రాష్ట్ర విభజన: సీఎం కిరణ్ ప్రోరోగ్ అస్త్రం..!
posted on Nov 20, 2013 @ 1:41PM
రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. ప్రోరోగ్ ద్వారా అసెంబ్లీ భేటీకి అడ్డుకట్ట వేయడం ద్వారా విభజనను జాప్యం చేసే యోచనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో విభజన అంశం కొత్త మలుపు తిరిగెఅవకాశం కనిపిస్తోంది.
రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం తన తుది నివేదికను ఈనెల 21న కేంద్ర మంత్రి మండలికి సమర్పించనుంది. దానిలో అవసరమయితే మార్పులు చేర్పులు చేసి, ఈనెల 28లోగా రాష్ట్రపతికి పంపనున్నారు. ఆయన దానిని పరిశీలించిన తరువాత రాష్ట్ర శాసనసభ ఆమోదానికి పంపుతారు. ఈ లెక్క ప్రకారం చూస్తే తెలంగాణా బిల్లు ఈనెలాఖరుకి లేదా వచ్చే నెల మొదటి వారంలోగానీ రాష్ట్ర శాసనసభ ముందుకు రాబోతోందని అర్ధం అవుతోంది.
వచ్చేనెల 5న మొదలయ్యే శీతాకాల పార్లమెంటు సమావేశాలు, ఐదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నందున కేవలం 20వరకే జరుగుతాయి. అందువల్ల రాష్ట్ర శాసనసభ సమావేశాలు వెంటనే జరుపకుండా పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు వాయిదా వేసినట్లయితే, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకోవచ్చునని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శాసనసభను ప్రోరోగ్ చేయాలని స్పీకర్ కు లేఖ రాసినా ఆయన జాప్యం చేశారంటూ కధనాలు వచ్చిన నేపధ్యంలో నాదెండ్ల మనోహర్ గవర్నర్ కు లేఖ రాస్తున్నారని సమాచారం. దీనివల్ల శాసనసభ ప్రోరోగ్ అవుతుంది. ప్రోరోగ్ కాకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు శాసనసభను పెట్టవచ్చు.
తెలంగాణా బిల్లుకి రాష్ట్ర శాసనసభ ఆమోదం అవసరం లేకపోయినా, రాజ్యాంగ పద్దతుల ప్రకారం సభలో కనీసం దానిపై చర్చజరగాలంటే సభ నిర్వహించి తీరాలి. కానీ ముఖ్యమంత్రి అభీష్టానికి విరుద్దంగా సభ నిర్వహించడం సాధ్యం కాకపోతే, తప్పని పరిస్థితుల్లో ఆయనను తొలగించి వేరొకరిని ఆ స్థానంలో నియమించయినా సరే ఈ ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంటుంది.