జగన్ కు ఎదురుదెబ్బ

      ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దేశంలోని అన్ని ప్రాంతాలలో పర్యటించి రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరతానని ఇంతకుముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుకు ధరఖాస్తు చేసుకున్నారు. తాజాగా విభజనకు సహకరించవద్దని ఆయన ఢిల్లీలోని జాతీయ పార్టీల నేతలను కలిసి వచ్చారు. అయితే ఈ రోజు కోర్టు జగన్ దేశ పర్యటనకు అభ్యంతరాలు తెలిపి పిటీషన్ ను తోసిపుచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలోను, అలాగే డిల్లీకి పర్యటించడానికి అనుమతి ఇచ్చినందున దేశ పర్యటన చేయాల్సిన అవసరం లేదని, దేశంలోని మెజారిటీ పార్టీల నేతలు ఢిల్లీలో కలుస్తారని ..ఇంతకుముందే ఢిల్లీ పర్యటన చేసినందుకు దేశ పర్యటన చేయాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది.

భద్రాచలంతో కూడిన తెలంగాణ కావాలి: జైపాల్

        జీవోఎంతో తెలంగాణ ప్రాంత కేంద్ర మంత్రుల సమావేశం ముగిసింది. ఈ భేటిలో తెలంగాణ కేంద్ర మంత్రులు 12పేజీల నివేదికను జీవోఎంకు అందజేశారు. జైపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...భద్రాచలంతో కూడిన తెలంగాణకావాలన్నారు. హైదరాబాద్ తెలంగాణాలో భాగమని అన్నారు. హైదరాబాద్ ను పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా పెట్టడమనేది చరిత్రలో అపూర్వమని అన్నారు. హైదరాబాద్ రెవెన్యూ పంపిణి విషయం చర్చకు రాలేదన్నారు. 371-డీ పై తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు ఓకే అభిప్రాయంతో ఉన్నారని, 371-డీ ని కొనసాగించాలన్నారు. కృష్ణా జలాల పై ట్రైబ్యునల్ సరిపోతుందని, గోదావరి జలాలపై ట్రైబ్యునల్ అవసరం లేదని అన్నారు. జీవోఎంకు లిఖిత పూర్వఖ నోట్ ఇచ్చామని, విదాన నిర్ణయాలు తీసుకోనే౦తవరకు నోట్ ను విడుదల చేయమని చెప్పారు.

సోనియాకి చిప్పకూడు తప్పదా?

      ఈరోజుల్లో రాజకీయ నాయకులు జైళ్ళలో మగ్గడం అనేది మామూలు విషయంగా మారింది. కాలం కలిసొచ్చినంత వరకూ దర్జా వెలగబెట్టినా, బ్యాడ్ టైమ్ రాగానే జైలుకి మకాం మార్చిన రాజకీయ నాయకులు ఇటీవలి కాలంలో చాలామంది వున్నారు. ఇప్పుడు భారతదేశ రాజకీయాలలో చక్రం తిప్పుతున్న ఇటలీ వనిత సోనియాగాంధీ భవిష్యత్తులో జైల్లో కాలక్షేపం చెయ్యక తప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ వాదన వినిపిస్తోంది ఎవరో కాదు. సంచలన వ్యాఖ్యలతో, కేసులతో తన రాజకీయ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించే అభినవ చాణక్యుడు సుబ్రహ్మణ్యస్వామి.     ఆయన తాజాగా సోనియాగాంధీతో పాటు తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుల మీద విమర్శలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సోనియాగాంధీని ఆయన టార్గెట్ చేశారు. ఒకప్పుడు సోనియా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో వుండేదట. ఇప్పుడా బ్యాలెన్స్ రెండు లక్షల కోట్లకు చేరుకుందట. ఆ సొమ్మంతా కుంభకోణాల ముడుపుల ద్వారా సమకూరినదేనట! టూజీ కుంభకోణంలో సోనియాకి 25 వేల కోట్లు, కరుణానిధికి 16 వేల కోట్లు, చిదంబరానికి 5 వేల కోట్లు ముడుపులుగా దక్కాయట! మొత్తమ్మీద ఈ కుంభకోణంలో 60 వేల కోట్లు చేతులు మారాయట! ఎన్డీయే అధికారంలోకి రాగానే ఈ ముగ్గుర్నీ జైలుకు పంపించడం ఖాయమట! సుబ్రహ్మణ్యస్వామి అన్న ఈ మాటలన్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. గతంలో ఆయనకి ఎంతో మంది రాజకీయ నాయకుల రాజకీయ భవిష్యత్తును సమాధి చేయడంతోపాటు, ఉద్ధండపిండాల్లాంటి ఎంతోమంది రాజకీయ నాయకుల చేత చిప్పకూడు తినిపించిన చరిత్ర వుంది. తన ప్రత్యర్థులకు సంబంధించిన రహస్యాల గుట్టమట్లను బయటకి లాగి న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టి శిక్షలు వేయించడంలో ఆయనకు ఆయనే సాటి. అన్నంతపనీ చేసే పట్టువదలని విక్రమార్కుడు సుబ్రహ్మణ్యస్వామి నోటి వెంట తమ అధినేత్రి గురించి ఇలాంటి మాటలు రావడం కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఆందోళనపడి ఉపయోగం ఏముంటుంది.. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహదేవా అని ఊరకే అన్నారా?!

