తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇంటర్వ్యూ

  తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత ఒక న్యూస్ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్ర విభజన, తెరాస-కాంగ్రెస్ విలీనం, జగన్మోహన్ రెడ్డి, సినీ పరిశ్రమ తదితర అంశాల గురించి మాట్లాడారు. ఆ వివరాలు:   రాష్ట్ర విభజన: 1. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం తన స్వంత పార్టీ నేతలని కూడా పరిగణనలోకి తీసుకోకుండా అంతా రహస్యంగా సాగిస్తున్నందునే వారు కూడా తెలంగాణాపై చాలా సందిగ్ధంలో ఉన్నారు. మరటువంటప్పుడు కాంగ్రెస్ తెరాసను సంప్రదిస్తుందని మేము ఎదురుచూడలేదు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ తెరాసను సంప్రదించ లేదు.   2. పది జిల్లాలతో కూడిన తెలంగాణా వస్తుందనే నమ్ముతున్నాము. భద్రాచలం, హైదరాబాద్ వంటి అంశాలపై ఎటువంటి రాజీలు ఉండబోవు. హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా తెరాస అంగీకరిస్తుంది గానీ ఆదాయంలో వాటా పంచి ఇవ్వడానికి ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించదు. కేంద్రమంత్రుల బృందం తన తుది నివేదిక సమర్పించిన తరువాతనే తెరాస స్పందిస్తుంది.   3. రానున్న ఎన్నికలలోగానే తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలని మా పార్టీ బలంగా కోరుకొంతోంది. లేకుంటే వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వం తన మనుగడ కోసం సీమాంధ్ర యంపీలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడితే మళ్ళీ తెలంగాణా వెనక్కి జరిగిపోయే ప్రమాదం ఉంది.   కాంగ్రెస్-తెరాస విలీనం, పొత్తులు: ఇంతవరకు అటువంటి ఆలోచనలేవీ లేవు. మున్ముందు ఉంటాయేమో ఇప్పుడే చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం తెలంగాణా విషయంలో నాన్చివేత ధోరణి అవలంభించిన కారణంగానే ఆ పార్టీ తెలంగాణాలో దీన స్థితిలో ఉంది. అది స్వయంకృతాపరాదమే. అందుకే ప్రజాభిమానం ఉన్న తెరాసను విలీనం లేదా పొత్తుల గురించి అడుగుతోంది. అయితే తెరాస తెలంగాణా రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించాలని కోరుకొంటోంది గనుక, తన ఉనికిని నిలుపుకోవడం కూడా అవసరమే. కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతే ఇక మా మాటకు విలువేమి ఉంటుంది?   జగన్మోహన్ రెడ్డి, వైకాపా: జగన్మోహన్ రెడ్డి తన పార్టీని సమర్ధంగా నడిపించలేకపోతున్నట్లు కనిపిస్తోంది. అతను ఓదార్పు యాత్రల పేరిట ప్రజల మధ్యే ఉంటూ తన పార్టీని బలపరచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అతని పార్టీ సీమాంధ్రకే పరిమితమయింది గనుక, మేము, మా తెలంగాణా ప్రజలు కూడా అతని గురించి, అతని పార్టీ గురించి పూర్తిగా ఆలోచించడం మానేశాము. అయితే రానున్న ఎన్నికలలో వైకాపా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో పోటీ చేయవచ్చునేమో కానీ తెలంగాణా అంతటా పొటీ చేయగలదని మేము భావించడం లేదు. ఒకవేళ పోటీ చేస్తే ఏమి చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు.   ఆయన ప్రస్తుతం చేస్తున్న దేశాటన తన ఉద్యమానికి మద్దతు కూడ గట్టడానికే కాక తనను తాను జాతీయ స్థాయి నాయకుడిగా ప్రమోట్ చేసుకోనేందుకు ప్రయత్నిస్తునారు. అందరితో పరిచయాలు పెంచుకొని తద్వారా రానున్న ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాలలో తన ప్రభావం చూపాలని ఆయన ఆశిస్తున్నట్లున్నారు.   సినీ పరిశ్రమ: సినీ పరిశ్రమ ఇప్పుడు పూర్తిగా వ్యాపార శైలిలోనే నడుస్తోంది. అందువలన వ్యాపారులకు తమకి ఎక్కడ ఎక్కువ లాభం ఉంటే అక్కడికే కదిలి వెళ్లిపోవడం సహజం. వారు ఇక్కడే ఉన్నా, ఏ వైజాగ్ కో వెళ్ళిపోయినా మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ‘తెలంగాణా సినీ పరిశ్రమ’ ఏర్పాటుకు తగిన కృషి చేస్తాము. తగిన ప్రోత్సాహకాలు అందించి పరిశ్రమ నిలద్రోక్కుకోనేలా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము. అలాగని టాలివుడ్ కి అన్యాయం చేయబోము.

ఈ అనుమతుల గోలేంటో!

