chandrababu

అత్యాశకు పోయినందుకే జగన్ జైలుకు

  చంద్రబాబు పాదయాత్ర ముగింపు దశకు చేరుకొనే సమయానికి ఆయన గ్రామీణ ప్రజలతో ఏవిధంగా అనుసంధానం అవ్వాలోఇప్పుడు బాగా నేర్చుకొన్నట్లు కనిపిస్తున్నారు. ఆయన ఇప్పుడు గ్రామీణులకు సులువుగా అర్ధం అయ్యేందుకు తన ప్రసంగాలలో పిట్టకధలను జోడిస్తూ తను చెప్పదలుచుకొన్నది వారి మనసులలో నాటుకొనేలా చెపుతున్నారు. నిన్న మండపేట వద్ద గల ఏడిద గ్రామంలో జగన్ మోహన్ రెడ్డి గురించి వివరిస్తూ ఆయన చెప్పిన చిన్నపిట్ట కధ గ్రామస్తులను బాగా ఆకట్టుకోంది. దురాశాపరుడయిన వ్యక్తి ఒకడు రాజుగారి వద్దకు వచ్చి తనకు కొంత భూమి ఇప్పించమని అడిగితే, అతని సంగతి కనిపెట్టిన రాజుగారు ఆ రోజు మొత్తం అతను ఎంత దూరం నడిస్తే అంత మేరా అతనికే ఇచ్చేస్తానని చెప్పడంతో, అత్యాశకు పోయినా ఆ వ్యక్తి ఆయాసపడుతూ రోజంతా తిరిగి తిరిగి చివరకి గుండె ఆగి చనిపోయాడు. అప్పుడు ఆ రాజుగారు తన భటులను పిలిచి అతనికి ఇప్పుడు కేవలం 6 అడుగుల స్థలం చాలు గనుక, అతనిని 6అడుగుల గోతిలో కప్పెట్టమని ఆజ్ఞాపించారు. ఈ కధ అంతా చెప్పి జగన్ కూడా ఆ వ్యక్తిలాగే అత్యాశకు పోయినందుకు ఇప్పుడు అతనికి చిన్న జైలు గదే మిగిలిందని చెప్పడంతో ప్రజలు నవ్వాపుకోలేక పోయారు.

Sudheer Reddy Devireddy

ఎమ్మేల్యే దేవిరెడ్డి మనసులో మాట

        ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మేల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిచాలని కోరగా కాంగ్రెస్ పెద్దలు చెప్పినా ఆ పనిమాత్రం చేయనని అంటూ తన మనసులోని ఆలోచనను బయటపెట్టారు. నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలి అనుకుంటే నన్ను ఆపేవారు ఎవరూ లేరు. నేను అందరికీ చెప్పిన తరువాతనే ఆ పార్టీలోకి వెళతాను. రాత్రికిరాత్రే పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తారా ? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ? అన్న ప్రశ్నకు నేను ఎక్కడ పోటీ చేసినా ఎలాంటి ఇబ్బందిలేదు. నేనేంటో అందరికీ తెలుసు అని అన్నారు.

Precautions For Holi

హోలీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  హోలీ వస్తుందంటే పిల్లలలో చెప్పలేని ఆనందం. హోలీ రోజుల రంగు రంగుల రంగులు ఒకరిపై ఒకరు జల్లుకుంటూ, పూసుకుంటూ తెగ హడావుడి చేస్తుంటారు పిల్లలే కాదు పెద్దలు కూడా. పూర్వకాలంలో ఎండాకాలంలో వచ్చే చర్మవ్యాధులు దరిచేరకుండా ఉండేందుకు ప్రకృతిలో దొరికే మొక్కలు, పూలతో రంగులు తయారుచేసుకునేవారు. కానీ ప్రస్తుతం అంత ఖాళీ ఎవరికుంది అందుకనే బజార్లలో దొరికే రంగులతోనే ఆనందిస్తున్నారు. మార్కెట్లలో దొరికే రంగులతో కళ్ళకు వివిధ రకాల జబ్బు వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. హోలీ ఆడేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం ... * చిన్న పిల్లలలను రంగులకు దూరంగా ఉంచాలి ఒకవేళ ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు వారి దగ్గర ఉండాలి. * రసాయనాలతో తయారైన రంగులు కంట్లోకి వెళితే కార్నియా దెబ్బతిని, చూపు కోల్పోయే ప్రమాదం ఉంది, రంగుల్లోని ఆమ్లాలు, క్షారాలు వెంటనే తమ ప్రభావాన్ని చూపకపోయినా రాను రాను కంటి చూపును దెబ్బతీస్తాయి. * గులాల్ లాంటి రంగులు కంట్లోకి వెళ్ళి ఇబ్బందిని కలిగిస్తాయి. * పెట్రోలియం ఉత్పత్తులను ఉపయోగించి సునేర్ ను ముఖానికి పూసుకుంటారు. అయితే సునేర్ కంట్లోకి వెళితే కంటికి వెంటనే నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువ అందుకే సునేర్ ను వాడకపోవడమే మంచిది. * రంగులు కంట్లో పడితే వెంటనే శుభ్రమైన చల్లటి నీళ్ళతో కడగాలి. * కన్ను ఎరుపుగా మరి, మంటపుడితే వెంటనే కంటి వైద్యున్ని సంప్రదించాలి.

IAS Officer Srilakshmi Health Report Submitted

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఆరోగ్య నివేదిక

  ఈనెల 20వ తేదీన నాంపల్లి సిబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలు అధికారులు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఉస్మానియా వైద్యాధికారులను కోరింది. ఉస్మానియా వైద్యుల బోర్డు శ్రీలక్ష్మికి ఈనెల 30వ తేదీన అపాయింట్ మెంట్ ఇచ్చింది.  జైలు అధికారులు సిబీఐ కోర్టు 25లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిందని వైద్యుల బోర్డుకు తెలుపగా వైద్యాధికారుల బోర్డు సోమవారమే నివేదిక ఇచ్చేందుకు సిద్దమై శ్రీలక్ష్మి ఆరోగ్య సమస్యలను అడిగి ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య పరీక్షలు చేసి, ఆమె పరిస్థితి ఏమీ బాగోలేదని, కనీసం లేచి నిలబడే స్థితిలో కూడా లేరని, ఆమె ఎడమకాలు ఎముక జాయింట్ల వద్ద తీవ్రంగా నొప్పి ఉందని ఆ మేరకు నివేదిక సిద్ధం చేసి చంచల్ గూడ జైలు అధికారులకు అందచేసినట్లు తెలిసింది. జైలు అధికారులు శ్రీలక్ష్మి ఆరోగ్య నివేదికను సిబీఐ కోర్టుకు సాయంత్రం సమర్పించింది. ఈ అంశంలో శ్రీలక్ష్మి ఆరోగ్య నివేదిక పై మంగళవారం సిబీఐ కోర్టు తదుపరి ఆజ్ఞలు జారీ చేసే అవకాశం వుంది.

TDP Candidates Declared

అభ్యర్థులను ఖరారు చేసిన టిడిపి

  చంద్రబాబు నాయుడు పాదయాత్రలలోనే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. అన్ని పార్టీలకంటే ముందుగా తమ అభ్యర్థులను టిడిపి ఖరారు చేస్తోంది. రాజమండ్రి నుండి మురళీమోహన్ ను, అమలాపురం ఎస్సీ రిజర్వ్ సీటును గొల్లపల్లి సూర్యారావుకు, కాకినాడ సీటును పోతుల విశ్వంకు, ఏలారు సీటును మాగంటి బాబుకు, మచిలీపట్నం సీటును సిట్టింగ్ ఎంపి కొనకళ్ల నారాయణరావుకు, విజయవాడ సీటును కేశినేని నానికి, వల్లభనేని వంశీకి ముందుగా అనుకున్నట్టు గన్నవరం నుండి కాకుండా నూజివీడు అసెంబ్లీ సీటును ఖరారు చేసినట్లు తెలిసింది. అభ్యర్థులను ఖరారు చేయడమే కాకుండా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిపై ఉద్యమించాలని చంద్రబాబు పిలుపునిచ్చినట్లు తెలిసింది.

