శభాష్ ఎర్రబెల్లీ!
posted on Nov 11, 2013 @ 6:26PM
తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయిలో వున్న కార్యకర్తల నుంచి జాతీయ స్థాయిలో వున్న నాయకుల వరకూ ఇప్పుడు శభాష్ ఎర్రబెల్లీ అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా, పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఎర్రబెల్లి దయాకరరావు ఇటీవల తన సహచరులు కోడెల శివప్రసాదరావు, పయ్యావుల కేశవ్ మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణవాదిగా ఎర్రబెల్లి చేసిన కామెంట్లను తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ సానుభూతితో అర్థం చేసుకున్నారు.
ఎర్రబెల్లి స్థానంలో ఎవరూ వున్నా అలాగే స్పందించేవారని భావించారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎర్రబెల్లి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతాయని, దానిని తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్లాన్ చేశాయి. అయితే ఎర్రబెల్లి వ్యాఖ్యల వివాదం టీ కప్పులో తుపానులా చల్లారిపోయి ఆ పార్టీలకు నిరాశ మిగిల్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తన దింపుడుకళ్ళం ఆశలను వదులుకోలేదు. తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిలో వున్న ఎర్రబెల్లి దయాకరరావుని కాంగ్రెస్ వైపు లాక్కోవాలని గాలం వేసింది. ఆహ్వానాల మీద ఆహ్వానాలు పంపింది. ‘ఆపరేషన్ ఆకర్ష’ సృష్టికర్త అయిన కాంగ్రెస్ పార్టీ ఎర్రబెల్లిని ఎలాగైనా తమ పార్టీలో చేర్చుకోవాలని చేసిన అన్ని ప్రయత్నాలనూ ఎర్రబెల్లి విజయవంతంగా తిప్పికొట్టారు.
ఆయన అక్కడితో ఆగకుండా తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ప్రాంత నాయకులు, కార్యకర్తలో జరిపిన మేధోమధన సదస్సులో ఈ విషయాన్ని బయటపెట్టారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టనని, ఒకవేళ పార్టీని వీడాల్సివస్తే రాజకీయాల నుంచి తప్పుకుని వ్యవసాయం చేసుకుంటానని ఎర్రబెల్లి ప్రకటించడం సదస్సులో కరతాళధ్వనులు మోగేలా చేసింది. శభాష్ ఎర్రబెల్లీ అని పార్టీలోని ప్రతి ఒక్కరూ ప్రశంసించేలా చేసింది. ఎర్రబెల్లి దయాకరరావు లాంటి నాయకులు చంద్రబాబు వెంట వుంటే ఇక తిరుగేముంటుందని మేధోమథన సదస్సులో పాల్గొన్న తెలంగాణ ప్రాంత తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడ్డారు.