తెలంగాణా ముఖ్యమంత్రిగా జైపాల్ రెడ్డికే తొలి ప్రాధాన్యత
posted on Nov 11, 2013 @ 8:32PM
ఇంతవరకు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తెర వెనుకే ఉంటూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకోసం కృషిచేసారు. అయితే ఇటీవల వరంగల్లో జరిగిన కాంగ్రెస్ జైత్రయాత్ర సభలో పాల్గొనడం ద్వారా ఇక ప్రత్యక్షంగా పనిచేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే మొట్ట మొదట ముఖ్యమంత్రి పదవి చెప్పట్టాలని ఆశిస్తున్నవారు టీ-కాంగ్రెస్ లో చాలా మందే ఉన్నారు. అయితే కేంద్రమంత్రిగా సుదీర్గ అనుభవం, కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలున్నజయపాల్ రెడ్డి కూడా పోటీలో దిగితే మిగిలినవారు, ఇక ఆశలు వదులుకోక తప్పదు.
కాంగ్రెస్ పార్టీ తెరాసను విలీనం చేసుకోవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా అటువైపు నుండి సానుకూల సంకేతాలు రావడం లేదు. అంతే గాక తామే తెలంగాణాలో మొట్ట మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసి, రాష్ట్ర పునర్నిర్మాణం కూడా చేస్తామని తెరాస నేతలు గట్టిగా చెపుతున్నారు. సీమాంధ్రని పణంగా పెట్టి మరీ తెలంగాణా రాష్ట్రం ఇస్తున్నా కూడా దాని ఫలితం తమ పార్టీకి కాక తెరాసకు దక్కుతుందంటే కాంగ్రెస్ చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చోదు.
కేసీఆర్ ధాటిని తట్టుకొని, తెలంగాణా సాధించిన కీర్తి భుజాన్నేసుకొని యుద్దానికి వస్తున్న తెరాసను డ్డీ కొని గెలవాలంటే చాలా సమర్దుడయిన నేత పార్టీకి చాలా అవసరం. ఇప్పుడున్న నేతలలో జయపాల్ రెడ్డి కంటే ఎక్కువ అనుభవజ్నుడు, అందరినీ కలుపుకొనిపోగల సమర్ధుడు లేరు గనుక కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయనకే ప్రాధాన్యం ఈయవచ్చును.
నీతి నిజాయితీలకు మారుపేరయిన ఆయన పెట్రోలియం శాఖా మంత్రిగా ఉన్నంత కాలం సాక్షాత్ రిలయన్స్ కంపెనీనే గుమ్మం దగ్గిర నిలబెట్టేసిన ఘనుడు. ఆయన కీలకమయిన తన పెట్రోలియం శాఖను వదులుకోవడానికి సిద్దపడ్డారు తప్ప, తన సిద్దాంతాలను, విలువలను వాదులుకోవలనుకోలేదు. అందుకే ఆయనను పెట్రోలియం శాఖ నుండి ప్రస్తుత శాఖలోకే మార్చేసింది కాంగ్రెస్ అధిష్టానం.
మరి అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే క్రిందనున్న వారికి ఇక ‘మిగిలేదేమి ఉండదు’. అయితే ఆయన వల్ల తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గట్టిగా నిలద్రోక్కుకోవడమే కాకుండా, తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పవచ్చును. ఒకవేళ వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో యుపీయే, తెలంగాణాలో జైపాల్ రెడ్డి ప్రభుత్వాలు కొలువు తీరినట్లయితే అది తెలంగాణా ప్రజలకి ఎంతో మేలు చేకూర్చవచ్చును.
కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తరువాత అనేక మౌలిక వసతులు, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చెప్పతవలసి ఉంటుంది గనుక మొదటి ఐదు సం.లు చాలా కీలకం. అందుకు సమర్దుదయిన, నిజాయితీ పరుదయినా నాయకుడు చాలా అవసరం. గనుక ఆ అర్హతలన్నీ ఉన్న జైపాల్ రెడ్డికే ప్రాధాన్యత ఈయవచ్చును.
జాతీయస్థాయిలో పనిచేసిన ఆయన, అదే జాతీయ దృక్పధం చూపుతూ ఇంతకాలంగా తెరాస ప్రజలలో నాటిన విషబీజాలను ఏరిపారేసి, రెండు ప్రాంతాల ప్రజల మధ్య మళ్ళీ సహృద్భావ వాతావరణం ఏర్పరచగలరు. తద్వారా రాష్ట్రం విడిపోయిన తరువాత వచ్చే అనేక సమస్యలను ఆయన సామరస్యంగా, చాకచక్యంగా ఎవరికీ నష్టం కలుగని రీతిలో పరిష్కరించగలరు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికీ కుర్చీ అప్పగిస్తుందో చూడాలి.