జగన్ పార్టీలోకి ధర్మాన

  జగన్‌మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసులో పదవి కోల్పోవటంతో పాటు కోర్టుల చుట్టూ తిరుగుతున్న ధర్మాన ప్రసాద్‌ రావు త్వరలో పార్టీ మారున్నారు. ఇప్పటికే ప్రసాద్‌రావు తమ్ముడు కృష్ణదాస్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతుండగా ఇప్పుడు ధర్మాన ప్రసాద్‌ రావు కూడా అదే పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు.  రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెడితే తాను కాంగ్రెస్ పార్టీని వీడతానని మాజీమం త్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గతంలోనే చెప్పారు. అయితే ఇటీవల పలు ప్రెస్‌మీట్‌లలో జగన్‌కు వ్యతిరేఖంగా స్టేట్‌మెంట్స్‌ ఇవ్వటంతో పాటు రాజశేఖర్‌ రెడ్డిని కూడా విమర్శించిన ధర్మానకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి స్థానం కల్పిస్తారన్న చర్చ మొదలైంది.  

హైదరాబాద్ పై శీలంగారి బేరాలు

  రాష్ట్ర విభజనపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలది ఎవరి దారి వారిదే. కొందరు విభజన జరగదని భరోసా ఇస్తుంటే, మరి కొందరు విభజన తధ్యమని బల్లగుద్ది మరీ వాదిస్తుంటారు. ప్యాకేజీలు పుచ్చుకోవడమే తక్షణ కర్తవ్యమని కొందరు, “శాసనసభలో ఎవరి వాదనలు వారు వినిపించడంలో తప్పు లేదు. కానీ అధిష్టానం నిర్ణయమే అందరికీ శిరోధార్యమని” బొత్స వంటి వారు లౌక్యం ప్రదర్శిస్తుంటారు.   ఇక జేసీ సోదరులయితే ఇంకా హైదరాబాద్ పట్టుకొని వ్రేలాడటం దండుగ! వెంటనే ఎక్కడో అక్కడ కొత్త రాజధాని పెట్టుకొని అక్కడి నుండి బయటపడటం మేలని ఉచిత సలహా ఇస్తుంటే, కేంద్రమంత్రి పదవి అందుకొన్న తరువాత “అధిష్టానం ఎంత చెపితే అంతే!” అని పలికిన జేడీ శీలం ఇప్పుడు “హైదరాబాద్ ని ఒక ఆరేడు సం.లకి యూటీ చేయడానికి తెలంగాణా నేతలు అంగీకరిస్తే, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరితో మాట్లాడి ఒప్పించి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి మార్గం సుగమం చేసే బాధ్యత నాదని” తాజాగా ఓ ప్రతిపాదన చేసారు.   “60 ఏళ్ళుగా మనం కలిసున్నాము. మరో ఆరేడేళ్ళు కలిసి ఉండటానికి కష్టం ఏమిటి? హైదరాబాద్ తెలంగాణాలో అంతర్భాగమని మేము ఒప్పుకొంటున్నాము. పది జిల్లాలతో కూడిన తెలంగాణా ఏర్పాటుకి మేమందరం పూర్తిగా సహకరిస్తాము. విద్య, విద్యుత్, ఉపాధి, నీటి సమస్యలను కూడా ఇద్దరికీ నష్టం కలిగించని విధంగా అన్నిటినీ పరిష్కరించుకొందాము. మీరు మాకు సహకరిస్తే మేము కూడా మీకు పూర్తిగా సహకరిస్తామని మా సీమాంధ్ర నేతలందరి తరపునా నేను హామీ ఇస్తున్నాను"   "తెలంగాణా ఏర్పాటు చేసుకోవాలనే మీ చిరకాల స్వప్నం సాకారం చేసుకోవాలంటే ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అవసరం. లేకుంటే చివరి దాక కూడా ఈ ఘర్షణ వాతావరణం తప్పకపోవచ్చు,” అని శీలం తెలంగాణా నేతలకి నయాన్న, భయాన్న నచ్చజెప్పే ప్రయత్నం చేసారు.   జేడీ శీలం హైదరాబాద్ ని యూటీ చేస్తే రాష్ట్ర విభజనకు సహకరిస్తామని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరి తరపున హామీ ఇస్తున్నారు. బాగానే ఉంది. సాక్షాత్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, “ఈ సమైక్య రాష్ట్రానికి తను ఆఖరి ముఖ్యమంత్రిని కానని, తన తరువాత ఇంకా చాలా మంది వస్తారని” నిన్ననే మరోమారు రచ్చబండ సాక్షిగా ప్రకటించారు. మరి ఆయన ఆలపిస్తున్నఈ పాటలన్నీరోటికాడ పాటలేనని శీలంగారి అభిప్రాయమా?   “కిరణ్ చాలా మంచోడు. అమ్మ మాట జవ దాటాడు. రాష్ట్ర విభజనకు తలూపేడు కూడా!” అని దిగ్విజయ్ సింగ్ అంతటి వాడు మీడియా ముందు ప్రకటిస్తే, “అది ఒట్టి అబద్దం. అది కేవలం ఆయన అపోహ మాత్రమే!” అని టకీమని జవాబిచ్చిఆయన నోరు మూయించిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మనసు మార్చుకొని,శీలం చేస్తున్నఈ ప్రతిపాదనకు అంగీకరిస్తారని హామీ ఏమయినా ఇచ్చేరా? ఇక రాష్ట్ర విభజన అంశం కేవలం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని శీలం భావిస్తున్నారా? ఏమో!

