విభజనపై చివరి దాక అదే అయోమయం
posted on Nov 20, 2013 @ 2:03PM
ఈరోజు కేంద్రమంత్రుల బృందం రాష్ట్ర విభజనపై తుది నివేదిక తయారుచేసేందుకు సమావేశమయ్యింది. రేపు మళ్ళీ మరో మారు సమావేశమయిన తరువాత తమ నివేదికకు తుది మెరుగులు దిద్ది, రేపే కేంద్రమంత్రి వర్గం చేతిలో పెట్టబోతున్నామని వారిలో ఒక సభ్యుడయిన జై రామ్ రమేష్ ప్రకటించారు. అయితే, మరి కొద్ది సేపటికే హోం మంత్రి షిండే మీడియా ముందుకు వచ్చి ఇటువంటి ముఖ్యమయిన అంశంపై ఇంత హడావుడిగా నివేదిక చుట్టబెట్టేసి, మంత్రి వర్గ సమావేశంలో ప్రవేశపెట్టడం మంచిది కాదని, అందువల్ల కనీసం మరో రెండు మూడు సార్లు సమావేశమయ్యి, అన్ని అంశాలపై మరింత లోతుగా చర్చించిన తరువాతనే మంత్రి వర్గ సమావేశంలో ప్రవేశపెడతామని ప్రకటించారు. రాష్ట్ర విభజనను పర్యవేక్షిస్తున్న ఒక మంత్రి 'రేపటితో సరి!' అంటుంటే మరొకరు 'లేదు! ఇంకా చర్చించవలసింది చాలా ఉందని చెప్పడం చూస్తే వారిలోనే ఈవిషయంపై సరయిన అవగాహన, ఏకాభిప్రాయం లేదని అర్ధం అవుతోంది. ఆర్ధిక శాఖ నుండి ఇంకా పూర్తి వివరాలు రాకపోవడం వలనే హోం మంత్రి షిండే మరి కొంత సమయం కొరుతునట్లు సమాచారం.
ఆవిధంగానయితే రాష్ట్ర విభజనపై నివేదిక మంత్రి వర్గం సమావేశంలో ఆమోదం పొంది రాష్ట్రపతి ద్వారా రాష్ట్ర శాసన సభకు చేరుకోవడానికి మరి కొంత ఆలస్యమవుతుందేమో? కానీ ఈ సారి పార్లమెంటు శీతాకాల సమావేశాలలోనే తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టాలంటే ఈ ప్రక్రియలో ఎక్కడా ఆలస్యం జరుగకూడదు.
అక్కడ డిల్లీలో ఈ అయోమయం కొనసాగుతుంటే, ఇక్కడ రాష్ట్రంలో వచ్చే నెల నుండి మొదలు కావలసిన శాసనసభ సమావేశాలను వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ని కోరినట్లు అందుకు ఆయన నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. శాసనసభ సమావేశాలను వాయిదా వేసినట్లయితే, తెలంగాణా బిల్లు సకాలంలో పార్లమెంటుకి చేర కుండా అడ్డుకోవచ్చునని, తద్వారా రాష్ట్ర విభజన జరుగకుండా ఆపవచ్చని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే రాష్ట్ర విభజనకు రాష్ట్ర శాసనసభ ఆమోదం అవసరం లేదు గనుక, ఒకవేళ శాసనసభ సమావేశాలు జరుగకుండా వాయిదా వేసినట్లయితే, ఇక రాష్ట్ర విభజనపై సభలో చర్చించకుండానే నేరుగా పార్లమెంటుకి వెళ్ళిపోతుంది. గనుక రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాలు తప్పకుండా సకాలంలోనే జరుపవచ్చును.