జగనన్న బాణం బ్యాక్ టూ అమ్ములపొది

  జగన్న వదిలిన బాణం కనబడటం లేదని, హైదరాబాదులో అంత పెద్ద సభ నిర్వహించినప్పుడు కనీసం ఆమె పేరు కూడా తలుచుకోలేదని మీడియాలో వస్తున్న రాజకీయ విశ్లేషణలు, ముఖ్యంగా తెదేపా నేతలు షర్మిలపట్ల జాలిపడుతూ మాట్లాడటం చూసిన తరువాత వైకాపా నేత అంబటి రాంబాబు వాటికి జవాబిస్తూ, జగనన్న విడిచిన బాణం తిరిగి అమ్ములపొదిలో చేరుకొంది. మళ్ళీ ఎప్పుడు అవసరమయితే అప్పుడు ఆమె ప్రజల ముందుకు వస్తారు. ఇంత కాలం జగనన్న జైల్లో ఉన్నందున ఆమె పాదయాత్రలు చేశారు. ఆమెను జగనన్న పక్కన పెట్టేసాదని, వారిరువురి మధ్య విభేదాలు ఏర్పడాయని మీడియాలో జరుగుతున్నా దుష్ప్రచారం చూసి మేమేమి భయపడిపోవట్లేదు. పార్టీకి అవసరమయినప్పుడు మళ్ళీ ఆమె సేవలు ఉపయోగించుకొంటాము,” అని అన్నారు.

పార్టీ నేతలని పొమ్మని బొత్సపోరు దేనికో

  రాష్ట్రం విడిపోతున్నందుకు బాధ కంటే విడిపోతే తమకు ముఖ్యమంత్రి అవకాశం దక్కుతుందని ఆశపడుతున్నకాంగ్రెస్ నేతలకు కరువు లేదు. అయితే ఆ మాట ఈ పరిస్థితుల్లో చెపితే అసలే ఆగ్రహంతో ఉన్న సీమాంధ్ర ప్రజలు భగ్గుమంటారనే భయంతోనే వారందరూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. కానీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లుగా, వారు ఎంత మొసలి కన్నీరు కారుస్తున్నా వారి మాటలు వారి మనసులో ఆలోచనలను బయటపెడుతున్నాయి.   ముఖ్యమంత్రి పదవిపై చాలా మోజుపడుతున్న వారిలో ప్రప్రధముడు బొత్ససత్యనారాయణ. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు కూడా. ఆయన మీడియాతో మాట్లాడుతూ వేరే పార్టీలో టికెట్స్ ఖాయం చేసుకొని పార్టీ వీడే ఆలోచన ఉన్నవారే పార్టీని ప్రజల ముందు దోషిగా చూపుతున్నారని, అటువంటివారి లిస్టు తన వద్ద సిద్దంగా ఉందని, క్రమశిక్షణ ఉల్లంగిస్తే నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. పార్టీని వదిలిపోదలచుకొన్న వారు, శాసనసభకు తెలంగాణా బిల్లు వచ్చేవరకు ఎదురు చూడనవసరం లేదని, నిరభ్యంతరంగా వెంటనే వెళ్లిపోవచ్చునని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవికి ఎవరయినా అర్హులేనని అన్నారు.   పార్టీ క్రమశిక్షణ ఉల్లంగిస్తే నోటీసులు జారీ చేస్తానని బింకాలు పలుకుతున్నఆయన గత రెండున్నర నెలలుగా నిత్యం అధిష్టానాన్ని ధిక్కరిస్తూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇంత కాలమయినా ఎందుకు నోటీసులు జారీ చేయలేదు? అదేవిధంగా రెండు రోజుల క్రితం ఆయనే స్వయంగా తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖంగా ఓటుస్తానని ప్రకటించారు. మరి అది క్రమశిక్షణ ఉల్లంఘన కాదా?   మరి తమ ఇద్దరికీ వర్తించని క్రమశిక్షణ పార్టీలో ఇతరులకే ఎందుకు అవసరం? అంటే పార్టీ నుండి ఎంత మంది వెళ్ళిపోతే తనవాళ్ళకు అంత మందికి పార్టీ టికెట్స్ ఇప్పించుకోవాలని ఉబలాటపడుతున్నట్లుంది. అందుకే పదేపదే పార్టీ నేతలని వెళ్లిపొమ్మని చెపుతున్నారు. ఇది కిరణ్ కుమార్ రెడ్డి కూడా వర్తిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. అయితే నేరుగా ఆయనతో ఆ మాటనే దైర్యం, తెగువ లేదు గనుక ఇలా అన్యాపదేశంగా చెపుతున్నారు.   ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించాలని అధిష్టానం నిర్ణయిస్తే, ఆ కుర్చీలో కూర్చోవడానికి అందరి కంటే మొట్ట మొదట నిలబడేది ఆయనే. ఒకవేళ ఇప్పుడు కుదరకపోయినా రాష్ట్రం విడిపోయిన తరువాతయినా తన ముఖ్యమంత్రి కల నెరవేర్చుకోవడానికి బొత్స గట్టిగా కృషి చేయడం ఖాయం. ఆయన పట్ల ప్రజలలో ఎంత చులకన భావం ఉందో ఇటీవలే రుజువయింది. అయినప్పటికీ, ఆయన ధోరణిలో ఎటువంటి మార్పు కలిగినట్లు లేదు.