ఈ నాన్చుడేందిరో!

    సమైక్య సింహంగా తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి నానా తంటాలూ పడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలో తన సొంత పార్టీని ప్రకటించబోతున్నారన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తాను నూటికి నూరుశాతం కాంగ్రెస్ వాదినే అని చెబుతున్న కిరణ్ చాపకింద నీరులా తన కొత్త పార్టీ ప్రయత్నాలను చేస్తున్నట్టు తెలుస్తోంది. తాను పార్టీ ప్రకటించే నాటికి సీమాంధ్రులను పూర్తిగా తనవైపు తిప్పుకునే కిరణ్ ప్రయత్నిస్తున్నారు.   అందులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న రచ్చబండ కార్యక్రమంలో తానెంత గొప్పపాలకుడో తానే చెప్పుకోవడంతోపాటు సమైక్య నినాదాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు. ప్రతి సమావేశంలోనూ ‘‘సమయం వచ్చినప్పుడు నాకు మీ మద్దతు కావాలి’’ అని ప్రజల్ని బతిమాలుకుంటున్నారు. ‘మద్దతు’ అంటే ఇంకేంటి తాను పెట్టబోయే కొత్త పార్టీకి ఓట్లు వేయమనే అర్థమని ప్రజలు నవ్వుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పాడె ఎక్కి చాలాకాలం కావడంతో ఆ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది పార్టీ మారే ఆలోచనలో వున్నారు. సమైక్య సింహాన్నని చెప్పుకుంటున్న కిరణ్ తాను పెట్టబోయే పార్టీ ఏదో త్వరగా పెట్టేస్తే అందులో దూకేద్దామన్న ఐడియాతో వున్నారు. అయితే కిరణ్ పార్టీ పెట్టే విషయంలో స్పష్టత ఇవ్వకుండా ఇష్యూను నానుస్తూ వుంచడం పట్ల జంప్ జిలానీల్లా మారడానికి సిద్ధంగా వున్న కాంగ్రెస్ నాయకులు చిరాకుపడుతున్నారు. సమయం వచ్చినప్పుడు మీ మద్దతు కావాలని కిరణ్ ప్రజలను అడుగుతున్నారు. అయితే కిరణ్ కొత్త పార్టీ పెట్టడానికి సమయం ఎప్పుడో వచ్చిందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ కిరణ్‌కి పార్టీ పెట్టే ఉద్దేశం లేకపోతే ఆ విషయాన్ని స్పష్టంగా చెబితే తమదారి తాము చూసుకునే ఉద్దేశంలో వారున్నారు. కిరణ్ ఇప్పటికైనా ఈ నాన్చుడు ధోరణిని వదిలిపెట్టాలని భావిస్తున్నారు. ఒకవేళ కిరణ్ పార్టీ పెట్టకుండా కాంగ్రెస్‌లోనే ఉండాలని నిర్ణయించుకుంటే తమదారి తాము చూసుకునే ఉద్దేశంలో ఉన్నారు. ప్రస్తుతం సీమాంధ్రలోని కీలకమైన కాంగ్రెస్ నాయకులందరూ తెలుగుదేశం వైపు చూస్తున్నారు. కిరణ్ అటో ఇటో తెలిస్తే వాళ్ళందరూ ఇటో అటో దూకేయడానికి రెడీగా వున్నారు. ఇప్పుడు బంతి కిరణ్ కుమార్ రెడ్డి కోర్టులో వుంది.