కాంగ్రెస్ బీజేపీపై జగన్మోహనాస్త్రం ప్రయోగించిందా?

  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మద్దతు కోరుతూ డిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసిన జగన్మోహన్ రెడ్డికి తాము ఎటువంటి మద్దతు ఈయలేమని బీజేపీ స్పష్టం చేసింది. ఇది పైకి కనబడే ఏనుగు పెద్ద దంతాల వంటిదే. కానీ, ఆ తరువాత బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డిల మధ్య జరిగిన రహస్య సమావేశమే కీలకమయినది. అందులో తీసుకొన్న నిర్ణయాలే అసలయినవని భావించవచ్చును.   ఎందుకంటే, 2014 ఎన్నికల తరువాత ఎలాగయినా కేంద్రంలో అధికారం వశం చేసుకోవాలని తపిస్తున్న బీజేపీకి జగన్మోహన్ రెడ్డి మద్దతు కూడా చాలా కీలకమే. అటువంటప్పుడు అతను తన సహాయం అర్దించి వచ్చినప్పుడు నిర్మొహమాటంగా తిరస్కరించలేదు. కానీ తిరస్కరించినట్లు నటించింది అనుకోవలసి ఉంటుంది. అందువల్ల ఆ రెండు పార్టీల నేతల మధ్య జరిగిన రహస్య సమావేశంలో ఏమి నిర్ణయాలు తీసుకొన్నారనేదే కీలకం.   బీజేపీ తను వ్యతిరేఖిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చి, ఆ పార్టీ తెలంగాణాలో మరింత బలపడేలా సహాయపడి, అక్కడ తన పార్టీని తనే దెబ్బ తీసుకొంటుందని భావించలేము గనుక ‘కర్ర విరగ కుండా పాము చావకుండా’ అన్నట్లు బీజేపీ పార్లమెంటులో వ్యవహరించవచ్చును.   అయితే, ఇక్కడ మరో ముఖ్యమయిన విషయం తేలవలసి ఉంది. 2014 ఎన్నికల తరువాత జగన్ తనకు మద్దతు ఇస్తాడనే ఉద్దేశ్యంతోనే అతనిని జైలు నుండి బయటకి రప్పించి, రాష్ట్ర విభజనపై దూసుకుపోతున్నకాంగ్రెస్ పార్టీ, జగన్ ఈవిధంగా తన ప్రత్యర్ధులతో రహస్య సమావేశాలవడం, వారిని కూడగట్టి తను చేయబోతున్న రాష్ట్ర విభజనను అడ్డుకొనే ప్రయత్నాలు చేయడం సహించగలదా? సహిస్తే దానర్ధం అది జగన్మోహన్ రెడ్డినే తన రాజకీయ అస్త్రంగా బీజేపీపై ప్రయోగిస్తోందా?   ఇక జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య ఉన్నరహస్య ఒప్పందం గురించి స్వయంగా కాంగ్రెస్ నేతలే స్వయంగా చాటింపు వేస్తునప్పుడు, బీజేపీ అగ్రనేతలు జగన్నిఎంతవరకు విశ్వసిస్తారు? తెలంగాణాలో తమ బీజేపీ శాఖ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోరుకొంటుంటే, అందుకు విరుద్దంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకొంటున్న జగన్ తో బీజేపీ చేతులు కలుపుతుందా? ‘విశ్వసనీయత’ కోల్పోయిన జగన్మోహన్ రెడ్డిని బీజేపీ విశ్వసిస్తుందా? అంటే లేదనే చెప్పవచ్చు.   కానీ, రాజకీయాలలో ఎవరూ శాశ్విత శత్రువులు కానీ, మిత్రులు గానీ ఉండరనే సిద్ధాంతం ప్రకారం బీజేపీ జగన్మోహన్ రెడ్డితో గౌరవంగా వ్యవహరించి ఉండవచ్చును.  

రాజకీయ నేతలు ఇడియట్స్: సీఎన్ఆర్ రావు

      భారతరత్న పురస్కారానికి ఎంపికైన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు (చింతామణి నాగేశ రామచంద్రరావు ) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలను 'ఇడియెట్స్' అని అంటున్నారు. భారతదేశంలో సైన్స్‌కు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యకూ శాస్త్రీయ పరిశోధనలకూ కేటాయించే నిధులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. "విద్యారంగంలోనూ, సైన్స్ రంగంలోనూ మనం మరిన్ని పెట్టుబడులు పెట్టాలి. సెన్సెక్స్, వ్యాపారం బాగున్నంతమాత్రన దేశం బాగున్న ట్టు కాదు. ఈ ప్రభావం ఐదు-పదేళ్లపాటు మాత్రమే ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో పరిస్థితి ఏమిటి? సైన్స్‌లో ప్రగతితోనే భవిష్యత్ భద్రత సాధ్యం'' అని రావు స్పష్టం చేశారు.     రాజకీయనాయకులపైనే కాదు.. ఐటీ రంగంపైనా సీఎన్ఆర్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఐటీ అనేది అసలు సైన్సే కాదని.. అది కొందరు డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతోందని అన్నారు. అంతేకాదు.. ఐటీ రంగంలో చాలా మంది అసంతృప్తితో పనిచేస్తున్నారంటూ ఇటీవలికాలంలో పేపర్లలో వస్తున్న ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యల గురించి ప్రస్తావించారు. ఐటీ ఉద్యోగులను అసంతృప్త గుంపుగా అభివర్ణించారు. VIdeo Courtesy: TV9

జీవోఎం చివరి భేటీ నేడే!