ఆరుషి హత్య కేసులో తల్లిదండ్రులే దోషులు

      దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులు దోషులని ఘజియాబాద్ సిబిఐ కోర్ట్ నిర్ధారించింది. ఆరుషి, హేమరాజ్ ల జంట హత్య కేసులో తల్లిదండ్రులు రాజేష్ తల్వార్, నుపుర్ తల్వార్‌లు నేరస్తుల అని సిబిఐ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది.   2008 మే 16న ఆరుషి - హేమరాజ్‌ల హత్య జరిగిన విషయం తెలిసిందే. నిజానికి ఆరోజు ఆరుషి పదహారవ పుట్టినరోజు. ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్‌లో వారిని హత్య చేశారని సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. దర్యాఫ్తు సమయంలో కేసు అనేక మలుపులు తిరిగింది. ఆఖరికి ఆమె తల్లిదండ్రులు దోషులని సిబిఐ కోర్ట్ తీర్పును వెల్లడించింది.         కోర్టు తీర్పు వెలువడగానే రాజేష్, నుపుర్‌లు కోర్టు హాలులోనే బోరున విలపించారు. వారికి సెక్షన్ 302 కింద కోర్టు రేపు శిక్షను ఖరారు చేయనుంది. పోలీసులు వారిని దస్నా జైలుకు తరలించనున్నారు.ఈ హత్య కేసులో ఐదున్నరేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేస్తామని రాజేష్ తల్వార్ చెప్పారు.

రాష్ట్రాన్ని భయపెడుతున్న 'లెహర్'తుఫాన్

      రాష్ట్రాన్ని వరుస తుఫానులు హడలెత్తిస్తున్నాయి. మొన్న 'ఫైలిన్', నిన్న 'హెలెన్', తాజాగా 'లెహర్' రాష్ట్రాన్ని భయపెడుతుంది. బంగాళాఖాతంలోకి ప్రవేశించిన 'లెహర్' పెనుతుఫాన్‌గా మారినట్లు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తుందని, ఈ క్రమంలో కోస్తావైపుగా పయనించి ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నానికి కళింగపట్నం-మచిలీపట్నంల మధ్య కాకినాడ సమీపాన తీరం దాటుతుందని పేర్కొంది.   అండమాన్‌లో 'తుఫాన్' ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి తెలిపారు. మత్స్యకారులను వాతావరణశాఖ అధికారులు అప్రమత్తం చేసింది. విశాఖ తీరానికి సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో లెహర్ తుపాను కేంద్రీకృతమై ఉంది.  ఆదివారం అర్ధరాత్రికి పోర్టుబ్లెయిర్ వద్ద తీరాన్ని దాటి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించిన అనంతరం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది.    video courtesy etv 2

సోనియాని జైపాల్ ఎందుకు కలిశారు?

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎప్పుడూ తెర ముందు కనిపించని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కేంద్రం తెలంగాణ విభజన ప్రకటన చేసిన తరువాత చురుకుగా ముందుకు వెళ్తున్నాడు. ఇటీవల తెలంగాణ జిల్లాలలో కాంగ్రెస్ సభల్లో తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు. దాంతో పాటు ఢిల్లీలో తెలంగాణ గురించి కేంద్ర మంత్రుల బృందాన్ని కలిసి నివేదిక సమర్పించాడు. అయితే తాజాగా రాయల తెలంగాణ వార్తల నేపథ్యంలో ఆయన ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఒవైసీతో బేటీ తర్వాత, రాయలతెలంగాణపై ఐబీ విచారణ, ఇప్పుడు జైపాల్‌తో భేటీ పలు అనుమానాలకు తావిస్తోంది.

రాయల తెలంగాణ పై కేంద్రం ఆరా..!

      రాష్ట్ర విభజన అంశం కీలక దశకు వచ్చిన సమయంలో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రాయల తెలంగాణ అ౦శాన్ని తెరమీదకు తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రాయల తెలంగాణ పై వివిధ పార్టీల అభిప్రాయాలను కేంద్రం రహస్యంగా సేకరిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతంలోని తెరాస, బిజెపి, సిపిఎం, సిపిఐ పార్టీల ఎమ్మెల్యేలను ఈ విషయం పై ఇంటెలిజెన్స్ అభిప్రాయం అడగడంతో, ఈ విషయం బయటికివచ్చింది.   పది జిల్లాల తెలంగాణకే తాము కట్టుబడి ఉన్నామని బిజెపి, తెరాసలు చెప్పాయి. బిల్లు చూశాక చెబుతామని సిపిఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎంఐఎం  రాయల తెలంగాణాకు సుముఖుంగా ఉండడం, అనంతపురం, కర్నూల్ జిల్లాల నేతలు కూడా ఇదే విషయంపై పట్టుపడుతుండడంతో కేంద్రం రాయల తెలంగాణ ఏర్పాటుకే మొగ్గుచూపుతోంది అన్నది విశ్వసనీయ సమాచారం.  దీంతో రాయల తెలంగాణ అంశం మరోసారి ప్రాదాన్యతను సంతరించుకుంది. అయితే ఈ అంశానికి తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నందున విభజన అంశం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరోవైపు తనకు రాయల తెలంగాణ అంశంపై ఐబి నుండి ఫోన్ వచ్చిందని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. కేంద్రం రాయల తెలంగాణతో మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదించుకునేందుకు కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆరోపించారు.

తెలంగాణాపై కాంగ్రెస్ డ్రామా

  ఇక నేడో రేపో తెలంగాణా బిల్లుని రాష్ట్రశాసనసభలో, పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సర్వం సిద్దం చేసుకొన్న ఈ తరుణంలోకూడా కాంగ్రెస్ అధిష్టానం రాయల తెలంగాణా అంటూ మీడియాకు లీకులు ఇవ్వడం ఒక విచిత్రమనుకొంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల మద్దతుతో రాష్ట్ర విభజనను అడ్డుకొంటానని రచ్చబండ మీద నిలబడి రంకెలు వేస్తుండటం మరో విచిత్రం. అదే సమయంలో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలలోనే తెలంగాణా బిల్లు ఆమోదం కూడా పొందుతుందని తన అపార రాజకీయ అనుభవంతో చెపుతున్నానని అనడం చూస్తే కాంగ్రెస్ ఈ ప్రక్రియని ఎంత లౌక్యంగా ముందుకు తీసుకువెళుతోందో అర్ధం అవుతుంది.   కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయమే శిరోధార్యమని చెప్పే కాంగ్రెస్ నేతలు మళ్ళీ మధ్యలో ఈ రాయల తెలంగాణా ప్రసక్తి ఎందుకు తెస్తున్నారంటే ప్రజలని గందరగోళ పరచడానికే, లేకుంటే రెండు ప్రాంతాల ప్రజలు కూడా వ్యతిరేఖిస్తున్నారని తెలిసికూడా ఈవిధంగా మాట్లాడేవారు కారు.   ఇక రాయల తెలంగాణా పేరు చెప్పి తెరాసను లొంగ దీయలనుకొంటోందనే వాదన కూడా నమ్మశక్యంగా లేదు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆపార్టీయే నష్టపోతుంది తప్ప తెరాసకు వచ్చేనష్టం ఏమిలేదు.   ఇటువంటి రకరకాల మీడియా లీకులతో కేవలం సీమాంధ్ర ప్రజలను అయోమయాపరుస్తూ తన పని సజావుగా కానీయడానికే కాంగ్రెస్ నేతలందరూ సమిష్టిగా కష్టపడుతున్నారు. ఇక రాష్ట్ర విభజన విషయంలో తన అధిష్టానాన్ని నిత్యం విమర్శించే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, దానిని అడ్డుకొనే ప్రయత్నమేదీ చేయకపోయినా, ఇలాగ రచ్చబండ మీద నిలబడి రంకెలు వేస్తూ ప్రజలలో తన పరపతి పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఆయనే స్వయంగా తన అధిష్టానానికి ఈ ప్రక్రియ సజావుగా పూర్తిచేసేందుకు అవసరమయిననంత సమయం కల్పిస్తున్నారు. మొత్తం ప్రక్రియ అంతా పూర్తి అయిపోయిన తరువాత తెలంగాణా బిల్లు మొక్కుబడిగా రాష్ట్రశాసన సభకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చినంత మాత్రాన్న బిల్లు ఆగిపోదని సామాన్య ప్రజలకి కూడా తెలుసు. అటువంటప్పుడు తను విభజనను అడ్డుకొంటానని ఆయన చెప్పడం కేవలం ప్రజలని మభ్యపెట్టడానికే.   ఇటువంటి తరుణంలో జైపాల్ రెడ్డి చెప్పిన మాటలనే ప్రామాణికంగా తీసుకొంటే, పార్లమెంటు శీతాకాల సమావేశాలలోనే తెలంగాణా బిల్లు తప్పక ఆమోదం పొందుతుందని అర్ధం అవుతోంది. అయితే అందుకు అవరోధంగా ఉన్నరాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డీ)ని కాంగ్రెస్ ఏవిధంగా అధిగమిస్తుందనే ఒకే ఒక అంశంపై తగిన వివరణ అవసరం. దానిపై కాంగ్రెస్ అధిష్టానంలో పెద్దలు కానీ, కేంద్రమంత్రుల బృందంలో సభ్యులెవరూ గానీ ఇంతవరకు పెదవి విప్పకపోవడం చూస్తే, దానిని అధిగమించేందుకు కూడా వారికి తగిన వ్యూహం ఉందని అర్ధం అవుతోంది. అందువల్ల ఇక పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టబడే వరకు వచ్చే మీడియా లీకులన్నీ కేవలం ప్రజలను త్రప్పు ద్రోవ పట్టించడానికే.

మధ్యప్రదేశ్, మిజోరంలో కొనసాగుతున్న పోలింగ్

      మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. మధ్యప్రదేశ్‌లోని 270 అసెంబ్లీ స్థానాల కోసం. 51 జిల్లాల్లో మొత్తం 2,583 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 4,64,57,724 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.   ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బుధ్నీ, విదిష స్థానాల నుంచి బరిలోకి దిగారు. ఆయన నాయకత్వంలో ‘అభివృద్ధి’ మంత్రంతో బీజేపీ హ్యాట్రిక్ సాధించి రికార్డు నెలకొల్పాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఎన్నికల్లో సీఎల్పీ నేత అజయ్ సింగ్ కాంగ్రెస్ శిబిరానికి నాయకత్వం వహిస్తున్నారు.  ఆయన చుర్హత్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి బుధ్నీలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాల నుంచి మొత్తం 142 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి లాల్ థన్హావ్లా కాంగ్రెస్ శిబిరానికి నాయకత్వం వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష కూటమి అయిన ఎండీఏ మొత్తం 40 స్థానాల నుంచి తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. రాష్ట్రంలో 1,126 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 6,90,860 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

తెలంగాణ సీఎం రేసులో మర్రి శశిధర్..!

      తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏమోగాని...రాష్ట్రం ఏర్పడితే ముఖ్యమంత్రి కావాలనుకోనె వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. తాజాగా తెలంగాణ సీఎం రేసులో మర్రి శశిధర్ రెడ్డి కూడా చేరిపోయారు. గత కొన్ని రోజుల నుంచి శశిధర్ రెడ్డి తెలంగాణ విషయంలో కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఈ ఊహాగానాలకు తెర లేపింది. దానికి తోడు అన్నట్టుగా కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ తాజాగా మర్రికి అనుకూలంగా మాట్లాడడం విశేషంగానే ఉంది. శశిధర్ రెడ్డి ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని, ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆయనకు అన్ని అర్హతలూ ఉన్నాయని బలరాం నాయక్ కితాబిచ్చారు.   తెలంగాణ ఉద్యమం సాగుతున్నపడు కానీ, టీ కాంగ్రెస్ నేతల సమావేశాలు, సభలు జరిపినప్పుడుకానీ, ఇతర కార్యక్రమాల వైపు చూడని శశిధర్, గత కొంతకాలంగా తెలంగాణపై గళం విప్పుతూ వస్తున్నారు.  ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీయవద్దంటూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చురకలు వేశారు. అసలు ఆయనకు తెలంగాణ ఏర్పాటు కావాలని లేదేమో అని కూడా వ్యాఖ్యానించారు. తాజాగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలన్న ప్రతిపాదనను శశిధర్ తలెకత్తుకున్నారు.  తాను తెలంగాణ వాదిని కానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 స్థానాలకు అదనంగా మరో 34 నియోజకవర్గాలను ఏర్పాటు చేసి ఆ సంఖ్యను 153కు పెంచాలన్న ప్రతిపాదన తీసుకు వచ్చారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లి 26న షిండేతో పాటు జీవోఎం సభ్యులను, పార్టీ పెద్దలను కలిసి సీట్ల సంఖ్య పెంచాలని, ఆ అంశాన్ని బిల్లులో పొందుపరచాలని కోరతామని శశిధర్ రెడ్డి అన్నారు.  

జగన్ ద్వంద వైఖరి

  రాష్ట్ర విభజన అనివార్యమని దృడంగా నమ్మినందునే వైకాపా రాత్రికి రాత్రి తెలంగాణా నుండి సీమాంధ్రలోకి జంప్ అయింది. అందుకే తనకు నమ్మిన బంటులయిన కొండా సురేఖ వంటి నేతలను సైతం వదులుకోవడానికి ఆ పార్టీ వెనకాడలేదు. అయితే సమైక్యాంధ్ర సెంటిమెంటుతో వైకాపా రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తోందని వస్తున్నఆరోపణలను ఎదుర్కోవడానికో లేకపోతే తెదేపాను చూసో జగన్ మళ్ళీ తెలంగాణా నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టారు. అంటే వైకాపా తెలంగాణాను వదిలిపెట్టేయలేదని, ఎన్నికలలో కూడా పోటీ చేస్తుందని ఆయన సంకేతాలు పంపారనుకోవాలి.   కానీ అదే సమయంలో సీమాంధ్రలో తనకున్న బలాన్ని ప్రదర్శించడానికి హైదరాబాదులో భారీ సభ నిర్వహించి తాను తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేఖిస్తున్నట్లు చెప్పారు. అంతే గాక సీమాంధ్రలో తమ పార్టీ అన్నియంపీ సీట్లను కైవసం చేసుకొని డిల్లీలో చక్రం తిప్పుతానని ప్రకటించారు కూడా. ఆ బహిరంగ సభ ద్వారా తన బలం ప్రదర్శించుకొన్నతరువాతనే అతను ఇప్పుడు దేశంలో వివిధ ప్రాంతీయ పార్టీల నాయకులని కలవడం చూస్తే, అతని రాజకీయ ఉద్దేశ్యాలు స్పష్టం అవుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే మిషతో దేశ వ్యాప్తంగా వివిధ పార్టీల నేతలతో పరిచయాలు పెంచుకోవడం అతని ప్రధాన ఉద్దేశ్యం అయితే, సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న ఏకైక చాంపియన్ గా తనని తను ప్రమోట్ చేసుకోవడం రెండో ఉద్దేశ్యం.   తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని అడ్డుకోవడానికి తను చేస్తున్న ప్రయత్నాల వల్ల తమ పార్టీ తెలంగాణాలో అడుగుపెట్టే అవకాశం శాశ్వితంగా కోల్పోతుందని జగన్ నమ్ముతున్నపటికీ, అతను ఈవిధంగా వ్యవహరించడం చూస్తే, అతనికి ఇక తెలంగాణాపట్ల ఎటువంటి ఆసక్తిలేదని స్పష్టం అవుతోంది. మరి తెలంగాణా నేతల సంగతి? వారికి కూడా కొండా సురేఖ గతే పట్టిస్తారా?   రాష్ట్ర విభజన జరిగి తీరుతుందని జగన్ మనస్పూర్తిగా నమ్ముతున్నపటికీ, ఉత్తుత్తి ప్రయత్నాలు చేస్తూ సీమాంధ్రలో తన పార్టీని బలపరచుకోవడానికే ప్రయత్నిస్తునారని స్పష్టం అవుతోంది. నీతి, నిజాయితీలకు, విశ్వసనీయతకి తనకే పేటెంట్ హక్కులున్నాయన్నట్లు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఈవిధంగా అటు తన తెలంగాణా పార్టీ నేతలని, ఇటు సీమాంధ్ర ప్రజలని కూడా మభ్యపెట్టి  చివరికి ఏమి సాధిస్తారో ఆయనకే తెలియాలి.

మూడేళ్ళ పాలనలో రాజకీయ ఏకాకిగా మారిన కిరణ్

  కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టి నేటికి మూడేళ్ళు పూర్తయింది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ అయిన రోశయ్య చేతులెత్తేసిన తరువాత ఎవరూ ఊహించని విధంగా ఆయనను అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించింది. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో భాద్యతలు చెప్పటిన అయనపై అటు అధిష్టానం, ఇటు ప్రజలూ కూడా చాలా ఆశలు పెట్టుకొన్నారు. కానీ నాటి నుండి నేటి వరకూ కూడా ఆయనకు నిత్యం గడ్డు పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. అధిష్టానం దయతో ముఖ్యమంత్రి అయిన ఆయన ఇప్పుడు అదే అధిష్టానం ఆగ్రహానికి గురయి ఏ క్షణంలోనయినా పదవి పోగొట్టుకొనేలా ఉన్నారు.   సీనియర్ కాంగ్రెస్ నేతలకి ఆయన తన మంత్రి వర్గంలో అప్రదాన్యమయిన మంత్రి పదవులు కేటాయించడంతోనే అసమ్మతినే మొదలయింది. తెలంగాణా ఉద్యమాల వలన ఏర్పడిన రాజకీయ అనిశ్చితి కారణంగా ఆయన ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పట్టలేకపోయింది. బహుశః అందుకే ఆయన తనకు రాజకీయంగా ప్రయోజనం కల్పించే సంక్షేమ పధకాలకే పెద్దపీట వేసారు.   కానీ, తన మంత్రులెవరినీ సంప్రదించకుండా, వాటి ద్వారా కేవలం తను ఒక్కడే పేరు సంపాదించుకోవాలని ప్రయత్నించడంతో సహజంగానే మంత్రివర్గంలో తీవ్ర వ్యతిరేఖత ఎదురయింది. ఆ తరువాత విద్యుత్ చార్జీలు, సర్ చార్జీల పెంపు విషయంలో ఆయన అనుసరించిన ఒంటెత్తు పోకడలకి ఆయన పట్ల మంత్రి వర్గంలో వ్యతిరేఖత పెరిగింది. సీబీఐ చార్జ్ షీట్లలో పేరేక్కిన ధర్మాన, సబితా రెడ్డిలను కాపాడే ప్రయత్నంలో ఆయన ప్రతిష్టమరింత మసకబారింది. అంతే గాక తన నిర్ణయాన్ని వ్యతిరేఖించినందుకు డీయల్ రవీంద్రా రెడ్డిని పదవి నుండి తొలగించడంతో ఆయన పూర్తి నిరంకుశదోరణికి బయటపెట్టుకొన్నారు.   ఇక సకలజనుల సమ్మెలో ఆయన టీ-కాంగ్రెస్ నేతలను అరెస్టులు చేయించడం, తెలంగాణాని వ్యతిరేఖిస్తూ ఆయన చేస్తున్నవాదనలతో తెలంగాణా కాంగ్రెస్ నేతలకు, అధిష్టానానికి కూడా బద్ద శత్రువుగా మారిపోయారు. అయితే అందుకు ప్రతిఫలంగా సమైక్యవాదిగా సీమాంధ్ర ప్రజలలో కొంత పేరు సంపాదించుకొన్నపటికీ, ఈ విషయంలో కూడా మొత్తం క్రెడిట్ తను ఒక్కరే స్వంతం చేసుకోవాలని ప్రయత్నించడంతో ఏ కొద్దిమందో తప్ప సీమాంధ్ర నేతలు కూడా ఆయనకి దూరమవడంతో రాష్ట్ర రాజకీయాలలో దాదాపు ఏకాకిగా మారారు.   ఎన్నోఅంచనాల నడుమ ముఖ్యమంత్రిగా భాద్యతలు చెప్పటిన కిరణ్ కుమార్ రెడ్డి, స్వంత పార్టీని కానీ, రాష్ట్ర నేతలని గానీ, ప్రజలని గానీ మెప్పించలేకపోయారు. తను చేస్తున్నసమైక్యవాదం, తను ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే తనని ఆదుకొంటాయని ఆయన ఆశిస్తున్నట్లున్నారు.   అయితే ఈ మూడేళ్ళలో ప్రభుత్వ అసమర్ధత కారణం వల్లనయితేనేమి, ఉద్యమాల వల్లనయితేనేమి రాష్ట్రంలో పెరిగిన అరాచకం, అనిశ్చితి, అధిక ధరలతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజానీకం ఆయన వేరే కొత్త పార్టీ పెట్టుకొని వచ్చినా బహుశః ఆదరించక పోవచ్చును.   ఇంతకంటే చాలా క్లిష్టమయిన పరిస్థితుల్లో అయన లాగే ఎవరూ ఊహించని విధంగా ప్రధాని పదవి చేప్పటిన స్వర్గీయ పీవీ నరసింహరావుగారు కత్తి మీద సామువంటి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతూ కూడా అనేక క్లిష్ట పరిస్థితులలో ఏవిధంగా నెగ్గుకొచ్చారో గమనిస్తే, కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఘోరంగా వైఫల్యం చెందారో మరింత స్పష్టంగా అర్ధం అవుతుంది. కిరణ్ కుమార్ రెడ్డికి ఆయాచితంగా ఒక అపూర్వ అవకాశం దొరికినప్పటికీ దానిని సమర్ధంగా వినియోగించుకోలేకపోయరని చెప్పవచ్చును. .

జూ.యన్టీఆర్ మామ వైకాపాలోకి జంప్ అవుతారా?

  హరికృష్ణ రాజకీయ నిర్ణయాల వలన జూ.యన్టీఆర్ సినిమా కెరీర్ లో ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీడియాలో వస్తున్న వార్తలు నిజమయిన పక్షంలో ఇప్పుడు అతనికి తన మామగారు నార్నే శ్రీనివాసరావు వలన కూడా కొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. నార్నేశ్రీనివాసరావు గుంటూరు లేదా నరసరావు పేట నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డిని సంప్రదిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ రెండు సీట్లు ఇప్పటికే వల్లభనేని బాలశౌరి, అయోధ్య రామిరెడ్డికి ఇచ్చేందుకు జగన్ మాట ఇచ్చినందున, శ్రీనివాసరావుకి ఎటువంటి హామీ ఈయనప్పటికీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఎందుకంటే, ఆయనను పార్టీలోకి రప్పించగలిగితే, జూ.యన్టీఆర్ కూడా ఆయన పక్షం వహించక తప్పదు.  అంతే గాక ఆయనకు చెందిన ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యన్.స్టూడియో కూడా వైకాపా పక్షం వహిస్తుంది గనుక, అది ఎన్నికల ముందు పార్టీకి చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల ఆయనకి వేరే ఎక్కడయినా టికెట్ ఇచ్చి పార్టీలోకి రప్పించవచ్చు.   అదే జరిగితే, మొట్ట మొదటగా ఆ ప్రభావం జూ.యన్టీఆర్ మీదే పడటం ఖాయం. ఇదివరకు వైకాపా ఫ్లెక్సీ బ్యానర్స్ తో ఆడిన మైండ్ గేమ్స్ వలన తమకూ, పార్టీకి, కుటుంబానికి మధ్య అగాధం ఇప్పటికీ పూడ్చుకోలేక జూ.యన్టీఆర్, అతని తండ్రి హరికృష్ణ నేటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇప్పుడు నార్నే శ్రీనివాసరావు కనుక వైకాపాలో చేరినట్లయితే జూ.యన్టీఆర్ మరో అగ్ని పరీక్ష ఎదుర్కోక తప్పదు.   అతను తన మామగార్ని అనుసరించి వైకాపా వైపు వెళ్ళలేడు. వెళితే అది అనేక కొత్త సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా అది అతని సినిమా కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. నార్నెవారు వైకాపాలో జేరినట్లయితే, జూ.యన్టీఆర్- తెదేపాల మధ్య ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్నసంబంధాలు పూర్తిగా చెడే ప్రమాదం ఉంది. గనుక నార్నెవారు వైకాపా తీర్ధం పుచ్చుకొనే ముందు ఇటువంటి విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మేలేమో! అంతకంటే ఆయన తెదేపా నుండి టికెట్ సంపాదించుకొన్నట్లయితే అది ఉభాయకుశులోపరిగా ఉంటుంది కదా!

మరో సారి సమ్మెకు సిద్దమే..

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్ర వడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఏపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో శీతాకాల సమావేశాల్లో తెలంగాణ ఏర్పాటు జరగదన్నారు. పార్లమెంట్‌ సమావేశాల మొదలవుతున్న సందర్భంగా ఉద్యమాన్ని మరింత ఉదృతంగా ముందుకు తీసుకెళాతామన్నారు. రాజ్యంగ ప్రక్రియను కాదని కేంద్ర ముందుకు వెలితే ఊరుకోమన్నారు అశోక్‌బాబు. సమైక్యా రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి మరో సారి సమ్మెకు కూడా సిద్దమన్న ఆయన, గతంలో తాము సమ్మె చేసినపుడు ఎలాంటి సహకారం అందించని రాష్ట్ర నాయకులపై మండిపడ్డారు. త్వరలోనే ఛలో ఢిల్లీ లేదా, ఛలొ హైదరాబాద్‌ కార్యక్రమం చేయటానికి సిద్దమవుతున్నట్టుగా ప్రకటించారు.

మన సైన్స్‌లో నాణ్యత లేదు

  ఇటీవల భారత రత్న అందుకున్న సైంటిస్ట్‌ సిఎస్‌ఆర్‌ రావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతరిక్ష ప్రయోగాలన్నింటికి ముందు తిరుపతి బాలజీ ఆశీస్సులు తీసుకునే ఇస్రో సాంప్రదాయాన్ని ఆయన తప్పు పట్టారు. తనకు అలాంటి వాటి మీద నమ్మకం లేదన్న ఆయన జాతకాలను కూడా నమ్మనని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం బెంగళూరులో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన ఇలా స్పందించారు. ప్రతిభావంతులైన వారందరూ కంపూటర్స్‌ , సాఫ్ట్‌ వేర్‌ రంగాల వైపు ఎక్కవగా వెలుతుండటం వల్లే మన దేశంలొ సైన్స్‌ నాణ్యత నాసిరకంగా తయారైందన్నారు. ఇప్పటికైనా రిలయన్స్‌, టాటా లాంటి వారు పరిశోదనా రంగం వైపు నిధులు కేటాయించాలని కోరారు.

లోక్‌ అదాలత్‌ ప్రపంచ రికార్డ్‌

  లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారం విషయంలో ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒక్క శనివారం రోజే 28 లక్షలకు పైగా కేసులు పరిష్కరించింది లోక్‌ అదాలత్‌. 39 లక్షల పెండింగ్‌ కేసుల పరిష్కారం లక్ష్యంగా శనివారం విధ కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా సుప్రిం కోర్టులో మాట్లాడిన న్యాయమూర్తి జస్టిస్‌ పి సదాశివం, లోక్‌ అదాలత్‌ నిర్వహించే న్యాయమూర్తులు ఫిర్యాదు దారులను భయపెట్టి లేదా తప్పుదోవ పట్టించి కేసులు పరిష్కరించ వద్దని తెలిపారు. శనివారం రోజే మన రాష్ట్రంలో కూడా దాదాపు లక్షకు పైగా కేసులను పరిష్కరించారు.

వీళ్ళు సీమసింహాలు కాదు..!

      సింహం అవసరమైతే ఆకలితో చస్తుంది కానీ, గడ్డి మాత్రం తినదంటారు. కానీ, రాయలసీమ కాంగ్రెస్ రాజకీయ సింహాలు అవసరమైతే గడ్డి, ఇంకా అవసరమైతే చెత్తాచెదారం తినడానికి కూడా సిద్ధమయినట్టున్నాయి. నిన్న మొన్నటి వరకూ రాష్ట్రం సమైక్యంగా వుండాల్సిందేనని గర్జించిన రాయలసీమ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రాష్ట్రాన్ని ఎన్నిముక్కలు చేసినా పర్లేదంటూ మ్యావ్‌మంటున్నారు. రాయల తెలంగాణా ఇచ్చేయాలని దారుణమైన ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందుంచారు.   రాయలసీమ అంటే పౌరుషానికి ప్రతీక అంటారు. ఇప్పుడు అక్కడి కాంగ్రెస్ నాయకుల తీరు సీమ పరువును గంగలో కలిపేలా తయారైంది. ఇదేనా సీమ పౌరుషం అని నలుగురూ  నవ్వుకునే పరిస్థితి తెచ్చారు. వీరి తీరు ‘రాయలసీమ’ ఉనికికే ప్రమాదంగా మారింది. రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చిన కాంగ్రెస్ నాయకులు నాలుగు రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తే ఒక పద్ధతిగా వుండేది. అలా కాకుండా కర్నూలు, అనంతపురం జిల్లాలను మాత్రమే తెలంగాణలో కలపాలని డిమాండ్ చేయడం చాలా దారుణమైన, అవకాశవాదంతో కూడిన ధోరణికి పరాకాష్ట అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాయలసీమ రెండు జిల్లాలు తెలంగాణలో కలసిపోయి సంతోషంగా వుంటే, రాళ్ళు తప్ప నీళ్ళులేని చిత్తూరు, కడప జిల్లాల పరిస్థితేంటి? కోస్తాంధ్ర జిల్లాల గురించి ఆలోచించకపోతే ఆలోచించకపోయారు.. కనీసం రాయలసీమలో వున్న మిగతా రెండు జిల్లాల గురించి కనీసం ఆలోచించని మీ స్వార్థానికి ఏ పేరు పెట్టాలి? కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాత్రమే ఈ రెండు జిల్లాలు తెలంగాణలో కలవాలని కోరుతున్నారుగానీ, ప్రజలు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి ప్రతిపాదను చేయడానికి కాంగ్రెస్ నాయకులకు నోరెలా వస్తోందని తిట్టిపోస్తున్నారు. రాయలసీమ ఉనికికే ప్రమాదం ఏర్పడే ప్రయత్నాలు చేస్తున్న కొంతమంది రాయలసీమ కాంగ్రెస్ నాయకులు తమ దృష్టిలో సీమసింహాలు కాదని.. గ్రామసింహాలని రాయలసీమవాసులే విమర్శిస్తున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాంగానీ, రాష్ట్రాన్ని, రాయలసీమని ముక్కలు కానివ్వమని నినదిస్తున్నారు.  

సియం మార్పు ఖాయమా..?

  కేంద్ర తీసుకుంటున్న ప్రతినిర్ణయాన్ని తప్పుపడుతూ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా తయారైన సియం కిరణ్‌ను త్వరలో తప్పించనున్నారన్న వార్త కాంగ్రెస్‌ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. ఇప్పటికే కొత్త సియంగా కన్నా లక్ష్మీ నారాయణ పేరు వినిపిస్తున్న ఆయన మాత్రం ఆ వార్తలను ఖండిచారు. పార్టీలో వివాద రహితుడిగా పేరున్న కన్నాకు అధిష్టానం అండదండలు కూడా పుష్కలంగా ఉన్నట్టు సమాచారం. తొలుత ఈ అవకాశం కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇచ్చినా ప్రస్థుతం ఉన్న పరిస్థితుల్లో ఆ పదవి ముళ్ల కిరీటమే అని ఆయన ఆ ఆఫర్‌ ను తిరస్కరించారు. దీంతో కన్నానే కొత్త ముఖ్యమంత్రిగా సరైన వ్యక్తిగా భావిస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగానే  గత వారం ఆయనను కాంగ్రెస్‌ అధినేత్రి, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ స్వయంగా ఆయనను ఢిల్లీ పిలిపించుకుని మంతనాలు జరిపారు. అయితే ఆ తరువాత కూడా సియం మార్పు వార్తలు ఖండిచిన కన్నా తాజాగా రాష్ట్ర గవర్నర్‌ను కలవడంతో మరో సారి సియం మార్పు వార్త తెర మీదకు వచ్చింది. ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలతో రాష్ట్రంలో సియం మార్పు తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

విభజనపై సుప్రింలొ మరో పిటిషన్‌

  రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రిం కోర్టులొ మరో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయిలో సమైక్యాంద్ర కోసం పర్యటనలు చేస్తుండగా ఇప్పుడు అదే పార్టీకి చెందిన మరో నేత సుప్రిం కోర్టును ఆశ్రయించారు. విభజనపై ఏ పార్టీ స్పష్టమైన వైఖరిని కనబర్చకముందే కేంద్ర నిర్ణయం తీసుకోవటాన్ని  తప్పుపడుతూ కనుమూరి రఘురామకృష్ఱంరాజు సుప్రింలో పిటిషన్‌ను దాఖ లు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రం విభజి స్తుందంటూ ఆ యన దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్టికల్‌ 371డీ, కేంద్రంగా తనకు అనుకూలంగా వాడుకుంటుందని ఆయన పిటిషన్‌లో ఆరోపించారు. అయితే  ఆయన పార్టీలో చేరక మునుపే సుప్రింలో పిటిషన్‌ వేశారు. తరవాత వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న పోరాటం నచ్చి ఆయన పార్టీలో చేరుతున్నట్టుగా ప్రకటించారు.

రాష్ట్రానికి మరో తుఫాను గండం

  పైలిన్‌, హెలెన్‌ తుఫానులు సృష్టించిన బీభత్సాలను మర్చిపోకముందే ఇప్పుడు మరో గండం రాష్ట్రం మీదకు ముంచుకు వస్తుంది. ఇప్పటికే పైలిన్‌, హెలెన్‌ల తుఫానులతో తీవ్రనష్టాలను ఎదుర్కొన్న ప్రజలు ఇప్పుడు మరో తుఫాను వస్తుందన్న భయంతో బిక్కుబిక్కు మంటున్నారు. అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం పోర్ట్బ్లెయిర్కు దక్షిణ ఆగ్నేయంగా 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తీవ్ర వాయుగుండం, ఈ రాత్రికే తుఫానుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఇది ఈనెల 26వ తేదీలోగా వాయవ్య దిశగా మన రాష్ట్రంవైపు పయనించే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో మరోసారి ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.