Ex-Minister Shanker Rao Meets Chief Minister

శంకర్రావ్ తో సిఎం భేటీ

  మాజీ మంత్రి శంకర్రావు గ్రీన్ ఫీల్డ్స్ వ్యవహారం, పోలీసులు తనపై చేసిన దౌర్జన్యాన్ని సోమవారం సభలో మాట్లాడేందుకు అనుమతించాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఛాంబర్ కు వెళ్లగా సభలో ఈ అంశాలు ప్రస్తావిస్తే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి వస్తుందని స్పీకర్ శంకర్రావ్ కు చెప్పినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ హుటాహుటిన స్పీకర్ ఛాంబర్ కు వచ్చి శంకర్రావు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగారు. అయితే శంకర్రావు గ్రీన్ ఫీల్డ్స్ భూముల వివాదంలో పోలీసులు తనపట్ల దురుసుగా వ్యవహరించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ వ్యవహారంపై సిఐడి విచారణ కొనసాగుతుందని వారంలోగా నివేదిక అందిన తరువాత తప్పనిసరిగా ఈ వ్యవహారంలో బాధ్యులైన వారపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సమాధానమిచ్చారని తెలిసింది. అయితే శంకర్రావు మాత్రం ససేమిరా అంటూ ఈ అంశాన్ని సభలో ప్రస్తావించడానికి అనుమతించాలని, కావలసివస్తే తనను సస్పెండ్ చేయవచ్చని, పోలీసులు తనని దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ కు తరలించే సాక్షాలు టీ.వి. ఛానల్స్ ప్రసారం చేశారు ఇంకా సిఐడి విచారణ ఎందుకు అని ముఖ్యమంత్రిని నిలదీసినట్లు తెలిసింది.

political news

లోకేష్ బస్సు యాత్రకు సాక్షి

  వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో తమకు శత్రువయిన తెలుగుదేశం పార్టీ గురించి వ్యతిరేఖ వార్తలు ప్రచురింపబడటం సహజమే. కానీ, ఈ రోజు, ఆ పత్రిక అన్ని పత్రికల కంటే ముందుగా త్వరలో లోకేష్ బస్సు యాత్ర మొదలు పెట్టబోతున్నట్లు ఒక వార్త ప్రచురించడం విశేషం. జూన్ 2వ వారం నుండి లోకేష్ బస్సు యాత్ర మొదలు పెట్టబోతున్నట్లు తెలియజేసింది. చంద్రబాబు కూడా ఇక ముందు గ్రామాల పోలిమేరవరకు బస్సులోనే ప్రయాణించి, గ్రామంలో మాత్రమే పాదయాత్ర చేయనున్నారని, వచ్చే నెల 27 తరువాత పాదయాత్రకి ముగింపు పలికి, కొద్ది రోజుల విశ్రాంతి తీసుకొన్న తరువాత ఆయన కూడా బస్సు యాత్ర చేసి మిగిలిన జిల్లాలను పర్యటిస్తారని తెలియజేసింది. చంద్రబాబు పాదయాత్ర ముగింపు గురించి ఇప్పటికే అందరికీ తెలిసినప్పటికీ, ఆయన రెండు గ్రామాల మద్యన బస్సులో ప్రయాణించడం, లోకేష్ బస్సు యాత్ర గురించి మాత్రం అందరికంటే ముందుగా సాక్షి పేపరే వివరాలు అందజేయడం విశేషం. అయితే, లోకేష్ బస్సు యాత్ర గురించి ఇంకా అధికార ప్రకటన వెలువడక మునుపే సాక్షిలో ఈ వార్త రావడం మరో విశేషం.

Samajwadi Party To Withdraw Support To UPA Government

2013లోనే ఎన్నికలు సమాజ్ వాదీ పార్టీ

  యూపీఏ పక్షంలోని భాగస్వాములు ఒక్కరొక్కరే బయటకు వెళ్ళిపోతున్నారు. వారం రోజుల క్రితం డిఎంకే యూపీఏ సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్ధతు ఉపసంహరించుకుంది. తాజాగా ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీ కూడా మద్ధతు ఉపసంహరించుకునే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 2013లోనే లోక్ సభ ఎన్నికలలు వెళ్లేందుకు సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ నిర్ణయం తీసుకున్నారని, యూపీఏ కూటమికి బయటినుంచి ఇచ్చే మద్దతును ఉపసంహరించుకోవాలని, మే రెండో వారంలో ఓటింగ్ కు వచ్చే ఆర్థిక బిల్లు ఆమోదం పొందకుండా చేస్తే చాలు అని యూపీఏ సర్కారు దానంతటదే కూలిపోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హోలీ తరువాత భారీ ర్యాలీ తలపెట్టిన ములాయం సింగ్ యాదవ్ ఆ సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

sanjay dutt

కాదేది రాజకీయలకనర్హం

  కుక్కపిల్లా, సబ్బు బిళ్ళా, అగ్గి పుల్లా కాదేది కవితకనర్హం అని మహానుభావుడు శ్రీశ్రీ ఏ ఉద్దేశ్యంతో అన్నారో గానీ, అవి శిలాక్షరాలయిపోయాయి. ఈ రోజు మన రాజకీయపార్టీలకి రాజకీయం చేయడానికి అనర్హమయినవంటూ ఏవీ లేవు. దిల్ షుక్ నగర్ బాంబు దాడులలో గాయపడిన వారు వారికి రాజకీయ పావులే, దేశ ప్రతిష్టకు సంబంధించిన ఇటలీ నావికుల కేసు రాజకీయ చదరంగం ఆడుకోవడానికి అర్హమయినదే.   అటువంటిది, ఇటీవల సుప్రీం కోర్టు బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ కు 5 ఏళ్ల జైలు శిక్ష విదిస్తూ ఇచ్చిన తీర్పు మాత్రం రాజకీయానికి ఎందుకు పనికిరాదు? కాంగ్రెస్ పార్టీ సంజయ్ దత్త్ ను క్షమించవచ్చునని వాదన మొదలు పెట్టగానే అంతవరకు మాట్లాడని బీజేపీ ముంబై దాడులలో మరణించిన వారిపై చూపని జాలి, కరుణ కేవలం సంజయ్ దత్త్ పైనే ఎందుకు చూపవలసి వస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసింది. సంజయ్ దత్త్ ని క్షమిస్తే ఇక ముందు ఇదొక సంప్రదాయంగా మారుతుందని వాదించింది. సంజయ్ దత్త్ క్షమార్హుడు కాదని గట్టిగా వాదిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీల మద్య ఈ విధంగా యుద్ధం సాగుతుంటే, మరో వైపు మహారాష్ట్రలో కూడా సంజయ్ దత్త్ కి క్షమాబిక్ష పెట్టడం గురించి అక్కడి శాసన సభలో పెద్ద యుద్ధమే జరుగుతోందిప్పుడు.   మహారాష్ట్రలో ఒకవైపు బీజేపీ, శివసేనలు సంజయ్ దత్త్ కు వ్యతిరేఖంగా వాదిస్తుంటే, శివసేన నుండి విడిపోయి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అనే వేరు కుంపటి పెట్టుకొన్నరాజ్ థాకరే శివసేనను వ్యతిరేఖించాలి గనుక కాంగ్రెస్ పార్టీతో కలిసి సంజయ్ దత్త్ కు అనుకూలంగా వాదిస్తున్నారు. ఈ రాజకీయాలు చూస్తున్న సంజయ్ దత్త్ ఇక ఈ కంపు భరించడం కంటే ఆ జైలు జీవితమే మేలని భావించి తానే స్వయంగా జైలులోకి వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు.

tdp

టీడీపీకి దూరం అవుతున్న వల్లభనేని వంశీ

  తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు కూడా కృష్ణా జిల్లా తెదేపాకు ఎప్పుడూ కంచుకోటగానే నిలుస్తోంది. నందమూరి కుటుంబానికి ఆ జిల్లాతో ఉన్న ప్రత్యేక అనుబంధం అక్కడి ప్రజలు తెదేపాను తమ స్వంత పార్టీగా భావించి ఆదరించడం ఒక కారణమయితే, నిత్య రాజకీయ చైతన్యంతో తొణికిసలాడే కృష్ణా జిల్లాలో తెదేపాకు బలమయిన నేతలు చాలామందే ఉండటం అందుకు మరో కారణమని చెప్పవచ్చును. అయితే, ఇప్పుడు ఆ రెండో కారణమే ఆ పార్టీకి ఊహించని ఇబ్బందులు తెస్తోంది.   ఒక ఒరలో రెండు కత్తులే ఇమడలేనప్పుడు అనేక కత్తులు ఎలా ఇముడుతాయి? ప్రస్తుతం కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ, కశినేని నాని, బుద్దా వెంకటేష్, నాగుల్ మీరా, ఇటీవలే పార్టీలో చేరిన దేవినేని చంద్రశేఖర్ వంటి వారే కాకుండా చాల మంది బలమయిన నాయకులున్నారు. ఒకసారి రాజకీయాలలో ప్రవేశించిన తరువాత ఎవరయినా తనకంటూ పార్టీలో, తన ప్రాంత ప్రజలలో ఒక గుర్తింపు కలిగి ఉండాలని కోరుకోవడం సహజమే. అయితే, ఇంత చిన్న పరిధిలో ఎక్కువమంది రంగంలో ఉన్నపుడు వారి మద్య పోటీ, తత్ఫలితంగా యుద్ధాలు కూడా అనివార్యమే. అయితే, అది ఒక పరిధి దాటినప్పుడు వారి మనుగడకే కాకుండా పార్టీకి కూడా నష్టం కలుగుతుంది. ఆ సంగతి అందరికీ తెలిసి ఉన్నపటికీ, ఒకరిపై మరొకరు పైచేయి సాధించుకొనే ప్రయత్నంలో యుద్ధాలు, గెలుపు ఓటములు కూడా తప్పడం లేదు.   గత దశాబ్ద కాలంగా కృష్ణా జిల్లాలో తేదేపాకు తిరుగులేని నాయకుడిగా వెలుగొందుతున్న వల్లభనేని వంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కృష్ణా జిల్లాలో తెదేపా బలపడేందుకు ఆయన చాల కృషి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దేవినేని నెహ్రు వంటి బలమయిన కాంగ్రెస్ నేతలను డ్డీ కొనడంలో వల్లభనేని చూపిన తెగువ, దైర్య సాహసాలను అందరు మెచ్చుకొన్నపటికీ, ఆయన దూకుడుతనం మాత్రం అప్పుడప్పుడు పార్టీకే కాక ఆయనకీ కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది.   అయితే, ఇటీవల కాలంలో కేశినేని నాని క్రమంగా ఆయన స్థానం ఆక్రమిస్తూ ఆయనను వెనక్కు నెట్టివేస్తున్నట్లు కనిపిస్తోంది. అది ఇటీవల చంద్రబాబు కృష్ణ జిల్లా పాదయాత్రలో స్పష్టంగానే కనబడింది. చంద్రబాబు పాదయాత్ర జిల్లాలో అడుగుపెట్టినపుడు వల్లభనేని వంశీ చురుకుగా పాల్గొన్నారు. అయితే, కేశినేని నాని రంగ ప్రవేశంతో ఆయన పాదయాత్ర నుండి దాదాపు కనుమరుగైపోయారు. కారణాలు ఎవయినప్పటికీ చంద్రబాబు కూడా ఆయన పట్ల కొంత నిర్లక్ష్యం కనబరిచినట్లే ఉంది. తత్ఫలితంగా వల్లభనేని వంశీ పార్టీకి మరింత దూరం జరిగినట్లు కనిపించింది.   అయితే, నిన్న చంద్రబాబు తన పాదయాత్రకు ఒకరోజు విరామం ఇచ్చినప్పుడు కృష్ణా జిల్లా నేతల మద్య నివురు గప్పిన నిప్పులా రగులుకొంటున్న విభేదాలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా వల్లభనేని వంశీ, కేశినేని నాని, బుద్దా వెంకటేష్ మరియు నాగుల్ మీరాలతో విడివిడిగా భేటీ అయ్యి వారి అభిప్రాయాలను తెలుసుకొన్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ముందుగా నాయకుల మద్య సయోధ్య అవసరమని, అందువల్ల తనతో విభేదించే వంశీ స్థానంలో వెనుకబడిన వర్గాలకు చెందిన నాగుల్ మీరాకు అర్భన్ అధ్యక్ష పదవిని ఈయమని కేశినేని నాని కోరడంతో చంద్రబాబుకు సరికొత్త సమస్య ఎదురయింది.   పార్టీకోసం ఎంతో కష్టపడిన వల్లభనేని వంశీని అర్భన్ అధ్యక్ష పదవి నుండి తప్పించడం ఆయనకు ఇష్టం లేకపోయినప్పటికీ, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా సరేననక తప్పలేదు. అందుకు వల్లభనేని చాలా ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అయితే, వంశీని రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకొని ఆయనకు కీలక బాద్యతలు అప్పగించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. అయినప్పటికీ, వంశీ ఆగ్రహం చల్లారలేదని తెలుస్తోంది. కానీ, చంద్రబాబుకి కూడా ఇంతకంటే వేరే మార్గం లేదు.   తాజా కూర్పులో కేశినేని నానికి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు, నాగుల్ మీరాకు అర్భన్ అధ్యక్ష పదవి, విజయవాడ పశ్చిమానికి ఇన్ చార్జిగా బుద్దా వెంకన్న, మద్య నియోజక వర్గంలో బొండా ఉమా, తూర్పున గద్దె రామ్మోహన్ ఉండేలా నిర్ణయం అయింది. అయితే, వల్లభనేని వంశీని అర్బన్ అధ్యక్ష పదవి నుండి తప్పించడానికి నిర్ణయం తీసుకోన్నపటికీ, ఆయనకు రాష్ట్ర కార్యవర్గంలో సముచిత పదవినిస్తూ తెదేపా అధిష్టానం ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయక పోవడంతో సహజంగానే కొంచెం ఆవేశపరుడయిన ఆయనకి మరింత కోపం కలిగించడంతో పార్టీ అధిష్టానానికి అందుబాటులో లేకుండా తన ఫోన్ స్విచ్చ్ఆఫ్ చేసుకొన్నట్లు తెలుస్తోంది.   అటువంటి బలమయిన నాయకుడిని తెదేపా కనుక వదులుకొంటే ఆయన చేయి అందుకోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ సిద్దంగా ఉంటుందని తెదేపా అధిష్టానం గ్రహించకపోతే అది ఆ పార్టీకే తీరని నష్టం కలిగిస్తుందని చెప్పవచ్చును. గతంలో జిల్లాలో బలమయిన నాయకుడయిన దేవినేని నెహ్రును కూడా ఇదేవిధంగా కోల్పోయిన తెదేపా ఆ తరువాత మళ్ళీ నిలదొక్కుకోవడం కోసం ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు. మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుందా లేక తెదేపా చేతులు కాలక ముందే జాగ్రత్త పడుతోందో త్వరలోనే తేలుతుంది.

tdp Payyavula Keshav

వైఎస్ చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష

        విద్యుత్ సమస్యలతో చిన్న పరిశ్రమల యాజమానులు ఆత్మహత్య చేసుకుంటున్నారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తపరిచారు. విద్యుత్ సమస్యను తేల్చకుండా ప్రకృతి సహకరించడం లేదంటూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు. వైఎస్ హయాంలో జరిగిన తప్పులకు ఇప్పుడు ప్రజలు శిక్ష అనుభవించాల్సివస్తోందని ఆయన అన్నారు.   వైఎస్ 20 ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు 45 వేల ఎకరాల భూమి కేటాయించారన్నారు. బొగ్గు మనది, భూమి మనది, బూడిద మనది అని అయితే విద్యుత్‌ను మాత్రం పొరుగు రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తపరిచారు. పొరుగు రాష్ట్రాలకు విద్యుత్ అమ్ముకుంటున్న ల్యాంకో, జీవీకే ప్లాంటుకు గ్యాస్ ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. కమిషన్లు తీసుకుని పెద్ద కంపెనీలకే అనుమతులిస్తున్నారని ఆరోపించారు.    టీడీపీ హయాంలో విద్యుత్ ఉత్పత్తి పెంపునకు కృషి చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అదనపు విద్యుత్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు. డిస్కంలను దివాలా తీయించిన ఘనత వైఎస్‌దే అని ఆయన అన్నారు. కమిషన్ల కోసం కోస్తాతీరం మొత్తం వైఎస్ ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టారని పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Sarve Satyanarayana congress

వైఎస్ కుక్కచావు చచ్చారన్న సర్వే

      దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి పై సర్వే సత్య నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియాలో వచ్చిన కధనాల ప్రకారం కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏకంగా వైఎస్ కుక్కచావు చచ్చారు అని హీనంగా మాట్లాడారు. ప్రజాసేవ చేయమని సోనియాగాంధీ పంపితే ఆయన డబ్బు దోచుకున్నారని, అందుకే అలా చచ్చారని అన్నారు. సోనియాగాంధీ నియమిస్తేనే వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారని, వైఎస్ హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలన్నీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వేనని, అందులో వైఎస్ ఘనత ఏమీ లేదని అన్నారు. ఎంత వైఎస్ అంటే పడకున్నా సర్వే ఇలా మాట్లాడడం ఏ మాత్రం సమంజసం కాదు.