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాష్ట్రనాయకులు అభిప్రాయలను సేకరిస్తున్న కేంద్ర మంత్రులు సోమవారం రాష్ట్రనికి చెందిన నాయకులతో చివరి సారిగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనటానికి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. కిరణ్‌తొ పాటు మంత్రి పితాని సత్యనారాయన, గంట శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి, శైలజ్‌నాధ్ టీజీ వెంకటేష్‌లు జీవోయంతో సమావేశం కానున్నారు.   అయితే సీమాంద్ర నాయకుల కన్నా గంట ముందుగానే తెలంగాణ నాయకులు తమ వాదనను జీవోయంకు వినిపించనున్నారు. తెలంగాణ ప్రాంతం తరుపున జైపాల్‌ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్‌ జీవోయంతో సమావేశం అవుతారు. ఈ భేటిల తరువాత సీమాంద్ర పాంత్రానికి చెందిన కేంద్ర మంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, పురందేశ్వరి, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణి జీవోఎంను కలిసి తమ తమ ప్రాంతాల డిమాండ్లను వినిపించనున్నారు.

కిరణ్‌ పై కంప్లయింట్‌

  పదవిలో కొనసాగుతూనే సమైఖ్యగానం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిపై తెలంగాణ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే పలువురు నాయకులు సియం వైఖరిపై బహిరంగంగానే విమర్శలు చేస్తుండగా మరి కొందరు నాయకులు ఇప్పుడ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు.   జీవోయంకు తెలంగాణ నేతలు తుది నివేదిక ఇవ్వనున్న నేపధ్యంలో టి కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలో మకాం వేసి చర్చలు జరుపుతున్నారు. కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి సారధ్యంలో ఇప్పటికే రెండు సార్లు సమావేశం అయ్యారు. ఈ సమావేశాల్లో కిరణ్‌ వైఖరిపై చర్చించినట్టుగా సమాచారం. కిరణ్‌ పట్ల పార్టీ హైకమాండ్‌ ఇంకా ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తే అది చివరకు పార్టీకే నష్టంచేకూర్చుతుందని, ఇదే విషయాన్నిపార్టీ అధినేత్రి సోనియాగాంధీకి చెప్పాలని ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

విభజనకు ఓకె, యూటి చేయండి

  రాష్ట్ర విభజన నేపధ్యంలో ఇన్నాళ్లు సమైక్యవాదం బలంగా వినిపించినట్టు కనిపించిన సీమాంద్ర కేంద్ర మంత్రులు ఇప్పుడు పూర్తిగా తమ మాట మార్చారు. ఇక సమైక్య రాష్ట్రం కష్టం అని భావించిన మంత్రులు ఇక ప్యాకేజీల మీద దృష్టి సారించారు.  ప్రధానంగా హైదరాబాద్, సాగునీటి వనరుల పంపకం, నూతన రాజధాని అభివృద్ధికి తగిన ఆర్థిక ప్యాకేజీ, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు వంటి అంశాలను.. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం ముందు ఉంచాలని భావిస్తున్నారు.   ముఖ్యంగా హైదరాబాద్‌ విషయంలో సీమాంద్రుల్లో నెలకొన్న భయాందోళనలను కేంద్ర నివృత్తి చేయాలని మంత్రులు నివేదించనున్నారు. హెచ్‌ఎండీఎ పరిధి మేరకు హైదరాబాద్‌ను ఢిల్లీ పుదుచ్చేరి లా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని, అలా అయితే విభజనకు సీమాంద్రునలు ఒప్పిస్తామని జీవోయంకు నివేదించే ఆలొచనలో ఉన్నారు.   సోమావారం జీవోయం ఎదుట కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటికే జీవోయం ముందుంచవలసి అంశాలపై చర్చించిన కేంద్ర మంత్రులు సోమావారం ఉదయం మరోసారి పళ్లం రాజు నివాసోం సమావేశం అయి చర్చించనున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులతో పాటు అందుబాటులో ఉన్న రాష్ట్ర నాయకులు కూడా హాజరు కానున్నారు.

రామాంజనేయ యుద్ధం!

    ఎప్పుడో రామాయణంలో రామాంజనేయ యుద్ధం జరిగిందని చదువుకున్నాం. ఇప్పుడు తెలంగాణాయణంలో కూడా మరో రామాంజనేయ యుద్ధం జరుగుతోంది. ఆ రామాంజనేయులు ఎవరో కాదు.. మాజీ పోలీసు ఉన్నతాధికారులు. రాముడేమో పేర్వారం రాములు.. ఆంజనేయుడేమో ఆంజనేయరెడ్డి!   పేర్వారం రాములేమో అర్జెంటుగా తెలంగాణ వచ్చేయాలని అంటూ వుంటే, ఆంజనేయరెడ్డేమో తెలంగాణ వస్తే తెలుగుజాతి నష్టపోతుందని అంటున్నారు. తెలంగాణ ఏర్పడితే రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితి మీద ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సమావేశం సందర్భంగా వీరిద్దరి పేర్లు ఒకేసారి వార్తల్లోకి వచ్చాయి. సదరు సమావేశానికి ఆంజనేయరెడ్డిని ఆహ్వానించిన కేంద్రం పేర్వారం రాములుని ఆహ్వానించలేదని టీఆర్ఎస్ హడావిడి చేసింది. అప్పుడు వీరిద్దరి మధ్య పరోక్షంగా యుద్ధం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టుల ప్రాబల్యం పెరిగే అవకాశం వుందని, అది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీసే అవకాశం వుందని ఆంజనేయరెడ్డి ఇటీవల ఒక  సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మావోయిస్టులకు అడ్డాగా మారే ప్రమాదం వుందని ఆయన హెచ్చరించారు.  ఆంజనేయరెడ్డి ఇలా మాట్లాడారో లేదో టీఆర్ఎస్ నాయకత్వం పేర్వారం రాముల్ని అర్జెంటుగా యుద్ధంలోకి దించింది. యుద్ధంలోకి దిగిన పేర్వారం రాములు ఆంజనేయరెడ్డి మీద విమర్శనాస్త్రాలు సంధించారు.   అసలు నక్సల్ సమస్య పుట్టింది తెలంగాణ కాదని, సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులే తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం బలపడటానికి కారణమయ్యారని ఎదురుదాడి చేశారు.  మొత్తమ్మీద ఇద్దరు సీనియర్ పోలీసు అధికారుల మధ్య మాటల యుద్ధం ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ యుద్ధం భవిష్యత్తులో ఎంత దూరం వెళ్తుందో చూడాలి.   Video Courtesy Tv9

భజన సంఘంలో విజయశాంతి!

      తెలంగాణ సీఎం కావాలని కలలు కంటున్నవాళ్ళంతా ఎవరికి వాళ్ళు ముమ్మరంగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. సీమాంధ్రులను తిట్టిపోయడం, సోనియాగాంధీని ఆకాశానికెత్తేయడం ద్వారా ఇటు తెలంగాణ ప్రజల అభిమానం, అటు సోనియాగాంధీ అనుగ్రహం పొందాలని ప్రయత్నిస్తున్నారు. జైపాల్‌రెడ్డి దగ్గర్నుంచి షబ్బీర్ అలీ వరకూ ఎవరి ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. తెలంగాణ వస్తుందో రాదో తెలియదు గానీ వీళ్ళ హడావిడి మాత్రం బాగా ఎక్కువైపోయింది.   రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్న సోనియాగాంధీని సీమాంధ్రులెవరైనా కడుపుమండి విమర్శిస్తే టీ కాంగ్రెస్ నాయకులు విరుచుకుపడిపోతున్నారు. సోనియాగాంధీని ఎవరేమన్నా సహించేది లేదంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఆ స్టేట్‌మెంట్లు ప్రింటయిన పేపర్ కటింగ్స్, టీవీలో టెలీకాస్ట్ అయిన వీడియో క్లిప్పింగ్స్ ఢిల్లీ పెద్దలకు పంపుతున్నారు. సోనియాగాంధీ అంటే తమకెంత అభిమానం వుందో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సర్లే.. పదవికోసం ఎవరి తంటాలు వారివి! ఇప్పుడు ఈ తంటాలు పడేవాళ్ళ లిస్టులో అభినయ రాములమ్మ విజయశాంతి కూడా చేరింది. మొన్నటి వరకూ మెదక్ పార్లమెంట్ సీటు మీదే మమకారాన్ని పెంచుకున్న విజయశాంతి, ఆ సీటు కోసం టీఆర్ఎస్‌కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరింది. ఇప్పుడు ఆమె మనసు మెదక్ సీటు మీద నుంచి సీఎం సీటు మీదకి మళ్ళినట్టుంది. అందుకే, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఎంతమాత్రం తీసిపోని విధంగా సోనియాగాంధీ భజన మొదలుపెట్టింది. మెదక్ నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి సోనియా వ్యతిరేకుల మీద విరుచుకుపడింది. తెలంగాణ ఇచ్చిన దేవతని కొంతమంది రాష్ట్ర మంత్రులు విమర్శిస్తున్నారని, అలాంటి వారిని క్షమించకూడదని ఉపన్యాసం ఇచ్చింది. సదరు ఉపన్యాసం ఇచ్చే సమయంలో  విజయశాంతి గారి హావభావాలు, ఆవేశం చూసిన వారికి విజయశాంతి ఎంత గొప్ప నటి అన్న విషయంలో ప్రత్యక్ష్యానుభవం కలిగి తరించిపోయారు. విజయశాంతి కూడా తెలంగాణ సీఎం పదవికి గాలం వేస్తోందన్న విషయం అర్థమైపోయి పులకరించిపోయారు.

ఆపండయ్యా మీ మోసాలు!

      సీమాంధ్రులు తమ సమస్యలకు అసలు కారకులు విభజనవాదులు అనుకుంటున్నారుగానీ, నిజానికి అసలు కారకులు ఎవరో కాదు.. సీమాంధ్ర కేంద్రమంత్రులు! తమను గెలిపించి కేంద్రానికి పంపిన తమ సొంత ప్రాంత ప్రజల్నే దారుణంగా మోసం చేసి రాష్ట్రాన్ని విభజన వరకు తీసుకొచ్చారు. తమను నమ్మినవాళ్ళని దారుణంగా మోసం చేశారు. ఇక్కడ సీమాంధ్రులందరూ రోడ్లమీదకి చేరి ఆందోళనలు చేస్తుంటే వాళ్ళంతా ఢిల్లీలో కూర్చుని రాష్ట్రాన్ని ఏరకంగా విభజిస్తే బాగుంటుందో కేంద్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు.   సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇప్పటి వరకూ తాము చేసిన మోసాలతో సంతృప్తి చెందినట్టు కనిపించడం లేదు. సీమాంధ్రులను ఇంకా మోసం చేసి కాంగ్రెస్ అధిష్ఠానం దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు. అందులో మొదటి స్థానంలో నిలిచే మంత్రిగారు ఘనత వహించిన కావూరి సాంబశివరావు గారు. మంత్రి పదవి వచ్చే వరకూ సమైక్యాంధ్ర అంటూ వీరంగాలు వేసిన ఆయన మంత్రి పదవి వచ్చాక గోడమీద పిల్లిని గుర్తుచేస్తూ అధిష్ఠానం దగ్గర మ్యావ్ అన్నారు. రాజకీయ నాయకులు ఎంత ఫాస్టుగా ప్లేటు ఫిరాయించగలరో స్పష్టంగా చూపించారు. ఇప్పటికీ ఆయన  సీమాంధ్రులకు మెత్తటి మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నారు. విభజన ఘట్టాన్ని క్లైమాక్స్ వరకూ పట్టుకొచ్చిన ఆయన ఇప్పుడు తీరిగ్గా విభజన ఏ దశలో అయినా ఆగే అవకాశం వుందని చెబుతూ సీమాంధ్రుల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్‌ పర్యటనకు వచ్చిన ఆయన సీమాంధ్రులు తనను టెన్షన్ పెట్టకుండా వుండటం కోసం ఇలాంటి రెడీమేడ్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఆయనగారు ఇచ్చిన స్టేట్‌మెంట్ విని మురిసిపోయిన సీమాంధ్రులు ఆయనకు అతిథి సత్కారాలు చేసి పంపించారు. కావూరిగారు ఇంకా చాలా గొప్ప రహస్యాలు వెల్లడించారు. రాష్ట్రం నుంచి తప్పుడు సమాచారం వెళ్ళడం వల్లే ఢిల్లీ పెద్దలు తప్పుగా అర్థం చేసుకుని రాష్ట్ర విభజనకు పూనుకున్నారట. తాను, ఇతర కేంద్రమంత్రులు ఈ నిర్ణయాన్ని మార్చడానికి కృషి చేస్తున్నారట. హలో కావూరీ అండ్ కేంద్ర మంత్రులూ.. ఇప్పటికైనా మీ మోసాలు ఆపండయ్యా.. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం వెళ్ళిందంటున్నారుగా.. ఆ సమాచారం ఇచ్చింది వేరెవరో కాదు.. మీ గోడమీద పిల్లుల గ్యాంగే అయి వుంటుంది.. నో డౌట్!  

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో రాజా రవీంద్ర

  సిటీలో మందుబాబుల మీద ట్రాఫిక్‌ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్‌, బంజారా హిల్స్‌ లాంటి ప్రాంతాల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు అధికంగా బుక్‌ అవుతున్నాయి. అంతే కాదు ఇలా పట్టుబడుతున్న వారిలో సెలబ్రిటీలే ఎక్కువగా ఉంటున్నారు తాజా శనివారం రాత్రి కూడా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఓ సిని నటుడు పట్టుబడ్డాడు.   శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో బంజారా హిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులకు సినీనటుడు రాజారవీంద్ర రోడ్‌ నంబర్‌ 12లో పట్టుబడ్డారు. ఫిలింనగర్ నుంచి బంజారాహిల్స్ వైపు స్కోడా కారులో (ఏపీ 20ఏపీ 1111) ప్రయాణిస్తున్న రాజా రవీంద్రను కూడా ఆపి పరీక్షించగా, ఆయన మద్యం సేవించినట్లు తేలింది. పోలీసులు ఆయన కారును స్వాధీనం చేసుకుని, ఆయనపై కేసు నమోదు చేశారు.  

సామాన్యులెరుగని అసమాన్యుడు భారత రత్నసి.ఎన్.ఆర్.రావు

  సామాన్య ప్రజలెవరికీ పెద్దగా పరిచయంలేని సుప్రసిద్ధ శాస్త్రవేత్త ప్రొఫెసర్ శ్రీ. సి.ఎన్.ఆర్.రావు కూడా ఈరోజు సచిన్ తో బాటే భారత రత్నఅవార్డుకి ఎంపికయ్యారు. ఆయన పూర్తి పేరు చింతామణి నాగేశ రామచంద్ర రావు. కర్నాటక రాష్ట్రానికి చెందినవారు. జూన్ 30, 1934న బెంగళూరులో జన్మించారు.   ఆయన డిగ్రీ-మైసూర్ విశ్వవిద్యాలయంలో, మాస్టర్స్ డిగ్రీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో, పిహెచ్ డి ఫుర్డ్యూ యూనివర్సిటీలో పూర్తి చేసారు. ఆ తరువాత కాన్పూర్ ఐ.ఐ.టి.లో 13 ఏళ్లు రసాయ శాస్త్ర అధ్యాపకుడిగా చేశారు. సాలిడ్‌ స్టేట్‌ కెమిస్ట్రీ, మెటీరియల్‌ సైన్స్‌ రంగాలలో ఆయన ప్రముఖ శాస్త్రవేత్తగా అంతర్జాతీయ గుర్తింపు కలిగిన వారు.   ఆయన జీవితం దాదాపుగా శాస్త్ర సాంకేతిక రంగాలలో బోధన, పరిశోధనలకే అంకితం చేసారు. రసాయన మరియు ఇతర శాస్త్రాలకు చెందిన అంశాలపై ఆయన 45 పుస్తకాలు, దాదాపు 1500 పైగా పరిశోధనా వ్యాసాలు రాశారు. ఆయన అసమాన ప్రతిభను గౌరవిస్తూ వివిధ దేశాలకి చెందిన 50 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్ లు ప్రధానం చేసాయి.   శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన విశిష్టలకు గుర్తింపుగా ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్‌ అవార్డులు అందజేసింది. అవి కాక దేశవిదేశాల నుండి కూడా ఆయన 150కి పైగా ప్రతిష్టాత్మకమయిన అవార్డులు అందుకున్నారు. ఇక ఆయన ప్రతిష్టాత్మకమయిన ‘శాంతి స్వరూప్ భట్నాగర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డును’ 1968లోనే స్వంతం చేసుకొన్నగొప్ప వ్యక్తి.   ఆ తరువాత కూడా ఆయన యొక్క ఆ అవార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. కానీ వాటన్నిటినీ పేర్కొనాలంటే మరో ప్రత్యేక గ్రంధం వ్రాయవలసి ఉంటుంది. ఇంత వరకు ఆయన అందుకొన్న ప్రతిష్టాత్మకమయిన అవార్డులలో రాయల్ సొసైటీ హ్యూస్ మెడల్ (2000), భారత్ ప్రభుత్వం నుండి ఇండియా సైన్స్ అవార్డు (2004), తెల అవీవ్ విశ్వవిద్యాలయం నుండి డాన్ డేవిడ్ ప్రైజ్ (2005), ఫ్రాన్సు ప్రభుత్వ అవార్డు (2005) కాగా ఇప్పుడు తాజాగా ఆయన కీర్తి కిరీటంలో భారత రత్న వచ్చి చేరింది.   ఈ అసమాన మేధావి డా. సి.ఎన్.ఆర్.రావు ప్రస్తుతం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు శాస్త్ర, సాంకేతిక సలహాదారులుగా ఉన్నారు. భారత రత్న అవార్డు అందుకొంటున్న సందర్భంగా శ్రీ డా. సి.ఎన్.ఆర్.రావు గారికి తెలుగువన్ తరపున , తెలుగు ప్రజల తరపున అభినందనలు.

ఫుల్‌స్టాప్ పెట్టిన బాబు!

      క్రమశిక్షణకు మారుపేరుగా ప్రజల నుంచి ప్రశంసలు అందుకునే తెలుగుదేశం పార్టీలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు చేదోడు వాదోడుగా వుండే ఎర్రబెల్లి దయాకరరావు ఈమధ్యకాలంలో పార్టీ క్రమశిక్షణ గీతను దాటడం ఎవరూ ఊహించని పరిణామంగా అందరూ భావించారు.   తన సహచరులు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాదరావు మీద ఎర్రబెల్లి ఘాటైన పదజాలంతో విరుచుకుపడటం పార్టీలో ఆందోళనకు కారణమైంది. ఏవైనా సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకునే తెలుగుదేశం పార్టీలో మీడియాకెక్కి విమర్శించుకునే కాంగ్రెస్ పార్టీ తరహా సంస్కృతి బయల్దేరడాన్ని ఎవరూ హర్షించలేకపోయారు. పార్టీకి విధేయుడిగా వుండే ఎర్రబెల్లి తన పొరపాటును దిద్దుకుంటారని అందరూ భావించారు. ఈ విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకోకపోయినా పరిస్థితి సర్దుకున్న వాతావరణం ఏర్పడింది. అయితే తాజాగా ఎర్రబెల్లి మరోసారి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మీద ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడటం, ఇది వారిద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీయడం, ఇద్దరూ వ్యక్తిగత విమర్శల వరకూ వెళ్ళడంతో ఈ అంశంలో చంద్రబాబు జోక్యం చేసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. ఏదైనా సమస్య ఏర్పడితే దాన్ని పార్టీలో చర్చించి పరిష్కరించుకోవాలే తప్ప ఇలా మీడియాకెక్కి తిట్టుకోవడం భావ్యం కాదని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. పార్టీలో అంతర్గత క్రమశిక్షణా రాహిత్యం పెరిగిపోతోందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతున్న సమయంలో చంద్రబాబు రంగంలోకి దిగడం మంచి పరిణామమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీలో సీమాంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య తలెత్తుతున్న విభేదాల విషయంలో చంద్రబాబు ఇంతవరకూ జోక్యం చేసుకోకపోవడం వల్లే నాయకులు కట్టు తప్పుతున్నారని, ఇప్పుడు చంద్రబాబు రంగంలోకి దిగడం వల్ల ఇలాంటి వివాదాలకు ఫుల్‌స్టాప్ పడే అవకాశం వుందని భావిస్తున్నారు. ఇకముందు ఎర్రబెల్లి మీడియాకెక్కి విమర్శలు చేసే అవకాశం వుండదని తెలుగుదేశం పార్టీలో భావిస్తున్నారు.

క్రికెట్ దేవుడు సచిన్ కు 'భారతరత్న'

      భారత క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు భారత అత్యున్నత పురస్కారం 'భారత రత్న' ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 'భారత రత్న' కు ఎంపికైన తొలి క్రికెటర్ సచిన్ రమేష్ టెండూల్కర్. ఇరవై నాలుగు ఏళ్ళుగా భారత క్రికెట్ సచిన్ అందించిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డ్ ప్రకటించింది.   భారత అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న' ను ప్రకటించడం పట్ల సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశాడు. తనకు ఈ పురస్కారాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పురస్కారాన్ని తన తల్లికి అంకితం ఇస్తున్నానని ప్రకటించారు.

రచ్చబండ మీద నిలబడి అరిస్తే విభజన ఆగుతుందా

  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని మా ముందు ఎంత గొంతు చించుకొని అరిస్తే మాత్రం ఏమి లాభం? అదేదో మీ అధిష్టానం ముందు అరిస్తే బాగుంటుంది కదా! అని ప్రజలు భావిస్తుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చ బండ మీద నిలబడి మన సమైక్యనినాదాలు ఢిల్లీకి విన్పించేలా గొంతెత్తి నినదించమని వారినే అడగడం విశేషం. తమ పార్టీ తీసుకొన్న నిర్ణయానికి తాను చింతిస్తున్నానని, అయితే ఈ నెల 18న జరుగనున్న కేంద్ర మంత్రుల బృందం సమావేశంలో పాల్గొని సమైక్యరాగం మరింత గట్టిగా ఆలపిస్తానని  ఆయన ప్రజలకి హామీ ఇచ్చారు.   నిజానికి సమైక్య ఉద్యమాలు జోరుగా సాగుతున్న సమయంలో ఆయన ప్రజల మధ్యకి వచ్చి ఉంటే, ముందుగా ఆయన రాజీనామా కోసం వారు పట్టుబట్టేవారేమో! ఒకవైపు డిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ చకచకా జరిగిపోతుంటే, మరో పక్క కేంద్రమంత్రుల బృందానికి అవసరమయిన నివేదికలు కూడా పంపుతూనే,మళ్ళీ ఇక్కడ రచ్చబండ మీద నిలబడి గొంతు చించుకోవడం దేనికి ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే! తనను నిలదీయవలసిన ప్రజల చేతనే కిరణ్ కుమార్ రెడ్డి తనకు జై కొట్టించుకోవడం నిజంగా గొప్ప విషయమే.

ఇంతకీ జగన్ డిల్లీ వెళ్లి ఏమి సాధించినట్లో

  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎంత దూరమయినా వెళ్లేందుకు సిద్దమంటున్నజగన్ బాబు ఈరోజు ప్రతిపక్ష పార్టీ నేతలను కలిసేందుకు డిల్లీకి వెళ్ళారు. అయితే ఆయన కలుస్తున్న పార్టీల్లో దాదాపు అన్నీ కూడా విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నవేనని తెలిసి ఉన్నప్పటికీ, వాటిని కలిసి మద్దతు కూడగట్టుకోవాలను కోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.   మొదటి నుండి తెలంగాణా ఏర్పాటుని సమర్దిస్తున్నసీపీఐ పార్టీ నేతలనే జగన్ మొట్ట మొదట కలవడం కాకతాళీయమే కావచ్చు. గానీ, ఊహించినట్లే వారు తెలంగాణాపై తమ వైఖరి మార్చుకొనే ప్రసక్తే లేదని మొహం మీదనే చెప్పేశారు. అయితే సీమాంధ్రకు అన్యాయం జరుగకుండా తమ పార్టీ శ్రద్ద వహిస్తుందని అభయం ఇచ్చిసాగనంపారు.   ఇక తరువాత ఆయన కలువబోయే సీపీయం, రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నపటికీ ఇటీవల జరిగిన అఖిల పక్షసమావేశంలో విభజన అనివార్యమయితే ఏమి చేయాలో చెప్పడంతో ఆ పార్టీ కూడా విభజనకు అంగీకరించినట్లే అయింది. కానీ మున్ముందు జగన్ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని చూస్తున్న ఆ పార్టీ బహుశః అతనికి సానుకూలంగానే స్పందించవచ్చును. ఆ పార్టీ కూడా సీమాంద్రకు అన్యాయం జరుగకుండా చూస్తామని హామీ ఇచ్చి సాగానంపవచ్చును.   ఇక రేపు జగన్ కలువబోయే బీజేపీ మొదటి నుండి తెలంగాణాకు మద్దతు పలుకుతోంది. అయితే సీమాంధ్ర, తెలంగాణాలలో తన పార్టీ ప్రయోజనాలను, భావి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఇటీవల తన వైఖరి మార్చుకొంటున్నట్లుగా సంకేతాలు ఇస్తోంది. రానున్న ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచాలని కోరుకొంటోంది గనుక మున్ముందు జగన్ మద్దతు అవసరం ఉంటుంది గనుక, అతను తన మద్దతు గురించి కన్ఫర్మ్ చేస్తేనే సానుకూలంగా స్పందించవచ్చును.   ఇక బహుజన్ సమాజ్ వాది పార్టీ తన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్నేనాలుగు ముక్కలు చేయాలని డిమాండ్ చేస్తోంది. గనుక జగన్ కోరికను మన్నించడం కష్టం. కానీ, ములాయం సింగ్ నేతృత్వంలో సమాజ్ వాది పార్టీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుని వ్యతిరేఖిస్తున్న కారణంగా జగన్ కి మద్దతు పలుకవచ్చును. కానీ కాంగ్రెస్ అధిష్టానం ములాయం కుటుంబ సభ్యులందరిపై తన సీబీఐ చిలుకలను ప్రయోగించి, వారినందరినీ తన అదుపులో ఉంచుకొంది. ఈ విషయాన్ని గతంలో స్వయంగా ములాయం సింగే చెప్పారు కూడా. అందువల్ల ములాయంకి మద్దతు ఈయలని ఉన్నపటికీ అతనికీ జగన్మోహన్ రెడ్డికీ మధ్య సీబీఐ అడ్డుగోడ ఉంది. గనుక దానిని దాటే సాహసం చేయకపోవచ్చును.   అంటే జగన్ కలిసిన పార్టీలలో ఏ ఒక్కటీ కూడా అతనికి బేషరతుగా మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని అర్ధం అవుతోంది.

వెల్‌కమ్ టు క్రిమినల్స్

      తలుపులు బార్లా తెరిచివున్న ఇంట్లోకి ఎవరు వెళ్ళారు? కుక్కలు, పిల్లలు, దొంగలు దూరేస్తారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ పార్టీ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. వచ్చే ఎన్నికలలో ఇటు సీమాంధ్రలో, అటు తెలంగాణలో భారీ సంఖ్యలో సీట్లు సంపాదించేయాలని జగన్ భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా డబ్బు భారీగా పెట్టగల వారికి ఎవరికైనా తన పార్టీలో స్థానం వుంటుందని సూచనలు ఇస్తున్నాడు. అలాంటి వారికి తన పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ పార్టీ తలుపులు బార్లా తెరిచిపెట్టాడు. దాంతో పార్టీలోకి నేరచరితులు భారీగా వచ్చి చేరుతున్నారు.   ఏ దిక్కూ లేకుంటే అక్కమొగుడే దిక్కన్నట్టు ఏ పార్టీలోనూ స్థానం దొరకని నేరచరితులు ఇప్పుడు వైఎస్సార్సీపీ వైపు ఆశగా చూస్తున్నారు. మొన్నటి వరకూ జైల్లో ఆతిథ్యం తీసుకున్న మోపిదేవి వెంకటరమణ వైసీపీలో మహా దర్జాగా చేరిపోయారు. ఈమధ్యకాలంలో ఈ పార్టీలో చేరిన వాళ్ళలో నేరచరితులే ఎక్కువగా వున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఒకటో అరో కేసులు వున్నవాళ్ళతోపాటు భారీ క్రిమినల్ రికార్డులు వున్నవారు కూడా వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జైలు శిక్షలు పడ్డవాళ్ళు కూడా ఎలాంటి జంకూ గొంకూ లేకుండా ఈ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడే పదహారు నెలలు జైలులో వుండొచ్చాడు కాబట్టి పార్టీలో చేరడానికి తమకు అభ్యంతరం చెప్పేవాళ్ళు లేరని సదరు జైలుపక్షులు భావిస్తున్నట్టున్నారు. అయితే ఈ ధోరణి వైసీపీలో వున్న ఒకటీ అరా ఉత్తములకు నచ్చడం లేదని తెలుస్తోంది. అయితే పార్టీలోకి నేరచరితుల ప్రవాహాన్ని ఆపే శక్తి తమకు లేకపోవడం వల్ల ఏమీ చేయలేక చేతులు ముడుచుకుని కూర్చుంటున్నట్టు తెలుస్తోంది. ఈ ధోరణి మంచిది కాదని జగన్‌కి చెప్పాలని ఒకరిద్దరు తాపత్రయ పడినా, మంచి సలహాలిచ్చేవారినే బయటకి నెట్టేసే జగన్ తత్వం తెలిసినవారు కావడంతో వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది.