లక్నో పర్యటనకు జగన్

      జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణను సీబీఐ కోర్టు జనవరి 3కు వాయిదా వేసింది. మంగళవారం ఉదయం ఈ కేసుకు సంబంధించి ఏ-1 నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఏ-2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద్‌రావు కోర్టుకు హాజరయ్యారు. అలాగే మొట్టమొదటి సారిగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో నిందితురాలుగా ఉన్న మంత్రి గీతారెడ్డి కోర్టుకు హాజరయ్యారు. మాజీ మంత్రి ధర్మాన కారులో గీతారెడ్డి కోర్టు వచ్చారు. ఈకేసుకు సంబంధించి మొత్తం 10 చార్జిషీట్లపైన కోర్టు విచారణ జరిగింది. లక్నో కు జగన్:  సమైక్యరాష్ట్రానికి మద్దతు ఇస్తూ తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ వై.ఎస్.జగన్ లక్నో వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను కలుస్తున్నారు. ఈ మేరకు ఆయన లక్నో వెళ్లడానికి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఇప్పటికే ఓడిషా,పశ్చిమబెంగాల్, ముంబై లలో పర్యటించి, ఆయా నేతలను కలిసి వచ్చిన జగన్ ఇప్పుడు లక్నో వెళుతున్నారు.

చిరు ఆఖరి ప్రయత్నం

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ముసాయిదా చివరి దశకు చేరిన నేపథ్యంలో సీమాంధ్ర నేతలు తమ చిట్ట చివరి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. విభజన అనివార్యం అయితే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్న కేంద్ర మంత్రి చిరంజీవి తాజాగా కేంద్ర మంత్రుల బృందంలోని సభ్యులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్ లను కలిశారు. హైదరాబాద్ ను శాశ్వత కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ను యూటీ చేసి ఢిల్లీ తరహా శాసన సభ ఏర్పాటు చేయాలని చిరంజీవి కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని అయితే విభజన అనివార్యం అయిన పక్షంలో హైదరబాద్ యూటీ చేయాలని తాము యూటీని కోరుతున్నామని అన్నారు. ఇది చివరి ప్రయత్నం అని చిరంజీవి చెప్పడం విశేషం. మొదటి నుండి హైదరాబాద్ విషయంలో సీమాంధ్ర నేతలు పట్టుబడుతున్నారు. అయినప్పటికి కేంద్రం ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు.

కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవబోతున్నారా

  రెండు మూడు రోజుల క్రితం గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారేకర్ హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రహస్య మంతనాలు జరిపినట్లు సమాచారం. మనోహర్ బీజేపీ ప్రచార కమిటీలో ముఖ్య సభ్యుడు. అంతే గాక పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మరియు బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకి సన్నిహితుడు.   ఒక బీజేపీ ముఖ్య నేత కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రస్తుత పరిస్థితుల్లో రహస్యంగా వచ్చికలవడం చాలా ఆశ్చర్యంకలిగిస్తోంది. అలాగే పలు అనుమానాలకు కూడా తావిస్తోంది.   కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఏర్పాటుకి బీజేపీ మద్దతు తీసుకొంటూనే మళ్ళీ అదే పార్టీని తెలంగాణాలో దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోందని స్పష్టం అయ్యింది. ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చిన రాయల తెలంగాణా ప్రతిపాదన కూడా అందుకేనని అర్ధం అవుతోంది. మరి అటువంటప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే అది తన కాళ్ళను తనే నరుకోవడం అవుతుంది. గనుక, బీజేపీ కూడా బహుశః కాంగ్రెస్ పద్దతిలోనే ఆలోచించి, కాంగ్రెస్ అధిష్టానాన్నిఎదురిస్తూ సమైక్య ఛాంపియన్ గా అవతరించి, త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెడతారనుకొంటున్న కిరణ్ కుమార్ రెడ్డిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టి ఉండవచ్చును.   ఇంత రాద్దాంతం చేసిన తరువాత ఇక కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండగలిగే అవకాశాలు లేవు. అలాగని తనంతట తాను పార్టీని స్థాపించి ఎన్నికలలో పోటీ చేయడమూ కష్టమే. గనుక, ఎటువంటి మరకలు లేకుండా సమైక్య చాంపియన్ గా అవతరించిన ఆయనకి సీమాంధ్రలో చాలా బలహీనంగా ఉన్న బీజేపీ శాఖ పగ్గాలు అప్పగిస్తే అటు బీజేపీ, ఇటు కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కూడా పూర్తి ప్రయోజనం పొందగలుగుతారనిబీజేపీఆలోచనఅయ్యిఉండవచ్చును.   రానున్న ఎన్నికల తరువాత కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కూడా కనబడటం లేదు గనుక, కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టుకొని ఇబ్బందులు పడే బదులు, సీమంధ్రలో బీజేపీ పగ్గాలు అందుకొంటే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయిన తరువాత రాష్ట్రాన్నిఅసలు విభజించాలా వద్దా? విభజిస్తే ఏవిధంగా విభజించాలి? వంటివి విషయాలలో ఆయన నిర్ణయాత్మక శక్తిగా మారుతారు.   ఒకవేళ ఆయన అద్వర్యంలో సీమాంధ్రలో బీజేపీ గనుక గెలిస్తే ఆయన మళ్ళీ రాష్ట్ర లేదా సీమాంధ్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ పార్టీ ఓడిపోయినా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అక్కడ కేంద్రమంత్రిగా సెటిల్ అయిపోవచ్చును.   మునిగిపోయే నావ వంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వ్రేలాడే బదులు, తమతో చేతులు కలిపితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని గోవా ముఖ్యమంత్రి మనోహర్ బీజేపీ తరపున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి హామీ ఇచ్చి ఉండవచ్చును. లేకుంటే వారిరువురూ రహస్యంగా ముచ్చటించుకోవలసిన సమయం, సందర్బము రెండూ కావు. వారి రహస్య సమావేశానికి ఇంతకంటే ప్రత్యేక కారణాలు కూడా వేరే ఏమి కనబడటం లేదు.   ఒకవేళ కిరణ్ బీజేపీ కమలం పట్టుకొనేందుకు సిద్దం అయితే రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతాయి.

పార్లమెంటులో టి.బిల్లు పెడతారా?

      తెలంగాణ బిల్లు పార్లమెంటుకు ఎప్పుడు వస్తుంది ? అసలు ఈ శీతాకాల సమావేశాలలో తెలంగాణ బిల్లు ఉండబోతుందా? కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెబుతున్న దానిని బట్టి ఈ సమావేశాలలో తెలంగాణ బిల్లు ఉండడం కష్టమేనని తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాధ్‌ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత సుష్మా స్వరాజ్ తెలంగాణ బిల్లు గురించి ప్రస్తావించారు. రాష్ట్ర పునర్విభజన బిల్లును పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే ప్రతిపాదించాలని కోరారు. ఈ బిల్లు విషయంలో జాప్యం చేస్తే పర్యావసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. పన్నెండు రోజుల పాటు సాగనున్న శీతాకాల సమావేశాల అజెండాలో తెలంగాణ బిల్లుకు ఎందుకు స్థానం కల్పించలేదని ఆమె ప్రశ్నించారు. అయితే తెలంగాణ బిల్లుకు సంబంధించి పలు ప్రక్రియలు మిగిలిపోయాయని, విభజన విధివిధానాలను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రుల బృందం నివేదిక సిద్ధమైన తర్వాత కేంద్ర మంత్రివర్గం దానిని పరిశీలించి ఆమోదించాల్సి ఉందని, ఆ తర్వాత రాష్ట్రపతికి నివేదించనున్న ముసాయిదా బిల్లును ఆయన రాష్ట్ర శాసనసభకు పంపాల్సి ఉంటుందని షిండే తెలిపారు. మరి ఈ లెక్కన తెలంగాణ బిల్లు తెరమరుగయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రాయల 'టి'కి ఒప్పుకోం

  రాయల తెలంగాణ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని టిఆర్‌ఎస్‌ పార్టీ తీర్మానించింది. తెలంగాణ ప్రజలు కేవలం పది జిల్లాల తెలంగాణ మాత్రమే కోరుకుంటున్నారని.. అది కాదని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మరో ఉద్యమానికి సిద్దమవుతాం అని పార్టీ అధినేత కేసిఆర్‌ అన్నారు. రాయల తెలంగాణ అన్నది ఇప్పటి వరకు ఊహాగానాలే అని, ఒక వేళ అధికారికంగా అలాంటి ప్రకటన వస్తే మరోసారి ఉద్యమానికి సిద్దం కావాలని కేసిఆర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు కోసం రాయలసీమ అస్థిత్వాన్ని కోల్పోవటం తమకు ఇష్టం లేదని, కేవలం రాజకీయా కారణాలతోనే రాయల తెలంగాణ ప్రతిపాదన తెరమీదకు తీసుకువచ్చారని కెసిఆర్‌ అన్నారు.

రాయల తెలంగాణకే కేంద్రం మొగ్గు

  రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం తుది నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇన్నాళ్లు వివిధ ఆఫ్షన్లను పరిశీలించిన కేంద్ర ఇప్పుడ ఫైనల్‌గా రాయల తెలంగాణకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తుంది. తెలంగాణలోని పది జిల్లాలతో పాటు అనంతపురంచ కర్నూల్‌ జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని జీవోయం సభ్యులు గాని కాంగ్రెస్‌ పెద్దలు గాని అధికారకంగా ధృవీకరించకపోయినా దాదాపు ఇదే కాయం అన్న వాదన మాత్రం డిల్లీలో బలంగా వినిపిస్తుంది. అయితే బిజిపితో పాటు తెలంగాణ కోరుతున్న పార్టీలన్ని రాయల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నాయి. ఈ నేపద్యంలో కేంద్ర ఎలా వ్యవహరిస్తుంది అన్న అంశం ఆసక్తిగా మారింది. పార్లమెంట్‌ సమావేశాలకు సమయం దగ్గరపడుతుండటంతో తెలంగాణ ఏర్పాటుకు సంభందించిన అంశాలపై కేంద్ర మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాం అని జీవోయం సభ్యులు చెపుతున్నా.. అది అసాధ్యం అంటున్నారు కొందరు కేంద్ర మంత్రులు.

ఇప్పడే విభజనపై జోక్యం చేసుకోలేం ; హైకోర్ట్‌

  రాష్ట్ర విభజన అంశంపై హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యన్ని కోర్టు కొట్టివేసింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక మీద పార్లమెంట్‌లో చర్చకు ఆదేశించాలని  కోరుతూ దాఖలైన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ కళ్యాన్‌ జ్యోతి సేన్‌ గుప్తా, జస్టిస్‌ పివి సంజయ్‌కుమార్‌లు కొట్టేశారు. నివేదిక పూర్తి స్థాయిలో లేదని పూర్తి వివరాలతో మరోసారి పిల్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినా, పిటీషర్‌ తరుపున న్యాయవాది వాదనలను కొనసాగించారు.అనంతరం విభజనకు సంబంధించి ప్రస్తుత దశలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేస్తూ, నిరర్థక వాదనలతో విలువైన కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు పిటిషనర్‌కు రూ.5 వేల జరిమానా విధించారు.

సోనియా ఆస్తుల గుట్టు

  తనకు కేవలం కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ఆస్తి మాత్రమే ఉందన్న సోనియా గాంధీకి హఫింగ్టన్‌ పోస్ట్‌ షాక్‌ ఇచ్చింది.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆస్తుల విలువ 12 వేల కోట్ల పై మాటే అని హఫింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక ధనవంతులైన రాజకీయ నేతల జాబితాలో ఆమె 12వ స్థానంలో ఉన్నారు. ఈ లిస్ట్‌లో 50 బిలియన్ల ఆస్తితో  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో థాయ్‌లాండ్‌ రాజు భుమిబోల్‌ అదుల్యాదెజ్‌, బ్రూనై సుల్తాన్‌ హసనల్‌ ఉన్నారు. అయితే బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ ఆస్తుల విలువ మాత్రం ఐదొందల మిలియన్‌ డాలర్లు మాత్రమే. ఇదిలా ఉండగా 2009లో సోనియా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తనకు 1.38 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లుగా తెలిపిన సోనియా,  ఆమెకు సొంత వాహనం కానీ, సొంత ఇల్లు కానీ లేదని వెల్లడించారు. 75 వేల నగదు, బ్యాంక్‌ డిపాజిట్ల రూపంలో 28 లక్షలా 61 వేల రూపాయలున్నాయని ప్రకటించారు.

లగడపాటి చిలుక జోస్యం ఫలించేనా?

  రాష్ట్ర విభజన విభజన ప్రక్రియ ఎంత జోరుగా సాగిపోతున్నప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం సమైక్యవాదులలో సైతం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఆవిధంగా కూర్చొని ఆయన రాష్ట్ర విభజనకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా తన అధిష్టానానికి తోడ్పడుతున్నారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నా, పదవి పట్టుకొని వ్రేలాడుతున్నారని స్వంత పార్టీ నేతలే అవహేళన చేస్తున్నా ఆయన చలించలేదు. కానీ, ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగదని నేటికీ గట్టిగా ఆయన వాదిస్తూనే ఉన్నారు.   ఇక అటువంటి మరో వ్యక్తి లగడపాటి రాజగోపాల్. రాష్ట్ర విభజన జరిగినట్లయితే తను రాజకీయ సన్యాసం చేస్తానని భీకర ప్రతిజ్ఞ చేయడమే కాక, ఎట్టి పరిస్థితుల్లో విభజన జరగదని నేటికీ పూర్తి నమ్మకంతో చెపుతున్నారు. అయితే, ఇంతవరకు చకచక జరుగుతున్న విభజన ప్రక్రియను చూస్తున్నవారికి ఆయన మాటలపై నమ్మకం కలగడం లేదు. కానీ, ఇప్పుడు జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటే మాత్రం వారిరువురి జోస్యం నిజమవబోతోందా? అనే అనుమానం కలుగుతోంది.   రాష్ట్ర విభజన ప్రక్రియపై తుది నివేదిక ఈయవలసిన కేంద్రమంత్రుల బృందం నేటికీ రాష్ట్రాన్నిఆంధ్ర, తెలంగాణాలుగా విభజించాలో లేక ఆంధ్ర, రాయల తెలంగాణాలుగా విభజించాలో తెలియని అయోమయంలో ఉంది. విభజన ప్రక్రియ ఒక కొలొక్కి వచ్చిందని భావిస్తున్నఈ తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం హటాత్తుగా ‘రాయల తెలంగాణా’ ప్రతిపాదన చేయడం చూస్తే, కాంగ్రెస్ చిత్తశుద్ది మీద అనుమానం కలుగుతోంది.   బీజేపీ మద్దతు ఈయకపోతే తెలంగాణా బిల్లు ఆమోదింపజేయలేని పరిస్థితిలో ఉన్నకాంగ్రెస్, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి భంగపడే బదులు, ఆచరణ సాధ్యం కాని రాయల తెలంగాణా అంశం ఎత్తుకొని ఆ సాకుతో ఎన్నికల వరకు కాలక్షేపం చేసేయాలని ప్రయత్నిస్తోందా? అని అన్ని రాజకీయ పార్టీలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.   ఇటీవల పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ కూడా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగకపోవచ్చని అనడం చూస్తే, కిరణ్ కుమార్ రెడ్డి, లగడపాటి ఇద్దరూ కూడ ఈ పరిస్థితులను చాలా ముందుగానే కనిపెట్టినందునే అంత నమ్మకంగా చెప్పడమే కాక, నిబ్బరంగా ఉండగలుగుతున్నారు.

తెరాసలో అయోమయం!

      తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు ఒక పెద్ద అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఆ అయోమయ పరిస్థితికి కారణం రాష్ట్ర విభజనను కేంద్రం ఆలస్యం చేస్తూ వుండటమో, సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమమో, రాయల తెలంగాణ ప్రతిపాదనో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందో లేదోనన్న భయం కాదు... టీఆర్ఎస్‌లోని రెండు అధికార, ఆధిపత్య కేంద్రాలలో ఏ కేంద్రంలో సెటిలవ్వాలనే అయోమయం.   టీఆర్ఎస్‌లో హరీష్‌రావు, కేటీఆర్ ఇద్దరూ అధికార, ఆధిపత్య కేంద్రాలు. వీళ్ళిద్దరికీ తెలియకుండా పార్టీలో ఏ పనీ జరగదు. అయితే వీళ్ళిద్దరిదీ చెరోదారి. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. తెలంగాణ ఉద్యమం కూడా ఇద్దరూ ఎవరికి వారే చేస్తూ వుంటారు తప్ప ఇద్దరూ కలసి పనిచేయరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక ఇద్దరిలోనూ వుండటమే. అధికారం అనేది ఎలాంటి బంధాన్నయినా పుటుక్కున తెంపేస్తుంది. ఆఫ్ట్రాల్ బావ బావమరుదుల బంధమెంత? నిన్నమొన్నటి వరకూ టీఆర్ఎస్‌లో నాయకులు హరీష్ పిలిస్తే హరీష్ వెంట, కేటీఆర్ పిలిస్తే కేటీఆర్ వెంట వెళ్ళేవారు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరగబోతోంది. తెలంగాణ ఏర్పడబోతోందని అనుకుంటున్న  తరుణంలో అటు హరీష్, ఇటు కేటీఆర్ ఇద్దరూ పార్టీలో తమ పట్టును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ కంటే హరీష్ కాస్తంత ఫార్వర్డ్‌ గా అడుగులు వేసి తెలంగాణ వచ్చాక హరీషే సీఎం అనే మాటను కొంతమంది కార్యకర్తల చేత పబ్లిగ్గా చెప్పించాడు. దాంతో  దాంతో ఉలిక్కిపడిన కేటీఆర్ తాను సీఎం అవ్వాలని బాహాటంగా చెప్పగలిగే కార్యకర్తలను సిద్ధం చేసుకుంటున్నారు. దాంతో టీఆర్ఎస్‌లో ఇప్పుడు హరీష్, కేటీఆర్ మధ్య విభజన స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో ఇప్పుడు ఈ రెండు విభాగాల్లో ఏ విభాగంలో ఉండాలా అన్న అయోమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు వున్నారు. ఎవరు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా వుంటే అటువైపే వుండాలన్న ఆలోచనలో కొందరు వున్నారు. అయితే ఎవరు సీఎం అవుతారన్నదీ అంచనా వేయలేక, ఎటు వైపు వెళ్ళాలో అర్థంకాక అయోమయ స్థితిలో వున్నారు.  

జగన్ కి మూడో స్థానం..!

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆదాయపన్ను చెల్లించడంలో మూడో స్థానంలో నిలిచారు. సుభాష్ అగర్వాల్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరగా ఆదాయపు పన్ను శాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఆదాయపు పన్ను అత్యధికంగా చెల్లిస్తున్న వారిలో వ్యక్తిగత విభాగంలో మొదట షిరీన్, ద్వితీయ స్థానంలో కమల్ స్టీల్స్ అధినేత కమల్ జీత్ సింగ్ అహ్లువాలియా ఉండగా మూడో స్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.2011 – 2012 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయనకు ఈ స్థానం దక్కింది. ఇక ఈ సంగతి ఇలా ఉంటే ఆదాయపు పన్ను చెల్లింపులో టాప్ 3లో ఉన్న ముగ్గురులో ఇద్దరు కుంభకోణాల్లో ఉన్నవారే. రెండో స్థానంలో ఉన్న కమల్ జీత్ సింగ్ బొగ్గు కుంభకోణంలో ఉండగా, అక్రమాస్తుల కేసులో ఇప్పటికే 15 నెలలు జైలు జీవితం అనుభవించి జగన్ బెయిలు మీద విడుదలయ్యారు.

ఎవరిగోల వారిదే

  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎవరి గోల వారిదేలా తయారయిందిప్పుడు. కాంగ్రెస్ అధిష్టానం ఆఖరి నిమిషంలో మళ్ళీ మాట మార్చి రాయల తెలంగాణా ప్రతిపాదన ముందుకు తెస్తుంటే, రాజ్యసభ సభ్యుడు వీ.హనుమంత రావు మాత్రం “ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణా ఇస్తున్న సోనియమ్మ మాపాలిట పోచమ్మ ” అంటూ మరో జైత్రయాత్రకు యాదగిరి గుట్టలో జెండా ఊపి సాగనంపి వచ్చారు.   రేణుకా చౌదరికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవి ఊడిపోవడంతో ఆమె తన ఖమ్మం జిల్లా నేతలకి కూడా లోకువయిపోయారు. అందుకే ఆమె హడావుడిగా తన అనుచరులను వెంటేసుకొని పది కార్లలో భద్రాచలంపైకి దండ యాత్రకి వెళ్లి, “భద్రాచలం గురించి ఎవరయినా మాట్లాడితే కబడ్దార్!” అని బలప్రదర్శన చేసిన తరువాత, రాముడి గుడికి వెళ్లకపోయినా మీడియా ముందు కాసేపు సోనియమ్మ భజన చేసారు.   ఇక మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణాలో అసెంబ్లీ సీట్లు ఎందుకు పెంచవలసి ఉందో అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. జైపాల్ రెడ్డి తను తెర వెనుక చేసిన మంత్రాంగంతోనే తెలంగాణా ఏర్పడుతోందని మధ్యమధ్యలో అందరికీ గుర్తు చేస్తుంటారు. ఇక జానారెడ్డిని సైడ్ చేసేసి హటాత్తుగా ముందుకు దూసుకుపోయిన దామోదర రాజనరసింహుల వారు డిల్లీకి మంత్లీ ప్లేన్ పాస్ తీసేసుకొని డిల్లీ-హైదరాబాద్ మధ్య తిరుగుతున్నారు. కానీ మొన్నఅధిష్టానం ‘రాయల తెలంగాణా’ అన్నపటి నుండి ఆయన మోహంలో కళ తప్పింది.   నిత్యం మీడియా ముందు హడావుడి చేసే జానారెడ్డి, ముఖ్యమంత్రి అవడానికి మద్దతు కూడగట్టుకొనే పనిలో ఉన్నందున ఈ మధ్య ఎక్కడా కనబడటం లేదని సమాచారం. ఆయన కనబడకపోయేసరికి ఆయన స్థానంలోకి డీ.శ్రీనివాస్ వచ్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ, రాయల తెలంగాణా ప్రతిపాదనను ఖండిస్తూ కొంచెం హడావుడి చేస్తున్నారు.   ఎన్నడూ హైదరాబాద్ దాటి తెలంగాణాలో కూడ కాలు పెట్టని దానం నాగేందర్ హైదరాబాద్ ని యూటీ చేస్తే అంగీకరించమని ప్రకటిస్తారు. అదేవిధంగా ‘హైదరాబాదు-యూటీ’ అనే అంశంపై స్పెషలిస్ట్ అయిన చిరంజీవి అదే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారమని సోనియమ్మ చెవిలో చెప్పి వస్తుంటారు.   కోట్ల వారికి రాయల తెలంగాణా కావాలి. బొత్సవారు గంట, జేసీ బ్రదర్స్,లగడపాటి తదితరులతో క్రమశిక్షణ చర్యల గురించి వాదోపవాదాలతో తీరిక లేకుండా ఉన్నారు. ముఖ్యమంత్రికి సమైక్యవాదంపై ఉపన్యాసాలు తయారు చేసుకొంటూ ఉండటంతో బొత్తిగా ఖాళీ లేదు.   అందువల్ల ఉల్లిపాయలు, టొమేటోల ధరలు పెరిగిపోయాయని, తుఫానులో పొలాలు నష్టపోయాయని, రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, బస్సుల్లోమనుషులు కాలిపోతున్నారని  ఎవరూ ఆందోళన చెందవద్దని మనవి. ఎన్నికలయ్యే వరకు  ప్రజలు కాస్త ఓపిక పట్టాల్సిందే. తప్పదు మరి. అన్యదా భావించవద్దని మనవి.

తేజ్ పాల్ విషయంలో పోలీసుల అత్యుత్సాహం

  తెహల్కా వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ విషయంలో గోవా పోలీసుల తీరు మరీ అతిగా ఉంది. 50ఏళ్ల వయసున్న అతనికి ఈరోజు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అతను మహిళా విలేఖరితో అసభ్యంగా ప్రవర్తించినట్లు స్వయంగా మీడియా ముందు అంగీకరిస్తున్నట్లు చేసిన ప్రకటన, తనను క్షమించమంటూ సదరు అమ్మాయికి ఈమెయిల్ ద్వారా పంపిన లేఖ రెండూ కూడా ఆయనను దోషిగా నిరూపిస్తున్నాయి. తన నేరం అంగీకరించిన అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నాక చట్ట ప్రకారం విచారించి అతనిపై కేసు నమోదు చేసి తగిన శిక్ష పడేట్లుచేసే బదులు, అతనికి లైంగిక పటుత్వ పరీక్షలు చేయడం, ఆ సంగతి మీడియా ద్వారా లోకమంతా తెలిసేలా చేయడం చూస్తుంటే, అది అతనిని, మానసికంగా దెబ్బతీసి అతని పరువు ప్రతిష్టలను పూర్తిగా దెబ్బ తీసేందుకేనని అర్ధం అవుతోంది.   అతను గతంలో బండారు లక్ష్మణ్ పై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, బీజేపీ హయాంలో జరిగిన ఆయుధాల కొనుగోళ్ళ వ్యవహారంలో గుట్టు బయటపెట్టారు. ఆ తరువాత ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాజనంద్ గావ్ అనే ప్రాంతంలో ఉన్న ఒక నదిపై హక్కులను ఒక స్థానిక పారిశ్రామిక వేత్తకు దఖలుపరచడం వంటి అనేక లోగుట్టులను తెహల్కా పత్రిక బయటపెట్టింది. బహుశః ఆ కక్షతోనే ఇప్పుడు గోవాలోని బీజేపీ ప్రభుత్వం అతనిపై పగ తీర్చుకొంటున్నట్లుంది. లేకుంటే, అసలు ఈ కేసుకి ఇంత ప్రాధాన్యం ఇచ్చేదే కాదు.   నేరం అంగీకరించిన వ్యక్తికి శిక్షపడేలా చేయడం కంటే, అతనిని మానసికంగా, సామాజికంగా దెబ్బ తీయాలని గోవా పోలీసుల తాపత్రయం ఎక్కువ కనిపిస్తోందిపుడు. అవసరమయిన మేరకు విచారణ చేసి అతనికి తగు శిక్షపడేలా చేయాల్సినపోలీసులు, కోర్టులు విదించబోయే జైలు శిక్ష కంటే కటినమయిన నరకం అతనికి చూపిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో పోలీసులు అతిగా వ్యవహరిస్తే, వారు కూడా కోర్టు కేసులలో చిక్కుకోవడం ఖాయం. పోలీసులు తీరు ఈ కేసులో బాదితురాలయిన మహిళా విలేఖరికి న్యాయం చేస్తున్నట్లుగాక, రాజకీయ ఉద్దేశ్యంతోనే వ్యవహరిస్తునట్లుంది. అంటే అసలు విషయం వదిలి పక్కదారిపడుతున్నారన్న మాట!

కాంగ్రెస్ వ్యతిరేఖ ఓటుతో లబ్ధికి జగన్ ప్రయత్నం

  ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ‘సమైక్య ఓదార్పుయాత్ర’ నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి, 2014ఎన్నికల తరువాత తను మద్దతు ఇస్తానని చెప్పిన సోనియా గాంధీ మీద కూడా తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. ఆమె తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే మన రాష్ట్రం విడదీస్తోందని విమర్శించారు. సీమాంధ్ర ప్రజలను హైదరాబాదు నుండి బయటకి పొమ్మనట్లే, ఆమెను కూడా ఇటలీకి పొమ్మంటే పోతారా? అని ప్రశ్నిస్తున్నారు. తనకు 30యంపీ సీట్లు ఇస్తే, రాష్ట్రాన్ని ఎలాగ విడదీస్తారో చూస్తానని సవాలు చేస్తున్నారు. అప్పుడు తనే దేశానికి ప్రధానిగా ఎవరుండాలో నిర్ణయిస్తానని అంటున్నారు.   జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అంత్యక్రియలు కూడా చేయకుండానే, ముఖ్యమంత్రి పదవి కోసం శాసనసభ్యుల సంతకాలు సేకరించిన నాడే తన పదవీ కాంక్ష బయటపెట్టుకొన్నారు. నేటికీ కూడా సమైక్యాంధ్ర సెంటిమెంటుతో 30యంపీ సీట్లు సంపాదించుకొందామనే యావే తప్ప, నిజంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే చిత్తశుద్ది అతనిలో ఏ కోశాన్న కనబడటం లేదు. తను ముఖ్యమంత్రి అయ్యేందుకు, ప్రజలలో కాంగ్రెస్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేఖతను తనకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నంలోనే సోనియా గాంధీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంత మాత్రాన్న తమ పార్టీ వచ్చే ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో యూపీయేకి మద్దతు ఈయదని ఖరాఖండిగా ఎన్నడూ చెప్పరు కూడా.   వచ్చేఎన్నికలు పూర్తయ్యే వరకు అతను, అతని పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ తమ ప్రధాన శత్రువన్నట్లుగానే మాట్లాడుతారు. ఎన్నికల తరువాత ఒకవేళ యూపీయే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచగలిగే స్థితిలో ఉంటే, అప్పుడు తప్పకుండా దానికే మద్దతు ఇచ్చి జగన్ తన కేసుల నుండి బయటపడే ప్రయత్నం చేయవచ్చు. బహుశః అందుకే నారా లోకేష్ ఇటీవల ట్వీట్ చేస్తూ వైకాపాకి, ప్రజారాజ్యానికి పెద్దగా తేడా లేదని విమర్శించారు.            సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించి తన కొడుకుని ప్రధానిని చేయాలనుకొంటుంటే, జగన్ రాష్ట్ర విభజన అంశాన్ని ఈవిధంగా ఉపయోగించుకొని ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇద్దరూ కూడా రాష్ట్ర విభజన ద్వారా లబ్ది పొందాలనుకొంటున్నపుడు మరి వారిరువురి మధ్య తేడా ఏమిటి?   ఆమె రాష్ట్ర విభజన చేసి లాభం పొందాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తున్న జగన్మోహన్ రెడ్డి, తను రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత కూడా సమైక్యవాదంతో, కాంగ్రెస్ వ్యతిరేఖ ఓటు అనే రెండు అంశాలను తెలివిగా వాడుకొని ఎన్నికలలో గెలిచి, కేంద్రంలో రాష్ట్రంలో కూడా చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఇద్దరివీ లక్ష్యాలు వేరయినా, అందుకు వారు అనుసరిస్తున్న మార్గం మాత్రం ఒక్కటే.

సర్వరోగ నివారణి ‘రాయల తెలంగాణ’

      రాష్ట్ర విభజన తేనెతుట్టెని కదల్చగానే కేంద్రాన్ని అనేకానేక సమస్యలు చుట్టుముట్టాయి. కొన్ని సమస్యలు ప్రథమ చికిత్స చేస్తే తగ్గిపోయే రోగాల్లాంటివి కాగా, మరికొన్ని సమస్యలు ఎప్పటికీ వదలక పీడించే దీర్ఘకాలిక రోగాల్లాంటివి. ఈ రోగాలన్నిటినీ నివారించే సర్వరోగ నివారణి ‘రాయల తెలంగాణ’ అని కేంద్రం భావిస్తోంది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపేయడం వల్ల  కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వుండే అద్భుతమైన ఫలితాలేవో వచ్చేస్తాయని కేంద్రం కలలు కంటోంది. కొత్త రాష్ట్రంలో తాను అధికారంలోకి రావడానికి, ఎక్కువ ఎంపీ సీట్లు గెలవటానికి, టీఆర్ఎస్, బీజేపీలను కొత్త రాష్ట్రంలో కంట్రోల్ చేయడానికి, అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేసుకోవడానికి, జలవివాదాలు తలెత్తకుండా వుండటానికి, సీమాంధ్రకు రాజధాని సమస్య రాకుండా వుండటానికి... ఇలా ఒకటీ రెండు కాదు రెండు మూడు డజన్లకు పైగా అంశాలను కేంద్రం ఆలోచించి పెట్టేసుకుంది. తెలంగాణను ప్రకటించి తాను తప్పు చేశానన్న అపరాధభావం కాంగ్రెస్ పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో అంతర్లీనంగా వుంది. తనకు ఎంతమాత్రం ఉపయోగపడేలా లేని లేనిపోని తద్దినాన్ని అనవసరంగా నెత్తికెత్తుకున్నానని మథనపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైతే తెలంగాణ ఇవ్వకుండా తప్పించుకోవడానికి కూడా రాయల తెలంగాణ ప్రతిపాదన ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఢిల్లీలో 'హస్తం' మాయం

      తాజాగా ఢిల్లీ ఎన్నికలలో ఏం జరగొచ్చన్న అంశం మీద రెండు ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు విశ్వసనీయమైన సర్వే సంస్థలతో ఒపీనియన్ పోల్ నిర్వహించాయి. ఇండియా టుడే గ్రూప్ సంస్థ ఓఆర్జీ సంస్థతో కలసి సర్వే జరిపింది. అలాగే ఏబీపీ న్యూస్, దైనిక్ భాస్కర్, నీల్సన్ సంస్థలు సంయుక్తంగా మరో సర్వే నిర్వహించాయి.   ఈ రెండు సర్వేల్లోనూ ఢిల్లీలో రాబోయేది బీజేపీ పాలనేనని స్పష్టమైంది. ఈ సర్వేలో ఢిల్లీ ఓటరు మహాశయులు ‘కమలానికి ఓటేయని కరములు కరముల్?.. కాంగ్రెస్‌ని తిట్టని జిహ్వ జిహ్వా?’ అంటూ ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని మట్టి కరిపిస్తామని చెప్పేశారు. ఇండియా టుడే నిర్వహించిన సర్వే బీజేపీ ప్రభుత్వం స్థాపించడానికి స్పష్టమైన ఆధిపత్యం లభించే అవకాశం వుందని చెప్పింది. దైనిక్ భాస్కర్ నిర్వహించిన సర్వే మాత్రం బీజేపీకి సాధారణ మెజారిటీ కంటే నాలుగు స్థానాలు తక్కువగా వస్తాయని తేల్చింది. కాంగ్రెస్ పార్టీకి 18 నుంచి 25 సీట్లు వచ్చే అవకాశం వుంది. రెండు సర్వేలూ ఆమ్ ఆద్మీ పార్టీకి పది స్థానాలు వస్తాయని వెల్లడించడం విశేషం. బీజేపీకి మెజారిటీ కంటే సీట్లు తక్కువ వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ సహకారం తప్పని సరి అవుతుంది. ఏది ఏమైనా ఢిల్లీలో పదిహేనేళ్ళ కాంగ్రెస్ పాలనకు ఈ ఎన్నికలతో తెరపడింది. కేంద్రంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయే అవకాశం వుందన్నదానికి ఢిల్లీ ఫలితాలు నిదర్శనం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బ్రిజేష్ తీర్పుతో కాంగ్రెస్ కి కొత్త సంకటం

  తమ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా రాష్ట్ర విభజన జరుగుతుండటంతో ఆత్మాభిమానం దెబ్బతిన్నసీమాంధ్ర ప్రజలకు ఇప్పుడు బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు పుండు మీద కారం చల్లినట్లయింది. అదేవిధంగా తెలంగాణా ఇస్తామని చెపుతూనే రోజుకొక ప్రతిపాదనతో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పై రగిలిపోతున్న తెలంగాణావాదులు కూడా ఈ ట్రిబ్యునల్ తీర్పుతో ఒక్కసారిగా భగ్గుమన్నారు.   రాష్ట్ర విభజన కీలకదశ చేరుకొన్న ఈ తరుణంలో, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఈ ట్రిబ్యునల్ తీర్పు వెలువడటంతో, అది ప్రతిపక్షాలకు ఆయుధంగా అందిరాగా, కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలకి ఊహించని విధంగా కొత్త ఇబ్బందులను సృష్టించింది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుకి వ్యతిరేఖంగా పోరాటాలకి సిద్దం అవుతూనే, మరో వైపు దానిని కూడా రాజకీయం చేస్తూ ఒకరిపై మరొకరు బురద జల్లుడు కార్యక్రమం కూడా మొదలుపెట్టేసాయి.   ఇప్పటికే, రాష్ట్ర విభజన అంశంపై చేతులు కాల్చుకొని బాధపడుతున్న కాంగ్రెస్ అధిష్టానం, ఆ సమస్య నుండి గౌరవప్రదంగా బయటపడేందుకు దారులు వెదుకుతుంటే ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో మరో సరికొత్త సమస్య తలకు చుట్టుకొంది. అదికూడా సరిగ్గా అసెంబ్లీ మరియు పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే ముందు ఈ తీర్పు వెలువడటంతో మరింత ఇబ్బంది తప్పదు.   రాష్ట్రం కలిసున్నపుడే ఇరుగుపొరుగు రాష్ట్రాలతో నీటి యుద్దాలు తప్పడంలేదని, విడిపోతే ఇక తెలుగు ప్రజలు కూడా ఒకరితో ఒకరు నీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితులు వస్తాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న వాదనలకు బలం చేకూరుస్తున్నట్లు బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్ తీర్పు వెలువడటం, అది కూడ సరిగ్గా అసెంబ్లీ సమావేశాలకు ముందుగా వెలువడటంతో, ఆయన ఇదే అంశం ఆధారంగా అసెంబ్లీలో గట్టిగా వాదనలు వినిపించవచ్చును.   ఈ తీర్పు ఆధారంగా సమైక్యవాదం బలంగా వినిపిస్తున్నలగడపాటి వంటి యంపీలు సైతం పార్లమెంటులో గట్టిగా వాదించవచ్చును. అయితే, పెద్ద పెద్ద కుంభకోణాలు బయటపడినప్పుడే ఏ మాత్రం చలించని కాంగ్రెస్ పార్టీ, ఇటువంటి అంశాలకు భయపడే అవకాశం లేదు. దానికి ఇదొక ఇబ్బందే తప్ప అవరోధం కాబోదు.

ఈ నెల ఏడున పులిచింతల శంకుస్థాపన

  ఈ నెల ఏడున పులిచింతల ప్రాజెక్ట్‌కు సియం శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మాద్యమిక విధ్యాశాఖ మంత్రి పార్థసారధి చెప్పారు. ముందుగా ఎనిమిదో తేదిన ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేస్తారని ప్రకటించినా ఆ రోజు సియంకు వేరే కార్యక్రమాలు ఉండటంతో ఒకరోజు ముందుగానే ప్రాజెక్ట్‌ పనులు మొదలు పెట్టనున్నారు. పులిచింతల్లో ప్రాజెక్ట్‌ ప్రారంభించిన సియం శంకుస్థాపన చేసిన తరువాత విజయవాడ స్వరాజ్‌మైదాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలొ పులిచింతల నమూనా నుంచి నీటి విడుదల చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్టుగా మంత్రి తెలిపారు.