కాంగ్రెస్ కు షర్మిల సవాల్

        వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరారు. పాదయాత్ర వందరోజులుకు చేరుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఇటీవల అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజాపక్షం తరఫున నిలబడ్డ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయగలరా…అంటూ ఆమె విరుచుకపడ్డారు.   కొనసాగింపుగా…దమ్ముంటే వారిపై వేటు వేసి.. ఎన్నికలకు వెళ్లాలని ఆమె అన్నారు. ఎన్నికలు వస్తే డిపాజిట్లు కూడా దక్కవని కాంగ్రెస్ కు భయమని షర్మిల ఎద్దేవా చేశారు. ఈ విధంగా షర్మిల తన పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా వ్యాఖ్యానాలు చేశారు.

గన్నవరం నుండి వల్లభనేని వంశీ పోటీ..!

  లోక్‌సభ ఎన్నికలలో విజయవాడ టీడీపీ అభ్యర్థిగా కేశినేని నానిని ఖరారు చేసేముందు చంద్రబాబు నాయుడు గారు.. తొలుత వల్లభనేని వంశీమోహన్‌ను బస్సులోకి పిలిపించి గంటసేపు మాట్లాడారు. అర్బన్ బాధ్యతలు వదిలేసి, రాష్ట్ర కమిటీలోకి రావాలని వంశీని ఆయన కోరినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలలో వంశీ పోటీచేయడానికి కూడా అవకాశం కల్పిస్తానని చెప్పినట్టు సమాచారం. 2009 ఎన్నికలలో వంశీ గన్నవరం సీటుకోసం పట్టుపట్టారు. దాసరి జైరమేష్, బాలవర్ధనరావులను వదులుకోలేని చంద్రబాబు..అప్పట్లో వంశీకి నచ్చచెప్పారు. తనమాట విని ఈసారికి విజయవాడ నుంచి పోటీ చేయాలని, వచ్చేసారి (2014) గన్నవరంలో పోటీకి పెడతానని అప్పట్లోనే హామీ ఇచ్చారు. భేటీ సందర్భంగా ఈ హామీని వంశీ గుర్తుచేసినట్టు తెలుస్తోంది. 'గన్నవరం' వంశీకి ఇచ్చి.. సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావును మండలికి పంపడమో లేక విజయా డైరీ మిల్క్ సొసైటీ చైర్మన్‌ని చేయడమో చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే దాసరి, జైరమేష్‌లతో బాబు మాట్లాడిన తరువాతగానీ దీనిపై స్పష్టత రాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వంశీకి గన్నవరం సీటు ఇచ్చేసినట్టు టీవీలలో స్క్రోలింగ్‌లు వచ్చాయి. దాంతో ఎమ్మెల్యే దాసరి తీవ్ర మనస్తాపం చెందినట్టు సమాచారం.

ఏప్రిల్ 27న పాదయాత్ర ముగింపు

      చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర విశాఖ జిల్లాలో ముగియనుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఆయన.. నాతవరం మండలం గన్నవరంమెట్ట వద్ద వచ్చే నెల ఎనిమిదో తేదీన విశాఖ జిల్లాలో అడుగుపెడతారు. ఏప్రిల్ 27 వరకు ఆ జిల్లాలో పర్యటిస్తారు. అదే రోజు విశాఖ మధురవాడలో బహిరంగ సభలో పాల్గొని పాదయాత్ర ముగిస్తారు. కాగా, విశాఖ జిల్లాలో మొత్తం 19 రోజులపాటు 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 163 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.   జిల్లాలో చోడవరం, మాడుగుల, పాడేరు, అరకులోయ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను పార్టీ జిల్లా పరిశీలకుడు సుజనాచౌదరి ఆదివారం వెల్లడించారు. యాత్ర ముగించేనాటికి ఆయన 2750 నుంచి 2800 కిలోమీటర్ల దూరం నడుస్తారని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడూ ఇంత సుదీర్ఘకాలం, ఇంత ఎక్కువ దూరం పాదయాత్ర చేయలేదని గుర్తుచేశారు. పాదయాత్ర ముగింపునకు గుర్తుగా మధురవాడలో పైలాన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.