కూడా నాలుగు మంచి ముక్కలు చెప్పిరా...   ష్యూర్ మమ్మీ..ఒకే.. సీయూ బై...

చంద్రబాబు దీక్షతో కాంగ్రెస్ పార్టీకి ఇరకాటం

  రాష్ట్రవిభజనపై కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ డిల్లీలో ఆంధ్ర భవన్ వద్ద నిన్నటి నుండి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన చంద్రబాబు నాయుడు ఊహించినట్లే కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టడం ద్వారా ఇంతకాలంగా రాష్ట్ర విభజనపై సీమంధ్రలో జరుగుతున్నఉద్యమాలను అంతగా పట్టించుకోని జాతీయ మీడియా దృష్టికి కూడా తేగలిగారు. ఈ సందర్భంగా ఆయన లేవనెత్తిన ప్రశ్నలు చాలా ఆలోచింప జేస్తున్నాయి.   రాష్ట్రంలో పరిస్థితులను వివరించి వాటిని సరిద్దిద్దామని రాష్ట్రపతిని కోరినా ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు సిద్దపడుతున్న కేంద్రం, సీమాంధ్ర ప్రజల ఆందోళన పట్ల కనీస స్పందన చూపకపోవడం వలననే నేడు రాష్ట్రంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు సంబందించిన ఈ అంశంపై వారికి సరయిన వివరణ ఈయకపోగా కేంద్రం ఎందుకు అంత రహస్యంగా టీ-నోట్ ను ఆమోదించవలసి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఈవిషయంలో తన రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోంది గనుకనే దానిని ఈవిధంగా దొంగచాటుగా ఆమోదించవలసి వచ్చిందని, లేకుంటే అదేవిషయం ముందుగానే మీడియాకు తెలియజేసి మరీ ఆమోదించి ఉండేదని ఆయన ఆరోపించారు.   కోట్లాది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయకోణం నుండే పరిష్కరించాలని ప్రయత్నించుతున్నందున, అది తెలుగు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్, షిండే వంటి కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు పొంతన లేని విధంగా మాట్లాడుతూ ఇరు ప్రాంతాల ప్రజలని ఎందుకు రెచ్చగొడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఈవిధంగా తెలుగు ప్రజల జీవితాలతో ఆడుకొనే హక్కు మీకెవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.   కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి కోసం తన పార్టీని నేతల రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెడుతున్నట్లు ఆ పార్టీకి చెందిన నేతలే చెపుతున్న మాటలను మీడియాకు వివరించి, తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బ తీయడం కోసం, కాంగ్రెస్ పార్టీ తన స్వంత పార్టీని, నేతలను కూడా బలిచేసుకోవడానికి సిద్దపడుతోందని ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని హేళన చేసారు.   చంద్రబాబు నాయుడు డిల్లీలో నిరాహార దీక్షకు దిగుతున్నపుడు కాంగ్రెస్ అధిష్టానం దానిని చాలా తేలికగా తీసిపడేసేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన మొదటిరోజే జాతీయ మీడియా ముందు ఈవిధమయిన ప్రశ్నలు లేవనెత్తడంతో కాంగ్రెస్ అధిష్టానం చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోబోతోంది.

కిరణ్ కూడా రాష్ట్ర విభజనకు సిద్దపడినట్లేనా

  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ఉద్యోగుల చేత సమ్మెవిరమింపజేసే బాధ్యత ముఖ్యమంత్రిదేనని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పిన మరునాడే కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ మరో మారు మీడియా ముందు తన సమైక్య రాగం ఆలపించారు.   రాష్ట్ర విభజన వల్ల కలిగే సమస్యలను చర్చించకుండా కేంద్రం హడావుడిగా విభజన చేయడం వల్ల మరికొన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని, ఇప్పటికయినా ప్రజల ఆందోళనలు గమనించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన అధిష్టాన్నాన్నికోరారు. ముఖ్యమంత్రే స్వయంగా వెనుక నుండి ఉద్యోగుల సమ్మెను ప్రోత్సహిస్తున్నరనే ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. వారు తమ జీతాలను కోల్పోతున్నాపట్టుదలగా ఉద్యమం చేస్తున్నారని మెచ్చుకొన్నారు. ప్రజల సమస్యలను దృష్టిలోఉంచుకొని ఇకనయినా ఉద్యోగులు సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.   టీ-నోట్ ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రకటన వెలువడిన తరువాత ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందిస్తారని అందరూ భావించారు. కానీ ఈసారి కిరణ్ కుమార్ రెడ్డి కొంచెం మృదువుగా మాట్లాడటం విశేషం. బహుశః ఇక తను కూడా రాష్ట్ర విభజన ఆపలేనని గ్రహించినందునే ఆయన కొంచెం వెనక్కి తగ్గినట్లున్నారు. అదేవిధంగా ఇంతవరకు చాలా గట్టిగా సమైక్యవాదం వినిపించిన అనేకమంది మంత్రులు, శాసన సభ్యులు కూడా పూర్తిగా చల్లబడిపోయినట్లే ఉన్నారు. ఇక పరిస్థితి అంతా చల్లబడేవరకు కేంద్ర మంత్రులు,యంపీలు తమ రాజీనామా డ్రామాలు కొనసాగిస్తూనే ఉంటారని వేరే చెప్పనవసరం లేదు.   ఇక మిగిలింది ఉద్యోగులు. వారిని మానసికంగా దెబ్బ తీసి వారి ఉద్యమంలో చీలికలు తెచ్చేందుకు ఇప్పటికే చాలామంది మంత్రులు, ప్రజాప్రతినిధులు తమకు తెలిసిన అన్ని విద్యలు ప్రదర్శిస్తున్నారు. ఒకసారి ఉద్యోగులు వెనక్కి తగ్గినట్లయితే ఇక రాష్ట్ర విభజన ప్రక్రియలో అందరూ తలో చేయివేసి త్వరగా పనికానిచ్చేయడం ఖాయం. ఎందుకంటే ఆ తరువాత రాజధాని నిర్మాణం కోసం బోలెడు కాంట్రాక్టు పనులుంటాయి మరి.

నిమ్మగడ్డకు బెయిల్ మంజూరు

      ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కు బెయిల్ లబించింది. నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలకు నాంపల్లిలోని సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈమేరకు ఇవాళ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇద్దరుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంతకాలం సిబిఐ వీరి బెయిల్ పిటిషన్ లను వ్యతిరేకిస్తూ వచ్చింది. ఇప్పుడు దర్యాప్తు పూర్తి అయినందున కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు జగన్ కు సన్నిహితుడిగా పేరుపడి జగన్ కోసమే 20 నెలలుగా జైలులో ఉన్నట్లు పేరుపడ్డ నిందితుడు సునీల్ రెడ్డి ఎట్టకేలకు బెయిల్ మీద ఈ రోజు చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యాడు. రూ.2 లక్షల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిలు మంజూరయింది.

జీవితా రాజశేఖర్‌పై అరెస్ట్‌ వారెంట్‌

  సినిమాలతో పాటు రాజకీయభవిష్యత్తు కూడా సరిగా లేని జీవితా రాజశేఖర్‌కు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా తన సినిమా కోసం ఓ రిటైర్డ్‌ ఇంజనీర్‌ దగ్గర అప్పు తీసుకొని అతని చెల్లని చెక్కు ఇచ్చిన నేరానికి జీవితా రాజశేఖర్‌ పై అరెస్ట్‌ వారెంట్‌ ఇష్యూ అయింది.   చిత్ర నిర్మాణం కోసం ఓ రిటైర్డ్ ఇంజినీర్ పరంధామ రెడ్డి వద్ద 36 లక్షల రూపాయలు తీసుకున్నారని.. అప్పు తీర్చడానికి జీవితా రాజశేఖర్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత రెండు సార్లుగా జీవితా రాజశేఖర్‌ విచారణకు హాజరు కాకపోవటంతో కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. అక్టోబర్ 29 తేదిలోగా జీవితా రాజశేఖర్ ను కోర్టులో హాజరుపర్చాలని జూబ్లీహిల్స్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

అధిష్టానం మూగ, చెవిటి, గుడ్డిది : జేసి

  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వైఖరిని ఆపార్టీ సీనియర్‌ నాయకుడు జెసి దివాకర్‌రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్‌ అధిష్టానం మూగ, చెవిటి, గుడ్డిదానిలా వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. అందువల్లే అధిష్టానం మొండిగా వ్యవహరిస్తుందని, ఇప్పటికే సీమాంద్ర ప్రాంతంలో ఆ పార్టీ పూర్తిగా చచ్చిపోయిందని ఆయన అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తనకు పార్టీ వీడాలంటే చాలా బాధగా ఉందని కానీ అధిష్టానం మాత్రం పార్టీలో కొనసాగే పరిస్థితి కల్పించటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తప్పని సరి పరిస్థితిల్లో కాంగ్రెస్‌ పార్టీని వీడినా మరే ఇతర పార్టీలో చేరనని తేల్చి చెప్పారు.

దీక్ష నుంచి జగన్ మాయం..!

      వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష సోమవారం మూడో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే జగన్ దీక్ష శిబిరంలో మొదటి రోజు ఓ ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. మొదటి రోజు శనివారం రాత్రి 11 గంటలకు దీక్షా శిబిరం వద్ద లైట్లు ఆర్పేశారు. ఆ తరువాత దీక్షా శిబిరం నుండి జగన్ లేచి వెళ్లిపోయాడు. రెండు గంటల పదిహేను నిమిషాల తరువాత ఆయన తిరిగి శిబిరంలోకి వచ్చాడు. దీనికి సంబంధించిన విజువల్స్ పలు ఛానళ్లలో వార్తలుగా రావడంతో ఆయన దీక్ష వ్యవహారం చర్చకు తెరలేపింది. ఆయన ఇంటికి వెళ్లలేదని, పక్కనే ఉన్న బస్సులోకి వెళ్లి స్నానం చేసి వచ్చాడని పార్టీ నేతలు చెబుతున్నా ఏకంగా రెండు గంటలకు పైగా దీక్షా శిబిరం విడిచిపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.

జగన్, బాబులపై ట్విట్టర్ లో డిగ్గీ

      సీమాంధ్ర అభివృద్ధికి ప్యాకేజీ ఇస్తామని, సీమాంధ్ర ప్రజలకు హైదరాబాద్‌లో విద్యా, వైద్య అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సీమాంధ్రలో ఏపీఎన్జీవోలు సమ్మె విరమించాలని కోరారు. హైదరాబాద్‌లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ పూర్తి భద్రత కల్పిస్తామని దిగ్విజయ్ సింగ్ భరోసా ఇచ్చారు. విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలకు కూడా పరిష్కారం కనుగొంటామని చెప్పారు. సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్‌లో ఉన్నా, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో... ఎక్కడ ఓటర్లుగా నమోదైతే అక్కడి పౌరులే అవుతారని, వారి హక్కులను ఎవ్వరూ కాలరాయలేరని అన్నారు. రాజకీయ లబ్ది కోసమే రాష్ట్ర విభజన అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట మార్చారని అన్నారు. తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తూ లేఖలు ఇచ్చిన టీడీపీ, వైసీపీ ఇప్పుడు తీరు మార్చుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని దిగ్విజయ్ పేర్కొన్నారు. గతంలో చేసిన హామీల నుంచి వెనక్కి పోవద్దని చంద్రబాబు, జగన్‌లకు విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీకి తెలంగాణ నోట్ తీర్మానం..!!

      తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎలాంటి షార్ట్‌కట్స్ ఉండబోవని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. విభజనపై చట్టాలు, రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. విభజనపై ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వెళుతుంది. శాసనసభలో దీనిపై చర్చ జరుగుతుందని వివరించారు.   ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి తిరిగి రాగానే ముసాయిదా బిల్లును ఆయనే అసెంబ్లీకి పంపిస్తారని చెప్పారు.విభజనపై ఏర్పాటు చేయబోయే మంత్రివర్గ బృందం సహజంగా రాష్ట్రానికి వెళ్లదని, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రతినిధుల నుంచి సలహాలు మాత్రం స్వీకరిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలో నగరంపై అధికారం గవర్నర్ లేదా కేంద్రం చేతిలో వు౦టుదని వ్యాఖ్యానించారు.   

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అనుచిత వైఖరి ఎందు కోసం

  రాష్ట్ర విభజన విషయంలో రెండు ప్రాంతాలలో ఎటు వైపు ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటే అటువైపు వారిని సముదాయించే విధంగా మాట్లాడుతున్నకాంగ్రెస్ అధిష్టానం, తనకి ఒక నిర్దిష్టమయిన ఆలోచన కానీ, స్పష్టమయిన వైఖరి గానీ లేదని నిన్న దిగ్విజయ్ సింగ్ చేసిన తాజా ప్రకటన స్పష్టం చేస్తోంది.   హైదరాబాద్ తెలంగాణాలో అంతర్భాగంగానే ఉంటుందని దానిపై సర్వ హక్కులు తెలంగాణాకే ఉంటాయని ఖరాఖండిగా చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం, టీ-నోట్ పై క్యాబినెట్ ప్రకటన వెలువడిన తరువాత సీమంద్రాలో సమైక్యఉద్యమం హింసాత్మకంగా మారడం చూసి, ఇప్పుడు మాటా మార్చి హైదరాబాద్ పై అధికారాలు కేంద్రం లేదా గవర్నర్ చేతిలో ఉంటాయని ప్రకటించారు. తద్వారా సీమంద్రాలో ఉద్యమాలను చల్లార్చే ప్రయత్నంలో ఇప్పుడు తెలంగాణాలో అగ్గి రాజేశారు.   ఈవిధంగా ఒకసారి సీమంద్రాలో మరొకసారి తెలంగాణాలో ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తున్నకాంగ్రెస్ పార్టీ ఈ సమస్యని పరిష్కరించలేక, ఆ తప్పును ప్రతిపక్షాలపైకి నెట్టివేసి తన భాద్యత నుండి తప్పించుకోవాలని చూస్తోంది. ఇది చూస్తే ఒక అనుభవరహితుడయిన వైద్యుడు క్లిష్టమయిన ఆపరేషన్ చేస్తున్నట్లుంది. ఆ వైద్యుని చేతిలో రోగి ప్రాణాలు కోల్పోతే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పూర్తిగా విషమించింది. అయినప్పటికీ దిగ్విజయ్ సింగ్ వంటి వారు రోజుకొక మాట మాట్లాడుతూ సమస్యను మరింత జటిలం చేస్తూనే ఉన్నారు.   సీమంద్రాలో విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మెతో రాష్ట్రంలో రైళ్ళు కూడా కదలలేని పరిస్థితి ఏర్పడింది. అనేక జిల్లాలలో పట్టణాలు, గ్రామాలు కరెంటు లేక అంధకారంలో మునిగిపోయాయి. అదేవిధంగా ఇంతవరకు ఎంతో ప్రశాంతంగా సాగుతున్న సమైక్య ఉద్యమం, కేవలం రెండు రోజుల్లో చాలా హింసాత్మకంగా మారింది. ఇంత జరుగుతున్నా తాము చేయగలిగిందేమీ లేదు, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య, ఉద్యోగులకు నచ్చజెప్పే బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిదేనని దిగ్విజయ్ సింగ్ ప్రకటించి చేతులు దులుపుకోవడం రాష్ట్ర ప్రజల పట్ల, నేతల పట్ల కాంగ్రెస్ అధిష్టానానికి ఎంత చులకన భావం ఉందో తెలియజేస్తోంది.   అదే కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో ఇటువంటి పరిస్థితి తలెత్తితే కాంగ్రెస్ అధిష్టానం ఆఘమేఘాల మీద కదిలి అక్కడి ప్రభుత్వాన్నికూల్చే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకి ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో ముజఫర్ నగర్ లో మత ఘర్షణలు చెలరేగినప్పుడు, ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు హుటాహుటిన అక్కడికి తరలి వెళ్లి, భాదితులను పరామర్శించి సమాజ్ వాదీ ప్రభుత్వం వారికి సాయపడకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీలు గుప్పించి వచ్చారు.   కానీ గత రెండు నెలలుగా రాష్ట్రం అతలకుతలమవుతున్నా కనీసం కంటి తుడుపు చర్యగా వేసిన అంటోనీ కమిటీ సభ్యులు కూడా రాష్ట్రంలో పర్యటించాలని ఎన్నడూ అనుకోలేదు. రాష్ట్రంలో పరిస్థితులను కిరణ్ కుమార్ రెడ్డి (ఉద్దేశ్యపూర్వకంగానే) అదుపుచేయలేకపోతున్నట్లు భావిస్తున్నప్పుడు, మరి కేంద్రం ఎందుకు చొరవ తీసుకోవడం లేదు? ఇప్పటికీ అతనిదే భాద్యత అని చెప్పడం వెనుక కాంగ్రెస్ ఉద్దేశ్యం ఏమిటి?   కాంగ్రెస్ అధిష్టానం ప్రతిస్పందిస్తున్న తీరు చూస్తే తన స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం అది ఉద్దేశ్యపూర్వకంగానే ఈవిధంగా ప్రవర్తిస్తోందని అర్ధం అవుతోంది.

సియం కూర్చీపై నాలుగో కృష్ణుడు..?

  తెలంగాణ ఏర్పాటు ప్రకటన కొరివితో తలగొక్కున్న కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పుడు నష్టనివారణ చర్యల్లో పడినట్టుగా సమాచారం.. ఇన్నాళ్లు ఎట్టి పరిస్థితుల్లో సియం ను మార్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పిన కేంద్ర ఇప్పుడు కిరణ్‌కుమార్‌ రెడ్డిని సాగనంపడానికి సిద్దమవుతుందట.   అందులో భాగంగానే సియం పీఠం మీద కన్నేసిన ఓ కాంగ్రెస్‌ నాయకుడు, ప్రస్థుతం జరుగుతున్న సీమాంద్ర ఉద్యమాన్ని తెగవాడేసుకుంటున్నాడని కాంగ్రెస్‌ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఇన్నాళ్లు రాష్ట్ర కాంగ్రెస్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏళిన ఏ సామాజిక వర్గం సొంత కుంపటి పెట్టేసుకోవటంతో ఇక రాష్ట్ర కాంగ్రెస్‌కు తామే పెద్ద దిక్కు కావాలని భావిస్తున్నాడట సదరు నేత.   అందులో భాగంగానే తన ఆస్తులను తానే పగలగొట్టేసుకొని, తగలబెట్టేసుకొని అధిష్టానం మెప్పుపొందటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడట. అంతే కదా మరి చీమ కూడా చొరబడలేని దొరవారి కోటలో ఆయన ఆస్తుల మీద చేయి వేసే ధైర్యం సామాన్యులకి ఎక్కడి నుంచి వస్తుంది, రాళ్లేది ఆయనే, వేయించుకునేది ఆయనే, నవ్వేది ఆయనే, ఏడ్చేదీ ఆయనే అనుకుంటున్నారు అంతా.   తెలంగాణ సమస్య తొలినుంచే అధిష్టానం మాటకు జీహుజూర్‌ అంటూ వచ్చిన సదరు నేత రాష్ట్ర విభజన తరువాత కాస్త అటు ఇటుగా మాట్లాడినా అధిష్టానానికి మాత్రం ఎదురు మాట్లాడలేదు. అందుకే అమ్మ ముందు చూపించిన విధేయతతో పాటు ఆస్తులు నష్టపోయాడనే సింపతీతో సియం సీటుకు టెండర్‌ వేశాడా నాయకుడు.. మరి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నట్టుగా కాంగ్రెస్‌ పార్టీ సియంను మారుస్తుందా.. ఏమో అది కాంగ్రెస్‌ పార్టీ అందులో ఏం జరిగే అవకాశమైనా ఉంది.

రాజీనామాలపై పళ్లం రాజు, కోట్ల యూటర్న్!

        కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సీమాంధ్ర నేత పల్లంరాజు తన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గారు. అన్ని పార్టీల అభిప్రాయం మేరకే విభజన నిర్ణయం తీసుకున్నామని, రాజీనామాను పక్కనబెట్టి సీమాంధ్ర ప్రయోజనాలు నెరవేర్చేందుకు మంత్రి వర్గ ఉపసంఘంలో ఉండాల్సిందిగా సోనియాగాంధీ సూచించడం తో ఆయన మెత్త బడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇతనితో పాటు మరో కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ని సోనియా సముదాయిండంతో ఆయన కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.     సీమాంధ్రలో ఉద్యమం గురించి పల్లం రాజు చెప్పింది విన్న సోనియా ముందు మద్దతు ఇచ్చిన పార్టీలు వెనక్కి తగ్గితే ఏం చేస్తామని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మంత్రుల కమిటీలో పని చేసి సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను తెలియపరచాలని సూచించినట్టు చెబుతున్నారు. సోనియాతో చర్చల నేపథ్యంలో పల్లం రాజు రాజీనామా ఆగిపోయినట్లే. ఇక మరో మంత్రి పనబాక లక్ష్మి రాజీనామా చేసే ముచ్చటే లేదని తెగేసి చెప్పారు. తాను విభజనకు అనుకూలం అని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు.

వెనకడుగే లేదు : అశోక్‌బాబు

  సీమాంద్రలో నిరసనలతో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా, ఉద్యోగులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదని ప్రకటించారు. ఈ నెల 20 తేది వరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈ మేరకు ఏపిఎన్జీవొ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఆదివారం మీడియాకు వివరించారు.   సోమవారం ప్రభుత్వంతో జరగనున్న చర్చలకు తాము వెళ్లటం లేదని ప్రకటించారు. ఇక కింది స్థాయి వారితో చర్చలతో ఉపయోగం లేదన్న ఆయన ముఖ్యమంత్రి స్థాయి వారితో మాత్రమే చర్చలు వెలతామని స్పష్టం చేశారు. సమైక్యాంధ్రా కోసం విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా దసరా పండుగను జరుపుకోమని అశోక్‌బాబు తెలిపారు.   20వ తారీఖు వరకు ప్రకటించిన కార్యచరణలో భాగంగా 8,9 తేదీల్లో బ్యాంకులు మూసివేత, 10 నుంచి 12వ తేదీ వరకు హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశాలు. 15న 13 జిల్లాల్లోని మండల స్థాయిలో అన్ని మండలాల్లో రైతుల కోసం ప్రత్యేక సదస్సులు. 17 నుంచి 19 వరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధం చేస్తామని చెప్పారు. అయితే 13, 14తేదిలతో పాటు, 16 తేదిన పండుగల సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు ఉండవని ప్రకటించారు.

విజయనగరంలో కర్ప్యూ కొనసాగింపు

      విజయనగరం జిల్లాలో కర్ప్యూ కొనసాగుతోంది. పట్టణంలో కనిపిస్తే కాల్చివేత వుత్తర్వులు ఇచ్చినట్లు పోలీస్ జిల్లా అదికారి కార్తికేయన్ చెప్పారు. జిల్లాలో ఆందోళనల నేపథ్యంలో కర్ప్యూ విధించిన ఆదివారం మధాహ్నం మళ్లీ ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద కొందరు ఆందోళనకారులు నిప్పు బంతులతో పోలీసుల పైకి దాడి చేసి తరిమేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలలో సిఆర్పీఎఫ్, బిఎస్ఎఫ్, బిఐఎస్ఎఫ్ పోలీసుల బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఆందోళనలు అదుపులోకి రావడం లేదు.     విజయనగరం జిల్లాకే పది కంపెనీల పారామిలటరీ దళాలను పంపించనున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. బొత్స విభజనకు అనుకూలంగా ఉన్నారనే ఆగ్రహంతో ఉన్న సమైక్యవాదులు ఆయన ఆస్తుల ధ్వంసమే లక్ష్యంగా వెళ్తున్నారు. గాజులరేగలో పోలీసులు నిరసనకారుల పైకి రబ్బర్ బుల్లెట్లు  ప్రయోగించారు.

జగన్ తో మ్యాచ్ ఫిక్సింగ్: ఆనం

      వైకాపా కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై విడుదల కావడం.. కాంగ్రెస్ తో అవగాహన మేరకే జరిగిందని విస్తృత ప్రచారం జరుగుతున్న సమయంలో స్వయంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ ఎమ్మెల్యే ఈ రకమైన ఆరోపణలు చేసి సంచలనం రేపారు. ఆ నాయకుడు మరెవరో కాదు.. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి. కాంగ్రెస్ కు, జగన్ కు మధ్య ఒప్పందం జరిగినట్లుగా అనుమానాలు కలుగుతున్నాయని ఆనం అన్నారు. వీరి మ్యాచ్ ఫిక్సింగ్ పై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పైన కూడా ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన డిగ్గీ రాజా కాదని బ్లడీ రాజా అని ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్‌లో లాగే ఆంధ్రప్రదేశ్‌లోను కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా చేయాలని దిగ్విజయ్ కుట్ర పన్నుతున్నారని ఆనం ఆరోపించారు.