సోనియా కడుపులో మంట!
posted on Nov 15, 2013 @ 4:22PM
కడుపులో వున్న బాధ బాగా పెరిగిపోతే అది కడుపు మంటగా మారి బయటపడుతుంది. దానికి తాజా ఉదాహరణగా మనం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని తీసుకోవచ్చు. రాజకీయ ప్రసంగాలు చేయడంలో నరేంద్రమోడీకి, రాహుల్ గాంధీకి వున్న తేడాని దేశం మొత్తం గమనిస్తోంది. నరేంద్ర మోడీ ప్రసంగిస్తే జనం మంత్రముగ్ధుల్లా వింటున్నారు. అదే రాహుల్ గాంధీ నోరు విప్పితే జనం పెదవి విరుస్తున్నారు.
పసలేని, పనికిరాని ప్రసంగాలతో రాహుల్ గాంధీ అందరిచేతా అక్షింతలు వేయించుకుంటున్నాడు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ప్రసంగాల్లో మత ఘర్షణలు, ఇందిర, రాజీవ్ హత్యల్లాంటి విషయాలను ప్రస్తావించి అందరి చేతా తలంటి పోయించుకున్నాడు. చివరకు ఎన్నికల కమిషన్ కూడా రాహుల్ గాంధీని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించింది.
తన కడుపున పుట్టిన రాహుల్ గాంధీ సరైన రీతిలో ప్రసంగాలు చేయలేక భంగపడుతూ వుండటం చూసి ఆయనగారి మాతృమూర్తి సోనియాగాంధీ ఎంతో బాధపడుతోంది. అయినా సోనియాగాంధీకే సరిగా ప్రసంగాలు చేయడం రాదు.. మరి రాహుల్‌కి ఎలా వస్తుంది? అందుకే, తన కొడుకు ప్రసంగాలు బాగా చేయలేడుగానీ, దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళగడని ఆమె తల్లి హృదయం నమ్మేస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీ కంటే నరేంద్రమోడీ బాగా ప్రసంగిస్తూ జనాన్ని ఆకట్టుకుంటూ వుండటం ఆమె కడుపులో బాధని కలిగిస్తోంది.
ఆ బాధ కడుపు మంటగా మారి బయటపడింది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన సోనియాగాంధీ నరేంద్రమోడీ మీద విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘ప్రసంగాలతో దేశ సమస్యలను పరిష్కరించలేం.. అభివృద్ధి సాధించలేం’’ అని తన కడుపుమంటని బయటపెట్టుకున్నారు. రాహుల్ గాంధీ కంటే నరేంద్రమోడీ బాగా ప్రసంగిస్తున్నారన్న విషయాన్ని పరోక్షంగా ఒప్పుకున్నారు. నరేంద్రమోడీ కంటే రాహుల్ బాగా మాట్లాలేకపోతున్నాడని ఏడవటం కంటే, రాహుల్‌ని నరేంద్రమోడీ ప్రసంగాలు విని ఎలా మాట్లాడాలో నేర్చుకోమని చెప్పొచ్చు కదా సోనియా మేడమ్!