      స్కాముల్లో పీకల్లోతులో మునిగిపోయిన జగన్ బాబు శేష జీవితం అటు జైల్లోగానీ, లేదా ప్రతిదానికీ పర్మిషన్లు తీసుకుంటూ ఉంటూ గానీ గడిచిపోయేలా వుంది. తిట్టే నోరు, తిరిగేకాలు ఊరుకోవంటారు. రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబును తిట్టిన జగన్‌ ఆ రెండిటికీ అలవాటు పడిపోయాడు. అందుకే తిట్టకుండా, తిరగకుండా ఒక్క రోజు కూడా వుండలేని పరిస్థితికి చేరుకున్నాడు.   సీబీఐ కోర్టేమో నీలాంటోడు దేశమంతా తిరిగితే డేంజర్ అని  జగన్ని హైదరాబాద్‌ దాటకూడదని చెప్పింది. జగన్ మాత్రం ఆ కారణం చెప్పి ఈ కారణం చెప్పి దేశమంతా తిరగడానికి పర్మిషన్లు తీసుకుని తన టూర్లు ప్లాన్ చేసుకుంటున్నాడు. జాతీయ నాయకుల అందరి దగ్గరకి వెళ్ళి తనకు ఇష్టం లేనివాళ్ళని, తన అవినీతిని ప్రశ్నించినవాళ్ళని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. మొదట ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడికి వెళ్ళడానికైనా అనుమతి ఇవ్వండి మహాప్రభో అని బతిమలాడుకున్న జగన్ ఆ అనుమతి వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్ళడానికి పర్మిషన్ కోసం తంటాలు పడ్డాడు. పోనిలే కదా అని ఢిల్లీకి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తే కోల్‌కతా వెళ్ళడానికి అనుమతి కావాలన్నాడు. సర్లే అని దానికీ అనుమతిస్తే ఇప్పుడు మరికొన్న ఊళ్ళ పేర్లు చెప్పి దానికీ పర్మిషన్ తీసుకున్నాడు. దేశదిమ్మరిలా దేశమంతా తిరుగుతానంటే చట్టాలు ఒప్పకోవడం లేదని ఇలా ముక్కలు ముక్కలుగా పర్మిషన్ తీసుకుంటున్న జగన్, ఈ పర్యటనలు చేస్తోంది రాష్ట్రానికి ముక్కలు చేయడానికేనన్న విమర్శలను ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకూ చేసిన పర్యటనల కారణంగా తాను సాధించిందేమీ లేకపోయినా మడమ తిప్పకుండా జగన్ బాబు జైత్రయాత్రలు కొనసాగిస్తున్నాడు.  

కిరణ్...ఇప్పుడు ఇది అవసరమా?

      సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజల సమస్యల కంటే రేపు రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకి కూడా ముఖ్యమంత్రి పోస్టు వెలగబెట్టాలన్న ముచ్చట ఆయనలో కనిపిస్తోంది. ఒకపక్క 'హెలెన్' తుఫాన్ దెబ్బకి పచ్చని కోనసీమ కకావికలమైతె.. ఈయన మాత్రం తనను సమైక్య చాంపియన్‌గా సీమాంధ్ర ప్రజల ముందు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేసిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో నిమగ్నం కావాలని ప్రయత్నిస్తున్నారు.   ఆదివారం నుంచి ఆయన రాయలసీమ ప్రాంతంలో రచ్చబండ నిర్వహించనన్నారు. అయితే ఆయన ప్రస్తుతం వెళ్ళాల్సింది రాయలసీమకు కాదు.. హెలెన్ తుపాను ధాటికి కకావికలైపోయిన కోనసీమ ప్రాంతాలకు...అక్కడికి వెళ్ళి ప్రజల కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కానీ, తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్న రచ్చబండకు వెళ్ళడం న్యాయమా? పోనీ కిరణ్ సార్ రచ్చబండకి వెళ్ళినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. జనం రచ్చబండలో సమైక్య నినాదాలు చేస్తూ  రచ్చరచ్చ చేస్తున్నారు.  రాయలసీమలో రచ్చబండకి వెళ్ళి జనం చేత తిట్లు తినేబదులు, తుపాను బాధితులను పరామర్శించడానికి వెళ్ళి బాధితుల చేత నమస్కారాలు అందుకోవచ్చు కదా..!  

రాష్ట్రపతికి జగన్ పాఠాలు అవసరమా?