విభజనకు మరికొన్ని సమావేశాలు తప్పవేమో: షిండే

  రాష్ట్ర విభజనపై కసరత్తు చేస్తున్న కేంద్రమంత్రుల బృందం రేపు సమావేశం కాబోతుంటే, కేంద్ర మంత్రి వర్గం బుధవారం నాడు సమావేశం కాబోతోంది. రేపు అంటోనీ నివాసంలో జరిగే కేంద్రమంత్రుల బృందం సమావేశంలో రాష్ట్ర విభజనపై తుది నివేదిక తయారు చేసి, ఎల్లుండి జరిగే మంత్రివర్గ సమావేశంలో దానిని ప్రవేశపెట్టాలని ముందు నుండి అనుకొంటున్నారు. అయితే  కేంద్రమంత్రుల బృందానికి నాయకత్వం వహిస్తున్నషిండే ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, “ఇంకా చాలా విషయాలు చర్చించాల్సి ఉంది. అందువల్ల రేపటి సమావేశమే ఆఖరుదని ఇప్పుడే చెప్పలేము. అవసరమయితే మరి కొన్ని సమావేశాలు జరిపి, అన్ని సమస్యలను ఇరు ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా ఉండేలా పరిష్కరిస్తాము. ఏ ప్రాంతం వారికీ అన్యాయం జరగదని హామీ ఇస్తున్నాను,” అని అన్నారు.   రేపు కేంద్రమంత్రుల బృందం మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి 8గంటల వరకు సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమయితే ఈ బృందం ఏర్పడిన తరువాత జరిగే అత్యంత సుదీర్గ సమావేశామిదే అవుతుంది. ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం గట్టిగా భావిస్తున్నందున, బహుశః ఈ సమావేశంలోనే వారు తమ నివేదికను దాదాపు ఖరారు చేసినా చేయవచ్చును. ఇంతవరకు కాంగ్రెస్ పెద్దలు ప్రతీ అంశంపైనా ఇదేవిధమయిన సందిగ్దత ప్రదర్శిస్తూనే, విభజన ప్రక్రియను సకాలంలోనే పూర్తి చేస్తున్నారు. బహుశః ఇప్పుడు కూడా షిండే మళ్ళీ అదే పద్ధతి అమలుచేస్తున్నారేమో.

కాంగ్రెస్ కష్టాలు తీర్చిన కిరణ్..!

      కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ముచ్చట తీరి మూడు సంవత్సరాలు ముగిసిన రోజున ఆయన రాయచోటిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ...తాను ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగితే అసలు గొడవే వుండేది కాదు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేసరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా వుందని, అప్పటికి నాలుగు సంవత్సరాల ముందు వరకూ కూడా పథకాలు సక్రమంగా అమలు కాక ఎన్నో బకాయిలు వుండిపోయాయని, అలాంటి ఘోరమైన పరిస్థితులన్నీ తాను రాగానే చక్కదిద్దానని ఆయన చెప్పుకున్నారు. ఇది పైకి చాలా సింపుల్ విషయంలా కనిపించినా, కాంగ్రెస్ పార్టీకే పెద్ద డ్యామేజ్ లాంటి విషయం.   కిరణ్ చెప్పిన మాటల ప్రకారం..వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య ముఖ్యమంత్రిగా వున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరమ అధ్వాన్నంగా వున్నట్టు! డబ్బులు లేక కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన గుడ్డ వేసుకుని కూర్చున్నట్టు! కిరణ్ గారు వచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు!!

