hari krishna

ఆహార భ‌ద్రత ఎన్టీఆర్ ఆలోచ‌నే

  యుపిఏ ప్రభుత్వం, సోనిమా గాందీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆహార భ‌ద్రత బిల్లు పై తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపి హ‌రికృష్ణ స్పందించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే కేంద్ర స్ధాయిలో ఆహార భద్రత గురించి ప్రస్ధావించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. అంతేకాదు దేశంలోనే తొలిసారిగా 2 రూపాయ‌ల‌కే కిలోబియ్యం ఇచ్చిపేద‌వాడి ఆఖ‌లి తీర్చిన ఘ‌న‌త అన్న ఎన్టీఆర్‌దే అన్నారు. తాను తెలుగుదేశం పార్టీ విడుతున్నట్టుగా వ‌చ్చిన వార్తల‌ను కూడా హ‌రికృష్ణ ఖండిచారు. తనుకు అలాంటి ఆలోచ‌నే లేద‌ని, ఇది త‌న తండ్రి స్ధాపించిన పార్టీ అని ఆ పార్టీ భ‌విష్యత్తు కోసం శ్రమిస్తాన‌న్నారు. త‌ను పార్టీ వీడుతున్నట్టుగా మాట్లాడుతున్న వారివి చిల్లర మాట‌ల‌న్న ఆయ‌న అలాంటి వాళ్ల మాట‌ల‌కు స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

Maoists

ఏవోబిలో మావోయిస్టుల దాడి

  రాష్ట్ర స‌రిహద్దుల్లో మావొయిస్టులు మ‌రోసారి తెగ‌ప‌డ్డారు.  సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లతో కూడిన బృందంపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఒక స‌బార్డినేట్ ఆఫీస‌ర్‌తో పాటు ముగ్గురు కానిస్టేబుల్లు కూడా అక్కడిక‌క్కడే మ‌ర‌ణించారు. ఎప్పుడు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండే ఎవోబి ప్రాంతం ఒక్కసారిగా తుపాకీ మోత‌ల‌తో ద‌ద్దరిల్లింది. ఉద‌యం తొమ్మిదిన్నర ప్రాంతంలో 18 మంది స‌భ్యులున్న సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జ‌వాన్ల బృందం విశాఖ‌ప‌ట్నం వెళ్తూ ఏవోబి ప్రాంతంలో ఎంట‌ర్ అయింది. అయితే ముందు వెళ్లిన మూడు వ్యాన్లు సుర‌క్షింతంగానే వెళ్లిన వెనుక ఉన్న నాలుగో వ్యాన్ మావోయిస్టులు అమ‌ర్చిన మందుపాత‌ర దాటికి తునాతున‌క‌లు అయింది. ఈ పేలుడుతో వ్యాన్‌లో ఉన్న నాలుగు అక్కడిక‌క్కడే మ‌ర‌ణించారు. అయితే పేలుడు త‌రువాత ముందు ఉన్న వ్యాన్లపై కూడా మావోయిస్ట్‌లు కాల్పుల‌కు దిగారు. బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. దాదాపు గంట‌కు పైగా కొన‌సాగిన ఈ ఎదురు కాల్పుల్లో మ‌రో ఇద్దరు జ‌వాన్లు గాయ‌ప‌డ్డారు.

vijayamma delhi

విజయమ్మ ఢిల్లీ యాత్రలు

      వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల తీరును కేంద్ర ప్రభుత్వానికి వివరించేందుకు రాష్ట్రపతి తో భేటి అయ్యారు. అంతా బాగానే వుంది కాని రాష్ట్రపతిని ఇప్పటి వరకూ ఏ పార్టీ నాయకుడు ఇన్ని సార్లు కలవలేదు. రాష్ట్రపతిని విజయమ్మ ఇన్ని సార్లు కలవడం వెనుక మతలబు ఏమిటి? అని రాజకీయ విశ్లేషకులు చర్చి౦చుకుంటున్నారు. ఇది మర్యాదపూర్వక సమావేశం అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పట్టికీ, దీనికి ఏమైనా ప్రాధాన్యత ఉందా అన్నదానిపై రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు.   రాష్ట్రపతిగా ప్రతిభ పాటిల్ వున్నప్పుడు గుర్తుకురాని ప్రజాసంక్షేమం... విజయమ్మ కి ప్రణబ్ ముఖర్జీ వచ్చిన తరువాత తరుచుగా గుర్తుకు రావడం ఆశ్చర్యం. అలాగే  రాష్ట్రంలో ఉన్న గవర్నర్ ని మర్చిపోయి... ఢిల్లీలో వున్న రాష్ట్రపతి కి  సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల పై ఫిర్యాదు చేయడం ఏంటీ? అని విమర్శలు వున్నాయి. జగన్ కాంగ్రెస్ లో ఎప్పటికైనా కలిసిపోతారనేవారి ఊహగానాలకు ఊతమిచ్చేలా విజయమ్మ ప్రయత్నాలు సాగడం విశేషం. కేంద్ర ఆర్ధిక మంత్రిగా ప్రణబ్ ఉన్నప్పుడు జగన్ పట్ల కాస్త సానుకూలంగా ఉన్నారన్న భావన ఉండేది.  అయితే ఆయన వ్యక్తిగతంగా చేయగలిగేది తక్కువగా ఉంటుందని, మర్యాద కోసమే తాము రాష్ట్రపతిని కలిశామని పార్టీ నేతలు వివరిస్తున్నా... ప్రణబ్ కు ఉండే పలుకుబడి ఎటూ ఉంటుంది. కాబట్టి ఏదైనా రాజీకోసం వీరు ప్రయత్నిస్తున్నారా? అన్న ఊహగానాలు ఊపందుకున్నాయి. ఇదంతా ఇలా వుంచితే... ఈ విజయమ్మ ఢిల్లీ యాత్రల మీద ఏ రాజకీయ పార్టీలు నోరు ఎందుకు మెదపడంలేదంటే... తెలంగాణలో తెలంగాణ అంటూ...సీమాంద్రలో చంద్రబాబు వల్లే తెలంగాణ వచ్చింది అంటూ కాంగ్రెస్ ఓట్ల కోసం రాజకీయాలు చేస్తూంటే.. ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఆత్మరక్షణలో పడిపోయి..విజయమ్మ గురుంచి పట్టించుకొనే స్థితిలో లేదు. 

Congress Ysr congress

కాంగ్రెస్, వైసీపీల వికృత క్రీడ

      రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని పార్టీలు ప్రజలను మరింత రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీ ఈ వికృత క్రీడలో భాగస్వాములు కావడం దురదృష్టకరమని, ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.   గత కొన్ని రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిస్తున్నాయని అన్నారు. సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు తమకు తోచిన విధంగా శాంతియుత ఉద్యమాలు చేసుకోవచ్చు. అలాంట ప్పుడు ఇతరులు వారి కార్యక్రమాలను అడ్డుకోవడం, రెచ్చగొట్టేలా వ్యవహరించడం, రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం మంచిదికాదని సూచించారు.  సున్నితమైన తెలంగాణ అంశాన్ని సమగ్ర రీతిలో పరిష్కరించాల్సిన కాంగ్రెస్, రాజకీయ ప్రయోజనాల కోసం జటిలంచేసి ప్రజలమధ్య చిచ్చు పెట్టిందన్నారు. తాంబూలాలిచ్చాం... తన్నుకు చావండన్న రీతిలో కాంగ్రెస్ నేతలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  ఏడు రోజులుగా వివిధ వర్గాల ప్రజలు ఆందోళనచేస్తున్నా వారిని శాంతింపజేసే ప్రయత్నాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయకపోవడం గర్హనీయమన్నారు. 

bifurcation

విభజన ప్రక్రియకు బ్రేకులేసిన ఆ ముగ్గురు

  నిన్న మొన్నటి వరకు తెలంగాణపై వెనకడుగు వేసే ప్రశ్నే లేదని డంకా బజాయించి చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు ప్రభుత్వ కమిటీ ఏర్పాటు, అఖిలపక్ష కమిటీ అంటూ రాష్ట్ర విభజనపై సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టింది. రాష్ట్ర విభజన ప్రకటనకు ముందువరకు చాలా ప్రశాంతంగా ఉన్న సీమంద్ర ప్రాంతం నేడు సమైక్య ఉద్యమాలతో అట్టుడికిపోతోంది. అయితే, గత ఐదారేళ్ళుగా తెలంగాణా ఉద్యమాలకి అలవాటుపడిపోయిన కాంగ్రెస్ అధిష్టానం, ఈ సీమాంధ్ర ఉద్యమం చూసి భయపడే అవకాశం లేదు. అంటే వీటికంటే బలమయిన కారణమేదో దానిని రాష్ట్ర విభజనపై వెనక్కి తగ్గేలా చేస్తోందని అర్ధం అవుతోంది.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ మాట్లాడటం మొదటి ప్రమాద హెచ్చరికగా భావించవచ్చును. ఆయన లేవనెత్తిన నీళ్ళు, ఉద్యోగాలు, విద్యుత్, రాజధాని తదితర అంశాలను పరిష్కరించకుండా కాంగ్రెస్ పార్టీ మొండిగా ముందుకుసాగినట్లయితే రెండు ప్రాంతాల ప్రజల మధ్య యుద్ధాలు ఎలాగు తప్పవు, ఆకారణంగానే రెండు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని ఆయన పరోక్షంగా చేసిన హెచ్చరిక కాంగ్రెస్ అధిష్టానంపై బాగానే పనిచేసినట్లుంది.   ఇక, రాష్ట్ర విభజనను మొదటి నుండి గట్టిగా వ్యతిరేఖిస్తున్న గవర్నర్ నరసింహన్ లేవనెత్తిన రాష్ట్రం విడిపోతే తెలంగాణాలో పెరగనున్న నక్సల్స్ సమస్య, రాజధానిలో శాంతి భద్రతల సమస్య తదితర అంశాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని పునరాలోచనలో పడేసి ఉండవచ్చును. ఈ అంశాలపై ముందే చాలా చర్చలు జరిగినప్పటికీ, ప్రస్తుతం హైదరాబాదులో ఆంద్ర తెలంగాణా ప్రభుత్వోద్యోగుల మధ్య నిత్యం జరుగుతున్నఘర్షణలు, అవి నగరంలో ఇతర వర్గాలకు ప్రాంతాలకు వ్యాపించే ప్రమాద హెచ్చరికలు వగైరాలు గవర్నర్ ముఖ్యమంత్రి వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.   ఇక పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించినప్పటికీ, రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ అధిష్టానానికి వ్రాసిన లేఖపై ముఖ్యమంత్రితో బాటు ఆయన కూడా సంతకం చేయడం గమనార్హం. ఒకవేళ తన రాజకీయ భవిష్యత్త్ ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితులు ఏర్పడినట్లయితే ఆయన కూడా అందుకు అనుగుణంగానే అభిప్రాయలు మార్చుకోవచ్చునని ఇది సూచిస్తోంది.   ఈవిధంగా రాష్ట్రానికి పెద్ద తలకాయలయిన గవర్నర్, ముఖ్యమంత్రి మరియు పీసీసీ అధ్యక్షుడు విభజనను గట్టిగా వ్యతిరేఖిస్తుండటం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడుపడటం లేదు. వారి సహకారం లేనిదే విభజన ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్ళడం కూడా చాల కష్టమని కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకపోలేదు. అదేవిధంగా వారి హెచ్చరికలను, అభిప్రాయాలను బేఖాతరు చేసి ముందుకు సాగడం కూడా చాలా ప్రమాదం అని అర్ధం చేసుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి ముందు నుయ్యి గొయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది.   సమస్యను సృష్టించడం, నాన్చడం తప్ప ఎన్నడూ సమర్ధంగా పరిష్కరించడం చేతకాని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అందుకే కమిటీలు, చర్చలు అంటూ కొత్త పల్లవి పాడుతుంటే, టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస, టీ-జేయేసీ నేతలు అనుమానంగా చూస్తున్నారు.    

telangana

ప్రజా శ్రేయస్సు.

    .......Vijaykumar ponnada   హట్టాతుగా, ఈ మధ్య ప్రజలందరు మంత్రులను, ఎమ్మెల్యేలని, ప్రభుత్వ వుద్యోగులని కనిపించినవార్ని కనిపించినట్టుగా, కనిపించనివారిని వెదికి పట్టుకుని, వున్నఫళంగా బరబరా లాక్కెళ్ళిపోయి, చేతికో పూలగుచ్చం ఇచ్చి, మెడలో ఓ దండవేసి, చుట్టూ ఓ శాలువాలాంటిది కప్పేసి, గుర్తుగా ఓ పనికిమాలిన ఉపయోగంలేని ఓ రుబ్బురోలు పత్రం బహుకరించి మరీ సన్మానాలు చేసేస్తున్నారు. ఈ హటాత్తు పరిణామానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వోద్యోగులు ఎక్కడివారక్కడే ఏకబిగిన హడలిపోయి ఆ తరువాత బెబేలిత్తిపోయి పిదప జాడుసుకుని ఇక ఏమి చెయ్యాలో తోచక ఉద్యోగాలకి శెలవులు పెట్టి ఎటొ పారిపోయారు. శెలవులు పెట్టలేని అభాగ్యులు ముఖానికి ముసుగులేసుకుని, మారువేషాలేసుకుని దొడ్డి దారెంబట ఆఫిసు కెళ్ళి బెంచికింద పడుకునో, కుర్చీకింద కూర్చునో, బిక్కుబిక్కుమంటు భయపడిచస్తూ పనిచేసుకుంటున్నారు. అప్పుడెప్పుడో తీవ్రవాదులు పార్లమెంటుని ముట్టడించినప్పుడు కూడా ఇంత బెంబేలెత్తిపోలేదు. మంత్రులుకాని, ఎమ్మెల్యేలుకాని, ప్రభుత్వ అధికారులుకాని వాళ్ళ ఉనికి తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. దుకాణాల ప్రారంబోత్సవానికి, సదస్సులకి, మీట్టింగులకి వెళ్ళటం మానేసి, ఇంట్లో మంచం కింద దాక్కుంటూ, ఎవరొచ్చినా లేరని చెప్పి పంపించేస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం యదావిధిగా నాల్రోజుల తరువాత ప్రభుత్వం మేల్కొని, ఇలాంటి పరిణామాలకి దారితీసిన పరిస్తితులని విశ్లేషించటానికి, ఓ కమిటీని వేసింది. వారు ప్రజల్లో వచ్చిన ఈ అనూహ్యమయిన మార్పుకి కారణాలు వారినే అడిగి తెలుసుకోవటం మొదలెట్టారు. 'భలేవారు సార్, ప్రభుత్వం మాకు అందించే సేవలు ఇంతా అంతా కాదు కదా. వారు మా బాగోగులు చూస్తూంటే, వారిని కానీసం పిలిచి గౌరవించుకోవటం మా కర్తవ్యం కాదంటారా? అన్ని తెల్సే అడుగుతారు.' అని వెళ్ళిపోయాడు. తలగోక్కున్న్నారు కమిటీవాళ్ళు. మరొకడి దగ్గరకి వెళ్ళారు. 'అసలు ఇది వారికి సన్మానం కాదు. మాకు మేమే చేసుకునే సన్మానం. వారు మాకు చేసే సేవలకి, వారు మాకొసం అమలు చెసే పధకాలకి, వేయి సన్మానాలు చేసినా తీరదు. మహానుభావులు.' అని, అటుగా దండలు పట్టుకుని స్థానిక ఎమ్మెల్యేల కోసం వెదుకుతున్న ఓ గుంపుని చూసి 'ఒరేయ్, మా ఇంటి పక్కన వేరుసనక్కాయలు అమ్ముకునేవాడిలా ఒకడు తచ్చాడుతూ తిరుగుతున్నాడు. వాడు మారు వేషంలో వున్న మన ఎమ్మెల్యే అని నాకు అనుమానం ' అన్నాడు. అంతే అందరు అటువైపు పరిగెత్తారు. అలా పరిగెడుతున్న ఒకడిని ఆపి, 'బాబూ నీకు పుణ్యం వుంటుంది. అసలు ఈ సన్మానాల ప్రహశనానికి కారణం చెప్పవా, ప్లీజ్ ' అని వాడి కాళ్ళు పట్టుకున్నత పని చేసారు. వాడు తన చేతిలో దండ పక్కన పెట్టి చెప్పడం మొదలెట్టాడు. 'మన ప్రభుత్వం మనల్ని ఎంత బాగా చూసుకుంటోదో మీకు తెలియదా?' అడిగాడు. కమిటీ వాళ్ళు తెల్లముఖం వేసారు. వాళ్ళ తెల్లముఖం చూసి అతగాడు 'సర్లెండి నేనే చెబుతాను ' అని 'ఆకలేసినప్పుడు అన్నం ఎవరయినా పెట్టి ఆకలి తీరుస్తారు, కానీ ఆకలిపుట్టించి మరీ ఆకలి ఎవరయినా తీరుస్తారా? అలాగే, రోగం వచ్చినప్పుడు మందులు ఎవరయినా ఇచ్చి రొగం తగ్గిస్తారు, కానీ రొగాలు తెప్పించి మరీ రోగాలు ఎవరయినా తగిస్తారా?' అని అందరిని చూసాడు. తెల్లముఖాలేసుకుని చూస్తున్న వారు ఇంకా అలానే తెల్లబోయి చూడ్డం చూసి ' ఏంటీ? ఇంకా అర్ధంకాలేదా? మందు తాగనోడు ఎలాను మనాల్సిన పన్లేదు, కానీ వాడికి మందు తాగించి, మానిపించడం ఎవరయినా చేస్తారా?' అనడిగి, ఆ తెల్లముఖాలని చూసి 'మన ప్రభుత్వం చేస్తుంది.'అన్నాడు. 'మీరు మరీ వాజమ్మల్లా వున్నారు. గోడకొట్టిన సున్నంలా అలా తెల్లబోయి చూడ్డం తప్ప, మీకు ప్రభుత్వ విధానాల గురించి అస్సలు తెలిసినట్టు లేదు. ప్రజలని బాగు చేయడం అంటే ఏంటో మీకు బొత్తిగా అవగాహన లేదు. ఇప్పుడు ప్రజలని బాగు చేయాలి అంటే, వాళ్ళు చెడ్డవాళ్ళయినా అయ్యిండాలి లెదా చెడిపోవాలి? ఆనాడు వాల్మీకి వచ్చేపోయే వాళ్ళందరినీ తెగ బాది, దోచుకునేవాడు. అలాంటి చెడ్డవాడిని ఋషులు, ఆతరువాత భ్రహ్మా అతన్ని మంచివాడుగా మార్చారు. రామాయణం రచించేలా చేసారు. ఒకవేళ వాల్మీకి చెడ్డవాడు కాకపోతే, అతన్ని మంచివాడుగా మర్చి, రామయణం రచించేట్టుగా చేసే అవకాశం వుండేదా? అదే తర్కాన్ని ఇక్కడా వుపయోగించండి. ప్రజలని పాడు చేసి, వాళ్ళని మంచి వాళ్ళుగా మర్చడమే ప్రభుత్వ ముఖ్యోద్దేశం. రూపాయికి బియ్యం ఇస్తున్నారు. అమ్మ హస్తం ద్వారా బోల్డు సరుకులు 'చీపుగా ' ఇచ్చేస్తున్నారు. వీటికి డబ్బులు తక్కువే, కానీ వచ్చే జబ్బులే ఎక్కువ. మరి ఆ రోగాలిని ఆరోగ్యశ్రీ పధకం ద్వారా ఇచ్చే మందులతో తగ్గించుకుంటాము. ఇలా జబ్బుల మందులకయ్యే ఖర్చు ఆదా చేసిన డబ్బుతో, మందు కొనుక్కుంటాము. ఇదివరకు మందు కొట్టేందుకు బెల్టు షాపుల్లోను, బూటు షాపుల్లోను జాగా లేక చాటుమాటుగా కొట్టే వాళ్ళం. ఈప్పుడు ప్రభుత్వం మందు కొన్న దుకాణం లోనే మందుకొట్టే సదుపాయం కలిపించి మమ్మలిని ఆదుకుంది. కాపోతే రోడ్డు మీదా వెళ్ళే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఇలా తాగి మేము పొర్పాటున రోడ్డు మీద తందన్నాలాడితే, ప్రభుత్వం వూరుకోదుకదండి. వెంటనే మమ్మలిని తీసుకెళ్ళి నివారణ కేంద్రానికి పంపిస్తుంది. అలా చెడ్డ వాళ్ళమయిపోయిన మమ్మాలిని బాగు చేసి మళ్ళి మందు షాపు ముందు నిలబెట్టి చేతులు దులుపుకుని వెళ్ళి పోతుంది. మేము అప్పుడు వాల్మీకిలా మంచోళ్ళమయ్యిపోతామన్నమాట. ఇన్ని వసతులు సౌకర్యాలు కలిపించిన ప్రభుత్వానికి మా విశ్వాసాన్ని తెలియచేయటానికే, ఇలా మంత్రులని, ఎమ్మెల్యేలని, ప్రభుత్వ వుద్యోగులని పట్టుకుని సన్మానిస్తున్నము. తప్పా, చెప్పండి.' అన్నాడు. కమిటీవాళ్ళు అదేదో ప్రకటనలో వాడిలా అవాక్కయ్యిపోయారు. వెంటనే తేరుకుని 'మీరు చేస్తున్నది చాలా మంచిపని. మంచి ఎవరు చేసినా వారిని ప్రోశ్చహించవలసినదే. మా ఇంటి ఎదురుగా గిన్నెలకి మాట్లు వేసేవాడిలా మారు వేషంలో తిరుగుతున్న ఓ ప్రభుత్వ వుధ్యోగి వున్నాడు. రండి ' అన్నాడు ఓ కమిటీ సభ్యుడు. 'ఒరేయ్, ఇంకొకడు దొరికాడురోయ్.' అన్నాడు. అంతా అటు పరిగెత్తారు.    

 Food bill

సోనియా ఓటు వేయకుండానే ఆహర భద్రత బిల్లు

  సోనియా మానస పుత్రికగా, యుపిఏ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎలాగైన ఈ సమావేశాల్లోనే బిల్లును పాస్‌ చేయించాలనుకున్న కాంగ్రెస్‌ తన పంతం నెగ్గించుకుంది. సోమవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం వాడివేడిగా చర్చ జరిగింది అయితే 15వ లొక్‌సభలో తొలిసారి ఆహార భద్రత బిల్లుపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రసంగించారు. అయితే సమావేశం జరుగుతున్న సమయంలోని సోనియా అస్వస్థతకు గురికావటంతో ఆమె ఓటింగ్‌లో పాల్గొన కుండానే వెళ్లిపోయారు. సోనియాతో పాటు రాహుల్‌ కూడా వెళ్లిపోయారు. బిల్లు లక్ష్యాలను సభకు వివరించిన ఆహార మంత్రి కెవి థామస్‌ బిల్లును ప్రవేశ పెట్టారు.ఆహార భద్రత బిల్లు అమలులోకి వచ్చినప్పటికీ.. రాష్ట్రాలకు ఆహార ధాన్యాల సరఫరాను తగ్గించబోమని స్పష్టంచేశారు.

political news

సెప్టెంబర్ 2వరకు ఏపీ యన్జీవోలకు కోర్టు గడువు

  రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా జరుగుతున్నపోరాటానికి ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో కూడా ఈరోజు ఎదురు దెబ్బలు తగిలాయి.   సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం ఏపీ యన్జీవోల నిరవదిక సమ్మె చట్ట విరుద్దమని, దానిని నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేయవలసిందిగా హైకోర్టులో ప్రజాహిత వాజ్యం దాఖలయింది. కోర్టు నోటీసులు అందుకొన్నఏపీ యన్జీవో ప్రతినిధులు ఈ కేసులో తమ ప్రతిస్పందన తెలియజేసేందుకు ఈనెలాఖరు వరకు గడువు ఇవ్వవలసినదిగా కోర్టును అభ్యర్దించగా, కోర్టు అందుకు అంగీకరించి కేసును వచ్చేనెల రెండవ తేదీకి వాయిదావేసింది. ఒకవేళ హైకోర్టు వారు చేస్తున్న సమ్మె చట్ట విరుద్దమని తేల్చిచెప్పినట్లయితే ఏపీ యన్జీవోలకు ధర్మసంకటం తప్పదు. సమ్మె విరమిస్తే సమైక్య ఉద్యమం నిలిచిపోతుంది. కొనసాగిస్తే చట్టపరమయిన చర్యలు ఎదుర్కోక తప్పదు.   ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన రాష్ట్ర విభజనను సవాలు చేస్తూ పీవీ కృష్ణయ్య అనే న్యాయవాది  సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసారు. అయితే ఆ పిటిషన్ను చీఫ్ జస్టిస్ పి. సదాశివం, జస్టిస్ రంజనా దేశాయ్, జస్టిస్ రంజన్ గొగైలతో కూడిన ధర్మాసనం ఈ రోజు కొట్టివేసింది. రాష్ట్ర విభజనపై కేంద్రం ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోనందున దానిపై విచారణ జరపటం సరికాదని, అయినా రాష్ట్రాల విభజనపై తగిన నిర్ణయం తీసుకొనేందుకు పార్లమెంటు ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.    

food securtiy bill

ఆహార భద్రత బిల్లుపై తెదేపా యంపీ నామా నాగేశ్వర రావు సునిశిత విమర్శలు

  రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాల్చిపెట్టగలదని ఆశిస్తున్న ప్రతిష్టాత్మకమయిన ఆహార భద్రత బిల్లుపై ఈ రోజు లోక్ సభలో వోటింగ్ జరిగింది. జేడీ (యు), ఆర్.జే.(డీ), బీయస్పీ, మరియు యం.ఐ.యం. పార్టీలు బిల్లుకి మద్దతు తెలుపగా, శివసేన మాత్రం వ్యతిరేఖించింది. ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు సవరణలను సభ ఆమోదించగా, ప్రతిపక్ష పార్టీ యంపీలు సుష్మ స్వరాజ్ సంపత్, గురుదాస్ గుప్తాలు ప్రతిపాదించిన ఆరు సవరణలు మాత్రం తిరస్కరించింది. తెదేపా యంపీ నామా నాగేశ్వర రావు బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ గత ఐదు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆహార భద్రత బిల్లుని ప్రతిపాదించడం అంటే ఇన్నేళ్ళుగా పేదలకు కడుపు నిండా తిండి అందించడంలో వైఫల్యం చెందిందని అర్ధం అవుతోంది.ఇన్ని దశాబ్దాల పాలన తరువాత కూడా దేశంలో పేద ప్రజలు తిండికి నోచుకోవడంలేదని ఈ బిల్లు ద్వారా స్పష్టం అవుతోంది. అందుకు సిగ్గుపడవలసిన కాంగ్రెస్ ప్రభుత్వం తానేదో పేదలకి మేలు చేస్తున్నట్లు నేడు ఈ బిల్లు ప్రవేశపెడుతోంది. దానిలో ఉన్న లొసుగులను తొలగించి ప్రవేశపెట్టి ఉంటే ఆ బిల్లుయోక్క ప్రయోజనం నెరవేరేది. కానీ, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని లోసుగులమయమయిన ఈ బిల్లును హడావుడిగా ప్రవేశపెడుతోంది. దీనివల్ల పేద ప్రజలకు లాభం జరగడం సంగతి ఎలా ఉన్నపటికీ, అబిల్లు పేరు చెప్పుకొని కాంగ్రెస్ ఓట్లు దండుకోవాలని ఆత్రం పడుతోంది. ఆ ఆత్రంలో కనీసం ప్రతిపక్షాలు చేస్తున్నసూచనలను, సలహాలను కూడా అది పట్టించుకొనే స్థితిలో లేకపోవడం చాలా విచారకరం," అని అన్నారు. 

