జీఓయం తుది నివేదిక 4న

  కొద్ది సేపటి క్రితమే కేంద్రమంత్రుల బృందం(జీఓయం) సమావేశం ముగిసింది. ఆర్ధికమంత్రి చిదంబరం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో షిండే, జైరామ్ రమేష్ పాల్గొన్నారు. అనంతరం షిండే మీడియాతో మాట్లాడుతూ వచ్చేనెల 4న జీఓయం తన తుది నివేదికను కేంద్ర మంత్రి వర్గం సమావేశంలో ప్రవేశపెడుతుందని తెలిపారు. హైదరాబాద్, భద్రాచలం పై ఎటువంటి సమస్యలు లేవని, ఎవరికీ బాధ కలిగించని విధంగానే తమ నివేదిక తయారుచేస్తున్నామని ఆయన తెలిపారు. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు.   అందువల్ల ఈ రోజు జరుగబోయే కేంద్రమంత్రి వర్గ సమావేశంలో జీఓయం నివేదిక ఉండబోదని స్పష్టమయింది. అయితే నాలుగవ తేదీలోగా రాష్ట్ర నేతలతో షిండే మరికొన్ని సార్లు చర్చించి నివేదికకు తుది రూపం ఇచ్చే అవకాశం ఉంది. నాలుగవ తేదీన జరిగే మంత్రి మండలి సమావేశంలో బిల్లుని ఆమోదించిన వెంటనే అదే రోజు రాష్ట్రపతికి పంపబడవచ్చును. ఆయన దానిపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే, వెంటనే రాష్ట్ర శాసనసభకు పంపుతారు. అంటే వచ్చేనెల 9లోగా ఎప్పుడయినా తెలంగాణా బిల్లు రాష్ట్ర శాసనసభకు వచ్చే అవకాశం ఉన్నట్లు భావించవచ్చును.   శీతాకాల సమావేశాలలోనే బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం కృత నిశ్చయంతో ఉన్నందున, బిల్లుపై చర్చించేందుకు రాష్ట్ర శాసనసభకు అట్టే సమయం ఈయకపోవచ్చును. బహుశః రెండు మూడు రోజులలో, మహా అయితే ఒక వారంలోనే బిల్లుపై సభ చేత ‘మమ’ అనిపించేసి డిల్లీ తిప్పి పంపేయవచ్చును. ఇంత క్లిష్టమయిన, సున్నితమయిన అంశాన్ని కాంగ్రెస్ నిర్వహిస్తున్న తీరు చాలా అసంబద్దంగా అనిపిస్తున్నప్పటికీ, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉండటంతో తనకు నచ్చిన విధంగా కధ నడిపిస్తోంది.

రాష్ట్రానికి సీఎం కిరణా?అశోక్ బాబా?

      సమైక్య రాష్ట్రం కోసం అవసరమైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామన్న ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ వీ.హనుమంతరావు మండిపడ్డారు. రాష్ట్రానికి సీఎం కిరణా?...అశోక్ బాబా? అని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా కేసీఆర్ మాట్టాడితే తాము ఖండిస్తామని...మీరు అశోక్ బాబు నోరు మూయిస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ ను యూటీ చేయాలని జీవోఎంపై సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ యూటీకి ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాయలసీమ నేతల ధాటికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూములే మిగల్లేదని, మళ్లీ రాయల తెలంగాణ ఎందుకని వీహెచ్ వ్యాఖ్యానించారు.

కావూరి కంపెనీ బ్లాక్ లిస్టులో

  రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్ర, తెలంగాణా ప్రజలకి ఏమి ఒరుగుతుందో తెలియదు కానీ రాజకీయ నేతలకు, ముఖ్యంగా సివిల్ కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకొనే నేతలకు మాత్రం నాలుగు కాదు..కాదు పద్నాలుగు రాళ్ళు వెనకేసుకొనే అవకాశం కలుగబోతోంది. తెలంగాణా రాష్ట్రంలో అందరి కంటే మొట్ట మొదటగా ప్రయోజనం పొందేది రాజకీయ నేతలే. కొందరికి మంత్రి పదవులు, మరి కొందరికి భారీ కాంట్రాక్టులు తధ్యం.   ఇంతవరకు సమైక్యాంధ్ర అంటూ గొంతు చించుకొని కేకలు పెట్టిన సీమాంధ్ర రాజకీయ నేతలకయితే తంతే బూర్లె గంపలో పడినట్లే అనుకోవచ్చును. రాజధానితో సహా భారీ ఎత్తున జరుగబోయే నిర్మాణ కార్యక్రమాల ద్వారా వారు ఊహించని విధంగా లబ్ది పొందబోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కేంద్రంలో ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే ఆయా పార్టీ నేతలు మై కాస్త ఎక్కువ లబ్ది పొందగలరు. రాష్ట్ర విభజన అంశం తెరపైకి రానప్పుడే అనేక ప్రాజెక్టులు దక్కించుకొని ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకొన్న రాజకీయ నేతలు ఇప్పడు ఏకంగా రాష్ట్ర పునర్నిర్మాణం చేసే అవకాశం వస్తే ఎంత వెనకేసుకొంటారో ఊహించవచ్చును.   అయితే లక్షల కోట్లతో భారీ ఎత్తున జరిగే ఈ నిర్మాణ పనుల కోసం భారత ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ ఆర్ధిక సహాయం కూడా తీసుకోవచ్చును. అయితే పాపం ఇటువంటి కీలక సమయంలోనే కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు అనుకోని విధంగా పెద్ద కష్టమోచ్చిపడింది పాపం!   ఆయనకు చెందిన ప్రోగ్రెసివ్ కనస్ట్రక్షన్స్ అనే సంస్థపై అవినీతి, దగా వంటి అభియోగాలు నమోదు అవడంతో ప్రపంచబ్యాంకు పదకుండేళ్లపాటు ఆ సంస్థని బ్లాక్ లిస్టులో పెడుతున్నట్లు ప్రకటించింది. అందువల్ల ప్రపంచ బ్యాంక్ ఆర్ధిక సహకారంతో జరిగే ఎటువంటి ప్రాజెక్టులలో కావూరి గారి సంస్థ వేలుపెట్టలేదు. అయితే రాష్ట్రంలో అన్ని ప ప్రాజెక్టులు ప్రపంచ బ్యాంక్ సహకారంతోనే జరగవు గనుక కావురివారు ఏదో ఒక ప్రాజెక్టు పట్టుకొని నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చును.   కానీ ముందు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలి కదా! గెలవకపోతే దానికి కావూరి మాత్రం ఏమి చేయగలరు? ప్రపంచ బ్యాంకు మాత్రం ఏమి చేయగలదు?

డిసెంబరు 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు..!

      డిసెంబరు మొదటివారంలో అసెంబ్లీ సమావేశపరచడానికి కసరత్తు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ వడివడిగా జరుగుతున్న నేపధ్యంలో... డిసెంబరు 20లోపు అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. డిసెంబరు 5 నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాలు కూడా 20వ తేదీనే ముగియనున్నాయి. అయితే పార్లమెంటులో తెలంగాణ బిల్లు చర్చకు రావాలంటే డిసెంబరు 20 లోపు అసెంబ్లీలో చర్చించి, అభిప్రాయాలను పార్లమెంటుకు పంపించాల్సి ఉంటుంది. ఇందుకోసమే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌కు, సిఎంకు ఉన్నతస్థాయిలో సూచనలు అందినట్లు తెలిసింది.   అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం శాసనసభ పరిసరాలను తనిఖీ చేశారు. అసెంబ్లీ అవరణలో పాములు తిరుగుతున్నాయన్న కలకలం రేగడంతో ఆయా ప్రాంతాలను కూడా పరిశీలించారు. పాములు సంచరించకుండా తగు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సిబ్బందిని స్పీకర్ ఆదేశించారు.

కిరణ్‌ పార్టీ విధేయుడే

  తెలంగాణ విషయంలో కొద్ది రోజులుగా అధిష్టానాన్ని దిక్కరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న సియం కిరణ్‌కుమార్‌ రెడ్డి దిగ్విజయ్‌ సింగ్‌ అండగా నిలిచారు. కిరణ్‌ కేవలం తన అభిప్రాయం మాత్రమే చెపుతున్నారని, ఆయన పార్టీని కానీ, సీడబ్ల్యూసి నిర్ణయాన్ని కానీ వ్యతిరేఖించటం లేదన్నారు. విభజనకు సంబందించిన జీవోయం కసరత్తు దాదాపుగా పూర్తయిందని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగ, న్యాయ పరిధికి లోబడే ఉంటుంది... కొంత కాలం ఉమ్మడి రాజధాని చేయవచ్చనే వెసులుబాటు రాజ్యాంగంలో ఉందని దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణ బిల్లు అసెంబ్లకి వస్తుందన్నారు.

తెలంగాణ నావల్లే వచ్చింది

  కేంద్రం తెలంగాణ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తుండటంతో ఈ ఘనత సాధించిన రికార్డును తమ ఖాతలో వేసుకోవడానికి అన్నిపార్టీలతో పాటు కొందరు జాతీయ నాయకులు కూడా తెగ ఆరాటపడిపోతున్నారు. మేము చేసిన సంప్రదింపులు, లాబీయింగ్‌ల వల్లే తెలంగాణ ప్రకటన వచ్చిందని ప్రతి సందర్భంలో చెపుతూ ఆ క్రెడిట్‌ తమకే సొంతం అని మురిసిపోతున్నారు. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం తాను చేసిన కృషివల్లే తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు నిర్ణయం వెలువడిందని ఆయన అన్నారట. హైకమాండ్ పెద్దలను ఒప్పించడానికి తాను రాత్రింబవళ్లు ఎంతగానో కృషి చేశానని పేర్కొన్నట్లు సమాచారం. తాను లేకుంటే ఈ నిర్ణయమే వచ్చేది కాదని కూడా ఆయన తెగేసి చెప్పారట. అయితే ఇవన్ని కేవలం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ ముఖ్యమంత్రి పదవి కోసం నేతలు ఇప్పటి నుంచే చేస్తున్న గ్రౌండ్‌ వర్క్‌ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ ఏర్పాటు తమ వల్లే సాద్యమయిందన్న మైలేజ్‌ ఇప్పటి నుంచే సొంతం చేసుకుంటే అది తరువాత కూడా తమకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారట నేతలు.

త్వరలో జేసీకి, శ్రీనివాస రావుకి బొత్స గంట కొట్టనున్నారా

  కొద్ది రోజుల క్రితం మెహబూబ్ నగర్ సమీపంలో జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదం తరువాత రవాణా శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు నిబంధనలకు వ్యతిరేఖంగా తిరుగుతున్నఅనేక ప్రైవేట్ బస్సులను పట్టుకొంటున్నారు. వాటిలో జేసీ బ్రదర్స్ యొక్క దివాకర్ ట్రావెల్స్ కి చెందిన బస్సులు కూడా చాలానే ఉన్నాయి. దానితో సహజంగానే జేసీ సోదరులకు బొత్సపై ఆగ్రహం కలగడం సహజమే. అయితే వారి పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లా అవడంతో ఈ విషయంపై నోరు మెదపలేక నానా అవస్థలు పడుతున్నారు.   అయితే అందివచ్చిన రాష్ట్ర విభజన అంశం సాకుగా తీసుకొని బొత్సపై ఇంతవరకు పరోక్ష విమర్శలు చేస్తూన్నారు. రాష్ట్ర విభజనకు ప్రధానకారకుడని ఇప్పటికే బోలెడంత అపఖ్యాతి మూటగట్టుకొన్న బొత్ససత్యనారాయణ, దివాకర్ రెడ్డి గుప్పిస్తున్న తీవ్ర విమర్శల కారణంగా మరింత అభాసుపాలవుతాననే ఆలోచనతో ఆయన కూడా ఎదురు దాడికి దిగారు.   “పార్టీలో కొందరు నేతలు వేరే పార్టీలో టికెట్స్ ఖరారు చేసుకొని పార్టీని అప్రదిష్ట పాలుచేసె విధంగా మాట్లాడుతూ, ప్రజల ముందు పార్టీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారి పేర్ల లిస్టు సిద్దం అయ్యింది. వారిపై చర్యలు తీసుకొనేందుకు అధిష్టానం కూడా అనుమతి ఇచ్చింది. నేడో రేపో వారికి నోటీసులు పంపబోతున్నాను,” అని హెచ్చరించారు. ఇది జేసీ దివాకర్ రెడ్డిని ఉద్దేశించేనని చెప్పనవసరం లేదు.   తెగించిన వాడికి తెడ్డే ఆయుధం అన్నట్లు,  తమ మధ్య యుద్ధం క్లైమాక్స్ దశకు చేరుకుందనో లేక ఇంత కాలమయినా తమ బస్సులను తిరగనీయకపోవడంతో సహనం నశించిందో ఏమో గానీ, దివాకర్ రెడ్డి వెంటనే బొత్సపై ఎదురుదాడి చేసారు. “అసలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్ససత్యనారాయణ ఇద్దరూ కూడా తోడు దొంగలవంటి వారే. వారికి రాష్ట్ర విభజన గురించి అంతా ముందే తెలుసు. అయినా తెలియనట్లు నటిస్తూ ప్రజలని మభ్యపెడుతున్నారు. వీరికే కాదు, సీమాంధ్ర కేంద్రమంత్రులందరికీ కూడా ఈ విషయం చాలా ముందు నుండే తెలుసు. అయినా అందరూ చివరి నిమిషం వరకు ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు. బొత్స ఎవరిపైనైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చును,” అని ఘాటుగా జవాబిచ్చారు.   అయితే ఈ సారి ఆయన ముఖ్యమంత్రిని కూడా బొత్సతో కలిపి నిందించడం చూస్తే ఆయన ఇక పార్టీతో తెగ తెంపులకి సిద్దంగా ఉన్నారని అర్ధం అవుతూనే ఉంది. తెదేపాతో టచ్చులో ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా బొత్సని ఘాటుగా విమర్శించారు. శాస్త్ర ప్రకారం జరగవలసిన ఈ విమర్శల తంతు కూడా పూర్తయింది గనుక ఇక బొత్సదే ఆలశ్యం మరి.