కిరణ్ కొత్త పార్టీ పెట్టరు: బొత్ససత్యనారాయణ

  రాష్ట్ర విభజన ను వ్యతిరేఖిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి వేరే కొత్త పార్టీ పెడతారని మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఎన్నడూ గట్టిగా ఖండించేప్రయత్నం చేయలేదు. కానీ ఆయన తరపున పార్టీలో ఇతర నేతలు మాత్రం మాట్లాడుతున్నారు. కొత్త పార్టీ పెడితే ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుందో తెలుసుకొనేందుకే బహుశః ఆయన ఈపద్ధతి ఎంచుకొన్నారేమో మరి తెలియదు.   నిన్న బొత్ససత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ “పార్టీ నుండి బయటకు పోదలచిన వారు పోవచ్చు. శాసనసభకి బిల్లు వచ్చేవరకు వేచి చూడనవసరం లేదు. పార్టీకి నష్టం కలిగిస్తున్నవారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనేందుకు అధిష్టానం అనుమతించింది. త్వరలోనే చర్యలుంటాయి,” అని ప్రకటించారు. ఆ వెంటనే ‘కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోరని’ మరో కొత్త కబురు చెపుతున్నారు.   ఒకవైపు పోయేవాళ్ళు పొండని చెపుతూ, పోకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిస్తూనే, అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డి మాత్రం పార్టీలో కొనసాగుతారని బొత్స చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి బయటకి వెళ్ళకపోతే మరప్పుడు పార్టీలో ఆయన పరిస్థితి ఏమిటి? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తపిస్తున్న బొత్స పరిస్థితి ఏమిటి?   కనీసం వచ్చే ఎన్నికల వరకయినా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంపై అధికారం వెలగబెట్టే అవకాశం ఉంటుంది కనుక మరి ఆలోగా రాష్ట్రం విడిపోతే ఆంధ్రప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రి ఎవరవుతారు?కిరణ్ కుమార్ రెడ్డా? బొత్ససత్యనారాయణా? లేక కన్నా లక్ష్మినారాయణా లేక కొత్తగా నాలుగో కృష్ణుడు రంగం మీదకి వస్తాడా?

కొడుకు కోసమే కాదు, అల్లుడి కోసం కూడానట!

  అధికార కాంగ్రెస్ ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం చాలా సహజమే అయినప్పటికీ ఒక్కోసారి అవే సామాన్య ప్రజలకు తెలియని అనేక ఆసక్తికరమయిన విషయాలను తెలియజేస్తుంటాయి. అయితే ప్రస్తుతం మన వ్యవస్థలో డబ్బు, అధికారం చేతిలో ఉంటే అవినీతిపరులు కూడా నీతి సూక్తులు వల్లిస్తూ జనాల చేత జేజేలు పలికించుకోగల సౌలభ్యం ఉంది. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొనేవాళ్ళకంటే, అటువంటి వారినే ఆదర్శప్రాయంగా భావిస్తూ వారి తరపున వాదించేవారే ఎక్కువ ఉన్నారిప్పుడు.   ఇక విషయంలోకి వస్తే తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేసారు. ఇందులో కొత్తేముంది అనుకోవచ్చు గానీ ఆ ఆరోపణలు, జరుగుతున్న పరిణామాలను కలిపి చూసినట్లయితే నిప్పులేనిదే పొగ రాదు కదా! అనిపించక మానదు.   అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ సమైక్యచాంపియన్ గా ఎదిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ లో తెలంగాణా బిల్లుపై తన వాదనలు వినిపించిన తరువాత పదవికీ, పార్టీకి కూడా రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతారని మీడియాలో వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే దానిని ముఖ్యమంత్రి ఎన్నడూ గట్టిగా ఖండించకపోవడం చూస్తే ఆయనకి ఆ ఆలోచన ఉన్నట్లు భావించవలసి ఉంటుంది.   సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అతని సోదరుడు కలిసి కొత్త పార్టీ పెట్టేందుకు వేల కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి శంకర్ రావు, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, బొత్ససత్యనారాయణ తదితరులు కిరణ్ సోదరులపై చేసిన పిర్యాదులపై కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు విచారణకు అనుమతించలేదని ప్రశ్నించారు.   కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాలేకపోతే కాంగ్రెస్ హయంలో జరిగిన కుంభకోణాలు బయటపడతాయని, అదేవిధంగా సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వద్రా అక్రమాలు కూడా బయటపడటం ఖాయమనే భయంతోనే కాంగ్రెస్ అధిష్టానం ఇంత హడావుడిగా రాష్ట్ర విభజన చేసేందుకు ప్రయత్నిస్తోందని సోమిరెడ్డి తీవ్రంగా విమర్శించారు.   అయితే ఇంతవరకు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి, తెదేపాను దెబ్బ తీయడానికే రాష్ట్ర విభజన చేస్తున్నారని వాదిస్తున్నతెదేపా నేతలు ఇప్పుడు వాటికి అదనంగా మరో కొత్త పాయింటు కూడా జోడించినట్లున్నారు. ఏమయినప్పటికీ సోమిరెడ్డి చేస్తున్నతీవ్ర ఆరోపణలలో నిజానిజాలు ఎలా ఉన్నపటికీ, వాస్తవ పరిస్థితులను బట్టి చూస్తే అందులో ఎంతో కొంత నిజముండకపోదని అనిపిస్తుంది.

సీమాంద్ర కేంద్ర మంత్రులతో జైరాం భేటీ దేనికోసం?

      సీమాంద్ర కేంద్ర మంత్రులకు మళ్లీ పిలుపు వచ్చింది. అయితే కేంద్ర మంత్రి జైరాం రమేష్‌, సీమాంధ్ర కేంద్ర మంత్రుల్ని తనతో భేటీ అవ్వాల్సిందిగా సమాచారం పంపడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. రాష్ట్ర విభజన స్వరూపాన్ని డిజైన్‌ చేస్తోంది జైరాం రమేష్‌.. అంటూ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే జైరాం రమేష్‌, సీమాంధ్ర కేంద్ర మంత్రులతో భేటీకి సిద్ధమవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. భద్రాచలం సీమాంధ్రలోనే వుండాలనీ, హైద్రాబాద్‌ని యూటీ చేయాలనీ జైరాం రమేష్‌ ప్రతిపాదనలు చేశారంటూ ఓ నివేదిక ఒకటి బయటకొచ్చిందామధ్య. దాంతో, జైరాం రమేష్‌ - సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ఏం సమాచారమిస్తారు.? సీమాంధ్ర కేంద్ర మంత్రుల నుంచి ఆయన కొత్తగా ఏం తెలుసుకుంటారు.? అనే విషయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

చంద్రబాబు టి.బిల్లును అడ్డుకుంటారా!

      రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం సమన్యాయం చేయకుంటే తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. విభజనపై కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. విభజన రాష్ట్ర ప్రజలందరికి సంబందించిన విషయం గనుక తప్పనిస సరిగా అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. గతంలో జరిగిన మూడు రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలోను అసెంబ్లీ తీర్మాణాలను పరిగణలోకి తీసుకునే విభజన చేశారని ఆయన గుర్తు చేశారు. కేసుల మాఫీ కోసమే జాతీయ నాయకుల చుట్టూ జగన్ తిరుగున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ సంప్రదాయల ప్రకారం విభజన జరగకపోతే వ్యతిరేకిస్తామని చంద్రబాబు తెలిపారు.

సోనియాతో జీవోయం భేటి

  రాష్ట్ర విభజనపై సమర్పించాల్సిన నివేదికకు ఇప్పటికే ఓ తుది రూపు తీసుకువచ్చిన జీవోయం సభ్యులు సోమవారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, యుపిఎ అధ్యక్షురాలు సోనియా గాందీని కలిసి చర్చించారు. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి జైరాం రమేష్ తయారు చేసిన 20 పేజీల ముసాయిదా నివేదికను ఆమెకు అందజేశారు.ఈ సమావేశంలో 371డి కి సంభందించి కూడా చర్చించినట్టుగా సమాచారం.ఈ రోజు, రేపు కూడా మరోసారి జీవోఎం సమావేశం అయి బిల్లుకు తుది రూపం ఇచ్చే అవకాశం ఉంది. ఈ భేటిలతో నివేదిక పూర్తి స్థాయిలో రెడీ చేసి పార్లమెంట్‌ సమావేశాలలోపు రాష్ట్రపతికి పంపాలని కేంద్ర భావిస్తుంది.

అసెంబ్లీ తీర్మానం చేయాల్సిందే

  రాష్ట్ర ప్రజల మనోభావాలకు విలువనివ్వకుండా అడ్డగోలుగా రాష్ట్ర విభజనకు సిద్దపడుతున్న కేంద్ర పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అసెంబ్లీ తీర్మానం లేకుం డా రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. విభజనపై కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. విభజన రాష్ట్ర ప్రజలందరికి సంబందించిన విషయం గనుక తప్పనిస సరిగా అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. గతంలో జరిగిన మూడు రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలోను అసెంబ్లీ తీర్మాణాలను పరిగణలోకి తీసుకునే విభజన చేశారని ఆయన గుర్తు చేశారు. 371(డి), 371(ఇ) ఆర్టికల్స్ ను సవరించాలంటే పార్లమెంట్‌లో 2/3 మెజారిటీ అవసరమన్న ఆయన, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే తాము కూడా ఒప్పకోబోమని హెచ్చరించారు.

మరాఠా నేతల మద్దతు కోరిన జగన్‌

  రాష్ట్రన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని కోరూతు దేశ పర్యటన చేపట్టిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మహారాష్ట్ర నాయకులను కలిశారు. సోమవారం ముంబై వెల్లిన ఆయన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ను, శివసేన అధ్యక్షుడె ఉద్దవ్‌ఠాక్రేలను కలిసి తమకు మద్దతివ్వాలని కోరారు. అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు, ఏకపక్ష విభజనకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3ను సవరణ కోరుతూ జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం పార్టీ నేతలు దాడి వీరభద్రరావు, మైసూరారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, బాలశౌరిలతో కలిసి ముంబై చేరుకున్నారు. ముందుగా శరద్‌పవార్‌తో సమావేశం అయిన జగన్‌ తరువాత ఉద్దవ్‌ఠాక్రేతోను కలిసి దాదాపు 45 నిమిషాల పాటు చర్చించారు.

జగనన్న బాణం బ్యాక్ టూ అమ్ములపొది

  జగన్న వదిలిన బాణం కనబడటం లేదని, హైదరాబాదులో అంత పెద్ద సభ నిర్వహించినప్పుడు కనీసం ఆమె పేరు కూడా తలుచుకోలేదని మీడియాలో వస్తున్న రాజకీయ విశ్లేషణలు, ముఖ్యంగా తెదేపా నేతలు షర్మిలపట్ల జాలిపడుతూ మాట్లాడటం చూసిన తరువాత వైకాపా నేత అంబటి రాంబాబు వాటికి జవాబిస్తూ, జగనన్న విడిచిన బాణం తిరిగి అమ్ములపొదిలో చేరుకొంది. మళ్ళీ ఎప్పుడు అవసరమయితే అప్పుడు ఆమె ప్రజల ముందుకు వస్తారు. ఇంత కాలం జగనన్న జైల్లో ఉన్నందున ఆమె పాదయాత్రలు చేశారు. ఆమెను జగనన్న పక్కన పెట్టేసాదని, వారిరువురి మధ్య విభేదాలు ఏర్పడాయని మీడియాలో జరుగుతున్నా దుష్ప్రచారం చూసి మేమేమి భయపడిపోవట్లేదు. పార్టీకి అవసరమయినప్పుడు మళ్ళీ ఆమె సేవలు ఉపయోగించుకొంటాము,” అని అన్నారు.

పార్టీ నేతలని పొమ్మని బొత్సపోరు దేనికో

  రాష్ట్రం విడిపోతున్నందుకు బాధ కంటే విడిపోతే తమకు ముఖ్యమంత్రి అవకాశం దక్కుతుందని ఆశపడుతున్నకాంగ్రెస్ నేతలకు కరువు లేదు. అయితే ఆ మాట ఈ పరిస్థితుల్లో చెపితే అసలే ఆగ్రహంతో ఉన్న సీమాంధ్ర ప్రజలు భగ్గుమంటారనే భయంతోనే వారందరూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. కానీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లుగా, వారు ఎంత మొసలి కన్నీరు కారుస్తున్నా వారి మాటలు వారి మనసులో ఆలోచనలను బయటపెడుతున్నాయి.   ముఖ్యమంత్రి పదవిపై చాలా మోజుపడుతున్న వారిలో ప్రప్రధముడు బొత్ససత్యనారాయణ. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు కూడా. ఆయన మీడియాతో మాట్లాడుతూ వేరే పార్టీలో టికెట్స్ ఖాయం చేసుకొని పార్టీ వీడే ఆలోచన ఉన్నవారే పార్టీని ప్రజల ముందు దోషిగా చూపుతున్నారని, అటువంటివారి లిస్టు తన వద్ద సిద్దంగా ఉందని, క్రమశిక్షణ ఉల్లంగిస్తే నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. పార్టీని వదిలిపోదలచుకొన్న వారు, శాసనసభకు తెలంగాణా బిల్లు వచ్చేవరకు ఎదురు చూడనవసరం లేదని, నిరభ్యంతరంగా వెంటనే వెళ్లిపోవచ్చునని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవికి ఎవరయినా అర్హులేనని అన్నారు.   పార్టీ క్రమశిక్షణ ఉల్లంగిస్తే నోటీసులు జారీ చేస్తానని బింకాలు పలుకుతున్నఆయన గత రెండున్నర నెలలుగా నిత్యం అధిష్టానాన్ని ధిక్కరిస్తూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇంత కాలమయినా ఎందుకు నోటీసులు జారీ చేయలేదు? అదేవిధంగా రెండు రోజుల క్రితం ఆయనే స్వయంగా తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖంగా ఓటుస్తానని ప్రకటించారు. మరి అది క్రమశిక్షణ ఉల్లంఘన కాదా?   మరి తమ ఇద్దరికీ వర్తించని క్రమశిక్షణ పార్టీలో ఇతరులకే ఎందుకు అవసరం? అంటే పార్టీ నుండి ఎంత మంది వెళ్ళిపోతే తనవాళ్ళకు అంత మందికి పార్టీ టికెట్స్ ఇప్పించుకోవాలని ఉబలాటపడుతున్నట్లుంది. అందుకే పదేపదే పార్టీ నేతలని వెళ్లిపొమ్మని చెపుతున్నారు. ఇది కిరణ్ కుమార్ రెడ్డి కూడా వర్తిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. అయితే నేరుగా ఆయనతో ఆ మాటనే దైర్యం, తెగువ లేదు గనుక ఇలా అన్యాపదేశంగా చెపుతున్నారు.   ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించాలని అధిష్టానం నిర్ణయిస్తే, ఆ కుర్చీలో కూర్చోవడానికి అందరి కంటే మొట్ట మొదట నిలబడేది ఆయనే. ఒకవేళ ఇప్పుడు కుదరకపోయినా రాష్ట్రం విడిపోయిన తరువాతయినా తన ముఖ్యమంత్రి కల నెరవేర్చుకోవడానికి బొత్స గట్టిగా కృషి చేయడం ఖాయం. ఆయన పట్ల ప్రజలలో ఎంత చులకన భావం ఉందో ఇటీవలే రుజువయింది. అయినప్పటికీ, ఆయన ధోరణిలో ఎటువంటి మార్పు కలిగినట్లు లేదు.

ఆరుషి హత్య కేసులో తల్లిదండ్రులే దోషులు

      దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులు దోషులని ఘజియాబాద్ సిబిఐ కోర్ట్ నిర్ధారించింది. ఆరుషి, హేమరాజ్ ల జంట హత్య కేసులో తల్లిదండ్రులు రాజేష్ తల్వార్, నుపుర్ తల్వార్‌లు నేరస్తుల అని సిబిఐ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది.   2008 మే 16న ఆరుషి - హేమరాజ్‌ల హత్య జరిగిన విషయం తెలిసిందే. నిజానికి ఆరోజు ఆరుషి పదహారవ పుట్టినరోజు. ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్‌లో వారిని హత్య చేశారని సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. దర్యాఫ్తు సమయంలో కేసు అనేక మలుపులు తిరిగింది. ఆఖరికి ఆమె తల్లిదండ్రులు దోషులని సిబిఐ కోర్ట్ తీర్పును వెల్లడించింది.         కోర్టు తీర్పు వెలువడగానే రాజేష్, నుపుర్‌లు కోర్టు హాలులోనే బోరున విలపించారు. వారికి సెక్షన్ 302 కింద కోర్టు రేపు శిక్షను ఖరారు చేయనుంది. పోలీసులు వారిని దస్నా జైలుకు తరలించనున్నారు.ఈ హత్య కేసులో ఐదున్నరేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేస్తామని రాజేష్ తల్వార్ చెప్పారు.

