కావూరి కంపెనీ బ్లాక్ లిస్టులో
posted on Nov 28, 2013 @ 11:32AM
రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్ర, తెలంగాణా ప్రజలకి ఏమి ఒరుగుతుందో తెలియదు కానీ రాజకీయ నేతలకు, ముఖ్యంగా సివిల్ కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకొనే నేతలకు మాత్రం నాలుగు కాదు..కాదు పద్నాలుగు రాళ్ళు వెనకేసుకొనే అవకాశం కలుగబోతోంది. తెలంగాణా రాష్ట్రంలో అందరి కంటే మొట్ట మొదటగా ప్రయోజనం పొందేది రాజకీయ నేతలే. కొందరికి మంత్రి పదవులు, మరి కొందరికి భారీ కాంట్రాక్టులు తధ్యం.
ఇంతవరకు సమైక్యాంధ్ర అంటూ గొంతు చించుకొని కేకలు పెట్టిన సీమాంధ్ర రాజకీయ నేతలకయితే తంతే బూర్లె గంపలో పడినట్లే అనుకోవచ్చును. రాజధానితో సహా భారీ ఎత్తున జరుగబోయే నిర్మాణ కార్యక్రమాల ద్వారా వారు ఊహించని విధంగా లబ్ది పొందబోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కేంద్రంలో ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే ఆయా పార్టీ నేతలు మై కాస్త ఎక్కువ లబ్ది పొందగలరు. రాష్ట్ర విభజన అంశం తెరపైకి రానప్పుడే అనేక ప్రాజెక్టులు దక్కించుకొని ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకొన్న రాజకీయ నేతలు ఇప్పడు ఏకంగా రాష్ట్ర పునర్నిర్మాణం చేసే అవకాశం వస్తే ఎంత వెనకేసుకొంటారో ఊహించవచ్చును.
అయితే లక్షల కోట్లతో భారీ ఎత్తున జరిగే ఈ నిర్మాణ పనుల కోసం భారత ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ ఆర్ధిక సహాయం కూడా తీసుకోవచ్చును. అయితే పాపం ఇటువంటి కీలక సమయంలోనే కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు అనుకోని విధంగా పెద్ద కష్టమోచ్చిపడింది పాపం!
ఆయనకు చెందిన ప్రోగ్రెసివ్ కనస్ట్రక్షన్స్ అనే సంస్థపై అవినీతి, దగా వంటి అభియోగాలు నమోదు అవడంతో ప్రపంచబ్యాంకు పదకుండేళ్లపాటు ఆ సంస్థని బ్లాక్ లిస్టులో పెడుతున్నట్లు ప్రకటించింది. అందువల్ల ప్రపంచ బ్యాంక్ ఆర్ధిక సహకారంతో జరిగే ఎటువంటి ప్రాజెక్టులలో కావూరి గారి సంస్థ వేలుపెట్టలేదు. అయితే రాష్ట్రంలో అన్ని ప ప్రాజెక్టులు ప్రపంచ బ్యాంక్ సహకారంతోనే జరగవు గనుక కావురివారు ఏదో ఒక ప్రాజెక్టు పట్టుకొని నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చును.
కానీ ముందు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలి కదా! గెలవకపోతే దానికి కావూరి మాత్రం ఏమి చేయగలరు? ప్రపంచ బ్యాంకు మాత్రం ఏమి చేయగలదు?