  రాజకీయాలలో నీతి నిజాయితీ, విశ్వసనీయత అంటూ నిత్యం సూక్తులు వల్లెవేసే జగన్మోహన్ రెడ్డి, ఇంతవరకు ఏనాడు కూడా వాటిలో ఏ ఒక్క లక్షణం తనకుందని నిరూపించుకోలేకపోయారు. పైగా అతని ప్రవర్తన, ఆలోచనలు, వ్యూహాలు అన్నీ ఎప్పుడూ కూడా అనుమానాస్పదంగానే ఉంటాయి.   గతంలో ఫ్లెక్సీ బ్యానర్ల వ్యూహంతో హరికృష్ణని, జూ.యన్టీఆర్ ని ఎగద్రోసి, నందమూరి వంశానికి, తేదేపాకు మధ్య చిచ్చు రాజేసిన తరువాత, ఆ జూ.యన్టీఆర్ ని ఘోరంగా దెబ్బతీసి వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు నిమ్మకూరులో ఉన్న నందమూరు బంధువు పెద వెంకటేశ్వర రావు ఇంటికి వెళ్లి జగన్ ఏవో మంతనాలు చేయడం చూస్తే మళ్ళీ అక్కడ అతను మరో చిచ్చు పెట్టేందుకు సిద్దం అవుతున్నట్లు ఉంది.   సాదారణంగా ఏ రాజకీయ నాయకుడు ఎంత రాజకీయ వైరం ఉన్నపటికీ తన ప్రత్యర్ధి యొక్క నియోజక వర్గం నుండి ఎటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టాలనుకోడు. కానీ జగన్ మాత్రం చంద్రబాబు నియోజక వర్గమయిన కుప్పం నుండే తన ‘సమైక్య ఓదార్పుయాత్ర’ మొదలుపెట్టాలనుకోవడం అతని నైజానికి అద్దం పడుతోంది.   ఒకవైపు సమైక్యాంధ్ర సెంటిమెంటు మరో వైపు తన తండ్రి పేరు చెప్పుకొని ఓదార్పు సెంటిమెంటుతో ప్రజల అభిమానం, సానుభూతి పొంది వచ్చే ఎన్నికలలో ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అవ్వాలని జగన్ చేస్తున్నఈ ప్రయత్నాలను ప్రజలు అర్ధం చేసుకోలేరని భావించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అతను ఈ రెండు అంశాలు ఎత్తకుండా నేరుగా “నా పార్టీకే ఓటేసి గెలిపించండని’ ప్రచారం చేసుకొని ఉంటే, ప్రజల కొంతయినా అతనిని నమ్మేవారేమో!   పట్టుమని మూడేళ్ళ రాజకీయ అనుభవం కూడాలేని జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో తలపండిపోయి, దేశానికే అత్యునత పదవి అలంకరించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్ర విభజనపై పాటాలు భోదించడం అవివేకమా? లేక అతితెలివి ప్రదర్శించడమా? రాష్ట్రంలో మిగిలిన అన్ని పార్టీలని కూడా తన వెనుక నడువమని కోరడం కూడా అటువంటిదే!   ప్రతిపక్ష పార్టీ నేతగా అతను రాష్ట్రపతిని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని కోరడం తప్పు కాదు, కానీ ఆ పని అతను ఇప్పటికే ఒకసారి పదిహేను రోజుల క్రిందటే చేసాడు. మళ్ళీ ఇంతలోనే మరో సారి డిల్లీవెళ్లి ఆయనను కలవాల్సిన అవసరం ఏమిటో? జాతీయ పార్టీలయినా లెఫ్ట్ పార్టీలతో సహా మరే ఇతర పార్టీ కూడా రాష్ట్రపతిని కలవాలని ఇంత అత్యుత్సాహం చూపలేదు. కానీ ఒక్క జగన్ మాత్రమే ఇన్నిసార్లు ఆయనని కలవడం విచిత్రమే.   లగడపాటి తమ పార్టీ అధిష్టానానికి జగన్ దత్తపుత్రుడు అని చెపుతుంటే, బహుశః అది తప్పని రుజువు చేయడానికో లేక మరి దేనికో అతను పనిగట్టుకొని కాంగ్రెసేతర పార్టీ నేతలని కలుస్తూ మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నారు. అదే పార్టీకి చెందిన మరో నేత వీ.హనుమంతరావు అసలు అతని దేశాటనల వెనుక వేరే ఉద్దేశ్యాలున్నాయని చెప్పడమే కాకుండా, కోర్టులు అతనిని నియత్రించాలని కోరడం విశేషం.   అంటే ఈ ‘జగన్మాయని’ ఎవరూ కూడా కనిపెట్టలేరని అర్ధం అవుతోంది. ఇటువంటి విచిత్రమయిన, అనుమానస్పదమయిన వ్యవహార శైలి ఉన్నవ్యక్తి తెల్లారి లేస్తే నీతి, నిజాయితీలు తన లోటస్ పాండ్ పెరట్లో చెట్లకు పూస్తునట్లు జనాల ముందు వెదజల్లడం మాత్రం మరిచిపోరు.

అనుక్షణం గతిని మార్చుకుంటున్న"హెలెన్''!

      ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఒక్కసారిగా ఎదుర్కొంటున్ననన్ని ఉపద్రవాలు ఇంతకు ముందెన్నడూ ఎదుర్కొని ఉండలేదంటే అతిశయోక్తి కాదు! ఈ ఉపద్రవాలలో కొన్ని ఇటీవల మాసాలలో వరసగా వచ్చిన పెనుతుఫానులు కాగా, తెలుగువాళ్ళు తమకు తాముగా ప్రకృతినిమించిన గాడితప్పిన 'ప్రవృత్తి'వల్ల తెలుగుజాతినే ముమ్మరించిన అనర్థదాయకమైన కృత్రిమ 'తుఫాను'లూ! మొన్నటి దాకా "ఫైలిన్'' తుఫాను రాష్ట్రవ్యాపితంగా ప్రజలను, పంటలను దెబ్బతీసింది. అది ముగిసీ ముగియకముందే సరికొత్త తుఫాను "హెలెన్'' ఆకస్మికంగా ముంచుకొచ్చింది. అంతకుముందు మన ప్రసిద్ధ వాతావరణ శాస్త్రవేత్తలుసహితం ప్రక్రుతి వైపరీత్యాలకు సంబంధిన సమాచారం గురించి కొన్ని సందర్భాలలో శాస్త్రయుక్తంగా హెచ్చరించటంలో విఫలమైనప్పటికీ, ఇటీవల కాలంలో ప్రపంచ శాస్త్రవేత్తలు పెక్కు ఆధునిక ఉపగ్రహాల సహాయంతో అందించగల్గుతున్న వాతావరణ సమాచారం మాత్రం చాలావరకు విశ్వసనీయంగా ప్రజలను, ప్రభుత్వాలను సకాలంలో హెచ్చరించడం సాధ్యమవుతోంది.   అయినా ప్రకృతి వైపరీత్యాల గురించి సకాలంలో సమాచారాన్ని శాస్త్రవేత్తలు అందించడంలో యిప్పటికీ అరుదుగానైనా విఫలం కావడానికి కారణం - అటు అంతరిక్షంలోనూ, ఇటు భూమిమీదా అగ్రరాజ్యాలు పరస్పరం పోటాపోటీలమధ్య హద్దులు మీరిన ఆబ కొద్దీ స్వలాభాపేక్షతో వాతారణ కాలుష్యానికి దోహదపడే అనుపాటవ పరీక్షలనూ, పరిసరాల విధ్వంసాన్ని కొనసాగిస్తూ రావడం వల్ల ప్రకృతిలో మానవుల ఉనికికే ప్రమాదం కల్గించే విరుద్ధ మార్పులకు దోహదం చేయడం! ఈ విపత్కర పరిణామం వల్లనే శాస్త్రవేత్తల, వాతావరణ శాస్త్ర సాంకేతిక ఉద్దండుల హెచ్చరికలను కూడా అధిగమించిపోయి వాతావరణ పరిస్థితులు ఆకస్మికంగా, క్షణాలమీద ప్రభావితం చేస్తూ తారుమారు చేస్తున్నాయి! ఈ దృశ్యమే ఇటీవల ప్రపంచ వ్యాపితంగానే కానవస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలుఖండాలలో, పెక్కు దేశాలలో వాతావరణం కేవలం తుఫానుల స్థాయిని దాటి, తరచుగా "సుడితుఫాను''లుగా (టాడోలు) జలాంతర్గత మందుపాతర్లుగా కూడా పనిచేస్తున్నాయి [ఈ దృశ్యాల్నే శ్రీశ్రీ "టార్నాడో, టార్పిడో/అది విలయం/ఇది సమయం'' అని అలంకార ప్రాయంగా వర్ణించాడు]! ఈ వాతావరణ ప్రకృతి విలయదృశ్యాలకు శాస్త్రవేత్తలు వాటి ప్రత్యేకతను గుర్తించడానికి కొన్ని పేర్లను పెడుతుంటారు. వాటిలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ను తాకి, పంటలకు, ప్రజలకూ భారీస్థాయిలో నష్టదాయకంగా పరిణమించిన ఉగ్రతుఫానులకు దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ పెట్టిన పేర్లు - లైలా, ఫైలిన్, హెలెన్, కత్రినా వగైరాలు! సహజమైన ప్రకృతి వైపరీత్యాలు కొన్నికాగా, పర్యావరణాన్ని తన స్వప్రయోజనాల కోసం కన్నూ మిన్నూ కానక్కుండా చేజేతులా మానవుడు సృష్టించుకుంటున్న విధ్వంసానికి రోజురోజుకీ అక్షరసత్యంగా నిరూపితమవుతున్న దృశ్యాలివి! పెట్టుబడిదారీ వ్యవస్థ కేవలం లాభార్జన ప్రాతిపదికపైననే ప్రకృతివనరులను వాతావరణాన్ని కొల్లగొడుతున్నంత కాలం వాతావరణ పరిస్థితులలో వినూత్నమైన ఆత్మాహుతికి దారితీసే వైపుగానే మానవుల్ని నడిపిస్తూంటుంది! వాతావరణంలో గత దశాబ్దాన్నర కాలంగా ఈ వినూతనమైన దృశ్యం - "పసఫిక్ ఫినామినా'' (పసఫిక్ మహా సముద్ర ప్రాంతంలో వచ్చిన ప్రత్యేక వాతావరణ మార్పులు. ఈ మార్పులవల్ల రెండు రకాల పరిణామాలు దూసుకువచ్చాయి! (1) "ఎల్-నీనో'', (2) :లా-నీనా'' ఈ రెండు ప్రత్యేక వాతావరణ వ్యవస్థలలో ఒకటి తీవ్రదుర్భిక్ష పరిస్థితుల్ని, వడగాల్పుల్ని మరొకటి బిళ్ళబీటుగా విరుచుకుపడే తీవ్రాతి తీవ్రమైన పెనుతుఫానులనూ ఆకస్మింగా సృస్టిస్తాయి. ఈ వాతావరణ దృశ్యాలు కేవలం పసఫిక్ ప్రాంతదేశాలకే కాదు, చుట్టుపట్ల హిందూమహాసముద్ర ప్రాంత దేశాలను కూడా అతలాకుతలం చేసిగాని వదిలిపెట్టవు. నేడు మనం ఎదుర్కొంటున్న 'ఫైలాన్', 'హెలెన్' భీకర తుఫానులు అవేనని మరచిపోరాదు. క్రిస్మస్ పండగ సమయంలోనే, అదీ ఇంతకుముందు దాదాపు ఆరు-ఎనిమిది సంవత్సరాలకు వచ్చేది. కాని వాతావరణ మార్పుల వల్ల దాదాపు ప్రతి రెండు మూడేళ్ళకూ ఈ దృశ్యం దేశాలపైన "దాడు''లు చేస్తోంది. ఇప్పుడు దీని రాకడకూడా, "వాన రాకడ, ప్రాణం పోకడ తెలియద''న్న సామెతలానే మారిపోయింది! తాజా వచ్చిపడిన "హెలెన్'' భీకర తుఫాను మూడు కోస్తాంధ్ర జిల్లాలను, రెండు తెలంగాణా జిల్లాలనూ 100-130 మీటర్ల వేగంతో చుట్టబడుతూ ఉంది.   ఇటీవల మన శాస్త్రవేత్తలు అంగారకగ్రహానికి పంపించిన "మామ్'' భూమినుంచి 70,000 కిలోమీటర్ల దూరంనుంచి విస్పష్టమైన తోలి ఛాయాచిత్రాల్ని పంపించింది. ఇలాంటి వైజ్ఞానిక విజయాలను ఇండియా సాధించినకొద్దీ వాతావరణ మార్పుల గతివేగాన్ని ఫలప్రదంగా శాస్త్రవేత్తలు మరింత త్వరితంగా పసికట్టి ప్రజలకూ, రైతాంగానికి హెచ్చరికలూ, సేవలూ అందించగల్గుతారు. ఎందుకంటే, భూమి ఉపరితలంలో 71 శాతం ప్రాంతాన్ని సముద్రాలు, మహాసముద్రాలూ చుట్టివేశాయి. ఇందులో భూఖండం మీద ఉన్న జలరాశిలో 97 శాతం నీటిని మహాసముద్రాల (ఓషన్స్) ఆధీనంలో ఉన్నాయి! ప్రతిరోజూ ప్రపంచం చుట్టూ ఉరుములు మెరుపులతో కూడిన తుఫానులు 40,000 దాకా ఉంటాయని అంచనా! ఎలా యుద్ధరంగాన్ని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ యుద్ధ\రంగాలుగా (వెస్టరన్ ఫ్రంట్, ఈస్టరన్ ఫ్రంట్ లాగా) యుద్ధకాలంలో విభజిస్తారో - అలాగే వాతావరణ శాస్త్రజోస్యాల్ని కూడా విభాగిస్తారు. మొదటి ప్రపంచయుద్ధం తరువాతనే వాతావరణ శాస్త్ర జోస్యాల్ని మొదటిసారిగా అలా "యుద్ధరంగ'' స్థాయిలో విభజించారు! మూడులక్షల మంది ప్రజల్ని పొట్టన పెట్టుకున్న పెనుతుఫానుకు ఉదాహరనైన్తవరకు ఒక్క బంగానే మాత్రమే! మన పరిస్థితి - వానకు మండే వరద, అన్నట్టుగా ఉంది!  