రాష్ట్రాన్ని భయపెడుతున్న 'లెహర్'తుఫాన్

      రాష్ట్రాన్ని వరుస తుఫానులు హడలెత్తిస్తున్నాయి. మొన్న 'ఫైలిన్', నిన్న 'హెలెన్', తాజాగా 'లెహర్' రాష్ట్రాన్ని భయపెడుతుంది. బంగాళాఖాతంలోకి ప్రవేశించిన 'లెహర్' పెనుతుఫాన్‌గా మారినట్లు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తుందని, ఈ క్రమంలో కోస్తావైపుగా పయనించి ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నానికి కళింగపట్నం-మచిలీపట్నంల మధ్య కాకినాడ సమీపాన తీరం దాటుతుందని పేర్కొంది.   అండమాన్‌లో 'తుఫాన్' ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి తెలిపారు. మత్స్యకారులను వాతావరణశాఖ అధికారులు అప్రమత్తం చేసింది. విశాఖ తీరానికి సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో లెహర్ తుపాను కేంద్రీకృతమై ఉంది.  ఆదివారం అర్ధరాత్రికి పోర్టుబ్లెయిర్ వద్ద తీరాన్ని దాటి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించిన అనంతరం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది.    video courtesy etv 2

సోనియాని జైపాల్ ఎందుకు కలిశారు?

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎప్పుడూ తెర ముందు కనిపించని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కేంద్రం తెలంగాణ విభజన ప్రకటన చేసిన తరువాత చురుకుగా ముందుకు వెళ్తున్నాడు. ఇటీవల తెలంగాణ జిల్లాలలో కాంగ్రెస్ సభల్లో తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు. దాంతో పాటు ఢిల్లీలో తెలంగాణ గురించి కేంద్ర మంత్రుల బృందాన్ని కలిసి నివేదిక సమర్పించాడు. అయితే తాజాగా రాయల తెలంగాణ వార్తల నేపథ్యంలో ఆయన ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఒవైసీతో బేటీ తర్వాత, రాయలతెలంగాణపై ఐబీ విచారణ, ఇప్పుడు జైపాల్‌తో భేటీ పలు అనుమానాలకు తావిస్తోంది.

రాయల తెలంగాణ పై కేంద్రం ఆరా..!

      రాష్ట్ర విభజన అంశం కీలక దశకు వచ్చిన సమయంలో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రాయల తెలంగాణ అ౦శాన్ని తెరమీదకు తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రాయల తెలంగాణ పై వివిధ పార్టీల అభిప్రాయాలను కేంద్రం రహస్యంగా సేకరిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతంలోని తెరాస, బిజెపి, సిపిఎం, సిపిఐ పార్టీల ఎమ్మెల్యేలను ఈ విషయం పై ఇంటెలిజెన్స్ అభిప్రాయం అడగడంతో, ఈ విషయం బయటికివచ్చింది.   పది జిల్లాల తెలంగాణకే తాము కట్టుబడి ఉన్నామని బిజెపి, తెరాసలు చెప్పాయి. బిల్లు చూశాక చెబుతామని సిపిఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎంఐఎం  రాయల తెలంగాణాకు సుముఖుంగా ఉండడం, అనంతపురం, కర్నూల్ జిల్లాల నేతలు కూడా ఇదే విషయంపై పట్టుపడుతుండడంతో కేంద్రం రాయల తెలంగాణ ఏర్పాటుకే మొగ్గుచూపుతోంది అన్నది విశ్వసనీయ సమాచారం.  దీంతో రాయల తెలంగాణ అంశం మరోసారి ప్రాదాన్యతను సంతరించుకుంది. అయితే ఈ అంశానికి తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నందున విభజన అంశం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరోవైపు తనకు రాయల తెలంగాణ అంశంపై ఐబి నుండి ఫోన్ వచ్చిందని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. కేంద్రం రాయల తెలంగాణతో మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదించుకునేందుకు కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆరోపించారు.