సమైక్య చాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్ లో గెలుపెవరిది
posted on Nov 16, 2013 @ 11:16AM
ఒక సమైక్య కృషీవలుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తన ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్దమని ప్రకటిస్తుంటే, మరొకాయన ఉంగరం పడిపోయిన చోటనే వెతుకోవాలనట్లు డిల్లీలో వాలి కాంగ్రెసేతర పార్టీలను తనతో సమైక్యం కమ్మని కోరుతున్నాడు.
పదవులు త్యాగాలు చేసినంత మాత్రాన్నఫలితం ఉండదని అనుభవపూర్వకంగా చెపుతున్నకావూరి, చిరంజీవి, పల్లంరాజు, పురందేశ్వరి వంటి వారి మాటలను ఖాతరు చేయక 'త్యాగం.. త్యాగం' అంటూ చాంపియన్ నెంబర్:1 ఒకటే పలవరిస్తున్నపటికీ, మరో వైపు ‘ఆయన కాంగ్రెస్ అధిష్టానం గీసిన గీతను జవదాటే రకం’ కాదని డిల్లీ వాళ్ళే సర్టిఫై చేస్తున్ననేపద్యంలో ఆయన విశ్వసనీయతపై జనాలలో అనుమానాలు మొదలయ్యాయి.
ఇక ‘సమైక్యసెంటిమెంటుతో సీమాంధ్రలో మొత్తం యంపీ సీట్లు అన్నినొల్లెస్తా, రాష్ట్రంలోనే కాదు డిల్లీ లెవెల్లో కూడా గిరగిర చక్రం తిప్పేస్తా’ అంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన చాంపియన్ నెంబర్:2 జగన్ బాబు ఇప్పుడు ఆ పనిమీదనే నేడు డిల్లీలో వాలిపోయారు. అందువల్ల ఇంతకీ ఆయన చేస్తున్నది సమైక్యయాత్రనా లేక ఎన్నికల పొత్తుల యాత్రనా అనే అనుమానాలు జనాలకున్నాయి.
ఏమయినప్పటికీ ఈనెలాఖరులోగా ఫైనల్స్ జరుగబోతున్నాయని షిండే మహాశయులు డేట్ కూడా ప్రకటించేసారు గనుక, ఇప్పుడు జరుగుతున్నవి సమైక్య చాంపియన్ ట్రోఫీ కోసం జరుగుతున్న మ్యాచ్ లో సెమీ ఫైనల్స్ గా భావించవచ్చును. డిల్లీలో కూర్చొన్న థర్డ్ ఎంపైర్స్ ఇంతకీ ఈ మ్యాచ్ లో ఎవరిని చాంపియన్ గా ప్రకటిస్తారో తెలుసుకోవాలంటే మరి కొన్ని వారాలు వేచి చూడక తప్పదు.