చంద్రబాబు జగన్ తో కుమ్మక్కు: హనుమంతరావు ఉవాచ

  సీనియర్ కాంగ్రెస్ నేత వీ.హనుమంత రావు మాటలు విన్నవారికి ఉద్యోగులకే కాదు రాజకీయ నాయకులకి సైతం పదవీ విరమణ వయసు పెట్టడం అవసరమనిపిస్తుంది.   ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్డి అక్రమంగా వేలకోట్ల ఆస్తులు కూడ బెట్టుకొన్నాడు. ఆయన తండ్రి తెలంగాణా ఏర్పాటు చేయాలని కోరితే అతను మాత్రం సమైక్యవాదం పేరిట దేశాటన చేస్తూ ప్రతిపక్ష నేతలందరినీ కలుస్తున్నాడు. ఈ మిషతో అందరినీ కలుస్తూ పరిచయాలు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. అతని అసలు ఉద్దేశ్యం వేరే ఉంది. పార్టీలనన్నిటినీ పోగేసి కేంద్రంలో ఏదో చక్రం తిప్పేయాలని కలగంటున్నాడు. అయితే అది నెరవేరదని అతనికీ తెలుసు. అతను హైదరాబాదు బయట కాలుపెడితే సాక్షులను ప్రభావితం చేస్తాడని వాదించిన సీబీఐ ఇప్పుడు అతనిని దేశమంతా తిరగడానికి, ఎవరిని పడితే వారిని కలవడానికి ఎందుకు అనుమతి ఇస్తోందో అర్ధం కావడం లేదు. ఇప్పటికయినా సీబీఐ కోర్టులు అతనికి కళ్ళెం వేయాలి,” అని అన్నారు.   ఆయన ఇంతటితో ఆగితే పరువలేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులు అనుమతులు మంజూరు చేయకుండా చంద్రబాబు అడ్డుకోవాలని ఒక విచిత్రమయిన కోరిక కోరారు. ఇంతవరకు ఆ రెండు పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యాయని ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకొంటుంటే, ఇప్పుడు హనుమంత రావు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్యాడని, అందుకే అతనిని అడ్డుకోవడం లేదని విచిత్రమయిన ఆరోపణలు చేసారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయి తమను అన్యాయం చేస్తోందని లగడపాటి వంటి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వాపోతుంటే ఈయన ఈవిధంగా మాట్లాడటం చూస్తే ఇక రాజకీయాల నుండి రిటైర్మెంటు తీసుకోవచ్చునని అర్ధం అవుతోంది.

టీఆర్‌ఎస్ కంచుకోటకు బీటలు..!

      టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా పిలువబడే సిద్ధిపేటకు బీటలు మొదలయ్యాయి. ఈ నియోజక వర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి వలసలు జోరందుకోవడంతో ఆ పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. మండల కేంద్రమైన చిన్నకోడూరుకు చెందిన గ్రామపంచాయతీ ఉప సర్పంచు మంగా ప్రసాద్, మరో ఆరుగురు వార్డు సభ్యులు, కార్యకర్తలు సిద్ధిపేట ఆత్మ కమిటీ ఛైర్మన్ కాముని శ్రీనివాస్ పార్టీని వీడి ఎంపీ విజయశాంతి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.   మరోవైపు సిద్ధిపేట నియోజ కవర్గంలోని చిన్నకోడూరు, నంగునూరు, సిద్ధిపేట మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్ సర్పంచులు, గ్రామ, మండల శాఖ నాయకులు పెద్ద యెత్తున కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎవరికి వారుగా తమ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన సిద్ధిపేట నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడల్లా అండగా నిలిచారు. అయితే, ఇప్పుడిప్పుడే సిద్ధిపేట నియోజకవర్గంలోని ప్రజల్లో మార్పు కొ్టచ్చినట్లు అగుపిస్తున్నది. స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకత్వం వల్ల అటు ప్రజలు, ఇటు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, తెలంగాణవాదులు కొంత అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం.

కోస్తాంధ్రలో 'హెలెన్' బీభత్సం

        'హెలెన్' తుఫాన్ దెబ్బకు పచ్చని కోనసీమ మరోసారి కకావికలమైంది! వందల సంఖ్యలో కొబ్బరి చెట్లు నేలరాలాయి! మిగిలిన చెట్లు తుఫానుకు ఎదురు నిలిచినా.. వాటిపై ఒక్క కాయ కూడా లేదు. కోనసీమ కొబ్బరి రైతు మరో పదేళ్లదాకా కోలుకోలేని రీతిలో తుఫాను దెబ్బతీసింది. లక్షల హెక్టార్లలో పంటలు మునిగాయి.   అరటి, చెరకు, తమలపాకు, పసుపు తదితర పంటలకు నష్టం వాటిల్లింది. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విద్యుత్తు వ్యవస్థ చిన్నాభిన్నమైంది! వేల సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి! వందలాది గ్రామాల్లో అంధకారం నెలకొంది! ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 1055 విద్యుత్తు స్తంభాలు కుప్పకూలాయి. 88 కిలోమీటర్ల విద్యుత్తు లైన్లు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సహా తీర ప్రాంత మండలాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 23 సబ్ స్టేషన్ల పరిధిలోని వంద గ్రామాల్లో అంధకారం నెలకొంది. 800కుపైగా కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. కోనసీమ సహా వివిధ ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరణకు మూడు రోజుల సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తుఫాను బీభత్సానికి కోస్తా జిల్లాల్లో 13 మంది మరణించారు. వీరిలో చెట్లు మీద పడి ఐదుగురు, విద్యుత్తు స్తంభాలు కూలి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.   video coutesy:tv9

యంగ్ టైగర్ జీవితంతో సీతయ్య ఆడుకొంటున్నాడా

  నందమూరి వంశస్థుడయిన తనకు తెలుగుదేశం పార్టీలో తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని చీటికి మాటికి అలుగుతూ ఎప్పుడో ఓసారి పార్టీ కార్యక్రమాలకి వచ్చి అప్పుడు కూడా తనదయిన శైలిలో వ్యవహరించే హరికృష్ణ, పార్టీతో సంప్రదించకుండా సమైక్యాంధ్ర వేడిలో తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన తరువాత ఆయన పరిస్థితి ఇప్పుడు రెంటికీ చెడిన రేవడిగా తయారయింది.   ఆ మధ్య వైకాపా జూనియర్, సీనియర్ యన్టీఆర్ ల ఫోటోలను తన పార్టీ బ్యానర్లలో వేసుకొని తెదేపాతో మైండ్ గేమ్స్ మొదలుపెట్టినప్పుడు, అతని సోదరుడు గట్టిగా ఖండించినప్పటికీ హరికృష్ణ మాత్రం అందులో తప్పేమిటి? అన్నట్లుగా మాట్లాడటంతో కేవలం ఆయనపైనే కాకుండా ఆ ప్రభావం అయన కుమారుడు జూ.యన్టీఆర్ సినిమాలపై కూడా నేటికీ తీవ్ర ప్రభావం చూపుతోంది. పార్టీకి, తమకి మధ్య ఏర్పడిన ఆ దూరాన్ని తగ్గించుకోవాలని ఇరువైపులా వారు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంతో వారి మధ్య ఆదూరం అలాగే ఉండిపోయింది.   రాష్ట్ర విభజన వ్యవహారంతో పార్టీ తీవ్రంగా సతమవుతున్నతరుణంలో హరికృష్ణ తన యంపీ పదవికి రాజీనామా చేయడం ఆ దూరాన్ని మరింత పెంచింది. ఆయన తనకు ఏ కారణంగా పార్టీలో ప్రత్యేక హోదా, గౌరవం కలిగి ఉండాలని ఆశిస్తున్నారో, ఇప్పుడు అదే నందమూరి వంశం అర్హత కారణంగానే ఆయన రాజీనామా పార్టీని ఇబ్బందులలో పడేసింది.   చంద్రబాబు పార్టీని కాపాడుకోవడానికి తలపెట్టిన ఆత్మగౌరవ యాత్రకు సమాంతరంగా ఆయన కూడా సమైక్యాంధ్ర కోసం ‘చైతన్యయాత్ర’ మొదలుపెడతానని ప్రకటించినా, బహుశః పార్టీ ఒత్తిడి వలననే ఆ ప్రయత్నం విరమించుకొన్నట్లు భావించవలసి ఉంటుంది. కానీ మళ్ళీ ఈ మధ్య ఆయన ‘తెలుగుజాతి మనోవేదన’ అంటూ ప్రజలకు మూడు పేజీల బహిరంగ లేఖ ఒకటి పత్రికలకి విడుదల చేసారు.   అందులో రాష్ట్ర విభజన చేస్తున్నకాంగ్రెస్ అధిష్టానాన్ని, దాని ఉద్దేశ్యాలని వివరించి, అధిష్టానానికి తలొగ్గి ప్యాకేజీలు కోరుతున్న కాంగ్రెస్ యంపీలను, కేంద్రమంత్రులను, వారి అధిష్టానాన్నికూడా దుమ్మెత్తి పోశారు. కానీ ఆయన అంతటితో ఆగకుండా 'సమన్యాయం' అంటూ మాట్లాడటం కూడా తెలుగుజాతిని ద్రోహం చేయడమేనంటూ పరోక్షంగా మళ్ళీ స్వంతపార్టీకి కూడా చురకలు వేసారు.   ఇంకా రాజకీయాలలోనే కొనసాగాలనుకొంటున్న హరికృష్ణ ఈ బహిరంగలేఖతో ఏమి సాధించదలచుకోన్నారో తెలియదు. కానీ తనసమైక్యవాదంతో అటు వైయస్సార్ కాంగ్రెస్ తోనూ కలవలేక, ఇటు స్వంత పార్టీతోను కలవలేక తన రాజకీయ జీవితాన్నే కాకుండా తన కుమారుడు ఎంతో కష్టపడి నిర్మించుకొన్న సినిమా జీవితాన్నికూడా నాశనం చేస్తున్నారు.   ఆయన చేస్తున్న సమైక్యవాదం వల్ల రాష్ట్ర విభజన ఆగిపోదు. వైకాపా అతనికి బాజా బజంత్రీలతో ఎదురేగి పార్టీలోకి స్వాగతం పలకదు. రెండు రాష్ట్రాలకి సమన్యాయం కోరుతున్న తెదేపా ఆయనని దరిచేరనీయదు. పైగా ఈ ప్రభావం ఆయన కుమారుడి సినీజీవితాన్ని కూడా దెబ్బ తీస్తోంది. ఆయన చేస్తున్నసమైక్యవాదం వలన తెలంగాణాలో యన్టీఆర్ సినిమాలకు ఆటంకాలు ఎదురవుతుంటే, ఆ తండ్రీ కొడుకులు వైకాపాకు దగ్గరవుతున్నారనే అనుమానంతో ఆంధ్రాలో అభిమానులు దూరం అవుతున్నారు.   హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. కనీసం పార్టీ సభ్యుడిగా క్రియాశీలకంగా పార్టీ వ్యవహారాలలో పాల్గొన్నదీ లేదు. అటువంటప్పుడు పార్టీ నుండి కానీ ప్రజల నుండి గానీ ఆయన ఏదో ఆశించడం అవివేకం. కనీసం రాజకీయ సన్యాసం స్వీకరిస్తే కనీసం ఆయన తన కుమారుడు యన్టీఆర్ కయినా మేలు చేసినవారవుతారేమో ఆలోచిస్తే బాగుంటుంది.

జగన్‌ దేశ పర్యటన

  సమైక్య రాష్ట్రం కోసం గట్టిగా కృషి చేస్తున్నానన్న క్రెడిట్‌ కోసం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నివిదాల ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా  విభజిస్తుందంటూ ఆరోపిస్ దేశ నాయకులను కలుస్తున్నారు జగన్‌. అందులో భాగంగానే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మరోసారి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవనున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం.. అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ విభజన ముసాయిదా బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందని చెప్తున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్రపతిని కలిసి విభజన ప్రక్రియలో జోక్యం చేసుకుని అడ్డుకోవాలని కోరనున్నారు.   జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలో రాష్ట్రపతిని కలవనున్నారు. ఆ తరువాత సాయంత్రం 5 గంటలకు జనతాదళ్ అధినేత శరద్‌యాదవ్‌ను కలిసి సమైక్యాంద్ర ప్రదేశ్‌కు మద్దతు కోరనున్నారు.ఆదివారం ఉదయం 11 గంటలకు బిజూ జనతాదళ్‌ అథినేత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను కలసి రాష్ట్ర పరిస్థితులను వివరించనున్నారు.

యూటికి మేం వ్యతిరేకం

  రాష్ట్రవిభజన నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దిన్‌ ఒవైసి, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధిని కలిశారు. శుక్రవారం మద్యాహ్నం సోనియాను కలిసిన ఆయన 45 నిమిషాల పాటు చర్చించారు.కేంద్ర మంత్రుల బృందానికి ఇచ్చిన నివేదికనే తిరిగి సోనియాగాంధీకి కూడా వినిపించానని అసదుద్దీన్ చెప్పారు. హైదరాబాద్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రపాలిత ప్రాంతం చేయొద్దని ఆయన సోనియాను కోరారు. హైదరాబాద్‌ను ఇరు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధాని చేయాలన్న సీడబ్ల్యుసీ ప్రతిపాదనకు కూడా తాము వ్యతిరేకమని, దేశంలో ఏ రాష్ట్ర రాజధానీ మరొక రాష్ట్రంలో లేదని గుర్తు చేశానన్నారు. ఒకవేళ తప్పదని భావిస్తే కనుక కేవలం ఖైరతాబాద్ మండల పరిధికే ఉమ్మడి రాజధానిని పరిమితం చేయాలని సోనియాను కోరానని అసదుద్దీన్ తెలిపారు.

విభజన వాదులను జైళ్లో పెడతా

  రాష్ట్ర విభజన నేపధ్యంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన నేత టిజి వెంకటేష్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను ముఖ్యమంత్రినై తే... రాష్ట్ర విభజనవాదులను జైల్లో పెడతా అంటూ మంత్రి టీజీ వెంకటేష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రం కోసం తీవ్రంగా పోరాడుతున్నామన్న ఆయన త్వరలో విభజనను అడ్డుకోవటానికి లక్షమందితో ఢిల్లీ వెల్లనున్నట్టు చెప్పారు. అయితే లక్షమందితో ఢిల్లీ దిగ్బందం కార్యక్రమం ఏపిఎన్జీవో అద్యక్షడు అశోక్‌బాబు నేతృత్వంలోనే జరుగుతుందన్నారు.ఢిల్లీ ముట్టడికి తన వంతుగా 15 వేల మందిని తీసుకెళతానని వెల్లడించారు. సీయం విభజనను ఆపాటానికి అన్నివిదాలుగా కృషిచేస్తున్నారన్న టిజి అసెంబ్లీ రద్దు చేయాల్సిందిగా సియంను కోరుతా నన్నారు.

నిమ్మకూరులో జగన్‌కు చేదు అనుభవం

  కృష్ణాజిల్లా పర్యటనలో ఉన్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు సొంతఊరు నిమ్మకూరులో పర్యటిస్తున్న జగన్‌, అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేయాలనుకున్నారు అయితే ఎన్టీఆర్‌ అభిమానులు ఆయన్ను అడ్డుకున్నారు. జగన్‌ పూల మాల వేస్తే ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పాలతో శుద్ది చేస్తామని అభిమానులు హెచ్చరించారు. దీంతో జగన్‌ పూలమాల వేయకుండానే వెనుదిరిగారు. తరువాత ఎన్టీఆర్‌ బంధువు పెద వెంకటేశ్వరరావు ఇంటికి జగన్‌ వెళ్లారు.

ఏటిఎం ఆగంతకుడి అరెస్ట్‌.?

  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏటీఎం వ్యవహారంలోని నిందితున్ని బెంగుళూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. పట్ట పగలు బెంగళూరులోని ఏటీఎం సెంటర్‌లో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన ఆగంతకుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తుముకూరు జిల్లా, టిపటూరులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి పేరు సతీష్ అని తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఇంకా పోలీసులు ధృవీకరించలేదు.  బెంగళూరులోని ఏటీఎంలో జ్యోతి ఉదయ్‌పై 19వ తేదీ ఉదయం దాడి జరిగింది. దాడిలో తీవ్ర గాయాల పాలయిన ఉదయ్‌ ప్రస్తుతం ఆమె బీజీఎస్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రేణుకాచౌదరికి అధిష్టానం షాక్‌

  ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ఫైర్‌బ్రాండ్‌ రేణుకాచౌదరికి కాంగ్రెస్‌ అధిష్టానం షాక్‌ ఇచ్చింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవి నుంచి శుక్రవారం రేణుకాచౌదరిను తొలగించింది. అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం పై రేణుకచౌదరితో పాటు జిల్లా నాయకులు కూడా షాక్‌ గురయ్యారు. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిథిగా రేణుకచౌదరి నియమితులయ్యారు. అయితే పార్టీ కార్యక్రమాలను భావాలను అనుకున్న స్థాయిలొ రేణుక ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారని అధిష్టానం అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమెను అధికార ప్రతినిధి పదవినుంచి తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.

విశ్వవిజేత ఓడిపోయాడు

  13 సంవత్సరాలుగా తన కిరీటాన్ని కాపాడుకుంటూ వస్తున్న చెస్‌ చాంపియన్‌ విశ్వనాధన్‌ ఆనంద్‌ చివరకు తలవంచాడు. 5 సార్లుగా వరుసగా టైటిల్స్‌ సాదిస్తున్న వచ్చిన ఆనంద్‌ ఈ సారి మాత్రం తన కిరీటాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. నార్వే దేశానికి చెందిన మాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ చెస్ చాంపియన్షిప్ను గెలుచుకున్నాడు. చెన్నైలో జరుగుతున్న ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్షిప్ పోటీలలో భారత యోధుడు విశ్వనాథన్ ఆనంద్ను 6.5-3.5 పాయింట్ల తేడాతో ఓడించి ఈ నార్వే యువకుడు కిరీటాన్ని దక్కించుకున్నాడు. ఏకంగా 13 సంవత్సరాల పాటు ఆ టైటిల్ మరెవ్వరికీ దక్కకుండా నిలబెట్టుకున్నాడు. అయితే, తాజా పోటీలలో భాగంగా పదో గేమ్ డ్రా కావడంతోనే ఈ కిరీటం ఆనంద్ చేజారింది. నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ విశ్వవిజేతగా నిలిచాడు. 22 ఏళ్ల అతి పిన్న వయసులోనే ఈ ఘనతను సాధించి రికార్డు సృష్టించాడు.

తెలంగాణ ఆశలు గోవిందా?

      కేంద్రం తెలంగాణ ఇచ్చే కార్యక్రమాన్ని ఏదో ఆషామాషీగా చేసిపారేద్దాం.. ఆంధ్రప్రదేశ్‌ని ఈజీగా రెండు ముక్కలు చేసిపారేద్దాం అనుకుని విభజన నిర్ణయాన్ని ప్రకటించింది. నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాతగానీ తాను తేనెతుట్టె మీద రాయితో కొట్టానని అర్థం అర్థంకాలేదు. ఇప్పుడు రాష్ట్రాన్ని కేక్ కోసినట్టు కోయడానికి కత్తి పట్టుకుని రెడీ అయిన మంత్రుల బృందానికి రాష్ట్రాన్ని ఎలా కోయాలో తెలియక ఆ కత్తితోనే బుర్రలు గోక్కుంటున్నారు.     రాష్ట్ర విభజన విషయంలో ఏ పాయింట్ గురించి ఆలోచించినా దాన్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థంకాక టెన్షన్ పడిపోతున్నారు. నెలలు, సంవత్సరాలు ఆలోచించి, ఎంతో కృషి చేస్తే తప్ప సాధ్యం కాని రాష్ట్ర విభజన ప్రక్రియని కట్టె కొట్టె తెచ్చె అన్నట్టు సింపుల్‌గా పూర్తి చేయడం ఎలాగో తెలియక గందరగోళపడిపోతున్నారు. అందుకే మంత్రుల బృందంలోని సభ్యులు ఈ విభజన గోల తమ నెత్తిన అనవసరంగా పడ్డ బరువుగానే భావిస్తున్నారు. బాధ్యత మొత్తం షిండే, జైరామ్ రమేష్ భుజాల మీద పడేసి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్టు అందరూ తప్పించుకు తిరుగుతున్నారు. మంత్రుల బృందం సమావేశానికి డుమ్మా కొట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మంత్రుల బృందం ఎప్పుడు సమావేశమైనా కొన్ని సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. దోశ పెనం మీద వుందన్నంత ఈజీగా బిల్లు రెడీ అవుతోందని మంత్రుల బృందం సభ్యులు గంభీరంగా చెబుతున్నప్పటికీ, నిజానికి అంత సీను లేదని తెలుస్తోంది. తమకు వీలుకాకుండా పోయిన ఈ తద్దినాన్ని ఎలా పెట్టాలో అర్థంకాక  మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిలా వుంటే, తెలంగాణ బిల్లు ఎందాకా వచ్చింది సార్ అని బృందంలో కీలక సభ్యుడు జైరామ్ రమేష్‌ని విలేకరులు అడిగితే, ఆయన ‘గోవిందా.. గోవింద’ అనేసి వెళ్ళపోయారట. పాపం లోపల ఎంత మథనపడి వుండకపోతే ఆయన నోట్లోంచి ఆ మాట బయటపడుతుంది? జైరామ్ రమేష్ చేసిన కామెంట్ చూస్తుంటే తెలంగాణ బిల్లు శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశాలు లేవన్నట్టే అనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శీతాకాల సమావేశాల్లో బిల్లు పార్లమెంటు ముందుకు రాకపోతే ఇక తెలంగాణ పరిస్థితి జైరామ్ రమేష్ చెప్పినట్టు ‘గోవిందా’ అనుకోవడమే అని భావిస్తున్నారు.

తీరాన్ని దాటిన హెలెన్ తుఫాన్

      రాష్ట్రంలో తీవ్ర ఉగ్రరూపం దాల్చిన హెలెన్ తుపాను మచిలీపట్నం వద్ద ఈ రోజు మధ్యాహ్నం తీరం దాటినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో ఆరు గంటల్లో ఇది క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారుతుంది. ఈ వాయుగుండం ప్రభావం వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. హెలెన్ తుపాను ప్రభావానికి రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో కోనసీమ ప్రాంతంలో విపరీతంగా నష్టంవాటిల్లినట్లు తెలుస్తోంది. మరోవైపు తీర ప్రాంత ప్రజలను అధికారులు పునరావాసకేంద్రాలకు తరలించిడంతో ప్రాణ నష్టం తప్పింది.   video courtesy;ETV 2