సియం, బొత్స తోడు దొంగలు

  రాష్ట్ర విభజన అంశం తెరమీదకు వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్‌ పార్టీ మీద గుర్రుగా ఉన్న ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు జెసి దివాకర్‌ రెడ్డి మరోసారి వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు.  విభజన అంశాలను దాచటంలో  కిరణ్, బొత్స సత్యనారాయణ ఇద్దూ ఇద్దరే అని వారు తోడు దొంగలని అన్నారు. ఈ ఇద్దరికే కాదు సీమాంద్ర కేంద్ర మంత్రులకు కూడా విభజనకు సంబందించిన అన్ని విషయాలు తెలుసన్నారు. కావాలనే జాతీయ నాయకులు సీమాంద్ర ప్రజలని మభ్యపెట్టారని అందరికి అంత తెలిసే ప్రజలని మోసంచేశారన్నారు. పార్టీ నిర్ణయాన్ని దిక్కరిస్తే చర్యలు తప్పవన్న బొత్స వ్యాఖ్యలను జెసి సమర్ధించారు. చర్యలు తీసుకునే అధికారం బొత్సకు ఉందన్నారు.

అసంపూర్తిగా ముగిసిన జీఓయం భేటీ

కేంద్రమంత్రుల బృందం రాష్ట్ర విభజనపై ఈరోజు సుదీర్ఘమయిన సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహంతి, ఇటీవల ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడు విజయ్ కుమార్, జలవనరులు, విద్యుత్, ఆర్ధిక, పరిపాలనా శాఖల అధికారులతో కూడా ఆయా అంశాలపై లోతుగా చర్చించింది. రేపు కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఉన్న కారణంగా ఈరోజు సమావేశంలోనే తన తుది నివేదిక తయారు చేయాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ అది వీలుకాలేదని షిండే మాటల ద్వారా అర్ధం అవుతోంది. రేపటి కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో తమ తుది నివేదికను సమర్పించడం సాధ్యం కాదన్నట్లు ఆయన మాట్లాడారు. మళ్ళీ రేపు మరో మారు సమావేశమవుతామని కూడా తెలిపారు. అయితే జలవనరులు, ఉద్యోగాలు, ఆర్టికల్ 371 (డీ) వంటి కొన్ని అంశాలపై తుది నిర్ణయం అయినట్లు సమాచారం. కానీ హైదరాబాద్ అంశంపై ఇంకా చిక్కుముడి అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. బహుశః రేపటి సమావేశంలో దానిపై కూడా ఒక స్పష్టత రావచ్చునేమో! రాష్ట్ర విభజనపై లోతుగా చర్చిస్తున్నకొద్దీ అది ఎంత క్లిష్టమయినధో కేంద్ర మంత్రుల బృందానికి కూడా ఇప్పుడు అర్ధం అవుతోంది. నిజానికి ఈ ప్రక్రియకు ఎంత సమయం అవసరమో కూడా బహుశః వారికి ఈపాటికే అర్ధం అయి ఉండవచ్చు. అయితే ఇది స్వయంకృతాపరాదమే గనుక ఇప్పుడు ఎవరినీ నిందించి ప్రయోజనం లేదు.

భద్రాచలం జోలికి వస్తే తడాఖా చూపిస్తా: రేణుకా

      భద్రాచలం తెలంగాణలోనే వుండాలని, భద్రాచలాన్ని ఎవరైనా తీసుకెళ్ళాలని అనుకుంటే తన శవం మీద నుంచి తీసుకెళ్ళాలని రేణుక సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం జోలికి ఎవరైనా వస్తే తన తడాఖా ఏమిటో చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఆమె తెలంగాణలో పుట్టి పెరగకపోయినా తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ ‘భద్రాచలాన్ని సీమాంధ్రకి ఇచ్చే సవ్వాలే లేదు’ అని నొక్కి వక్కాణించారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ధికోసం ఏమైనా చేస్తారు.. దేనినైనా తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న రేణుకా చౌదరి ఈ వర్గానికి చెందిన నాయకురాలేమోనన్న సందేహాలు ఆమె మాటల్ని వింటే కలుగుతున్నాయి.

ధర్మాన చేరికతో వైకాపాకి ఓదార్పు

    శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు సీబీఐ చార్జ్ షీట్లో ఎక్కడంతో తన మంత్రి పదవి కోల్పోవడమే కాక, ఇప్పుడు కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు తప్పడం లేదు. లోపం తనలో ఉంచుకొని, ఇంత కాలం తనకి ఉన్నత పదవులు కట్టబెట్టి పార్టీలో, సమాజంలో ఒక హోదా కల్పించిన కాంగ్రెస్ పార్టీని వీడి వచ్చే నెల 7న వైకాపాలో జేరబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు ధర్మాన కృష్ణ దాస్ స్వయంగా ప్రకటించారు.   సర్పంచే స్థాయి నుండి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగిన ధర్మానకు ఆ సీబీఐ మరకలు అంటి ఉండకపోతే, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేవారు. ఇంకా ఉన్నత పదవులను కూడా పొందగలిగేవారని ఖచ్చితం చెప్పవచ్చును. అయితే మునిగిపోయే ఓడ వంటి కాంగ్రెస్ నుండి ఆశావహకంగా కనిపిస్తున్న వైకాపాలోకి దూకేసేందుకు ఇంత కంటే మంచి సాకు, సమయం వేరే ఉండవని భావించిన ధర్మాన త్వరలో ఆ పార్టీలోకి దూకనున్నారు.   తనకు జగన్మోహన్ రెడ్డి అండ దొరుకుతుందని ఆయన దైర్యం చేస్తుంటే, ఆయన రాక వలన శ్రీకాకుళం జిల్లాలో తమ పార్టీ మరింత బలపడుతుందని జగన్మోహన్ రెడ్డి సంతోషపడుతున్నారు. అయితే ధర్మానకు అతని అండ దొరకడం సంగతి ఎలా ఉన్నపటికీ, ఆయన చేరికతో జిల్లాలో పార్టీ బలపడటం ఖాయం.   రాష్ట్ర విభజన కారణంగా తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ జిల్లాలో విభజనను సమర్దిస్తున్న కిల్లి క్రుపారాణి వంటివారి వలన మరింత బలహీనంగా తయారయింది. ఇప్పుడు ధర్మాన కూడా తప్పుకొని, ప్రత్యర్ధి వర్గంలో చేరిపోవడంతో, జిల్లాలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఇక జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసిన ఎర్రం నాయుడు ఆకస్మిక మరణంతో అక్కడ తెదేపా కూడా చాలా బలహీనంగా ఉంది. ఈ పరిస్థితులన్నీ వైకాపాకు కలిసివచ్చే అంశంగా మారవచ్చును.   కానీ, వైకాపాకు ఓటేయడం అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడమేనని ప్రజలు భావిస్తే ధర్మాన బలయిపోయే ప్రమాదం కూడా ఉంది.

తెలంగాణ సీఎం: హరీష్ వర్సెస్ కేటీఆర్

      తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ సీఎం అంశం ముదురు పాకానపడింది. తెలంగాణకి మా అన్న సీఎం అంటే మా అన్న సీఎం అని హరీష్ రావు, కేటీఆర్ వర్గాల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. తాజాగా కొంతమంది పార్టీ నాయకులు తెలంగాణకి హరీషే సీఎం అని బాహాటంగా ప్రకటించడంతో ఈ రెండు వర్గాల మధ్య లొల్లి ముదిరింది. తెలంగాణ సీఎం పదవి మీద మొదటి నుంచి హరీష్ రావు, కేటీఆర్‌లకు కన్నుంది. ఒకరి లక్ష్యానికి మరొకరు అడ్డుగా వున్నారు కాబట్టి ఈ బావాబామ్మర్దులిద్దరికీ మొదటి నుంచీ ఒకరంటే మరొకరికి పడదు. ఒకరి ప్రస్తావన మరొకరు తేరు. ఒకరిమీద వచ్చిన అవినీతి ఆరోపణలను మరొకరు ఖండించరు. ఇద్దరూ ఒకే సందర్భంలో చాలా అరుదుగా కనిపిస్తారు. రాష్ట్రాన్ని చీల్చాలని ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్ ఈరకంగా ఏనాడో చీలిపోయింది. వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని కేసీఆర్ ప్రయత్నించి విఫలమయ్యారు. ఇద్దర్లో ఎవర్ని జాగో అనాలో ఎవర్ని భాగో అనాలో అర్థంకాక, ఫామ్‌హౌస్‌లో తపస్సు చేసినా పరిష్కారం లభించక ఇద్దరి మధ్యన ఇరుక్కుపోయి నలిగిపోతున్నారు. కేసీఆర్‌లోని తండ్రి మనసు కొడుకు వైపే మొగ్గుచూపుతున్నా, దాన్ని బయటపెట్టలేక బాధపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి హరీష్‌రావేనని ఆయన వర్గీయులు బాహాటంగా ప్రకటిస్తూ వుండటం టీఆర్ఎస్‌లో వున్న ఆల్రెడీ వున్న అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.

శంకర్ రామన్ కేసు: కంచి స్వాములకు ఊరట

      కంచి కామకోఠి పీఠాధిపతులకు తొమ్మిదేళ్లుగా వేధిస్తున్న కేసు నుంచి ఊరట లభించింది. శంకర్ రామన్ హత్య కేసులో కంచి స్వాములను నిర్దోషులుగా తేల్చుతూ బుధవారం ఉదయం పాండిచ్చేరి కోర్టు తీర్పును వెలువడించింది. జయేంధ్ర సరస్వతి, విజయేంధ్ర సరస్వతి సహా 23 మందిని కోర్టు నిర్దోషులుగా తేల్చనింది. ఈ కేసులో నిందితుల ప్రమేయంపై ఆధారాలు లేవని కోర్టు తెలిపింది.2004 సెప్టెంబరు నెలలో శంకరరామన్ హత్య జరిగింది. శంకరరామన్ హత్య కేసులో దర్యాఫ్తు బృందం 189 మందిని విచారించింది. ఈ కేసు విచారణ తమిళనాడులోని చెంగల్‌పేట కోర్టు నుండి పాండిచ్చేరి కోర్టుకు మార్చాలని జయేంద్ర సరస్వతి కోరారు. దీంతో సుప్రీం కోర్టు తీర్పుతో విచారణను పాండిచ్చేరి కోర్టుకు మార్చారు.

తెలంగాణా ఏర్పాటుకి కేసీఆర్ బీజేపీని ఒప్పించగలరా

  డిశంబర్ 5నుండి 20వరకు జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలలోనే తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుండటంతో, కాంగ్రెస్ అధిష్టానం తనను పక్కనబెట్టినప్పటికీ కేసీఆర్ కూడా తనవంతు ప్రయత్నాలు చేసేందుకు వచ్చే నెల3న డిల్లీకి బయలుదేరబోతున్నారు.   ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి, ఏపీ ఎన్జీవోలు డిల్లీలో జాతీయ పార్టీలను కలిసి పార్లమెంటులో రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా ఓటువేసి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించమని అభ్యర్దించిన నేపధ్యంలో, కేసీఆర్ కూడా వారినందరినీ కలిసి తెలంగాణా ఏర్పాటుకి మద్దతు కూడ గట్టే ప్రయత్నం చేస్తారు. అయితే ఒక్క బీజేపీ తప్ప దాదాపు ఇతర పార్టీలన్నీకూడా ఈవిషయంలో స్పష్టమయిన వైఖరితోనే ఉన్నాయి. గనుక, కేసీఆర్ బీజేపీ అగ్ర నేతలతో జరిపే సమావేశమే కీలకమని చెప్పవచ్చును.   2014 ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ, కేసీఆర్ అభ్యర్ధనను మన్నించడం కష్టమే. ఎందుకంటే, ఆయన అభ్యర్ధనను మన్నించి ఒకవేళ బీజేపీ కాంగ్రెస్ పార్టీతో సహకరించి తెలంగాణా ఏర్పాటుకి దోహదపడితే, కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినా, పొత్తులు పెట్టుకొన్నా బీజేపీకి నష్టమే తప్ప ఎటువంటి లాభమూ ఉండబోదు. అదే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదింపచేయలేక చేతులెత్తేసేట్లు చేయగలిగితే, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశాలుంటాయి,   ఒకవేళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పరచగలిగితే అప్పుడు తెరాసకు బీజేపీయే దిక్కవుతుంది. అందువల్ల బీజేపీ కేసీఆర్ కి నచ్చజెప్పి పంపేసే అవకాశాలే ఎక్కువ. ఒకవేళ ఆ రెండు పార్టీ నేతలు ఈ సమావేశంలోనే ఎన్నికల తరువాత మద్దతు గురించి ఒక అవగాహనకి వచ్చినట్లయితే, కేసీఆర్ సమావేశం తరువాత బయటకు వచ్చి మీడియాతో “మా అభ్యర్ధనకు బీజేపీ నేతలు సానుకూలంగా స్పందించారు” అంటూ ఒక్క రొటీన్ డైలాగ్ పలకవచ్చును.

కిరణ్ అధిష్టానం మాట జవదాటడు: దిగ్విజయ్ సింగ్

  “ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి విదేయుడు. ఆయన అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఆయన రాష్ట్ర విభజనకు ఇదివరకే అంగీకరించారు,” అంటూ కొద్ది రోజుల క్రితం దిగ్విజయ్ సింగ్ అన్నమాటలను కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే ఖండించారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమేమో కానీ తన సమైక్యవాదంలో ఎటువంటి మార్పు లేదని, ఉండబోదని నిర్ద్వందంగా ప్రకటించారు. నేటికీ ఆయన అదే పంధాను కొనసాగిస్తున్నారు కూడా.   అయితే ఈ రోజు అంటోనీ నివాసంలో జరిగిన కేంద్రమంత్రుల సమావేశంలో పాల్గొన్న దిగ్విజయ్ సింగ్ మళ్ళీ కిరణ్ గురించి అదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. ఈ సమావేశంలో మిగిలిన ఇతర అంశాలతో బాటు, ముఖ్యమంత్రి వ్యవహార శైలి గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆ తరువాతనే దిగ్విజయ్ ఈ విధంగా మాట్లాడటం చూస్తే ముఖ్యమంత్రి నిబద్దతపై ప్రజలలో అనుమానాలు రేకేత్తించేందుకే ఈవిధంగా చేస్తున్నారా? లేక నిజంగానే కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం చెప్పిన ప్రకారమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏమయినప్పటికీ మరికొద్ది రోజులలో అందరి అసలు రూపాలు బట్టబయలవడం ఖాయం.

యు.టి. ఎందుకు వద్దంటే..!

      హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్రులు కుట్రలు పన్నుతున్నారని, హైదరాబాద్ యు.టి. ప్రతిపాదనకి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని విభజనవాదులు విరుచుకుపడుతున్నారు. యు.టి. పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. ఇంతకీ విభజనవాదులు యు.టి.ని ఎందుకు వద్దంటున్నారంటే... 1. హైదరాబాద్ మాదే అని పోజులు కొట్టడానికి వీలుండదు. 2. హైదరాబాద్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో వుంటుంది కాబట్టి లోకల్ రాజకీయ నాయకుల ఆటలు చెల్లవు. 3. హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు న్యాయమైన వాటా దక్కుతుంది. 4. స్థానికంగా వుండే రాజకీయ నాయకులు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాలి. హైదరాబాద్‌ని      ఉద్ధరించేస్తామని చెబుతున్నవాళ్ళకి ఆ ఛాన్స్ వుండదు. 5. సీమాంధ్రులను హింసించడానికి వీలుండదు. భయభ్రాంతులను చేయడానికి అవకాశం వుండదు. వాళ్ళని హైదరాబాద్ నుంచి తరిమేస్తాం అనడానికి కూడా ఛాన్స్ వుండదు.   6. పదేళ్ళ తర్వాత యు.టి. శాశ్వతంగా కంటిన్యూ అయ్యే అవకాశం వుంది. 7. హైదరాబాద్‌లో సీమాంధ్రుల ఆస్తులపై దాడులు చేయడానికి వీలుండదు. 8. సీమాంధ్రులను హింసించడానికి కొత్తకొత్త చట్టాలు క్రియేట్ చేయడానికి అవకాశం లేదు.    9. హైదరాబాద్‌లో విద్య, ఉద్యోగాల విషయంలో  సీమాంధ్రులను అనాథలు చేసే అవకాశం వుండదు. ఈ విషయంలో సీమాంధ్రులు, తెలంగాణవాళ్ళు అనే తేడా వుండదు. అందరూ సమానమే. 10.  యు.టి. అయితే కబ్జాలు కుదరవు. కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు తప్పనిసరిగా చెల్లించాలి. 11.  యు.టి.కి ఒప్పుకుంటే తెలంగాణ విభజనకు అడ్డంకులు వుండవు. తెలంగాణ సమస్య పరిష్కారమైపోతుంది. విభజనులకు, ఉద్యమాలు చేసేవాళ్ళకు పని వుండదు. .... ఇవి కాక ఇలాంటి నష్టాలు ఇంకా బోలెడన్ని వున్నాయి. అందుకే యు.టి. వద్దంటారు!

కిరణ్ పై హరీష్ పిల్

      నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం నుండి చిత్తూరు జిల్లా తాగునీటి పథకానికి రూ.4,300 కోట్లు కేటాయించడాన్ని తప్పుపడుతూ టీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీష్ రావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. చిత్తూరు తాగునీటి పథకానికి నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ గత అక్టోబర్ 10న జారీచేసిన 14,15 జీవోలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని ఆయన తన పిటీషన్ లో న్యాయస్థానాన్ని కోరారు. కేవలం ఎన్నికలలో లబ్దిపొందేందుకు ముఖ్యమంత్రి తన సొంత జిల్లాకు నిధులు తరలించుకెళ్లారని, ప్రభుత్వ బిజినెస్ రూల్స్ కు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేయవద్దని తాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినప్పటికి జీవోలు జారీ చేసి పనులు కూడా మొదలు పెట్టారని తెలిపారు. ఈ జీఓలను వెంటనే సస్పెండ్ చేయాలని, పనులు జరగకుండా స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ, గ్రామీణ నీటిపారుదల శాఖలను ప్రతివాదులుగా చేర్చారు. ఇక నెల్లూరు నీటిని అక్రమంగా తరలించడం మీద ఇప్పటికే అక్కడ నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పుడు గనక కోర్టు పనులు నిలపాలని ఆదేశాలు ఇస్తే ముఖ్యమంత్రికి ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతాయి.

జెట్ స్పీడుతో పయనించనున్న టీ-బిల్లు

  రాష్ట్ర విభజనపై కేంద్రం తీవ్ర సందిగ్ధంలో ఉన్నట్లుగా నటిస్తూనే, మరో పక్క తెలంగాణా బిల్లుని జెట్ స్పీడుతో పార్లమెంటుకి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం తెలంగాణా బిల్లుపై చర్చజరిపేందుకు వచ్చేనెల రెండు మూడు తేదీలలో రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చునని తెలుస్తోంది.   స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిన్న శాసనసభ కార్యాలయ అధికారులతో సమావేశమయ్యి సభ నిర్వహణ గురించి చర్చించారు. మళ్ళీ ఈరోజు ఆయన పోలీసు ఉన్నతాధికారులతో కూడా సమావేశామయ్యి భద్రతా ఏర్పాట్ల గురించి చర్చించనున్నారు.   ఈ ప్రత్యేక సమావేశాలలో కేవలం రాష్ట్ర విభజన, తెలంగాణా బిల్లుపై తప్ప వేరే ఏ ఇతర అంశాలపై చర్చకు అనుమతించరు. ఒకవేళ అవసరమను కొంటే, స్పీకర్ ఈ సమావేశాలను మరొక్క రోజు మాత్రమే పొడిగించవచ్చును. రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించమని రాష్ట్రపతే నేరుగా స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయబోతున్నందున ఇక శాసనసభని ప్రోరోగ్ చేయమంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆయనకి అందిన లేఖను పట్టించుకొనవసరం లేదని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.   ఈ ప్రకారం చూస్తే ఈరోజు జరిగే కేంద్రమంత్రుల బృందం సమావేశమే తుది సమావేశమని భావించవచ్చును. వారు రేపు జరిగే కేంద్రమంత్రి వర్గం సమావేశానికి తమ తుది నివేదిక సమర్పించడం, అక్కడి నుండి తెలంగాణా బిల్లు జెట్ స్పీడుతో పయనిస్తూ అందరి ముద్రలు వేయించుకొని పార్లమెంటు శీతాకాల సమావేశాలలోగానే డిల్లీ చేరుకోవడం ఖాయంలా కనిపిస్తోంది.   ఇదే నిజమయితే, రాజ్యాంగ స్పూర్తికి, విధివిధానాలకు పూర్తి విరుద్దంగా తెలంగాణా బిల్లును ఆఘమేఘాలపై కదిలించడం దేనికంటే బహుశః వచ్చేనెల 9న సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్టేందుకేనని భావించాల్సి ఉంటుంది.   ఇది చాలా ఆహేతుకంగా ఉన్నపటికీ సీనియర్ కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడిన మాటలు వింటే నిజమని నమ్మక తప్పదు. ”అమ్మ తలుచుకొంటే ఏదయినా సాధ్యమే! ఈ అంటోనీ కమిటీలు, కేంద్రమంత్రుల బృందాలు అంతా ఒట్టోట్టివే! ఎవరెన్ని ఆలోచనలు, నిర్ణయాలు తీసుకొన్నా అమ్మ నిర్ణయమే తుది నిర్ణయం. ఆమె మాటే వేదవాక్కుఅందరికీ,” అని అన్నారు.   సోనియాగాంధీ తెలంగాణా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొన్నారు గనుక, ఆ ప్రకారమే కాంగ్రెస్ లో అన్ని వ్యవస్థలు పనిచేస్తాయి. అవసరమయితే పరుగులు తీస్తాయి కూడా.