 Ketireddy Venkatrami Reddy

కాంగ్రెస్‌కు మ‌రొ ఎదురుదెబ్బ

  విభ‌జ‌న సెగ‌ల‌తో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ త‌గులుతుంది. తాజాగా అనంతపురంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవిభజన వ్యవహారంలో కాంగ్రెస్‌ తీరుతో ఆగ్రహంగా ఉన్న అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విభ‌జ‌న విష‌యంలో కాంగ్రెస్ వైఖ‌రిపై అసంతృప్తితో ఉన్న కేతిరెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వాధ్యక్షురాలు విజ‌య‌మ్మను క‌లిశారు. ఆమె కండువా క‌ప్పి కేతిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. కాట‌సారి, కేతిరెడ్డిల దారిలోనే మ‌రికొంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడే అవ‌కాశం ఉందంటున్నారు విశ్లేష‌కులు.

Geeta Reddy

గీతారెడ్డికి సిబిఐ స‌మ‌న్లు

  రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి ఇంకా సిబిఐ గండం త‌ప్పిన‌ట్టుగా లేదు ఇప్పటికే మాజీ మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ జైలు ఊచ‌లు లెక్కపెడుతండ‌గా, ధ‌ర్మాన, స‌భిత‌లు సిబిఐ ఆఫీస్ చుట్టూ చ‌క్కర్లు కొడుతున్నారు ఇప్పుడు ఈ లిస్ట్‌లో మ‌రో మంత్రి కూడా చేరిపోయింది. లేపాక్షి నాలెడ్జ్ హ‌బ్ భూకేటాయింపుల విష‌యంలో మంత్రి గీతా రెడ్డికి సిబిఐ స‌మ‌న్లు జారీచేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ విష‌యంలో గీతారెడ్డి చేసిన భూకేటాయింపుల్లో అవ‌క‌త‌వ‌క‌లు ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌తో సిబిఐ మంత్రి గీతారెడ్డికి స‌మ‌న్లు జారీ చేసింది. ఈ వ్యవ‌హారంలో మంగ‌ళ‌వారం సిబిఐ గీతారెడ్డిని విచారించే అవ‌కాశం ఉంది. అందుకు కావాల్సిన ప‌ర్మిష‌న్స్ కోసం గతంలోనే రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించిన సిబిఐ లీగ‌ల్‌గా అన్ని ఫార్మాలీటీస్‌ను పూర్తి చేసింది. అయితే  గీతారెడ్డిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ అధికారులకు అనుమతివ్వడంతో  ఆమె నివాసంలో సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా సీబీఐ అధికారులు ఇటీవల ప్రశ్నించారు.

 Rahul Gandhi

విజ‌య్‌కాంత్‌కు రాహుల్ శుభాకాంక్షలు

  2014 సార్వత్రిక ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతుండటంతో రాహుల్‌కు ప‌ట్టాభిషేకం చేయ‌డానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ర‌కాలుగా ఎత్తులు వేస్తుంది. వ‌చ్చిన ప్రతి అవ‌కాశాన్ని ఉప‌యోగించుకొని రాహుల్ను ప్రదాని చేయ‌డానికి మార్గం సుగ‌మం చేసుకుంటుంది. అందులో భాగంగానే త‌మిళనాట మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ విజ‌య్‌కాంత్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రాహుల్ గాంధీ స్వయంగా శుభాకాంక్షలు తెలియ‌జేశారు. 2014 లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎండీకే పార్టీ మధ్య పొత్తులు కుదిరే దిశగా అడుగులు పడుతున్నాయి. చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ డీఎండీకె పార్టీతో పొత్తుకు ప్రయ‌త్నిస్తుండ‌గా ఈ సంఘ‌ట‌న ఆ వాధ‌న‌కు మ‌రింత బ‌లానిచ్చింది. అయితే విజయ్ కాంత్ తో రాహుల్ మాట్లాడటం వెనుక ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు లేవని డీఎండీకే పార్టీకి చెందిన సీనియర్ నేత అన్నారు.  ప్రస్థుతానికి ఎవ‌రితో పొత్తుల గురించి ఆలోచ‌న లేద‌ని స‌రైన స‌మ‌యంలో దానికి సంబందించిన వివ‌రాలు వెల్లడిస్తామ‌న్నారు.

cbi

జగన్ విడుదలకు కాంగ్రెస్ మార్గం సుగమం చేస్తోందా

    సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా లక్ష్మీనారాయణ పనిచేసినంత కాలం సీబీఐ నిత్యం ఏదో రూపంలో వార్తలలో ఉండేది. అదేవిధంగా జగన్ మోహన్ రెడ్డి, అతని అక్రమాస్తుల కేసులతో సంబంధం ఉన్నమంత్రులు, ఐఏయస్ ఆఫీసర్ల కేసుల వ్యవహారం గురించి నిత్యం వార్తలు వినబడేవి. కానీ, ఆయన బదిలీపై వెళ్ళిపోయిన తరువాత వార్తలలో సీబీఐ ప్రస్తావనే వినబడటం లేదు. అంటే, సీబీఐ ఉన్నతాధికారి మారితే సీబీఐ పనితీరు కూడా మారుతుందనుకోవచ్చును.   జగన్ మోహన్ రెడ్డిని జైలులో నిర్బందించడంలో తమ హస్తం లేదని వాదిస్తున్నకాంగ్రెస్ పార్టీ, ఈవిధంగా ఒక ఉన్నతాధికారి బదిలీతో కేసును తనకు అవసరమయిన రీతిలో మలుపులు తిప్పుకోగలదని అర్ధం అవుతోంది. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం లేదా ఆ పార్టీతో ఎన్నికల పొత్తులకు అంగీకరించినట్లయితే కాంగ్రెస్ అధిష్టానం అతని కేసులను పక్కదారి పట్టించగల ‘సమర్దుడయిన’ ఉన్నతాధికారిని నియమించవచ్చును. లేకుంటే లక్ష్మినారాయణ వంటి ‘సమర్దుడిని’ నియమించి అతనిని జైలుగోడలకే పరిమితం చేయగలదని అర్ధం అవుతోంది. మరి ప్రస్తుతం సీబీఐ జగన్ మోహన్ రెడ్డి కేసుల దర్యాప్తు, మరియు చార్జ్ షీట్స్ దాఖలు విషయంలో ఎంతవరకు పురోగతి సాధించిందో సామాన్య ప్రజలకి తెలియదు.   సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నాలుగు నెలలోగా అతని కేసుల దర్యాప్తు ముగించకపోయినట్లయితే, అతను బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చును. సుప్రీంకోర్టు ఇచ్చిన నాలుగు నెలల గడువు వచ్చేనెల అంటే సెప్టెంబర్ తో ముగుస్తుంది. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం జరిగి ఉంటే, సీబీఐ అతని బెయిలుకి మార్గం సుగమం చేయవచ్చును. లేకుంటే, ఇదివరకులాగే అతని బెయిలుకి అభ్యంతరం చెపుతూ వాదనలు చేసి, అతని రిమాండును మరికొంత కాలం పొడిగించేందుకు ప్రయత్నాలు చేయవచ్చును. అతని కేసులకు సీబీఐ ఎటువంటి ముగింపు ఇస్తుందో తెలుసుకోవాలంటే మరొక నెల రోజులు ఆగవలసిందే.

 Mopidevi Resigned

ఎమ్మెల్యే పదవికి మోపిదేవి రాజీనామా

      మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణరావు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడ జైలులో దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన దీక్షకు సంఘీభావంగా మోపిదేవి ఈ రోజు తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. మోపిదేవి తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మాట్లో జైలు అధికారులకు అందజేశారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు అధికారులు పంపించనున్నారు. తాను జైలులో ఉన్నందు వల్లనే ఇలా లేఖ పంపాల్సి వచ్చిందని మరో లేఖలో స్పీకర్‌కు మోపిదేవి వివరించారు.   మోపిదేవి రాజీనామా గుంటూరులో కలకలం రేపింది. జగన్ దీక్షకు మోపిదేవి ఈ రోజు సంఘీభావం తెలిపారు. జగన్ బ్యారెక్‌కు వెళ్లి తన మద్దతును ప్రకటించారు. జగన్ ఆదివారం ఉదయం నుండి దీక్ష చేస్తున్నారు. కాగా, జగన్ దీక్షకు సంఘీభావంగా మోపిదేవి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆయన జగన్ వైపు వెళ్లినట్లే!

సమైక్యాంధ్ర ఉద్యమంలో చీలికలు మొదలయ్యాయా

   సమైక్యాంధ్ర కోరుతూ ఏపీ.యన్.జీ.ఓ.లు నిరవధిక సమ్మెకు దిగడంతో సీమాంధ్ర ప్రాంతం దాదాపు స్తంభించిపోయింది. గత రెండు వారాలుగా సీమాంధ్ర ప్రాంతంలో వేలాది ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయిపోవడంతో సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె ప్రభావం బాగా కనబడుతోంది. అయినప్పటికీ కేంద్రం మాత్రం దిగివస్తున్న సూచనలు కనబడకపోవడంతో క్రమంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వోద్యోగులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. రోజులు కొనసాగుతున్నకొద్దీ ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులలో మునుపటి ఉత్సాహం కూడా క్రమంగా తగ్గుతోంది. ఇక నెల జీతాల మీదనే ఆధారపడిన ఉద్యోగులలో తీవ్ర ఆందోళన నెలకొంది.   బహుశః ఆ కారణంగానే విజయవాడ, కడప మరియు నెల్లూరు జిల్లాలకు చెందిన ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మిక సంఘాల నేతలు త్వరలో అంటోనీ కమిటీని కలిసేందుకు నిశ్చయించుకొన్నారు. అయితే వారు కమిటీకి సమైక్యాంధ్ర కోరుతూ వినతి పత్రం ఈయడంతో బాటు, ఆర్టీసీపై ఉన్న రూ.5000 కోట్ల రుణభారం ప్రభుత్వం స్వీకరించాలని, అదేవిధంగా సంస్థ పూర్తిగా కోలుకోవడానికి అదనంగా మరో రెండువేల కోట్లు సహాయం కూడా చేయాలని వారు కోరనున్నారు.   తమ సంస్థ తీవ్ర నష్టాలలో కూరుకుపోయి ఉందని తెలిసి కూడా ఆర్టీసీ నేతలు సమైక్యాంధ్ర ఉద్యమంలో దిగి, ఇప్పుడు తమ సంస్థను రక్షించాలంటూ అంటోనీ కమిటీని కోరబోవడం హాస్యాస్పదం. సంస్థ మనుగడపైనే వేలాది కార్మికుల జీవితాలు ఆధార పడిఉన్నాయనేది ఎవరూ కాదనలేని నిజం. అటువంటప్పుడు సంస్థను కాపాడుకోవలసిన ఉద్యోగులు నిరవదిక సమ్మెచేసి సంస్థ మూతబడే స్థితికి తీసుకువస్తే మొట్ట మొదట నష్ట బోయేది వారేననే గ్రహింపు లేకపోవడం విచిత్రం. ఇదే సూత్రం మిగిలిన సంస్థలకు కూడా వర్తిస్తుందని వేరే చెప్పనవసరం లేదు.   ఇక, సమైక్యాంధ్ర కోరుతూ సమ్మెకు దిగిన నేతలు ఇప్పుడు తమ ప్రధాన డిమాండు నేరవేర్చమని కోరకుండా ఆర్టీసిని ఆదుకోమని కోరడం విశేషం. బహుశః త్వరలోనే మిగిలిన ప్రభుత్వోద్యోగులు కూడా క్రమంగా తమ బెట్టు సడలించి ఇటువంటి కోరికల చిట్టాలతో ఆంటోనీ కమిటీ ముందు బారులు తీరినా ఆశ్చర్యం లేదు.   బహుశః కేంద్ర ప్రభుత్వం కూడా వారిలో ఈ మార్పు కోసమే బిగుసుకొని కూర్చొని ఉన్నట్లు కనబడుతోంది. ఒకసారి ఉద్యమంలో చీలికలు వస్తే, ఇక రాజకీయ పార్టీలు కూడా వెంటనే వెనక్కి తగ్గడం ఖాయం. ఆ తరువాత విభజన ప్రక్రియ ఊపందుకోవచ్చును.

జగన్ పార్టీలోకి కాటసాని

      కర్నూలు జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుండి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లాలో ఆళ్లగడ్డ నుండి శోభా నాగిరెడ్డి, బనగానపల్లి నుండి కాటసాని రాంరెడ్డిలు ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాంరెడ్డి జగన్ కు సన్నిహితంగా మారి ఆ పార్టీకి దగ్గరయ్యారు.   ఇక శోభానాగిరెడ్డికి, వైఎస్ జగన్ మేనమామ రవీంధ్రనాథ్ రెడ్డికి చుట్టరికం కారణంగా ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో భూమా దంపతులు జగన్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శోభా నాగిరెడ్డి మళ్లీ ఎన్నికయ్యారు. అయితే జగన్ కు దగ్గరయిన కాటసాని తిరిగి చిరంజీవి చేరువయ్యారు. ఇప్పుడు మళ్లీ యూ టర్న్ తీసుకుని తిరిగి జగన్  పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

హత్య కేసులో లొంగిపోయిన టిడిపి ఎమ్మెల్యే

      తన సోదరుడు జగన్మోహన్ ను హత్య చేసిన కేసులో హైకోర్టు బెయిలు పిటీషన్ ను తిరస్కరించడంతో జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ఆలియాస్ ఎర్ర చంద్రశేఖర్ మహబూబ్ నగర్ ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. జులై 17న సోదరున్ని హత్య చేసిన అనంతరం ఎర్ర శేఖర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఇప్పటి వరకు పోలీసులకు పట్టుబడలేదు. పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. పలుమార్లు బెయిలు పిటీషన్లు కోర్టులు కొట్టేయడంతో ఎట్టకేలకు తానే లొగింపోయారు. ఎర్రశేఖర్ సోదరుడు జగన్మోహన్ సర్పంచ్ పదవికి తన భార్యను పోటీకి దింపాడు. ఎర్రశేఖర్ భార్య కూడా సర్పంచ్ గా పోటీచేస్తుంది. అయితే నామినేషన్ ఉపసంహరించుకోవాలని చెప్పినా సోదరుడు వినకపోవడంతో కాల్చిచంపారు. ఆ ఘటనకు పాల్పడింది ఎర్రశేఖర్ అని ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ఆధారాలున్నాయని పోలీసులు కూడా తెలిపారు.

టిడిపి ఎంపీలు సస్పెండ్

      సమైక్యాంధ్రకు మద్దతుగా లోక్ సభలో ఆందోళన చేస్తున్న సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలు నలుగురిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్ సభలో తమ సభ్యులను సస్పెండ్ చేయడం అన్యాయమని, దీనిపై ప్రభుత్వ వివరణ కావాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు నినాదాలు చేశారు. అయితే లోక్ సభలో సస్పెన్షన్ల గురించి రాజ్యసభలో చర్చించే అలవాటు లేదని, సభ్యులిద్దరూ సహకరించి తమ తమ స్థానాలలోకి వెళ్లి కూర్చోవాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దీంతో వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి సభను అరగంట పాటు వాయిదా వేశారు. ఇప్పటికే లోక్ సభ నుండి సస్సెండ్ అయిన లోక్ సభ సభ్యులు ముగ్గురు పార్లమెంటు ఆవరణలో నిరవధిక దీక్షకు దిగారు.